Saturday, July 30, 2016

విటుని కౌగిట నలిగిన ఓ ఆడతనం....


“వేస్య” అనబడే ఈ స్త్రీ గురించి ఎవ్వరూ పట్టించుకోరు.. సమాజంలో ప్రతీ ఒక్కరికి ఆమె లోకువే.. కాని ఆమె ఎందుకలా రోత కూపంలోకి వెళ్లిందో చూసేవాడు చాలా అరుదు.. ఒక స్త్రీ అన్నీ తెగించి అలా పైట జార్చాలంటే ఆమె యెంత నలిగివుండాలో .. యెంత మదనపడి ఉండాలో.. !!! అవసరాల కోసం తనని తాను దహించుకుంటూ క్షణకాలపు సుఖేంద్రులకు తనని తాను అర్పిస్తూ పైకి సన్నజాజిలా నవ్వు చిందిస్తూ.. లోలోన బ్రద్దలవుతున్న అగ్ని సిఖరాగ్నిని అణిచిపెట్టి, త్ర్రోక్కిపెట్టి.. నటిస్తుంది, లాలిస్తుంది.. బిడ్డ ఆకలి కేకలు వినపడినా ఆ చీకట్లో నవ్విస్తుంది, నర్తిస్తుంది.. కళ్ళలోని నీరును ఆవిరి చేస్తూ ఆడుతోంది.. అలాంటి స్త్రీ మూర్తులను ఉద్దేశించి అక్షరనీరాజనం చెయ్యాలనిపించింది .. 

రెండు గుండెలను మాత్రమే చూసే ఓ మగాడు తనని చిదిమేస్తుంటే, ఆ గుండెల వెనుక దాగివున్న ఆవేదనను చూచి అక్షరాలుగా మలిచే మరో మగాడు ఖచ్చితంగా రచయిత అయిన, కవి అయినా అవుతాడు అని సగర్వంగా తెలియజేస్తూ.. ఇది కేవలం విపత్కర పరిస్థితులలో ఇలా మారిన స్త్రీ మూర్తులను మాత్రమే ఉద్దేశించి రాసినది.. ఒళ్ళు బలిసి కన్ను, మిన్ను తెలియక కొట్టు మిట్టాడుతున్న వారికి మాత్రం యెంత మాత్రమూ కాదని విన్నవిస్తూ ... 

విటుని కౌగిట నలిగిన ఓ ఆడతనం.... 

ఓయ్ మగాడా.. !
వింటావా ఓ నిమిషం...!
సమాజం చెక్కిన శిధిల శిల్పాల కన్నీటి గాధ..
ఈ వీధి మలుపులో, ఆ మురికి సందుల్లో...
చీకటి గదుల్లో, కామందుల కబంధ హస్తాలలో...
బండబారిన సుతిమెత్తని హృదయాల రోదన..
సృతితప్పిన జీవన రాగాలాపన.. !!

ఓ మగాడా..
ఇలా చూడు ఓ క్షణం..
కామాంధుని బుసల్లో..
బుగ్గి అయిన నా నును బుగ్గలు..
విటుని కౌగిట కాలిపోయిన నా యవ్వనం..
ఇగిరిపోయిన సోయగం..
సౌష్టవం కోల్పోయిన నా సౌందర్యం..
కార్చిన కన్నీటి వెల్లువ ..ఆ
కన్నీటి తెరల చాటున ఎన్నో, మరెన్నో.......
హృదయ విదారక దృశ్యాలు..
మల్లెలెన్ని తురిమినా పరిమళం చిందని
కుళ్ళిన మా దేహాలు..
చీకటికే బానిస అయిన
జీవచ్చవాలం ..
కామాగ్ని జ్వాలలకు ఆహుతి అవుతున్న
కోమలాంగులం ...
చితికి చేరువ అవుతున్న
నీచమైన నీలవేణులం ..
డబ్బుకు అమ్ముడు పోయిన
బజారు బొమ్మలం..
ఎవరీ దౌర్భాగ్యులు ??
సంఘం వెలివేసిన గమ్యం లేని
బాటసారులు ..
సూత్రమే లేని గాలి పటాలు..
చమురు లేని ప్రమిదలు..

ఓయ్ మగాడా వినిపిస్తోందా ...!!!
ఆశల సుడిగుండాల వలయంలో
చిక్కుకొన్న అంతులేని ఆవేదనలతో
అలమటించే అభాగినుల ఆక్రందనలు..
దాచుకునేందుకు మరేమీ మిగల్చక
సర్వం దోచుకున్న
విలాసేంద్రుల వికటాట్ట హాసాలు..
కనిపిస్తోందా ..
ఆ గాజు కళ్ళలోనుంచి తొంగి చూసే..
నిరాశా, నిస్పృహల వెల్లువ..
ఎన్నో రాత్రుల విషాద అనుభవాల క్రినీడలు...
ఉషోదయమే లేని విషాద జీవచ్చాయలు..
తోడు లేక,
నీడ లేక
ఎండిపోయిన బీడు గుండెల
జీవన సమరపు ఛాయలు ..!!!
అణువణువునా విటుని పన్ను గాట్ల గురుతులు..
కలల్లో జీవిస్తూ, మమతానురాగాలకై
కలవరిస్తూ కాలగర్భంలో కలిసిపోయే
కాగిత పూల కుసుమాలు..
దేవుని పూజకు నోచుకోని
నలిగి నేలరాలిన మల్లెల మాలికలు ..
మానవ సమాజ గ్రంధంలోని
ఆఖరి పుటల్లో సైతం చోటులేని
చరిత్ర హీనుల కన్నీటి బ్రతుకులపై
కించిత్తు సానుభూతి చూపలేవా ??
ఏకాంతం లో అయినా
ఓ వెచ్చటి కన్నీటి బొట్టు రాల్చలేవా మా కోసం ఓ మగాడా.. !!!

స్వస్తి __/\__


Bobby Nani

Friday, July 29, 2016

పరమాత్మ ఎక్కడున్నాడు ??

ఏంటో ఈ రోజు నా ఆలోచనలు ఆధ్యాత్మికత వైపు పరుగులు తీసాయి .. ఆధ్యాత్మికత తో పాటు మానవ సత్ప్రవర్తన, నైతిక విలువలను కూడా రాస్తే బాగుంటుంది అనిపించింది.. అందుకే ఇలా రెండిటిని మిశ్రమం గా మలిచి మీ ముందుకు...

ఆధ్యాత్మిక దృష్టితో మాత్రమే చదవండి..

మానవుడు ఏ పని మొదలు పెట్టాలన్నా మనస్సులో ఒక సంకల్పం అనేది వుండాలి.. శాస్త్రాలు ఏ విధంగా చెప్పాయో ఆ విధంగా నడుచుకోవడం ధర్మం .. ధర్మం ఆచరిస్తే శ్రేయస్సు కలుగుతుంది.. ఆ ధర్మం స్వరూపం తెలుసుకోవడానికి మనకు శక్తి, సామర్ధ్యాలు లేకపోతే మహాత్ముల సేవ చేసి ధర్మ స్వరూపాన్ని తెలుసుకోవచ్చు..

మనం అనుకుంటాం ఐశ్వర్యం, అధికారం వీటివల్ల సుఖం కలుగుతుంది అని.. కాని నిజానికి అది తాత్కాలికమే.. శాశ్వతం కాదు.. ఐశ్వర్యము కలవాని దగ్గరకు వెళ్లి సుఖమైన శాంతి అనుభావిస్తున్నావా ? అని ప్రశ్నిస్తే “లేదు” అనే స్పష్టంగా చెప్తాడు... ఈ మధ్యన నా మిత్రుడు ఒకడు మధ్యంతర శిరి కలిగి అనుభవిస్తున్నాడు.. అతను మొదట చాలా సంతోషంగా వున్నా తరువాత ఇంతకుముందే బాగుంది అనుకునే స్థాయికి వచ్చాడు.. ఇంత ఐశ్వర్యం ఉందిగా .. సుఖ శాంతులు లేకపోవడం ఏంటి ?? అని మళ్ళి ప్రశ్నిస్తే ఈ ఐశ్వర్యం వచ్చాకనే అవి కరువైనాయి అంటాడు...అలాగే అధికారం లభిస్తే సుఖంగా ఉండొచ్చు అనుకుంటాం.. అధికారం పెరిగేకొద్దీ అశాంతి పెరుగుతుంది.. సమస్యలు ఎక్కువ అవుతాయి.. మరీ శాశ్వతమైన సుఖశాంతి ఎక్కడ వుంది అంటే పరమాత్మ స్వరూపం తెలుసుకున్నప్పుడే మనకు శాశ్వతమైన సుఖ శాంతులు దొరుకుతాయి... అది లేనినాడు సుఖ శాంతులు ప్రాప్తించవు... వాస్తవస్వరూపం తెలుసుకోవలసి వుంది.. పరమాత్మ ఎక్కడున్నాడు ?? గుడిలో వున్నాడా ? మసీదులో వున్నాడా ? చర్చ లో వున్నాడా.. ? లేక పర్వతాలలో వున్నాడా ? కాదు.. పరమాత్మ సర్వ వ్యాపకుడు.. ఆయన లేని చోటు లేదు.. సమస్త జగత్తులో పరమాత్మ నిండి వున్నాడు..

ఒకసారి భావతం తీసి దాంట్లో “ప్రహ్లాదోపాఖ్యానం” చదివితే భగవంతుడు లేని చోటు కనిపించదు.. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో “ఎక్కడున్నాడు నీ భగవంతుడు చూపు” అని అంటే భగవంతుడు ఎక్కడ లేడు ? అని తిరిగి సమాధానమిస్తాడు.. ఇలా

“ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి జూచిన నందందే గలడు దానవాగ్రణి వింటే!

బాల భక్తుడు ప్రహ్లాదునికి వున్న ఉత్కృష్ట సంస్కారం లేనందువల్లే మనం భగవద్దర్శనం చేయలేకపోతున్నాం... ఇది మనం గ్రహించాలి..

మనుష్య జన్మ పొంది కూడా మనం మనుష్యులుగా జీవించక పోతే ఇక పశుజన్మే గతి.. కూడని పనులు చెయ్యడం వల్ల నరకం, దుఃఖం ఇవి రెండూ మాత్రం తప్పవు.. భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడని, సమస్త పుణ్య పాపాలు చూస్తుంటాడని.. ఎప్పుడో ఒకప్పుడు ఆ పరమాత్మకు మనం సమాధానం చెప్పాల్సి వుందని జ్ఞాపకం వుంచుకోవాలి.. మన కర్తవ్యాన్ని మనం ఏమరుపాటు లేకుండా నిర్వహించుకోవాలి.. అప్పుడు మనవల్ల పొరపాట్లు అనేవి జరగవు..

అందరూ సనాతన ధర్మం అని అంటూ వుంటారు.. ఈ సనాతన ధర్మం అనేది నిన్న, ఇవాళ పుట్టినది కాదు.. సృష్టి మొదట్లోనే పరమాత్మ ప్రజలకు ధర్మం గురించి భోదించి వున్నాడు.. ఆది, అంతం లేనిదే సనాతన ధర్మం.. ఈ ధర్మాన్ని గురించి మీరు పాటిస్తూ శ్రేయస్సును పొందండి అని పరమాత్మ చెప్పివున్నాడని శాస్త్రాలు చెప్తున్నాయి.. ఆ ధర్మాన్ని కాపాడవలసిన భాద్యత మనమీదే వుంది..ఆ పరంపర ప్రకారమే మనం జీవనం గడపాల్సి వుంటుంది.. మన పూర్వీకుల చరిత్ర చదువుతుంటే వాళ్ళు ఎటువంటి కష్ట పరిస్థితులలోనూ ధర్మాన్ని వదిలిపెట్టలేదు.. ఆపదలు ఎప్పుడూ మనుష్యులకు వస్తూనే వుంటాయి. అయితే ఆ ఆపదలను తప్పించుకోవడం కోసం మన ధర్మాన్ని మాత్రం మనం వదలకూడదు.. పరిస్థితులను బట్టి ధర్మాన్ని వదులుతున్నామనేది వివేకులైన వారికి ఏ మాత్రం తగదు.

మనం సంకల్పించే పనులు పరిశుద్దమైన సంకల్పంతో కూడి వుండాలి.. అప్పుడు భగవంతుని సన్నిదిలో మనశ్శాంతిని పొందుతారు.. భగవంతుడు కూడా మనకు తోడ్పడుతాడు..

స్వస్తి.. ___/\___

Bobby Nani

Thursday, July 28, 2016

చావుభయం ఒకటిపోతే దేవుడి బ్రతుకు గోవిందే కదా..దేవుడున్నాడని నమ్మి నిజంగా..
మనం మానేసింది ఏమీ లేదు..
చేతనైనదంతా చేసుకొనే
చేతనామయులం మనం..
చేతకానిదంతా దేవునితో,
దేవదూతలతో చేయించుకొనే
స్థితప్రజ్ఞులం మనం..
మన ఆనందం కోసం దేవునికి
మాటలు నేర్పిన, మతం నేర్పిన
మహానుభావులం మనం..
చిదానందులం మనం ... !
సర్వ ధర్మాలను పరిత్యజించి
సర్వేశ్వరుణ్ణి శరణం అంటాం..
ఇహపర సుఖాలకోసం
ఎవరినైనా వేదిస్తుంటాం..
స్వార్ధానికి సానుకూలంగా ఉంటేనే
ఏ దేవుడి మాటైనా వింటాం..
చావుభయం ఒకటిపోతే
దేవుడి బ్రతుకు గోవిందే కదా..
అనంతం అంతమై పోతే
అందరి పనీ గొంవిందే..

Bobby Nani

Wednesday, July 27, 2016

పుస్తకాలు లేని గది ఆత్మలేని దేహం వంటిది...

తెల్లటి పొలంలో నల్లని విత్తులు.. అదే అండి.. పుస్తకంలో అక్షరాలు..
ఏమైనా పుస్తకంలో చదవడంలో వున్నఆనందం మరెందులోనూ వుండదు.. అలా చదివిన మనకు సంతృప్తిగా కూడా వుంటుంది.. ఎంతైనా పుస్తకం పుస్తకమే..
ఎవ్వరూ లేనప్పుడు నేనున్నాను అంటూ తోడుగా మారగలదు..
భాదలో వున్నప్పుడు మనసు మరల్చి సంతోషాన్ని అందించే సంజీవిని కూడా కాగలదు..
తెలియనివి భోదించడంలో గురుస్థానాన్ని కలిగి సన్మార్గంలో నడిపేదిగా కూడా చెయ్యగలదు..
ఓ స్నేహితుడిగా, గురువుగా ఇలా ఎన్నో అవతారాలను పోషించి మనల్ని ఒకతాటిపై నడిపించనూ గలదు..


అందుకే నా దృష్టిలో పుస్తకాలు లేని గది ఆత్మలేని దేహం వంటిది... అంతే కాదు పుస్తకాలు దీపాలవంటివి కూడాను . వాటి వెలుతురు మనోమలిన్యమనే చీకటిని తొలగిస్తుంది... సానపెట్టినకొద్ది రాయి రత్నం వలె ప్రకాశిస్తుంది. చదివినకొద్దీ మనిషికూడా వివేకవంతుడవుతాడు....


Bobby Nani​

Tuesday, July 26, 2016

ఇది ఆవేశపూరిత అక్షరాలు కాదు.. ప్రతీ భారతీయుడి గుండె చప్పుడు..


