Saturday, February 25, 2023

గంధర్వ కాంత ...


ఒక పుష్పం ఎన్ని విధాలుగా పరిణామం చెందగలదో
అంతకన్నా ఎక్కువగా ఒక స్త్రీ పరిమళించగలదు
ఇది పురుష జాతి తెలుసుకోలేని అక్షర సత్యం..!

తను ఏకాంతంలో వున్నప్పుడు చూడాలి
తన అల్లరేంటో,
తన ఆటా, పాటా ఏంటో..!
ఆ రమణీయతను దర్శించాలంటే
ముక్కంటి దగ్గర మనోనేత్రం
అరువు తెచ్చుకోవాల్సిందే..!

తను అభినయిస్తుంది తన హావభావాలతో
తను ఉదయిస్తుంది తన కెంపారు నేత్రాలతో
తను నర్తిస్తుంది తన ఆంగికాభినయముతో
తను రవళిస్తుంది తన సవ్వడి పాంజేబులతో

అరచేతులు ముఖానికి అడ్డుపెట్టుకొని
పక్కకు తిరిగి వేళ్ళ సందునుంచి
దొంగ చూపులతో సిగ్గుపడుతుంది చూడు
ఏ విపంచి పలికించగలదు
తన భావాల స్వరాలను
ఏ కృతికర్త రచించగలడు
తన మనోసౌందర్య భావ వీక్షణను
ఏ చిత్రకర్ముడు గీయగలడు
తన మానస నందనవనమును

తానెప్పుడూ వేకువ మయూరమే
అందుకే మొదటి జామునే
కోనేరు గట్టున కూర్చుని
సంపెంగ తైలం ఒడలంతా పూసుకొని
చందన నలుగు మేనంతా రాసుకొని
మెడలోతు నీటిలో
తేలుతున్న ముఖముతో
విచ్చుకున్న తామరై
శ్వేత హంసలా వయ్యారాలొలుకుతూ
తనవంతా జలతారులా వచ్చింది..!!

పన్నీటి ముత్యములు తనువంతా జల్లుతూ
అగరుధూపమున కురులనార్చుతూ
పసిడివర్ణపు పట్టువస్త్ర మలంకరించుతూ
పగడాల రవిక బిగుతుగా తొడుగుతూ
కెంపులు తాపిన కర్ణాభరణాలు చెవుల కమర్చుతూ
బహుచక్కని రీతిగ అలంకార మమరగా..!!

హంసలు చెక్కిన జడబిళ్ళ నమర్చి
ఆత్మీయ అంగుళీయము మురిపెముగ తొడిగి
కస్తూరి సింధూరము నుదుట నద్ది
పచ్చ కర్పూరపు కాటుక కెంపారు నేత్రాల కద్ది
నవనీత నడుమొంపులకు రవ్వల వడ్డాణము జుట్టి
నిలువుటద్దాలలో తుది మెరుగులు దిద్ది
గంధర్వ కన్యలా ఎదుట నిల్చుంది..!!

స్తన విస్తారిత,
నిత్య సౌందర్య శోభిత
కాశ్యపలాలిత,
హవణిక వినీత
నవనీత హృదయత
లలనా హృదబ్దగలిత

ఓ లలనా
ఇలాంటి విన్నాణము
నీకు మాత్రమే చెల్లింది
శరత్కాలపు వెన్నెలను
నిను చుట్టిన వస్త్రం దాచగలదా
ప్రణయ వీణ మీటుతూ,
వలపుజ్యోతి వెలిగిస్తూ,
అనుక్షణం వూహల ఊయల
ఊగించడం న్యాయమా..!

చూస్తున్నావా?
చంద్రకాంతికి
చంద్రకాంత శిలలు కరుగుతున్నాయి
చకోరాలు
గప్చిప్గా సుఖిస్తున్నాయి
చక్రవాకములు
తామరతీగతో ముడుచుకున్నాయి
దశవిధములైన విరహ జ్వాల నను బంధించింది
అందుకే ఓ గాఢ పరిష్వంగముతో
భుజ బాహువుల మధ్యన వెన్నలా కరిగిపోవే..!!

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985

Tuesday, February 14, 2023

దేశభాషలందు తెలుగులెస్స...



ముందు భాష గురించి కొంత తెలుసుకొని తరువాత తెలుగు గురించి తెలుసుకుందాం..

