Thursday, September 28, 2017

\\\\హృదయాలయం ////\\\\హృదయాలయం ////
*****************


వెయ్యి ఏనుగులు 
ఒక్కసారి ఘీంకరించినట్లు, 
వెయ్యి జలపాతాలు 
ఒక్క పెట్టున మ్రోగినట్లు, 
కోటి ఉరుములు, 
కోటి మెరుపులు, 
బుద్దిని బద్దలు చేస్తున్నాయి..!! 
గుండెను పుండును కావిస్తున్నాయి..!! 
వంద నందనవనాలు 
ఒక్కసారి పుష్పించినట్లు.. 
వేల విద్యుద్దీపాలు 
ఒకేసారి వెలిగినట్లు..
తనువంతా పరిమళం, 
తలంతా కాంతులు, 
ఊపిరి సలపనివ్వటం లేదు..!! 
చూపు ఆననివ్వటం లేదు..!! 
నరాల తీగల్లో, 
నాకు తెలియని తంతివార్తలు.. 
గుండె కోనలో, 
అవ్యక్త మధుర సంగీత ధ్వనులు.. 
కను కొలుకుల్లో, 
కనిపించని వర్ణ చిత్రాలు.. 
అరలు తొలగి పొరలు తొలగి, 
కలల్లోని కమ్మని బొమ్మలు,
వెన్నెముక నిచ్చెన మీద, 
మంచులాంటి చేతులూ.. 
వెన్నలాంటి పాదాలూ.. 
తాకుతున్న, దూకుతున్న, జాడలు నీడలు.. 
హృదయ రక్తనది వంతెన మీద, 
పూల అడుగుల నడకలు..!! 
పరుగుల సవ్వడులు.. !!
తీయని మర మేకులు,
కమ్మని రంపాలు, 
హాయి అయిన సమ్మెటలు, 
గుండెను తొలుస్తున్నాయి...!! 
కోస్తున్నాయి..!! 
కొడుతున్నాయి..!! 
మధుర వేదనలు, 
మనస్సు పూల చెట్టును,
మరీ మరీ విదిలిస్తున్నాయి..!! 
కదిలిస్తున్నాయి..!! 
ఆనందస్రోతస్విని అంచున 
అమృతం కురిపిస్తున్నాయి..!! 
ప్రవహిస్తున్నాయి..!! 
కళ్ళు మూసుకుంటే, 
కనిపించే సుందర దృశ్యాలు, 
కనురెప్పల తలుపులు తీస్తే, 
కదిలిపోతున్న వెన్నెల వాగులు, 
నా శరీరం వీణను, 
నా మనస్సు మీటను, 
నా నరాల తీగలను, 
కదిలించి కుదిలించి, 
నా హృదయాన్ని పలికించే, 
ఈ అమాయికపు అల్లరిమూక, 
నా ప్రాణానికి వెన్నెలవాక..!! 
ఈ వినిపించని సంగీతం, 
ఈ కనిపించని సాహిత్యం, 
ఏ నాటికో వినిపిస్తుంది..!! 
కనిపిస్తుంది..!! 
ఆ నాడు, 
నన్నాడించిన, ఉడికించిన, 
పలికించిన, రాయించిన, 
ఈ అమాయికపు అల్లరిమూక, 
నా గుండెకు ప్రతినిధిగా, 
నా హృదయానికి ఆలయంగా, 
నాకు శాశ్వతత్వం ప్రసాదిస్తుంది..!!
అంతవరకు ఇలా.. 
నేనిలా..!!

Written by : Bobby Nani

Saturday, September 23, 2017

యుత్ప్రేక్షాలంకారములతో కూడిన వర్ణన ఇది..యుత్ప్రేక్షాలంకారములతో కూడిన వర్ణన ఇది.. 

(ఇందులో ఉపయోగించిన పద ప్రయోగాలు, శబ్ద మాధుర్యాలు మీకేక్కడా కనిపించవు, వినిపించవు .. అందరికీ అర్ధం అవ్వకపోవచ్చు.. మన్నించాలి... )

తొలి చూపులో చూచిన చెలి అందచందములు చూచిన భావకుడు.. ఎన్నో ఏళ్ళ తరువాత ఆమెను చూచినా కూడా అదే అందచందములు ఆమెలో అమరి ఉండటం చూసి ఔరా .. ఏమి యీ పడతి అందం అని నోరు ఎల్లబెడుతూ అదే మలిచూపుగా, ఆ అపూర్వసౌందర్య రాశిని చూస్తూ పరవశించి, ఆమె రూపలావణ్యములను దంపూర్వరీతిలో భావించి ఆ భావకుడు వర్ణించాడు.. అంతే కాదు.. 
ఆమెలో పాత్రౌచిత్య సంభాషణ, 
పదగుంభనాచాతురి, 
అనల్ప శిల్పకల్పనా నైపుణి, 
అత్యాకర్షణీయమగు ఉక్తి చమత్కృతి, 
రసస్పూర్తి, 

మొదలగు విశేషములు మెండుగా గల్గి అపర సౌందర్యరాశికున్న లక్షణాలు కనిపించాయాభావకునికి... 

కలకంఠి కంఠమున
కొలువున్న గీర్వాణి 
వీణియను గీల్కొల్పు 
వజ్రపేటి కోపరి 
భద్రకవాటములన 
పెం పెందు బింబోష్ఠి 
పెదవులే ఒక ఎత్తు 
అధరయుగళము దెఱువ 
మధుర మంజుల రీతి 
శ్రుతిరుచిర గీతికా 
ఋతులగుచు వెలుగొంది 
దంతపంక్తుల కాంతి 
దొంతి మల్లియ నవ్వ 
హితము నుపదేశించు 
మితభాషి, శుఖవాణి 
మురువు హరువులు గులుకు 
పలుకును పై ఎత్తు.. 
తీరైన ఆ కనులు 
తీయ తలపుల గనులు 
నిడుపైన ఆ నాస 
పొడవైన నా యాశ 
అదరు లేబెదవి, నా 
ఉదుటు రక్తపు పృధివి 
ఈ లేమ, ఈ చాన 
ఈ మగువ, ఈ కాంత 
నా యైశ్వర్య విభవ ..!!
నిగనిగ మెఱయుచు 
సొగసులను గుఱియుచు 
చీకట్లు చీకొట్టు 
చెలువసిగ, ఒక ఎత్తు 
ఆలివేణి సిగపై 
నిలుచుటే పెన్నిధిగ
కులికి నృత్యము సల్పు 
స్మరవిభుని కేడె మన 
అరవిరిసి, నగు,మొగలి 
సిగపూవు, పైయెత్తు .. 
అద్బుతాద్బుత కావ్య 
రామ్యాక్షర మ్మౌచు,
బాలికామణి కమ్ర 
ఫాలమ్మునం దేర్చి 
కమ్మకస్తూరి దీర్చు 
తిలకమే పైయెత్తు .. !!

Friday, September 22, 2017

////భారతమ్మ బాష్పములు.. \\\\కవిత్వం వ్రాసి చాలా రోజులైంది అంటే.. ఈ “వచన కవిత్వం” వ్రాసి మరిన్నో రోజులైంది.. 

ఆనాడు పద్యాలంకరణములు ఓ వెలుగు వెలిగితే నేడు మాత్రం వచన కవిత్వం అదే స్థానంలో వ్రేళ్ళూనుకుందనే చెప్పాలి.. కాకపోతే ఈ వచన కవిత్వాన్ని కాస్త మన మోడ్రెన్ భాషలో వ్రాయడం జరిగింది.. కవిత అంటే అర్ధాలు వెతుక్కునేదే కాదు.. ఇలా మన వాడుక భాషలో కూడా ఒకసారి వ్రాయాలనిపించింది..!!

