Thursday, May 31, 2018

నీ నడుమును చుట్టిన నా చేయి ..!!
నీ నడుమును చుట్టిన నా చేయి 
నా నడుమును చుట్టిన నీ చేయి 
లతలా పెనవేసుకొని నడిచి పోతున్నవి 
వైశాఖ పూర్ణిమ సముద్ర 
విశాల సైతకముల మీద..!! 

మన చేతి వ్రేళ్ళ కొసల నుండి 
సకల లోకాలు స్వరలహరులైపోయిన 
సజీవ స్వప్నంలో .. 
కదిలే మన చరణాల సవ్వడికి 
భాష్యం చెప్పింది 
నిద్దుర లేచిన నిశ్శబ్దం..!! 

ఊగిపోయే మన ఒడలి పడవలకు 
లంగరు వేసింది 
చిలిపి మలయ మారుతము..!! 

నీలో ఓ మౌనం 
నాలో ఓ మౌనం 
ఆవరించిన వేళా 

మనమధ్య లేచిన 
ఇసుక రేణువుల తెర 
సిగ్గున ముసిముసిగ నవ్వుకుంది..!! 

తెలుపలేని తన్మయత్వమును 
తెలుపలేక నీవు 
తెలుపబోక నేను 
ఎవరు నీవంటే ఎవరు నీవన్నట్లు 
ఎక్కుపెట్టాము కనుబొమ్మలను 
ఒకరిలో మరొకరిని చూచుకొని 
ఉలిక్కిపడి తెరుకున్నాం..!! 

ఒక మీన మిధునం 
ఒక తారకా శారికల జంట 
మన కంటి పాపల్లో కదలాడుతుంటే 
ఈ క్షణం మరణించినా పర్వాలేదు 
అన్నమాట రాలింది మన ఉల్లమువెంట..!!

Written by : Bobby Nani

Tuesday, May 29, 2018

సమాజంలో అందరి పరిస్థితి మారుతుంది.. మెరుగుపడుతుంది ఒక్కరిది తప్ప.. !!సమాజంలో అందరి పరిస్థితి మారుతుంది.. మెరుగుపడుతుంది ఒక్కరిది తప్ప.. !!

ఈ మధ్యకాలంలో ఒక ఆర్టికల్ చదివాను. అందులో ఇలా రాసివుంది.. ఇద్దరు అన్నదమ్ములు అంట సీతన్న, వెంకన్న ఆస్తి అంతా ఇద్దరూ చెరిసగం చేసుకున్నారంట .. వారికి ఒక విధవ ఆడపడుచు వుంది అంతే కాదు వారు పంచుకున్న ఆస్తులు సమానంగా పోను ఒక ఎకరా పొలం మిగిలింది.. పొలం, మరియు విధవ ఆడపడుచు ఈ రెండిటిని కూడా ఇద్దరూ తీసుకోవాలి అనే నిర్ణయాన్ని నమోదు చేసి ఉంటాడు వారి తండ్రి.. పొలం కావాలని కొట్టు కుంటారేమో అని అందరూ అనుకున్నారు..కాని ఆశ్చర్యంగా వారు ఆమె కావాలని కొట్టుకున్నారు.. విషయం ఏంటి అంటే పొలం మీద పంట వస్తుంది.. ఆమెను ఇంటికి తీసుకువెళ్తే ఖర్చు తగ్గుతుంది.. ఆడమనిషి కాబట్టి బ్రతికినంతకాలం మా కుటుంబానికి చాకిరీ చేస్తుంది .. పైగా అట్లు పోసి అమ్మి రాబడి కూడా తెచ్చి ఇస్తుంది అని సమాధానం చెప్పారంట.. వారి దూర దృష్టికి నేను విస్తుపోయాను.. 