రోజు రోజుకీ జనాలు కులం, మతం పిచ్చితో పెట్రేగిపోతున్నారు ...
"మొక్కై వంగనిది మానై వంగునా"
అనే నానుడి లోని మాటలు నిజం అవుతున్నాయి ... ఈ పిచ్చి రోజు రోజుకు మనవాళ్ళలో స్తిరత్వం లేకుండా పెరిగిపోతూ ఉచ్ఛస్థితికి చేరుకుంటుంది ... దీన్ని ఎవరూ ఆపలేరు అని అనుకుంటున్నాను.... ఒకవేళ ఆపాలంటే ఒక అద్బుతం జరగాలి ... మనకు స్వాతంత్ర్యo వచ్చినప్పుడే దీన్ని కట్టడి చేసుంటే ఈ రోజువరకు ఎందరో అభాగ్యులు బలికాకుండా వుండేవారు ... 

ఎన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేవి.. ... 
చాలా చాలా బాదగా వుంది ...

మన దేశంలో నిజాయితీగా పనిచేసే వారు 20% మాత్రమే కాని విచిత్రం ఏంటంటే రోజు రోజుకీ వీరి సంఖ్య తగ్గిపోతుంది. కారణం మిగిలిన 80% మంది వీళ్ళని ఏదోఒక రకంగా లొంగదీసుకుంటున్నారు ... సరే మనం ఎవరన్న నిజాయితీగా వున్నామా అంటే ఎలక్షన్స్ వస్తే మనవాళ్ళు 80% డబ్బులు తీసుకునే ఓటు వేస్తున్నారు ... మీరు మిమ్మల్ని అమ్ముకుంటూ ఉన్నంత కాలం పరిస్థితి ఇలానే వుంటుంది .... ఒక దేశం బాగుండాలి అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుండాలి ... అది బాగుండాలంటే దాన్ని నడిపే నాయకుడు సరైన వాడు అయివుండాలి ... సరైన నాయకుడను ఎన్నుకోవాలంటే ముందు మనం నిజాయితీగా వుండాలి ... ప్రతీ ఒక్కరు వారికి వారు ఇలా స్వతహాగా అనుకున్నప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ...

"ప్రజలను రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయటకు ధర్మాన్ని పున:స్థాపించుటకు ప్రతి యుగమున నేను జన్మిస్థాను" అని శ్రీకృష్ణుడు చెప్పాడు.
“మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏటా షుమారు నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నాయి. అంటే సగటున ఒక కుటుంబానికి లక్ష్యా యాభై వేల రూపాయలన్న మాట.

ఆయినా ఇంకా ఇళ్ళు లేని పల్లెలున్నాయి... .

కరెంటు లేని విలేజ్ లు ఉన్నాయి..

రోడ్లు లేని గ్రామాలున్నాయి....

మంచినీళ్ళు లేని ఊళ్ళున్నాయి....

సాధారణ జ్వరానికే నేల రాలే వారు వేలల్లో....

ఉద్యోగాల్లేక, పెళ్ళిళ్ళు కాలేక పరువు కోసం నరకయాతన అనుభవించే యువత లక్షలు....

రెండు పూటల కడుపు నిండా తిండి లేని వారు అరవై కోట్ల పై మాటే. ....

ప్రపంచంలోని నిరక్షరాసుల్లో సగం మంది భారతీయులే...

మరి ఏమవుతుంది ఈ ప్రజాధనం? ....”

“నల్ల ధనాన్ని వెలికి తీస్తే ఇప్పటివరకు మన దేశం చేసిన అప్పులన్నీ తీర్చవచ్చని అంచనా. ఇంకా మిగిలిన ఆ ధనాన్ని భారతీయులందరికీ పంచి తే తలా లక్షరూపాయలు పైగానే వస్తుందట....” ఇది మనం గొప్పగా చెప్పుకునే, చెప్పుకుంటూనే వుండే మన స్వతంత్ర భారతం ....

రైతుకు ఆకలేస్తే పచ్చని పైరుసాయి చూసే రోజులు పోయి.. ఆకలేస్తే ఆకాశానికి చూసే రోజులు వచ్చాయని అతను కన్నీటిపర్యంతం అవుతుంటే హృదయం ద్రవీకరిస్తుంది..

ఇది ఆవేశపూరిత అక్షరాలు కాదు.. ప్రతీ భారతీయుడి గుండె చప్పుడు..


స్వస్తి __/\__
Bobby Nani​

Monday, July 25, 2016

నా ఆస్థి ..

నాకంటూ నేను కోరుకుంటున్న ఆస్థి ..
ఓ చిన్న ఇల్లు, ఆ ఇంటిముందు ఓ పెద్ద వృక్షం ..
ఆ వృక్షం క్రింద ఒక చాప, ఆ చాప మీద నేను ..
నా చేతిలో ఎప్పటికీ తరగని సిరా ఉన్నటువంటి కలం ..
బోలెడన్ని కాగితాలు .. ఇంతకు మించిన ఆస్థి మరేదైనా ఉందా.. ?
ఆస్తి అంటే నా దృష్టిలో అనుభవించేది కాదు..
ఆనందించేది.., ఆనందింపజేసేది .. :)

Bobby Nani

నేటి ఇక్కట్లు ... నాటి ముచ్చట్లు...


ఆనాటి వసంతకాలపు సౌందర్యం,
కనుచూపు మేర ఆకుపచ్చని లోకంలో ..
విహరింపజేసేది..
నేటికాలపు వసంత సౌందర్యం,
కంటిపాపకు అందని మసిబారిన
మలినపు కాలుష్యానికి ఆవాసం..
రంగు రంగుల కాంతులు లేని నాటి కాలంలో..
నూనెదీపపు వెలుగుల ముచ్చట్లే బహు ప్రీతులు..
విందు భోజనములున్న నేటి కాలంలో ..
వేకువన దొరికే చలువది అన్నమే మధురాతి మధురం..
యాంత్రిక జీవనం, యాంత్రిక ఆటలు ఆడుతున్న నేటికాలంలో ..
అలనాటి టైరు బండి ఆట మరుచుట సాధ్యమా..
ఈనాటి మానవనిర్మిత చరవాణి సంగీత సాధనములలో...
మైమరిచి పోయే ఓ యువతా .. !
అలనాటి స్వచ్చమైన పైరుగాలి పారవశ్యపు
సహజసిద్ద సంగీతం వర్ణనకు అందునా..
ఒక్కటేంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఓ గ్రంధమే తయారవ్వదా ..
చెరువుగట్టు స్నానాలు, సూర్యావందనాలు..
పొద్దుగాల కోడికూత స్వర మధురాలు ..
పడుచుపిల్లల ఊయల కేరింతలు...
అమ్మలక్కల హృదయ ఘోషలు..
ఆడపడుచుల ఆప్యాయతలు..
ఆలుమగల కొంటె సరసాలు..
చిన్నపిల్లల చిలిపి చేష్టాలు ...
వయసుకొచ్చిన యువత షికార్లు..
రచ్చమాను పుకార్లు..
ఇంటిముంగిట ముత్యాల ముగ్గులు..
ఇలా ఎన్నో ఎన్నెన్నో...
అలనాటి రోజులు అందాల రోజులు.. కనుచూపుమేరలో వెతికినా ఎక్కడా లేవు..


Bobby Nani

Thursday, July 21, 2016

అతడో కాంత దాసుడు..ప్రతీ ఒక్కరు తల్లి గురించే మాట్లాడుతారు.. ఆమె గొప్పది అందులో సందేహం లేదు.. కాని తండ్రి కూడా అందుకు తక్కువ కాదనే నా ఈ చిరు సత్కార కవిత ..
ఇంట్లో తండ్రి స్థానం చాలా గొప్పది .. ఎందుకంటె ఆయనకు ఎన్నో సమస్యలు, మరెన్నో భాద్యతలు, ప్రతీ క్షణం భయపడుతూనే బ్రతుకుతాడు... కాని పైకి మహా ధైర్య శాలిలా ... ఇంటికి తండ్రి ఒక రక్షణ వలయం లా మారుతాడు.. అందరికీ ఏమో కాని తన కూతురుకు మాత్రం ఆయన మొదటి ప్రేమికుడే.. ఎప్పటికీ..

ఇలాంటి తండ్రికి నా ఈ చిరు కవితను అందిస్తున్నాను..

అతడో కాంత దాసుడు..
పేరుకే కాంత దాసుడు..
నిరంతర సంసార సాగర శ్రమజీవుడు...
నితాన్వేషణ విధి నిర్వహనుడు...
వేకువనే లేచి .. వున్నా, లేకున్నా
యేవో బట్టలు వేసుకొని ..
తిన్నా, తినకున్నా,
ఎండనకా, వాననకా,
పగలు, రేయి తారతమ్య భేదాలు మరిచి
సంసారమనే బీడు కయ్యను ..
గాడేద్దు వలె దుక్కి దున్నుతున్నాడు..
కంటిలోని జలాన్ని ఆవిరి చేస్తూ ..
కంటిముందర సంసారమనే భూమిని
చిరునవ్వుతో .. లాగుతున్నాడు పచ్చని
పంట చెయ్యాలనే తపనలతో..
కమిలిన చేతులతో,
తన పాదాన్ని అంటిన కనికరం లేని గాయాలతో.. !!
ఎందుకోసం ఈ త్రాస.. ఎవరోకోసం ఈ ప్రయాస..
అద్దంలో తనని తాను చూసుకున్నప్పుడు తెలిసింది..
మసిపట్టి మసకబారిన తన మోము ఒకటి వుందని..
గతించిన ఏళ్ళను వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకుంటే ..
అంతా చీకటిపట్టిన మసే కనిపించింది..
దుమ్ము, ధూళితో నిండిన తన జీవితాన్ని దులిపేదెవరు ??
మొరటివాడు, మొండి వాడు, క్రోధుడు ఇవే తన బిరుదులు ..
అతడో అద్బుతం, అతడో అజరామరం,
అతడే ఓ అనంత శక్తిస్వరూపుడు మగసిరి గల్గిన మగాడు...

__/\__


Bobby Nani

అమృత లయనానందకరీ ..క్షీరసాగర మదనామృత మనోచరనిలా ...
సూర్యుడు ఉదయించేవేల సుప్రభాతపు తొలి సంధ్యారాగిణివై..
నెలరేడు అగుపించే వేళ వేణుగానామృత మయూరివై..
తొలిపొద్దున వికసించే పుష్పమై ...
ప్రతీ మనసును కదిలించే మనోగీతవై ..
స్వచ్చమైన ఆ మనస్సుతో..
పరిపక్వతపు నీ మాటలతో..
దివి నుండి భువికి దిగిన అందాల హరి విల్లు వలే ..
సుగంధ, శోభిత, స్వర్ణాతి, సుమదుర, మధురానంద అమృత భాండాగారిణివై ..
కోకిల లయనానందకరిలా, విందా రవిందముల పదనిసల పరువానిలా..
వసంతకాలపు నీ అమృత తుల్యపు మాటలకు ...
ప్రకృతి లోని అణువణువు పరవశముతో ఉప్పొంగి..
పరవశించి పోవును కదా..
పరువాలు పొదిగిన సొగసు, సోయగం..
తారాజువ్వల వంటి నెమలపురి నేత్రములు ...
ఇంద్రధనస్సును తలతన్నే ఆ కనుబొమ్మలు...
లేలేత సంపెంగ వలెనున్న ఆ స్పష్టమైన నాశిక..
పున్నమి వెన్నెలను మించిన ఆ చెక్కిలి..
ప్రతీ అడుగుకీ చెంగు చెంగు మంటూ ..
నాట్యభంగిమలను ప్రదర్శిస్తూ .. చకోరపక్షిలా..
హృదయామృత వీణా, నాద తరంగిణివై .. కదలిరా .. ఓ
అమృత లయనానందకరీ ... !!!


Bobby Nani

Wednesday, July 20, 2016

పెళ్లినాటి ప్రమాణాలు ...


పెళ్ళినాడు మీరు అన్నిటికి ఒప్పుకొని చేసిన ప్రమాణాలను ఎలా మరుస్తారు ?? 

'ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి' అని వరుడు ప్రమాణం చేస్తాడు. అంటే 'ధర్మమునందు గాని, సంపదల విషయములందు గాని, శారీరక సుఖ విషయములందు గాని, దాన ధర్మములవల్ల లభించు మోక్ష విషయములందు గాని నిన్ను విడిచి నడువను.' అని వధువును పరిగ్రహించే ముందు వరునిచేత ప్రమాణం చేయిస్తారు. తరువాత మాంగళ్యధారణ సమయం లో కూడ ప్రమాణం లాంటి మంత్రాన్నే ఈ విధం గా చెబుతాడు వరుడు. 'మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా.
కంఠే భద్నామి శుభగే త్వం జీవ శరదశ్శతం '

అనగా : ఓ మాంగళ్యమా! నా జీవనానికి కారణ భూతురాలైన ఈ సౌభాగ్యవతి కంఠానికి నిన్ను అలంకరిస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు ఈమె కంఠము నందే వుందువు గాక!. ' అని చెప్పి మాంగళ్యాన్ని వధువు మెడలో మూడు ముళ్ళు వేసి కడతాడు.... త్రిమాతలైన లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవి లకు అంకితం గా మూడు ముళ్ళుగా వాటి యొక్క పవిత్ర చిహ్నంగా అవి పేర్కొనబడతాయి ...

సప్తపది లో కూడా ... ' ఏకం ఇషే విష్ణుత్వాం అన్వేతు' అనే మంత్రాలతో ఏడడుగులు వేయిస్తారు.... 

మొదటి అడుగు శక్తి కోసం, రెండవ అడుగు బలం కోసం, మూడవ అడుగు వ్రతం కోసం, నాల్గవ అడుగు ఆనందం కోసం, ఐదవ అడుగు ఇంద్రియ బలం కోసం, ఆరవ అడుగు రుతువుల కోసం, ఏడవ అడుగు గృహ ధర్మాల కోసం.. ఇద్దరమూ జీవితాంతం ఇలాగే కలసి నడుస్తాము అని అగ్ని సాక్షి గా ప్రమాణం చేస్తూ నడుస్తారు. ఈ సప్తపది తో వధువు యింటి పేరు మారిపోతుంది. వివాహానికి ఈ కార్యక్రమమే చాలా ముఖ్యమైనది.... పెళ్లి నాటి ప్రమాణాలు అంటే ఇవి... వీటిని పురుషుడు తప్పనిసరిగా అనుసరించి ఆచరించిన నాడే.. పవిత్రమైన వివాహం పరమార్ధ స్థితిని చేరుకుంటుంది. భర్తకు భార్య.... భార్య కు భర్త ..... అన్యోన్యంగా తోడు, నీడగా .. అరమరికలు లేకుండా అర్ధ నారీశ్వర తత్వం తో బ్రతికినప్పుడే ఈ ప్రమాణాలకు అర్ధం, విలువ వుంటుంది. 

కీచులాటలతో, వివాదాలతో, నిత్య సమస్యలతో... నిండు జీవితాలను బండల పాలు చేసుకోకూడదు. ప్రతి ఒక్కరు వివాహ ప్రయోజనాలను అర్ధం చేసుకోవాలి, వాటి గురించి తెలుసుకోవాలి.... 

