Monday, February 27, 2017

మన సింహపురి (నెల్లూరు)


చాలామంది మిత్రుల కోరిక మేరకు ఇలా రాయాల్సి వచ్చింది.. 
నాకు ప్రాంతాభిమానం కాని, కులాభిమానం కాని, మతాభిమానం కాని లేవు.. నేను మనిషినే నమ్ముతాను, మనిషిలోని అద్బుతమైన శక్తినే నమ్ముతాను.... 
కాని ప్రతీ రచయిత తమ పుట్టిన ఊరి గురించి, ఆ ఊరి ప్రాముఖ్యత గురించి రాస్తున్నారు .. ఈ ముఖపుస్తకంలో టపాల రూపంలో పెడుతున్నారు.. అలా మీరు కూడా మన నెల్లూరు గురించి రాయండి అనే కొందరి మిత్రుల ఆవేదన, వాంఛ మేరకు నేను పుట్టి పెరిగిన “విక్రమ సింహపురి” (నెల్లూరు) నగర విశిష్టతను, ప్రాముఖ్యతను, వైభోగాలను ఉద్దేశించి రాయసంకల్పించాను... 

మన సింహపురి (నెల్లూరు)
********************

విశాలాంధ్రమునకు ఈ నెల్లూరు గుండెకాయ వంటిది అనడంలో అతిశయోక్తి లేదు... విజ్ఞాన నిధులకు పుట్టినిల్లు, విద్యావేత్తలకు నిత్య నివాసము, కవితా నిధులకు జన్మస్థానము, కళోపాసకులకు మధుర నిలయము ఈ నెల్లూరు... 

తన దివ్యమైన లేఖినితో, తన మధురమైన భావములతో సానబెట్టి వజ్రములవంటి పడజాలముతో మెఱుగుబెట్టిన రత్నములవంటి పాదములతో మహాజ్యోతులవలె వెలుగొందు మానిక్యములవంటి పద్యములతో భారతమును రచించిన “మహాకవి తిక్కన” ఈ పినాకినీ (పెన్నా) తీర పరిసర ప్రాంగణము లందే వెలసెను గదా .. !!!

“తింటే గారెలే తినవలెను – వింటే భారతమునే వినవలెను” 

అన్న నానుడి పుట్టినది ఈ సింహపురమునందే... కవి తిక్కనకు జన్మస్థానము, ఖడ్గతిక్కనకు నివాసస్థానము కనుకనే కవి కోకిలను ప్రసాదించిన దీ నెల్లూరు పట్టణము... 

“కవి కోకిల దువ్వురి” కలములో కోటి కోకిలలు కాపురము చేసినవి. ఆ మహాకవి కుహరమునుండి లక్షల భావనా స్రవంతులు పెన్నలై ప్రవహించినది ఇక్కడే... సారస్వత నందనములో కొంగ్రొత్త సుమ వల్లరులను నాటి మధుర భావనామృతములు పోసి కంటికి రెప్పవలె కాపాడి పెంచి పెద్ద చేసిన మహానుభావుడతను. అందుకే ఆ మహాకవికి నిఖిలాంద్ర జగత్తు నివాళు లోసగినది. కవి లోకమునకు జేజేలు చెప్పినది. పండిత ప్రపంచము జోహార్లు సమర్పించినది.

అంతేకాదు.. ముస్లిం తెలుగు కవుల్లో ఆణిముత్యం “దావూదు కవి” ఆయన అన్న మాటలు “మట్టిని చదవని వాడు మనిషి కాలేడు – మనిషిని చదవనివాడు కవి కాలేడు” మనిషినీ, మనిషి జీవితంలో ఎగుడుదిగుళ్ళని ఆసాంతం చదివి కవిత్వం రాసినవాడు “షేక్ దావూదు” గారు... ఛందోబద్దు పద్య కవిత్వం పట్ల దావూదు కవికి వున్న ఆరాధన చివరిశ్వాస వరకు కొనసాగింది.. వైవిధ్యం, సరళమైన శైలి, పదబంధాల సమవేతంతో పదునైన పద్య రచనలో ఆయనది ఏడు నిలువులెత్తు ఎదిగిన వ్యక్తిత్వం... 

“దాసిపన్నా” దావూదు కవి గారి సాంప్రదాయక ఖండకావ్యం. అలాంటి భావ గాంభీర్య రచనా పటుత్వం గల రచనల కారణంగానే ఆయన విశ్వనాధ సత్యనారాయణ, దివాకర్ల వేంకటావధాని, పుట్టపర్తి, విద్వాన్ విశ్వం, జాషువా, తుమ్మల సీతారామ చౌదరి లాంటి ప్రఖ్యాత కవుల సరసన నిలవగలిగాడు... 

“నెల్లూరు నెఱజాణ” అనే పదాన్ని శృంగార కవి “శ్రీనాధుడు” సృష్టించారని ప్రతీతి .. నెల్లూరు జిల్లాలోని కృష్ణ పట్నం గ్రామంలో సిద్ధేశ్వర శివాలయంలో శృంగార కవి శ్రీనాధుడు నివసించినట్లు దేవాలయం కుడ్యంపై ఉన్న ఆయన చాటు పద్యాలు చెబుతున్నాయి... ఓ సారి పెన్నా తీరాన వద్ద ఆయన కూర్చొని ఉన్నప్పుడు నెల్లూరు వనితలు చంకన మట్టి కుండలతో నయగారాలు చిలికే నడుము మడతలతో, ఊయలలా ఊగుతున్న కటీరములతో నడుస్తున్న కొందరు స్త్రీ లను జూచి “ఔరా” ఏమి ఈ వనితల సౌందర్య రహస్యములు అని అనుకుంటూ వారిని అలానే చూస్తూ నిలబడ్డాడట .. వారి కళ్ళల్లో “నెఱ” అంటే నేర్పరి తనం తొణికిసలాడుతూ కనిపించిందంట.. అంతే కాదు గడుసుతనం, సొగసుతనం, పొగరు, వగరు, మూతి విరుపుల్లు, చంప చెల్లుమనిపించే ముక్కుసూటి తనం, కళ్ళల్లో కామరసం చిలికించే వారి కనుచూపులు, మాటలు ఆయన్ని అమితంగా ఆకట్టుకున్నాయట అందుకే “జాణ” అని కలిపి “నెల్లూరు నెఱజాణ” అని పిలిచారంట .. “జాణ” అంటే చాలా అర్ధాలు వస్తాయి.. కళ్ళలో కామరసం స్రవించే దానా అని కొందరు అంటారు.. మరికొందరేమో సంభోగించే స్త్రీ అని అంటారు.. ఆయన ఏ ఉద్దేశంతో అనినా ఆ మాట నిలిచిపోయింది... 

ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావులు తిక్కన సోమయాజి, భగవాన్ వెంకయ్య స్వామి, శ్రీ పొట్టి శ్రీరాములు, పాలూరి శంకర నారాయణ, ఆచార్య, ఆత్రేయ, తిక్కవరపు వెంకటరమణారెడ్డి, దువ్వూరి రామిరెడ్డి, వై.వి.రావు, వెన్నెలకంటి రాఘవయ్య, విద్వాన్ కణ్వశ్రీ, బెజవాడ గోపాల రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, దొడ్ల సుబ్బారెడ్డి, ఆనం చెంచు సుబ్బారెడ్డి, ఇంగువ కార్తికేయ శర్మ, పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి, ఎం.ఎస్.రెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, మల్లి మస్తాన్ బాబు, నాకు తెలిసిన ప్రముఖుల మహానుభావుల పేర్లు ఇవి.. ఇంకెవరినైనా ఉదహరించకుంటే క్షంతవ్యుడను... 

ఆధ్యాత్మిక ప్రదేశాలకూ కొదవలేని మన సింహపురిలో శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి దేవాలయము, శ్రీ గాయత్రీ దేవి విశ్వకర్మా దేవాలయం, జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షీ దేవి ఆలయం, వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, గొలగమూడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి దేవాలయము, మూలస్థానేశ్వర దేవాలయం (శివాలయం) వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు కొలువై భక్తులపాలిట కొంగుబంగారమై విరాజిల్లుచున్నవి.. 

ఆహ్లాదాన్ని కలిగించే ప్రదేశాలలో ముఖ్య పాత్ర వహించేవి, యాత్రికులను ఆకట్టుకునేవి నేలపట్టు పక్షుల సంరక్షణా కేంద్రం, పులికాట్ సరస్సు, తడ వాటర్ ఫాల్స్(ఉబ్బలమడుగు ఫాల్స్), ఉదయగిరి కోట, వెంకటగిరి రాజావారి సంస్థానం, షార్ ( సతీష్ ధావన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ), కృష్ణపట్నం పోర్టు, సోమశిల డ్యామ్, కండలేరు డ్యామ్ లు గా నెల్లూరీయులను, దేశ విదేశాల యాత్రికులను అలరిస్తూ ముచ్చటగోల్పుచున్నవి .. 

ముఖ్యమైన సముద్ర తీరాలుగా కొత్త కోడూరు, మైపాడు, ముత్తుకూరు అని చెప్పుకోవచ్చు.. సెలవు దినములలో ఇక్కడ సందడి అంతాఇంతా కాదు.. 

నెల్లూరు జిల్లాకు ఎన్నో శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉంది. అంతే కాదు నెల్లూరు జిల్లా నాగరికతకు పుట్టినిల్లు... నెల్లూరు ప్రాంతాన్ని ఎన్నో వంశాలు పాలించాయి. మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, తెలుగు చోళులు, పాండ్యులు ఏలారు. ఆ తర్వాత గజపతులు, విజయనగర రాజులు, మహమ్మదీయులు, గోల్కొండ సుల్తానులు, ఆర్కాటు నవాబుల ఆధీనంలోనూ కొన్నిరోజులు కొనసాగింది. కాలక్రమేణ డచ్‌లు, ఆంగ్లేయుల పాలన కిందకు వచ్చింది. జిల్లాలో స్వాతంత్య్ర ఉద్యమానికి వూపిరి పోసిన వారిలో శ్రీ పొట్టిశ్రీరాములు, ఓరుగంటి వెంకటసుబ్బయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, రేబాల లక్ష్మీనరసారెడ్డి, డాక్డర్‌ బెజవాడ గోపాలరెడ్డి, వెన్నెలకంటి రాఘవయ్య, పొణకా కనకమ్మ తదితరులు ఉన్నారు.

వరి విస్తారంగా పండే ప్రాంతం కావడంతో నెల్లూరుగా పేరు వచ్చిందని ప్రతీతి. ఇది తమిళనామం. ఆ భాషలో ‘నెల్లు’ అంటే వరి అని అర్థం. అలా నెల్లు+వూరు... క్రమేపీ నెల్లూరుగా వాడుకలోకి వచ్చిందంటారు. పచ్చని పొలాలతో ప్రశాంతమైన ప్రాంతం కావడం వల్ల నల్ల+వూరు (మంచి వూరు) క్రమేపీ నెల్లూరుగా మారిందన్న వాదనా ఉంది. అంతే కాదు నెల్లి అంటే ఉసిరిక అని అర్ధం.. ఇక్కడ ఎక్కడ చూసినా నెల్లి చెట్లు అధికంగా కనిపించేవని అందుకే నెల్లి + ఊరు .. క్రమేపి నెల్లూరు గా మార్పు చెందినదన్న వాదనా లేకపోలేదు.. 


ఇకపోతే సింహపురి ఎలా వచ్చిందన్న వాదన ఒకప్పుడు నెల్లూరు దండకారణ్యంలో ఉందని చరిత్ర చెబుతోంది. దండకారణ్యంలో ఎక్కువగా సింహాలు సంచరిస్తూ ఉండేవి. నిద్రించే ఏనుగులకు సింహాలు కలల్లోకి వచ్చేవి, వాటికి భయపడే ఆ ఏనుగులు నిద్రలోనే మరణించేవనికథనం. అందువల్లే ఈ ప్రాంతాఁకి సింహపురి అనే పేరు వచ్చిందనే నానుడి ఉంది. ఒకప్పటి విక్రమ సింహపురి రాజ్యమే ఇప్పటి నెల్లూరు. 13వ శతాబ్దం వరకు మౌర్యుల చేత పాలింపబడి, ఆంధ్రప్రదేశ్‌లోనే ఆరవ అతిపెద్ద నగరంగా ప్రసిద్ధి చెంది, ఆధ్యాత్మిక చరిత్రతో పాటు ఆహ్లాదానికీ, ఎన్నో అద్భుతాలకు కొలువై ఉన్నది మన నెల్లూరు.. 


సముద్రతీరం అంచున ఉండటం చేత ఇక్కడ చేపలకు కొదవే లేదు.. నెల్లూరు వాళ్ళు చేపల పులుసును వండటంలో సుప్రసిద్దులు... నిజానికి నేను చేపలను తినను.. ఎవ్వరిని అడిగినా ఇదేమాట చెప్తారు... అంతే మా మలైఖాజా నెల్లూరులో ముఖ్య పాత్ర వహిస్తుంది... ఏ శుభకార్యాలలో అయినా సరే ఇది దర్శనమివ్వాల్సిందే .. ఎన్ని తిన్నా ఎవిటెక్కని రుచి దానిది... అబ్బా తలుచుకుంటేనే నాకు లాలాజలం స్రవిస్తోంది.. యెంత గొప్పగా ఉంటుందో దీని రుచి .. నోట్లో అలా వేసుకోగానే వెన్నపూసలా మెత్తగా చక్కర పాకం నోటినిండా వచ్చేసి మధ్య మధ్యలో చక్కర పోలుకులు నాలుకకు తగులుతూ చిన నాలుకమీదనుంచి గొంతు ద్వారము మొదలు ఉదరములో పడేదాకా దాని రుచి నాభిదాకా మధురంగా ఉంటుంది... అంతే కాదు చిన్నపిల్లలకు విరోచనాలకు ఇది సంజీవని లాంటిది... 