రక్షణ లేని ఆమెపై అందరికీ హక్కువుంటుంది.. అందరూ ఆమెను వాడుకోవాలని చూసేవాల్లే కాని ఆమె అభివృద్దిని కోరే వారే అరుదవుతారు.. ఆమె శ్రేయస్సు పై కాని, ఆమె ఇష్టాఇస్టాలపై గాని ఏ ఒక్కరికి శ్రద్ద వుండదు.. ఆఖరికి కన్న తల్లితండ్రులకు, రక్త సంబంధీకులకు కూడా భారం అవుతుంది ఈమె.. అత్త మామలు, అన్నదమ్ములు, వదినెలు ఆమెను వేరు పురుగుగా చూస్తారు.. బావలు, మరుదులు ఆమె వారసత్వాన్ని ఎలా భంగ పరుద్దామా అని ఆలోచిస్తారు.. చదువుకుందామా అంటే చదివించే నాధుడే వుండడు .. పోనీ పెళ్ళాడుదామా అంటే మళ్ళీ పెళ్ళా !!! అంటూ అసహ్యంగా చూస్తారు.. వయస్సు మళ్ళిన మగవారు సైతం కన్నెలనే కోరుతారు ..కాని భర్తృవిహీనలంటే అతి నీచంగా చూస్తారు.. వైధవ్యం ఆమె కోరుకున్న వరం కాదు అని అందరికీ తెలిసిన విషయమే కదా.. కావాలని తెచ్చుకున్న దోషం అంతకన్నా కాదు.. అది ఆమెపై అనుకోని ఆశనిఘాతంగా వచ్చిపడ్డ మహోపద్రవం ... 

ఈ సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.. మరెన్నో సమస్యలు తీరుతున్నాయి.. ఇంకెన్నో మరబోతున్నాయి.. కాని మారని సమస్య మన విధవరాండ్రదే ... వారి వేష భాషల్లో కొంచం మార్పు వచ్చినా జీవిత విధానంలో ఏ మార్పు రాకబోవటం శోచనీయం .. వారు ఇటు పుట్టింటి వారికి, అత్తింటి వారికి కూడా బరువే.. అది చాలక “తల చెడ్డ దానికి భోగభాగ్యాలెందుకు పడివుండక” అంటూ ఈసడిస్తుంది ఈ సమాజం.. “పూర్వ జన్మ పాప ఫలం వల్ల ఇలాంటి దశ వచ్చింది “ అంటారు తోటి స్త్రీలు.. “చేసుకున్నవారికి చేసుకున్నంత, అనుభవించక తప్పుతుందా ? ఏనాడో ఏ పచ్చని కాపురంలో నిప్పులు పోసి వుంటుంది అనుభవిస్తుంది మనమేం చేస్తాం “ అంటూ దెప్పిపొడుస్తారు తోబుట్టువులు.. “ నా పాప ఫలం” అంటాడు తండ్రి.. “ నా తలరాత వల్లనే దాన్ని కన్నాను కాని దాని అదృష్టాన్ని కనగలనా “ దానితో పాటు నేను అనుభవించక తప్పుతుందా అంటూ వాపోతుంది ఆమె తల్లి.. 

నెత్తిమీద గుడ్డ ఆ దేముడే తొలగించినప్పుడు, నుదుటి వ్రాత అలా రాసినప్పుడు అనుభవించక తప్పుతుందా.. ఇలా అందరికీ లోకువై, అందరిచేతా ఈసడింపబడుతూ ఎదారిలాంటి జీవితాన్ని సాగిస్తుంది ఆ అభాగ్యురాలు.. ఏ నేరం లేకుండా, ఏ తప్పూ చెయ్యకుండా శిక్ష అనుభవించేది ఎవరయ్యా అంటే విధావాడబడుచు అని రూఢీగా చెప్పవచ్చు.. అంతే కాదు ఒక చెంప జీవితంలో తీరని నష్టాన్ని పొంది బ్రతుకులో భారంతో గడుపుతున్న ఆమెపై జాలిలేక పోగా దయ, కరుణ చూపకపోగా దెప్పిపొడవటంలో న్యాయమేమిటో అర్ధం కావట్లేదు.. అందరికీ చాకిరీ చేస్తూ అందరికీ లోకువగా బ్రతకటమే ఆమె జీవిత ధ్యేయం, పరమావధి అవుతుంది.. 