అలా వ్రాయడానికి ఓ కారణం కూడా ఉంది...

(అ)సభ్య సమాజంలో (అ)సమర్ధుల (అ)సాంఘిక చర్యల వికృతిఁ చేష్టలకు,
పాలకుల (అ)పరిపక్వత విన్యాసాలకు, (అవి)నీతి సామ్రాజ్యానికి, 
ప్రజల (కు)సంస్కార జీవన విధానానికి ఓ చెంపపెట్టుగా.. వారికి అర్ధమయ్యేలా మోడ్రెన్ (ఆధునిక) భాషలో తెలియజెప్పే ఓ చిన్న కవితాలంకరణమే ఈ “భారతమ్మ బాష్పములు”... 

////భారతమ్మ బాష్పములు.. \\\\
***********************

సౌభాగ్యశీలి భరతమాతా...
అతులిత భాగ్య సుజాతా...
కలకలలాడే నీ మోమున కన్నీరేమమ్మా ..!!
కన్నీటి చారికల్తో చిక్కిన చెక్కిల దేవమ్మా ..!!

ఏ రీతిగ నిను ఓదార్చేది.. !!
ఏ మోముతో నిను వీక్షించేది.. !!
గాంధీ చెప్పిన సూక్తులన్నీ,
బ్రాందీ మీద భక్తితోటి, 
పట్టుదలగా కట్టగట్టి, 
“కల్చరంటూ” కుదువబెట్టాం..!! 
సోషలిజముతో బాస చేసి, 
సెక్యులరిజము ట్రిక్సు చూపి, 
అన్నీ ఇజములు మిక్సుచేసి, 
సెల్ఫు ఇజములో కల్పి వేసాం..!! 
దోపిడీలకు రంగుమార్చి, 
పేద ప్రజలకు టోపీ వేసి, 
ప్రజాస్వామ్యం పేరుబెట్టి, 
ఉన్నవాళ్ళను దోచుకున్నాం..!! 
బక్క ప్రజల పూరిపాకల్తో, 
ఊరిఆవల పేట కట్టి, 
సిక్సు స్టోరీడ్ మేడలకు, 
దిష్టి బొమ్మల నిలువబెట్టాం..!! 
లంచ గొట్టును పట్టలేక, 
బందుప్రేమను చంపలేక, 
మేము కూడా ముదముతీర, 
లంచ గొండిగ మారిపోయాం..!!
మూడు అడుగుల గొయ్యి తీసి,
నిజమునెప్పుడో పాతిపెట్టి, 
గజముఎత్తు సీటు చూసి, 
అబద్దాన్ని ఆవిష్కరించేం..!! 
అత్త సొమ్మును పట్టుకొచ్చి, 
దారవోసిన అల్లునట్లు, 
దేశ ప్రజల సోట్టుతోటి, 
స్వంత కొడుకుల బ్రతుకులద్దేం..!! 
కాని,
తల్లీ భరతావనీ .. !!
ఎన్ని చెప్పిననూ..
ఎవ్వరు చెప్పిననూ.. 
గాడిద కొడుకుల కుటిల బుద్దులు,
మారనుగాక మారవు..!! 
నీ నగు మోమును ఇకనెన్నటికీ కాంచబోము.. !!!

Written by : Bobby Nani

Wednesday, September 20, 2017

తల్లితండ్రుల్లారా మేల్కోండి ...!!!తల్లితండ్రుల్లారా మేల్కోండి ...!!!

(రెండు సంవత్సరముల క్రితం వ్రాసింది మరలా మీకోసం..)

మీ పిల్లల పట్ల మీరు చూపే ప్రేమాభిమానములు విలువైనవి, అమూల్యమైనవి, వెలకట్టలేనివి ... కాకపోతే ఈ ప్రేమలో పడి ప్రతీ తల్లి, తండ్రులు చేస్తున్న చాలా చిన్న విషయం అనుకునే పెద్ద పొరపాటు
“నేను పడ్డ కష్టం, శ్రమ నా బిడ్డ పడకూడదు”

ఇది తల్లి, తండ్రుల పవిత్ర ప్రేమకు చిహ్నం... కాని ఇక్కడ మీరో విషయం మర్చిపోతున్నారు... మీరు ఆ కష్టాలు, శ్రమలు పడ్డారు కాబట్టే ఇంత పైకి వచ్చి భాద్యతగా ఉంటూ వున్నారు.. అదే మీ పిల్లల విషయంలో మీరు ఖటినంగా ఉండకుండా సున్నితంగా వారికి లోకం తెలియకుండా పెంచితే మాత్రం వారు... వారితో వున్న ప్రతీ ఒక్కరు మూల్యం చెల్లించాల్సి వుంటుంది... కష్టమేమిటో ఎరగని వాడికి సుఖం విలువ తెలియదు. నష్టమేమిటో ఎరుగని వాడికి లాభం విలువ తెలియదు. కాలమేమిటో తెలియని వాడికి జీవితం విలువ తెలియదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి... "అతి ప్రేమ, అతి గారాబం, అతి అలుసు అనేది అస్సలు మంచిది కాదు"..

మీ పిల్లలకు ఏ లోటూ రాకుండా పెంచాలనే భావనతో వారిని మరీ సున్నితంగా పెంచుతున్నారు. ఇదే నేడు సమస్యగా మారింది. “స్వీటీ” అనే అమ్మాయి ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమె తల్లితండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు. అడిగింది కాదనకుండా ఇంకా ఎక్కువగా ఆమెకు తెచ్చి అందిస్తారు. చిన్నతనం నుండి ఓ మహారాణి అన్న భావనను స్వీటీలో పెంచారు. ఉన్నత చదువులు చదివి.. పెళ్లాయ్యాక... భర్త ఆమెను ప్రత్యేకంగా చూడకపోవడంతో గొడవ పడేది. ఇలా పెరిగడం వల్లే చివరికి విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇలా స్వీటీ ఒక్కటే కాదు..ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.చిన్న చిన్న విషయాలకే మనస్థాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి పెంపకంలోని లోపాలే కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు.

ప్రతి తల్లితండ్రులు పిల్లలకు అన్నం విలువ, డబ్బు విలువ తెలియచేయాలి... కొన్ని సందర్భాలలో చేతినిండా డబ్బు ఉన్నా తినడానికి తిండి దొరకదు.. అలాగే కొన్నిసార్లు తినిడానికి అన్నీ దొరికినా చేతిలో డబ్బులు ఉండవు.. ఇటువంటి పరిస్ధితులు జీవితంలో ఎదుర్కొన్న వారికి తప్పకుండా అన్నం, డబ్బు విలువ తెలుస్తుంది... అతి గారాబం చేయడం వలన పిల్లలకు కష్టాలు తట్టుకొనే శక్తి సడలుతుంది.. అలాగే అతి భయం, బెదిరింపు, కొట్టడం, తిట్టడం చేయడం వలన మొండిగా/మూర్ఖంగా తయారయ్యే అవకాశం ఉంది... కనుక తల్లితండ్రులు ఈ రెండింటిని సమానంగా చేస్తూ పిల్లలను సక్రమమైన మార్గంలో పెట్టాలి...ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకొనే శక్తి కలిగే వారిగా చేసి వారికి మార్గదర్శకంగా నిలవాలి.... వారికి కష్టం... నష్టం... సుఖం అన్నీ తెలియాలి. లగ్జరీగా పిల్లల్ని పెంచడం నేటి ఫ్యాషన్‌. అదే ఇప్పుడు కొంప ముంచుతోంది. ఇలా పెరిగిన వారు చిన్న కష్టాలకే హడలుతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్నీ అంశాలపై అవగాహన పెంచాలి.