ఆరు పదులు దాటినా కూడా మీ అర్ధాంగిని మల్లె పందిరి పక్కన నులకమంచం మీద ఒయ్యారంగా కూర్చున్నట్లుగా భావించాలి.. అప్పుడే సంసారం రసవత్తరం అవుతుంది.. రెండు రోజుల క్రితం ఒక ఆర్టికల్ చదివాను అందులో ఒక ముసలి అతను ఇలా అంటున్నాడు.. నా ఇరవై అయిదు ఏళ్ళ వయస్సులో నాకు పెళ్లి చేసారు ... చాలా పేద స్థితిలో వుండే వాడిని అప్పుడు చిన్న పట్టమంచం వుండేది ఆ మంచం ఒకరికి ఎక్కువ ఇద్దరికి తక్కువలా వుండేది .. నేను నా అర్ధాంగి ఇద్దరం ఇరుక్కొని మరీ పడుకునే వాళ్ళం .. చాలా గమ్మత్తుగా వుండేది లే ఆ రోజులు.. ఆ సమయ ఆనందం నేను ఉదయం నుంచి కష్టపడ్డ శ్రమను పక్కకు నేట్టేసేది వెచ్చని ఒకరి శ్వాసలో మరొకరం మిళితమై పడుకొనే వాళ్ళం.. ఇప్పుడేమో చూడు ఖరీదైన ఏ.సి. గదుల్లో విశాలమైన మంచాలలో పడుకుంటున్నాం కాని నా పక్కన ఇప్పుడు వున్నది ఓ 50 ఏళ్ళ ముసల్ది... అప్పుడేమో ఓ 22 ఏళ్ళ చిన్నది.. అంటూ చెప్పుకొచ్చాడు.. అంటే ఈన పక్కన వున్న భార్య ముసలిది అయిపోయింది.. ఈన మాత్రం ఇంకా సుఖ పురుషుడే అన్నట్లుగా వున్నాడు.. చాలా నవ్వుకున్నాను ఆయన మాటలు విని యెంత అన్యోన్య దాంపత్యమో కదా.. 

ఇలాంటి అర్ధాంగినుల మీద చిరు కవితాసత్కారం ... 

మల్లెలు విరబూసిన సొగసే నీది... 
సన్నజాజి సంధ్య వెలుగుల సౌందర్యమే నీది... 
సంపెంగెల వలపుల సోయగమే నీది... 
మందారపు చిరుమంద హాసముతో ..
పారిజాతపు పరిమళ పరువా పారవశ్యముతో ...
పెండ్లి పీటలపై, కనకాంబరాల కన్య జ్ఞాన నేత్రాన ...
పసిడి తలంబ్రాల తన్మయత్మంతో ... సింధూరపు సిగ్గులోలకంగా ...
మంగళకరమైన మాంగల్యం నీ మనోరంజిత కంఠముపై మెరవంగ ...
చూచెడి జనులెల్లరు కనులకు కనులారవిందు గావించగా ...
మెరిసే ఆకాశపు నక్షత్రములనే అక్షింతలుగా మలచి ...
నిత్య, నూతన వధూవరులను ఆశీర్వదించగన్ ...

స్వస్తి __/\__

Bobby Nani​

Tuesday, July 19, 2016

మారాల్సింది ఆడవారి వస్త్రధారణ కాదు దానికి ముందు మగవాడి ఆలోచనలు...


చాలామంది ఆడవారు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు అందుకనే మానభంగాలు జరుగుతున్నాయి అని తెగ గింజేసుకుంటూ వున్నారు ... దీనికి మీరు ఏకీ భవిస్తున్నారా ?? అయితే నేను రాస్తున్న ఈ కొన్నిటికి మీ హృదయం ఏం సమాధానం చెప్తుందో చూడండి ....

ఈ మధ్య మనం చూస్తున్నాం ఒక పింక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి స్కూటీ మీద అర్ధనగ్న వస్త్రములతో కూర్చొని వుంటుంది.. దాన్ని ఎవడో ఫోటో తీసి సోషల్ నెట్వర్క్స్ లో పెట్టాడు... వాడెవడో పెట్టాడు మరి మన మిత్రుల బుద్ది ఏమైంది... ?? ఆమె చేసింది తప్పే కాని మనం చేస్తున్నదేంటి ?? ఆ తప్పును మరింత తప్పుగా చిత్రికరిస్తున్నాం .. ఇదే ఇంట్లో వారు అయితే అలా ఒక ఆడతనాన్ని నడిరోడ్ లో పెట్టేస్తారా ??

సరే మీరు చేసిందే నిజమని అనుకుందాం... ఇక్కడ నేను అడిగిన ప్రశ్నలకు మీదగ్గర సమాధానం వుంటే తెలియజెయ్యండి...

ఒక వయస్సులోవున్న ఆడపిల్ల బట్టలు సరిగా వెయ్యలేదని, మిమ్మల్ని రెచ్చగొట్టేలా తన బట్టలు వున్నాయని అందుచేతనే మీరు తనమీద మానభంగం చేసారని అనుకుందాం ... మరి మూడేళ్ళ పసి హృదయం మిమ్మల్ని రెచ్చగొట్టేలా చేసిందంటారా ??

తనకు ఆ వయసుకు రెచ్చగొట్టే పరిజ్ఞానం ఉందంటారా ?? లేదు కదా అయితే ఎందుకు తనమీద కూడా మానభంగం జరిగింది ?? జరుగుతోంది ??

మూడేళ్ళ పాప కి అసలు రెచ్చగొట్టే విషయమే తెలియదు. అమ్మా నాన్న వేసిన డ్రస్ తప్ప ఫ్యాషన్ దుస్తులు వేసుకోవచ్చనీ, అందరినీ తనవైపు ఆకర్షించాలనీ తెలియని పసి వయసు. ‘పప్పీ షేమ్’ అని తోటి పిల్లలో, తాతా నాయనమ్మలో ఏడిపిస్తే తప్ప తన వంటి మీద బట్టలు లేవని గ్రహించలేదు. ఏం రెచ్చగొట్టిందని ఆ పాపని రేప్ చేయాలి? దీనికి మీరు అనుకున్న, అనుకుంటున్నా బట్టలే కారణం అంటారా ??

మరో పాపకి పదేళ్ళు. ఆ పిల్లదీ అదే పరిస్ధితి. సొంత మేనమామ, తన పిల్లలతో సమానంగా చూడవలసినవాడు మానభంగం చేశాడు. చిన్న వయసు గనక, మేనమామతో సరసం ఆడిందనడానికి కూడా లేదాయే. కనీసం సరసం ఆడొచ్చని కూడా తెలియని వయసు. పదేళ్ళ వయసులో ఏ డ్రస్సు వేసుకుంటే పురుష వీరులను రెచ్చగొట్టగలదు? కాముకుల మనసు చెదరడానికి పదేళ్ళ పాప ఎన్ని ప్రయత్నాలు చేస్తే సాధ్యం అవుతుంది? మీ దగ్గర సమాధానం ఉందా ??

ఇక 32 సంవత్సరాల విధవరాలు. భర్త చనిపోయిన పాపానికి విధవ గా పేరిడిన సమాజం మానభంగం చేసే పురుషులను కనీసం వెధవ అనయినా పిలుస్తుందా? రాత్రి ఎనిమిది దాటితే స్త్రీలని బైట తిరగకుండా చేయాలని ఢిల్లీ పోలీసులు ప్రతిపాదించారు. ఎనిమిది ముందు జరిగే రేప్ ల నివారణకి ఏం చేయాలో వారు చెప్పలేదు. భర్త లేని స్త్రీ, పొట్ట నింపుకోవడానికి ఏ పని చేస్తే రాత్రి ఎనిమిది దాటకుండా ఉంటుంది? కూలీ నాలీ చేసుకుని బతికేవారు, ఇళ్ళల్లో పాచిపని చేసి బతికేవారూ, రోడ్లు ఊడ్చే కార్మిక స్త్రీలు తాము పగలే పని చేస్తామనీ, చచ్చినట్లు పని ఇవ్వాల్సిందేననీ షరతులు పెట్టి పని సంపాదించగలరా? ప్రవేటు వ్యక్తులనీ, సంస్ధలని వదిలేద్దాం. ప్రభుత్వానికైనా ఆ షరతులని కార్మిక స్త్రీలు విధించి పని సంపాదించగలరా? చెప్పండి ?? దీనికి మీ సమాధానం ??

ఫ్యాషన్ దుస్తులే రేప్ లకి కారణం అన్నారు.
కనిపించేలా డ్రస్ లు వేసుకుంటారన్నారు.
బాయ్ ఫ్రెండ్స్ తో పబ్ లకి వస్తే రేప్ లు చేయరా అనడిగారు.
తాగుతారని నిందించారు.
మగాళ్లలతో కలిసి పని చేస్తే అంతే అన్నారు.

‘ప్రతిసారీ ఆడవాళ్ళదే తప్పు’ అన్నదే నేను గమనించిన ప్రతీ మగవారిలోని ఆంతర్యం.. అదే వారి మాటల్లోని సారాంశం.

కురచ దుస్తులు, వెర్రి తలలు వేస్తున్న ఫ్యాషన్ల ఫలితం. పశ్చిమ దేశాల వెర్రి సంస్కృతిని మక్కీకి మక్కీ కాపీ కొడుతున్న ఫలితం. ఈ సంస్కృతీ పరాధీనతను సవరించడానికి ప్రభుత్వాలు కృషి చేయవలసి ఉండగా అదేమీ జరగడం లేదు. కానీ అమ్మాయిల కురచ దుస్తుల వల్ల మగాళ్లు నీతి తప్పాలా అన్న ప్రశ్న పోలీసు అధికారులు వేయకపోవడమే విచిత్రం.


ఇక్కడ ఎవ్వడూ మగాడి బుద్దిని చూడట్లేదు ... అదే బట్టలు నీ చెల్లో, అక్కో వేసుకుంటే నువ్వు చూస్తావ ?? చూసినా చూస్తావ్ ఎందుకంటె నువ్వు వావి, వరసలను విడిచిన అతినీచమైన చిత్త కార్తివి కనుక ...

అబ్బాయి, అమ్మాయి ఇష్టపడడం, ప్రేమించుకోవడం, దగ్గరవడం అన్నీ ఒక్కటే అన్న అవగాహన నెలకొని ఉండడం ఒక సమస్య. ఇరువురి మధ్య ప్రేమ సంబంధం అభివృద్ధి చెందడంలో సంభవించే వివిధ సున్నిత దశలను ఒకదానికొకటి విభజించుకోవడంలో ఈ రోజుల్లోని యువతీ, యువకులు విఫలం అవుతున్నారు. ఆ విషయంలో చైతన్యవంతమైన అవగాహన కలిగించడంలో సమాజం సఫలం కావడం లేదు. సమాజమే వెనుకబాటు భావాలు కలిగి ఉన్నపుడు స్త్రీ, పురుషు సంబంధాలలోని సున్నితాంశాలు యువకులకు సరిగ్గా అర్ధం కావడం సులభమైన విషయం కాదు. సమాజం పరివర్తనా దశలో ఉన్నపుడు ప్రభుత్వాలు, నిర్దేశక వ్యవస్ధలను సమర్ధవంతంగా నిర్వహించగలగాలి. లేనట్లయితే యువతీ, యువకుల్లో ఏర్పడే అనేక సందేహాలు పరిష్కారానికి నోచుకోక అయోమయంలో అనేక తప్పటడుగులు వేస్తారు. వేస్తున్నారు.. ఈ పరిస్ధితిని గుర్తించడానికి బదులు మొత్తంగా అమ్మాయిల ప్రవర్తనలని తప్పు పడుతూ రేప్ నేరాలకి వారినే బాధ్యులని చేయడం అసంగతం...
వారు అలా బట్టలు వేసుకోవడం తప్పుకాదని నాఉద్దేశం కాదు ... అలా వేసుకోవడం చాలా తప్పు .. కాని కేవలం అలాంటివాటిమీద ఈ దుశ్చర్యలు జరుగుతున్నాయన్నదే పొరపాటు .... ఆడవారు మీరు కూడా కొన్ని కొన్ని నిభందనలు, హద్దులు ఏర్పరుచుకొని మసులుకోవాలని ఆశిస్తున్నాను ... మీరు బయటికి వెళ్ళేటప్పుడు అందరి ద్రుష్టి మీ మీద పడాలని అనుకోకండి.. మనం, మన సాంస్కృతిక, సాంప్రదాయాలు ప్రపంచం నలుమూలలా వెలుగెత్తి చాటవలసిన భాద్యత మనందరిదీను... దయచేసి దాన్ని కాపాడమని నా మనవి ...

అలాగే మగవారు కూడా మన సర్వేంద్రియాలను అదుపులో పెట్టుకొని మసలుకోవాలని చిన్న మనవి .. స్త్రీ, పురుషులు ఇరువురూ వారి వారి నైతిక విలువలను కాపాడుకుంటూ, ప్రవర్తిస్తూ వస్తే మనము, మనదేశం సస్యశ్యామలమైపోతుందని నొక్కి వక్కాణించగలం...

మారాల్సింది ఆడవారి వస్త్రధారణ కాదు దానికి ముందు మగవాడి ఆలోచనలు...


స్వస్తి .. __/\__


Bobby Nani

Saturday, July 16, 2016

ఏడు రోజుల భాగోతం...ఆదివారం నాడు – 
అల్లరి, ఆనందం కలగలిపి చిరుమందహాస దారులై వెలుగొందే వేల... ఇంటా, బయటా ఎక్కడైనా హాయ్ హాయ్ అంటూ రయ్ రయ్ మంటూ గాలిలోనే నృత్య ప్రదర్శనలు గావిస్తారు...

సోమవారం నాడు –
సొమ్మసిల్లి పడిపోయేంత పని వత్తిడి లేకపోయినా వుందని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ బద్దకంగా, బలహీనంగా ఎలాగోలా ఈడుస్తూ ఆ రోజు సాగిపోతుంది..

మంగళవారం నాడు – 
మత్తుగా,గమ్మత్తుగా కొత్త కొత్త ఆలోచనలతో, మాటల యుద్దాలతో, ఆ రోజు కాలం వెలిబుస్తాము ..

బుధవారం నాడు – 
భాద్యతతో చాలా పని పెండింగ్ లో వుంది ఎలా అయినా పూర్తి చెయ్యాలని రావలసిన సమయం కన్నా ముందుగానే వచ్చి కూర్చుంటారు... కాని ఏదో ఒక ఆంతర్యం తో తెలియకుండానే ఆ రోజు గడిచిపోతుంది..

గురువారం నాడు –
గురువుగారు అయిన సాయి ఆశీర్వాదం తో నుదిటిన బొట్టుతో “రామం” లా పిలకలేకున్న ఉన్నట్లుగా ఫీల్ తో చేతిలో ప్రసాదంతో వెళ్లి కూర్చుంటారు.. కాని ఆరోజు బాస్ మరోపని చెయ్యమని ఆదేశం తో ఆ రోజు అలా గడిచిపోతుంది ..

శుక్రవారం నాడు –
రెమో మాదిర తయారయ్యి సంప్రదాయ వస్త్రాలంకరణలతో అక్కడ పనిచేసే వనితలను కళ్ళు విట్టార్పి చూస్తూ చూస్తూ నేత్రానందం పొందుతూ పొందుతూ ఆ రోజు అలా గడిచిపోతుంది..

శనివారం నాడు – 
ఈరోజు కోసం గడచిన 6 రోజుల నుంచి ఎదురుచూస్తూ వుంటారు.. ఈ రోజు అస్సలు కాళ్ళు భూమి మీదనే పెట్టరు చాలా వేగంగా వుంటారు.. ప్రతీ పనిని చాలా చురుగ్గా చేస్తూ మొత్తానికి పని మొత్తం పూర్తిచేస్తారు..

ఇదండీ మన ఏడు రోజుల భాగోతం... :P

ఇలా కనీసం కొందరైనా వుంటారనే హాస్యానికి రాసాను.. మరోలా అనుకోకండే ... ;)

<3 HAPPY WEEK END <3


Bobby Nani

“కృష్ణ” అనే శబ్దం ఎలా వచ్చినది ....