ఇక పిల్లలున్న తల్లి, ఆస్తిలేని తల్లి, ఉద్యోగార్హత లేని తల్లి అయితే ఆమె కష్టాలు చెప్పలేనివిగా వుంటాయి.. ఇంటిపని, పిల్లల పని, వారి పోషణా భారం అనంతంగా వుంటుంది.. వారి చదువు, ఆరోగ్యం లాంటివి అనుక్షణం ఆమెను వేదిస్తూనే వుంటాయి.. అష్ట కస్టాలు పడి పెంచిన ఆ పిల్లలు పెద్దవారయ్యాక పెళ్లి అయ్యాక ఆమెకు ఇంత తిండీ, గుడ్డా కూడా ఇవ్వరు.. తండ్రి ఆస్తికి మాత్రం వారసులు అవుతారు.. 

“విడో” కాగానే ఆమె పరిస్థితులు తారుమారు అవుతాయి.. కొన్ని విధులు, బాధ్యతలు ఆమెకై కేటాయించబడతాయి .. ఎడురువస్తే “అపశకునం” అంటారు.. శుభకార్యాలలో పాల్గొనరాదు అంటారు.. తన బిడ్డ పెళ్లి కూడా తను దూరంగా వుండి చూడాలి.. ఇలా ఎన్నో ఎన్నెన్నో.. 

ఇవన్నీ మనసులో పెట్టుకొని వారికోసం ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటూ వున్నాను.. స్త్రీలకు కేటాయించిన ఉద్యోగాల్లో వితంతువులకు యాభై శాతం కేటాయిస్తే బాగుండు.. అలాగే వృత్తి, విద్యల్లో వారికి ముందుగా అవకాశం కల్పించాలి.. వయోపరిమితిని అధిగమించి వారికి ప్రత్యేక సదుపాయాలు కలిగించాలి.. యువకులు, విద్యార్ధులు చైతన్య వంతులై అలాంటి వారికి వివాహం చేసేందుకు ముందుకు రావాలి.. తోటి స్త్రీలు వారిని ఉద్దరించడానికి తోడ్పడాలి.. అలా సర్వులూ వారికి చేయూత నిచ్చిన నాడే వారు స్వతంత్రులు కాగలరు.. 

ఎన్ని చేసినా, మరిన్ని చేసినా వితంతువులు సైతం తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుకోవడానికి సర్వవిధాలా ప్రయత్నించాలి.. ఆనాడే వారి సమస్యలు సమసి పోగలవు.. 

ఒక్కరి హృదిలో అయినా ఈ ఆలోచన వస్తే బాగుండు.. 

స్వస్తి __/\__ 

Written by : Bobby Nani

Friday, May 25, 2018

ప్రణయ ఘట్టం.. !!


ఓ కడవ శ్రేష్ఠమా ..!!
లోగడ నీవు కుమ్మరి చేతిన ఎన్నో 
గూటపు దెబ్బలు తినటమూ, 
ఎర్రెర్రని ఎండలో ఎండిపోవడమూ, 
బురద పాకంలో త్రొక్కిడి పడటమూ, 
కుమ్మరి ఆవంలోని మంటల్లో పడి మాడటమూ, 
అన్నియూ శ్లాఘనీయములే ..!!

ఆ తరువాతనే కదా !!
ఎన్నో రంగులతో సింగారించుకొని, 
ఈనాడు ఇంత అందమైన నా ప్రేమిక 
సుతిమెత్తని బాహులతికల మధ్యలో నల్గుతున్నావు.. !!

ఆమె స్తనపార్శ్వాలను ఒరుసుకుంటూ, 
నడుముల మధ్య ఒయ్యారాలు పోతూ,
ఉయ్యాలలూగుతున్నావు..!!
ఈ నాటి నీకు కల్గు సుఖాలైననూ
నాకు లేవనే మనస్తాపమునుంటిని..!! 

ఓ కలువ కన్నుల తరుణీ,
అసలే ఇది వర్షాకాలపు రాత్రి,
ఆకాశంలో మబ్బులు దట్టంగా ముసిరాయి..
అంతటా గాఢాంధకారం అలుముకుంది..
పగలంతా కడవ మోసిన ఆ కౌను కందిపోయివుంది..
మన సాంగత్యము జరిగి నేటికి మూడు దినములైనది..
మూతి విరుపులాపి ప్రణయ పరిష్వంగములందించ 
కనుసన్నలియ్యవే సఖీ..
లిప్తపాటున నవనీతము రాసుకొచ్చి అధర మర్దన గావిస్తాను.. !!