ఇలా ఎన్ని చెప్పినా ఇంకా మిగిలే ఉంటాయి మా నెల్లూరు, నెల్లూరోల్ల ముచ్చట్లు ... 
ఎకసేకలు పడటంలో మాకు మేమే సాటండోయ్ ... 
మాటకు, మాట, దెబ్బకు దెబ్బ ఇదేనండి మాకు తెలిసింది.. 
చాలా సహన పరులమండోయ్ .. 
తేడా వస్తే మాత్రం తాట తీసేదాకా వదలం... 
తియ్యని పెన్నా నీరు తాగేటోల్లం .. 
ముక్కుసూటిగా వ్యవహరించేటోల్లం ... 
ఇటు తమిళము, అటు తెలుగును మిక్స్ చేసి సరిక్రొత్త యాసతో మాట్లాడే మేధావులం ... 
మా ఆడపడుచులు చూడటానికి అందంగా ఉండే మల్లె తీగలండి .. 
ఎదవేషాలు ఏస్తే మాత్రం దూల తీరిపోగలదండి .. 
ఆ తీగలే మెడకు చుట్టుకునే యమపాశాలౌతాయి.. 
ఎవడి పనుల్లో ఆడుంటాడండి .. సమస్య వస్తే మాత్రం సమిష్టైపోతారండి... 
అదేనండి నాకు ఆల్లలో నచ్చేది.. ఎంతైనా నెల్లూరోల్లం కదండీ... 
కళలకు, క్రీడలకు ముఖ్యస్థానం కల్పిస్తామండి .. 
ప్రతీ రంగంలోనూ పోటీపడతామండి .. గెలిచినా, ఓడినా నెల్లూరోల్లమండోయ్ .. !!
కావలసిన వారికోసం ఎన్ని మెట్లు అయినా దిగేస్తామండి .. 
ఎందుకంటె మాకు కావాల్సింది ప్రేమా, ఆప్యాయతలే అండి.. వాటికే ప్రాధాన్యత ఇస్తామండి .. 
అందుకేనండి నెల్లూరోల్లం అయ్యాం.. విలువతెలియని వారి దగ్గర నలిగిపోతున్నాం.. 
కూసంత ప్రేమ చూపెడితే చివరి శ్వాస వరకు గుర్తుంచుకుంటామండి.. 
తర తరాల శత్రువు ఇంటికొచ్చినా అన్నం పెట్టి పంపే గుణమండి.. 
అందుకేనండి నెల్లూరోల్లం అయ్యాం.. 
నింగికి సగర్వంగా ఎగరేసిన నేల మాదండి.. పసిపిల్లల
అర్ధాకలి పేద బ్రతుకులు కూడా మావేనండి.. 
రోజుకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టగలిగే ధనికులున్నారండి .. 
రిక్షా లాగి నూరు రూపాయలతో కడుపునింపుకునే కుటుంబాలూ వున్నాయండి.. 
ఆత్మాభిమానాన్ని చంపుకునే బదులు ప్రాణాన్ని సమర్పించే మా చెడ్డ నెల్లూరోల్లం అండి.. 
తల తెగిపడినా, చేతులు నరికినా, కాళ్ళు విరిగి పడినా లెక్కచెయ్యక, 
నడుముతో ముందుకు నడిచే పౌరుషం కల విక్రమ సింహపురులమండి .. 
రచ్చబండ కబుర్లు, గణపతి నిమజ్జన డ్యాన్సులు మా బాగుంటాయండి.. 
తిండి ఉన్నా లేకున్నా వినోదం మాత్రం ఉండాలండి మా నెల్లూరోల్లకు .. 
అందుకే చిన్నా, పెద్ద తారతమ్య భేదాలు లేకుండా అన్నీ సిన్మాలను ఆదరిస్తాం.. 
ఎంతైనా నెల్లూరోల్లం కదండీ.. మేమంతేనండి.. !!!!

Written by : Bobby Nani

Friday, February 24, 2017

SOCOTRA (The Mysterious Island) from Bobby... 13th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...

ఆమె ఒక్కసారిగా కోపంతో.. ఇప్పటికే నా వ్యక్తిగతాన్ని మీకు చాలా చెప్పేశాను ఇక చెప్పాల్సిన అవసరం నాకు లేదు.. అసలు మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి ?? అని ఆమె కసురుకోగా.. 

తన జేబులో వున్న మ్యాప్ ని తీసి ఆకాష్ తనకు చూపిస్తాడు.. ఆ దీవిలో జరుగుతున్న పరిణామాలను .. తను చూసిన ఆ విచిత్ర మనుషులను ఆమెకు వివరిస్తాడు.. 
ఆమె భయంతో నాకు కూడా అలాంటి గతే పడుతుందా ?? అంటూ అడుగుతుంది.. లేదు నీకు అలా ఏమి జరగదు మేము నీకు తోడుగా వుంటాం.. దయచేసి నీ గురించి మొత్తం మాకు చెప్పు .. సమస్యను ఎదుర్కోవడానికి మనం పరిష్కారాన్ని కనుగొనవచ్చు.. అని అంటాడు ఆకాష్..

ఇంతకీ ఆమె వారికి చెప్తుందా తన గురించి... తెలుసుకుందాం పదండి..
13th Part
ఇవన్ని నీకు ఎలా తెలుసు ?? అని అడిగాను.. సరే అయితే .. ముందు మీరు ఇద్దరూ నేను ఇప్పుడు చెప్పబోయే విషయాల్ని ఎవ్వరితోనూ చెప్పరని నాకు మాట ఇవ్వండి అని అడుగుతుంది.. 

తప్పకుండా అంటూ ఇద్దరూ మాట ఇస్తారు.. 

మా గ్రామాన్ని వదిలి మేము ఎప్పుడో వెళ్ళిపోయి ఉండొచ్చు .. కాని అలా చెయ్యలేము.. ఎందుకంటె ఆ గ్రామంలో మా తర తరాల నుంచి ఓ రహస్య కొలను ఉంది .. దాన్ని బయట వారికి తెలియకుండా కాపాడుకుంటూ వస్తున్నాము.. దానిపేరు “చంద్రిక కొలను” అందరికీ సహజంగానే కనపడే కొలను అది.. కాని పున్నమి రోజు నడి రేయిన మాత్రం ఆ కొలనును చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు.. ఎన్నో తరాల నుంచి మేము త్రాగే నీటి వనరు అదే... ఎప్పుడూ ఎండదు.. చుట్టుపక్కల ఎక్కడ గుంటలు త్రవ్వినా ఉప్పునీరే పడుతుంది అందుకే అందరం ఎన్నో శతాబ్దాలనుంచి ఆ కొలనునే నమ్ముకొని ఉన్నాము.. 


“చంద్రిక” అంటే వెన్నెల వెలుగు అని అర్ధం… సంపూర్ణమైన వెన్నెల వెలుగు ఆ కొలనుపై పడగానే నీలం రంగు గా ఆ కొలను మారిపోతుంది.. అందులో ప్రకాశవంతమైన వెలుగులు విరజిమ్ముతాయి.. నీలాకాశం నేల మీదకు వచ్చిందేమో అన్నంత సుందరంగా ఉంటుంది ఆ కొలను… అడవి మధ్యభాగంలో వుండటం చేత ఆ కాంతులు పరులు ఎవ్వరూ చూడకుండా చుట్టూరా దట్టమైన చెట్లు కాపు కాస్తున్నాయి.. అందుకే అది అంత రహస్యంగా ఈ నాటికీ వుంది.. 

నా చిన్నతనంలో నేను ఆ కొలను దగ్గరే ఎక్కువ గడిపేదాన్ని ఆ కొలను చుట్టూ ఎక్కడా లేనన్ని రకరకాల, రంగురంగుల పూలమొక్కలు, మల్లెలు, మాలతి, మధు మాలతి, రాదామనోహరి, జాజి, మొదలైన పూ పొదలు, నేరేడు, మారేడు, మోదుగ, వెలగ, ఇలా నానావిధ ఫల, పుష్ప, వృక్షాదులు ఉండేవి.. అంతే కాకుండా “చంద్రిక కొలను” పై, మొదటి రవి కిరణం పడి అందులోనుండి వివిధ వర్ణాలను కళ్ళకు కనిపిస్తూ కనువిందుచేస్తుంది... అడవిలో అదో అందమైన దృశ్యం.. రోజు ప్రాతఃకాల వెలుగులలో ఆ “చంద్రిక కొలను” చుట్టూ వున్న ప్రకృతి మాత కౌగిలి యెంతో శోభాయమానంగా, స్వర్గతుల్యంగా, ఎప్పుడూ నూతనత్వంగానే కనిపిస్తుంది నాకు.. అందుకే నా బాల్యం అంతా నేను అక్కడే గడిపేశాను… 

చుట్టూ పక్కల ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్ల గుబుర్లలో చిలుకలు, పావురాళ్ళు, గువ్వలు, గోరింకలు, చకోరలు, మొదలైన పక్షులు నివాసముంటూ .. తొలిసంధ్య కిరణాలను చూసి ఆనందంతో మనసారా పాడుకుంటూ ఆహార వేట కోసం స్వేచ్చగా విహరిస్తుంటాయి... ఆ పక్షుల స్వరగానం నన్ను ఎంతగానో అలరిస్తుంది.. ఆ పారవశ్యపు సంగీత నాదాన్ని వింటూ నా సుఖ, దుఃఖ, బాధలను మర్చిపోయేదాన్ని.. 


అలా ఎప్పటిలానే నేను ఆ కొలను దగ్గర ఆడుకుంటున్న సమయంలో ఓ వానర సమూహం నాపై హటాత్తుగా దాడి చేసింది.. భయంతో కేకలు పెడుతూ అడవిలోకి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాను.. అవి చాలా దూరం నన్ను వెంబడించాయి .. అలా భయంతో పరుగెడుతూ పరుగెడుతూ ఓ కొండ మొదలు భాగానికి చేరుకున్నాను.. అప్పటికే సమయం సంధ్యాస్తమయం కావస్తోంది.. తిరిగి వెళ్ళే దారి తెలియదు.. భయంతో వణుకుతూ అలానే ఆ కొండ మొదలు భాగంలో చేతులు, కాళ్ళు ముడుచుకొని ఓ రాయిని ఆనుకొని కూర్చుని వున్నాను.. దూరంనుంచి ఒక చిన్న పాప స్వరం నాకు వినిపించి, వినిపించనట్లుగా వినపడుతోంది… ఈ దట్టమైన అడవిలో ఎవరిదాస్వరం అని అనుకుంటూ ఆలోచిస్తుండగా… 

దూరాన వున్న సముద్రపు కెరటాల గంభీర్యం నన్ను మరింత భయపెడుతున్నాయి.. అవి ఎలా ఉన్నాయంటే .. కోపంగా చూస్తున్న సముద్రుని ఊపిరి ఉచ్వాస, నిచ్వాసలా ఉంది … కెరటాలు ఆకాశమంత ఎత్తు ఎగసి విరిగి పడుతున్న చప్పుడు. విలయ తాండవమాడుతున్న సముద్ర రౌద్ర సౌందర్యం నా చెవులకు స్పష్టంగా వినిపిస్తోంది.. దట్టమైన మబ్బులు ఆకాశాన్ని కబలిస్తున్నట్లుగా పై పైకి ఎగబాకుతున్నాయి .. వర్షపు తుంపరులు మంచు ముత్యాలవలె నింగినుంచి జల జల మని రాలుతూ ఉన్నాయి … ఆ తుంపరులు అప్పుడప్పుడూ ఒక క్షణం తెరిపిస్తూ మరో క్షణం మైమరపిస్తూ, ఇంకో క్షణం నన్ను తడిపేస్తూ రాలుతున్నాయి.. 


ఇంతలోనే ఆకాశం కదిలిపోయేలా ఓ మెరుపు, దాని వెనుకగా ఒక ఉరుము, గుండె ఝల్లుమని ఆగినంత పనైంది.. గాలి ఏం వూగినా అన్నీ ఊగుతున్నాయి.. సుడులు చుట్టుకుంటూ రింగులు రింగులుగా అంతా స్పష్టంగా నాకు వినిపిస్తూనే వుంది, కళ్ళకి కట్టినట్టు. సరుగుడు చెట్ల కొమ్మలు విరిగి పడుతున్న చప్పుళ్ళు. కొబ్బరిమట్ట గాల్లో తేలుకుంటూ నేల మీద ధబ్బున పడ్డ చప్పుల్లు .. అన్నీ క్షణాల్లో చక చకా జరిగిపోతున్నాయి.. వర్షం చిన్నగా మొదలౌతుండగా … ఇందాక వినిపించిన పసిపాప స్వరం మల్లి వినిపించింది.. ఉలిక్కిపడి లేచి అయ్యో పసిపాప ఏమన్నా నా లానే తప్పిపోయి ఇక్కడకు వచ్చి ఉంటుందేమో అని అనుకుంటూ ఆ స్వరం ఎక్కడ నుంచి వస్తుందో వెతక సాగాను.. .

