Tuesday, January 10, 2017

నేటి “సంక్రాంతి” కి సంకెళ్ళు ...



నేటి “సంక్రాంతి” కి సంకెళ్ళు ...
**********************

నాటి కాడెద్దు గలగలలూ – గిలకబావి చప్పుళ్ళూ ..
ముగ్గులు నిండిన లోగిళ్ళూ – చేతివృత్తుల నైపుణ్యాలు..!
రచ్చబండ తీర్పులూ – నాటకాల రాత్రులూ 
ఆటపాటల పులకరింతలూ, 
చేతికందిన కొత్త పంటలు, 
ఇంటి ముందు అందమైన రంగవల్లికలూ,
పూలతో అలంకరింపబడ్డ గొబ్బెళ్ళూ,
హరిదాసు గానాలూ,
గంగిరెద్దుల ఆటలూ, 
చిరుత పులుల వేషాలూ,
గాలి పటాలు రెపరెపలు, 
భోగి మంటలు ధగ ధగలూ, 
భోగ భాగ్యాల భోగి పళ్ళూ, 
చక్కని బొమ్మల కొలువులూ, 
పౌరుషపు కోడి పందాలూ,
కొత్త అల్లుళ్ళ మర్యాదలూ,
నూతన దంపతుల విరిసీ విరియని ప్రేమలూ,
చెక్కిలినంటిన నును నూగు సిగ్గులూ,
అరిసెలూ, పరవాణ్ణపు పిండి వంటలూ,
కొసరి కొసరి వడ్డింపులూ,
పితృదేవతల తర్పణాలూ,
పాడి పశువుల భక్తి పూజలూ,
ఆప్యాయతాను రాగాలూ,
నేడివి కనుమరుగైన సజీవ దాఖలాలు.. 
కాలం మిగిల్చిన మన కన్నీటి ఆనవాళ్ళు ...! 
గతకాలపు స్మృతి చిహ్నాలూ..!
మరి నేడు ..?
కాంతి లేని పల్లెటూళ్ళు ..! ప్రాణం లేని లోగిళ్ళు.. !
వెల వెల పోతున్న పండుగలు.. సంకెళ్ళ మాటున “సంక్రాంతి” చీకట్లు.. 
దుర్భర దారిద్ర్యపు కౌగిల్లు ...దుస్సల దైన్యానికి సజీవ నకల్లు.. 
పొట్టతిప్పల వేటలో యువకులు.. పూటగడవని వృద్దులు .. !
వయసుడిగిన కాలంలో .. 
పాతబడిన ఇళ్ళకు కాపలా.. 
ఇదీ ముసలితనపు చిత్రం ..
రాలుతున్న బ్రతుకు పత్రం.. 
కళ తప్పిన “సంక్రాంతి” నూతన భాగోతం .. 
ఇది ఏ అభివృద్దికి చిహ్నం ?? 
ఏ సంక్షేమానికి సూత్రం .. !
ఏ విపరీత పోకడకు విచిత్రం .. !


నేటి యువతకు ఈ సంబరాలు మీడియాలో కూడా ముచ్చట్లు కరువయ్యాయి .. నేడు పల్లెటూళ్ళలో కూడా ఈ పండుగ ఛాయలు కనుమరుగైపోయాయి. ఒకప్పుడు ఈ పండగకి సిటీలు బోసిపోతాయి, పల్లెటూళ్ళు ఫక్కున నవ్వుతాయి.. ఇప్పుడు రెండిటికీ పెద్ద తేడా లేదు.. పక్కున నవ్విన పల్లెటూళ్ళు వెల వెల బోతూ బిక్కమొహం వేసుకున్నాయి మనవైపు జాలిగా చూస్తూ.. 


స్వస్తి __/\__


Written by : Bobby Nani
10th Jan 2017.

No comments:

Post a Comment