కాటుక కళ్ళన నర్మగర్భముగ ఆహ్వానము పలుకగా,
సరసజాక్షి రసరమ్య వీక్షణాలు శృంగార రసాభిషేకాలై, 
జవరాలి దేహపు క్షేత్రము.. గళ్ళు లేని వలపుల వాకిళ్ళై,
సరస, రసహృదయుడకు పుప్పొడుల పూల బాటలై, 
కన్నె ప్రాయములను అన్వేషించమని 
వలుపుగానికి సవాలు విసిరి 
విల్లులా నీల్గి, చతుర్విధ ముద్రలలో
చిగురుబోడిలా నిల్చుంది..
ఆమె కనులు మాట్లాడే కలువ భాషకు 
మధురములను అద్డుతూ అధర తాళపత్ర సంతకాలతో 
మొదలైనది వారి ప్రణయ ఘట్టం.. !! 

వణికే అధరములను మునిపంట నొక్కి,
కులికే గాండీవ నడుమును కరమునపట్టి, 
అర్ధ చంద్రాకార భంగిమలో, 
ఒక పాదమ్మును బాహువున మోపి, 
మరొ పాదమ్మును పుడమిన నిలిపి, 
బిగు కౌగిళ్ళ సంగమంలో ధ్వనించే 
ఘాటైన మూల్గుల తమకములో, 
జీరాడు కుచ్చిళ్ళు నేల రాలుతూ, 
పసిడి గుబ్బలను శంఖమున పట్టి పూరిస్తూ, 
మంచు గంధపు తనురసమును
నాలిక కొనలన మీటుతూ, 
తుమ్మెద గ్రుచ్చని పుష్పపథమున
వెచ్చని మేహనము ఒదుపున నాటి 
త-క … ది-మి, 
ది-మి … త-క 
తపనల వరసల శోభన రాతులలో 
సాగే శృంగారం, 
ఊగే సింగారమై
మౌనాల తీరాన, 
గారాలా మారాల పాన్పుపై 
సృష్టి రహస్యాలను ఛేదిస్తూ, 
వికసిత కుసుమాలమై ఒదిగిపోమా.. !!

Written by : Bobby Nani

Monday, May 21, 2018

అన్వేషణ..


అన్వేషణ
********

హిమం దాడితో పగిలిన 
యెర్రని పెదవుల లోపల 
ఇవుళ్ళు తొడిగే గడియ కోసం 
ఎదురుచూస్తున్నాను ..!!

కనపడ్డ ప్రతీవాని మీద 
మరువులకొద్ది దుమ్మెత్తిపోసి 
అందమైన పత్రపు వలువలు
అకారణంగా ఒలిచివేసి
శిశిరాత్ములను దెబ్బతీసే 
చిత్రమైన మనిషి కోసం 
ఎదురుచూస్తున్నాను ..!!

పలాశ పతాకను ధరించి 
విలాసంగా నడిచి వచ్చే 
విప్లవ కారునికోసం...
మందారం వలె నవ్వే 
సుందర హృదయుని కోసం... 
మల్లికవలె మాట్లాడే 
మానవ మిత్రుని కోసం 
గడచిన కొన్నేళ్ళనుంచి 
గవేషిస్తూన్నాను..!!

భాషా వాసన తెలియని, 
పరిశ్రమకు సాధ్యపడని,
శాస్ర్తీయ సంగీతం కాని, 
స్త్రీయ సంగీతం కోసం ..
స్వీయ సంకేంతం కోసం.. 
ఎదురుచూస్తున్నాను ..!!
తపాలావాని మసి ముద్రను 
తమాషాగా తప్పించుకొని 
తనదాకా నడిచివచ్చే 
అర్ధణా కార్డు కోసం.. 
దారి మధ్య వలలోపలి 
దానిమ్మ గింజలను జూచి 
నోరూరక గడ్డి విత్తులు 
ఆరగించే పక్షికోసం ..
మొదటి దివ్వెను వెలిగించి మరీ 
వెతుకుతున్నాను.. !!

