Monday, October 31, 2016

ప్రకృతి కాంత ...ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఓ సోదరి అందించారు.. ఈ చిత్రాన్ని చూడగానే నాకు మొదట కలిగిన అనుభూతి ఓ ప్రకృతి కాంత అందమైన మానవ కాంత రూపంలో మారి తెల్లని మేఘాలను చీరకట్టుగా మలిచి, రంగు రంగుల పుష్పాలను రవికగా మర్చి, సప్తవర్ణాలను అలంకారములుగా చేసుకొని, బంగారు వర్ణపు మువ్వలను సింగారించుకొని, లేలేత పారాణి సొగసులతో, సౌభాగ్యవతియై .... తన ప్రియుడైన ఆకాశ రాజు కోసం పరితపించిపోతున్నట్లు గా నేను భావించాను.. ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని వారి మధ్యన వున్న ప్రణయ బంధాన్ని ఇక్కడ వివరించాను.. 

ప్రకృతి కాంత 
*********


నింగి వలచింది నేలను.. 
తొంగి చూచింది ఈ ప్రకృతి కాంత సొగసును .. 
వంగి నిలిచింది 
సందిట కౌగిలించింది.. 
కనుసైగ చేసింది.. 
అనువైన కోనలో 
కోరిక తీర ముద్దులిచ్చింది.. 
నింగి నేలను వలచి 
మంచుపొగలతో పంపింది ప్రేమలేఖ.. 
నేలకు దిగివచ్చి 
వలచి తలచి 
పిలిచి కౌగిట జేర్చి 
కొండ శిఖర అధరాల 
కొరికి నొక్కి 
పచ్చికబయళ్ళ 
పమిట కొంగుపై 
రంగు రంగు పువ్వుల 
పుప్పొడి గందాల సువాసనలు చిలికి 
వనమూలికల పరిమళాల పన్నీరుచల్లి 
పిల్ల గాలులు చల్లగా వీచి 
ఈ ప్రకృతి కాంత సఖియలైన గిరులు తరులు 
తన్మయమునొంద 
అబల ప్రకృతి కాంత కన్నియును 
ఆకాశ రాజు ఆలింగనముచేసి 
పరిణయమాడె ఈ ప్రకృతి కాంతను
ప్రకృతి పులకరించి హర్షింపగన్ .. 

Bobby Nani

Wednesday, October 26, 2016

అసలు కథలంటే ఏంటి ? ఏది కథ ? ఏది కథ కాదు ? ఈ విషయాలను ఓ సారి పరిశీలిద్దాం ..


అసలు కథలంటే ఏంటి ? ఏది కథ ? ఏది కథ కాదు ? ఈ విషయాలను ఓ సారి పరిశీలిద్దాం .. 

కొందరు విమర్శకులు, సంపాదకులూ, ఒకొకప్పుడు పాఠకులు కూడా కథంటే ఇలా ఉండాలి, ఈ లక్షణాలు ఉంటేనే కథ అవుతుంది అని నిర్ధారించి ఉన్నారు .. 
వారు నిర్దేశించిన కొన్ని ముఖ్య లక్షణాలు చెప్తున్నాను : క్లుప్తత, వాస్తవికత, సమయైక్యత, నిబద్దత, సాంద్రత.. రెండో స్థాయిలో పరిశీలించేవి : ఎత్తుగడ, నిర్వహణ లేక నడక, ఆవరణ, పాత్రపోషణ, ముగింపు, వీటికి తగినట్లుగా సన్నివేశాలు.. సంఘర్షణ ఉన్నాయా ? లేవా అన్నది పరిశీలిస్తారు ఈ విమర్శకులు ... 

నిజానికి అసలు కథకు ప్రధానాంగాలు : ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు, ఉపాంగాలు, ఆవరణ, పాత్రచిత్రణ, భాష... 
ఈ భాష అనేది చాల విస్తృతమైన విషయం... 
అసలు కథ అంటే ఏమిటి ?
ఏది కథ అవుతుంది ?

మీరు ఏది మాట్లాడితే అదే కథ... లేదా కథ అవ్వడానికి కావాల్సిన లక్షణాలను కలిగివుంటాయి మీ మాటలు.. మనం ప్రతీరోజు కథలు చెప్పుకుంటూనే వుంటాం.. ఏ ఇద్దరు ఎదురుపడినా రెండోవారు చెప్పేవి కథలే.. “ఇవాళ ఏమైందో తెలుసా?” అని ఒకరు మొదలెడితే అది కథ కావచ్చు అంతెందుకు మనం లేట్ గా వెల్లామనుకోండి అక్కడ వారికి మనం చెప్పేవి కూడా కథలే.. 

ఉదాహరణకు : 

హోంవర్క్ ఏది ?
కుక్క తినేసింది .. 
ఇంటికి ఆలస్యంగా వచ్చారెందుకు ??
వానపడింది.. 
వానెక్కడ పడింది.. ఫేళ్ళున ఎండ కాస్తుంటే 
ఇక్కడ కాదు ప్రక్క వీదిలో పడింది.. 

ఆమాట నిజమే కావచ్చు.. లేదా కొంచం నిజం కావచ్చు, కాకపోవచ్చు కూడా... కానీ ఇవన్నీ కథలవడానికి అవకాశం వుంది.. 

మాట ఏనాడైతే పుట్టిందో అప్పుడే కథలూ పుట్టాయి.. ముందు కథనం, తరువాత లేఖనం, అనాదిగా జానపద సాహిత్య రూపంలో మౌఖికంగా కథలు చెప్పుకుంటూనే వున్నాం.. ఈనాడు మనం కథాంశాలు అని వేటిని చెప్పుకుంటూ వున్నామో అవన్నీ జానపదగేయాల్లో చూస్తాం.. 

పల్లెలో ఒక చిన్నవాడు కంటబడ్డ చిన్నదాన్ని అడుగుతాడు ఇలా 
ధాన్యమైనా దంచగలవా పిల్లా నీవు.. ?? అని 
ధాన్యమంటే దగ్గోస్తాదయ్యా మాకు అంటుందా చిన్నది.. 
ఇలా యేవో మూడో నాలుగో ప్రశ్నలేస్తాడు ఆ చిన్నవాడు.. 
చివరికి అంటాడు.. 
సంతకైన ఎల్లగలవా పిల్లా నీవు ?? 
సంతకంటే సంతోషమయ్యా మాకు అంటుందాచిన్నది.. 

వెనుకటి రోజుల్లోను, పెళ్లి చూపులలోను, ఇప్పుడు డేటింగ్లలోను జరిగేది అదే.. పెళ్ళికి ముందు పిల్లదాని అర్హతలు, అభిరుచులు కనుకోవడం.. నిజమైన డేటింగ్ అంటే ఇది.. నేటి కాలపు డేటింగ్ అలా లేదు.. దానికి అర్థాన్నే పూర్తిగా మార్చేసారు.. 
అలాగే త్రివిక్రమ్ గారు మళ్ళి చూపించినటువంటి కొన్నిటిని చూద్దాం.. 
ఓ అత్త కొత్త కోడలిని నిలదీస్తుంది.. 

పచ్చిపాల మీద మీగడేదమ్మ 
వేడిపాలలోన వెన్న ఏదమ్మా అంటూ.. 
ఆ కోడలు ఆ అత్తకు ఎదురు చెప్పలేదు .. అందుకని పొరిగింటి ఇల్లాలితో ఇలా అంటుంది.. 
మాయత్త ఆరళ్ళే గానీ చూస్తివ ఓయమ్మా ?
పచ్చిపాలమీద మీగడుంటుందా ..
వేడిపాలలోన వెన్న ఉంటుందా ..
అంటూ తన బాధ వెళ్ళబోసుకుంటుంది ...

ఇలా ఆనాటి పాటకజనం తమ కష్టం, సుఖం, మంచి, చెడ్డ, అన్నీ కలబోసుకొని ఒకరికొకరు చెప్పుకునేవారు.. అందుచేత కథ ఎప్పుడు పుట్టింది అంటే మాట పుట్టినప్పుడే అని చెప్పుకోవాలి.. ఒకరితో మరొకరు మాట్లాడినప్పుడల్లా ఏదో కథకు ఆస్కారం ఉంది .. 

కథ వ్రాతపూర్వకంగా మొదలైంది పైశాచీ భాషలో గుణాడ్యుడు రాసిన బృహత్కథ అని సాహిత్యం చెప్తోంది.. తెలుగు కావ్యాలు, ప్రబంధాలు, బృహత్కథ లోని వృత్తాలు తీసుకొని రాసినవే.. 

కథనం చెప్పిన పద్దతి – పద్యరూపమే అయినా వీటిలో కథలు వున్నాయి.. శాలివాహనుని గాధాసప్తశతి, సోమదేవుని కథాసరిత్సాగరం, ఇంకా భట్టి విక్రమార్క చరిత్ర, భేతాళపంచవింశతి ఇలాంటివన్నీ సంస్కృతమూలాలనుండి తీసుకొని తెలుగులో రచించినవి.. అలాగే సంస్కృత రామాయణం, మహాభారతాలలోనుంచి కూడా ఇతివృత్తాలను తీసుకొని తెలుగు కథలు రాయడం జరిగింది.. 

కథలు అనేవి మన భాషనుంచే వచ్చాయని మనం స్పష్టంగా నమ్మొచ్చు... కథ ఎవరైనా రాయవచ్చు.. కాకపోతే కొన్ని ప్రాస నియమాలు, అలంకారాలు, పర్యాయపదములు, అన్నిటికన్నా ముఖ్యం లోతైన ఆలోచనాధోరణి కలిగి వుంటే చాలు .. ఇలాంటివి రాయడం అలవరుచుకుంటే మన ఆలోచనా విధానం చాలా మెరుగుపడుతుంది.. నేటి కాలం పిల్లలు రాయడం అటువుంచితే చదవడమే గగనమైంది.. పిల్లల్లో మార్పు తేవాలని కోరుకుంటూ ఆ భాద్యతను తమ భుజస్కంధాలపై మోయాలని పెద్దవారికి విన్నవిస్తూ.. 

స్వస్తి ____/\____


Bobby Nani

Monday, October 24, 2016

ఆదివారంనాడు నేను, నా మిత్ర బృందం కలిసి వెళ్ళిన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ క్షేత్ర విశేషాలు, వింతలు మరియు నా అనుభవాలు ...

ఆదివారంనాడు నేను, నా మిత్ర బృందం కలిసి వెళ్ళిన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ క్షేత్ర విశేషాలు, వింతలు మరియు నా అనుభవాలు ... 