సముద్రం వైపుగా వినిపిస్తుంది ఆ స్వరం… లేచి గబగబా పరుగులు తీశాను.. నిజంగానే అక్కడ ఒక చిన్న పాప బోర్లా పడి ఉంది… దగ్గరకు వెళ్లి చూస్తే … ఆ పాప కాలికి గాయం తగిలి రక్తం కారుతోంది.. 

నా రెండూ చేతులతో ఎత్తుకొని… తనని ఓదారుస్తూ ఏం కాదు.. ఏం కాదు అని ధైర్యం చెప్తూ తీసుకెళ్తుండగా … 

ఒక విషపు చేప నన్ను గాయపరిచింది… కొన్ని క్షణాల్లో ఆ విషం నాపై ప్రభావం చూపుతుంది అని చెప్పి.. 

వర్షం వచ్చేలా ఉంది.. !

నేను వర్షంలో తడవకూడదు .. 

దయచేసి నన్ను వర్షం తగలని ప్రదేశానికి తీసుకువెల్తావా అక్కా.. అని అడిగి స్పృహకోల్పోయింది.. 


ఆ సమయంలో ఆ పాప అడిగిన మాటలు నన్నో తల్లిగా మార్చి… నా హృదయంలో తీరని ఆవేదనాలజడులను సృష్టించాయి.. కన్నెనైన నేను ఆ క్షణంలో ఓ తల్లిగా మారిపోయాను… 

తనెవరో నాకు తెలియదు.. 

తనని మా ప్రాంతంలో ఎప్పుడూ చూడలేదు.. 

చాలా అందంగా బొద్దుగా ఉంది.. షుమారు ఓ 6 ఏళ్ళు ఉండొచ్చు… 

ఈ పాప ఇక్కడకు ఎలా వచ్చింది ? ఇలా ఎన్నో ప్రశ్నలు నాలో.. 

ఒకవేళ సముద్రపు దొంగలు ఈ పాపను ఎక్కడనుంచో తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెల్లిపోయారా ?? 

సరే ఇవన్నీ కాదు ముందు ఆ పాపను ఎలా కాపాడాలి ? అనుకుంటూ ఉండగా .. 

నా చిన్నతనాన నా పెదనాన్న గారు చెప్పిన విరుగుడు మొక్కల వైద్యం ఒకటి నాకు జ్ఞాపకం వచ్చింది.. ఆ మొక్కల పసురు తీసి గడియ గడియకు ఓ సారి తాగిస్తే ఎలాంటి విషం అయినా విరుగుడు అవుతుంది.. పాపను కొండకు దిగువ భాగాన వున్న ఓ పెద్ద రాతికింద పడుకోబెట్టి ఇక ఆ మొక్కలకోసం వెతకనారంభించాను… 

అప్పుడే టప టప మని మాడు పగిలేంత పెద్ద పెద్ద చినుకులతో వర్షం మొదలైంది.. దానికి తోడు గాలికూడా తయారయ్యింది.. ఆ గాలి వానలో నేను మాత్రం చాలాసేపటి నుంచి మొక్కలకోసం వెతుకుతూనే వున్నాను.. 

ఓ మంచి పని చేస్తున్నప్పుడు పరీక్ష ఎదురౌతుందంటే ఏమో అనుకున్నాను.. స్వయంగా ఇప్పుడు చూస్తున్నాను.. 

వర్షానికి నేల మీద వున్న సన్నని రాళ్ళు ముల్లుల్లా నా కాళ్ళను కోసేస్తున్నాయి.. 

వర్షపు చినుకులు నా నేత్రాలకు తగిలి ఎదురుగా ఏముందో కనిపించకుండా చేస్తున్నాయి..

నాపైనే ఓ జలధార ఏర్పడి తలనుంచి కాలి బొటనవ్రేలు వరకు నిరంతర ప్రవాహ ధారలా పారుతోంది.. 

వణుకుతూ, వణుకుతూ ఓ పెద్ద వృక్షం కిందకు చేరుకున్నాను.. ఆ వృక్షానికి మనిషి పట్టేంత బిలం ఉంది.. ఇక్కడ కాసేపు నిల్చుందాం అని ఆ బిలంలోకి ప్రవేశించాను.. అందులో నాకు కావాల్సిన మొక్కలు కుప్పలు తెప్పలుగా వున్నాయి.. అప్పుడుకాని నాకు అర్ధం కాలేదు.. ఆ మొక్కలు నీడనే పెరుగుతాయని.. 

ఇక ఆలస్యం చెయ్యకుండా సరిపడా మొక్కలను కోసుకొని పాప దగ్గరకు వెళ్లాను.. గుండ్రని రాతితో బాగా నలగ్గొట్టి పాపకు తాగించాను.. అప్పటికే తన గాయం దగ్గర అంతా బూడిదరంగు లా మారిపోయి ఉంది.. ఇక దైవం మీద భారం వేసి పక్కన కూర్చున్నాను.. 

ఇంటికి వెళ్ళే దారి వెతుకుదామని అనుకున్నాను … కాని ఈ వర్షంలో అది అసాధ్యం.. అందుకే నేనే, నా స్వంత నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఈ పాపకు ఏమైనా జరిగితే నా జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను అని అనుకుంటూ ఉండగా పాపలో మెల్లిగా కదలికలు రావడం గమనించాను… 

ఆ క్షణం నా కళ్ళల్లో ఓ తెలియని మెరుపు… 

అనేక గడియలు ప్రసవవేదన పడిన తల్లికి తన బిడ్డను చూడగానే ఎలాంటి భావన కలుగుతుందో ప్రస్తుతం నాలోనూ అదే కలిగింది.. 

వర్షం మాత్రం ఏకధాటిగా కురుస్తూనే ఉంది.. చూస్తూండగానే చీకటి పడిపోయింది.. నాలో భయం కూడా మొదలైంది.. 

నన్ను నేను రక్షించుకోవడమే కష్టం.. అలాంటిది ఈ పసిపాపను కూడా రక్షించే భాద్యత నాపై ఉంది అని అనుకుంటూ …. మనసులో భగవన్నామస్మరణ చేస్తూ ఉన్నాను .. కంటిపై కునుకులేకుండా చుట్టూరా గమనిస్తూ ప్రతీ చిన్న చప్పుడుని ఆలకిస్తూ ఉన్నాను.. 

అలా ఉండగా .. పాప లేచి కూర్చుంది.. 

ఎలా ఉంది తల్లి నీకు ఇప్పుడు… అంటూ తన కేశములను నా చేతివేళ్ళతో స్పృశిస్తూ అడిగాను…

నువ్వు లేకుంటే నేను ఈ క్షణానికి ఏమై ఉండేదాన్నో అని అంటూ.. 

మా జాతిలోనే మిగిలిన ఏకైక జీవిని నేను ...అని కృతజ్ఞతలు తెలిపింది.. 

ఏంటి ఈ పాప జాతి, జీవి అంటూ ఏదేదో మాట్లాడుతుంది…! అని అనుకున్నాను నేను… 

అలా ఆలోచిస్తూ ఉండగా.. 

అక్కా నాకు మరలా ఊపిరి పోసావ్ అందుకు నీకు నేను ఓ కానుకను ఇస్తాను .. రేపు తెల్లవారుజామున నీకు ఆ కానుకను ఇచ్చి నేను వెళ్ళిపోతాను అని చెప్తుంది.. 

చూడటానికి మాత్రం పసిబిడ్డ లా ఉంటుంది .. కాని ఇంత పరిపక్వంగా ఎలా మాట్లాడుతుందని నాకు అర్ధం కాలేదు.. 

పాప నువ్వెవరు ?? ఇక్కడకు ఎలా వచ్చావ్ అని అడగగానే… 

నా గురించి రేపు ఉదయానే నీకు అంతా తెలుస్తుంది అని చెప్తుంది… 

సరేలే ఆ విషయం రేపు చూసుకుందాం అని అనుకొని .. ఇక ఇద్దరం కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాం.. …మెల్లిగా వర్షం కూడా ఆగిపోయి నీలాకాశం కాస్త నలుపు వర్ణమును పులుముకొని, జిగేల్ జిగేల్ మనే తారాజువ్వల కాంతులతో … నిర్మలంగా మారిపోయింది.. ఆ రోజు అందులో నిండు పున్నమి కూడానూ … చూడు యెంత అందగాడో ఆ చంద్రుడు .. అని మాట్లాడుకుంటూ ఉండగా.. ఎందుకో నాకు వున్నట్లువుండి “చంద్రిక కొలను” గుర్తుకు వస్తుంది.. 


పెద్దనాన్న గారు తప్పకుండా నా గురించి ఆలోచించి ఉంటారు ..ఇంత రాత్రి అయినా నేను ఇంటికి రాలేదంటే ఖచ్చితంగా “చంద్రిక కొలను" అందాలను చూడటానికి అక్కడికి వెళ్లి ఉంటానని నా కోసం అక్కడకు వచ్చి వెతుకుతూ వుంటారు.. 

ఎలాగో నేను ఈ అడవిలోనే ఉన్నాను కాబట్టి .. కొంచం దూరం లోపలకు వెళ్లి వెతికితే ఆ వెలుగులు నా కంటపడి నేను ఇంటికి చేరే మార్గం తప్పకుండా తెలుసుకోగలను అని భావించి.. 

ఇక అనుకున్నదే తడువుగా .. నేను నిన్ను ఒక దగ్గరకు తీసుకెళ్తాను.. ఆ ప్రదేశం నీకు చాలా నచ్చుతుంది అని ఆ పాపకు చెప్పి అక్కడనుంచి ఆ పాపను తీసుకువెళ్ళాను … 

నిజం చెప్పాలంటే ఈ రోజు పౌర్ణమి కాకుండా వుండి వుంటే మేము అడుగు కూడా కదపలేక పోయేవాళ్ళం.. అంత చీకటిగా ఉంటుంది ఆ అడవి.. ఆ చంద్రుని వెండి పూతవంటి వెలుగులలో నడుస్తున్న నాకు చాలా ఆనందం కలుగుతోంది.. 

ఏంటి అక్కా అంత ఆనంద పడిపోతున్నావ్.. ?? అని ఆ పాప అనగానే… 

ఇలా పౌర్ణమిరోజు అడవిలో ఒక్కదాన్నే ఉండటం తొలిసారి.. ఏదో తెలియని చల్లని పిల్లగాలి వంటి ఆనందం నన్ను ఆవరించి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. అని చెప్పాను.. 

నువ్వు చెప్పిన ఆ “చంద్రిక కొలను” ఎలా ఉంటుందో నాకు తెలియదు. కాని నేను నీకో అందమైన ప్రదేశాన్ని చూపిస్తాను..నాతో వస్తావా ?? అని ఆ పాప అడగగానే .. 

ఇక్కడ నాకు తెలియని మరో అందమైన ప్రదేశమా ?? ఎక్కడ ?? అని అడిగాను.. 

అదిగో వినిపించట్లేదా ?? ఆ సముద్రపు కెరటాల భీకర శబ్ద ఘోష.. ప్రతీ పౌర్ణమికి, అమావాస్యకు సముద్ర కెరటాలు భీకరంగా మారుతాయి.. భయంతో చూసే వారికి భయమే కలుగుతుంది.. నిజమైన సముద్ర అందాలను చూస్తే ఆ సముద్రం మనకు అమ్మ లా కనిపిస్తుంది.. చూస్తావా ?? అని అనగానే… 

నువ్వు ఇంతలా చెప్తుంటే ఎందుకు చూడను.. పద వెళ్లి చూద్దాం అని నేను అన్నాను.. 

మార్గ మధ్యంలో నాకో సందేహం వచ్చింది.. 

ఎందుకు ? 

ఈ సముద్రం ప్రతీ పొర్ణమికి, అమావాస్యకు ఇంత భయంకరమైన అలలతో ఉంటుంది.. ? అని నాలో నేనే అనుకుంటుండగా.. 

అది విన్న ఆ పాప ఇలా చెప్పడం ఆరంభిస్తుంది.. 

చంద్రుని స్థితి గతులను బట్టి భూమి తన ఉపరితల ప్రవర్తనను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది.. ఇది చాలామంది మూఢనమ్మకం అని కొట్టి పారేస్తూ ఉంటారు .. 

నిజానికి గ్రహణ సమయంలో కాని, ఇలా 15 రోజులకు ఒకసారి వచ్చే ఈ పౌర్ణమి, అమావాస్యలకు ఎందుకు ఈ సముద్రం స్పందిస్తూ ఉంటుంది ?? 

ఈ ప్రశ్న వేసుకుంటే సమాధానం నీకే తెలుస్తుంది.. 

సముద్రపు నీటి మట్టాన్ని దగ్గరిగా చుస్తూ సముద్రములో ప్రయాణించే సాగర పుత్రులకు ఈ విషయం బాగా తెలుసు… ఎవరన్నా కనుక చంద్రుని ప్రభావం భూమిమీద లేదు అంటె వాళ్ళు దాన్ని ఒప్పుకోరు.. ఎందుకంటె అంత పెద్ద సముద్రం పైనే చంద్రుని ప్రభావం ఉంటె... ఇక మనిషి ఒక లెఖ్ఖా.. అని వారి ప్రగాఢ నమ్మకం.. 