నేత్రాలను కప్పివేయని 
నీలి ముంగురుల కోసం 
బోధి వృక్షాన్ని దాటిన 
పూర్వ తేజం కోసం 
కంఠంలో నిల్ప గలిగిన 
కాలకూట విషం కోసం 
ఆడవేషం వడ్డించని 
అమృతంలాంటి రసం కోసం 
ఆలోచనల ఆజ్యంతో 
యజ్ఞం చేస్తున్నాను.. !!

Written by : Bobby Nani

Wednesday, May 16, 2018

తెలుగు సాహిత్యం లో కవితా ధోరణులు ..తెలుగు సాహిత్యం లో కవితా ధోరణులు 
****************************

నేడు అందరూ ముఖపుస్తకాన్ని వేదికగా చేసుకొని “కవిత్వాలు” వ్రాస్తున్నారు.. అందుకు చాలా సంతోషంగా ఉంది.. కానీ వ్రాసే ప్రతీ ఒక్కటీ “కవిత్వం” అంటున్నారు అందుకు చాలా విచారంగా కూడా ఉంది.. సామాజికావసరాలను తీరుస్తూ, సామాజికాభిరుచులకు అనుకూలంగా సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ సమాజంలో పుట్టి పెరిగేదే సాహిత్యం అంటే... ఇటువంటి సాహిత్యం నన్నయ కాలం నాటికి అనగా క్రీ.శ. 11వ శతాబ్దం నాటికి స్థిరపడింది.. అప్పటినుంచి అది క్రమముగా వికాసాన్ని పొందుతూ, చిన్నయ దాకా ఒకే మూసలో అవిచ్ఛిన్నంగా, విశృంఖలంగా సాగింది.. దాదాపు తొమ్మిది శతాబ్దాలలో అవిరళంగా, విస్తృతంగా వ్యాపించిన ఈ తెలుగు సాహిత్యమంతా స్వరూపంలో కొద్ది పాటి వైవిధ్యాన్ని పొందినా, స్వభావంలో మాత్రం ఎలాంటి మార్పులకు లోనుకాకుండా కొనసాగుతూ వచ్చింది... నన్నయ నుంచి చిన్నయ దాకా సాగిన ఈ కవిత్వాన్నే ప్రాచీన కవిత్వంగా, సంప్రదాయ కవిత్వంగా సాహితీకారులు పిలిచారు.. 

సంప్రదాయ కవిత్వం..

నన్నయ నుంచి చిన్నయ దాకా పరంపరంగా సంక్రమించిన కవిత్వాన్నే సంప్రదాయ కవిత్వం అంటారు.. దీనినే ప్రాచీన కవిత్వం అని కూడా అంటారు.. ఇందులో ముఖ్యంగా వీర, శృంగార రసాలకు ప్రాధాన్యత ఇవ్వడం, అష్టాదశ వర్ణనలను కలిగి ఉండటం, ప్రకృష్టమైన రచనలతో సాగడం, వ్యాకరణ బద్దంగా నడవడం, ఛందో నియమాన్ని పాటించడం, అలంకారాలకు ప్రాధాన్యత ఇవ్వడం, పురాణ, ఇతిహాస, కావ్య, ప్రబంధాది మార్గాలలో నడవడం, ఈ లక్షణాలన్నీ సంప్రదాయ కవిత్వ ముఖ్య ఉద్దేశాలు.. 

భావ కవిత్వం.. 

ఇది ఓ లిరిక్ లా ఉంటుంది.. దీనిని గీత కవిత్వమని, అభినవ కవిత్వమని, నవ్య కవిత్వమని అనేకమంది అనేక పేర్లను సూచించినా గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు సూచించిన “భావకవిత్వమనే” పేరుతోనే ఇది స్థిరపడింది.. కవి తన హృదయగత భావావేశాన్ని అతి స్పష్టంగా వ్యక్తీకరించడమే దీని ముఖ్య ఉద్దేశం.. ఇందులో ముఖ్యంగా.. వస్తువు, భావం, ఊహాతీతంగా వ్రాయడం, కల్పనకు ప్రాధాన్యమివ్వడం, ఏక భావాశ్రయంగా నడవడం, అలౌకికతను కలిగి ఉండటం, స్త్రీ ని తల్లిగా, చెల్లిగా, చెలిగా పూజించడం, అమలిన శృంగారానికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రకృతిని ఆరాధించడం, వర్ణించడం మొదలగు లక్షణాలన్నీ భావకవిత్వ ముఖ్య అలంకారాలు..