అనుకున్న సమయం కన్నా ఓ గంట లేటుగా బయలుదేరాల్సి వచ్చింది .. అందుకు గల కారణం నా మిత్ర బృందం లోని ఒకరి పెళ్లి చూపులకు సంబంధించిన తన చిత్రాన్ని అమ్మాయి ఇంటి వారికి అందజేయ్యాల్సిన పరిస్థితి రావడం.. ఇది చాలా శుభ పరిణామం.. ఆ పెనుశిలేశ్వరుడి కరుణా, కటాక్షాలు ఆ ఒక్కటి కాబోతున్న జంటపై ప్రసరించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ... 


ముందుగా దక్షిణ భారతదేశంలో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ పెసుశిల (పెంచలకోన) పేరుగాంచింది. ఈ పుణ్య క్షేత్రం దర్శించుకున్న వారి పాపాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తారు.. అంతే కాదు ఓంతో పాసస్త్యం గల శ్రీ లక్ష్మి సమేత పెనుశిల లక్ష్మి నారసింహ స్వామి భక్తులకు ఇలవేల్పుగా మారారు.. చెంచు రాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచలకోన గా పురాణాలు చెప్తున్నాయి... దట్టమైన తూర్పు కనుమలు మధ్యన వున్న కీకారణ్యం అయినప్పటికీ ఇక్కడ ఒంటిగా వున్నా కూడా ఎలాంటి ఆపదలు, క్రిమి కీటకాలనుంచి జంతువులనుంచి ఆపదలు తలెత్తవని అందరూ నమ్ముతారు.. ఇక విషయంలోకి వెళ్తున్నా...అరవై కిలోమీటర్ల వేగంతో బండి వెళ్తోంది.. దానికి రధ సారధిని నేనే.. వెనుక కూర్చున్న నా మిత్రుడు ఎన్నో కబుర్లు చెప్తూ వున్నాడు.. ఆ లేలేత సూర్య కిరణాల చివుక్కు చివుక్కు మనే చక్కలి గిలిగింతల నులువెచ్చని వెలుగులలో ... నల్లని తారు రోడ్డు పై మా ప్రయాణం సాగుతుండగా .... బాగా తల నెరిసిన ఓ వృద్ద పురుషుడు చేతి కర్ర సాయంతో దీటుగా నిలబడి అక్కడున్నటువంటి వృక్షాలకు కాపలాగా, ఓ సలహా దారునిగా ఓకింత అనుభవ గర్వంతో, చిరునవ్వు చిందిస్తూ వున్నట్లుగా కుడిచేతిప్రక్కన కనపడిందో పెద్ద వృక్షం ... ఆ వృక్షానికి అన్నీ ఆకులు కాగితాలలా తెల్లగా వున్నాయి.. పచ్చదనం అనేది లేకుండా సజీవంగానే నిలబడి వుంది.. అది చూడగానే నాకు కలిగిన మొదటి అనుభూతి ఇది.. అక్కడవున్న చుట్టుప్రక్కల వృక్షాలకు ఓ పెద్ద తలకాయిలా ఆ వృక్షం ఉంది అనిపించింది.... 


80 కిలోమీటర్ల మా ప్రయాణం ముందు ఉంది .. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆ రోడ్డు స్థితిగతులను బట్టి నేను సారధ్యం వహిస్తూ వున్నాను.. నా మిత్రుడు ఏమో నన్ను అలరింప చేస్తూ మాట్లాడుతూనే వున్నాడు.. రోడ్డుకు ఇరుప్రక్కల యవ్వన కోమలాంగులు, అపర సౌందర్యవతులు అయిన నర్తనలు వరుసగా వయ్యారంగా కదులుతూ .. స్వయానా వారి హస్తములతో మధుర పరిమళ గంధపు జల్లులలను, కుసుమములను మాపై చల్లుతూ ఆహ్వానం పలికే ద్వారపాలకులలా (ఓ మోస్తరు ఆకృతి గల వృక్షాలు మాపై వాటి ఆకులను, పువ్వులను విసురుతున్నట్లు) అనిపిందింది.... ఇది నాకు కలిగిన రెండవ అనుభూతి.. 


మరికొద్ది దూరం లో మేము పెద్ద జంక్షన్ నుంచి మరో రోడ్ లోకి ప్రవేశించాలి అనుకుంటూ వుండగా.. అక్కడ ఒక చిన్న దుకాణం చూసాము.. అది శీతల పానియాల దుకాణం.. ఇంకేముంది వెళ్లి రెండు సుగంధ పానీయం చెప్పి అందులో తప్పకుండా నిమ్మకాయ కలపమని చెప్పాము.. చెప్పిన వెనువెంటనే చేతిలోకి వచ్చి వాలింది ఓ తియ్యనైన, పుల్లనైన శీతల సుగంధ పానీయం.. మెల్లి మెల్లిగా దాని రుచిని ఆస్వాదిస్తూ ప్రతీ గుటకకు అబ్బా బాగుంది కదా.. అని చెప్పుకుంటూ చివరి బొట్టు వరకు పూర్తి చేసి బండి దగ్గరకు వెళ్లేముందు సూర్యభగవానుడి అగ్ని కిరణముల జ్వాలలకు తాళలేక జేబులో వున్న చేతి రుమాలు తీసి బాగా తడుపుకొని ముఖానికి కట్టుకొని, దరిమిల్లా కళ్ళజోడు పెట్టుకొని మరింత రెట్టింపు ఉత్సాహంగా ముందుకు కదిలాం.. మార్గ మధ్యంలో రాక్షస జాతికి చెందిన పెద్ద పెద్ద మర్రి చెట్లు వాటి చేతులవంటి ఊడలను మనసారా చాచుతూ పరుగు పందెం లో విజేతగా నిలిచిన క్రీడాకారునికి ఇరుప్రక్కల ఉన్న వీక్షకులు అభినందనలతో చేతులు జాపి ఆ విజేతను తాకాలని ఎలా అయితే ఆరాటపడతారో అలా ఆ ఊడలు మమ్ములను తాకేయత్నం చేసినట్లు నాకు అనిపించింది.. నాలో నేనే నవ్వుకొని అయినా నా పిచ్చి కాని సాధించడానికి నేనేం చేసానులే.. అని అనుకుంటూ ముందుకు వెళ్లాం...

సన్నని దారి ఇరుప్రక్కలా దూరాన వున్న కొండలు నిశ్చలంగా ఎన్నో ఏళ్ళనుంచి అవే రూపురేఖలతో అటు, ఇటు, వెళ్ళే మాలాంటి వాళ్ళను చూసి పలకరిస్తున్నట్లుగా అనిపించింది.. కంటి చూపు మేరా లే లేత ఆకుపచ్చని తివాచి కప్పినట్లు ఉండే పొలాలలో అప్పుడే వచ్చిరాని చిన్న చిన్న మొలకలతో కంటికి చాలా ఆహ్లాదకరంగా మారి ఓ పచ్చని ప్రపంచంలో మేము మాత్రమే సవారీ చేస్తున్న తుమ్మెదలమా అని అనిపించింది ఆ ఆక్షణమున .... నిజంగా ఆ క్షణాన తుమ్మెదలా మర్చవయ్యా..!! అని అడగాలనిపించేంత ఆశ కలిగింది నాలోన.. అల్లరి చేసిన బాల్యం ఒక్కసారి కళ్ళముందు కదలాడింది... అక్కడక్కడా మార్గ మధ్యలో పొడవైన తాటి చెట్లు, ఈత చెట్లు, నానాజాతి ఫల వృక్షాలు మాకు ఆహ్వానం పలుకుతున్నట్లు గా వుంది.. ఇరువైపులా పచ్చని పొలాల మధ్యన నల్లని తారురోడ్ పై మా ప్రయాణం స్వర్గానికి వెళ్ళే మార్గం లా ఉంది .. 


ఎన్నటికీ తరగని మధుర జ్ఞాపకాలు, విలువైన జ్ఞాపకాలు కూడా ఇవే... వీటికన్నా ఈ ప్రపంచంలో మరో విలువైనది ఉందంటే నేను నమ్మను.. నిజమైన సుఖాలు, సంపదలూ నా దృష్టిలో ఇవే .. బండిని వేగంగా పోనిస్తున్నాను.. కళ్ళూ విప్పార్చి మనసు లో తలపు తెరలను కూడా బాహాటం గా తెరిచి పెట్టి నా ముందు పరుగులు తిస్తున్న దృశ్య మాలికలను చూస్తూ క్షణం కూడా రెప్ప వెయ్యకూడదు అని మనసులో అనుకుంటూ ఎంత హాయిని పొందానో.. 


ఆ తన్మయత్నంలో వుండగా .. ఎదురుగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దివ్యమైన కోవెల దర్శనం ఇచ్చింది... ఆహా ఆ దివ్య సుందరమైన కోవెల వెనుక వున్న పర్వతాన్ని చూస్తుంటే మనసు పడే ఆరాటం ఆ సమయంలో ఒక్కటే .. బిర బిరా వెళ్లి స్వామివారిని చూడాలని .. అనుకున్నట్లే, అనుకున్న సమయానికే లోపలకు వెళ్లాం.. యెంత అందగాడివయ్యా ఓ పెనుశిలవాసా .. అందుకే కదా మా తల్లి చెంచులమ్మ నీ మాయలో పడిపోనాది .. పచ్చని పసిడి కనకముతో ధగ, ధగల మెరుపు సౌందర్య తెజోవిరాజితముల కాంతులతో సకల ప్రాణకోటికి రక్షణమూర్తివై వెలుగొందుతూ భక్తుల పాలిట ప్రతినిత్యం కొంగు బంగారమై విరాజిల్లే ఆ మహిమాన్విత దివ్య సుందర సుమధుర శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ మూర్తి దివ్యమంగళ దర్శనంతో మనసూ, తనువూ పులకరించి, పునీతమై పరవశించి పోయింది.. మాకోసమే అన్నట్లుగా ఓ పదినిమిషాలు అలానే ఆయన్ని చూస్తూ ఉండిపోయాను.. ఆ రూప దర్శనంతో కోరికలు కూడా మర్చిపోయి అలా చూస్తూ నిలిచిపోయాను.. 


బయటకు వచ్చి ఎదురుగా వున్న వానరుడు, సుగ్రీవుని మంత్రి, రాముని దూత, అతిబలశాలియు అసహాయశూరుడున్నూ అయిన హనుమంతుని వద్దకు వెళ్లి అక్కడనుంచి శ్రీ చెంచు లక్ష్మీ అమ్మవారిని దర్శించాము.. ముదురు కుంకుమ రంగు చీరతో, చేతి గాజు వంటి ముక్కు పుడకతో, మేనిమి ఛాయ కలిగిన మోముతో చల్లగా చూసే ఆ తల్లి కరుణ, కటాక్షముల ఆనంద వీక్షణ మాపై ప్రసరించినట్లు అనిపించింది.. ఏదో తెలియని ఉత్సాహం మా లోలోన.. చాలాసేపు అక్కడ కబుర్లాడుకొని కోనేరువైపు అడుగులేశాము.. అక్కడ నీరు పరిశుబ్రంగా లేనందున అన్నదాన శిబిరానికి వెళ్లాం.. 