ఇక సముద్రం లోపల జలచరాల విషయానికి వస్తే, అడుగు భాగాన చాలా స్వల్పంగా ప్రకంపనలు ఉంటాయి.. అప్పుడే పుట్టిన పిల్లలకు ఈ విషయం అర్ధం కాక చాలా భయపడిపోతుంటాయి .. 

చెప్తాను పదా అని అంటూ నా చెయ్యి పట్టుకొని ఆ సముద్రం దగ్గరకు తీసుకెళ్ళింది.. 

ఆ సముద్రాన్ని చూసి నాకు మొదట భయం కలిగింది.. 


తరువాత చంద్రుని వెన్నెల కిరణాల వెలుగులో నీలిరంగుతో కనిపించే ఆ సముద్ర జలాలు, బంగారంలా మెరిసిపోయే ఇసుక తిన్నెలు, జలచరాలతో పోటీపడే కెరటాలు, ఆ కెరటాలపై ఎగిరెగిరి పడుతుండే పిల్ల చేపలు... ఇలా చెప్పుకుంటే అనంతమైన ఆ సముద్ర సౌందర్యానికి ఆ రాత్రివేళ అంతే లేకుండా ఉంది.. కళ్లు తిప్పుకోలేనంత ప్రకృతి అందాన్ని నింపుకున్న సముద్ర తీరం అది.. నిజంగానే అద్బుతంగా ఉంది.. అని ఆ పాపకు చెప్పాను.. 

నేను చెప్పిన సౌందర్యం ఇది కాదు… అని అంటూ తన నోటికి రెండు చేతులు అడ్డుపెట్టుకొని నోటినుంచి ఓ విచిత్ర శబ్దాన్ని అరవసాగింది. ఆ పాప ..

To be continued …

Written by : BOBBY

Thursday, February 23, 2017

ముఖపుస్తక వైభోగం..ముఖపుస్తక వైభోగం.. 
****************

అది మహాస్రవంతి, ఆ స్రవంతిలో నురగలతో వెండిలా వచ్చే తరంగాలలో యెంత నిండుతనమో .. ఆ నిండుతనంలో యెంత గడుసుతనమో... యెంత లోతు, ఎన్ని ఊహలు, మరెన్ని ఆశయాలు, అనుభూతులు, సందేశాలు, సందోహాలు, సంతోషాలు... !

ఏంటి అనుకుంటున్నారా ?? అదేనండి ఈ ముఖపుస్తకం.. ఎంతగా చూడదలుచుకున్నా ఆ గభీరత కేసి అలా చూస్తూ.... ఆఁ! ఎంత నిండుతనం అన్న ఊహాజగత్తులో అలానే నిస్తేజంగా నిలబడిపోతాము ... !

ఒక విషయమా... రెండు విషయములా ..!! జీవితం అంటే ఏమిటో అక్షరాల రూపంలో “టపాల” గుత్తులతో ఇమిడి ఘోషిస్తోంది ఈ ముఖపుస్తకం ... మనసు బాలేనప్పుడు తెరిచి చూస్తే మహా మహుల అక్షరాలతో తాలికట్టేందుకు ముస్తాబైన పెండ్లి కూతురిలా అందంగా సింగారించుకొని ఉంటుంది... నేర్చుకోవాలనే తపన కాస్త ఉంటే చాలు ప్రతీ ఒక్కరు ఇక్కడ గురువర్యులే... పూజ్యసమానులే... 

ఉలిక్కిపడ్డ కోడి కొక్కొ..రో....కో అనడమే తడవుగా మేల్కొంటుందీ ముఖపుస్తకం.. పల్లెల చిరు గంటల లేగల “అంబా” అనే ఆగవులు, రైతు, కూలిజనం పనీ పాటలకోసం ఉరుకులు, పరుగులు.. నగరాల్లో “బ్లో బ్లో” మనే శబ్దాలు, గోలలు, పొగలు, కాలుష్యాలు, యంత్రాల తో ఉరుకులు, పరుగులు... సమయం లేని జీవిత ప్రయాణాలు.. !!!

మరెన్నో ... సాయం సమయం పక్షుల కిల కిలా రవాలు, రేకులు విచ్చిన సన్న జాజులు, సంపెంగలు, మల్లెల పడుచుతనపు కోర్కెల సువాసనా రూపంలో గుబాళింపులు.. ! సూర్యునికి విశ్రాంతి సమయం, కూలిజనం పాటల హోరుతో ఇంటికి నడకలు, రెక్కల పక్షుల గూటికి ఎగురులు.. 

కోర్కెల కూని రాగాలు, ప్రేమల పల్లవి గీతాలు, కొంటేతనపు సింగిరి గీతాలు యెంత గమ్మత్తులో ..!

ఉంగరంతో జీవితం ప్రారంభించి ఎన్నో మజిలీలు, మైలురాళ్ళని దాటుకుంటూ ప్రయాణం చేసి, పసితనం, బాల్యం, యువకత్వం, యౌవ్వనం, సంసారం, భాద్యతలు, పెద్దరికం, చుట్టూ కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మునిమనమలు, ఒడుగులూ, పెళ్ళిళ్ళు, పేరంటాలు, నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు, గుడులు, గోపురాలు, దేవుళ్ళు, దెయ్యాలు... ! ఇలా అన్నింటి గురించి ఎన్ని “టపాలో”... 

ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, ఆ అనుభవాలకు ప్రతి రూపాలు ఎన్నో, మరెన్నో ఈ ముఖపుస్తకపు రచనలు, అక్షర విభాగాలకు భాండాగారాలు ... చదువరుల ఆనందానికి ప్రతీకలు, కోమలాంగుల ఆపాదమస్తక వర్ణనలకు పుట్టినిల్లులు, అసమర్ధ నాయకత్వ పరిపాలనలకు రచయితల రౌద్ర అక్షర రూపానికి నిలువెత్తు నిదర్శనాలు ... ఈ ముఖపుస్తకంలో ఇలా ఎన్నో ఎన్నెన్నో.. 

ఏముంది ఈ జీవితం ?? అనే ప్రశ్నకు .. ఆ ప్రశ్నలో ధ్వనించే తత్వాలతో ఈ ముఖపుస్తకం ఎప్పటికప్పుడు సమాధాన పరుస్తూనే ఉంటుంది.. భావాల వెల్లువ నీటి చలనులా నేటి రచయితలకు ఊరే కొద్ది అక్షరాలకు కొదవే లేదు .. 

అందరూ సరదాగా... సునాయాసంగా... ఆనందంతో, ఆస్వాదిస్తూ రాయాలి, చదవాలి అదే నా తాపత్రయం..

మరి రాస్తారు కదూ...

Written by : Bobby

Wednesday, February 22, 2017

ఒకరికొకరు ...


కొన్ని ప్రయాణాలు మనకోసమే అన్నట్లు సాగుతాయి.. ఆ ప్రయాణంలో మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది.. ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలే కాని చూసేందుకు, చెప్పేందుకు బోలెడు ఉంటుంది... 

అలాంటి ప్రయాణంలో ఓ భార్యా, భర్తల మధ్యన వున్న ప్రేమను, సఖ్యతను, మరియు నేటి యాంత్రిక జీవన విధానంలో మనం అనుభవిస్తున్న లోటుపాట్లను, వాటి స్థితిగతులను రాయాలనిపించింది... అందుకోసమే కొంచం సమయం తీసుకొని ఈ టపా రాస్తున్నాను.. 

నిజంగానే ఈ 21వ శతాబ్దంలో మనకు తెలియకుండానే మనం యంత్రాలుగా మారిపోయాం.. ఉదయాన నిద్ర లేచిన దగ్గరనుంచి సాయంత్రం మంచం ఎక్కేవరకు అంతా పరుగులమయమే.. ఆఖరికి నిద్రనుకూడా కృత్రిమం గా అనుభవించేస్తున్నాం.. ఇంత పరుగులు తీసి మనం చివరికి సాధించింది ఏంటి ?? 

మనశ్శాంతిగా వున్నామా ?? లేదు.. 
ప్రశాంతంగా వున్నామా ?? లేదు.. 
ఆరోగ్యకరంగా వున్నామా ?? లేదు... 
సౌకర్యవంతమైన జీవనాన్ని గడుపుతున్నామా ?? లేదు.. అన్నిటికీ సర్దుకునే బ్రతుకుతున్నాం.. 
అన్నిటికన్నా ముఖ్యంగా .. అసలు సంతోషంగా వున్నామా ?? 
అస్సలు లేము.. కృత్రిమ నవ్వును మొహానికి పులుముకొని నవ్విస్తున్నాం..నటిస్తున్నాం.. నడిచేస్తున్నాం.. 
ఇందుకోసమేనా మనం నిరంతరం ప్రాకులాడేది.. పరితపించేది... 

అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నాం ?? కాడెద్దు లా సమస్యలతో సతమతమౌతూ ఉండటమేనా జీవితం అంటే ... 

దీన్ని జీవితం అనరు.. బానిసత్వం అంటారు.. కంటికి కనిపించని బానిస సంకెళ్ళు మనల్ని పాలిస్తున్నాయి.. అప్పుడప్పుడు అయినా ఈ యాంత్రిక జీవన విధానానికి ఫులిస్టాఫ్ పెట్టి మీ జీవిత భాగస్వామితో కొన్ని ప్రయాణాలు చెయ్యండి... 

అలా ఓ జంట చేసిన ప్రయాణమే “కొడైకెనాల్” ప్రయాణం.. 
రాత్రి నుంచి ప్రయాణం చేసి చేసి చివరికి ప్రక్కరోజు మధ్యాహ్న సమయానికి వారు అనుకున్న ప్రదేశానికి మరో నాలుగు గంటలు ప్రయాణం మిగిలి వుండగా ఇద్దరిలోను ఒకటే భయం.. అనితరసాధ్యమైన ఆ కొండను ఎక్కే ప్రక్రియలో సంభవించే విపత్తులను ఎలా ఎదుర్కోవాలి అని ?? దానికి తోడు ఆ దంపతులకు ఓ 2 సంవత్సరముల చిన్నారి కూడా వుంది.. భయం భయం గానే ఓ లిమ్కా బాటిల్ పెట్టుకొని కారులో ఎక్కి కూర్చున్నారు... 

మిట్ట మధ్యాహ్నం అయినప్పటికీ పళ్ళు కోరికే చలిలో ఆ కారు రయ్యి రయ్యి మంటూ కొండపై పైకి ఎగబాకుతూ దూసుకుపోతుంది.. రింగులు రింగులుగా తిరుగుతూ కారుకంటే వేగంగా వారి బుర్రలు తిరుగుతూ వున్నాయి.. ఓ ముప్పై నిమిషాలు అనంతరం ఇక ఆగలేక, తట్టుకోలేక ఆ కోమలాంగి కారు ఆపండి అని కారు ఆపించి.. బయటకు దిగి కడుపు కాళీ చేసేసుకుంది... ఆ సమయములో తన భర్త ఆమె వెనుకగా వచ్చి తన రెండు చేతులతో ఆ కోమలాంగి చెవులు గట్టిగా మూస్తూ ధైర్యం చెప్తున్నాడు.. అనంతరం ఓపక్క బిడ్డను, మరోపక్క అర్ధాంగిని తన రెండు భుజాలపై వేసుకొని నిద్రపుచ్చాడు .. మరో 2 గంటల ప్రయాణం అనంతరం ఆ చిన్నారికీ అదే పరిస్థితి కలగడం.. తన భార్య ఏమి చెయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో ఉండటం తను గమనించి తనే ఆ చిన్నారిని శుబ్రం చేసి బట్టలు మార్చి నీరు త్రాగించి మరలా ప్రయాణం కొనసాగించారు.. చివరికి వారు అనుకున్న ప్రదేశానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మూడు నక్షత్రాల హోటల్ లోకి అడుగు పెట్టారు.. 

అప్పటికి తన అర్ధాంగికి ఓపిక వచ్చి మీకు తిప్పలేదా ఆ ప్రయాణంలో అని అడుగగా... ఎందుకు తిప్పలేదు ?? చాలా నిగ్రహించుకున్నాను.. ఆ సమయంలో మీరిద్దరే కళ్ళముందు కనిపించారు.. మీకులాగా నాకు అలా అయితే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అనే ప్రశ్న నన్ను పదే పదే గుర్తు చేసింది.. అందుకే నేను ఉండగలిగాను అని చెప్పాడు ఆ భర్త... 

ఆ కోమలాంగికి ఒక్కసారిగా అనిపించింది.. 

ఆయన ఆఫీసులో ఉన్నప్పుడు లేవలేని పరిస్థితిలో నేను ఉంటే నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అని అనుకునే దాన్ని కాని ఆయన వెళ్ళేది నా కోసమే అని అర్ధం చేసుకోలేక పోయాను.. ఆయన నన్ను ఆ పరిస్థితిలో ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నారు అని నేను అర్ధం చేసుకుని ఉంటే బాగుండేది... అయినా నాకు అన్నీ సమకూర్చి వెళ్ళేవారు... తప్పు చేసాను.. నన్ను వదిలి ఆయన అక్కడ ఎలా వుద్యోగం చేసేవారో తలుచుకుంటేనే చాలా కష్టం గా వుంది.. ఆయన ఉండాల్సిన సమయంలో ఎప్పుడూ వుంటూనే వున్నాడు.. అయినా నేను ఎందుకు అలా ఆలోచించాను అనే ఆలోచనలతో ఆ కోమలాంగి తన భర్తపై మరింత ప్రేమ కనపరిచింది... 