అభ్యుదయ కవిత్వం 

ఆంగ్లంలో “Progress” అనే పదానికి సమానార్ధకంగా వాడబడుతున్న అభ్యుదయమనే పదానికి “మంగళం” “శుభం” అనే రూఢ్యర్ధాలతో పాటు పురోగమనం, ప్రగతి అనే అర్ధాలు కూడా ఉన్నాయి.. ఇలా అభ్యుదయ కవిత్వం ద్వారా ప్రజలను ఏకతాటిపై నిలబెట్టిన వారు శ్రీ శ్రీ గారు.. సమకాలిన జీవిత పరిస్థితులకు, రాజకీయ వాతావరణానికి, ఆర్ధిక సమస్యలకు, సమాజ సంఘర్షణలకు, నైతిక సందర్భాలకు, ఐహిక, ముష్మిక సిద్దాంతాలకు వైజ్ఞానిక విశేషాలకు అనుగుణంగా, అనుకూలంగా అవసరమైన అక్షరాలతో విలసిల్లాలని అభ్యుదయ కవిత్వాన్ని మరికొందరు ఆకాంక్షించారు .. ఇందులో ముఖ్యముగా సామాన్యునికి ప్రాధాన్యత, సామాజిక చైతన్యం పెంపొందించడం, గతాన్ని నిరసించడం, వాస్తవిక దృక్పథంతో నడవడం.. తదితర లక్షణాలు ఈ అభ్యుదయ కవిత్వానికి వున్న నియమాలు.. 

దిగంబర కవిత్వం 

దిక్కునే అంబరంగా కలిగిన కవిత్వాన్ని దిగంబర కవిత్వం అంటారు.. సమాజంలో కుళ్ళు, రుగ్మత, అలజడి మొదలగు వాటిని వున్నది ఉన్నట్లుగా అత్యంత సత్యంతో, సహజమైన ధోరణిలో వ్యక్తీకరించడం దీని ప్రత్యేకత.. మనిషి తన అవయవాలను కాపాడుకోవడానికి అంబరాలను ధరిస్తాడు.. కాని రహస్యంగా దాచుకోవాల్సినవి లేనప్పుడు అంబరాలతో కూడా అవసరం లేదనే సిద్ధాంతం పై ఆవిర్భవించినదే ఈ దిగంబర కవిత్వం.. “ ఈ ప్రాపంచిక అచ్చాదనల్ని చీల్చుకొని కొత్త రకాన్ని ఇంజెక్టు చెయ్యడానికి వస్తున్న దిగంబర కవుల గుండెల్లోంచి ధైర్యంగా, స్థైర్యంగా దూసుకొచ్చిన కేకలే దిగంబర కవిత” అని ఈ కవిత్వాన్ని గురించి దిగంబర కవులు స్పష్టం చేసారు.. ఇందులో ముఖ్యముగా సమాజంలో జరిగే పరిస్థితులను ఉన్నవి వున్నట్లు చిత్రించడం, కళకు కాకుండా విషయానికే ప్రాధాన్యత ఇవ్వడం.. వ్యక్తీకరణ అత్యంత సత్యంగా ఉండటం, ఎలాంటి అశ్లీలాన్ని అయినా దాచకుండా చిత్రీకరించడం.. విప్లవ పంథాలో నడవడం..పూర్తి స్వేచ్చగా వ్రాయడం.. అత్యంత సరళంగా ఉండటం.. స్పష్టతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం.. వాస్తవికతను చూపడం.. ఇలాంటి లక్షణాలు ఇందులో ముఖ్యం.. 