ఒక్క బంతిలో దాదాపుగా 350 మంది భక్తులు కూర్చుని తినగలిగే వసతిని కల్పించారు.. అందులో మేము వెళ్లి కూర్చున్నాం.. ఎప్పుడో చిన్నప్పుడు చూచిన విస్తరాకులలో భోజనం.. అడ్డ చెట్టు ఆకులతో కలిపి సన్నని పుల్లలతో చక్కగా అల్లినటువంటి ఈ విస్తరాకులు చాల పలుచగా, నాణ్యతగా, విస్తారంగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి పూర్వం నుంచి ఈ చెట్టు ఆకులను విస్తరాకుల తయారిలో ఉపయోగిస్తున్నారు. వీటిల్లో తింటే ఆరోగ్యం కూడాను.. అలాంటి విస్తరాకులలో ముందుగా క్యాబేజీ తాలింపు, బీరకాయ పచ్చడి, అన్నం, సాంబారు, రసం, మజ్జిగ వెరసి కమ్మని భోజనం .. యెంత రుచిగా ఉందో ఇప్పుడు చెప్తుంటే కూడా నోట్లో నుంచి నీరు ఊరుతోంది .. తినే ముందు ఇలా అనుకున్నాం ఈ మధ్యాహ్న వేళ, ఈ పెనుశిల క్షేత్రమున, చుట్టూ ఉన్నటువంటి అటవీ మధ్యమున మాకు ఇంత కమ్మని నాలుగు రుచుల భోజనం అందించి మా కడుపు నింపిన ఆ దాతకు దానికోసం పనిచేసిన పనివారమంతటికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు అందరూ సుఖ, శాంతులతో వర్ధిల్లాలని చిన్న ప్రార్ధన చేసుకొని ఒకపట్టు పట్టేసాం.. 

బయటకు రాగానే ఐస్క్రీం బండి హై హై అనుకుంటూ అల్లరిచేసి అమ్మదగ్గర చిల్లర అడిగి అప్పలు కొనుక్కుని తినే చిన్న పిల్లాడిలా దానిముందు వాలిపోయాను..అందరం తలో చాకోబార్ తీసుకొని తినేశాం.. ఓ 10 నిమిషాల విశ్రాంతి అనంతరం అసలైన పయనానికి సిద్దం అయ్యాం.. 


అడవిలోపలకు 3 కిలోమీటర్ల ప్రయాణం మొత్తం ఎటుపడితే అటు గుట్టలు గుట్టలుగా ఉన్న రాళ్ళు, ఇదే దారి.. ఇలానే దాటుకుంటూ వెళ్ళాలి.. వేసే ప్రతీ అడుగు జాగ్రత్తగా వెయ్యాలి.. లేకుంటే ప్రక్కకు తొలిగి లేదా విరిగే అవకాశం ఎక్కువ.. అలా వెళ్తూ వున్నాం.. కళ్ళు పట్టనంత సౌందర్యం తో కూడిన పర్వతాలు, చెట్లు.. ఆ చెట్ల నుంచి వస్తున్న సుగంధంతో కూడిన స్వచ్చమైన గాలి.. ఇలాంటి గాలి పీల్చి ఎన్నో రోజులు అయింది అని అనుకుంటూ ముందుకు వెళ్తూ వున్నాం.. ఇక ఆ ప్రయాణపు దారిలో మధ్య మధ్యలో కొండపై నుంచి విరిగిపడ్డ పెద్ద పెద్ద రాళ్ళ గుట్టలు దట్టమైన చెట్లు, సర్పాకృతి కలిగిన గుబురు గుబురు పొదలు, అవన్నీ దాటుకుంటూ ఆనందంతో, ఆశ్చర్యంతో, ముందుకు కదులుతూ వెళ్తూ ఉన్నాము.. ఎన్ని సార్లు ఇక్కడకు వచ్చినా ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది అదేంటో నాకు... ఎక్కడా లేనన్ని రకరకాల, రంగురంగుల పూలమొక్కలు, జాజి, మొదలైన పూ పొదలు, నేరేడు, మారేడు, మోదుగ ఇలా నానావిధ ఫల, పుష్ప, వృక్షాదులు మా కన్నులకు కనువిందు చేస్తూ, మా మనసును అమాంతం లాగేసుకుంటూ వున్నాయి.. 


ఆ అడవిలో అణువణువునా అందమైన దృశ్యం తాండవిస్తోంది.. దారం తెగిన గాలి పతంగం లా నేను ఆ అడవిలో స్వేచ్చగా తిరుగుతున్నాను.. “అందం ఉన్నచోట ఆపద కూడా పొంచి ఉంటుంది” అని మామ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది.. ఇక జాగ్రత్త పడి ఒక వీడియో తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.. వచ్చి రాగానే మొదలెట్టేసా.. ఈ కొండలను వాటి ప్రాముఖ్యతను నాకు తెలిసినంతలో వివరిస్తూ ఓ 6.30 నిమిషాల వీడియో కూడా తీసా.. దాదాపుగా 50 నిమిషాలు నడిచిన అనంతరం చివరికి వచ్చాము.. నిజానికి అక్కడ జలపాతం లేదని మాకు ముందుగానే తెలుసు.. అయినా ఒక్క జలపాతానికే నేను ప్రాధాన్యత ఇవ్వబోను.. అది లేకుంటే ఏం మరెంతో అందం అక్కడ మెండుగా వుంది.. నిజంగా అదో అద్బుతమైన ప్రదేశం.. ఒకప్పుడు తొమ్మిది గుండాలు అని ఉండేవట .. గుండం అంటే కొండనుంచి కోనేరులా జాలువారి నీరు నిలిచిన ఓ అందమైన ప్రదేశం అని అర్ధం.. అలాంటి గుండాలు నేను కొన్ని సంవత్సరాలకు ముందు 3 చూడగలిగాను.. తరువాత అక్కడనుంచి కొండచర్యలను పట్టుకొని వ్రేలాడుతూ పోవాలని చెప్పారు.. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే 7 గుండాల దాకా వెళ్ళారని అక్కడ నానుడి.. 9 వరకు ఎవ్వరూ వెళ్లలేరని అది అసాధ్యం అని అంటుంటారు.. 9 వ గుండం దగ్గర స్వామివారు స్వయంబు బోర్లా పడి పిరుదులు పైకి లేచినట్లు ఉంటారని అక్కడ స్వామివారు సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెప్పివున్నాయి.. ప్రస్తుతం ఇప్పుడు కేవలం ఒక్క గుండం దగ్గరకే వెళ్ళగలం.. కొన్ని కొండచర్యలు విరిగి పడి మిగతా గుండాలకు వెళ్ళే దారిని పూర్తిగా మూసివేశాయి.. 

ఆ ప్రాంతంలోనే షుమారు 2 గంటలు గడిపాము.. ఎన్నో జీవరాశుల్ని పరిశీలించాము, మొక్కలను పరీక్షించాము, చిత్ర విచిత్ర విన్యాసాలు కూడా చేసేశాము.. అనేక చిత్రాలు క్లిక్ మనిపించాము... తరువాత తిరిగి ఇంటిముఖం పట్టాము.. ఎక్కడా ఇబ్బంది లేకుండా సజావుగా, సాఫీగా అందరం క్షేమంగా ఇంటికి చేరాము..

ప్రతీ ఒక్కరు దర్శించి పరవశించవలసిన మహిమాన్విత దివ్య సుందర క్షేత్రం .. వీలుచూసుకొని తప్పక వెళ్తారు కదూ.. 

స్వస్తి. ___/\___Friday, October 21, 2016

ఓ హృదయం లేని శిల్పం..
ఓ శిల్పకారుడు అందం చందం లేకుండా పడివున్న ఓ రాతిని రంభలా ఊహిస్తాడు.. ఆ ఊహలో మెదిలే ఓ రూపానికి జీవం పోయాలని అనుకుంటాడు.. అందుకోసం ఎన్నో రోజులు శ్రమిస్తాడు .. ఇన్ని రోజులూ తన హృదయంలో ఆ రూపాన్నే ప్రతిమగా నిలుపుకుంటాడు.. రాతిని రతనాల రాశిగా, తన ప్రియురాలిగా భావిస్తాడు.. అలాంటి సందర్భంలోనే తనకు తెలియకుండానే కొన్ని సందర్భాలలో ఆ శిల్పం ప్రేమలో పడిపోతాడు.. నిజానికి తను ప్రేమలో పడింది ఆ రూపం మీదనే కాని ఆ ప్రేమ శిల్పం లో చూపిస్తాడు.. అందుకే కొన్ని శిల్పాలు చూడగానే ఏదో హృదయంలో తన్మయత్నం కలుగుతుంది.. 

ఓ హృదయం లేని శిల్పం.. 
******************

నా తలపుల్లో నిలిచి ఉన్నది 
నీ వైనప్పుడు ..
ఈ ఎడబాటుకు అర్ధమేముంది.. 
ఎద ప్రతిధ్వనించినా .. 
అడుగు అడుగులో మెదిలే నీ 
మువ్వల సవ్వడులు రాతిని సైతం 
రమణీయం చెయ్యగలవు.. !!
ఒంటరితనమే నా చిరునామా.. 
పగలైనా, రేయైనా నీ ఊహే 
నన్ను నాకు వివరించేది 
నన్ను నిలువరించి వరించేది అదే.. !!
యుగాల విరామంలో క్షణాలు గడుస్తున్నాయి.. 
అంతరంగాల్లో మనోభావాలే 
జ్ఞాపకాల కూనిరాగాలై నిలుస్తున్నాయి.. !!
ఆకాశం చలి కాగుతుంది
నా ఊపిరిలో వెచ్చదనానికి ..
మంచుకరుగుతోంది నీ దిక్కున... !!
నిను జీవితంలా శ్వాసించనీ ... ఈ నేలపై.. 
నా అడుగుల తడబాటు .. 
నీ ఊహల్లో నేను నేనుగా ఉండాలనే 
ఆవిర్లు విరజిమ్మే ఈ గుండె చప్పుడు 
ఆగే లోగా నిను చేరాలనే తపన నాది.. !!

Bobby Nani

“ఉయ్యాలూపే ఒయ్యారి చెయ్యి”...“ఉయ్యాలూపే ఒయ్యారి చెయ్యి”...
**********************

“అమ్మ” ఈ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేనే లేదు .. ఎందుకంటె నాటి నుంచి నేటి వరకు ఎందరో మహానుభావులు అక్షరాలను మాలలుగా గుచ్చి అందించి వున్నారు.. అయినప్పటికీ ఎప్పుడూ మనసుకు హత్తుకుంటూనే ఉంటుంది .. 