అసలు మన పరిభాషలో “కృష్ణ” అనే శబ్దం ఎలా వచ్చినదో దాని నిర్వచనం ఏంటో చూద్దాం.. 

కృష్ణ  : క + ఋ +ష +న +అ : క కారఋకారషకార సకార అకార విసర్గములు చేరి “కృష్ణ” శబ్ధమైనది. క కారమునకు బ్రహ్మయు, ఋ కారమునకు అనంతుడను, ష కారమునకు శివుడును, న  కారమునకు ధర్ముడను, అ కారమునకు శ్వేతదీపవాసి అగు విష్ణువును, విసర్గమునకు నారాయణ ఋషియు అని అర్ధములగును. సర్వ మూర్తి స్వరూపుడును, సర్వాధారుడను, సర్వకారణుడు అయిన ఈ స్వామి దివ్య తెజస్వరూపుడగుచే కృష్ణుడు అని పిలవబడుచున్నాడు... 

శ్రీ కృష్ణుడు అవతరించగా.... 
గోకులములోని అన్నీ భూములలో అక్కడక్కడ ... 
చందనము, మందారము, నాగము, 
పున్నాగము, చంపకము, అశోకము, 
పనస రసాలము మొదలైన నానా జాతి 
వృక్షములు, కుసుమ ఫల సంపదలతో,....
దివ్యమైన పరిమళములు దిక్కులయందు వ్యాపించగా...., 
స్రవించుచున్న తేనెల గ్రోలి చరించు 
తుమ్మెదలు ఝంకారము సొంపుగా చేయుచుండగా .... 
ఫలముల అమిత  బరువుతో కొమ్మలు కిందకు వంగగా ... 
భక్తిచేత భూమిని ఆనుకొని ... !
భగవంతుడైన వసుదేవునికి ...
సాష్టాంగ లక్షణమైన ప్రణామము చేయుచున్నట్లుగా ఉండెను ఆ సమయంలో.. 
అంతే కాకుండా అక్కడక్కడా మాధవి, 
జాజి, మల్లిక మొదలైన పూదీవెలు...  ఎల్లప్పుడూ ....
మందమారుతముచే జారువట్టి పుష్పముల సమూహముగలవై ఉంటూ .... 
అవతరించిన శ్రీ భగవంతుడైన 
నారాయణుని యెడల అవి పరమ ప్రేమగల, 
భక్తితో కూడిన  పుష్పాంజలి సమర్పించునట్లుగా ....
కనులకు కనువిందులు చేస్తున్నాయి ...
ఆ  సమయమున నాకు.. నిజంగా శ్రీ కృష్ణ నామ స్మరణలో ఏదో తియ్యని, తెలియని మత్తు వుంది.. అందుకే ఆయనను మహా మహులు సైతం వర్ణించలేరు.. వర్ణనకు అతీతుడు ఈ నల్లని గోపాల కిట్టయ్య....

ఈ రోజు ఏంటో కృష్ణా, కృష్ణా అంటూ మదిలో ఓ మృదంగామృతం గిలిగింతలు పెట్టుచున్నది... 

స్వస్తి.. ___/\___

Bobby Nani 

కాలే కడుపులు ...


డైటింగ్ పేరుతో మన కడుపులను మనమే కాల్చుకుంటుంటే ... ఒక్క ముద్ద దొరకక ఎందరో అభాగ్యులు కడుపు కాల్చుకుంటున్నారు... ఇది మనకు చాలా చిన్న విషయం గా అనిపించవచ్చు ..... కాని ఒక్కరోజు అయితే పర్వాలేదు, లేదా రెండు రోజులు, పోనీ ఒక వారం మనం ఉండలేము. మనకే ఈ లోకంలోనే లేని కష్టాలు అన్నీ వచ్చి మనమీద పడినట్లు సతమతమౌతాము.. & గింజేసుకుంటాము .. దేవుడిని తిట్టేసుకుంటాము ... ఎంతైనా ఫ్రీ గా మన తిట్లు ఓపికగా వింటూ వుండేది ఆయన ఒక్కడేకదా ... తరువాత చంపలు వేసుకోవడం మాములే కదా... 

కాని రోడ్లమీద మనకు కనిపించే నిరుపేదలు కడుపునిండా తిని ఎన్ని రోజులు అయిందో ఎవ్వరికీ తెలిదు... పట్టించుకోరు కూడా,.... వేరే గ్రహాల మీద ఏముందో తెలుసుకునే పరిజ్ఞానం మనకు వుంది. కాని ఎదుటి మనిషి చచ్చిపోతున్నా పట్టించుకోనిఅతిగొప్ప పరిజ్ఞానం మనది....

మన ఇంట్లో వాళ్ళు ఒక్కరోజు కాదు, ఒక్క పూట తినకపోతేనే విలవల లాడిపోతాము.... మరి వాల్లనేమంటారు.... రోడ్ మీద అప్పుడే పుట్టిన పురిటి పిల్లలు ఖటినమైన రాళ్ళమీద దొర్లుతుంటే కంటినీరు పెట్టుకోవడం కన్నా మనం ఏమీ చెయ్యలేమా ??  
వాల్లనేదో వుద్దరించమని చెప్పట్లేదు.... వాళ్ళకు ఒక దారి చూపించమని చెప్తున్నాను... 
మీ అమూల్యమైన సమయం వృధా చెయ్యమని చెప్పట్లేదు.... మీరు డైటింగ్ చేసి వృధా చేసే ఒక ముద్ద వాళ్ళకు ఇవ్వమని చెప్తున్నాను.... 
మీకు తోచిన రూపాయో, అయిదు రూపాయలో తప్పక దానం చెయ్యండి.. అదిలేకుంటే ఏదన్నాఆహారం కొని వాళ్ళకు ఇవ్వండి...

ఇప్పటివరకు మీరు ఒక కోణంలో ఆలోచించి వుంటారు ... కాని ఒక్కసారి మరోకోణంలో నా కోసం ఆలోచించండి మీకు తప్పకుండా నచ్చుతుంది... ఖరీదైన స్నేహితులకు ఖరీదైన హోటల్స్ లో పెట్టే ఆనందం కన్నా మనం తినగా మిగిలిన ఒక్క ముద్ద ఈ చిన్నారులకు అందించడంలో వారి ముఖంలో కనపడ్డ ఆనందం వెలకట్టలేనిది.. నిజమైన ఆనందం అంటే అదే.. 

సమస్య వచ్చినప్పుడు సరైన సమయంలో, సరైన పద్ధతిలో స్పందించని వారు సమజమార్పుకు తోడ్పడ లేరు. ఇవన్ని మీరు గుర్తుపెట్టుకొని వున్నా కూడా కాస్త మనిషికి మనిషి సాయాన్ని బ్రతికించమని వేడుకుంటున్నాను. 

స్వస్తి __/\__

Bobby Nani

కొన్ని స్నేహాలు...

కొంతమంది పరిచయాలు బలే గమ్మత్తుగా  మొదలవుతాయి ..అలానే గప్చిప్ గా దూరం  కూడా  అవుతాయి కూడా .. ప్రతీ పరిచయానికి  కారణం అవసరం  లేదు.  కాని ప్రతీ పరిచయం దూరం  అవ్వడానికి  మాత్రం కారణం తప్పక  వుండాలి ..  తుమ్మెదలు పుష్పం మీద తియ్యనైన తేనెకోసం వచ్చి వాలినట్లు వాలుతారు.. కాని ఆ పుష్పానికి  తెలియదు ఆ అందమైన తుమ్మెద వచ్చింది తేనే కోసమని.. అలానే ఈ తుమ్మెదకు తెలియదు ... సంధ్యాస్తమ సమయానికి ఆ పుష్పం వాడిపోయి నిర్జీవం అవుతుందని.. కాని అవి కలుసుకున్న ఆ కొన్ని మధుర క్షణాలు అద్బుత క్షణాలుగా మారిపోతాయి.. అలానే మనకూ నిన్నటి గురించి అనవసరం, రేపటి  గురించి  అనవసరం ఈ రోజు ఉన్నవాళ్ళే మన అద్బుతాలు రేపు వారు మనతో ఉంటారని ఆశించకుండా ఈ కొన్ని క్షణాలు వారి ఆత్మీయానందాన్ని అందుకోవడమే ఉత్తమం..ఇదే నేటి లోకం పోకడ.. అందరికీ కొత్తదనం కావాలి.. కొత్తదనం అంటే శారీరక మార్పులు మార్చుకోవడం అనుకున్నాం కాని మానసిక జ్ఞాపకాలను మరవడం అని అనుకోలేదు.. కొత్త అంటే పాతవాటిని మరవడం కాదు  పాత, కొత్త అందరినీ కలుపుకుపోవడం ...

స్వస్తి  __/\__

Bobby Nani

ఖరీదైన మనుషులు..

యెంత అబ్బురపరిచే టెక్నాలజీ వచ్చినా మనిషి.. మనిషికే పుడతాడు.. 
పసితనం, యవ్వనం. వృద్దాప్యం ఆగవు ... మరణం, జననం ఆగవు... 
మేఘాలనుంచే వర్షపు చినుకులు రాలుతాయి.. 
తొలకరి జల్లులతో తడిచి పులకరించిన నేల ...
సుఘంధ, సువాసనల మేళవింపు తో వచ్చే పరిమళం .. వర్ణింపసఖ్యం కా జాలదు...
అనుభవాలు, జ్ఞాపకాలు, ఆటలు, పాటలు, అన్నీ మనసున్న మనిషికే సాధ్యం.. 
యంత్రాలను కనిపెట్టిన మనం ... వాటితోనే సహజీవనం సాగిస్తున్నాం... 
మనుషుల మనసులకు, ప్రకృతి అందాలకు, దూరంగా వచ్చేస్తున్నాం.. 
హృదయంతో చూసే రోజుల్లోనుంచి కళ్ళతో చూసినా కనపడని రోజుల్లోకి వెళ్తున్నాం... 
పక్షుల కిలకిలా రావాలు... ఎక్కడ ? 
సెలయేటి జలపాతాలు... ఎక్కడ ? 
నాట్యమయూరి నెమలమ్మ ... ఎక్కడ ?
కళ్ళు పట్టనంత సౌందర్యం.... ఎక్కడ ? 
మనపై పడు ఉదయపు ఉషోద కిరణాలు ... ఎక్కడ ? 
మనకంటికి కనపడని పడమటి దిక్కు సూర్యభగవానుడు సంధ్యాకాంత రాగరంజితం.... ఎక్కడ ? 
మానవత్వం... ఎక్కడ ? 
అమ్మమ్మ, తాతయ్యల ప్రేమానురాగాలు... ఎక్కడ ?

ఇవన్నీ ఇలా ఎన్నెన్నో కాలక్రమేనా కనుమరుగు అయిపోతున్నాయి.. కాలగర్భం లో కలిసిపోతున్నాయి... మన ముందు తరాలు వాళ్ళు చూసినవి, చేసినవి మనం చూడలేదు.. మనం చూసినవి మన తరువాత రాబోవు తరాల వారు చుస్తారన్న నమ్మకం లేదు... 
ఇది అభివృద్దా .... లేక .... పతనమా .... ఒకప్పుడు అన్ని సమపాళ్ళలో ఉండేవి ఇప్పుడు అన్ని హెచ్చుపాళ్ళలో వున్నాయి.. కారణం మనకు అన్ని అతి శీఘ్రముగా జరిగిపోవాలి దేవుని దగ్గరకు కూడా ముందు మనమే వెళ్లిపోవాలి అని కోరుకునే అతి సాధారణ విషయం అనిపించే నీచమైన మనస్తత్వం మనది... ఒప్పుకోవాలి మనం ఇవన్నీ... ఇలా ఎన్నో...  ఎన్నెన్నో.. 

కళలు కూడా ఖరీదై పోయిన రోజులివి.. మెప్పుకోసం, గొప్ప కోసం డబ్బులు తగలేసే వింత మనుషులం మనం... పెండ్లి అంటే వెళ్లి మొహం చూపించి వచ్చే మనస్తత్వం నిజానికి పెండ్లి అంటే రెండు వేరేవేరే హృదయాలు ఒక్కటయ్యే వేళ.. ఎందరు ఇలా ఆలోచిస్తున్నారు ?? స్వార్ధపు ముసుగులో మనిషి మొహానికి రంగులు పులుముకొని ఇలా పైకి ఆప్యాయతలు, అనురాగాలు అంటూ వేల్లజూపుతూ జీవితపు నాటక రంగంలో తనదైన శైలిలో తను అనుకున్న ప్రతీ పాత్రలోకి పరకాయ ప్రేవేశము గావిస్తూ, నవ్విస్తూ, ఏడిపిస్తూ, భాదిస్తూ, అగ్ని కోసం వెళ్ళే పురుగువలె సమస్యల వలయంలోకి మనమే చిక్కుకుంటూ ఉన్నాము... 

ముఖ్యంగా కొందరు యువత ... యువత దేశానికి పట్టుకొమ్మలు అనే విషయం ఏమో కాని కేవలం కొందరు స్త్రీ, పురుషులు ఇద్దరు గురించి చెప్తున్నాను... 
చాటింగ్ లోనే సంసారాలను చేస్తున్నారు ... ఇదేనా మన అభివృద్ధి.. ఒక యంత్రాన్ని ఒక సత్కార్యం  కొరకు కనిపెడితే దాని ద్వారా 100 దుర్వినియోగపు పనులను మనమే సృష్టిస్తున్నాం.. కాదంటారా??  

సమాధానం మీ దగ్గరే కాదు నా దగ్గర కూడా లేదు... మనిషి ఆలోచనా తరంగాలు వాయువుకన్నా వేగంగా వెళ్తున్నాయి ఈ దశలో కనీస నైతిక విలువలను మరుస్తున్నాడనడంలో ఎలాంటి సంశయము, సందేహము లేదు... ఏదో సాధించాలన్న తపన ...తపన వుండాలి అది మనల్ని మింగేసేలా వుండకూడదు అనేది నా అభిప్రాయం... స్థలానికి, పొలానికి హద్దులు ఉన్నట్లే మనిషికి కూడా కొన్ని హద్దులు, నియమాలు ఏర్పాటుచేసుకోవాలి... 

ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే వుంటాయి మన చరిత్ర అంత పెద్దది కదా మరి... 

చివరగా ఒక్క మాట ... యెంత ఎత్తు ఎదిగిన తలపైకేత్తే అనంత విశ్వాన్ని చూడాలి...
పైకెత్తి ఉమ్మితే ఏమౌతుంది,, ??

స్వస్తి   __/\__

Bobby Nani

మతాలు ఎన్ని వున్న మానవత్వం ఒక్కటే..

పుట్టిన వారందరి తీరు ఒక్కటే. ..
గిట్టిన  వారందరి దారి ఒక్కటే... 
మధ్యలో మనకు  మనం పులుముకుంటున్న ఈ ...
మలిన కులతత్వం, చేసుకుంటున్న మోస మత మౌడ్యం ఎందుకు ??
ఒక దేవుణ్ణి చంపి మరో దేవుణ్ణి బ్రతికించలేం కదా.. 
ఒక మతాన్ని ఓడించి మరో మతాన్ని గెలిపించానూ లేం కదా..
మందిరమైనా, మసీదు అయినా, చెర్చి అయినా గురుద్వార మైనా 
అక్కడ మనిషి సమర్పించేది భక్తి ఒకటే ... సాధించే శక్తి ఒకటే.. 
సత్యం దేవుడు అయితే చాటింపు  మాత్రం మతం  అయింది.. అదే నేటి మన దుర్గతి.. 