విప్లవ కవిత్వం 

దెబ్బకు దెబ్బ, కత్తికి కత్తి అనే సిద్దాంతంతో సమాజంలో పేట్రేగిన ధనిక వర్గాలను సమూలంగా పెకలించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో సమ సమాజ స్థాపన చెయ్యాలనే సదాశయంతో, ముఖా ముఖిగా పోరాడాలనే తత్వంతో, అట్టడుగు వర్గాలలో చైతన్యాన్ని రంగరించి వారిని విప్లవ యోధులుగా సిద్ద పరచాలనే ఆవేశంతో బహిర్గమించినదే ఈ విప్లవ కవిత్వం.. దీని ముఖ్య ఉద్దేశాలు మార్క్స్ వాదాన్ని ఆధారంగా గ్రహించడం, తాడితులను, పీడితులను మకుట ధారులుగా తయారుచెయ్యడం.. వీరోచిత కథనం చెయ్యడం, ఓర్పును, సహనాన్ని అసహ్యించుకోవడం, వర్గ చైతన్యాన్ని ఊపిరిగా గ్రహించడం, అవసరమైనప్పుడు మానవతా విలువలకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడం మొదలగునవి ఈ విప్లవ కవిత్వ ముఖ్య లక్షణాలు.. 

మినీ కవిత్వం 

నిఘూడమైన భావాన్ని కొద్ది పంక్తులలో పొదిగి, ఒక రసవత్కావ్యఖండికను చదివిన అనుభూతిని కలిగించడం మినీ కవిత లక్షణం.. వ్యర్ధ పదం ఒక్కటి లేకుండా చెప్పదలచిన భావం పూర్తి అయ్యాక గీతం పూర్తి అయిందా లేదా అని చూడక అక్కడే ఆపివెయ్య బడడం దీని తత్వం.. పద్యాలలో, గేయాలలో ఇది వస్తున్నప్పటికీ ముఖ్యంగా వచనంలోనే ఇది విశేష సార్ధకతను సంతరించుకుంటుంది.. దీని లక్షణాలు సంక్షిప్తతను, క్లుప్తతను, స్పష్టతను పాటించడం, భావ తీవ్రత కలిగి ఉండటం, అల్పాక్షర, అనల్పాక్షర రచనను పాటించడం, అనుభవ ప్రధానంగా సృజింపబడటం, అనుభూతికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, రాసావేశాన్ని కలిగి ఉండటం, ఆనంద ప్రధానంగా ఉండటం, ముఖ్యంగా అతితక్కువ సమయంలో పఠించేందుకు వీలుగా ఉండటం.. ఈ లక్షణాలు మినీ కవిత్వ అలంకారాలు ..

గేయ కవిత్వం 

భావ కవిత్వంలో అంతర్వాహికగా, సూచనాప్రాయంగా గేయ కవిత్వం కనిపిస్తుంది.. మాత్రా, ఛందస్సుతో రాగ, తాళ యుక్తంగా, గానానుకూలంగా, సంగీత యోగ్యంగా, సంతరింపబడుతున్న కవిత్వమే గేయ కవిత్వం .. ఇప్పుడున్న సినిమా కవిత్వం అంతా ఈ గేయ కవిత్వంలోనే మిళితమై ఉంది.. 
ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్తే వచనా కవిత్వమని, ఆశుర కవిత్వమని, మధుర కవిత్వమని చాలా ఉన్నాయి.. చతుర్విధ కవితలు అని కేవలం నాలుగు ముఖ్యమైనవి ఉన్నప్పటికీ వాటిలో భిన్నాలుగా ఎన్నో పుట్టుకొచ్చాయి.. ఇలా సాహిత్య పరంగా నేడు కవులు అని చెప్పుకునే వారు కొద్దిలో కొద్దిమందైనా రాస్తున్నారా.. ?? లోతైన భావాలను వ్రాస్తున్నారు.. కాని వాటికి సాహిత్యాన్ని జోడించి రాస్తే మరింత అందాన్ని సంతరించుకుంటుంది.. అని నా అభిప్రాయం.. 