మానవుడికీ పశువుకీ గల ముఖ్యమైన తేడాల్లో భాష ఒకటి. ఒక జాతి లేదా దేశం సంస్కృతి గానీ, చరిత్ర గానీ కళలు గానీ, సాహిత్యం గానీ అన్నీ భాష మీదే ఆధారపడి వుంటాయి. అసలు భాష ప్రజలకోసమే పుట్టింది. అభిప్రాయాల్ని వ్యక్తపరిచే ఒక సాధనం భాష. ఆ తర్వాతే సాహిత్య భాష, శాస్త్ర భాష మొదలైనవి పుట్టాయి. 'భాష కి తెలుగులో సరైన పదం లేదు. ఉండాలనీ లేదు. కొన్నిటికి కొన్ని భాషల్లో మాటలు లేక పోవటం సహజమే.
భాష అంటే ఏమిటి?
ఉచ్చారణ అవయవాల సహాయంతో భావాన్ని తెలియజేసే మాటల సమూహమే భాష అన్నారు.
అభిప్రాయల్ని వివరించే ధ్వనుల ఉచ్చారణని భాషగా కొందరన్నారు.
అయితే ఉచ్చారణ లేకుండానే అవయవాల కదలిక ద్వారా కూడా అభిప్రాయాల్ని తెలియచెప్పవచ్చు.
వెళ్ళు, రా, వద్దు, నిశ్శబ్దం వంటివాటిని అవయవాల సంకేతం ద్వారా తెలపటం మనకి తెలిసిందే కదా!

ఇంతకీ భాష ఎలా పుట్టింది?

ఈ ప్రశ్న ప్రశ్న గానే మిగిలిపోతుంది. 'భాష దేవుడి సృష్టి' అంటే అసలు చిక్కేమీ వుండదు. కాని, పుట్టిన పసిబిడ్డని అడవిలో వదిలేసి వచ్చేస్తే భాష రాదని నిర్ణయించారు. అందువల్ల మానవ సమూహంలో వుంటేనే భాష అలవడుతుందన్నమాట! సంస్కృత భాషను "అమరుల భాష'గా చెప్తారు. భాష ఎలా పుట్టింది. అనే దానికి చాలా సిద్ధాంతాలున్నాయి. అయితే సమగ్రమైన, సహేతుకమైన, సార్వకాలికమైన, సార్వజనీనమైన సిద్ధాంతం లేదనాలి.

ప్రపంచంలో ఇప్పుడు సుమారుగా 2,900 భాషలు ఉన్నాయని చెప్తారు. మన దేశంలోనే రెండు వందల భాషలున్నాయట! భాషలన్నీ సంస్కృతంలో నించే పుట్టాయని నమ్మేవారు తెలుగు మొదలైన కాని అది సరి కాదని భాషాశాస్త్రం నిరూపించింది. సంస్కృత భాషా ప్రభావం ఉన్న మాట నిజమే కాని - "అన్ని భాషలకి తల్లి సంస్కృతం" అన్నది సహేతుకం కాదని తేలింది. ఉత్తర భారత దేశంలోని భాషల్ని ఆర్య భాషలని అంటారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం మొదలైన. వాటిని ద్రావిడ భాషలంటారు. తెలుగు ద్రావిడ భాష అన్నమాట!

ఇకపోతే మన తెలుగు భాషకి చాలా పేర్లుండేవి. పోర్చుగీసువాళ్లు మన భాషని 'జెంటూ భాష' అని పిలిచేవారు. తమిళ, కన్నడ పుస్తకాల్లోనూ, శాసనాల్లోనూ 'వడుగ, వడగ, తెలింగ, తెలుంగు' అనే విధంగా పేర్లు కనిపిస్తాయి. విదేశీయులు కొందరు 'తెలుగు' అనే వారు. అయితే ఎక్కువగా వాడే పేర్లు మూడు -అవి ఆంధ్ర, తెలుగు, తెనుగు అనేవి.

