Friday, August 24, 2018

నల్లశాలువా


మహానగరాలలో యదేచ్చగా జరుగుతున్న కొన్ని పరిణామాలలో .. ఈ సిటీ బస్సుల స్వైర విహారం కూడా ఒకటి.. ప్రతీ ఏటా వేల ప్రాణాలు ఈ భారీ చక్రాల కింద నలిగిపోతున్నాయి.. నల్లని రోడ్లు నెత్తురోడుతున్నాయి.. మధ్యతరగతి వాడి వెన్నును విరుస్తూ, అవినీతి, లంచం అనే రెండూ పురుగులు రాజ్యమేలుతున్నాయి..ఆలోచించే నాధుడు, ఆచరించే మాధవుడు ఇద్దరూ కనుమరుగే.. !

కొన్ని రోజుల క్రితం కళ్ళముందు జరిగిన ఓ సంఘటన యధాతధంగా అక్షరాలుగా మలిచాను.. ఒక్కరైనా ఈ నిర్లక్ష్య ధోరణిని మారుస్తారేమోనని ..!!

నల్లశాలువా
*********

చలికి సూర్యుడికి కప్పిన ఎర్ర శాలువా 
తూర్పు సంధ్య తొలగించి మేల్కొలిపింది.. 
తను లేవకమునుపే నిద్రలేచి నడుస్తున్న 
లోకాన్ని చూచి 
జాలిపడ్డాడు సూర్యుడు 
విద్యుక్త కార్యానికి ఉద్యుక్తుడయ్యాడు 
దేశ సంపద అరవై కుటుంబాలకే హస్తగతమైనట్లు 
నగర వాసుల ప్రాణాలు 
సిటీ బస్సుల చక్రగతమై పరిభ్రమిస్తున్నాయి 
చక్రాలే కానీ బ్రేకుల్లేని బస్సుల మధ్య 
ప్రాణాలు ఇనప్పెట్టెలో దాచుకున్నా 
ఫలితం దక్కకుండా ఉంది..
భవిష్యత్తును బ్యాగులో దాచి 
మరణ మృదంగాల మధ్య 
అక్షరాభ్యాసం కోసం జనారణ్యంలో 
అడుగులు వేస్తున్న బాలుని బ్రతుకు 
అదుపుతప్పిన బండికింద 
అర్ధాంతరంగా ముగిసి
నల్లని తారురోడ్డు మందారంలా మారింది..!!

జన నియంత్రనే లక్ష్యమై రవాణాధికార్లు
నగరాన్ని నేరస్తులకు అంకితం చేసిన పోలీసు యంత్రాంగం 
తప్పొప్పుల పట్టికలో, 
ఒప్పుల కిరీటం తప్పులకు కట్టబెట్టి మెల్లిగా జారుకుంది..!!
మనఃక్లేశాన మరణించిన సూర్యుడిపై నల్లశాలువా కప్పి 
పడమటి సంధ్య గుక్కపెట్టి రోధిస్తూ ఉంది..
చనిపోయిన బాలుని శవం 
అంతిమ యాత్రకు బయలుదేరగా 
చిదిమేసిన బస్సు 
స్వైర విహారానికి కదిలి ఎదురైంది...!!

Written by : Bobby Nani

Wednesday, August 15, 2018

ఆమె సామాన్య స్త్రీ కాదు...ప్రతీ స్త్రీ మూర్తిలోనూ ధర్మత్వం, దైవత్వం, మాతృత్వం, రసికత్వం, వ్యక్తిత్వం ఇలా ప్రతీ కోణంలోనూ ఆమె వికసిస్తూ ఉంటుంది.. ఆమె అంతరంగాన్ని చూడగలగాలే గాని తనని మించిన దైవం ఉండదనిపిస్తుంది .. అందుకే ఓ కవి ఇలా అన్నాడు బ్రతుకు ముల్లబాటలోన్ జతగా స్నేహితురాలవయితివి ....కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి....వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన బార్యవైతివి....పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి.. కష్టంలో ముందుండి.... సుఖంలో క్రిందుండి....విజయంలో వెనకుండి ....ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ... వారిని వర్ణించడం, సత్కరించడం తుదకు నమస్కరించడం కూడా మనకు తెలిసుండాలి అని విన్నవిస్తూ, ఈ చిరు సత్కారం..!!