ఇదంతా ఎందుకు అని అంటే ఒక్కో కవితకు ఒక్కో నియమ నిభందనలు ఉన్నాయి.. ఎలా పడితే అలా వ్రాసేది కవిత్వం కాదు కపితము అవుతుంది.. తెలియనివి నేర్చుకోవడంలో తప్పులేదు.. నేను వ్రాసేదే గొప్ప అదే నిఖార్సైనా కవిత్వం అనుకుంటే నువ్వు ఎప్పటికీ అధముడువే ..!! పత్రికలలో రాసే ప్రతోడు గొప్పవాడు కాదు.. అలా అని ప్రతీ వారు తక్కువ అని కాదు.. కొందరు అందులో కూడా చాలా బూతులు రాస్తున్నారు.. పత్రిక అంటే లక్షల మంది చదువుతారు అలాంటి వాటిల్లో వ్రాయాలంటే ఎంతటి వారికైనా చెయ్యి వణుకుతుంది .. చాలా సింపుల్ గా నియమాలు లేకుండా రాసేస్తున్నారు.. చదువరులు కూడా కనీస అవగాహన లేకపోవడమే ఇందుకు మూల కారణం .. అక్షరానికి సాహిత్యం చాలా ముఖ్యం సాహిత్యం లేకుంటే దేహానికి వస్త్రం లేకుండా వున్నట్లు ఉంటుంది.. 

ప్రతీ ఒక్కరికీ అర్ధం అవ్వాలనే ఇంత సమయాన్ని వెచ్చించి ఇదంతా వ్రాసాను.. 
వందమంది చదువుతారని కాదు.. ఒక్కరు ఆచరిస్తారని ఆశిస్తూ.. !!

స్వస్తి __/\__

Written by : Bobby Nani

Monday, May 14, 2018

ఓ ప్రశ్నార్ధక కవి..


నాటి కాలపు కవులను ఒక్కసారి పరిశీలిస్తే ఏ ఒక్కరూ వారి వారి అంతిమదశలో సుఖంగా జీవితం ముగించినట్లు లేదు.. ఏదో ఒక సమస్య.. కొందరు వేదనతో, ఇంకొందరు పేదరికంతో, మరికొందరు దుఃఖాలతో, ఇలా వారి వారి జీవితాలు ముగిసిపోయాయి.. కొన్ని దశాబ్దాలను ఏక చక్రాధిపతిగా విరాజితమైన కవులు చివరి దశలో చరమగీతాలాపనలతో స్వస్తి చెప్పారు... అలాంటి కవిని గూర్చి చిన్న అక్షర మాల.. 


చిరిగిపోయిన జేబుల్లో చేతులాడించుకుంటూ 
తిరుగుతా నేనొక్కన్నే 
నే కప్పుకున్న బొంతకు గుడ్డకన్నా కంతలే ఎక్కువ 
విచ్చుకున్న గగనం కింద కవిత్వానికి ఊడిగం చేసే బానిసన్నేను..!!
అక్షరము తప్ప మరేదీ రాదు.. !!

వెదజల్లుతా నెన్నో ఉజ్వల ప్రణయ స్వప్నాలు.. 
వున్న ఒక్క లాల్చీ మోకాళ్ళ మీద చిరిగిపోయింది.. 
ఆకాశంలో ఆశ్రయ చిహ్నంగా చంద్రబింబం విరిసింది. 
పట్టులా మెరుస్తున్న నక్షత్రాల హాసం 
బఠానీల్లా ప్రాసల్ని ఒలుస్తున్న స్వప్నజీవిపై కురిసింది.. !!

మైకం కల్పించే హిమకరణ చషకంలో నా నుదురు తడిసింది.. 
భాద్రపదరాత్రుల దారి ప్రక్కల ఒంటరినై కూర్చుని వున్నాను...
ముట్టడించినవి నన్ను ... నా వెర్రి నీడలు 
అక్షరాల కోసం నా వద్దనే వెతుకుతున్నట్లుగా.. 
చిరిగిపోయిన చెప్పుల్లో కాళ్ళు దూర్చుకుని
హృదయానికి ఒక పాదాన్ని వీణలా మలిచి
ఈ నిశీధమునకు జోలపాడుతూ, హత్తుకున్నాను 
రేపటి ఉషోదయానికి ఓ ప్రశ్నార్ధక కవినై ..!!

Written by : Bobby Nani