ఉదాహరణకు : పెద్ద ప్రైవేటు స్కూల్లో చదివే మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు ఒకసారి తీసుకువెళ్ళండి ... అక్కడ పిల్లలు అనుభవిస్తున్న పరిస్థితులు, సౌకర్యాలు, కష్టాలు, నష్టాలు, ఆనందాలు, సరదాలు, అనుభవాలు అన్నీ వారికి చూపించండి.. అప్పుడే వారు యెంత సౌకర్యాల్ని పొందుతామో తెలియడమే కాకుండా అవగాహన కూడా వస్తుంది.. తమ తల్లి, తండ్రులు తమ మీద చూపిస్తున్న ప్రేమ, భాద్యత కూడా వారికి తెలుస్తుంది...
కొంతమంది తల్లి, తండ్రులు తమకు ఎన్ని కష్టాలు వున్నాయో, వారి కుటుంబ పోషణకు సంబంధించే సరుకులు కూడా కొనుటకు ఎలా ఇబ్బంది పడుతున్నారో వగైరా విషయాలు పిల్లల దాకా రానివ్వరు.. ఇవన్ని వాళ్ళకు తెలియాలని అనుకోరు.. కాని అది సరైనది కాదు. పిల్లలకు విచ్చలవిడి తనాన్ని మనమే అలవాటు చేస్తున్నాం..మీరు సంపాదించే ప్రతీ రూపాయి యెంత జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారో వాళ్ళకు తెలియాలి.. అలానే ప్రతీ రూపాయి మీరెంత కష్టపడి సంపాదిస్తున్నారో కూడా వాళ్ళకు తెలియాలి.. తద్వారా వాళ్ళకు దుబారా ఖర్చులు అలవడకుండా వుంటాయి.. ముఖ్యంగా తల్లి తండ్రులు వాల్లకు చదువు కంటె జీవితంలో జనరల్ విషయాలు ఎక్కువ అవగాహనకు తీసుకురావాలి.. చదువు ఒక్కటే ఉంటె ఈ కాలంలో సరిపోదు. కొందరు పిల్లలు సెలవు దినాల్లో ఏదైనా పనికి పంపుతుంటారు కారణం వాళ్ళు సంపాదించి పెడతారని కాదు.. వాళ్ళకు డబ్బు విలువ తెలుస్తుందని .. నా చిన్నప్పుడు నన్ను ఇలానే మా తాతయ్య గారు పంపేవారు. దశరా సెలవులకు, వేసవికాలం సెలవులకు మధ్యాహ్నం దాకా పనిచేసివచ్చి తరువాత సంవత్సరం చదువుకు ప్రిపేర్ అయ్యేవాడిని... అలా అని ఆటలమీద శ్రద్ద తక్కువేమీ కాదు అన్నిటికన్నా వాటిల్లోనే ముందు ఉండేవాడిని..

ఇలా ప్రతీ తల్లి, తండ్రులు వాళ్ళ పిల్లలకు సరైన అవగాహనా, సరైన శిక్షణ, అందిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు తప్పకుండా అవుతారు. గొప్ప వాళ్ళు కాకపోయినా సమాజంలో మంచి మనుషులుగా మిగులుతారు... ప్రతీ గొప్ప వారు డబ్బునుంచి వచ్చిన వారు కాదు కష్ట, నష్టాల్లోనుంచి వచ్చిన వారు కూడా... కారణం వారు అన్నీ అనుభవించి వచ్చినవారు కనుక వారికి అన్ని తెలుసు.. నాయకులు ఏ.సి రూముల్లో కూర్చొని పనిచేస్తే సరిపోదు.. ఆ పని చేస్తే ఎవరికి మేలు కలుగుతుంది, ముందు ఎవరికి ఉపయోగపడాలి, ఏ పని ఏ ఏ సమయాల్లో సమయానుకూలంగా చెయ్యాలనే విషయం వారు స్వయంగా కష్ట, నష్టాలు అనుభవిస్తేనే తెలుస్తుంది...

పిల్లల్ని ముద్దుగా చూడటంలో తప్పులేదు కానీ... వారికి లోకం తెలీకుండా పెంచడంలోనే అసలు సమస్య. అందుకే దయచేసి తల్లి, తండ్రులారా మేల్కోండి.. 

రేపటి భావితరానికి మీరు పూబాటలు వెయ్యండి..

స్వస్తి __/\__

Written by : Bobby Nani

Monday, September 18, 2017

మన దక్షిణ భారతదేశ చరిత్ర..


శతాబ్దాల చరిత్ర .... సముద్ర గర్భంలో మునిగిపోయింది...!! 

కాలగర్భంలో కలిసిపోయింది..!!

చరిత్ర పుటలులో చెరిగిపోయింది..!! 

వైభవోపేతంగా, సకల శిరి సంపదలతో శోభాయమానంగా విరాజిల్లిన నాటి "పాండ్యుల చరిత్ర" నేడు మనకో ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది.. !!

Kumari Kandam

కొన్ని నెలలకు ముందు తమిళులకు సంబంధించి, వారి సంస్క్రుతి, సాంప్రదాయాలకు సంబంధించి, ముఖ్యంగా వారి చరిత్రకు సంబంధించిన ఓ గ్రంధాన్ని నేను చదువుతున్న సమయంలో ఈ పాండ్యుల చరిత్ర నా కంట పడింది.. ఏంటో తెలియదు ఆ గ్రంధంలో వారి గురించి స్వల్పంగా వ్రాసి ఉన్నప్పటికీ .. ఆ వ్రాసిన కాస్త చరిత్ర చదవగానే నాలో ఇంకా ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది.. అప్పటినుంచి నా వెతుకులాట మొదలైంది.. ఒక పుస్తకంలో నుంచి మరో పుస్తకంలో ఈ ప్రస్తావన ఉందని తెలిసి అది చదవడం.. ఆ పుస్తకం లోనుంచి ఇంకో పుస్తకంలోకి వేరొక ప్రస్తావన ఉందని తెలిసి చదవడం.. అలా చదువుకుంటూ దాదాపుగా ఓ ఆరు పుస్తకాలు చదివెయ్యడం జరిగింది.. స్నేహితులు, పూజ్యనీయుల సహాయ, సహకారములతో నేను కొంత విషయాన్ని తెలుసుకోగలిగాను.. అలానే వికీపీడియా, ఎన్సైక్లోపీడియా ద్వారాయున్నూ మరియు కొన్ని సంవత్సరములకు పూర్వం ప్రచురించిన పత్రికల ద్వారాయున్నూ, యుట్యూబ్ ద్వారాయున్నూ, నేను ఈ పాండ్యుల చరిత్రను తెలుసుకోగలిగాను ... 

కాని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ??

