Friday, January 20, 2017

“యువ” కవులే కాని, “నవ” కవులు లేని యుగం మనది..


“యువ” కవులే కాని, “నవ” కవులు లేని యుగం మనది..
******************************************

ఈ రోజుల్లో కవిత వ్రాస్తున్నంత మంది యువకులు, యువతులు ఇంతకుముందు వుండి ఉండకపోవచ్చు.. అయితే కొందరి కవితల్లో మాత్రం “నవత” కనిపించడం లేదు.. 


ఉడుకుతనం, దురుకుతనం, తిట్లు, పట్లు, మాటల ఫీట్లు, రాజకీయ విమర్శలు, వర్గ నినాదాలు, మాటల్ని బోల్తాకొట్టించి, నవ్వు పుట్టించి, చప్పట్లు కొట్టించుకోవడాలు, పూర్వకవుల నుంచి, జానపద సాహిత్యం నుంచీ భావాలు, వాక్యాలు కూడా కొట్టేసి అక్కడక్కడా మసిపూసి, స్వంతం చేసుకొని కీర్తి గడించడాలు .. ఇదీ ఈ నాటి ఆధునిక కవితా స్వరూపం.. సినిమాలు, పత్రికలు వంటి ప్రచారసాధనాలను కైవశం చేసుకొని తమ గిప్పిట్లో పెట్టుకొన్న వాళ్ళు తదితరులకంటే అత్యధికంగా కీర్తి ప్రతిష్టలను ఆర్జించడం జరుగుతున్నది.. అందరికీ అట్టివాళ్ళే ఆదర్శ కవులు అవుతున్నారు.. ఇది ఈనాడు ఆధునిక కవితా రంగాన్ని పట్టి పీడిస్తున్న జాడ్యం.. 

కవిత రాయడానికి కొంచం ఆలోచన కావాలి అన్న ఆలోచనే ఇప్పుడు కవితలు రాస్తున్న కొందరికి లేదు.. అసలు వారి ప్రతిభను నమ్మట్లేదు.. కొంచం భాషపై పట్టుకోసమైనా పూర్వ గ్రంధాలు చదువుదాం, వివిధ రంగాలకు సంబంధించి కనీస విజ్ఞాన్ని అయినా సంపాదిద్దాం, ప్రకృతిని, జీవనైజాన్ని పరిశీలిద్దాం.. ఉచితానుచితాలను గ్రహిద్దాం, గతాన్ని పునాదిగా చేసుకొని వర్తమానం సామగ్రిగా, భవిష్యత్తును ఇతోధిక సముజ్వలంగా నిర్మిద్దాం.. అనే ఆలోచనే లేదు ఎవ్వరికీ.. ఇక అందుకు కృషి ఎలా వస్తుంది ?? 

ప్రయత్నమెలా జరుగుతుంది.. ?? 

నిజానికి ఇదే ఈ యుగధర్మం.. బ్రతుకుదెరువును వెతుక్కోవడమే ప్రధాన లక్ష్యంగా పరిణమించిన ఈనాడు అన్ని విద్యలతోపాటు కవిత వ్రాయడం అనేది కూడా ఒక బ్రతుకుదెరువు సాధనంగా మారింది.. వాస్తవానికి చాలా ముఖ్య సాధనంగా కూడా అవుతోంది.. ప్రచారం, పేరు, గౌరవం, సత్కారాలు తద్వారా ఆర్ధిక లాభం.. హోదాగలవారి పరిచయం, పదవులలోకి ప్రవేశం వగైరా కవిత వ్రాయడం మూలకంగానే సులువుగా సాధ్యమౌతున్నాయి.. అందువల్ల రైల్వేస్టేషన్లలో భోజనసదుపాయాలవలె నేటి కవిత ఉడికీ ఉడకని మెతుకులు కాక తప్పడంలేదు.. 


స్వస్తి ___/\___


Written by : Bobby Nani

No comments:

Post a Comment