ఆ రాత్రి ప్రశాంతమైన నిద్రను అనుభవించిన తరువాత ప్రక్కరోజు ఉదయాన్నే .. రెండు కాఫీ కప్ లతో ఆ కోమలాంగి దర్శనమిచ్చింది.. ఇద్దరూ కలిసి బాల్కనీలో కూర్చుని వణుకుతున్న చలితో వేడి వేడి కాఫీ జుర్రుకుంటూ చూట్టూరా కనపడే పచ్చని తివాచి కప్పిన కొండలను, లోయలను, పక్షుల కిల కిలా రావాలను వింటూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు.. వాహన శబ్దాలకు, రేడియో ధార్మిక సిగ్నల్స్ కు, యాత్రిక జీవనానికి దూరంగా ఇద్దరు మాత్రమే ఒకరికొకరు ఉన్నట్లుగా ఉద్యోగం, ఇల్లు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఇవేమీ ఇప్పుడు వాళ్ళ మధ్య లేవు.. ఉన్నదల్లా ఆకాశమంత ప్రేమ వారి మధ్యన ఓ వృత్తాకారపు వలయంలా దృడంగా వుంది.. ఆ ట్రిప్ తరువాత వారు చాలా దగ్గరయ్యారు...తెరిచిన పుస్తకంలా వారి జీవితాలు సాగుతున్నాయి... 

ఇదెలా సాధ్యం.. అదే భార్య, భర్తలు కదా .. అప్పుడు కనిపించని ప్రేమ ఇప్పుడెలా ?? 

ప్రేమ ఎప్పుడూ దంపతుల మధ్య వుంటూనే ఉంటుంది.. కాని ఆ ప్రేమను చుట్టూ వున్న సమస్యలు ఎప్పటికప్పుడు బలహీన పరుస్తూనే వుంటాయి.. ఆ సమస్యలను ఎప్పుడైతే అధిగమిస్తామో .. ముందు మన భాగస్వామి .... తరువాతే ఏదైనా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే వారి మధ్య ప్రేమ నిరంతరం చిగురించే సంజీవనిలా ఉంటుంది.. అంతే కాదు... నిత్యం నూతనత్వంతో శోభిల్లుతూనే ఉంటుంది... 

ప్రేమ గుండెల్లో ఉంటే సరిపోదు.. అది మీ భాగస్వామికి పంచండి.. అప్పుడే దానికి నిండుతనం వస్తుంది.. ముందు నేను చెప్తే తక్కువ అయిపోతానే అనే ఆలోచనలు రానివ్వకండి.. ప్రేమలో తక్కువ, ఎక్కువ లు ఉండవు ... ఆనందం, ఆప్యాయతలే వుంటాయి.. కళ్ళు వుండి కూడా చూడలేని అంధకారంలో మనం ప్రస్తుతం బ్రతుకుతున్నాం.. ఇలాంటి ప్రయాణాల వల్ల అయినా మీరు మీ ప్రేమను గుర్తించాలని ఆశిస్తూ ఉన్నాను ... 

ఇలాంటి ప్రయాణంలో భర్త భాద్యతాయుతంగా వ్యవహరిస్తాడు.. కాపుకాసే కంచెలా కనిపిస్తాడు.. భార్య తనతో తోడుగా తనని నమ్మి నడిచే ప్రేమమూర్తిగా కనిపిస్తుంది.. అలాంటప్పుడు వారు ఇద్దరు మాత్రమే ఈ లోకంలో వున్నట్లు వారు భావిస్తారు... వాళ్ళకన్నా ఏది ఎక్కువ కాదు అని గ్రహిస్తారు.. అందువల్లే ఇలాంటి అద్బుతాలు జరుగుతాయి.. ఇది ఇంట్లో ఉంటే సాధ్యం కాదు.. ప్రేమ పునరావృతం కావాలంటే ప్రదేశం మారాల్సిందే ... 

కావాలంటే మీ అర్ధాంగితో ఓ లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసి చూడండి .. పోయి వచ్చాక ఆ తేడా మీరే గ్రహిస్తారు... 

Written by : Bobby Nani

Friday, February 10, 2017

SOCOTRA (The Mysterious Island) from Bobby... 12th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...

ఏంటి ఆకాష్ నన్ను పిలిచావ్ అంటూ మోహన్ దగ్గరకు వస్తాడు.. 

ఇది చూసారా నిన్న మనకు ఈ మ్యాప్ ఆ సొరంగంలోని వారు ఇచ్చారు.. దీన్ని బాగా గమనించారా కనిపించీ కనిపించని ఆకారంతో ఓ గుర్తు ఇందులో దాగుంది … అదే గుర్తు (“నేత్రం నుంచి జాలువారే కన్నీరు”)ను నేను ఇందాక ఈ నౌకలోని ఓ గది తలుపుపై చూసాను.. ఆ గదిలో ఏముందో మనం తెలుసుకోవాలి.. ఖచ్చితంగా అందులో ఏదో వుంది.. అని చెప్తాడు ఆకాష్.. 
అవునా అయితే పద.. వెళ్దాం.. ఎవ్వరికీ అనుమానం రాకుండా మనం మెలగాలి గుర్తుపెట్టుకో అని అంటాడు మోహన్..

ఇద్దరూ కలిసి ఆ గది దగ్గరకు వెళ్తారు..

ఆ గదిలో ఏముందో తెలుసుకుందాం పదండి..
12th Part
కాని ఆ గదికి తాళం వేసివుంది.. ఇక్కడ ఈ గది దగ్గర మనం వుంటే చూసే వాళ్ళకు లేనిపోని అనుమానాలు వస్తాయి … తద్వారా మనం ఇక్కడ వుండటం అంత శ్రేయస్కరం కాదు.. మరెక్కడైనా ఈ గదిలోకి వెళ్ళే మార్గం ఉందేమో అని ప్రయత్నిద్దాం పదా అని మోహన్ అంటాడు.. 


ఇద్దరూ గదికి వెనుక భాగం లోకి చేరుకుంటారు .. అక్కడ పాత వస్తువులను భద్రపరిచే ప్రదేశంలా వుంది.. అక్కడ అన్నీ దుమ్ము, ధూళి తో నిండివున్నాయి .. అడుగులు వేస్తుంటేనే వారి అడుగులు అక్కడ పడుతున్నాయి.. 

ఏంటి ఇంత అందమైన నౌకలో ఇలాంటి ఒక ప్రదేశం వుంది.. అయినా ఈ ప్రదేశానికి ఎవ్వరూ వచ్చినట్లు లేరు.. అందుకే మన అడుగులు కూడా ఇంత దుమ్ములో స్పష్టంగా కనిపిస్తున్నాయి… అని అంటాడు ఆకాష్.. 

నిజమే ఆకాష్ ఎవరూ రాలేదంటే ఇక్కడ ఏదో వుందని అర్ధం అని అంటాడు మోహన్.. నాకెందుకో ఈ నౌకలో ఏదో జరుగుతోందని పిస్తుంది … 

ఎలా చెప్తున్నావ్ అని అంటాడు ఆకాష్.. 

ఇక్కడ ఉన్నవన్నీ చాలా దుమ్ముతో వున్నాయి .. చూడు ఆ ప్రదేశం లో కొంచం అంటే కొంచం కూడా దుమ్ము లేదు..అంటాడు మోహన్.. 

నిజమే .. అయినా నువ్వు అన్నింటిని ఇలా ప్రత్యేకంగా ఎలా చూడగలవు.. ఇదెలా సాధ్యం.. అని అంటాడు ఆకాష్.. 

అవన్నీ మనం తరువాత మాట్లాడుకుందాం.. ముందు గదిలో ఏముందో మనం తెలుసుకోవాలి అంటాడు మోహన్.. 

ఇద్దరూ ఆలోచిస్తూ వుండగా.. 

వెళ్ళాల్సిన గదికి షుమారు పన్నెండు అడుగుల ఎత్తులో ఒక చిన్న (గాలిని బయటకు పంపే ) ఫ్యాన్ అక్కడ తిరుగుతూ వుండటం గమనిస్తారు ఇద్దరూ… 

ఆకాష్ మనం ఎలా అయినా ఆ పైకి ఎక్కి లోపల ఏముందో చూడాలి.. అప్పుడే మనకు ఒక అవగాహన వస్తుంది అంటాడు మోహన్… 

అక్కడ ఉన్నటువంటి పాత వస్తువులలో నుంచి కొన్ని విరిగిన కుర్చీలు, స్టూల్స్ ఒకదానిపై మరొకటి పెట్టి ఆకాష్ ని ఎక్కమని చెప్తాడు మోహన్.. 

వెంటనే ఆకాష్ పైకి ఎక్కి గదిలోకి చూసే ప్రయత్నం చేస్తున్నాడు.. 

ఆ గది అంతా చీకటిగా వుంది.. సరిగా కనిపించట్లేదు… ఏవేవో కొన్ని ఆడవారికి సంబందించిన దుస్తులు, పగిలిన గాజులు, అక్కడ చెల్లా చెదురుగా పడివున్నాయి.. ఇంతలో ముందువైపున గది తలుపును ఎవరో తీస్తున్నారు… 


మోహన్ గారు… ఎవరో ఆ గదిలోకి రాబోతున్నారు మీరు అటువెల్లి చూడండి అని ఆకాష్ చెప్పగానే మోహన్ ముందువైపు తలుపు దగ్గరకు చేరుకోవడానికి అటు ప్రక్కకు వెళ్తాడు.. 

ఈలోపలే ఆ గది తలుపులు తెరుచుకుంటాయి.…

ఓ 15 ఏళ్ళ పిల్లాడు తన చేతిలో ఆహార పదార్ధాలను పట్టుకొని ఆ గదిలోకి వస్తాడు.. 
అక్కా అంటూ ఎవరినో పిలుస్తున్నాడు.. 

అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న ఆ గది ప్రాంగణం ఒక్కసారిగా ఆమె రోధనకు దద్దరిల్లి పోయింది.. 

ఆ రోదన ఎలా ఉందంటే … పిచ్చిపట్టిన వారు పెద్ద పెద్దగా ఎడుస్తున్నట్లు ఉంది ..ఆకాష్ కి ఏమి అర్ధం కాక అలానే చూస్తూ వున్నాడు…

ఆమె ఎవరు? 
ఇక్కడ ఆమె ఎందుకు వుంది ??
ఎందుకు అలా ఏడుస్తుంది ? 

ఇలాంటి ప్రశ్నలతో అలానే నిస్తేజంగా చూస్తున్న ఆకాష్ కి ఘల్లు, ఘల్లు మని ఆమె అందియల చప్పుడు వినిపిస్తుంది.. ఆమె ఆ గదికి కుడిచేతివైపున వుంది.. అక్కడ చాలా చీకటిగా వుంది.. అందియలు వినిపిస్తున్నాయి కాని ఆమె మోము మాత్రం కనిపించట్లేదు.. 

ఆ అందియల చప్పుడు మరింత దగ్గరగా వినిపిస్తుంది… 
ఆకాష్ తన తలను బాగా వంచి చూస్తూ… 

అయ్యో పాపం ! 

ఏ స్త్రీకి ఏ పురుషుడి వల్ల ఏ ఆపద వాటిల్లిందో.. 
అని అక్కడ కలయజూశాడు. 
అలా చూస్తుండగా ... ఆ లేలేత చీకట్లలో ప్రకాశవంతమైన ఓ కోమలాంగి పాదము కనిపిస్తుంది .. ఆ పాదమునకు అంటిన ముదురు వర్ణము గల పారాణి, ఆ పాదాలను అంటిన బంగారు వర్ణము గల కాలి అందియలు.. అవి ఆమె ఒక్కో అడుగుకీ ఘల్లు ఘల్లు మని సవ్వడిచేస్తుండగా ఇక్కడ ఆకాష్ గుండె ఝల్లు ఝల్లుమని ఎగిరెగిరి పడుతోంది.. నిజంగానే ఆమె పాదాలు విచ్చుకున్న పద్మాలవలె వున్నాయి.. మరొక్క అడుగు ముందుకు వేసింది.. ఆమె మోకాలి క్రింద భాగం స్వేతవర్ణమును పులుముకున్న శంఖం ఆకృతి లో ఉంది .. అలానే నోరు ఎల్ల బెట్టి చూస్తున్నాడు ఆకాష్.. మరో అడుగుతో ఆమెను చూడొచ్చనే ఆతురతతో ఎదురు చూస్తూ వున్నాడు.. 

అనుకున్నట్లే ఆమె ముందుకు వచ్చింది.. తలకట్టు చెదిరి ఆ కేశములు ఆమె వెన్నెలవంటి నడుము పై పడి అమావాస్య పరుచుకున్న చీకటిలా ఉండగా, కంటినీరు ధారలై ప్రవహిస్తూ, విలపిస్తూ, తుమ్మెదల బారులవంటి కంటిచూపులు భయంతో, బెరుకుతో నలుదిశలా ప్రసరిస్తుండగా మనుషుల అలికిడితో ఆ గదిలో ఈ చిన్నది, చాప కన్నులున్నది, దీనత్వము మూర్తీభవించినట్లు కనబడింది ఆకాష్ కి… భయముతో, శోకముతో, వడలిపోయి, మేనిసౌందర్యలక్ష్మి శోభ సడలిపోయి, వణుకుతూ ఆ పిల్లాడి ముందుకు వచ్చింది…. సన్నని మేలిముసుగు చాటునుండి మేలిమికాంతులు ప్రసరిస్తున్న వదనముతో, పాపిటిపై చేతులు జోడించి “దయచేసి నన్ను వదిలేయండి” అంటూ చిక్కిన మోముతో, నలిగిన చీరతో, వణుకుతున్న స్వరంతో ఆ కోమలాంగి మాట్లాడిన మాటలకు ఆకాష్ ఆ క్షణం ఆమెకోసం ఏమైనా చెయ్యాలని తన ప్రాణాన్ని సైతం ఆమెకు కానుకగా సమర్పించాలని నిర్ణయం తీసుకుంటాడు.. 