ఓ చరిత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుందో, ఎప్పుడు ముగిసిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు... కాని మన దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళ, పాండ్య, చెర, వంటి రాజ వంశస్థులైన వారి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలిశాయి.. చోళ, చెర రాజ వంశస్థులు పరిపాలించిన కళాఖండాలు, వారు ఉపయోగించిన వస్తు, సామాగ్రి తమిళనాడు పరిసర ప్రాంతాలలో పురావస్తుశాఖవారికి అనేకం దొరికాయి.. అందువల్లే వారి ఇరువురి చరిత్ర మనకు చాలా సులభంగా దొరుకుతుంది.. కాని పాండ్యుల చరిత్ర మాత్రం దొరకడం అసాధ్యమైంది.. దానికి కారణం వారి చరిత్ర కాలగర్భంలో కలిసిపోవడమే... !!!

Pandya Empire 


దాని గురించే నా అన్వేషణ మొదలైంది.. 

నేను తెలుసుకున్నది పాండ్యుల చరిత్ర 6వ శతాబ్దం నాటినుంచి మొదలైందని... కాని... ఇందుకు నా మనస్సు అంగీకరించలేదు... నా ఊహ ఇంకా ముందునుంచే వారి చరిత్ర ఉందని పదే పదే చెప్తూ వుండేది.. ఆ దిశగానే నా అన్వేషణ మొదలుపెట్టాను.. నిజంగానే నేను ఊహించింది నిజమైంది.. 
Pandya Empire Flag


2వ లేదా 3వ శతాబ్దపు అశోక చక్రవర్తి పరిపాలనలోనే సున్నపురాయి మీద మేజర్ రాక్ ఎడిక్ట్ 13వ శాసనం పై అశోక చక్రవర్తి చెక్కించిన స్తూపం ఆధారంగా పాండ్యుల చరిత్ర అప్పటికే ఉందని ఆధారితమైనది .. కానీ ఇప్పటికీ వారి మొదలు ఎప్పుడు అనేది ఓ ప్రశ్నార్ధకంగానే మిగిలిపోయింది... !!
Asoka 13th Major Rock 

అంతేకాదు మన హిందూ పురాణాల ప్రకారం త్రేతాయుగం నాటినుంచే పాండ్యులు తమిళనాడును రాజ్యమేలుతున్నారని ఆధారాలు వున్నాయి.. పాండ్యుల రాజధాని మధురైగా వుండేది.. శ్రీలంక రాజు అయిన రావణుడు పాండ్యుల శక్తి, సామర్ద్యాలను చూచి నివ్వెరపోయి ఆ పాండ్య రాజుతో ఆనాడే శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కాళిదాసు వ్రాసిన "రఘువంశం" అను పుస్తకంలో పేర్కొని వున్నారు..

Kalidas Raghuvamsham


ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.. అసలు విషయం వేరే వుంది... 

పాండ్యుల చరిత్ర ఒక్క దక్షిణ భారతదేశంలోనే కాదు.. త్రేతాయుగం కంటే కూడా ఎన్నో వేల సంవత్సరములకంటే ముందుగానే దక్షిణ భారతదేశానికి దిగువున వున్న హిందూమహాసముద్రంలో శ్రీలంకను కలుపుతూ కొన్ని వేల మైళ్ళ దూరంలో తూర్పు దక్షిణ శ్రేణిలో ఉన్నటువంటి మడగాస్కర్ ను మరో వైపున ఉన్నటువంటి ఆస్ట్రేలియాను కలుపుతూ ఓ భారీ ఖడం ఉండేదని చరిత్ర చెప్తోంది.. ఈ భారీ ఖండాన్ని " కుమారీ కంధం" లేదా "కుమరినాడు" లేదా “కుమారి కండం” గా పిలిచేవారని పురాణ, ఇతిహాసాలు చెప్తున్నాయి.. 

Lemuria

ఈ “కుమారి కండం” ను పాండ్యులు పరిపాలించినట్లు, పాండ్య రాజుకు ఎనిమిది మంది కుమారులు, ఒక్క కుమార్తె కలదని.. ఆ ఎనిమిది మంది కుమారులకు ఎనిమిది రాజ్యాలను అప్పగించి మిగిలిన తన ముద్దుల కుమార్తె అయిన “కుమారి”కి ఈ “కుమారి కండం” ని అప్పగించినట్లు అందువల్లే ఆమె పేరుతో ఈ ఖండం ఏర్పడినట్లు మన పురాణాలలో పేర్కొని ఉన్నారు.. మహాభారతంలో కూడా పాండ్యుల చరిత్ర ఉన్నట్లు ఇతిహాసాలలో వ్రాసి ఉన్నారు... 

Ithihas

Ithihas

"కుమారీ కంధం" అనే పదము మొదటిది, కంచిపపశివచారియర్ (1350-1420) రచించిన స్కంధ పురాణము అనే గ్రంధంలో 15వ శతాబ్దపు తమిళ సంస్కరణ అయిన “కందా పురాణము” గురించి వ్రాసి ఉన్నారు.. ఇదంతా ఒక ఎత్తు అయితే .. 1864వ సంవత్సరములో, ఇంగ్లీష్ జూలాజిస్ట్ శాస్త్రవేత్త అయిన Philip Sclater ఓ ఆశ్చర్యకరమైన విషయానికి తెరలేపారు.. 

Skanda Puraan

Philip Sclater
అదేంటి అంటే.. 

“Lemur” అనే జీవి మడగాస్కర్ ప్రాంతంలో తప్ప ప్రపంచం మొత్తంలో మరెక్కడా కనిపించదు.. అలాంటిది దక్షిణ భారతదేశ సరిహద్దులలో ఈ జీవి వున్నట్లు తను కనుగొన్నారు.. మడగాస్కర్ కు ప్రక్కన వున్నఆఫ్రికా ఖండంలో మాత్రం ఈ జీవి మనుగడ లేదు.. ఇక ఆ దిశగా తన అన్వేషణ మొదలైంది.. ఇన్ని వేల మైళ్ళు ఈ జీవులు సముద్రంలో ప్రయాణించి దక్షిణ భారతదేశంలోకి రావడం అసాధ్యం.. మరేమైవుంటుంది ?? 

Lemur


national institute of oceanography

అప్పుడే తను మన భారతదేశానికి, మడగాస్కర్కు మధ్యన ఓ భూభాగం ఉండొచ్చు అని నిర్ధారించుకున్నారు.. ఆ భూభాగం సముద్ర మట్టానికి చాలా తక్కువ స్థాయిలో ఉండేదని, అప్పుడప్పుడు ఆ భూభాగాన్ని వరదలు ముంచెత్తుతూ ఉండేవని ఆయన అభిప్రాయ పడ్డారు.. అలానే “National Institute of Oceanography” వారు సర్వే చేసిన సర్వే ప్రకారం ఒకప్పటి సముద్ర మట్టానికి ఇప్పటి సముద్ర మట్టానికి ఊహించని రీతిలో సముద్రమట్టం పెరిగిపోయింది వారు ఓ నివేదికను కూడా ప్రవేశపెట్టడం జరిగింది.. ఇలా ఎన్నో వేల సంవత్సరముల క్రితం ఆ భూభాగం ఓ పెద్ద సునామీ కారణంగా భారతదేశానికి, ఆ భూభాగానికి మధ్యగల సంబంధం తెగిపోయిందని.. తన ఉనికిని కోల్పోయిందని ఆ శాస్త్రవేత్త “The Mammals of Madagascar” అనే పుస్తకంలో ప్రతిపాదించారు. అంతే కాదు.. ఈ భూభాగానికి “Lemuria” అనే నామకరణం కూడా చేసారు.. 
Lemuria

ఇది ఊహాజనితమైన భూభాగం అని కొందరు శాస్త్రవేత్తలు కొట్టిపారేసినా.. మరికొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇది నిజమని చెప్తూ.. మరింత ఆధారాల కోసం వెతుకులాటలో నిమగ్నమై ఉన్నారు.. 