ఋగ్వేదంలోనే 'ఆంధ్ర' పదం వుంది కాబట్టి ఆంధ్ర జాతి అప్పుటికే (అంటే సుమారు క్రీ.పూ. 600సం) వుందని తెలుస్తుంది. 'ఆంధ్ర' అనే పదం వీరు వేటగాండ్లు కావడం వల్ల, వేటలో జీవించేవారు కావడం వల్ల ఆ పేరు వచ్చిందని చెప్తారు.. సరే, శత్రువుల్ని అంధులుగా చేసేవారు - ఆంధ్రులు అని కూడా అర్ధం చెప్పారు. ''తెనుగు' పదమే ప్రాచీనమని కొందరు, 'తెలుగు' ప్రాచీనమని మరికొందరు అభిప్రాయపడ్డారు. కానీ నన్నయ 'తెనుగు' పదాన్నే వాడాడు. 'త్రినగ' నుంచి తెనుగు ఏర్పడిందని కొందరు, 'తెన్' నుంచి తెనుగు వచ్చిందని కొందరు అంటారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, మహేంద్రగిరి (గంజాంజిల్లా) అనే మూడు కొండలు గల ప్రదేశంగా 'త్రినగ' శబ్దం ఏర్పడిందిట. తెన్ అంటే దక్షిణదిక్కు. దక్షిణ ప్రాంతానికి సంబంధించిన భాష కాబట్టి 'తెనుగు' అయిందని ఎక్కువమంది అంగీకరించారు.

మనం ఎక్కువగా వాడే పదం 'తెలుగు. ' మన ప్రాంతానికి పూర్వం త్రిలింగదేశం అనే పేరుండేది. శ్రీశైలం, కాళహస్తి, దక్షారామం. (ద్రాక్షారామం) అనే పుణ్యక్షేత్రాల్లో గల మూడు శివలింగాలు ఆధారంగా త్రిలింగ - తి అలింగ - తెలింగ తెలుంగు తెలుగు అయిందని చెప్తారు. మరికొందరి అభిప్రాయం ప్రకారం త్రి కళింగ నుంచి తెలుగు ఏర్పడింది. మొత్తం మీద ఆంధ్ర తెలుగు తెనుగు మూడూ ఒక్కటే. తెనుగు ప్రాచీనమైంది అనుకొంటే 'ల న' లు మారటం తెలుగు లో సహజం కాబట్టి (ములుగు మునుగు, లేదు – నేదు) తెనుగు తెలుగుగా మారిందని చెప్పవచ్చు.

పూర్వం తెలుగు ఎలా వుండేదో తెలుసుకోవాలంటే ఆనాటి శాసనాలే ముఖ్యమైన ఆధారాలు. అమరావతి స్తూపంమీద గల 'నాగబు' అనేది తెలుగులో మొట్టమొదటి పదం అంటారు. శాతవాహనుల కాలం నాటి వెండి నాణాలమీద ఒక ప్రక్క ప్రాకృతంలోనూ, మరో ప్రక్క తెలుగులోనూ రాయబడివుండేది. ఆనాటి ఒక నాణెం మీద వున్నట్టు పరిశోధకులు నిర్ణయించిన క్రింది వాక్యం కూడా తెలుగు వాక్యమే అంటే మీరు నమ్ముతారా?
"అరహిణిష వాహిట్టి మాకనషతిరుపోత కణిష"

నన్నయ కాలంనాటి తెలుగుభాష వేరు. నన్నయకి ముందున్న తెలుగు భాష వేరు. క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దికి చెందిన శాతవాహన రాజుల కాలం నుండి తెలుగు బాషకు ఒక విశిష్టమైన చరిత్ర ఉన్నది. భారత దేశంలో తెలుగు మాట్లాడే ప్రజలు ఎన్నో కోట్లకు పైగా ఉన్నారు. హిందీ మాట్లాడేవారి తరువాతి స్థానం మన తెలుగువారిదే. బౌద్ధ పూర్వ యుగంనుంచి, బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలనాయుగం వరకూ తెలుగువారు పెద్దఎత్తున ప్రపంచం నలుమూలలకూ వలస వెళ్ళడం, అలా వెళ్ళిన తెలుగువారు తమ భాషా సంస్కృతి సంప్రదాయాలను ఆయా జాతీయ జీవన విధానాలతో మేళవించి, వాటిని సుసంపన్నం చేయడం జరుగుతూ వుంది.