అమ్మతో అనుబంధంలేని జీవితం వుండదు.. ప్రతీ సమయంలోనో, ఏదో ఒక సందర్భంలోనో గుర్తు చేసుకొనే తియ్యటి జుంటితేనే అమ్మ.. అమ్మ గురించి ఏమి రాయాలనే సందేహం కలిగిన వాళ్ళు వున్నారు.. పూర్తి వ్యక్తిగతాన్ని అమ్మకోసం మన ముందు పరిచిన వారూ వున్నారు.. జ్ఞాపకాల పొరల్లోనుంచో, అనుభూతుల గురుతుల్లోనుంచో, గుండెలో దాచిన అల్మరాలోంచో “అమ్మా !! నిన్ను ప్రేమిస్తున్నాను “ అని చెప్పడంలో వున్న ఆనందం మాటలలో ఏ రచయిత, ఏ కవి వర్ణించలేని నగ్నసత్యం అది.. 

అందుకే నా పరిభాషలో నేను చెప్పాలంటే “ఉయ్యాలూపే ఒయ్యారి చెయ్యి” అమ్మది అంటాను.. 
అమ్మంటే ఓ అద్బుతం.. 
అమ్మంటే ఓ అపురూపం.. 
అమ్మంటే ఓ అద్బుత కావ్యం.. 
మురిపాలు, జ్ఞాపకాలు, 
లాలిపాటలు, గోరుముద్దలు, 
అక్షరాలు, ఆలింగనాలు, 
నడక, నడత, 
అనురాగాలు, ఆత్మీయతలు, 
ఆనంద సమయాలు, 
కన్నీళ్లను వర్షించే క్షణాలు 
ఇంకా..ఎన్నో ఎన్నెన్నో.. 
అందమైన అనుబంధం, 
అంతేలేని అనురాగం 
వెరసి ఓ మరుపురాని జ్ఞాపకం.. 
నన్ను గెలిపించడానికి తను ఓడిపోతుంది.. 
అలా ఓడిపోవడమే గెలుపనుకుంటుంది.. 
ఒకసారి నన్ను కొట్టింది.. 
అయినా ఏం లాభం ? 
నాకంటే ముందే ఏడ్చింది..!!
నేను గుక్క పెట్టేలోపే 
గుండెల్లోకి లాక్కుంది.. 
తెరలు తెరలుగా 
తన కౌగిళ్ళలో కప్పుకుంది.. 
కళ్ళే కాదు.. తనువులోని 
ప్రతీ అణువు చెమరించేలా ఏడ్చింది.. 
ఇంకెప్పుడూ అమ్మకు కోపం తెప్పించకూ !! అంటూ 
నను బహిరంగంగా బతిమాలింది.. 
మన అల్లర్లు వెయ్యి భారించాక ఒక్కటి చెబుతుంది..
అదే అమ్మంటే.. 

స్వస్తి ___/\___

Bobby Nani

ఈ రోజు ఓ వార్త నన్ను విస్మయానికి గురిచేసింది..ఈ రోజు ఓ వార్త నన్ను విస్మయానికి గురిచేసింది.. 550 కోట్లకు పై చిలుకు ఖర్చుతో.. 11 రోజుల పెండ్లి సంబరాలట .. ఎల్.ఇ.డి లో పెండ్లి పత్రికలట .. వినడానికి చాలా బాగుంది కదూ.. 

పెండ్లి అంటే ఆకాశమంత పందిరి.. భూదేవంత విస్తరి మాత్రమే కాదు.. తరతరాలు మనల్ని గుర్తుపెట్టుకునే ఓ గొప్ప రోజు కావాలి ఆ రోజు.. ఓ నిండు జీవితానికి తొలి అడుగే ఈ పెండ్లి పీటలు.. 

మీ అమ్మాయి బ్రహ్మణి మీద మీకు యెంత ప్రేమ వుందో అర్ధం అయింది .. అందుకు చాలా సంతోషంగా వుంది.. 

ప్రతీ తండ్రి ఔరా అనుకునే విషయం ఇది.. 

ప్రతీ వ్యక్తి అబ్బురపడే సందర్భం ఇది... 

ప్రతీ అల్లుడు అసూయ చెందే రోజిది...

మీరన్నట్లు నిజంగానే చరిత్రలో నిలిచిపోతుంది .. ఆ పదకొండు రోజులు మాత్రమే .. !! తరువాత షరా మాములే.. తిన్న ఆహారం, పంచిన కానుకలు మచ్చుకు కూడా గుర్తుండవు ఈ జనాలకు.. 

అందుకు గల కారణం ఒక్కటే... మీరేంటో చూపించుకునేందుకు ఇంత ఆర్భాటం చెయ్యడం..అలా కాకుండా జనం కోసం మీరు ఖర్చు పెట్టివుంటే వారి ఆఖరి శ్వాస వరకు అది వారికి గుర్తుకు వుంటుంది.. 

మీరు అనుకుంటున్నట్లుగా "సంతోషం" అంటే దేశ విదేశాలనుంచి వచ్చిన మీ అతిధులు భుజించే అర్ధ ఆహారంలో ఉండనే ఉండదు .. 

మీరు చూపించే ఈ ఖరీదైన దగ దగ మెరుపుల పూతలలో ఉండనే ఉండదు.. 

అబ్బా అని పొగిడే ఈ జనాల నాలుకల మీద ఉండనే ఉండదు.. 

ఇదంతా ఆ పదకొండు రోజుల ముచ్చటే .... తరువాత మిగిలింది వ్యర్ధమైన ఆహారం, విడిచిన ఎంగిలి విస్తరులే ... 

నిజమైన సంతోషం అంటే "ఆశీర్వాదం" మీ బిడ్డకు అదే చివరివరకు తోడై, నీడై, రక్షణై నిలిచి వుంటుంది.. అలాంటి ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందో తెలుసా ?? మూడు పూటలా పస్తులుంటున్న నిరుపేదల దగ్గర.. మీ దగ్గర లేనిది వారి దగ్గర వున్నది అదే.. మీరు కొనలేనిది, విలువ కట్టలేనిది కూడా అదే.. ప్రతీ మనిషికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి వసతి, చెయ్యడానికో పని ఇది చాలా ముఖ్యం.. ఇలాంటి కనీస అవసరాలు నోచుకోకుండా అతి దారుణమైన, దుర్భరమైన, దుర్భేధ్యమైన జీవనాన్ని వారు గడుపుతున్నారు.. 

ఈ వివాహ మహోత్సవం సందర్భంగా మీరు అలాంటివారికి ఏమైనా చేసుంటే ... మీరు 550 కోట్లు కాదు మరో 550 కోట్లు ఖర్చు పెట్టిన దానికన్నా మరింత ఆనందాన్ని, సంతృప్తిని పొందుతారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను..

చరిత్ర అంటే అది.. 

ఆనందం అంటే అది..

వివాహానికి తొలి అడుగు అంటే అది.. 

అందరూ గొప్పగా చెయ్యాలి, గొప్పగా విందు అందించాలి అని చూసేవారే .. ఆ గొప్ప కొన్ని గంటల్లో విసర్జించబడుతుంది అని మర్చిపోతున్నారు.. గొప్పగా అంటే కడుపులోకి కాదు గుండెల్లోకి వెళ్ళాలి... అలా మీరు చెయ్యగలగాలి అని ఆశిస్తూ సోదరి బ్రహ్మణి కి హృదయపూర్వక శుభాకాంక్షలు .. 

స్వస్తి ___/\___

Bobby Nani

Wednesday, October 19, 2016

ఓ యువతా మేల్కొ..ఓ యువతా మేల్కొ.. 
****************** 

మరణమే శరణమని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకునే ఓ యువతా ఒక్కసారి ఆలోచించు.. నీ మరణం కన్న నీకొచ్చిన సమస్య ఏ పాటిది.. మరణానికి మించిన సమస్య లేదని గ్రహించు.. 

అసలు సమస్య ఎక్కడ మొదలౌతుందో తెలుసా.. ప్రతీ మనిషి తనకే అన్నీ కష్టాలు వున్నాయని అనుకోవడమే మీ మొదటి సమస్య.. అదే మిమ్మల్ని మృత్యువు దగ్గరకు తీసుకెళ్తుంది.. 

ఈ సృష్టిలో ప్రతీ ప్రాణికి సమస్యలు వుంటాయి... వున్నాయి కూడా ... “జీవం” అనగా పోరాడటం అని అర్ధం... ఎన్నో జీవరాసులు ఈ భూమి మీద పోరాడుతున్నాయి.. వాటి మనుగడను పెంచుకుంటూ పోతూ వున్నాయి... మరి మనిషి ఎందుకు సమస్యలతో పోరాడకుండా అత్యంత పిరికివాడిలా ఆత్మహత్య లాంటివి చేసుకుంటున్నాడు.. ?? 
మనిషి ముందు అవి వేటిలో గొప్ప ??
ఇంత జ్ఞానం మనకు భగవంతుడు ఇచ్చిన ఓవరం.. మీ ప్రాణాల మీద మిమ్మల్ని పుట్టించిన మీ తల్లిదండ్రులకే అధికారం లేదు.. అలాంటిది మీకెలా వుంటుంది...

ప్రతీ సమస్యకు పరిష్కారం వుంటుంది... విత్తు లేనిదే చెట్టు లేదు.. చెట్టు లేనిదే విత్తు లేదు అని గ్రహించండి... మీ సమస్యకు విత్తు ఎక్కడ వుందో అన్వేషించండి.. ఈ లోకంలో దొరకనిదంటూ ఏది లేదు... ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు ఒక్కసారి ఆలోచించండి...

మీ మరణం కన్నా మీ సమస్య ఇసుక రేణువులో అతి సూక్ష్మమైనది అని అర్ధంచేసుకోండి... దయచేసి ఆత్మహత్యలు ఆపండి... మీకోసం మీరు జీవించడం నేర్చుకోండి.. 

మీరు మరణించాలి అనే ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎవరేం చెప్పినా అస్సలు ఎక్కదు .. కాని ఆ సమయంలో ఒక పని చెయ్యండి.. మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళండి.. చివరి నిమిషంలో మృత్యువుతో పోరాడుతున్న వారిని చూడండి కుదిరితే వారితో మాట్లాడండి.. జీవితం అంటే ఏంటో యెంత అమూల్యమైనదో వారి మాటల్లోనే మీకు తెలుస్తుంది.. మీరు వద్దు అనుకుంటున్న జీవితం కోసం .... కనీసం ఒక్క రోజు అయినా బ్రతకాలనే తాపత్రయం తో వారు ఎంతలా పరితపిస్తున్నారో గ్రహించండి.. 