Bobby Nani​

"బ్రహ్మోత్సవం" తో నా అభిప్రాయ ముచ్చట్లు...


"బ్రహ్మోత్సవం" ఈ చిత్రం గురించి  చెప్పాలంటే శ్రీకాంత్ అడ్డాల  గారు గొప్ప సాహసమే చేసారు అని చెప్పొచ్చు... ఎందుకంటె ఒక ఫ్రేమ్ లో హేమా హేమీ లాంటి నటీనటులను అందరినీ ఒకోచోట కలిపి వాళ్ళకు క్యారక్టరైజేషన్ ఇవ్వడం  అనేది ఒక సాహసమే.. ప్రతీ క్యారెక్టరూ అద్బుతమే కాని వారి అందరినీ వాడుకొని ప్రజల మనసులో చోటు సంపాదించడంలో శ్రీకాంత్ అడ్డాల గారు విఫలం అయ్యారని చెప్పొచ్చు.. సహజంగానే వారు అందరూ గొప్ప నటులు కాని వారి నటన ఈ చిత్రంలో  ఏమీ కనపడలేదు... "ఓ మంచి మాట  చెప్పు" అనే అంశాన్ని తీసుకొని కుటుంబ విలువలను వారి వారి భావనలను, ఆప్యాయతలను, ఒకరి మధ్య ఒకరికి ఉన్న చనువును, భాద్యతను, భందాలను, ప్రేమను, ఆత్మీయతను చక్కగా చూపించారు... ఆనందం అంటే అందరం కలిసి మెలసి ఉండాలాన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.. కుటుంబం అంటే అమ్మ, నాన్న, పిల్లలు  మాత్రమే  కాదని, మూడు తరాల మనుషులు ఒకేతాటిపై కలిసి మెలసి జీవించడమే నిజమైన కుటుంబం అని ఒక సందేశాన్ని అందించారు.. కథ, కధనం బాగుంది... కాని తీసే విధానం, ప్రజలకు చూపించే విధానం, వారి మనసుకు హత్తుకునే విధానాలను అందించడంలో పూర్తిగా విఫలం అయ్యారు...  

ముగ్గురు కథానాయికలు ఉన్నప్పటికీ ఒక్కరిని కూడా సరిగా వారినుంచి వారి  నటనాప్రతిభను  ప్రజలకు చూపించలేక పోయారు.. సత్యరాజ్ గారి గురించి చెప్పడానికి ఏమి లేదు.. కట్టప్ప పాత్ర ద్వారా ఆయనేంటో చూపించేశారు ... హావాభావాలు వారి నటనావిన్యాసం ఈ చిత్రానికి ప్రత్యేక అలంకారణ... ఇకపోతే రావు రమేష్ గారు ఆయన నటన పరకాయ ప్రవేశం లాంటిది. ఎందులో అయినా తనదైన శైలిలో అల్లుకుపోతారు... ప్రతికూల (negative) నటనతో  ఆకట్టుకున్నప్పటికీ ఏదో వెలితి ..  ఇంకొంచం చేసివుంటే బాగుండు అనిపించింది... ప్రణీత మరదలి క్యారెక్టర్ తో ఎప్పుడూ పక్కనే ఉంటున్నా కూడా కధానాయకుని మధ్య, మరదలి మధ్య, కొన్ని సన్నివేశాలు సరిగా లేకపోవడం, కాజల్ తో కెమిస్ట్రీ ని తీయగలిగి ఉన్నప్పటికీ వెంటనే ఆమెను దూరం చెయ్యడం, సమంతాని ఎందుకు వున్నట్లు వుండి వూడిపడినట్లు తీసుకోచ్చారో అర్ధం కాకపోవడం ఈ  చిత్రానికి తీరని నష్టాలు...  ముగ్గురి కథానాయికల పోటా పోటిలో సమంతా నటన కొంచం ఆనందాన్ని, ఆహ్లాదాన్ని  కలిగించింది.. తన అల్లరి వేషాలు, ఆ ప్రవర్తన  చాలా అందంగా చూపించడంలో సఫలం అయ్యారు...  సమంత పాత్రలో స్పష్టతను చూపించలేకపోయారు... 

ఇకపోతే సంగీతం విషయానికి వస్తే మిక్కీజే మేయర్ ఈ పేరు వింటేనే బాధగా ఉన్న మనసు అప్పుడే గొంగళిపురుగు నుంచి సీతాకోకచిలుక గా  మారిన అనుభూతికి లోనౌతాము.. అంతటి మైమరిపించే సంగీతాన్ని అందివ్వగల మెలోడీ  దిగ్గజం ఆయన.. ఈ  చిత్రంలో ఆయన సంగీతం ఒక అద్బుతమే.. మధ్య మధ్యలో సన్నివేశానికి తగ్గట్లు అందించినటువంటి సంగీతం మధురాతి మధురం.. 

ఇక మన కథానాయకుడు మహేష్ .. అతను నిస్సందేహంగా ఓ గొప్ప  నటుడు... అందం, నటన, హవాభావాలు అద్బుతం ..  ఏమి  మాట్లాడకుండానే ఎన్నో మాటలకు అర్ధాలు  చూపించేంత మహా నటుడు.. కాని ఈ మధ్య తరచుగా తనని తాను ఎక్కువ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడో అర్ధం కావట్లేదు.. ప్రతీ అమ్మాయి తననే కోరుకుంటుంది అనే అంశాన్ని ప్రతీ చిత్రంలో చూపించడం వల్ల చూసే ప్రజలు చాలా నిరాశకు గురి అవుతున్నారని చెప్పడంలో సంశయమే లేదు... ఒక నటునిగా తన నటనలో నాకు నచ్చిన అంశం .. తండ్రిని దేవునిలా చూడటం.. తండ్రికి చెప్పులు తొడగడం, తండ్రి నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి వుండటం, వాటిని నమ్మడం, భాద్యతలని నిర్వర్తించడం తదితర అంశాలను అద్బుతంగా చిత్రీకరించారు.. తండ్రి, కొడుకుల మధ్య చిన్న చిన్న సన్నివేశాలు మనసుకు హత్తుకున్నాయి.. మొదటి భాగం చిత్రం చాలా బాగుంది.. మొదటి భాగం చివరన సత్యరాజ్ మరణం హృదయాన్ని కలిచివేసింది ... రెండో భాగం మొత్తం ప్రదేశాలు తిరగడం తోనే సరిపోయింది.. కథ సాగలేదు.. మధ్యలో  హరిద్వార్, కాశి,  పుణ్యక్షేత్రాల పునఃదర్శన భాగ్యాన్ని, స్వామివారి  బ్రహ్మోత్సవ వైభవాన్నిచూపించి కళ్ళకు ఆనందాన్ని కలిగించారు.. కేవలం ఈ చిత్రంలో చాలా స్వల్ప సన్నివేశాలు మాత్రమే హృదయానికి చేరువ అయ్యాయి.. మిగిలినదంతా ఏదో సాగుతూ పోయింది.. 

చివరగా : చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వారికి మాత్రమే ఈ చిత్రం నచ్చుతుంది.. నాకు అంత సున్నితత్వం లేదు అని  అనుకుంటూ  వున్నాను.. ఏది ఏమైనా ఇందులో మనం కేవలం కుటుంబ విలువలు, వారితో మెలిగే విధానాలు, అల్లరి చేసే మనస్తత్వాలు, భాదను పంచే అనురాగాలు ఇలాంటివి మాత్రమే ఈ చిత్రం ద్వారా తీసుకుంటే చాలా బాగుంటుందని నా  అభిప్రాయం.. మిగతాది మనకు అవసరం లేదు... చిత్రం ఎలా వున్నా వాటిలో మనకు కావాల్సిన మంచిని మాత్రమే మనం తీసుకోవడమే ముఖ్యం.. 

ఈ చిత్రానికి  పనిచేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు  ... 

స్వస్తి  ___/\___

Bobby Nani

నాటి కాలంలో చాణక్యుడు సూచించిన శిక్షలు ఇప్పుడు, ఇక్కడ, వెను వెంటనే అమలుచేయాలి....

బాలికలపై, మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యాలవుతున్న ఈ రోజులలో ఇక ఈ మేడిపండు ప్రజాస్వామ్య చట్టాలు పక్కనబెట్టి ..... ఈ దేశానికి సరిపడేలా రూపొందింపబడ్డ ఆనాటి చట్టాల అమలు మరలా అవసరం..... 


ఈ దేశంలో ఒకప్రణాళిక ప్రకారం ధ్వంసం చేయబడ్డ విద్యావిధానాల వలన జాతి సంస్రుతీ సంపదలను కోల్పోతున్నది....... నవసంబంధాలలో మానవీయవిలువలను కోల్పోయి మార్కెట్ విలువలు ప్రతిష్టింపబడుతున్నాయి. కావలసినది పొందటం, ఎటువంటి దానికోసం అయినా ....  ఎంతటి నీచానికైనా దిగజారటం. భౌతిక సుఖాలను పొందటమే పరమలక్ష్యం గా సాగుతున్న ఈ చదువుల ఫలితాలు నేడు అర్ధనగ్నవస్త్రధారణలను ఆధునిక అలంకారాలుగాను, రకుక్కల్లాఎవరితోబడితేవారితో తిరిగే పాశ్చాత్య సంస్కృతిని స్వేఛ్ఛాజీవనానికి సంకేతంగానూ మార్చేశాయి.... విలువల వలువలు విడిచేశాక ఇక ఆడాలేదు, మగాలేదు మృగాల మనఃస్థితే !

మనకు నచ్చినంతసేపూ .... ప్రమాదం మనదగ్గరకు రానంతసేపూ.....  వీటికి ఆహో! ఓహో! అనే బాకారాయుళ్ళు అసలు ప్రమాదాలను గ్రహించరు.... గుర్తించరు ... పరిస్థితి చేయిదాటింది . ఇప్పుడు నీతివాక్యాలు , సత్య ధర్మ పాలన పనిచేయవు, పనికిరావు ... 

భయం ...భయం.. భయం కావాలి నేటి  మా జాతికి.... 

తప్పుచేస్తే ఏం జరుగుతుందో తలచుకుంటేనే వణుకుపుట్టేంత భయం కావాలి. ... 

నిర్ధాక్షిణ్యంగా తప్పుడుపనులకు తెగబడెవారి తలలు నేలకు రాల్చాలి.... 

అందుకే అర్ధశాస్త్రాన్ని రచించిన చాణక్యుడు కఠినమైన శిక్షలు సూచించాడు... అందుకే  ఆయనంటే నాకు అమిత  భక్తి ప్రపత్తులు... 

మానభంగం చేసినవాడికి మర్మాంగాలను కోసివేయడం....
దొంగతనం చేసినవాడికి వేళ్ళుతెగనరకడం....
ప్రజలను దోచుకున్నవాడికి బహిరంగంగా శిరచ్చేదన చేయడం ....
ఇలాఉండాలి శిక్షలు అంటే.. ఒకప్పటి  మన  శిక్షలు ఇవే... కాని మనమే  వాటిని మరిచిపోయాం... పక్క  దేశాలవారు  ఇలానే చేస్తున్నారు.....  అందుకే అన్యాయాలపై వారి శాతం స్వల్పం ..... మన శాతం  అమితం ... 

ఆధునుకతపేరుతో పిల్లలకు అసభ్యకరమైన వస్త్రధారణలకు అనుమతినిస్తూ, పబ్బు గబ్బులకు అలవాటవుతున్నా కళ్లప్పగిమ్చి చూస్తున్న తల్లిదండ్రులను, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లంటూ విచ్చలవిడితనాని అలవాటుపడుతున్న పిల్లలకూ శిక్షలుండాల్సిందే....

ఎన్నిమాటలు చెప్పినా పరాయివారైన స్త్రీపురుషుల మధ్య ఉండే సంబంధాలలో అంతర్లీనంగా ఉండేది "కామవాంఛే' నని ఈమధ్య శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చి చెప్పారు కదా ! కనీసం ఈవిషయాలనైనా నమ్మాలి. ఈ వావివరుసలు. శీల సంపద పట్ల శ్రద్దలేని వారికి తగిన శిక్షలుండాల్సిందే ....

ఇంతకఠినమా ??? 
మానవత్వం వద్దా ... ! అని సోది మాట్ళాడకండి.....  

మానవత్వం  గురించి  మనం  మాట్లాడే  అర్హతను  ఎప్పుడో  కోల్పోయాం.. 

పురిటిబిడ్డలు చెత్త బుట్టలలో వున్నప్పుడేమైంది ఈ  మానవత్వం ?? 

నెలల  బాలికమీద అత్యాచారం జరిగినప్పుడేమయింది ఈ  మానవత్వం ?? 

మొన్న ఒక  నిర్భయ, నిన్న ఒక   రిశితేశ్వరి ఇలా ఎందరో రోజుకో ఆడతనం నలిగిపోతుంది.. ఇంకెక్కడ మానవత్వం ?? 

మానవత్వం చూపాల్సింది మనుషులపట్ల. మనిషన్నవాడు చనిపోయి మృగాకారాలుగామారి తిరుగుతున్నవారి పట్లకాదు.....

ఎంతత్వరగా ఈ చట్టాలు రావాలంటే . మరో చెల్లి, తల్లి బ్రతుకులు అన్యాయం కాకుండా ముందుగానే కావాలి, రావాలి ...మన రాజ్యాంగంలో ప్రస్తుత  పరిస్థితుల  రీత్యా  చాలా సవరణలే చేసారు ...  కాని అవి చాలవు, ఇంకా ఖటినతరం చెయ్యాలి తప్పు చెయ్యాలనే  ఆలోచన వస్తేనే తడిచిపోవాలి... ఇలాంటివి  రావాలని  మనస్పూర్తిగా  కోరుకుంటూ  నా  ఆవేదనను మీతో  పంచుకుంటూ  వున్నాను..  ఉదయం  పేపెర్  చూసింది మొదలు రాత్రి వార్తలు విన్న  వరకు ఏదో ఒక మూల ఎక్కడో ఒకదగ్గర పలానా వాడు ఇలా చేసాడు అనే రాతలు చూసి తట్టుకోలేకున్నాం ..... అంతకు మించి మరో ఉద్దేశం లేదు.. 

చివరగా నా  మాట : ప్రస్తుతం జంబూ ద్వీపానికి కావలసింది ఒక కౌటిల్యుడు. అవును కౌటిల్యుడే. అప్రాచ్యులు దండెత్తి వచ్చినప్పుడు, రాజుల నుంచి సామాన్యుల వరకు వర్గ విభేదాలు మరచిపోయేలా చేసి, జంబూ ద్వీపాన్ని ఒక తాటి మీదకు తెచ్చిన కౌటిల్యుడు. అన్యాయాన్ని సహిస్తూ బతకడం కన్నా ఎదిరిస్తూ మరణించడం గొప్పదన్న కౌటిల్యుడు. కుటుంబం కోసం సభ్యుడిని, గ్రామం కోసం కుటుంబాన్ని, దేశాని కోసం గ్రామాన్ని ఫణం పెడితే తప్పు లేదని నిర్మొహమాటంగా చెప్పిన కౌటిల్యుడు (చాణక్యుడు ) అందుకే ఆయన అంటే నాకు చాలా గౌరవం... ఎవరి అభిప్రాయాలు వారివి... మనుషులను గౌరవించని నేటి రోజులలో కనీసం అభిప్రాయాలను అయినా గౌరవించమని చిన్న విన్నపం ... 

స్వస్తి  __/\__

Bobby Nani

మేలుకో రా యువత సాధించరా ఘనత....