ఇదండీ సంగతి.. 

ఇది తెలుసుకునే ప్రయత్నంలో నా అన్వేషణ, నా ప్రయాణం చాలా ఉత్సాహంగా సాగిపోయింది.. ప్రతీ రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూ, సమయంతో పరుగులు తీస్తూ.. సమయమే తెలియకుండా గడిపిన క్షణాలనెన్నో నేను అనుభవించాను.. అంతా అయిపోయిందా అనే భావమే నాలో ఏదో తెలియని మౌనాన్ని మిగులుస్తోంది.. 

ఈ ఆర్టికల్ చదివాక దీనిపై మీ స్పందనను తెలియజెయ్యడం మాత్రం మర్చిపోకండి.. __/\__

Written by : Bobby Nani

Wednesday, September 13, 2017

//// అసలు ఈ “blue whale” అంటే ఏంటి.. ?? దీనిపై నా చిన్న వ్యాసం.. //////// అసలు ఈ “blue whale” అంటే ఏంటి.. ?? 
దీనిపై నా చిన్న వ్యాసం.. ////

ప్రపంచాన్ని వణికిస్తున్న పనికిమాలిన ఆటలలో “blue whale” ఛాలేంజ్ ఆట ముఖ్య పాత్రను సంతరించుకుంది... రష్యన్ దేశంలోని అనధికారంగా Philipp Budeikin అనే డెవలపర్ సృష్టించిన గేమ్ ఇది.. ఇది 2013 వ సంవత్సరములోనే మనుగడలోకి వచ్చింది.. కాని అప్పటి అంతర్జాల సదుపాయం, విస్తరణ సరిగా లేనందువల్ల ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగానే నడపబడుతూ ఉంది.. 

“బ్లూవేల్‌” సిస్టం లొ డౌన్‌లోడ్‌ చేసుకుని ఆడే ఆటకాదు., అలాగే మొబైల్ లొ యాప్ ద్వారా ఆడే ఆటకూడా కాదు.. ఇది సాఫ్ట్‌వేర్‌ కానేకాదు... 

మరి ఎలా నడపబడుతుంది ?? 

ఎలా అంటే సోషల్ నెట్వర్క్ ద్వారా నడపబడుతుంది..

ఉదాహరణకు : ముఖపుస్తకంలో గ్రూప్స్ ఎలా అయితే ఉంటాయో అలానే.. so-called "death group" of the “VKontakte social network” ద్వారా నడపబడుతుంది.. 

దీనిలో ఎలాంటి వారు చేరుతారు ?? 

12 నుంచి 19 లోపు వారే ఎక్కువ.. వాళ్లనే టార్గెట్ చేస్తున్నారు.. అలాంటి వారిలోనే మనోధైర్యం సన్నగిల్లి చిన్న చిన్న విషయాలకు మనస్తాపం చెంది వ్యక్తుల మీద సమాజం మీద దురభిప్రాయాన్ని, అసహ్య ధోరణిని, విరక్తి భావాన్ని పొందివుంటారు అలాంటివాళ్ళే వారి పైశాచిక ఆటకు పావులు.. ఇలాంటి వారు ఎప్పుడూ మొహం చిరాకుగా పెట్టుకొని, ఏదో అనాలోచిత ధోరణితో, క్రుంగుబాటు మనస్తత్వంతో, తాము ఎందుకూ పనికిరామనే భావనతో తమలో తామే నలుగుతూ, తమకు నచ్చని స్వల్ప విషయాలను కూడా తట్టుకోలేని ఉచ్చస్థితిలో కొట్టుమిట్టాడుతూ వుంటారు.. అలాంటి వారికి ఒంటరిగా ఉండటమే ఇష్టం.. నలుగురిలో కలవలేరు.. ఉత్సాహంగా ఉండలేరు.. ఒకరి నవ్వును చూసి తట్టుకోలేరు.. ప్రపంచమంతా తమని ద్వేషిస్తుంది అనే భావనను కలిగి వుంటారు.. అలాంటి వారు తమని తాము గాయపరుచుకునేందుకు, ప్రాణాన్ని సైతం తీసుకునేందుకు, వేరొకరి ప్రాణాన్ని కూడా తీసేందుకు కూడా వెనుకాడబోరు .. 

సరిగ్గా ఇలాంటివారినే వారు గుర్తిస్తారు.. ఈ గ్రూప్ లోకి ఆహ్వానిస్తారు.. ఇక ఈ గ్రూప్ గురించి చెప్పాలంటే ఇందులోకి వెళ్ళగానే భయంకరమైన ట్యాగ్ లైన్లుతో, కొటేషన్లుతో మరణం చాలా బాగుంటుంది, అది ఈ క్షణమే అయితే ఇంకా బాగుంటుంది అనిపించేలా ఉంటాయి... పాజిటివ్ కి అక్కడ చోటే లేదు... అందులో కనిపించే ప్రతీ అక్షరం సభ్యుల చావునే కోరుకుంటూ ఉంటుంది..

ఇందులో ముఖ్యంగా 50 ఛాలేంజ్ లెవెల్స్ ఉంటాయి. వాటిల్లో మొదట 20 లెవెల్స్ దాకా చాలా ఆరోగ్యవంతమైన ఛాలేంజెస్ ను పొందుపరిచి వుంటారు.. ఇంకో విషయం ఏంటంటే ఒక సభ్యుడు మొదట ఛాలేంజ్ ని పూర్తి చేసినతరువాత తను ఆ ఛాలేంజ్ ని చేసినట్లుగా ధృవీకరణ కోసం ఫోటో తీసి అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది.. అలా చేస్తేనే వారు తరువాతి లెవెల్ కి వెళ్ళగలరు.. లేకుంటే వాళ్లకు తరువాతి ఛాలేంజ్ అడ్మిన్ ఇవ్వడు.. 

ఈ ఇరవై ఛాలేంజెస్ ఎలా ఉంటాయంటే 

ఉదాహరణకు : ఈరోజు మీ ఇల్లు మొత్తం నువ్వే శుబ్రపరచాలి.. ఎవరికైన సాయం చెయ్యాలి.. ఇలా మంచి మంచి ఛాలేంజెస్ ఉంటాయి.. పోను పోను ఈ ఛాలేంజెస్ ఎలా ఉంటాయంటే ఆ అడ్మిన్ ఏ ఛాలేంజ్ ఇస్తే అది ఎలా అయినా చెయ్యాలి మనమేంటో ప్రూవ్ చెయ్యాలనే వ్యసనమునకు లోబడిపోతారు.. 20 ఛాలేంజెస్ లోపు మెయిన్ అడ్మిన్ దృష్టికి వెళ్ళరు .. 20 లెవెల్స్ దాటాక మెయిన్ అడ్మిన్ దృష్టికి వెళ్తారు.. ఇక అప్పటినుంచి వారి చావు ఖారురు అయినట్లే..సభ్యుని యొక్క ప్రతీ కదలికను అడ్మిన్ చూస్తూనే ఉంటాడు.. 20 లెవెల్స్ తరువాత నుంచి డోస్ పెంచుతాడు ఈ అడ్మిన్ .. ఎలా అంటే 
ఉదాహరణకు : మీరు న్యూడ్ గా నిలబడి పిక్ తీసిపంపాలి.. ఒకరిని చితకబాదాలి .. ఇలా అన్నమాట.. 
తరువాత 30 లెవెల్స్ నుంచి ఇక సభ్యునికి రక్తం కనిపించేలా, బయటకు వచ్చేలా ఈ ఛాలేంజెస్ వుంటాయి. 
ఉదాహరణకు : బ్లేడ్ తో కోసుకోవడం.. అదే బ్లేడ్ తో చేతిమీద కోసుకుంటూ ఓ బొమ్మగీసుకోవడం.. ఇలా 49వ లెవెల్స్ దాకా ఉంటాయి.. 
ఇక ఆఖరిది 50 వ లెవెల్ అది చనిపోవడమే .. ఎలా చనిపోవాలి అనేది ఆ గ్రూప్ అడ్మిన్ నిర్ణయిస్తాడు.. 
ట్రైన్ కింద పడిపోవడమా లేక ఉరితాడు వేసుకోవడమా .. ఎత్తైన బిల్డింగ్ మీద నుంచి దూకేయ్యడమా అనేది తనే నిర్ణయిస్తాడు.. 