ఆమె సామాన్య స్త్రీ కాదు
బ్రహ్మచే పంపబడిన ఒకానొక సౌందర్య శక్తి 
ఆమె మేను ఎర్రని లేత చిగురు కాంతి లా, 
చక్కగా వికసించిన మోదుగు పువ్వులా
ఎర్రనైన వంపుతిరిగిన ఆమె అధరములు 
కుంకుమ కాంతిని వర్షిస్తుంటాయి..!!

కుచముల మొదలు నాభి సరస్సు వరకు 
ఆమె నూగారులు నల్ల త్రాచు పిల్లలవలె, 
చలిచీమల బారుల వలె నాచుతీగలవలె 
అత్యంత రసికత్వాన్ని రంగరిస్తూ 
లోకోత్తర లావణ్యరూపిణిలా 
మధుకము వంటి నడకలతో, 
పూర్ణవికసిత బంగారు పద్మముల వంటి పాదాలతో, 
కోకిల స్వర మాధుర్యాన్ని అధిగమిస్తూ, 
ఒక్కింత గర్వమును, 
ఒక్కింత సరస రసమును 
కటీరములపై ఒలకబోస్తూ, 
తుమ్మెద వరుసల వంటి శిరోజాలను 
లయబద్దముగా నాట్యము గావిస్తూ 
నర్తించు ఆమె సొగసులు 
సాధువునికి సైతం మనఃపలకముపై 
చెరగని ముద్రను చిందించగలవు...!!

ఆమె నడుముకు చుట్టిన గంటల మొలనూలు, 
ఆ పాదాలకు అంటిన రత్న భూషణములు, 
ఆమె వక్షఃస్థలముపై ముక్తాహార విందములు, 
నాభిన వ్రేళ్ళాడు సౌందర్య ముత్యపు పుట,
పాదాలకు అంటిన అందియల హారములు, 
ఆమె నఖశిఖ పర్యతము మైనపు పూత పొదిగిన
కనకాంబరపు కాంతులను వేవేల వర్ణములు గావించినా 
తనివితీరదెందుకనో..!!

Written by : Bobby Nani

Thursday, August 9, 2018

ఓయ్ నిన్నే వింటున్నావా.. !!నీ 
తలంపు తగిలితే చాలే 
ఓ తియ్యనైన అనుభూతి నా 
లోలోన దూరిపోతుంది. 
రోజూ చూచే నక్షత్రాలు 
ఈ రోజు మరింతగా మెరుస్తున్నాయి 
ఏనాడూ కనిపించని ప్రేమ చేపలు 
పడవ అడుగున తమకముతో ప్రేమించుకుంటున్నాయి 
పిల్లల ముఖాలపై దోబూచులాడే నిర్మలత్వం 
చూసిన ప్రతీ చోటా నాకు కనిపిస్తుంది.. 
ఆ రెండు జడలతో 
కళ్ళముందే తోరణాలు కట్టే నీ మందహాసము 
నా నరాల్లో ప్రాణాన్ని, 
నా కలంలో సిరాని నింపుతూ ఉంటుంది. 
నీ సమ్మోహన రూపం దర్శించిన ప్రతీ సారి 
హృదయం చమర్చి 
నా కళ్ళను కడుగుతూ ఉంటుంది.. !! 

నీ పాదాలకంటిన నూరు అందియలలో 
నేనో అందియనైనా కాకుంటినే 
నీ అడుగుల సరిగమలకు 
నే గమకములు పలికేందులకు. 
ఓయ్ 
జానపద సాహిత్యం లాంటి నిన్ను 
నా భావకవిత్వ సాహిత్యంతో ఏలుకోవాలని ఉంది.. 
అలంకారాల ముళ్ళు లేని 
వాస్తవ కుసుమం లాంటి నిన్ను 
నా స్వప్నాల గుండెల్లో తురుముకోవాలని ఉంది..!! 

నీ పెదాల మీద నేనో కళ్యాణ రాగమై 
నీ వక్ష వృక్షం పై నేనో విహంగమై 
కళలు కన్నులు విప్పిన ఆ కనుబొమ్మల మధ్యన 
కాంతి పుంజమై, అరుణారుణ తిలకమై, 
శాశ్వతముగా నిలవాలని ఉంది. 
ఓయ్ నిన్నే 
వింటున్నావా.. !!

Written by : Bobby Nani