తొలిచూపు, తొలిప్రేమ, తొలివలపు ఇవన్నీ ఒక్కసారిగా ఆకాష్ హృదిలోకి చొచ్చుకొని వచ్చేశాయి… తనకు తెలియకుండానే ఆమెను అమితంగా ఆరాదిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు .. ఆ ఇరవై రెండేళ్ళ చిన్నదాని కోసం తన ఇరవై ఐదేళ్ళ నిరీక్షణ ఫలించే సమయం వచ్చేసిందని తను గ్రహిస్తాడు.. 

గది లోపలకు వచ్చిన పిల్లాడు ఏమి మాట్లాడకుండా తనచేతిలో వున్న ఆహార పదార్థాలు అక్కడ పెట్టి మల్లి తలుపు వేసుకొని వెళ్ళిపోతాడు.. 

మోహన్ ఆ పిల్లాడిని అవతలివైపు కలిసి ఇలా అడుగుతాడు.. 

తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ …. పక్కకు తీసుకెళ్ళి ఇక్కడ జరగకూడనివి యేవో జరుగుతున్నట్లు వున్నాయి అవేంటో నీకు బాగా తెలుసు.. నీ మనసు కూడా ఇవన్నీ చెయ్యడానికి చాలా బాధపడుతూ ఉంది .. దానికి నీ ఈ కన్నీళ్ళే సాక్షి…. నాకు వివరంగా చెప్పు నీ గురించి ఎవరికీ తెలియనివ్వను, నీకేం కాకుండా చూసుకుంటాను .. నిన్ను మాతోపాటు తీసుకెళ్ళి బాగా చదివిస్తాను.. నా తమ్ముడిలా చూసుకుంటాను…. దయచేసి నన్ను నమ్ము… ఓ మంచి కార్యానికి నీవంతు నీవు సహాయం చెయ్యి అని ఆ పిల్లాడిని అడుగుతాడు.. 

ఆ పిల్లాడు కాసేపు మౌనం గా వుండి .. తరువాత తన కళ్ళను తుడుచుకుంటూ చెప్తాను అన్నా.. నాకేమైనా మరేం పర్వాలేదు కాని ఈ దారుణాలను చూడలేక పోతున్నాను.. మీరు నన్ను తీసుకెళ్ళినా, తీసుకెళ్ళక పోయినా సరే ఈరోజు నేను మీకు చెప్తాను అని అంటూ… చెప్పనారంభించాడు .. 

ఇందాక ఆ గదిలో కనిపించిన ఆ అందమైన అమ్మాయి కొన్ని రోజుల్లో అత్యంత దారుణంగా తన రూపాన్ని పూర్తిగా వదులుకొని వికృతంగా మారబోతోంది.. అలా ఎందుకు మారబోతోందో నాకు కూడా తెలియదు కాని ఇక్కడ నుంచి ఆ దీవికి తీసుకెళ్ళిన ప్రతీ అమ్మాయి అలానే మారిపోతుందని ఇక్కడ వాళ్ళు అనుకుంటుంటే విన్నాను.. అంతే కాదు అలా మారిన వాళ్ళ ఫోటో కూడా నేను చూసాను.. నేను అన్నం పెట్టిన వారు అలా అయిపోవడం చూసి చాలా ఎడ్చేవాడిని … ఆ దీవిలో ఏదో జరుగుతోంది అని చెప్తాడు ఆ పిల్లాడు… 

సరే కాని ఈ నౌక ఎక్కడనుంచి వస్తుంది?? ఆ అమ్మాయిలను ఎక్కడనుంచి తీసుకొస్తున్నారు ?? అని మోహన్ అడుగగా.. 

ఒక దగ్గరనుంచి అని కాదు ప్రత్యేకమైన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారని తెలిస్తే వారందరినీ యెంత దూరంలో వున్నా వెళ్లి బలవంతంగానో, లేదా వారికి ఏదైనా ఆశ చూపించో, ఎలాగోలా ఇక్కడకు తీసుకొచ్చేస్తారు .. ఈ గదిలోనే బంధిస్తారు.. ఆ దీవి దగ్గరకు వెళ్ళేదాకా ఎన్ని రోజులు ఉంటే అన్నిరోజులు నేను వారిని భోజన సౌకర్యాలు అందిస్తాను.. ఆ దీవికి వెళ్ళాక ఇక నాకు వారికి ఎలాంటి సంబంధం వుండదు.. అని చెప్తాడు.. 

ప్రత్యేకమైన అమ్మాయిలు అంటే ?? అని అడుగుతాడు మోహన్ … 

దాని గురించి కూడా నాకు తెలియదు వారు అంటుంటే వినడమే.. అని సమాధానమిస్తాడు ఆ పిల్లాడు.. 

నీ దగ్గర ఆ గది తాళం మరోటి ఉందా ?? అని అడుగుతాడు మోహన్.. 

హా నా గదిలో మరోటి వున్నట్లు నాకు గుర్తు అనగానే.. 

ఈ తాళం నాకు ఇచ్చేసి .. నీ దగ్గర వున్న తాళాన్ని నీ దగ్గర పెట్టుకుంటావ ?? అని మోహన్ అనగానే .. 

ఇస్తాను కాని మీరు ఆ గదిలోకి వెళ్ళారని తెలిస్తే నన్ను చంపేస్తారు అని అంటాడు ఆ పిల్లాడు.. 

మేము ఇలా వెళ్లి ఆమెతో కొన్ని మాట్లాడి అలా వచ్చేస్తాము .. నన్ను నమ్ము నీకేం కాదు అని మాట ఇస్తాడు మోహన్.. 

సరే నేను నా గదికి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ పిల్లాడు.. 

మోహన్ వేగంగా ఆకాష్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పి ఇద్దరూ కలిసి ఆ రూము దగ్గరకు తాళం తీసేందుకు వెళ్ళారు.. 

తాళం తీయ్యడమే ఆలస్యం.. ఆకాష్ చాలా వేగంగా తలుపులు తీసుకొని గదిలోకి వెళ్లి ఆమెను వెతకనారంభిస్తాడు.. చీకట్లో అటువైపుగా తిరిగి వున్న ఆమెవెనుక ఆకాష్ నిలబడి .. 

మీరు ఇక భయపడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు.. మిమ్మల్ని ఎలాగైనా క్షేమంగా మీ ఇంటికి చేర్చే భాద్యత మాది.. మమ్మల్ని నమ్మండి.. అంటూ తన కంఠాన్ని మృదువుగా చేసుకొని అంటాడు ఆకాష్… 

ఎవరు మీరు ??? 
అంటూ తన చేతి గాజుల చిరు శబ్దముతో, తన పాదములనంటిన మువ్వల సవ్వడులతో, పురివిప్పిన కేశములతో ఆకాష్ వైపుగా తిరిగి ఎదుట నిలబడింది.. 

ఆమె కళ్ళలోకి చూసే ధైర్యం లేదు ఆకాష్ కి.. అందుకే ఆమె తిరగగానే తలను కిందకు వంచి .. వారు ఇక్కడకు ఎలా వచ్చారో అంతా వివరంగా చెప్పాడు.. 

ఈలోపల మోహన్ మధ్యలో దూరి … మీరు ప్రత్యేకమైన వారు అని ఆ పిల్లాడు చెప్పాడు .. ఆ విషయం మీకు తెలుసా ?? అని అడుగగా.. 

ఏంటి ??
నేను ప్రత్యేకమైన అమ్మయినా.. అందుకేనా వారు నన్ను బలవంతంగా ఇక్కడకు లాక్కొచ్చి పడేశారు.. ఈ విషయం నాకు మీరు ఇప్పుడు చెప్పేదాకా తెలియదు.. అని అంటుందామె.. 

బాగా ఆలోచించండి మీలో ఏదో ప్రత్యేకత వుండే ఉంటుంది.. లేకుంటే వారు ఇక్కడకు తీసుకురారు అని చెప్తాడు మోహన్.. 

ఆమె ఆలోచిస్తూ వుండగా.. 

ఒకపని చెయ్యండి.. మీరు ఎక్కడనుంచి వచ్చారు ?? మీరేం చేస్తారు ?? తదితర విషయాలను మొదలుకొని మీరు ఇక్కడకు వచ్చేదాకా మీ గతాన్ని మాకు వివరించండి అంటూ అడుగుతాడు ఆకాష్.. 

కాసేపు మౌనంగా ఉండిపోయింది ఆమె… 

కొన్ని నిమిషాల అనంతరం.. ఆకాషే చొరవ చేసుకొని ఆమెను అడుగుతాడు.. 

మీరలా మౌనంగా ఉంటే ఎలా.. మీ గురించి మాకు తెలిస్తేనే కదా మిమ్మల్ని కపాడగలం అని అంటాడు ఆకాష్.. 

నా గురించి చెప్పడానికి ఏముంటుంది ?? 


మాదో చిన్న కుగ్రామం.. మా గ్రామం మొత్తం అడవికి మధ్యభాగంలో సముద్రానికి దగ్గర భాగంలో ఉంటుంది.. అందువల్ల ప్రభుత్వంచే గుర్తించబడని ఓ ఆటవిక తెగలా మేము బ్రతుకుతున్నాం.. మా గ్రామంలో ఓ ఇరవై ఆరు కుటుంబాలు మాత్రమే జీవిస్తున్నాయి.. నిత్యం ఆహార వనరులకోసమే వేట సాగించే కుటుంబాలు మావి... పాడి, వ్యవసాయమే మా ప్రధాన జీవనాధారం… ఈరోజుల్లో కూడా విద్యుత్తు లేని గ్రామాలుంటాయంటే మీరు నమ్ముతారా ?? మా గ్రామం అందుకు తార్కాణం .. ప్రపంచపటంలో మా గ్రామం వెతికినా మీకు కనిపించదు.. సముద్రపు దొంగలకు మాత్రమే తెలిసిన ఏకైక గ్రామం మాది.. ఆ సముద్రపు దొంగలకు ప్రతినిత్యం బలౌతున్న బానిస గ్రామం, వారి తల దాచుకునేందుకు విడిది చేసే గ్రామం అని చెప్పొచ్చు.. నా చిన్నప్పుడే అమ్మా, నాన్న ఓ పడవ ప్రమాదంలో చనిపోయారు.. అప్పటినుంచి నన్ను మా పెదనాన్నగారు పెంచారు.. తన బిడ్డకన్నా గొప్పగా నన్ను ప్రేమించారు.. ఆయనకు తెలిసిన నాలుగు అక్షరాలు నాకు నేర్పించారు.. 

మరికాసేపట్లో నా పెళ్ళి జరుగుతుందనగా వీళ్ళు నన్ను తీసుకువచ్చేశారు .. ఏ ఆడపిల్ల అయితే దేనికోసమో కలలు కంటుందో ఆ మరుపురాని మధుర క్షణం అది.. ఇక నేను బ్రతికినా ఒక్కటే, చచ్చినా ఒక్కటే.. ఇదే నా గతం.. అని చెప్తుంది ఆ అమ్మాయి.. 

మీ వ్యక్తిగతం గురించి చెప్పమన్నాను… అంటే మీ స్వభావం, మీ పనితీరు, ఇలా మీ గురించి చెప్పండి అని చెప్తున్నాను.. అని ఆకాష్ అనగానే.. 

ఆమె ఒక్కసారిగా కోపంతో.. ఇప్పటికే నా వ్యక్తిగతాన్ని మీకు చాలా చెప్పేశాను ఇక చెప్పాల్సిన అవసరం నాకు లేదు.. అసలు మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి ?? అని ఆమె కసురుకోగా.. 

తన జేబులో వున్న మ్యాప్ ని తీసి ఆకాష్ తనకు చూపిస్తాడు.. ఆ దీవిలో జరుగుతున్న పరిణామాలను .. తను చూసిన ఆ విచిత్ర మనుషులను ఆమెకు వివరిస్తాడు.. 
ఆమె భయంతో నాకు కూడా అలాంటి గతే పడుతుందా ?? అంటూ అడుగుతుంది.. 

లేదు నీకు అలా ఏమి జరగదు మేము నీకు తోడుగా వుంటాం.. దయచేసి నీ గురించి మొత్తం మాకు చెప్పు .. సమస్యను ఎదుర్కోవడానికి మనం పరిష్కారాన్ని కనుగొనవచ్చు.. అని అంటాడు ఆకాష్..