పూర్వం తెలుగు లిపిలో అరసున్న కనిపించదు. మొదట్లో తలకట్టులు లేవు. దీర్ఘాల్ని తెలపటానికి చిన్న అడ్డు గీతలు పెట్టేవారు. ఒక నిలువు గీత, రెండు నిలువుగీతలు కామా, ఫుల్స్టాప్లుగా వాడేవారు. బదులుగా అనునాసికాలు ఎక్కువగా కనిపిస్తాయి. అసలు కొన్ని వాక్యాలు కలిపి మహావాక్యంగా వుండేవి. రాళ్ళమీదా, రాగిరేకులమీదా రాయటం మొదలై ఆ తర్వాత తాటాకుల మీదకి వచ్చింది అప్పటినుంచి తెలుగు అక్షరాలకి ఒక కుదురు, ఒక క్రమం వచ్చింది. తాటాకుల మీద రాయడానికి ప్రత్యేకంగా 'వ్రాయసగాళ్ళు' వుండేవారు. అప్పటికే 'దస్తూరి' కి ప్రాముఖ్యం వుండేది. ముత్యాల కోవలా రాయటం ఒక 'గొప్ప'గా భావించబడేది. దస్తూరికి మనవాళ్ళు ఎంతో ప్రాముఖ్యం ఇవ్వబట్టే 'చూచికాపీ' లు, కాపీ పుస్తకాలు అలవాటయ్యాయి. గొలుసుకట్టుగా రాసేవారు. లిపిలో విడివిడి అక్షరాలతో పాటు కొందరు కొందరిది అర్థం కాకుండా 'బ్రహ్మరాత' లావుంటుంది. అంటే మనకి తెలీని 'బ్రాహ్మీలిపి' నే బ్రహ్మరాత అని మన నుదుట రాసే బ్రహ్మవ్రాత, అని కొందరు అర్థం చెప్తారు.

అసలు మాట్లాడే భాష వేరు. రాసే భాష వేరు. మాట్లాడినట్టుగా రాయలేం. రాసినట్టుగా మాట్లాడనూలేం. ఏ భాషలో నైనా ఇది మామూలే. ఇంగ్లీషులో ఈ భేదం మరీ ఎక్కువ గదా! 'మధ్యాహ్నం' అని రాస్తాంతప్ప అలాగే పలుకుతామా? మజ్ఞానం అంటాం. అలాగే మామా, ఏమోయ్ వంటి వాటిని మనం పలికినట్టు రాయలేం.వాడుకలో మనం వాడే "మొహం "ముఖము" నుంచి ఏర్పడిందే. ముఖము -మొగము - మొగంగా మారి చివరికి మొహం అయింది. ఒకనాటి తేనియ, నూనియలు ఈనాడు తేనే, నూనె అయ్యాయి. వలదు నుంచే "వద్దు" వచ్చింది. అలాగే కొలది - కొద్ది, చలిది - చద్ది, తరుగు తగ్గు అయ్యాయి.
"చిలుక 'చిక్క" గా, పలుకుని "పల్కు" గా మార్చుకున్నాం. ""అర్పణము" ను "అప్పనంగా తెచ్చుకున్నాం. "వంగకాయ" అంటే మన వంకాయ పెత్తనం అంటే మనం సహించం కానీ అది "పెద్ద తనము'' అంటే గౌరవిస్తాం కదా! పూర్వం పచ్చళ్ళు పెట్టడానికి రాచ్చిప్పలు వాడేవారు. అది “రాతిచిప్ప" నుంచి వచ్చిందే.. క్రొత్త కొత్తగానూ, ప్రాత మార్చుకొన్నాం. పాత గానూ, వ్రాత - రాత గానూ అంతే కాదు రక్తం నుంచి 'రకతము' వచ్చింది. 'యాత్రని 'జాతర' చేసుకున్నాం. రాత్రిని 'రాతిరి' గా మార్చుకొనటమే కాదు - 'రేతిరి' గా చేసేశాం. ''వత్తు' ఉన్నప్పుడు వాటిని తీసేశాం. ఉదాహరణలు -

సఖి -సకి; పీఠము, పేట, కాష్ఠము - కట్టె; ఫలకము - పలక అందాక ఎందాకలో వున్న 'దాక' ఏమిటో తెలుసా? 'దనుక' నుంచి 'దాక' వచ్చింది. మనం ఇష్టపడే సంపెంగ 'చంపక వన్నెచిన్నెలు వన్నియ, చిహ్నములనుంచి ఏర్పడినవే. ప్రపంచం అంటే చాలదూ ప్రపంచకం అంటాం. అలాగే అసలు 'బొటవ్రేలు' అను మధ్యలో 'న' చేర్చి 'బొటన వేలు' చేసుకొన్నామని అంటారు. ఇలా మన తెలుగు ఎన్నోరకాలుగా మార్పు చెందుతూ వచ్చింది.