అంతర్జాలానికి ఆకర్షితులై ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లలకు ప్రత్యేక స్నేహితులుగా పరిచయం చేసుకుని రహస్యంగా ఆన్‌లైన్‌ ఛాలెంజ్‌లు నిర్వహిస్తుంటారు. పిల్లలు, యువతను గుర్తించి వారిని ప్రత్యేక లింకుల ద్వారా గ్రూపులోకి తీసుకుంటున్నారు. అంతే కాకుండా రోజూ ఉదయాన్నే 4 గంటలకు గ్రూప్ అడ్మిన్ ఓ వీడియో పంపుతాడు.. ఆ వీడియో కోసం వీరు ఆ రోజంతా ఎదురుచూస్తూనే వుంటారు.. ఆ వీడియో చూస్తేనే వాళ్ళకు ఆ ఛాలెంజ్ ఎలా చెయ్యాలో అర్ధం అవుతుంది.. 

అంతా బాగుంది ఇక ప్రాణం ఎలా తీసుకుంటారు అనే కదా మీ సందేహం.. 

టీనేజ్ వాళ్ళు కదండీ.. వాళ్ళకు మరో ఆప్షన్ ఇవ్వకుండా భయపెడతారు.. ఎలా అంటే.. వారు పంపిన ఫొటోస్ న్యూడ్ వీడియోస్ అన్నీ సేవ్ చేసి పబ్లిక్ గా పెట్టేస్తాం అనే భయాన్ని వారికి పరిచయం చేస్తారు.. ఇక వారు చేసేది లేక... మరొకరికి చెప్పుకోలేక మౌనంగానే ఈ ఆత్మహత్యను శరణువేడుతున్నారు.. ఆత్మహత్య చేసుకునే ముందు వారు I’am Quit అనో లేక “Good Bye World” అనో మెసేజ్ పెట్టి “బ్లూవేల్‌” ఫోటో ఉప్లోడ్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ఇదే వారి చివరి సందేశం.. ఈ ఆటకు అన్నీ దేశాలలోను బాధితులు ఉన్నారు.. 

మనదేశంలో కూడా కేరళలోని తిరువునంతపురం లొ వున్న 16 ఏళ్ళ పిల్లాడు జూలై 26 న ఆత్మహత్య చేసుకున్నాడు.. 
ముంబై లొ 14 ఏళ్ళ అబ్బాయి ఐదంతస్థుల మేడ మీదనుంచి అమాంతం క్రిందకు దూకేసాడు. ఇది జరిగింది అదే జూలై 30వ తేదిన.. నాలుగు రోజుల వ్యవధిలో మరో ఘోరం జరిగింది. 

అంతే కాదు.. మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, మధురై, ఇలా ప్రతీచోట ఈ “బ్లూవేల్‌” ఛాలెంజ్ లొ అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.. 

అదండీ సంగతి.. పిల్లలను పట్టించుకోవాల్సిన భాద్యత తల్లితండ్రులది.. 
వారు ఏం చేస్తున్నారు ?? 
ఎలా వుంటున్నారు ?? 
ఎలా ప్రవర్తిస్తున్నారు ?? 
తదితర విషయాలను పట్టించుకొని వారితో స్నేహపూర్వకంగా మెలగాలి.. వారు చెప్పే ప్రతీ విషయాన్ని నమ్మాలి.. అర్ధం చేసుకోవాలి.. మీ పిల్లలకన్నా మీరు మొండిగా ఉన్నప్పుడు మీ తల్లితండ్రులు మిమ్మల్ని ఎలా సహనంతో వ్యవహరించి చూసుకున్నారో అలానే మీరు వాళ్ళను చూసుకోవాలి.. అప్పుడే ఇలాంటి పనికిమాలిన ఆటలు ఎన్ని ఉన్నా మన పిల్లలు మనతోనే ఉంటారు .. మనం సంతోషంగా ఉంటాము.. 

స్వస్తి.. __/\__

Written by : Bobby Nani

Monday, September 11, 2017

//// నాని అక్షర స్వరూపము కాదిది .. విలక్షణ విశ్వరూపం \\\\ఏ కవీ చెయ్యలేని సాహసోపేత అనంత సృష్టిస్థితిలయ కవితా ప్రళయ నర్తన విన్యాస ఖండము ఇది.. సృష్టి ఆవిర్భావం మొదలు.. నేటి వరకు ఏక కవితలో పొందుపరిచే మహత్తర దృశ్య కావ్యం.. ఇప్పటివరకు ఏ కవి చెయ్యని సాహసమే.. ఎక్కడా చదవని విన్యాసమే.. 

ఎందుకో తెలియకుండా ఓ ఆలోచన వచ్చింది 10 రోజుల క్రితం.. ఒకే కవితలో సృష్టి ఆవిర్భావం మొదలు ముఖ్యమైన భావాలన్నీ పొందుపరిస్తే ఎలా ఉంటుంది ?? అని.. 
మళ్ళి ఆలోచించా.. చాలా పెద్దది అయిపోతుందేమో కదా... చదువుతారా ?? అని 
ఒక్కరైనా చదువుతారు కదా అనే నమ్మకమే నన్ను ఈ స్థాయికి నడిపించింది.. అదే షుమారు 9 రోజులనుంచి నాచేతి కలాన్ని అవిశ్రాంతంగా కదిలించింది.. కొన్ని వర్ణనలను, కొన్ని పద ప్రయోగాలను నేను మునుపు వ్రాసిన వ్యాసాలలో నుంచి, కవితలలో నుంచి తీసుకోవడం జరిగింది.. ఈ విషయాన్ని పాఠకులు గమనించాలి.. మీ ఇంటి సభ్యునిగా భావించి చదివి మీ అభిప్రాయం చెప్తారని ఎదురు చూస్తూ.. 