ఓ యువతా ..
దేశమంటే మట్టి కాదని,
మంచి మనుషులున్న నేలని మరిచితే ఏల  రా.. 
నీ జాతికి వెన్నెముఖవై కధం తొక్కి ముందుకు కదలరా .. 
అజ్ఞానాంధకారపు చీకటిని తరిమికొట్టి వెలుగుని పంచరా ... 
నీ శక్తి సామర్ధ్యాలు వెలికి తీయరా ... 
ఒక్కడికోసం అందరూ .. 
అందరికోసం... ఆ ఒక్కడులా ముందుకు సాగరా ... 
కన్నె పిల్ల పై పై అందాలకు లొంగకురా .. 
వెకిలి చేష్టలు, వెకిలి పనులు మానరా.. 
వానరుడువలె కపిలి చేష్టలు చెయ్యకురా .. 
కన్న తల్లిలాంటి ఈ పుడమిని మరువకురా .. 
చెరపకురా చెడేవు అన్న సామెతను జ్ఞప్తికి తెచ్చుకొని ముందుకు కదలరా .. 
మార్చార భవిత, సృష్టించర చరిత ...
మేలుకో యువత సాధించార ఘనత... !!

Bobby Nani​

Friday, July 15, 2016

ఓ “స్త్రీ” అందుకో నా ఈ అభిమాన నీరాజనం...

“స్త్రీ” ఈ పదం  పుట్టినప్పటినుంచి  వింటున్న పేరు... 
వరుని కట్నపు జ్వాలలో .... 
కల్మష ప్రేమతో మరిగే కాలకూట విషపు కషాయం లో కరిగి, కలిసి...
సగం తిన్న తన కలల్ని జ్ఞాపకాలుగా నెమరేస్తూ... 
సగం చచ్చిన ప్రాణాల్ని జొ కొట్టుకుంటున్నావు...!!!!!!
కష్టాల కడలిలో... బ్రతుకు సమరంతో....
కాంక్షా పురవీధుల ... ఎడారి ఎండమావుల ఆశాసూర్యుడు ప్రతిఫలింపక... 
చిరిగిన స్వప్నపు సంచిలో... చితికిన ఆదర్శాలను తలుచుకుంటూ... 
అర్ధాంగి ఆకారాన్ని అద్దంలొ వీక్షించుచూ ...
నిదుర పొతున్నావు...!!! 
సహనానికి  చెలికత్తెగా ... దుఃఖమనే  కలుపుమొక్కలను ఏరుతూ... 
అశ్రువులతో చేసే బ్రతుకు అనే వ్యవసాయమే “ స్త్రీ “... 
ఏరుకుంటుంది... పారేసుకున్న ధాన్యం కాదు... 
మోమున  జారే ఘర్మజలంబు కణాలలో...
పురుషుడి పరువు తాలూకు గుర్తులవే ...!!!
తనకన్ని తేదీలు గుర్తుంటాయి ... తన పుట్టినరోజు తప్ప...! 
ఎందుకంటే... జీవితపు  పొగలతో ఆమె బ్రతుకు  క్యాలెండరు మసి బారిపొయింది... 
నీ జీవితాన్నే మాకు మెతుకులుగా తినిపిస్తూ... 
పస్తులున్న శాశ్వతపు పడతిగా మిగిలిపొయావు.. ఒంటరిగా.. 
 ఒక్కటి మాత్రం ఇక్కడ నిజం ...  
మనిషి గతం లోనూ  " స్త్రీ " ఉంది... వర్తమానం లోనూ  " స్త్రీ " ఉంది.... 
భవిష్యత్తు లో కూడానూ  "పురుషుని" లో అన్నీ " స్త్రీ " అయి విజేతగా నిలుస్తుంది... ఈ కోమలాంగి....
ఈ సృష్టి అంతటా దుర్యోధన, దుస్యాసన, నరకాశురులే... 
మరి సత్యభామ రూపిణియై ఎన్ని యుద్ధాలు చేయ్యవల్సివస్తుందో...?? 
అందుకే ....ఓ స్త్రీ !! 
నీవు నిర్మించుకున్న ఈ ఆశావరూథములో... 
ధైర్యమే ఒక కవచంగా సాగుతున్ననీకు... 
అర్పిస్తున్నాను...ఈ అభిమాన నీరాజనం !!! 
సమర్పిస్తున్నాను... మమకార సిరుల స్వర్ణ చందనం... !!!!!

Bobby Nani​

"కవి" అంటే ఎవరు ??

అసలు ఎవరు ఈ “ కవి “ ?

నీ లోను, నా లోనూ, మనందరిలోనూ  వున్నాడు.... కొందరిలో నిదుర పోతుంటే మరికొందరిలో జాగరూకతతో ఉంటూ ఉంటాడు.. జాగరూకతతో ఉండేలా గుర్తించడం, గుర్తించకపోవడం అన్నది మన చేతుల్లోనే  వుంటుంది.. కవి హృదయం ఎలా ఉండాలంటే పిల్ల గాలికి ఊగుతున్న గుల్మము (చెట్టు)ను  ఆస్వాదిస్తూ, ఆ కదులుతున్న చెట్టు తనతో ఎన్నో విషయాలు పంచుకుంటున్నట్లుగా తను భావిస్తాడు.. చెట్టు ఏంటి మాట్లాడేది ? అని అజ్ఞానులు మాత్రమే  ప్రశ్నిస్తారు .. రాతిని కూడా దైవం గా భావించే సున్నిత మనస్కుడే ఈ  “కవి” హృదయం...... 
అందుకే  అతని  హృదయం రమణీయం.  అతని స్పందన కమనీయం, 
అతని కష్టాలు కడు ధృల్లభం, అతని జీవితం చిరస్మరణీయం,
అతని హృదయంలో రవి రాగరంజితుడై ఉదయించనూ గలడు... అస్తమించనూ గలడు... 
అతని హృదయంలో కావ్యం జన్మిస్తుంది..., అతని కావ్యంలో భక్తిభావం ఉద్భవిస్తుంది, అతని కలంతో సర్వం సకలం సృజించగలదు... 
అతను  పొందని అనుభూతి ఉండదు.,  అతను  త్రాగని రసభావం ఉండదు,  అతను  సృష్టించని రణరంగం ఉండదు. అతను  నర్తించని రంగస్థలం ఉండదు. 
కర్త, కర్మ, క్రియలను సైతం సృష్టించగల ఉన్నతుడు, ఘనుడు, మహత్తరుడు, విశేషుడు, మహనీయుడు, మహాపురుషుఁడు అతడే... 
తన కలం నుండి ప్రతినిత్యం జాలువారు  అక్షరస్వరూపుడు..., 
అతడొక  నిరంతర ప్రవాహ సంగమం, అహర్నిశము ప్రజ్వలించు శక్తిరూపము... 

స్వస్తి __/\__

Bobby Nani​

Thursday, July 14, 2016

కర్పూరగంధిని ...

నీ గురించి మాట్లాడేందుకు భాష చాలటం లేదే....సఖీ !!!! 
ఎంత చెప్పినా నీ ధ్యాస మారటం లేదే .. 
కళాత్మకమైన నీ నటనా ప్రభంజనం, నీ  కెంపుల చెంపల సౌందర్యం, 
విరి తేనెల మెరుపులు కన్నా మిన్న కదే.. 
స్వర్ణ, వర్ణ చిరు మీనములకన్నా,  ఆ కలువరేకు పోలిన నీ నేత్రములే మిన్న ... 
నీ చెక్కిలి, చిలిపి కళ్ళు వలపుల సంకెళ్ళై, మధుర సంకేతాలతో...
గమ్మత్తుగా ఇలా నీ సోత్తులా నన్ను తనివి తీరా కరిగించు నీ తపనలలో... 
గడి బిడి చేసే నా గుండెను దూసే చురకత్తి నీ చూపుల మత్తు జల్లే వశీకరణవోలె ... 
లిప్తపాటు క్షణమున అదృశ్యం అయిపోయావు కదే... 
నినదించిన, నిరసించిన, నీరసించినా నీవే....నే .. 
నా పరిష్వంగ ఖారాగృహ కర్పూరగంధిని ... 

Bobby Nani​

మన దేశం...

భారతదేశం ఎంతో గొప్పది కదా.... 
అవును చాలా  గొప్పది ఎందుకంటె నేను భారతీయుడను కాబట్టి..... 
మన దేశం జనాభా 2016 సంవత్సరానికి 1.33 బిలియన్లు అయింది ....  ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యము లో ప్రపంచంలో ఏడవది. భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి( పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించినది. భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. వీటిలో మొదటిది జంబూ ద్వీపం., ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", తరువాతి పేరు హిందూదేశం, తరువాత హిందూదేశం యొక్క రూపాంతరం ఐన ఇండియాఅనే పేరు అని మనకు తెలిసినవే .... గడచిన 5000 సంవత్సరాలలో మనదేశం ఏ దేశం పైనా దండెత్తలేదు. అంతటి సహనంతో కూడిన దేశం... ఒక  చెంపమీద కొడితే మరో చెంప చూపించే అతి గొప్ప దేశం మనది... అంతే కాదండోయ్ ఇక్కడ దోచుకునే వారికి  దోచుకున్నంత కూడా... ఇక్కడ  ప్రజలకు చిన్న ఆశ చూపిస్తే చాలు వెంటనే పార్టి మార్చేస్తారు .... ఇది తప్పు అనేవాడిని నయనో, భయానో ఒప్పించేస్తారు అంత గొప్పది మనదేశం... ముక్కుపచ్చ లారని పసికందులను చెత్త కుప్పల్లో చూడాల్సిన దుస్థితి మనది ... అందుకే మనదేశం చాలా గొప్పది... 

మహిళలు గొప్పవారని పురాణాల్లో వినడమే కాని ఇక్కడ వారు ఒంటరిగా కనిపిస్తే కామంతో కన్ను, మిన్ను కనపడని మగ కుక్కలు ఎక్కువగా వున్న అతి గొప్ప దేశం మనది... ఒక ఆడపిల్లమీద అత్యాచారం చేస్తే అది నిజమా కాదా అని విచారణ జరపడానికి సగం జీవితం అయిపోయే దాకా తిప్పెంతటి గొప్ప రాజ్యాంగ దేశం మనదేశం.... ఒక పరాయి దేశంనుంచి వచ్చి మన బిడ్డలను, మనవాళ్ళను మన కళ్ళముందే చంపేస్తుంటే వాల్లనుపట్టుకొని కూడా బిరియాని తినిపించే అతి గోప్ప దేశం మనది.... ఏ దేశంకు వెళ్ళినా  మనవాళ్ళకు కుక్కల్ని కాల్చినట్లు కాల్చి చంపేస్తుంటే చూస్తూ ఊరుకొనే ప్రజాస్వామ్య దేశం మనది... 

ఇవన్నీ ఎంతకాలమని సహిస్తాం? 
ఎంతకాలమని భరిస్తాం ? 
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మీరు అనుకుంటున్నారా ? 
ఎంతకాలమని వెన్ను చూపించి పరుగులు తీస్తాం.... 
మనదేశంలో నే మనకు రక్షణ లేకపోతే పక్కదేశంలో ఎలావుంటుంది..? 
మన రాజ్యాంగాన్ని అప్పటి పరిస్థితులను అనుసరించి రాశారు ఇప్పుడు అలాంటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి... పరిస్తితులతోపాటు సవరణలు కూడా చెయ్యడం మంచిదని నా అభిప్రాయం...చేస్తున్నారు  కాని అవి సరిపోదు.. ఇంకా ఖటినతరం చెయ్యాలి... 
నేను  రాజ్యాంగాన్ని ప్రశ్నించే వయస్సు కాని, అర్హత కాని, నాకు  ఏమాత్రము లేదు ... కాని దయచేసి ఒక్కసారి ఆలోచించండి అని మాత్రమే  చెప్పగలను .... నాయకులారా మీరు మాకు ఏదీ ఉచితంగా ఇవ్వకండి... అలా మీరు ఇచ్చి, ఇచ్చి మేము ఇలా తీసుకొని, తీసుకొని మా గుంటలు మేమే తవ్వుకుంటూ ఉన్నాము.... మీరు అలా మాకు ఆశ చూపించి యెంత వెనకేసుకుంటున్నారో గత 67 ఏళ్ళగా చూస్తున్నాం... వద్దు ఇకనైనా ఆపండి దయచేసి... మీ భవిష్యత్తు, మా భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది ... దాన్ని మీరెలాగో మార్చలేరు కనీసం ప్రయత్నం చెయ్యండి... తోలి అడుగు మీరు వేస్తే తరువాత  రాబోయే తరాలవారిలో ఒక్కరైనా మారి తదుపరి అడుగులు వారు వెయ్యడానికి అవకాశం వుంటుంది.... మీరే కాదు మాలో కూడా కొందరు మారరు ... వాళ్ళు ఇలా....  వాళ్ళను అమ్ముకొని ఓటు వేసేంతవరకూ, మతం పిచ్చితో ఓట్లు వేసేంతవరకూ, ప్రాంతం పిచ్చితో ఓట్లు వేసేంతవరకూ, మేము బాగుపడము .. 
మా జీవితాలు బాగుపడవు.. 

శ్రీ గురజాడ అప్పారావు గారు అన్నారు 

“దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్” 

ఎంతో గొప్ప పలుకులు కాని ఇప్పుడు పరిస్థితి 

“దేశం అంటే మనుషులు కూడా కాదోయ్ దేశం అంటే ధనమోయ్” 

అన్నట్లు వుంది.... 

అందరం అంటూ ఉంటాము మనం అతిగొప్ప దేశంలో బతుకుతున్నాము అని.... కాదు అలా అనుకుంటున్నాం అంతే... మన తాతలు చెప్పుకున్నారు మనదేశం అభివృద్ధి చెందుతుంది అని, మన తండ్రి గార్లు చెప్పుకున్నారు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, తరువాత మన మనుమళ్ళు కూడా చెప్పుకుంటూనే వుంటారు .. 

ఇలా చెప్పుకుంటూనే పోవడమేనా ఎప్పుడండీ మనదేశం (నాదేశం) ఎంతో అభివృద్ధి చెందిన దేశం అని మనం ఆకాశానికి గర్వంగా చూస్తూ చెప్పుకునేది ?? 

ఈ ప్రభుత్వం ఎప్పుడైతే మార్పు తెస్తుందో  అప్పుడే మనము మన దేశం, క్రమమైన దారిలో నడుస్తాము... మార్పు అంటే తప్పు ఎవ్వరు చేసినా తప్పించుకోకూడదు వెంటనే శిక్షలు అమలు పరచాలి... 

పూర్వపు రోజుల్లో చాణక్యుడు వేసిన శిక్షలు ఇక్కడ అమలుపరచాలి... అలాంటి మార్పు రావాలి... ఆ మార్పు కోసం నేను ఎదురు చూస్తునట్లు గానే నాలా ఎంతో మంది వున్నారని నాకు తెలుసు. వాళ్ళలో మీరు వున్నారా ?? మిమ్మల్నే వాళ్ళలో మీరు వున్నారా ?? 

స్వస్తి  ___/\____

Bobby Nani

పురిటి నొప్పులు తాళలేక ప్రకృతి ఒళ్ళు విరుస్తోంది....