తెలుగు లో మొట్ట మొదటి పుస్తకం 1746 వ సంవత్సరంలో అచ్చైంది. దానిపేరే “నూరు జ్ఞాన వచనాలు”
దీన్ని “రెవరెండు బెంజిమన్ సుల్డ్” అనే అతను ముద్రిపించాడు. అప్పటి నుండి తెలుగులో ముద్రణ యుగం ఆరంభమైందని చెప్పొచ్చు.. ఇది వచన పుస్తకం. అంటే తెలుగులో అచ్చైన మొట్ట మొదటి పుస్తకం వచనంలోనే ఉందన్నమాట.

పాశ్చాత్యులు తమ మత ప్రచారార్ధం ప్రవేశ పెట్టిన ముద్రణ తెలుగు సాహిత్యానికి ఎంతో మేలు చేసింది. అందులోను “వచన సాహిత్యం” మరీ ఎక్కువగా అభివృద్ధి చెందింది.

తెలుగు వచనం గ్రాంథికాన్ని వదిలించుకొని, వ్యావహారికాన్ని సంతరించుకొని ఎన్నో ప్రక్రియల్లో మరింత వికసించింది. అవి: కవిత, కథ, నవల, వ్యాసం, స్థానిక, జీవిత, స్వీయ, యాత్రా, సాహిత్య చరిత్రలుగా, పీఠికలు, సంపాదకీయాలు, నాటికలు ఇలా వివిధ ప్రక్రియలు. ప్రాచీన సాహిత్యమంటే కేవలం కవిత్వమే గుర్తుకొచ్చినట్లు, ఆధునిక సాహిత్యమనగానే గద్యరచనలే గుర్తుకొస్తాయి. అందుకే ఆధునిక సాహిత్య యుగాన్ని 'వచన యుగంగా' పేర్కొంటే అది అతిశయోక్తికాదు.

వచన సాహిత్యంలో ఎక్కువ ప్రక్రియలను వీరేశలింగం పంతులే మొట్ట మొదట దేపట్టి వాటికి ఆద్యుడైనాడు. 'దిద్దుబాటు' కథానిక రాసి గురజాడ కథానికా సాహిత్యానికి మొదటి వాడైనాడు.

ఈవిధంగా ఆరంభమైన ఆధునిక వచన ప్రక్రియల్లో వీరేశలింగం, గురజాడలతో పాటుగా ధర్మవరం కృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు, కట్టమంచి, విశ్వనాథ సత్యనారాయణ, చలం, అడవి బాపిరాజు, నోరి నరసింహశాస్త్రి, శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, ఆరుద్ర, రంగనాయకమ్మ, రామలక్ష్మీ, వాసిరెడ్డి సీతాదేవి మొదలైన వారెందరో 'వచనం' లోని వివిధ ప్రక్రియల్లో రచనలు చేసి తెలుగులో వచనాభివృద్ధికి తమ వంతు కృషి చేశారు.

ఎప్పుడైనా ఒక భాష గొప్పతనం తెలియాలి అంటే అన్నీ భాషలు తప్పక తెలిసి ఉండాలి... అందుకే శ్రీకృష్ణ దేవరాయలు అంతటివారు “దేశభాషలందు తెలుగులెస్స” అని సంబోధించారు... సి.పి.బ్రౌన్ గారు వేనోళ్ళ కొనియాడారు. అంతటి గౌరవపురస్కారాన్ని అందుకున్న తెలుగు నేడు యువత నోటిలో తెగులుగా మారి బయట పడుతోంది.

తెలుగు అంటే మన అమ్మతో మనం మాట్లాడే మన బాష. అందుకే కొంతైనా మన తెలుగు గురించి తెలుసుకుందాం.. అవసరం లేనిచోట అనవసరమైన పాశ్చాత్య బాష ఎందుకు? చక్కగా తెలుగులో మాట్లాడుకునేలా నేటి యువత అడుగులు వెయ్యాలి. మనసులోని భావాన్ని వ్యక్తీకరించాల్సి వచ్చినప్పుడు తెలుగులో ఉన్నంత కమ్మదనం మరేబాషలోనూ రాదు రాలేదు.

ఇలా వ్రాసుకుంటూ పోతే వ్యాసం కాస్త సంపుటమై పోగలదు. అందుచేత ఇక్కడితో స్వస్తి..__/\__

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985