ఆ పక్కనే యాక్సిడెంట్ వార్డ్ కి వెళ్ళండి.. ఎందుకంటె మృత్యువుకు చాలా దగ్గరగా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు మీకు అక్కడ కనిపిస్తారు.. మృత్యువు ముంచుకొస్తున్నప్పుడు వారి మనసులో కదిలిన అనేకానేక సంగతులు, వారు చేసిన పాప పుణ్యాలు అన్నీ ఒక్కసారిగా కళ్ళముందు మెదల్తాయి.. ఒక్క అవకాశం ఇస్తే ఇక ఇలా బ్రతకను నన్ను నేను సరిచేసుకుంటాను అని భగవంతుడని కన్నీటితో వేడుకుంటారు ఆ సమయంలో .. మీకేమో మీ జీవితం అంటే లెక్కే లేదు కదా.. అలా మృత్యువు దాకా వెళ్లి వెనక్కి వచ్చినప్పుడు జీవితం మీద ఒక నిబద్దత ఏర్పడుతుంది.. వారి దృష్టిలో ఈ కష్టాలు, సమస్యలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి... ఎందుకంటె తనేంటో, తన స్థాయి ఏంటో, తను ఎందుకు ఉన్నాడో అప్పుడు తనకు ఎవ్వరూ చెప్పకపోయినా అనుభవం తనకు నేర్పుతుంది... అలాంటి వారి మాటలు విన్నప్పుడు మీకు మరణించాలనే ఆలోచన కాదు కదా.. ఊహ కూడా రాదు.. 

ఒక మనిషి జననం సులభమే, మరణం కూడా సులభమే ... 
కానీ ఈ రెండిటికి మధ్య వున్న జీవనం మాత్రం అలుపెరగని పోరాటం ... 
గమ్యమెరుగని పరుగుపందెం .. 
దారి పొడవునా “మంచి” అనే ముసుగులో పొంచివున్న దొంగలు ... 
కులంతో, రాజకీయంతో, మతంతో, ధనంతో, స్నేహంతో, ప్రేమతో, నానారకాల ముసుగులో ఏకమైపోయి ముళ్ళ కంపలై గుచ్చుతుంటారు ...
కొందరు స్నేహితులు పువ్వులై పలకరిస్తుంటారు.... 
దుష్టులకు దూరంగా, సన్నిహితులకు దగ్గరగా, శ్వాసిస్తున్నంత కాలం సాగిపోతూనే వుండాలి..
చిన్న చిన్న ఆనందాలను విడువక జుర్రుకుంటూ వెళ్ళడమే ఏకైక మార్గం ...

ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు ఒక్కసారి నేను పైన చెప్పిన విషయాలను ఆలోచించండి... దయచేసి ఆత్మహత్యలు ఆపండి...

స్వస్తి __/\__

Bobby.Nani

Tuesday, October 18, 2016

భగవంతుడెక్కడ ??భగవంతుడెక్కడ ?? 


ఈ ప్రశ్న వేసుకోనివారు వుండరు.. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న మన మనసులో మెదుల్తుంది.. అలాంటి ప్రశ్న కోసం నాకు తెలిసిన నా ఈ చిరు సమాధానం ఇది.. 

నా దృష్టిలో భగవంతుడు అంటే “ ప్రేమ “ 

ఆ ప్రేమ ఎలాంటిదంటే... 

మన రూపం తెలియకముందే మనల్ని ప్రేమించే తల్లి, తండ్రి ప్రేమ.. 
తన ప్రాణాన్ని అడ్డుపెట్టి ప్రసవించిన ఓ మాతృమూర్తి ప్రేమ.. 
తన ప్రాణం ఉన్నంత వరకు బిడ్డ భవిష్యత్తు కోసం పరుగెడుతూ తపనపడే ఓ తండ్రి ప్రేమ.. 
మనల్ని మనల్ని గా చూసి ఇష్టపడే ఓ ప్రియుడు/ప్రేయసి ప్రేమ.. 
ఏ బంధమూ తెలియకుండా మనతో అన్నీ పంచుకొనే మిత్రుడు/మిత్రురాలు ప్రేమ.. 
నూరేళ్ళ జీవితానికి అన్నీ తానై మనలో సగమై మనతో నడిచే ఓ అర్ధాంగి/అర్ధగ్నుని ప్రేమ.. 
అనేకానేక సమస్యలతో ఇంటికి వచ్చిన తండ్రిని నాన్నా అంటూ వచ్చి, తన చిట్టి చేతులతో చుట్టేసే ఓ పసి ప్రేమ.. 
ఎక్కడో దూరాన వున్న సోదర /సోదరీల క్షేమసమాచారాల ప్రేమ.. 
సెలవులలో ఊరెల్లినప్పుడు తాతయ్య, నాయనమ్మలు కురిపించిన వాత్సల్యపు ప్రేమ.. 

ఈ ప్రేమలన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడని నమ్ముతాను నేను... మనం ఒకరిని అమితంగా ప్రేమిస్తున్నప్పుడు అది వారికి ఒక కవచమై ఉంటుందని తెలుసా.. ఆ కవచమే భగవంతుడు.. 
భగవంతుడు అంటే రక్షణ అని అర్ధం.. అలాంటి రక్షణ ఇంతమంది స్వచ్చమైన ప్రేమలో ఉంటుంది .. వారిని, వారి ప్రేమను కించపరచకండి.. వీలైతే గౌరవించండి.. 

స్వస్తి ____/\___

Bobby Nani

Monday, October 17, 2016

దారితప్పిన తుమ్మెద..దారితప్పిన తుమ్మెద.. 

ఓ పచ్చని చెట్టు ఆకు క్రింద జీవం పోసుకుంటుందొక ప్రాణం.. 
తళతళమని మెరిసే గాజువంటి ఆకృతిలో... 
దుమ్ము, ధూళికి సైతం, ఎండా వానకు సైతం చెక్కుచెదరక ...!!
రోజులు గడుస్తున్నాయ్, ప్రాణం ఊపిరిపోసుకొని ఓ రూపం దాల్చుతోంది... 
ఇంతలో ఓ రోజు ఆ గాజుగూడు భళ్ళున పగిలింది ... 
చిత్రమైన రూప లావణ్యంతో, 
జుగుప్సాకరమైన ఆకారంతో,
మెల్లి మెల్లిగా బయటకు వచ్చిందో జీవి.. 
ఆకుపచ్చని రంగులో అందవిహీనంగా ఉన్న ఆ జీవి
వచ్చి రాగానే వెతుకుతోంది తనవారిని .. 
వృధా ప్రయాస అని తెలియడానికి కొంచం సమయమే పట్టింది.. !!
మెరుపువంటి వేగంతో, నిప్పు కణిక వంటి నేత్రములతో,
మరో జీవి మీద మీదకొస్తోంది ... 
కదలడానికి ఇన్ని కాళ్ళు వున్నా, వేగంలేని కదలికతో ముందుకు వెళ్తోంది.. 
నివాసం నుంచి క్రిందపడి తప్పించుకోగలిగింది ఆ క్షణమున ... 
భయం, భయం .. ఈ భయంతోనే బ్రతుకుపోరాటం చేసింది కొన్ని రోజులు.. 
ఓ రోజు విశ్రాంతి సమయంలో, ప్రసవ వేదన మొదలైంది అనుకోకుండా.. 
వస్త్రములు వేరు అయినట్లు తన చర్మం కోసుకుపోయి విడిపోతుంది..
కొన్ని నిమిషాల వేదన అనంతరం .. 
తోలిసంధ్యా కాంతి లే లేత వెలుగులలో, 
రంగు రంగుల రెక్కలు పొదిగినట్లుగా, 
ఓ అందమైన తుమ్మెదలా రూపుదాల్చింది .. 
తనకే ఓ ఆశ్చర్యం, 
తనకే ఓ ఆనందం,
తనే ఓ అద్బుతం.. 
గుండెనిండా మనో నిబ్బరంతో, తన రెక్కలను రెపరెప లాడిస్తుంది .. 
మెల్లిగా తను పైకి లేస్తుంది.. .. ఎగురుతోంది.. 
ఆకలితో ఉన్న ఆ తుమ్మెదకు అప్పుడే ఓ వికసించిన పుష్పం కనిపించింది.. 
చూడగానే వేగంగా ఆ పుష్పం మీద ఆమాంతం వాలిపోయింది..
ప్రియుని కౌగిలి కోసం వేచిచూసే ప్రియురాలిలా ఆ పుష్పం, 
ఆ ప్రియురాలి మధుర మకరంద రసాన్ని జుర్రుకునే ఓ ప్రియునిలా ఈ 
తుమ్మెద రెండూ తపించిపోతున్నాయి .. 
తన ప్రియుని దాహం తీర్చేందుకు ఆ పుష్పం తన మధుర రసాన్ని విడిచింది.. 
ఊపిరాడనివ్వకుండా కొన్ని నిమిషాలు ఆ మధుర రసాన్ని అమాంతం జుర్రుకుంది .. 
ఇద్దరికీ అది తొలి అనుభవం.. ఓ మధుర అనుభవం .. 
సంధ్య వేళకు వాడిపోతుందని ఆ పుష్పానికి తెలియదు.. 
మళ్ళి మధుర రసాన్ని అందివ్వలేదని ఈ తుమ్మెదకు తెలియదు.. 
ఇద్దరూ ఘాడంగా ఒకరిలో మరొకరు ఐక్యం అయిపోయారు అలా.. 
కొన్ని నిమిషాల బిగుతు కౌగిలింతల అనంతరం విడువలేక విడువలేక విడిచిన ఓ
దారితప్పిన తుమ్మెద మొదటి మకరంద మధురమిది.... !!!!

Bobby Nani

Saturday, October 15, 2016

డైరి లో ఓ పేజీ ..


డైరి లో ఓ పేజీ .. 