To be continued …

Written by : BOBBY

Thursday, February 9, 2017

యుగాలనుంచి కాదు.. నీ ఊపిరికి ప్రతి ఊపిరినై పెనవేసుకుంటూ.. పుడుతూనే ఉంటాను .. !!!
అదేంటో ఈ కోమలాంగిణి చూస్తే కోటి పూలు ఒక్కసారిగా వికసించినట్లు ఉంటుంది ..
చెంగు చెంగు మంటూ గంతులేసే ఆ అల్లరి వనితను చూస్తుంటే లేడిపిల్ల గుర్తుకువస్తుంది.. 
అమాయకమైన ఆ బెదురు, అదురు చూపులలో అరణ్య కుందేలు కనిపిస్తుంది.. 
ఏది ఏమైనా అన్నీ నీకే చెందునులే .. !!
నవరసాలను పండించగల పుష్కలాక్షిణివి.. !!
“శృంగారం” లో ఎత్తుకు పై ఎత్తును అందించే రతీదేవి లా.. 
“శౌర్యం” లో ఖడ్గం పట్టిన నీరజాక్షి లా.. 
“కరుణ” లో ప్రేమగా దీవించే ధవళాక్షి లా.. 
“అద్బుతం” లో ఆనందాన్ని నింపే అంబుజవదన లా.. 
“హాస్యం” లో చిరునవ్వును అందించే కిన్నెరకంఠి లా.. 
“భయానకం” లో ఎరుపు వర్ణపు నేత్రాలతో ఊగిపోయే ఉజ్జ్వలాంగిణి లా.. 
“బీభత్సం” లో అలుపెరగని పోరాట ప్రతిమ కనపరిచే తాటంకవతి లా..
“రౌద్రం” లో పాపాత్ముల రక్తాన్ని జుర్రుకునే వరారోహిణి లా.. 
“శాంతం” లో అమృతాన్ని పంచె శాతోదరి లా .. 
సమయాన్ని బట్టి లతలా అల్లుకుపోయే “స్త్రీ”తత్త్వం నీదైతే.. 
ఆ “స్త్రీ” తత్వాన్ని అందుకునే “పౌరుష” తత్వం నాది..
పద్మిణి, చిత్రిణి, హస్తిని, శంఖిని లా 
సాత్వికం, ప్రచోదకం, భయానకం లా 
నీ వెలా ఉన్నా ... 
నా నేత్రములకు వయ్యారాలు వొలకపోసే వగలాడివే ... !
అందని ద్రాక్షలు నీ పరువాలైతే .. 
వాటిని అందుకొనగ వచ్చిన చిత్తేశుడను నేను.. 
ఏనాటి బంధమో ఇది.. 
అలసిన ఈ నా హృదయం నీ 
కౌగిటను జేరి సేద తీరఁగ తహతహ లాడుచున్నది .. 
తెలుసు అలా జరిగిన మరు గడియలోనే నా ప్రాణం ఆగిపోతుందని.. 
ఆ ఒక్క గడియ కోసం ప్రాణాలేంటి.. వేల జన్మాలనైనా వదిలేస్తా.. !!
హృదయం ఆగిన చోటునుంచి నీ ప్రేమకై మరలా జనియిస్తూనే ఉంటాను ... 
యుగాలనుంచి కాదు.. నీ ఊపిరికి ప్రతి ఊపిరినై పెనవేసుకుంటూ.. పుడుతూనే ఉంటాను .. !!!

Written by : Bobby

Monday, February 6, 2017

లలితాంగిని...
నీ అణువణువునా ... 
ఏమి సౌందర్యమో, ఏమి సౌభాగ్యమో, 
ఏమి సోయగమో, ఏమి సౌరువమో, 
ఏమి స్వాధువమో, ఏమి సౌష్ఠవమో, 
ఏమి స్వరూపమో ...
నిను వర్ణించాలంటే భాష చాలదె.. 
నిను ఆరాధించాలంటే భావం సరిపోదే.. 
నిను అర్ధం చేసుకోవాలంటే అక్షరాలు సరితూగవే .. 
ఎలా చేశాడే ఆ బ్రహ్మ... !!!
మనసుపెట్టి చేశాడో, లేక 
మైమరిచి చెక్కాడో కాని ... 
ఇంద్రధనువు లోని సప్త వర్ణములను,
రుచులలో షడ్రుచులను, 
తత్వములలో పంచ తత్వములను.. 
చతుర్విధ పురుషార్థాలను ..
మూడు ముళ్ళ బాంధవ్యములను..
రెండు ఆత్మల దేహ పరిణయములను.. 
కలిపి ఏక శిలా సౌందర్య లలన, 
లలిత, లలితాంగినిలా రూపొందించాడేమో ...!!! 
అందుకే ఇలా .. 
పొగమంచు కప్పిన ప్రాతఃకాల కన్యకలా..
నెలవంకను పోలిన కాంతిపుంజనిలా..
నయగారాలు చిలికే మధువనిలా.. 
షడ్రుచుల సమ్మేళనాభరితములా .. 
నీ ప్రతీ అణువూ పరువపు సొగసులు పొదిగి వున్నాయి.. 
నీ నడకలో వేల రంగుల పూలు పుడమిపై వెల్లివిరుస్తాయి.. 
నిను తాకిన ఆ గాలిలో మల్లెలు వికసిస్తాయి.. 
నీవు పలికిన ఆ స్వర మధుర్యములో 
వేయి కోయిల గొంతుగానములు కోటి సరాగాలై ప్రతిధ్వనిస్తాయి.. 
నీ ఒడి ఒడి వోర చూపులలో మలయమారుతపు ఓ పులకరింత.. 
తడి తడి ఆ అధరములలో ఓ వెచ్చని పలకరింత.. 
మగండునై నిలిచిపోనాను.. నిస్తేజంగా.. !!
మొగుండునై ఉంటే .. 
మాపటేళ కాడ, ఇరగ్గాసిన వెన్నెలలో, 
మల్లెతోట నడిమిన, మడతమంచముపై
కొసరి కొసరి యెర్రని తాంబూలములు 
నాలుగు ఆధరముల మధ్యన దోబూచులాడేవి.. 
సరస సయ్యాటలో ఒయ్యరాలు ఒలకబోసేవి.. 
గాజుల సవ్వడులలో మల్లెలు విరబూసేవి.. 
మువ్వల అలజడులతో అందాలు ఆరబోసేవి.. 
ప్రేయసీ, ప్రియుల బిగుతు కౌగిళ్ళ ముచ్చట్లలో ప్రేమ రసం స్రవించేది.. 
నూతన అధ్యాయం చిగురించేది.. 
సృష్టి కార్యం సఫలమయ్యేది..

Written by : Bobby

Saturday, February 4, 2017

కొన్ని సంవత్సరములకు ముందు..

SOCOTRA (The Mysterious Island) from Bobby... 11th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...

ముందు మనం మన నౌకలో అక్కడకు వెళ్లి .. రహస్యంగా అక్కడేం జరుగుతోందో తెలుసుకొని అప్పుడు ఆలోచిద్దాం అని చెప్తాడు మోహన్.. 
ఇక ఇప్పటికే నౌక వచ్చి వుంటుంది…. మనం వెంటనే వెళ్ళాలి అని అనుకోని… 
మేము మళ్ళి తప్పకుండా ఇక్కడకు వచ్చి మిమ్మల్ని అందరినీ మాతో తీసుకువెళ్తాం .. మా ఇద్దరినీ నమ్మండి.. అని మాట ఇచ్చి … 
అక్కడనుంచి నేరుగా ఆ ఊదారంగు గల ప్రవేశ మార్గం దగ్గరకు వచ్చి కాగడా వెలిగించి ఆ రాయి దగ్గరగా పెడతారు.. ఆ రాయిలో ఎలాంటి చలనం లేదు.. 
ఇదేంటి ఈ రాయి ముడుచుకొని దారి ఇవ్వట్లేదు.. ఇప్పుడెలా ? 
ఇందాక వారు ఇలానే కదా బయటకు వచ్చారు .. ఇప్పుడేమైంది ? అని అనుకుంటూ వుండగా.. 
వెనుకనే వచ్చిన ఆ వింత జీవి సైగలతో చెప్తుంది ..

ఆ రాయి తెరుచుకోక పోతే ఇప్పుడెలా ?? అనే ఆలోచనలతో ఉన్నారా ..??
సరే అదేంటో చూద్దాం పదండి..
11th Part

రాత్రివేళ మాత్రమే ఈ రాయి తెరుచుకుంటుందని.. పగటిపూట తెరుచుకోదని.. చీకటి పడే వరకు ఇక్కడనుంచి కదలలేమని .. సైగలతో చెప్తుంది .. 

అప్పుడు అర్ధం అవుతుంది మోహన్ కి .. 

మనకు ఈ జీవి ఉదయం పూట కనిపించింది..అంటే ఆ ముందు రోజు రాత్రి తను బయటకు వచ్చి మళ్ళి లోపలకు వెళ్ళలేక పోయింది.. మనం మంట వేసుకుని వున్నాం కదా .. మనకు చెప్పడానికి, తను లోపలకు వెళ్ళడానికి మంట కావాలి… అందుకోసమే తను మన వెనుకనే తిరిగింది.. మనం వెంటాడి వెళ్ళాక తను ఆ మంట సహాయంతో లోపలకు వెళ్ళిపోయింది.. ఈ లోపు ఆ మనుషులు వచ్చారు… తను భయపడి ఆ సొరంగంలో దాక్కొని వుంటుంది అని మాట్లాడుకుంటారు.. 

అన్నీ బాగున్నాయి కాని ఒక్కటి మాత్రం సందేహం గానే మిగిలి వుంది అని ఆకాష్ అంటాడు.. 

ఏంటి చెప్పు అని మోహన్ అనగా.. 

తన బిడ్డ చనిపోయిందని ఆమె రోదిస్తోంది.. కాని కళ్ళల్లో నుంచి ఒక్క చుక్క నీటిబొట్టు కూడా రాలేదు .. ఇదెలా సాధ్యం.. 

ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మనకు సమాధానం అక్కడ మాత్రమే దొరుకుతుంది ఆకాష్ అని మోహన్ అంటాడు.. 

మనం ఇక్కడ ఇరుక్కుపోయాం.. మనవాళ్ళు అక్కడ మనకోసం వెతుకుతూ వుంటారు.. మళ్ళి చీకటి పడే దాకా ఇక్కడ మనం ఉండాల్సిందే అని మాట్లాడుకుంటారు.. 

ప్రసన్నకుమార్ భాటియా అతని ఇద్దరు కుమారులు బయట ఆ దీవి అంతా జల్లెడ పడుతున్నారు.. ఎక్కడా వారి జాడ కనపడకపోయేసరికి కంగారుగా అందరూ ఒకదగ్గరకు వచ్చి కూర్చుంటారు.. 

నేను మీకు ముందే చెప్పాను.. ఇలాంటివి మనకు వద్దు అని .. మీరు వినలేదు ఇప్పుడు చూడండి అందరం ఈ నిర్మానుష్య ప్రదేశంలో ఆకాష్ కోసం ఇలా కూర్చుని ఏడుస్తున్నాం.. అని రెండవ వాడు అయిన లోకేష్ అంటాడు.. 


అన్నయ్యా నువ్వు ఇంకా నాన్నను భయపెట్టకు .. 

అన్నయ్యకు ఏం కాదు.. 

మనం అనుకున్నది అనుకున్నట్లే పూర్తి చేస్తాం అని చివరి వాడు అయిన సంతోష్ అంటాడు .. 

కాని ప్రసన్నకుమార్ భాటియాను మౌనం ఆవరించి వుంది.. తనేమి మాట్లాడే పరిస్థితిలో లేడు .. ఆకాష్ కి ఏం జరిగిందో అని తీవ్ర మనోవేదనతో భయపడుతూ వున్నాడు.. చాలా నీరసంగా కూడా కనిపిస్తూ వున్నాడు… 

వారు కూర్చున్నప్రక్కనే ఆకాష్ ఉన్నాడని వారు కనుగొనలేని పరిస్థితిలో వున్నారు… 

అలా వుండగా .. సూర్యుని కిరణాలు పడి ప్రకాశవంతంగా కనిపిస్తున్న ఆ ఊదారంగు రాయిని చూస్తాడు.. చిన్నవాడు అయిన సంతోష్.. 

లేచి పరుగు పరుగున అక్కడకు వెళ్లి తన చేతితో స్పృశిస్తూ .. 

ఆహా యెంత అద్బుతంగా వుంది ఈ రాయి.. 

ఇక్కడ ఉన్నవాటిల్లో ఇది చాలా ప్రత్యేకమైనదిగా కనపడుతూ వుందే .. అని అనుకొని ప్రక్కకు తిరిగి చూడగా.. పొదల మాటున ఎవరిదో ఓ చేతి రుమాలు అక్కడ పడివుండటం గమనిస్తాడు.. 

నాన్నగారు ….. 

ఇలా వచ్చి చూడండి .. ఇక్కడ ఎవరిదో చేతి రుమాలు వుంది.. 

ఇక్కడే ఎక్కడో అన్నయ్య ఖచ్చితంగా ఉన్నాడని నాకనిపిస్తోంది.. అని అంటాడు.. 

పరుగు పరుగున ప్రసన్నకుమార్ భాటియా వచ్చి .. 


నిజమే రా ఇది ఆకాష్ ది కాదు. కాని ఆకాష్ తో పాటు మరొకరు వుండి ఉండాలి.. నిన్న రాత్రి ఆకాష్ తో పాటు మోహన్ వున్నాడు…. బహుశా అతనిది అయి వుంటుంది.. అంటే ఇద్దరూ కలిసి వచ్చి వుంటారు.. 

