Friday, March 10, 2023

అతడెప్పుడూ గొప్పే మరి.....



అతడెప్పుడూ గొప్పే మరి

మురికి బ్రతుకుల జీవితాలను
చక్కబెడుతుంటాడు
చదివిన గొర్రెలు చేసే తప్పులను
సరిచేస్తూ ఉంటాడు
ఊరందరి మలినాలను ఎత్తే
సజీవ యంత్రం అతడు
నానిపోయిన మొండి చేతులతో
మురికితో సగం తినేసిన బంక చర్మంతో
ముక్కుపుటాలు దద్దరిల్లే దుర్గందంలో
అతడు రోజు రోజుకి మెడలోతు కాలువలో
కూరుకుపోతుంటాడు..!!

ఎప్పుడూ ఆరేసిన ఆశల ఖాకి ని చీకట్లో దులిపి
రాలిపోయిన వ్యర్ధాల బ్రతుకుని భుజానేసుకొస్తుంటాడు
అతడి చేయి కదిలితేనే జన జీవితాలు సాఫీగా సాగుతాయి
అటు పక్కకు వెళ్ళలేని దారులు సైతం అతడి స్పర్శకు
క్రమమైన వరుసల్లో ఒదిగి కూర్చుంటాయి
ఉదయ సాయంత్రాలను ఒక్కలాగే ప్రారంభించే అతడు
దుర్గందపు సువాసననే ఊపిరిగా శ్వాసిస్తాడు
రేతిరి వేన్నీళ్ళతో నలత తీరిన శరీరాన్ని
ఈరోజు, రేపంటూ జమా ఖర్చులు రాసుకుంటూ
నెల జీతం కోసం ఎదురు చూసే
విరామం లేని వెర్రి షావుకారి అతడు..!!

ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గుల మధ్యన
స్వేదాన్ని, ఉదకంలా తాగుతూ
మాసిన బ్రతుకుతో
ఆకలి కోసం అశుద్ధాన్ని ఎత్తుతున్నాడు..!!
అతడంటూ లేకుంటే మన బ్రతుకులు అధోగతే..!!
అందుకే
అతడెప్పుడూ గొప్పే మరి..!!

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985