అందం తనమీద రాయమందో కవిత... 
చందనపుపూత లేని అమ్మాయి కోసం.. 
ఆరోగ్యమైన జవరాలి కోసం, చెలువ పిల్లకోసం.. 
యెక్కడని వెతకను ఏ కొలతన కొలవను.. 
అద్దాన్ని అడిగా తనే అందమంది.. 
అద్దమే అందమైనప్పుడు అన్నీ అంతేగా.. 
ఉండాలేమో మరి అందరికీ అద్దంలాంటి మనసు.. 
మనల్ని మనలాగే చూసుకుపోయే సొగసు.. 
అద్దాలమేడలో వున్నది అందమైనదైపోతుందా ..? 
అద్దం అందమైతే రాయికెందుకు అంత లోకువ.. 
రాలిపోతే, పాలిపోతే పగిలేనే భళ్ళున ..
ఆడపిల్ల, అద్దమూ రెండూ పెళసరే .. ఆదమరిస్తే అంతే.. 
ఏది మంచో లెక్కలేవి ఎందుకొచ్చిన చిక్కులివి.. 
నా ఊహల్లో రాతికి సైతం పోయలేనా ప్రాణము.. 
పుట్టినప్పుడు పురుడు పోసిన మిస్సమ్మ లా .. 
బళ్ళో కెళ్ళే బుజ్జోడి టీచర్ లా.. 
కాలేజి కుర్రోడికి .. ముందు బెంచి అమ్మాయిలా.. 
నాకెప్పుడు కనిపిస్తావో అందమా.. 
అమ్మ నుదిటిన బొట్టులా.. 
పల్లెగట్లమ్మట నీడ పంచే చెట్టులా..
కొబ్బరి ముక్క పగలకొట్టి పెట్టే గుడిమెట్టులా ..
మారుతున్న ఈ కాలంలో మళ్ళి నిను చూస్తానో లేదో అందమా.. !
అందమంటేనే మిస్సైన బంధమా.. !
కలల్లో ననుతాకే భావనా గంధమా.. !
అక్షరాల పలకరింపుతో ప్రపంచాన్ని పరిచయం చేసే గ్రంథమా... !
అసలు నువ్వెవరు అందమా.. !!
నను కన్న ఆనందమా.. లేక నే కనుగొన్న స్నేహమా.. ?
నా కడుపున పుట్టిన ఆనందమా.. లేక అంతుపట్టని ఓ అపురూపమా.. 
అసలు నువ్వెవరు అందమా.. ?? 

Bobby Nani

Thursday, October 13, 2016

బావా మరదళ్ల సరసాలు...బావా మరదళ్ల సరసాలు అందరికీ విదితమే .. అలాంటి బావా మరదళ్ళు నూతన దంపతులై మూడు రాత్రుల ముచ్చట ఇంకనూ తీరకమునుపే వారి ఇద్దరినీ ఒక్కదగ్గర ఉంచితే వారి కొంటె సరస సయ్యాటలను చూచుట సాధ్యమా.. వారి మధ్య ప్రేమ వెల్లివిరుస్తుంది.. నవ్వులు పువ్వులై పరిమళాలు దిశ దిశలా వ్యాప్తి చెందుతాయి.. అది పున్నమి వెలుగుల్లో ఆరుబయట మల్లెల చాటున నులకమంచం మీదన అయితే ఇక చెప్పనక్కరలేదు.. ఇలాంటి ఒక మధుర అనుభూతి రాయాలనిపించింది.. ఇక్కడ శృంగారం కనపడదు.. కాని హృదయంలో ద్రవిస్తుంది.. ఓ రచయిత గా ఇలా చూపే చిరు ప్రయత్నమే ఇది. ఇక్కడ మన వ్యవహారిక భాష కాకుండా యాస మర్చి రాయడం జరిగింది.. కావున మీరు చదువు సమయంలో ఆ యాసతో కనుక చదివితే అందులో మాధుర్యం అర్ధం అవుతుంది.. 


ఇరగ్గాసిన పండు వెన్నెలలో ..
దట్టమైన చీకటి కారుమబ్బుల మాటున 
నక్కి నక్కి చూస్తున్న నెలరేయి సిగ్గుల హొయలు.. 
కనిపించి కనిపించని మసక మసక 
రేయి పొరల వెలుగులలో,
సన్నజాజి పూ చెట్టు తోట కాడ.. 
గడ్డివాము ఎనకాల నులకమంచమెక్కి కూకున్న మా బావ
అరువుకో ముద్దు అప్పుగా ఆరా ఆరా ఇస్తుంటే.. 
మలయమారుతపు శీతల పైరు గాలికి 
బిగుసుకున్న నా దేహాన్ని..
బావ బిర బిరా చుట్టేస్తుంటే.. 
తన వెచ్చని ఊపిరులకు నా మనస్సు 
ఉలిక్కి ఉలిక్కి పడతాంటే... 
ఉడుకు రకత మంతా వొంట్లోన ఓ సోట చేరి 
ఉర్రూతలూయిస్తాంటే.. 
తెలియని మత్తు నన్నావరిస్తాంటే.. 
ఆ పున్నమి రేయి లా మా బావ.. 
ఆ రేయిలోని చిరు చీకట్ల చిన్నదానిలా నేను మిళితమై.. 
ఝల్లు ఝల్లు మనే గాజుల చప్పుడు, 
ఘల్లు ఘల్లు మనే అందియల చప్పుడు ఎనాటికాగునో 
మా సరసాల బావ చిలిపి చేష్టలకు..

Bobby Nani

విజయ రహస్యం ...సాధించాలనే తపన ఉంటే సరిపోదు .. దానికి ఒక దారికూడా కావాలి.. ఆ దారే గమ్యం వైపు అడుగులేయిస్తుంది.. ఇది చదివాక మీలో ఎక్కడో ఓ మూల ఓ ఆవగింజ లో అనుసంత అయినా మార్పు వస్తుందేమో చూద్దాం.. 

నేటి మన భారతదేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య నిరుద్యోగం. ఎన్ని డిగ్రీలు చదివినా ఫలితం మాత్రం శూన్యం. ఉద్యోగాలు దొరకడం లేదు. ప్రైవేట్ సంస్థలు ఇదే అదునుగా చేసుకొని సవాలక్ష నిబంధనలు పెడుతున్నాయి..... వయస్సు, లింగ భేదం, ఆఖరికి వర్చస్సు కూడా చూస్తున్నాయి.... పరిగెత్తండి, పరిగెత్తండి అంటూ తల్లితండ్రుల దగ్గరనుంచి పాఠశాల యాజమాన్యం వరకు చెప్పే మొదటి, చివరి మాట ఇదే.. ఎక్కడికి పరిగెత్తాలి ?? కొన్ని కోట్ల వీర్య కణాలలోనుంచి పరుగెత్తి, పరుగెత్తి అలసి, సొలసి ఇలా ఊపిరి పోసుకొని వచ్చాం.. ఇక చాలు.. నేటి కాలంలో కావాల్సింది పరిగెత్తడం కాదు.. గొడ్డులా పని చెయ్యడం కానే కాదు.. 

మరేంటి ?? 

ఏంటి ?? 

ఆలోచించడం .. ! 

అవును మీరు విన్నది నిజం .. 

నేను గడచిన 8 ఏళ్ళ నుంచి కనుగొన్నది కూడా ఇదే.. 

ఏంటి చమత్కారం అనుకుంటూ వున్నారా.. సరే విషయం లోకి వెళ్దాం.. 

మన దేశంలో సగటున 40 శాతం మంది యువత ప్రతీ ఏటా చదువు పూర్తి చేసుకొని నిరుద్యోగంతో జీవిస్తున్నారు.. వారిలో కొందరు కుటుంబ పోషణార్ధం వారి చదువును, ఆశయాలను పక్కన పెట్టి ఏ ఉద్యోగమైన సరే చెయ్యడానికి సిద్దం అయిపోయి చేసుకుంటూ వున్నారు... అంతెందుకు మొన్నటికి మొన్న కానిస్టేబుల్ ఉద్యోగ దరఖాస్తుకు ఇంటర్ పాస్ అయినవారు సరిపోతారు.. కాని పి.హెచ్.డి. పాస్ అయినవారు, ఎం.టెక్, చేసినవారు షుమారు 30,000 మందికి పైగా దరఖాస్తులు పంపారు.. ఇక బి.టెక్, డిగ్రీ చేసిన వాళ్ళు అయితే కోకొల్లలు.. కేవలం 4000 ఉద్యోగాలకు వేలల్లో ఇలా దరఖాస్తులు చెయ్యడం చాలా బాధాకరమైన విషయం.. ఇక ఇంటర్ వాళ్ళను ఎందుకు ఎంపిక చేస్తారు ?? అంటే వాళ్ళు అనర్హుల క్రిందే కదా లెక్క.. ఒకరి ఉద్యోగమును మరొకరు భక్షించడం (చిన పామును పేద పాము మింగడం) లాంటిది.. 

బ్యాంకు ఉద్యోగాలు అయితే చెప్పనక్కరలేదు... ఆ పేపర్ చూస్తేనే దిమ్మతిరిగి బొమ్మ కనిపిస్తుంది.. వాటిల్లో ముఖ్యంగా ఇంగ్లీష్ పేపర్ .. ఎక్కడో అమెరికాలో ఒక మ్యాగజైన్ లో ప్రింట్ అయిన ఒక టాపిక్ తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేసి వాటిల్లో 10 ప్రశ్నలు వెయ్యడం చాలా శోచనీయం... అయినా అలా ప్రిపేర్ చేసేవాళ్ళు ఏం చేస్తారు ?? పోటీ అలా వుంది.. ఐ.బి.పి.ఎస్ 8000 ఉద్యోగాలకు దాదాపుగా ముప్పై లక్షల మంది రేపు పరీక్షలు రాయబోతున్నారు అంటే మీరే ఊహించండి.. ఇంత పరుగుపందెం ఒలంపిక్ లో కూడా వుండదేమో..

ఎక్కడ చూసినా పోటి.. ఉరుకులు, పరుగులు.. ఉద్యోగం కొట్టాలనే తపన వాళ్ళను తారాస్థాయికి తీసుకువెళ్తుంది.. ఈ నేపధ్యంలో వారిలో కొందరు స్ట్రెస్ కు లోనై రాబోయే రోజుల్లో భారీమూల్యాలను చెల్లించుకోవాల్సి వస్తుంది.. మీరు పడే ఇంత స్ట్రెస్ లో ఓ పావు వంతు ఆలోచిస్తే మీ జీవితం మరోలా వుంటుంది .. 

ప్రస్తుతం మీ ఆలోచనలు గొంగళిపురుగులా మందంగా ముందుకు సాగుతున్నాయి.. ఒక గొంగళిపురుగు ఒక చెట్టు పైనుంచి మరో చెట్టు పైకి వెళ్ళాలంటే యెంత శ్రమ పడాలి, యెంత శక్తి ఖర్చు చెయ్యాలి.. అన్నిటికన్నా ముఖ్యం సమయం చాల వృధా .. సరిగ్గా ఇలాంటి పోటీలోనే కొందరు యువత ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు.. మీ గొంగళిపురుగు ఆలోచనలను రంగు, రంగుల సీతాకోకచిలుకలుగా మార్చండి ... వేగం, సమయం, శ్రమ, శక్తి ఇవన్ని మీకు ఖర్చు కాకుండానే నచ్చిన చెట్టుపైకి క్షణాల వ్యవధిలో వెళ్లి అమాంతం మకరందాన్ని యెంత కావాలంటే అంత జుర్రుకోవచ్చు.. ఇవన్ని ఏదో చెప్పాలని నేను చెప్పట్లేదు.. ఎన్నో రోజులనుంచి మీతో పంచుకోవాలని అనుకుంటూ వున్నాను.. ఇప్పటికి సమయం ఆసన్నమైంది.. దానికి కావాల్సింది మీరు స్వతహాగా ఆలోచించడం.. 