//// నాని అక్షర స్వరూపము కాదిది .. విలక్షణ విశ్వరూపం \\\\
********************************************


మహా విస్పోటనం..
ప్రళయ భీకర విధ్వంశం..
విశ్వవ్యాప్తికి ఆదిమ బీజం..
ఉద్భవించెను సమస్త జీవరాశి..!!
అదిగో .. అదిగదిగో.. 
రాక్షస బల్లుల రాకాసి జాడ..
వికృత చేష్టల హింసా.... మారణ కాండ..
రాకాసుల స్వైర విహార రణరంగ క్రీడ .. !!
గగనతలంలో విహంగ వీక్షణ.. !!
సముద్రనవనీత సుధా సాగరంలో 
జలపుష్పాల జలక్రియా విన్యాసంబులు..!! 
భువన సీమలో చెంగు చెంగుమను 
కృష్ణతారముల చెంగలించులు..!!
మ్రాను మ్రానుకు దుమికెడి 
మర్కటముల గారడి ప్రదర్శనములు..!!
పటమట దిక్కున ధగ ధగల మెరుపులు.. 
వాయువ్య మూలన ఆకాశ రాజు 
ఢమ ఢమల ఘర్జనలు.. ఇంతలోనే 
నింగి వలచింది నేలను.. 
తొంగి చూచింది ప్రకృతి కాంత సొగసును .. 
వంగి నిలిచింది, 
సందిట కౌగిలించింది.. 
కనుసైగ చేసింది.. 
అనువైన కోనలో 
కోరిక తీర ముద్దులిచ్చింది.. 
నింగి నేలను వలచి 
మంచుపొగలతో పంపింది ప్రేమలేఖ.. 
నేలకు దిగివచ్చి 
వలచి తలచి 
పిలిచి కౌగిట జేర్చి 
కొండ శిఖర అధరాల 
కొరికి నొక్కి 
పచ్చికబయళ్ళ 
పమిట కొంగుపై 
రంగు రంగు పువ్వుల 
పుప్పొడి గందాల సువాసనలు చిలికి 
వనమూలికల పరిమళాల పన్నీరుచల్లి 
పిల్ల గాలులు చల్లంగ వీచి 
ప్రకృతి కాంత సఖియలైన గిరులు తరులు 
తన్మయమునొంద 
అబల ప్రకృతి కాంత కన్నియును 
ఆకాశ రాజు ఆలింగనముచేసి 
పరిణయమాడె ఈ ప్రకృతి కాంతను
ప్రకృతి పులకరించి హర్షించే.. 
వానరము.. వానరుడయ్యే.. 
రక్త హింస జేసి...
జంతు భక్ష గావించే.. 
సిగ్గు, బిడియము నేర్చే..! 
కప్పుకొనుటకు పత్రములు జుట్టే.. 
ఆరగించుటకు నిప్పును రాజేసే.. 
వానరుఁడు .. మానవుడయ్యే .. 
ప్రకృతి మాతకు నిత్య కళంకమయ్యే.. 
వాని జీవితం 
జనన మరణాల మధ్య
కాలం వ్రేలాడగట్టిన 
ఓ కాంతి రేఖయ్యే.. 
జననం ఒక మరణం లేని ప్రశ్న.. 
మరణం ఒక జననం లేని ప్రశ్న.. 
సమాధానం లేని రెండు 
సంపూర్ణ ప్రశ్నలకు 
సమాధానం చెప్పడానికి
సందేహాల బోనులో నిలబడ్డ
సాక్షిలాంటిదీ జీవితం..!!
అది అబద్దం చెప్పదు .. 
సత్యం తెలియదు.. 
ఎన్ని జీవితాలు.. 
ఎన్నెన్ని జీవితాలు !!
ఎన్నెన్ని సాక్ష్యాలు.. !!
కళ్ళులేని కాలం 
చెవులు లేని కలంతో.. 
నోరులేని కాగితాల మీద 
కన్నీటి అక్షరాలతో 
అన్నీ వ్రాసుకుంటున్నది.. 
ఎక్కడి నుంచి వచ్చి
ఎక్కడికి పోతున్నాడో 
ఎవరికీ తెలియని 
మనిషి జీవితం ఒక మహాకావ్యం.. 
జీవితం ఒక నిత్య సత్యం 
అయినా అది మహా స్వప్నం.. 
బాల్య యౌవన వృద్దాప్యాలు 
రుజా జరా మరణాలు 
రాగ ద్వేషాలు – త్యాగ భోగాలు
అల్లుకున్న 
సుందరతర గందరగోళం ఈ జీవితం 
అనుభవించడం తప్ప 
అర్ధం చెప్పరానిదీ జీవితం 
రండి చూద్దాం జీవితాన్ని 
రంగు రంగుల సింగిణిని 
ఎన్నో వికీర్ణ వర్ణాల ఏకరూపం ఈ జీవితం 
కామ, క్రోధ, లోభ, 
మోహ, మద, మత్సర్యాది 
అరిషడ్వర్గాల పందిరి మీద 
క్షణానికో పూవు పూచే 
చిత్ర గంధి జీవితం 
ఎక్కడ పుడుతుందో.. తెలియని 
ప్రాయేటి కెరటం ఈ జీవితం.. 
అద్బుత ద్వీపం మీద 
మబ్బులా వచ్చి కురిసి 
వాగులా పొంగి పొరలి 
వారాశిలో కలిసిపోయే 
వర్ష బిందువు ఈ జీవితం 
అనుభూతి శిఖరాలనుంచి 
అవలోకిద్దాం జీవితాన్ని 
ఆలోచనా అంతరాళాలనుంచి 
పరిశీలిద్దాం జీవితాన్ని 
అనంతత్వ కిరణాలలో 
దైవత్వ దర్పణాలలో 
దర్శిద్దాం ఈ జీవితాన్ని 
జననానికి మరణం శిక్ష.. 
మరణానికి జననం శిక్ష.. 
ఉభయ శిక్షలను తానే అనుభవించే 
ధర్మం లేని జీవితం మానవునిది.. 
అందుకే.. 
దయ, దాక్షిణ్యం మరచి
తల్లితండ్రులు భ్రూణహత్యకు 
పూనుకొనుటకు సిద్దహస్తులైనారు..
జాలి లేక ఆడ పిల్లను 
సాకనోపక చంపబూనుచు, 
గోడకు కొట్టినట్టి తండ్రియే 
కరుడుకట్టిన కసాయి యవ్వగా..
పాపను కనుపాపవలెన్ 
కాయవలసిన తల్లిదండ్రులే ఆ 
పాపను రూపుమాపఁగ..
ఏది ధర్మం.. ??
ఎక్కడిది న్యాయం ?? 
అన్నీ తప్పించుకొని 
ఆడపిల్లగా భూమిమీదకు రాగా.. 
ఆడపిల్లను “ఆడ” పిల్లవే, 
ఈడ పిల్లవు కావనుచు 
అత్త ఇంటికి సాగనంపుటే 
తమ లక్ష్యముగా పంపితిరే .. 
వెళ్ళినాక ఈసడింపులకు 
తాళలేక, కన్నవారికి చెప్పలేక.. 
మరణమే శరణమని వేడగా .. 
గర్భమున తన శిశువు 
కదలికలకు ఊపిరి పీల్చుకొని 
క్రొత్త భంధం కోసం 9 నెలలు 
వేచి చూడగా.. 
ముద్దులొలుకుతూ పుట్టినది 
చూడు ఆడపిల్ల.... !!
అత్త మూతివిరుపుల తోడూ ..
మామగారి వెక్కిరింతలూ 
ఇక మగపిల్లాడు లేడు 
మనకని ఈసడించేడు భర్త.. 
వైఖరి దిక్కు తోచక గుండె 