అయినా అంత రాత్రి వేళ ఇద్దరూ కలిసి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది ? అని రెండవ వాడు ప్రశ్నిస్తాడు.. 

నిజమే ఇది ఆలోచించాల్సిన విషయమే…. అని ప్రసన్నకుమార్ భాటియా అంటూ ఆ ఊదారంగు రాయి వైపు చూసి … ఆ రాయివైపుగా వెళ్ళి నిలబడి తదేకంగా చూస్తున్నాడు.. 

లోకేష్, సంతోష్ ఇద్దరూ వచ్చి ఏంటి నాన్నగారు ఆ రాయిని అంతలా చూస్తున్నారు అనగా… 

ఇది మామూలు రాయిలా నాకు అనిపించట్లేదు రా.. అంటూ ఆ రాయిని చేత్తో తాకుతూ పై నుంచి కింద వరకు చూస్తుండగా.. కింద కాగడా కాలిన బూడిద, మసి, సగం కాలిన కొన్ని పుల్లలు అక్కడ పడి వున్నాయి.. 

ఇప్పుడు అర్ధం అయింది.. ఇది నిప్పుకు స్పందించే రాయిలా వుంది.… అందుకే ఎవరో ఇక్కడ మంట మండించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.. 

ఈ రాయి లోపల ఏదో రహస్యం వుంది.. ఈ ఇద్దరూ అదేంటో కనుక్కోవాలని అక్కడకు వెళ్ళినట్లు వున్నారు. వారికి మన సాయం కావాలి .. చిన్నోడా నువ్వు వెంటనే వెళ్లి మనం ఉంటున్న చోటునుంచి మంట తీసుకుని రా అని చెప్తాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

సంతోష్ పరిగెడుతూ వెళ్తాడు.. 

లోకేష్ మాత్రం నిజమా నాన్నగారు .. ఇది నిప్పుకు స్పందించే రాయా.. అలాంటిది ఒకటి ఉందా.. ?? 

ఎప్పుడూ వినలేదు అని అంటాడు.. 

నేను విజ్ఞానశాస్త్ర అధ్యాపకుడనే కాదు.. కొన్ని ప్రయోగాలు కూడా చేసివున్నాను.. అందుకే నాకు తెలిసినంతలో నేను చెప్తున్నాను.. ఇది ఓ అసాధారణమైన రాయి.. ఈ రంగు రాయి ఈ భూమ్మీద ఎక్కడా కనిపించదు.. ఎందుకంటే ఇది ఈ భూమికి చెందిన రాయి కాదు.. అంతరిక్షం నుంచి ఓ స్పటికంలా వచ్చి పడివుంటుంది.. దీని విలువ చాలా ఎక్కువ .. ఇంత విలువైనదాన్ని ఇక్కడ ఇలా ఎందుకు ఏర్పాటు చేసారో అర్ధం కావట్లేదు… అని చెప్తాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

నాన్నగారు అన్నయ్యకు ఏమి కాదు కదా.. అని లోకేష్ అనగా.. 

ఏమోరా ఇది కేవలం నా ఊహ మాత్రమే .. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇక దీన్ని జీవితం అని ఎందుకు అంటాము.. చూద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం.. వాడికేం కాదులే.. నువ్వు దిగులు చెందకు.. ఎలాంటి కష్టసమయాల్లో అయినా మనం కలిసిమెలిసి వుంటే మనకేం కాదు రా.. అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

ఇలా మాట్లాడుకుంటూ వుండగా.. ఈ లోపు సంతోష్ నిప్పును తెస్తాడు.. 

పక్కన వున్న ఎండిన ఆకులు, అలమలు వేసి ఒక మంట తయారు చేసి ….కొన్ని ఎండిన పుల్లలతో కాగడ లా కట్టి వెలిగించి ఆ రాయికి దగ్గరగా పెడతాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

ఆ మంటకు ఆ రాయిలో ఎలాంటి మార్పు వుండదు.. యెంత పెద్ద మంట వేసి దగ్గరగా పెట్టినా కూడా స్పందన లేకపోయే సరికి మళ్ళి ప్రసన్నకుమార్ భాటియా ను …మౌనం ఆవరిస్తుంది.. మళ్ళి దిగులుగా పక్కన వచ్చి కూర్చుంటాడు.. 

నేను ఎందుకు ఏమి చెయ్యలేక పోతున్నాను.. మొన్నటికి మొన్న ఆ వీలునామాలో దాగున్న రహస్యాన్ని కనుగొనలేకపోయాను.. ఈరోజు ఈ రాయి గురించి పొరపడ్డాను.. నేను ఏమి చెయ్యలేని నిస్సహాయుడను అయిపోయాను.. బహుశా వృద్ధాప్యం వల్లనేమో.. మీకు ఎందుకూ పనికిరాకుండా అయిపోతున్నాను రా అని బాధపడుతూ ఉంటాడు.. 

నాన్నగారు మీరు ఏమనుకున్నా పర్వాలేదు.. కాని మీరు మాతో వుంటే చాలు.. చెప్పలేనంత బలం మాకు వస్తుంది.. అని అంటాడు సంతోష్.. 

ఇలా మాట్లాడుకుంటూ వుండగా.. చీకటి పడుతోంది.. 

వీళ్ళల్లో భయం కూడా మొదలౌతోంది.. ఉదయం నుంచి ఈ దీవి మొత్తం జల్లెడ పట్టినా ఇంతవరకు ఆకాష్ జాడ కనుగొనలేదు. మనకు వున్న ఒక్క ఆశ ఆ చేతి రుమాలు దొరికిన ప్రదేశం. అందుకే ఈ రాత్రికి ఇక్కడే ఉందాం అని ప్రసన్నకుమార్ భాటియా అంటాడు.. 

ముగ్గురూ మంట వేసుకొని దాని పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ వుండగా … ప్లాస్టిక్ కవర్ ని బాగా నలుపుతున్న శబ్దం వస్తుంది.. ఏంటా అని చూస్తే ఆ ఊదారంగు రాయి ముడుచుకుంటూ కనిపిస్తుంది… వీళ్ళు హడావుడిగా మంటను ఆర్పివేసి .. ఆ పక్కన వున్న పొదలమాటుకు వెళ్లి దాక్కుంటారు.. ఆశ్చర్యంగా ఆ రాయినే చూస్తున్నారు ఈ ముగ్గురూ… అందులోనుంచి ఆకాష్, మోహన్ లు మండుతున్న కాగడ తో బయటకు వస్తారు.. వారిని చూడగానే ఆనందంతో ఆ పొదలచాటు నుంచి పరుగెడుతూ వెళ్తారు.. 

నేను చెప్పాను కదా.. 

మా నాన్నగారు, నా తమ్ముళ్ళు నాకోసం ఉంటారని అని మోహన్ తో ఆకాష్ అంటాడు.. 

మీరు ఇదే స్థలానికి ఎలా రాగలిగారు అని ఆకాష్ అడుగగా.. 

మోహన్ కి సంబంధించిన చేతి రుమాలు ఇక్కడ మాకు దొరికింది అందుకే ఇక్కడే వున్నాం అని సంతోష్ చెప్తాడు… 

నేను అనుకున్నట్లే ఆ రాయి స్పందిస్తోంది.. అయితే నాలో ఎలాంటి లోపం లేదు.. అని ప్రసన్నకుమార్ భాటియా సంతోషంతో అంటాడు.. 

ఇంతకీ మీరు లోపలకు ఎందుకు వెళ్ళారు ?? అని ప్రసన్నకుమార్ భాటియా ప్రశ్నిస్తాడు.. 

నాన్నగారు అదంతా తీరికగా చెప్తాను .. ఇప్పుడు మనం ఇక్కడనుంచి ఎలా బయట పడాలి ?? 

నువ్వేం దిగులు పడకురా రేపు ఉదయాన్నే మరో నౌక మనకోసం వస్తుందంట .. దానిలో మనం వెళ్లిపోవచ్చు.. పదండి అందరం అలసిపోయాము… విశ్రాంతి తీసుకుందాం.. అని మళ్ళి మంటరాజేసి అందరూ ఆ మంట దగ్గర కూర్చుని .. జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటారు… 

లోపల వారికి జరిగిన అన్యాయాలకు ప్రసన్నకుమార్ భాటియా.. మిగిలిన ఇద్దరు కుమారులు చాలా బాధపడతారు.. వాళ్ళకోసం ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకుంటారు.. 

అలా ఆ ప్రశాంతమైన రేయిలో ఎలాంటి గుడారం లేకుండా అందరూ వెచ్చని మంట ప్రక్కన కలిసి ఘాడ నిద్రలోకి జారుకుంటారు.. 


తెల్లవారుతుందనగా రావాల్సిన సమయం కంటే ముందుగనే ఆ నౌక పెద్ద శబ్దంతో హారన్ మోగిస్తూ వస్తుంది.. అందరూ హడావిడిగా వారి వారి వస్తువులను తీసుకొని వొడ్డుదగ్గరకు వస్తారు.. 

దీవికి కొన్ని మీటర్ల దూరంలోనే ఆ నౌక ఆగివుంది.. అందులో నుంచి ఓ వ్యక్తి చిన్న పడవను తీసుకొని వీరి వైపుగా వచ్చి, అందరినీ ఆ పడవలో ఎక్కమని ఆదేశించాడు… అందరూ ఎక్కి ఆ పడవలో కూర్చున్నారు.. ఆ పడవ నడిపే వ్యక్తి నౌక దగ్గరకు తీసుకువెళ్ళి ఆ నౌక యొక్క అడుగు భాగానికి చేర్చాడు.. అందరం నోరు ఎల్లబెట్టి యెంత పెద్ద నౌకో ఇది అనుకుంటూ వుండగా.... మీరు మీ గమ్యస్థానానికి చేరుకునే దాకా అందరూ ఇక్కడే ఉండండి .. ఇదిగో ఇదే మీ గది అని వారికి వారి గదిని చూపించి తను వెళ్ళిపోతాడు.. 

మా తాత గారు రాసిన వీలునామా ప్రకారం మేము వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వేల్లబోతున్నాం.. కలలో కూడా ఊహించని ప్రదేశానికి మేము అనుకోకుండా ఇలా రావడం చాలా ఆశ్చర్యంగా వుంది.. ఎన్నో రోజులు శ్రమ, యెంతో ప్రయాస, ఎన్నో ఒడిదుడుకులు, ఊహించని రాతలు, రహస్య అర్ధాలు అన్నీ చేదించిన మాకు ఈ ప్రయాణం ముగుస్తోంది అన్న భావన చాలా ఆనందాన్ని కలిగిస్తోంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

మళ్ళి ఇలాంటి నౌకలో ఎక్కుతామో లేదో అని చిన్నవాడు అయిన సంతోష్ ఓ సారి నౌక అంతా తిరిగి వద్దామని వెల్లబోతుండగా .. అరేయ్ నేను వస్తాను అంటూ ఆకాష్ కూడా వెళ్తాడు.. అడుగు భాగంలో వున్న వీరు మెట్ల ద్వారా ప్రతీ అంతస్తుకు ఎక్కుతూ వెళ్తున్నారు.. ఇంద్రభవనం లా వుంది ఆ నౌక అని మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఓ గదికి సంబంధించిన తలుపు మీద “నేత్రం నుంచి జాలువారే కన్నీరు” ఆకారంలో ఓ గుర్తును చూస్తాడు ఆకాష్.. 

ఈ గుర్తును ఎక్కడో చూసాను. అని మనసులో అనుకోని తన జేబులు వెతక సాగాడు.. 

ఇంతలో సంతోష్ ఏంటి అన్నయ్యా అలా వెతుక్కుంటూ వున్నావ్ .. ఏమన్నా పారేసుకున్నవా ?? అని అడుగుతుండగానే నువ్వు వెళ్లి చూడు నాకు కొంచం పనివుంది అంటూ వీరు వున్న అడుగుభాగంలోని గదికి పరుగెత్తుకుంటూ వెళ్తాడు ఆకాష్.. 

గదికి వచ్చి తన బ్యాగ్ లో పెట్టిన దీవి యొక్క నమూనా చిత్రాన్ని చూస్తూ మోహన్ కి సైగ చేసి తీసుకువెళ్తాడు.. 

ఏంటి ఆకాష్ నన్ను పిలిచావ్ అంటూ మోహన్ దగ్గరకు వస్తాడు.. 

ఇది చూసారా నిన్న మనకు ఈ మ్యాప్ ఆ సొరంగంలోని వారు ఇచ్చారు.. దీన్ని బాగా గమనించారా కనిపించీ కనిపించని ఆకారంతో ఓ గుర్తు ఇందులో దాగుంది … అదే గుర్తు (“నేత్రం నుంచి జాలువారే కన్నీరు”)ను నేను ఇందాక ఈ నౌకలోని ఓ గది తలుపుపై చూసాను.. ఆ గదిలో ఏముందో మనం తెలుసుకోవాలి.. ఖచ్చితంగా అందులో ఏదో వుంది.. అని చెప్తాడు ఆకాష్.. 

అవునా అయితే పద.. వెళ్దాం.. ఎవ్వరికీ అనుమానం రాకుండా మనం మెలగాలి గుర్తుపెట్టుకో అని అంటాడు మోహన్..

ఇద్దరూ కలిసి ఆ గది దగ్గరకు వెళ్తారు..

To be continued …

Written by : BOBBY