"Not Hard Work, please do smart work.. " ఈ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను.. 

ఈరోజుల్లో కావాల్సింది ఏదైనా కొత్తగా చెయ్యడం ... దానికోసం పదును పెట్టండి మీ మస్తిష్కాలకు .. మొన్నటికి మొన్న ఓ పదునెనిమిది ఏళ్ళ బాలుడు కేవలం కొబ్బరి బొండాల వ్యాపారం మీద నెలకు 40 వేలు ఆదాయం అర్జిస్తున్నాడు.. ఇదెలా సాధ్యం.. ? 

గ్రాడ్యుయేట్లు చేసిన మనం కనీసం కుటుంబ పోషణను కూడా సక్రముగా నిర్వర్తించలేక పోతున్నాం.. లోపం ఎక్కడ ? మనలోనే.. నిస్సందేహంగా మనలోనే.. 

నేను గ్రహించింది కొన్ని చెప్తున్నాను.. 

1. మనం చెయ్యాలనుకున్న పని సమయానికి ముందే చెయ్యడం.. 
2. వేగంగా చెయ్యడం.. 
3. చేసేపని వేగంతోపాటు నాణ్యతగా ఉండేలా చూడటం.. 
4. ఆ పనిలో (Honest) నిజాయితీ ముఖ్యంగా వుండటం.. 

సహనం, ఓపిక, శ్రద్ద, ఇంద్రియ నిగ్రహం, చిరునవ్వు, వాక్చాతుర్యం, బట్టల విషయంలో శ్రద్ద, ముఖ్యంగా మన (attitude) పద్దతి వక్రం గా లేకుండా చూడటం. ఇదే (success) విజయానికి బెత్తెడు దూరంలో ఉంచుతుంది.. ఆ బెత్తెడు ఎందుకంటార ...! విజయం అందుకున్నాక విశ్రాంతి కావాలనిపిస్తుంది.. అది మనకు వద్దు.. దానికి సమయం చాలానే వుంది.. ఇప్పుడు కాదు..

ఇదే నేను అవలంబించే పద్దతి.. ఇలాంటి ఆశయాలతో ఇవే ఆలోచనలతో ఎవరన్నా ఉంటే సభాముఖంగా తెలియచేస్తున్నాను.. నాకు పర్సనల్ మెసేజ్ చెయ్యండి.. అందరం కలిసి ఆరోగ్యవంతమైన చర్చ జరిపి ముఖపుస్తకానికి ఓ కొత్త నాంది పలుకుదాం.. అందరం కలిసి ఆలోచిద్దాం.. కొత్త కొత్త ఆలోచనలతో మన పని మనమే చేద్దాం.. అందరి ఆలోచనలు యెంతో అమూల్యమైనవి.. అవి అద్బుతాలు సృష్టించగలవు.. చేతులు కలపండి..

Bobby Nani 

Wednesday, October 12, 2016

ఓ నీటి చుక్క చేసిన విన్యాసం..ఓ నీటి చుక్క చేసిన విన్యాసం.. ;)


తలపై రాలిన ఓ నీటి చుక్క..
బిర బిరా జాలువారుతూ..
నుదుటి మధ్యన జారుతూ..
ముక్కు కొనల మధ్యన రాలుతూ...
చెక్కిలికి అంటిన బుగ్గ చొట్టలో చేరి..
అక్కడనుంచి మెల్లగా కదులుతూ ..
అధరములను తాకుతూ....
తేనెకన్నా మధురంగా మారుతూ ..
గవుదము కొనన..
ముత్యమల్లె ఓ మెరుపు మెరిసి..
కంఠము మీదకు చేరి....
కదులుతూ, కులుకుతూ ...
వయ్యారాలు పోతూ ...
మరింత రెట్టింపు ఉత్సాహంతో ...
ఉక్కిరిబిక్కిరి అయిపోతూ..
గంతులేస్తూ,
మెల్లిగా, మెల్లిగా,
అలసి, సొలసి,
విశాలమైన ఉదరమధ్య వృత్తములో
సేద తీరి..
దేహంలో ప్రతీ అణువణువునూ స్పృశించి .. కిందకు జాలువారి ...
పారాణి అంటిన పాద పద్మములమీద నుంచి ..
అతి వినయంతో
ధరణినిలో ఐక్యం అయిన ఆ
ముత్యపు నీటి బిందువు యొక్క ఓ విచిత్ర వింత గాధ ఇది.... :P
Bobby Nani

Saturday, October 8, 2016

నవ కుసుమంనవ కుసుమం .. 
***********
పూచిందొక నవ కుసుమం 
పుప్పోడుల సుగంధములతో.. !

మకరంద్రపు కాల్వలు కట్టి
మాధుర్యములను విరిసింది..!

కోటి కోటి నవకాంతులతో 
కోటి కోటి పూ రేకులతో..!

ఝం ఝామ్మని ఆడే తుమ్మెద బారులు తీయ్యంగా 
కమ్మంగ నాట్యములను ఆడెను..! 

ఎఱ్ఱని పూ రేకులన్ని ఎగిరి 
తరులు, గిరులను నిండి.. 
రక్తాక్షరముల వలె నింగిని 
రమ్య పంక్తులుగా ఉదయించెనుగా .. 

పండుటాకులన్నియూ రాలి 
క్రొత్త చివురులు, పచ్చదనములతో 
ప్రకృతిమాత ప్రసవ వేదన గావించి 
కానుకగా ఇచ్చెను నూతన శోభ..ఈ ధరణికి 
పచ్చి బాలింతగా మారెను ప్రకృతి మాత 

పెనుచీకటి మూసెను జగమున 
ప్రేమ మందిరముగా మారెను 
ఆకలి, అజ్ఞానము, పీడన 
అంతరించే ..! ఈ ధర నుండి.. 

ప్రసవ వేదనను భరించి కానుకగా ఈ 
మానవాళికి అర్పించిన ప్రకృతి మాత బిక్ష మనకీ అమూల్య ధరణి...

Bobby Nani

విజ్ఞాన సముపార్జననేటి అడ్డద్రోవల సమాజంలో పలువురు ఏదో ఒకటో రెండో పుస్తకాలు చదివి, ఆ ఫలానా రంగంలో నిష్టాతులు కావాలని తాపత్రయపడటం మనం చూస్తూనే వున్నాం. చివరకు ఈ ప్రయత్నం ఫలించక వారు మొత్తం విజ్ఞాన సముపార్జననే సందేహిస్తుంటారు..

అయితే విజ్ఞాన సముపార్జన కూడా బిడ్డకు జన్మనిచ్చేందుకు తల్లి తొమ్మిది నెలలపాటు మోసి ప్రయాసపడినట్లే వుంటుంది.. ఎంపిక చేసుకున్న రంగంలో దీర్ఘకాలంపాటు నిరంతర కృషి చేయకుండా ఎవ్వరికీ సత్ఫలితాలు అందవు... తొలి ప్రయత్నాలలో అపరిపక్వంగా వున్న విజ్ఞానం, దానిని ఆచరణలో పెట్టడం ద్వారా, మరింత లోతుగా అధ్యయనం చేయటం ద్వారా పరిపక్వమవుతుంది. ఈ మొత్తం ప్రక్రియకు సహనం, ఓర్పు, కృషి ఎంతో అవసరం...

అలాగే విజ్ఞాన సముపార్జన ఏక బిగిన నింగివైపు దూసుకెళ్ళే రాకెట్ వంటిది కాదు. విజ్ఞాన సముపార్జనలో ప్రతీ నూతన దశ వెనుకా దీర్ఘకాలపు, గ్లామర్ లేని నిశ్శబ్ద కృషి వుంటుంది. దీని అంతిమ ఫలితంగా విజ్ఞాన ఫలం తాలూకు పరిపక్వ ఫలాలు ఆ వ్యక్తికి అందుతాయి.. ఇది నిరంతర అధ్యయనంలో వున్న వ్యక్తి జీవితంలో వుండే రెండు దశలు .. 

వ్యక్తిలో ఈ రెండు దశలు మధ్యకాలం యెంత తక్కువగా వుంటే ఆ వ్యక్తి ఆ రంగంలో అంత శ్రమించినట్లు, లోతులకు వెళ్ళినట్లు అర్ధం.. ఈ విజ్ఞాన సముపార్జన ప్రక్రియ సరైన దారిలో సాగి, సత్ఫలితాలను ఇవ్వాలంటే వ్యక్తి తాను అధ్యయనం చేసిన దానిని, లేదా తన అనుభవం లోనికి వచ్చిన దానిని గుడ్డిగా స్వీకరించరాదు. ప్రతీ దానిని సందేహించి ప్రశ్నించడం అవసరం.. అదే నిజమైన తాత్వికుని మర్మ రహస్యం.. 

Bobby Nani

Monday, October 3, 2016

ఓ మంచి మాట...ఓ మంచి మాట... 
************

ఉదయాన మీరు బాగా ఆలస్యంగా నిద్రలేస్తారు... ఆ రోజు మీరు చెయ్యాల్సిన పనులు చాలా వుంటాయి.. అబ్బబ్బా అనుకుంటూ మీ ఆవిడను హడావిడి పరుస్తూ పనుల్ని ముగించుకొనేసరికి ఆఫీసు టైము దగ్గరపడుతుంది.. 

పడుతూ లేస్తూ బయలుదేరుతారు.. టైమును లెక్కపెట్టుకుంటూ మాటి మాటికీ వాచీని చూసుకుంటూ వెళ్తుండగా దారిలో ట్రాఫిక్ జామ్ అవుతుంది.. తిక్కతో మీ వంట్లో రక్తం జయ్ జయ్ మంటూ ప్రవహిస్తుంది.. 

ఎలాగో ఆఫీసుకు చేరుకుంటారు.. ఇంట్లో పెళ్ళానికి భయపడే చండా మార్కుడైన మీ ఆఫీసరు మీ మీద గయ్ గయ్ మని అరుస్తాడు.. కోపాన్ని దిగమింగుకుంటూ లోలోపల వాణ్ణి నానా బూతులు తిట్టుకుంటూ ఆ అరుపుల్ని భరించి ఆఖరికి వెళ్లి సీట్లో కూర్చుంటారు.. 

బోలెడంత పేరుకుపోయిన పని.. దేన్ని ముందు చెయ్యాలో తెలియని స్థితి.. సాయంత్రం దాకా ఫైళ్ళతో కుస్తీ పట్టి ఇంటికి బయలుదేరుతారు.. 