ప్రకృతికి ఈ  ప్రపంచం మీద కోపం వస్తుంది...  
రౌధ్రంగా మారిపోతోంది ... 
అభివృద్ది పేరిట జరిగే ఈ అశుద్ధ కాలుష్యాలపై ... 
సంద్రం  తిరగుబాటు చేస్తుంది.. 
విసిగి వేసారిన  ఈ మనుష్యులమీద ...!
మన మానవాళికి ఇవాళిదేం కొత్త కాదుగా...
ఒకరినొకరం ముద్దుగా పేర్లు పెట్టి మరీ పిలుచుకుంటాం...
పలకరించి పోయాక ఒంటిగా కూర్చొని శవాలు లెక్కపెట్టుకుంటాం...
మనవాళ్ళు పోతే మాత్రం ... ప్రకృతి మీద పడి దేబిరిస్తుంటాం...
అశోకుడు చెట్లు నాటించెను అని చదివుకుని మరీ ...
మీసాలకి సంపెంగ నూనె రాసుకున్న ఘనులమే కదా అందరం...
మనిషి అడవులు నాశనం చేస్తే అది పురోభివృద్ది క్రమమా...
పురిటి నొప్పులు తాళలేక ప్రకృతి ఒళ్ళు విరిస్తే అది మాత్రం విధ్వంసమా...
ఇదెక్కడి న్యాయం రా అయ్యా... !!!!
నువ్వు విసర్జించిన  ప్లాస్టిక్ సంచులు.... 
భారీ పరిశ్రమలు  నుండి వదిలిన వ్యర్ద పదార్దాలు..
నీ మహా నగరపు మురుగు మలినపుల  నీరు
నీకు వడ్డీతో సహా తిరిగి ఇవ్వడానికే అక్కడక్కడా అకాల ప్రకృతీ విధ్వంశములు ..
కొండలు, కోనలు, పుట్టలు, గుట్టలు  పగలగొట్టి మరీ నీ నగరాన్ని విస్తరించావుగా...
ఇళ్ళల్లో  తగరపు పూలని పెట్టుకుని మురిసావుగా...
ఇంటి అందాల్ని చూపడం కోసం ఇంటి ముందున్న చెట్టును తుంచేసావుగా ...
మరి సిద్దం అయిపో భారీమూల్యానికి ... 
ఇప్పటికైనా మించినది ఏదీ  లేదు.. మన చేతుల్లోనే వుంది.. 
మనల్ని మనమే ఇలా నష్టపెట్టుకుంటూ,
ఎన్నాళ్ళిలా, ఎన్నేల్లిలా ఈ ఆస్ధి నష్టం, ప్రాణ నష్టం  లేక్కలేస్తూ 
చితికిన చితిమంటలలో భోగ భాగ్యాలను వెతుక్కునేది... 
దీనికి అసలు  కారణాలు ఏమిటో మనకు తెలియదా...!!! తెలుసు.. 
నీ ప్రాణానికి, నీ కుటుంబ ప్రాణానికి  వచ్చిన ముప్పు ఏంలేదుగా ...
దాచుకున్నావుగా పదిలంగా బహుళ అంతస్ధుల మేడలలో ... 
మరి పల్లెకారులు, గిరిపుత్రులు, అడవిబిడ్డల, మాటేమిటి..
పునరావాసం రక్షణ శిబిరాల పేరుతో పూటకో ఊరు, రోజుకో వేషం ...
వెన్నెల కాంతికి సైతం భగ్గున కాలి బూడిదయ్యే పేదింటి గుడిసెలు...
నీ ఇంట్లో వెలిగే విద్యుత్ దీపపు కాంతులకు బలవ్వాల్సిందేనా...
మారని బతుకులు వారివి .. మారినా ఉపయోగపడని రాతలు మనవి...
ఇంత చదువు, ఇంత జ్ఞానం, ఇంత పరిజ్ఞానం వ్యర్ధమే కదా... 
సంద్రం మీద వర్షం వలె... 

పర్యావరణాన్ని సంరక్షించుకుందాం... 
సాటి మనిషిని గౌరవించుకుందాం ... 
మన ముందు తరాల్ని బ్రతకనిద్దాం...
మన  ప్రతీ ఆనందానికి గుర్తుగా ఒక చెట్టు నాటుదాం.. 
సాధ్యమైనంత వరకు సంరక్షించుకుందాం ... 
నేను ఇలా  చెయ్యాలని సంకల్పించాను... 
మరి  మీ  మాటేంటి ?? మీ  సమాధానం నాకు వద్దు .. మీ ఆచరణ మాత్రమే కావాలి.. 

నోట్ : దయచేసి కాపీ, గట్రా చెయ్యకండి.. మానవ నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వండి.. వారి భావాలకు, మనోభావాలకు  గౌరవం కల్పించండి....

స్వస్తి.. __/\__

Bobby Nani​

అక్షరారణ్యం ...

“కవిత్వానికి” 
కుదింపులోనే సొగసైన ఇంపుంది ...
అనవసరంగా మాటపడని ఆత్మ గౌరవమూ వుంది.. 
అక్షరానికీ అక్షరానికీ మధ్య, 
అంతరిక్షం ఆవులిస్తూంది ...
శబ్దానికి శబ్దానికి మధ్య 
శూన్యం ఆవరిస్తూంది .. 
సంచులిస్తేనే నేటికాలంలో సౌబ్రాతృత్వం ..
పైసా లేకుంటే పరిచయమే లేదస్సలు ..  
కవిత్వానికి పేరుపెట్టుకుంటే ..
అది నువ్వు పెట్టిన పేరుకు 
మాత్రమే కవిత  అవుతుంది... 
రాసేది నిఖార్సైన కవిత అయితే
దానికదే పేరు తెచ్చుకుంటుంది...
ప్రతీ ఋతువూ పులకరింపజేసే  
కవిత్వాన్ని, నా పారవశ్యం పలికిస్తున్నది.. 
ఏంటో ఈ దినం .. గడబిడగా గడిచిపోయింది...
ఏవేవో ఊహలు, ఎన్నెన్నో ఊసులు.. 
నిప్పుకు చెదలు పడుతాయా... 
నీటికి మంటలు పుట్టునా... 
ఈ కవితారణ్యంలోనుంచి 
జనారణ్యంలోకి రాలేకపోతున్నానే ... 
అక్షరాలునే ఆత్మగా.. 
శబ్దాలే శరీరాలుగా .. 
వాక్యాలే ఆలోచనలుగా ... 
భావాలే లక్ష్యం గా ...
జీవిస్తున్నాను ఈ రక్త మాంసాదుల దేహపు 
మాతృభాషా మానస పుత్రునివలె... 

మీ ...

Bobby Nani​

పెండ్లి చేసుకోబోతున్నారా .. ?

అయితే మొదట మీ భాగస్వామికి వెనుక ఎంతుందో లెక్కలు కాకుండా (అతను లేదా ఆమె) blood samples తీసుకోండి..  

"వివాహము" అనగానే నెల ముందునుంచే అమ్మాయి, అబ్బాయి  ఇళ్ళల్లో పండగ వాతావరణం మొదలవుతుంది కదా.. పెండ్లి పత్రికల దగ్గరనుంచి పెండ్లి అయ్యాక భోజనాల వరకు ఎక్కడా తక్కువ కాకుండా, ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి ముఖ్యంగా దంపతుల ఇరువురి గుణ, గణాలు, జాతక పొంతనలు చూసి మరీ ఇద్దరినీ ఒక్కటి చేసి పంపించేస్తారు.. ఇక్కడ వరకు బాగానే వుంది..

వీటికన్నిటి కన్నా ముందు అనగా అమ్మాయి, అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి నచ్చిన మరుక్షణం మీరు మొదట అడిగేది వారి ఇరువురి జాతకాలు. నిజమే కదా... కాని నిజానికి వీటికన్నా ముందు ఇద్దరివి అడగాల్సినవి ముఖ్యంగా ఈ రోజుల్లో "blood samples" ... ఏంటి అవాక్కయ్యారా ?? అయితే ఒక సంఘటనను మీరు చదవాల్సిందే....

ఇది చదువుతున్న ప్రతీ ఒక్కరు దయచేసి మీ పరిసర ప్రాంతాలలో ఉన్నవారికి, ముఖ్యంగా నూతనంగా ఒక్కటి కాబోతున్న వధూవరులకు తెలియపరచండి... వాళ్ళేదో అనుకుంటారని, బాగోదు అని మీరు వేసే ప్రతీ వెనకడుగు వల్ల ఒక వంశమే తుడిచిపెట్టుకు పోతుంది.. అంతే కాదు దాని పర్యవసానం చాలా ఘోరంగా, భయానకంగా కూడా వుంటుంది.. దాని మూల్యం భారీ మొత్తం లో కూడా వుంటుంది... 

ఇక విషయంలోకి వెలితే ....

ఒక శ్రీమంతుల దంపతులకు ఒక్కగానొక్క అబ్బాయి... మంచి చదువు, మంచి వ్యాపారం మంచి మనసున్నవాడు, గుణవంతుడు ... అంతే కాదు అందగాడు కూడా ఈ అబ్బాయికి ఎందులోనూ తీసిపోకుండా సరి సమాన స్థాయిలో ఆ అమ్మాయి కూడా వాళ్ళు శ్రిమంతులే, ఒక్కగానొక్క అమ్మాయి... యెంతో గారాభంతో పెరిగింది...ఇద్దరికీ ముడి పెట్టేయ్యాలని ఇరువురి పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు... ఇక అంతే ఇద్దరి ఇళ్ళల్లో నెల రోజులనుంచి పండుగ వాతావరణం నెలకొంది...
బంధువుల రాకపోకలు, స్నేహితుల అల్లర్లు, మరదళ్ల సరసాలు, పెద్దల ప్రేమానురాగాలు, పసిహృదయాల కేరింతలు, పచ్చని తోరణాలు, పూల సువాసనలు, కమ్మని విందులు, తప్పెట్లు, తాళాలు, అబ్బబ్బ ఒక్కటేమిటి ఇంద్రలోకమే భువిపైకి దిగినంతలా నభూతో న భవిష్యతి అన్నట్లుగా ప్రతీ రోజు ఎవరి పనుల్లో వారు చేసుకుంటూ వచ్చేస్తున్నారు...

పెళ్ళికి వారం రోజుల ముందునుంచి ఈ కోలాహలాలు ఇంకాస్త ఎక్కువైపోయాయి.. నలుగులని, స్నానాలు అని, వ్రతాలని, ఆధ్యాత్మికత కూడా ఈ సంతోష సాగరంలో కలిసి అందు పారవశ్యంలో మునిగి తేలుతున్న వారికి, దూరంనుంచి చూచే లోకులకు అమితోత్సాహముతో కనులకు కనువిందు చేయగా కన్నులకు కనుల పండుగగా, మంగళ వాయిధ్యముల రాగ, సరాగాల మేళవింపులతో హృదయానందకరమై పసిపిల్లల దగ్గరనుంచి వృద్దుల వరకు సంతోషాలతో అలలారుతూ నూతన వధూవరులను పెండ్లి పీటలపై కూర్చుండ బెట్టి వందలాదిమంది బంధు, మిత్రు, సపరివార సమేత, సోదర, సోదరీల మధ్య అంగ రంగ వైభవంగా వివాహము జరిగినది...

వివాహము అయిన ఆరు మాసముల తరువాత ఆడతనం అమ్మతనం అవ్వడానికి, హాస్పిటల్ కి వెలితే పరీక్షించిన డాక్టర్ ఇద్దరికీ H.I.V. Positive అని చెప్పగానే ఆ తల్లి ప్రాణమున్న జీవచ్చవం అయిపోయింది ... విషయాల్లోకి వెలితే పెళ్లి కాకముందు ఆ అబ్బాయి ఒక సెలూన్ లో షేవ్ చేయించుకుంటుంటే కొంచం తెగిందని అప్పుడే వేరేవాళ్ళకు చేసిన షేవర్ తో ఇతనికి చెయ్యడం మూలంగా అతని వైరస్ ఇతనికి సంక్రమించినట్లు దర్యాప్తులో తేలింది.. 

ఇక్కడ తప్పు ఎవరిది ??

- ఒకరికి వాడిన షేవర్ ని ఇతనికి వాడిన ఆ సెలూన్ యాజమాన్యందా  ?
- ఆ సెలూన్ లో షేవ్ చేయించుకున్న ఈ అబ్బాయిదా ?
- తన బిడ్డకు H.I.V. Positive వుందని తెలుసుకొని తల్లి, తండ్రులదా ?
- ఈ అబ్బాయిని పెళ్ళాడిన ఆ అమ్మయిదా ??
- ఇప్పుడు జన్మను ఇవ్వబోతున్న ఆ బిడ్డదా ?

తప్పు ఎవ్వరిదీ కాదు కాని ఇక్కడ మూడు జీవితాలు కాలగర్భంలో కలిసిపోయాయి ... పచ్చని సంసారం రావణ కాష్ట అయిపోయింది... ముక్కు పచ్చలారని పసి హృదయం పరమాత్మను చేరింది...

తల్లిదండ్రులారా మీరు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అన్నీ ఒకటికి రెండుసార్లు చూసి ఆలోచించి ఆచరిస్తారు వాటితో పాటు ఇలాంటివి కూడా కొంచం గ్రహించమని చిన్న మనవి... 

మొదట  ఒకరికి, ఒకరు నచ్చగానే అడగాల్సింది జాతకాలు కాదు 
“blood samples”... 

ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహిస్తారని ఆసిస్తూ...

నోట్ - పైన నేను చెప్పిన కథ కేవలం కల్పితము మాత్రమే .... కాని మన నోటీసుకు రాని ఎన్నోనిజమైన ఇలాంటి కథలు పరువుకోసం కాలగర్భంలో కలిసిపోతున్నాయి.. బయటకి రావట్లేదు.. దయచేసి ఈ విషయాన్ని నిర్లక్ష్యం వహించకుండా ఈ చిన్న ఆలోచననను ఆచరిస్తారని కోరుకుంటున్నాను... సెలవు..

స్వస్తి..  ___/\___

Bobby Nani​

కుటుంబ విలువలు ..ఒకప్పటి కుటుంబం అంటే తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, ఆత్త, అన్న, తల్లి, తండ్రి, భార్యా, పిల్లలు, అక్కా, చెల్ల్లెళ్లు, మామలు.. ఇలా ఎన్నో బంధాలు అనుబంధాలు…అందరి మధ్యన రక్త సంబంధంతో కూడిన అనురాగం, ఆప్యాయత, గౌరవం, మమకారం కనిపిస్తుంది. “నీది” “నాది” అనకుండా “మనది” అనే అందమైన ఆప్యాయతతో కూడిన భావన అందరికీ ఉండేది. కానీ నేడు ఈ అను బంధాలన్నింటిలో ఎన్నో పరిమితులు మరెన్నో మార్పులు, వలయాలు, పొరలు, ఆత్మవంచనలు, స్వార్థాలు, మోసాలు, అహం, ఇలా ఎన్ని వున్నాయో అన్నీ మన కుటుంబ విలువలను దూరం చేసేసాయి.... ఆనాడు కుటుంబం అంటే చిన్నదైనా, పెద్దదైనా పరస్పరం అందరూ ఒకే చోట కలిసి ఉన్నా, వేర్వేరుగా నివసిస్తున్నా అందరినీ ప్రేమగా చూసుకుంటూ, అందరి పట్ల గౌరవ మర్యాదలతో మసలుకుంటూ బాధ్యతలను సమంగా పంచుకుని నా అనుకుంటూ అందరిని ఏక త్రాటిపై నడిపించే ప్రయత్నం గావించేవారు.. కాని ఇప్పటి పరిస్థితి అందుకు పూర్తిగా వ్యతిరేకం అయిపోయింది.. “ఎవరికి వారే యమునా తీరే” అన్నట్టుగా ఉంది నేటి స్థితి, మన దుస్థితి.. .. కొందరు కావాలని స్వేఛ్చ కోసం వెలితే మరికొందరు విపత్కర పరిస్థితులలో వెళ్ళవలసిన పరిస్థితి... 