దారిపొడుగునా ట్రాఫిక్ గందరగోళం .. మీ వెనక నుంచి చెవుల్ని చిల్లులు పరిచే హారన్లు .. బండినాపి వెనుక హారను మోగించే వెర్రి నాయాల్ని ఆపి .. వాడిని కారులోనుంచి బయటకు లాగి చాచి రెండు ఇచ్చుకోవాలనిపిస్తుంది .. అయినా నిగ్రహించుకుంటారు.. 
తల పగిలే పోటుతో ఇంటికి చేరుకుంటారు.. పిల్లలు ఏదో విషయం మీద పోట్లాడుకుంటూ వుంటారు.. మీరు వాళ్ళ మీద అరుస్తారు.. భార్యదేమీ తప్పు లేకపోయినా ఆమె మీద కూడా అరుస్తారు.. 

“నన్ను కాసేపు వంటరిగా వదలండి “ అంటారు.. 

ఆ వంటరితనం లభించేసరికి మీలో పశ్చాత్తాపం మొదలవుతుంది.. భార్యా పిల్లలమీద అనవసరంగా ఎందుకు అరిచానా అని.. ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయతలో మీ మీద మీరు జాలి చెందుతారు, నిట్టూర్చుతారు ఆ క్షణాన ... 

ఇంక ఆ రాత్రి మీ కెంతకీ నిద్ర పట్టదు.. నరకప్రాయమే .. 

ఆరోజు సంఘటనలన్నీ పునర్విమర్శించుకుంటే మీ కేమనిపిస్తుంది ?? 

ఆ రోజుంతా మీరెంతో మానసిక ఒత్తిడిని అనుభవించినట్లు కదూ !!

ప్రక్కరోజు మీ పొరుగింటి పెద్ద మనిషికి గుండెపోటు వస్తుంది.. అందుకు గల కారణం ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవ్వటం అంటారు డాక్టర్ గారు.. 

వెంటనే మీరు కూడా డాక్టర్ కు చూపించుకునేందుకు వెళ్తారు.. అన్నీ పరిక్షలు చూసిన డాక్టర్ మీకు బీపి బాగా ఎక్కువగా వుందని అంటాడు.. అతిగా టెన్షన్ ఫీలవ్వకండి, మానసిక ఒత్తిళ్ళుకు దూరంగా వుండండి అని సలహా ఇస్తారు.. 

నిత్య జీవితంలో జరిగే సంఘటనలకు మీరు తట్టుకోలేక ట్రాంక్విలైజర్స్ (నిద్ర మాత్రలు) లేక తాగుడుకు అలవాటు పడతారు.. 

ఈ అన్నీ సందర్భాలలోనూ మానసిక ఒత్తిడి అనేది మీకు ఎదురౌతుంది... 

అసలు ఏమిటి ఈ మానసిక ఒత్తిడి అంటే ?? 

సమాజం ఆధునికం అవుతున్న కొద్దీ మానసిక ఒత్తిడి అనే పదం ఎందుకని ఎక్కువగా వినిపిస్తుంది.. ?? 

దీనినుంచి ఎలా బయట పడాలి .. 

స్వతహాగా అసహనంగా గొంతెమ్మ కోర్కెలతో, పోరాట మనస్తత్వంతో, దూకుడు స్వభావంతో (Aggressive) గా వుండేవారు పెద్దగా యాంబిషన్స్ లేకుండా ప్రశాంతంగా జీవనాన్ని గడిపేవాల్లకంటే తేలికగా, త్వరగా ఒత్తిడికి లోనౌతూవుంటారు. . అలాగే మీకు ఇష్టంలేని తరహా జీవనాన్ని గడపాల్సి వచ్చినప్పుడు మీ మీద ఒత్తిడి దాడిచేస్తుంది.. జీవితంలో జరిగే దుర్ఘటనలు, సంక్షోభాలు, విడాకులు, ఆత్మీయులు చనిపోవడం లేదా విడిపోవడం, పరీక్షలు, ఆర్ధిక సమస్యలు, కుటుంబకలహాలు ఇవన్నీ మనల్ని అత్యంత ఒత్తిడి లోనికి నెట్టి నలిపేస్తాయి.. 

నేటి ఆధునిక జీవితంలో అనివార్యంగా ఎదుర్కొనే భయాలు, అనిశ్చిత స్థితి (Uncertainty), జనసాంద్రత, శబ్ద కాలుష్యం లాంటివి తెచ్చే వొత్తిల్లు చాపకింద నీరులా మనకు తెలియని అపకారాన్ని కలుగజేస్తున్నాయి... 

మనం తీసుకొనే ఆహారంలో కూడా రసాయనాలు మనకు తెలియకుండానే మనకు చికాకును పెంచి వొత్తిడిని కలిగిస్తున్నాయి.. 

కాఫీ, టీ, కోలాలలో వుండే కెఫీన్, సిగరెట్లలో నికోటిన్, వగైరాలు తాత్కాలికంగా మన మనస్సును ఉపశమింపజేసినట్లు అనిపించినా దీర్ఘకాలం మీద మనకు అవి అపకారాన్నే కలిగిస్తాయి.. తట్టుకోలేని స్థితికి తీసుకు వెళ్తాయి.. అందుకే మానసిక ఒత్తిడిని ఆరోగ్యకరమైనది, అనారోగ్యకరమైనది అంటూ విభజించుతారు .. దయచేసి ప్రకృతికి దగ్గరగా వుండండి .. . దొరికిన కాస్తసమయాన్ని కుటుంబం తో గడపండి.. అందరూ కలిసి ఔటింగ్ కి వెళ్ళండి.. సంతోషంగా గడపండి.. సాధ్యమైనంతవరకు ఒత్తిడిని దూరం చెయ్యండి.. 

మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. 
ఆలోచించండి.. 
ఆచరించండి.. 

స్వస్తి.. __/\__

Bobby Nani

Sunday, October 2, 2016

నేటి ప్రజాస్వామ్యం ..రోడ్డు మీద ఒక పక్కన ఒక చిన్న మామిడి చెట్టు పెరుగుతూ వుంది... అందరూ దాన్ని మామిడి చెట్టు అని తెలుసుకోకుండానే, పట్టించుకోకుండానే దాన్ని పక్కనే నడుస్తూ తిరుగుతూ వున్నారు... మురికి నీరు పోసేవారు, వ్యర్ధ పదార్ధాలను వేసే వారు వాళ్ళపని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు... తీగలకు అడ్డుగా వుందని సగంచెట్టు నరికే వారు కొందరు.... ఇలా రక రకాలుగా ఆ చెట్టు ఎన్నో బాధలను అనుభవిస్తూ, సహిస్తూ వస్తున్నది .. కాని ఎవ్వరూ తనని గుర్తించట్లేదని బాదపడుతూ వుంది... ఇంతలో ఆ చెట్టు కొంచం వయసుకు వచ్చింది దానికి తోడు వేసవి కాలం వస్తుండడంతో కొద్ది కొద్దిగా పూత రావటం మొదలుపెట్టింది... అతితక్కువ వ్యవధిలోనే పిందెలు వచ్చి అవి పెరుగుతున్నాయి... ఆ చెట్టు చాలా సంతోషంగా వుంది... మొదటిసారిగా తను కాపుకు వచ్చింది కాబట్టి... మామిడి కాయలు కొద్దిగా పెరిగి గుత్తులు గుత్తులుగా చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి ... ఒకరోజు ఉదయాన్నే లేత సూర్యుని కిరణాలు వెలుగులు ఆ మామిడి కాయల మీద పడి మిరుమిట్లు గొలుపుతూ వుండగా అటువైపు వెళ్తున్న కొందరి ఆకతాయుల కళ్ళు ఆ చెట్టుమీద పడ్డాయి... 

ఇంకేముంది ఇల్లు పీకి పందిర వేసినట్లు పిందే, కాయా అనే బేధాలు లేకుండా అన్నీ కోసి పారేసారు... అది చూసి అక్కడే నివాసం ఉంటున్న ఒక పెద్దాయన వాళ్ళను తిట్టి తరిమేసాడు... తరువాత ఆ పెద్దాయన ఒక దోటి తీసుకువచ్చి కొన్ని కాయలు కోసుకుపోయాడు... అలా ఎంతోమంది ఒక్క కాయని కూడా పండనీయ కుండా ఒకరి తరువాత ఒకరు లా వచ్చి మొత్తం కాయలను కోసుకుపోయారు... ఇప్పుడు ఆ చెట్టు నా పరిస్థితి ఇంతకుముందే బాగుంది అని అనుకుంటుంది.... 

ఇదంతా విన్న తరువాత మీకు ఒక విషయం అర్ధం అయ్యి వుంటుంది.. ఇక్కడ చెట్టుగా చెప్పబడినది ఆంధ్రా ప్రజలు, మనుషులుగా చెప్పబడినవారు ప్రస్తుతకేంద్రం, మామిడి కాయలుగా చెప్పబడినవి మనకు మంజూరు కాబడే నిధులు.... ఎలక్షన్ల ముందువరకు ప్రగల్భాలు పలికినవారు ప్రస్తుతం మౌనంవహిస్తున్నారు.. ఆమౌనాన్ని చెరపాలంటే ప్రజలే పెదవులు విప్పాలి.. ఇంటికి ఒక్కడు చొప్పున కదిలితే పనైపోతుంది.. 

ఇది ఒక్కరిమీద చెప్పబడింది కానే కాదు... ప్రస్తుతం మన ప్రజాస్వామ్యంలో జరిగినా, జరుగుతున్న, పరిస్థితులు...

Bobby Nani

ఈ నిత్య, నూతన వధూవరులను ఆశీర్వదించగన్ ...మల్లెలు విరబూసిన సొగసే నీది...
సన్నజాజి సంధ్య వెలుగుల సౌందర్యమే నీది...
సంపెంగెల వలపుల సోయగమే నీది...
ఆ యెర్రని మందారపు అధరముల చిరుమంద హాసముతో ..
పారిజాతపు పరిమళ పరువాల పారవశ్యముతో ...
పచ్చని తోరణాల మధ్యన, పసుపు వస్త్రములతో..
పెండ్లి పీటలపై ...
కనకాంబరాల కన్య జ్ఞాన నేత్రాన ..
పసిడి తలంబ్రాల తన్మయత్మంతో ...
సింధూరపు సిగ్గులోలకంగా ...
మంగళకరమైన మాంగల్యం నీ
మనోరంజిత కంఠముపై మెరవంగ ...
చూచెడి జనుల నేత్రములకు అందారవిందం గావించగా ...
మెరిసే ఆకాశపు తారలనక్షింతలుగా మలచి ...
ఈ నిత్య, నూతన వధూవరులను ఆశీర్వదించగన్ ...

Bobby Nani