ఏది ఏమైనప్పటికీ “ధన” సంపాదనపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మానవ సంబంధాల ప్రాముఖ్యత పలుచబడిపోయింది.. ఒకే ఇంట్లో నివసించే వారి లో కూడా ఈ విభజించి పాలించు అనే సూత్రం దుర్భేద్యంగా ప్రభావితం చేస్తుంది... మనది  అనేది  మరిచి ఇది నీది, అది నాది అన్న దయనీయ వాతావరణం నెలకొంది.... ఇలా ఎవరికివారు బిజీగా బ్రతికేస్తూ, పిల్లల పెంపకాన్ని అనామకులకు వదిలేసి, పెద్దవారిని వృద్ధాశ్రమాలకు తరలించేస్తున్నారు. ఈ కారణంగా కుటుంబ విలువలు పూర్తిగా నీరుగారడమేకాక, తల్లిదండ్రులకు, పిల్లలకు, మనవళ్లకు మధ్య ఉండాల్సిన అనుబంధం, అనురాగం, ఆప్యాయతలు పూర్తిగా కొరవడుతున్నాయి. పెంపకాన్ని అనామకులకు వదిలి, పెద్దవారిని వృద్దాశ్రమాలకు వదిలి ఇంకెందుకు బ్రతకడం, ఎవరికోసం ఈ అవిశ్రాంత ప్రయాస, ఎవరికోసం ఈ ప్రయాణం... 

ఇక్కడ మనం చెప్పుకొని తీరాల్సిన మరో ముఖ్య మైన విషయం : సమాచార, సాంకేతిక విప్లవం.... 

ఈ విశాల ప్రపంచాన్ని ఓ చిన్న గదిగా మార్చేసింది ఈ టెక్నోలజి.... దేశ, విదేశాల, సముద్రాల  మధ్య గల వేల మైళ్ల దూరాన్ని “వేగం” అనే ఆయుధంతో చెరిపేసి వారిని నిమిషాల్లో కలిపే పరికరాలు సహజంగానే అందరికీ అందుబాటులో వుండటం. ఇది చాలా గొప్ప విషయం అయినప్పటికీ ఒకప్పుడు దూరం ఎక్కువ వున్నా మనుషుల మధ్య ఆ దూరం గాలికూడా జొరబడని విధంగా వుండేది.. క్షణాల్లో గమ్యాన్ని చేరే మార్గాలు వున్నా కూడా దూరాలు తగ్గడం అలా ఉంచితే మరింత పెరిగిపోయాయి.. మానవ సంబంధాలు మెరుగవుతూ కనిపించినా, కుటుంబ సంబంధాలు మాత్రం కుంటివై పోతున్నాయి...  ఒకరి మాట ఒకరికి నచ్చడం లేదు. ఒకరి ఉనికిని ఒకరు సహించడంలేదు, చిన్న, పెద్ద తారతమ్య భేదాలు కాలగర్భంలో కలిసిపోయాయి.. 
ఇదంతా ఎందుకు రాస్తున్నాను .. అసలు రాయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే  శ్రీమతి భావన గారు .. నాకు అక్కగారి స్థానంలో వుండి ... నా ప్రతీ పోస్ట్  లోను  ప్రతీ పదంలో ఉన్నటువంటి దోషాలను ప్రేమ పూర్వకంగా ఒక ఉపాధ్యాయురాలు గా వుండి తప్పొప్పులను సరిచేసేవారు ... ఆమెకు ఈ రోజు ఆరోగ్యం బలేనప్పటికీ నన్ను ఓ సహాయం చెయ్యమని అడగడం జరిగింది.. అది నేటి కుటుంబ విలువలు.. 
ఆమె చెప్పిన ప్రకారం ఒక కుటుంబం. ఆ కుటుంబంలోని వారి ప్రవర్తన స్వల్పంగా మీకు చెప్తున్నాను.. ఇలాంటివారు కూడా వున్నారని తెలిపే ముఖ్య ఉద్దేశం మాత్రమే ఇది.. 

ఒకానొక కుటుంబం అమ్మ, నాన్న, పిల్లలు వారు కలిసి భోజనం చెయ్యరు.. మనసువిప్పి మాట్లాడుకోరు... 

తండ్రి ఏమో ఇల్లుని ఒక లాడ్జి లా భావిస్తాడు.. తల్లేమో తన ప్రపంచం ఇది కాదనే ఊహాలోకంలో వుంటుంది.. మరి పిల్లలేమో వారి దారి వారిదే... 
తండ్రి ఓ స్పోర్ట్స్ ఛానల్, తల్లేమో ఓ సీరియల్, పిల్లలేమో మొబైల్ పట్టుకొని నొక్కుకుంటూ వుంటారు.. భోజనం ప్లేట్లు ముందు పెట్టుకొని... 
ఒక శుభకార్యానికి అందరూ వెళ్తారు.. కాని ఆప్యాయంగా పలకరించేందుకు కాదు సెల్ఫి లు తీసుకునేందుకు వాటిని  అప్ లోడ్ చేసేందుకు.. 
ఇక మనం బ్రతకడమెందుకు .. వస్తువులను ప్రేమిస్తూ ప్రాణాలను వాయువులో కలిపేస్తున్నాం.. నిజాన్ని పక్కకు నెట్టి అబద్డంతో కాలక్షేపం చేస్తున్నాం.. మారుదాం.. మీరే కాదు నేను కూడా.. మార్పు మొదట మనతోనే మననుంచే రావాలి.. 

స్వస్తి  __/\__

Bobby Nani

కవీ హృదయం ...

మన ప్రాచీన సాహిత్య కవులు కొందరు తాము ప్రేమించిన స్త్రీ ని కాని, ఆమె గురించి కాని, వారి ప్రేమవ్యవహారాలు కాని వారు రచించిన కావ్యాలలో ఎక్కడా కనిపించవు ఇంత గొప్ప కవితాసాగరులకు ప్రేయసి లేదా అనే సంశీతి నాకు కలిగి .. అందుకుగల కారణం ఏమైవుంటుంది అని కొన్ని పుస్తకాలు తిరగేశాను....అందులో కొన్ని వాస్తవికతలను చూసాను... కొంతమంది ప్రముఖ కవులు వారి ప్రేయసిని కావ్య నాయికగా స్వీకరించి కావ్య రచన చేసున్నారు.. మరికొందరు ప్రకృతిలోని అందాలనే వారి ప్రణయ ప్రేయసిగా చేసుకొని వర్ణించి వున్నారు..  ఉదాహరణ కు  
నాయని సుబ్భారావు గారు “సౌభద్రుని ప్రణయ యాత్ర” లోని “ వత్సల అనే స్త్రీ ఆ కవి ప్రేమించిన ప్రేయసే .. 

అడవి బాపిరాజు గారు “శశికళ” లో ఓ ఊహా సుందరినే అయిన ప్రేయసి గా ఊహించారు..  

విశ్వనాధ సత్యనారాయణ గారు “కిన్నెరసాని” పాటలో “కిన్నెర” అంటే ఒక వాగు. ఆ వాగునే ఆయన ప్రేయసిగా భావించారు .. 

ఇలా ఎందరో ప్రాచీన కవులు వారి ప్రేయసిని వివిధ రూపాలలో చూసుకుంటూ  వారి శైలిలో “నభూతో న భవిష్యతి” లా ఎన్నో పద్యాలు, కావ్యాలు, రచనలు రాసారు.. నిజానికి ఆ వర్ణనలు వారికోసమే అన్నట్లు గా వుంటాయి.. 

“భావ కవిత్వం” అంటే నాకు చాలా ఇష్టం “భావ కవిత్వం” అనగా సౌందర్యం, ప్రేమ .. “భావ కవిత్వం” కేవలం స్త్రీ యొక్క హృదయాన్ని  మాత్రమే చూస్తుంది... ఇందులో శారీరక అంగాంగ వర్ణనలు కనిపించవు. అందుకే వేల్చేరు నారాయణరావు గారు “అమలిన శృంగారం” అని నామధేయం పెట్టారు.. అంటే నిర్మలమైన, పరిశుద్ధమైన, నిష్కల్మషమైన శృంగారం అని అర్ధం... ఇది చదువరులకు అందాన్ని, ఆహ్లాదాన్ని, నిర్మలత్వాన్ని, నిశ్చలత్వాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయి.. అందుకే ఈ రకపు వర్ణనలను నేను ఇస్టపడుతాను .. మనసు బాలేనప్పుడు ఇలాంటి భావ కవిత్వాలు రాసుకోవడం అలవాటు .. ఒక్కోసారి అలా  రాసుకున్నవి చదవడం నేను రాసినవాటిల్లోనే మళ్ళి మళ్ళి సవరణలు చెయ్యడం అలవాటు.. 

కాని “ప్రబంధ కవిత్వం” అలా కాదు.. స్త్రీ యొక్క దేహ అంగాంగ వర్ణనలకు ఇది నిలయం... ఘాటైన పదాలతో, విశ్లేషణలతో సున్నిత హృదయులకు భయానకాన్ని, ఉద్రేకాన్ని కలిగిస్తాయి..   కాని “భావ కవిత్వం” నుండే ఈ “ప్రబంధ కవిత్వం” పుట్టింది.. అంతే కాదు “భావ కవిత్వం” లో ప్రకృతి, ప్రణయం, ప్రబోధం, ప్రాధాన్యం వహించాయి.. 

మన ప్రాచీన కవులు ఆదర్శ ప్రణయాన్ని వర్ణించి వున్నారు.. వాటిల్లో చాలావరకు పురుషాధిక్యాన్ని చాటినవే వున్నాయి.. స్త్రీ పై గౌరవాదరాలు కలిగి లేవు.. స్త్రీ ని శృంగార మూర్తిగాను, ప్రబంధాల్లో అయితే కముకిగాను మన ప్రాచీన కవులు వర్ణించి వున్నారు.. 

మరికొందరు ద్వంద విధముల కవిత్వాలను రాసేవారు.. ఉదాహరణకు “భావ సంధి” సత్యభామ నరకాసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు వీర  రస మూర్తిగాను, అదే సమయంలో కృష్ణుని వైపు చూస్తున్నప్పుడు శృంగార రసమూర్తిగాను కనిపించింది... దేని స్థానం దానిదే. ఇలాంటి ఒక స్థితినే “భావ సంధి” అంటారు.. 
ఇకపోతే “రాగ భంధం” దీనిలో ప్రణయ స్పర్శ వుంటుంది కాని అది ఎలాంటిది అంటే ప్రకృతినే ప్రేయసిగాను, కవి హృదయం ప్రియుడిగాను సంభావించుకొని ప్రకృతి వర్ణన చాటున చాలావరకు ప్రణయ వర్ణనే వుంటుంది.. ఇలాంటి వర్ణనలో దాశరధి గారు ప్రముఖులు.. 

“పూల  గాలి సోకి పులకింప జగమెల్ల 
వచ్చినది ఉగాది వన్నెలాడి “ 

ఆహా యెంత బాగా  రాసారో కదా.. ఉగాది అనగానే మనకు  వసంతం జ్ఞప్తికి వస్తుంది... ఆ వసంతంలో ప్రకృతి నయనానందకరంగా వుంటుంది.. ఎటు చూసినా చెట్లన్నీ కొత్త చిగుళ్ళతో, పూల సువాసనలతో కనిపిస్తాయి.. ఇదంతా ఒక కవికి ఒక ప్రేయసిని చూసినట్లే వుంటుంది... చాలామంది కవులు ప్రకృతి ని ప్రకృతి లానే వర్ణించారు... అలాంటి సందర్భంలో సామాన్య మానవులకు కవులకు తేడా వుండదు అనడంలో సంశయమే లేదు.. దృశ్య వస్తువును వీలైనంత వరకు అంతర్నేత్రముతో చూడగానే అది మనకు పలువిధముల కోణాలు కనిపించాలి. ఓ నది ని చూసినప్పుడు ఒక కాంతగా కవితానేత్రానికి కనిపించాలి.. 

ఇలా  చెప్పుకుంటూ పోతే ఎన్నో మహా కావ్యాలు, ఎందరో మహానుభావులు, చదవగలిగే ఓపిక, తీరిక  ఉండాలే కాని యావత్ జీవితం కూడా సరిపోదు .... 

స్వస్తి,  ___/\__

Bobby Nani

Wednesday, July 13, 2016

నలుగుతున్న ఆడతనం ...

ఎనిమిదేళ్ళ వయస్సులో పక్కనింటి అంకుల్ గట్టిగా బుగ్గ గిల్లాడని తల్లికి చెప్పలేకపోయింది ఓ ఆడతనం .. తల్లి కోప్పడుతుందని..
Photo Credited by : Google 
బడిలో ఓ కామ పంతుల వెకిలి చేష్టల్ని మనసులోనే అణిచివేసింది ఆ ఆడతనం.. ఇంట్లో తెలిస్తే చదువుకు ఇక సెలవంటారని ...
బజారులోని దుకాణం దారుడు, 
రోజు వెళ్ళే బస్సులోని కండెక్టర్,
ఇంటి సందు చివరన కుర్రకారు గుంపు,
ట్యూషన్ మాస్టారు కొడుకు ఇలా ఎన్నో ఎన్నెన్నో వేదింపులు..
అన్నీ అవమానాలను దిగమింగుకొని కన్నిటితోనే కలిసికట్టుగా జీవిస్తోంది..
ఈవ్ టీజింగ్ ని మునిపంట నొక్కి, ర్యాగింగ్ లకు దాసోహం చేసి,
అగ్నిగుండాల వంటి ఎన్నో సంద్రాలను దాటుకొచ్చింది ఆ ఆడతనం ...
ఉద్యోగంలో పై అధికారి దుర్భుద్ది బయటపెడితే గుట్టుగా మందలించింది... వింటే ఎవరైనా తనమీద నిందమోపుతారేమో అని భయపడి..
చివరికి భర్త క్రూరత్వాన్ని, కర్కశత్వాన్ని భరించడంలో తానింకా భూదేవి పాత్రనే ధరిస్తూ వుంది...
సహనంగానే భరిస్తోంది అతగాడి ఆగడాలను.. మౌనంగా ఆ ఆడతనం తన లోలోన కుములుతూ...
శాంతిని కోల్పోతూ, ఆరు నూరైనా సరే నుదుటి గీతను రాసే హక్కు ఎప్పటికీ మొగుడిదే అంటూ...
అతగాని ఆంక్షల లక్ష్మణ రేఖని చెరపలేనంటూ..
చెదరిన మనసుతోనే, చేజారిన ఆశతో .. ఇక బ్రతుకంటోంది.
వాని వికటాట్ట హాసాల విరుపులో ఆమె ఒక తునిగిన తునకవలె....
అదే విజయమని ఆ మగసిరి విర్రవీగితే...
అతని వెనకనున్నది మాత్రం ఆమె నల్లని నీడ మాత్రమే...!!!!

ప్రతీ వయస్సులో ఆడతనం అర్ధాంతరంగా చిదిమివేయబడుతుంది, చితికివేయబడుతుంది... తల్లిదండ్రుల భాద్యత పిల్లలను దగ్గర కూర్చోపెట్టుకొని వారి సమస్యలను తెలుసుకోవడం.. నేటి బిజీ బిజీ ప్రపంచంలో పిల్లలను హాస్టల్ లో వేస్తున్న తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారితో మనసువిప్పి మాట్లాడండి ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది...
సర్వేజనా సుఖినో భవంతుః

స్వస్తి   ___/\___

Bobby Nani