బరువై కుమిలి కుమిలి ఏడ్చే ఆ యబల .. 
జన్మనిచ్చిన తల్లి నిస్పృహ 
తెలిసినట్లుగా ఆ బిడ్డ ఏడ్వగా .. 
ఆడపుట్టుక అంత అలుసా.. 
అన్నట్లు తోచేనపుడు.. 
పెద్దలందరు చీదరించిన 
తండ్రికూడ నిరాదరించిన 
తల్లి ఒడిలో పెరిగి పాపయు 
వ్యక్తిత్వము కూర్చుకున్నది..
విద్య, వివేకములు అబ్బి 
అంద, చందములు అమరి.. 
వినయ భూషణయై నిలిచినది
ఈ కోమలాంగి.. !!
ఆమెను చూడాలంటే కళ్ళతో కాదు... 
హృదయంతో చూడాల్సిందే.. 
అబ్బ ఏమి అందమో, 
యెంత లావణ్యమో,
నిజం చెప్తే నమ్మరు కాని ..
పుడమి హర్షిస్తుంది
తన పాదపద్మములు తగిలి.. 
మేఘాలు వర్షిస్తాయి 
తన సుగంధాల శ్వాస తాకి.. 
మయూరము పురివిప్పియాడును 
తన దేహ సౌందర్య కాంతులకు..
తుమ్మెదలు పరితపించును 
తన పెదవుల తియ్యదనానికి.. 
కొందరిని చూస్తే, అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ..
ఇంకొందరిని చూస్తే, ఆరాధించాలనిపిస్తుంది ..
ఆమెను చూస్తే మాత్రం ఏంటో నా భావాల్ని చూస్తున్నట్లు వుంది.. 
తన నేత్రాలకు అంటిన ఆ కాటుక ఘాడంగా ఆమెను కౌగిలించుకొని చెరగనంటోంది..
తన మోముకు అంటిన పున్నమి వెన్నెల ఆమెను వదలనంటోంది.. 
తన అధరములనంటిన గులాబి వర్ణం ఆమెను చూసి సిగ్గులొలుకుతోంది..
పారిజాతపు కుసుమం వంటి ఆమె దేహ పరిమళములు 
మదనుడిని మత్తెక్కించి ఆహ్వానము పలుకుతున్నాయి.. 
ఆమె చూసే క్రీగంట చూపులు సమ్మోహితుడను చేస్తున్నాయి.. 
మొదట ఆమెను నా నేత్రాలతో చూశాను .. 
ఎలాంటి సౌందర్యం కనిపించలేదు..
ఆశ్చర్యమేసింది.. 
హృదయపు తలుపులు తెరిచి మరలా తేరిపారా ఆమెను చూడసాగాను.. 
బోలెడన్ని సౌందర్య అందాలు ఆమె అణువణువునా అమరి వున్నాయి..
ఆమె నలుగుపిండితో అభ్యంగనస్నాన మాచరించి
లేలేత పసుపు తన వంటి మొత్తానికీ రాసుకొని.. 
ముదురు కుంకుమ వర్ణం గల రవిక, చీర కట్టుకొని, 
నుదిటిన పాపిడిబిళ్ళ పెట్టుకొని, 
నడుము కిందకు జాలువారే వయ్యారాల వాలుజడతో,
విరబూసిన పుష్పాల అలంకరణతో, 
చెక్కిలినంటిన సౌందర్య చుక్కతో, 
గంధపు లలాట తిలకముతో,
అరచెయ్యిని అంటిన యెర్రని గోరింటాకుతో,
పునుగు, జవ్వాది మొదలగు దేహ పరిమళములతో,
పారాణి కలిగిన పాద పద్మములతో,
ముద్దులొలికే ముక్కుపుడకతో,
కంఠమున ధరించిన ఎద సౌందర్యాభరణంతో,
చెవికి అలంకరించిన కర్ణికతో.. 
అరిటాకు వంటి శృంగార నడుముకు,
ముద్దుల వడ్డానంతో..
హంస నడకలు చిందుతూ.. నా 
హృదయ వేదిక మీద నవరస రూపిణియై,
నవజీవన నాయికవై 
అనంగ శరాలు వర్షించే ఆంగికాభినయంతో .. 
నర్తిస్తోందీ... రంగుల ప్రపంచంలో.. !!
అదే రంగుల ప్రపంచంలో ఓ రైతూ ఉన్నాడని 
తన భుజాన నాగలిని నిలిపి..
ఒళ్లంతా కమిలిన గాయాలతో,
కాడెద్దులా మారి దున్నుతున్నాడని ..
రక్తంతో తన పొలాన్ని తడుపుతూ.. 
కన్నీళ్ళతో చేనును దున్నుతూ ..
అన్నపూర్ణను అందరికీ అందించాలనే, 
తపనతో భగీరధునిలా మారాడు ఆ రైతు .. 
అన్నం “మేకు” అయిందనో, 
“ముద్ద” అయిందనో, 
ప్రక్కకు నెట్టే నేటి మనుషుల 
మనస్తత్వ పోకడలు ఒక్కసారిగా
జ్ఞప్తికి వచ్చాయి.. !!
నీటికోసం నింగివంకా, 
పంటకోసం నేలవంకా, 
ఆశపడుతూ..పరుగుపెడుతూ.. 
నేలతల్లిని నమ్ముకొని,
ఉన్నదంతా అమ్ముకొని, 
బిడ్డల కన్నా “చేనే” ప్రాణమనుకొని, 
పొలాల మధ్య తిరుగుతూ 
బక్కచిక్కిన ఈ కర్మలోకపు 
ఈ కర్షకుడి కన్నీళ్ళు ఎవ్వరికీ కనిపించట్లేదు 
నీరుతో తడవాల్సిన భూములు 
ఈ నాడు,
రైతుల కన్నీళ్ళతో తడుస్తున్నాయి.. 
పచ్చగా పలకరించాల్సిన పంటలు 
బీడులై దీన స్థితితో చూస్తున్నాయి.. 
నిజంగానే ఇదో “రంగుల ప్రపంచం”.. 
“విద్య” వ్యపారమౌతోంది.. 
“వైద్యం” అంగట్లో వస్తువౌతోంది.. 
“బంధాలు” సెంటిమెంట్లు అవుతున్నాయి.. 
“అమ్మ” అద్దెకు దొరుకుతోంది.. 
“నాన్న”కు చిరునామానే అవసరం లేదు..
“క్రమశిక్షణ మా ప్రత్యేకత” అన్న నినాదం.. 
“కంప్యూటర్ మా లక్ష్యం” గా మారుతోంది.. 
“జాతీయగీతం” పరదేశం ఆలాపన చేస్తుంది.. 
దేశాన్ని అమ్మేవారు “దేశభక్తులు” అయ్యారు.. 
పొలాలు “స్మశానాలు” అవుతున్నాయి.. 
ఇక్కడ 
అన్నం, నీళ్ళు దొరకవు.. 
సెల్ పోన్లు, కలర్ టీవీలు, 
టాబ్ లు, కార్లు చౌకగా దొరుకుతాయి.. 
ప్రేమ అమ్మబడుతుంది “తూకాని”కి.. 
రక్తం చిమ్మబడుతుంది “ఉత్త పుణ్యానికి” 
అదో మాయా ప్రపంచం.. 
అదే “రంగుల ప్రపంచం” 
అదే ప్రపంచంలో ఓ “తండ్రీ” వున్నాడు.. 
సమాజం దృష్టిలో అతడో కాంత దాసుడు.. 
పేరుకే కాంత దాసుడు.. 
నిరంతర సంసార సాగర శ్రమజీవుడు... 
నితాన్వేషణ విధి నిర్వహనుడు... 
వేకువనే లేచి .. వున్నా, లేకున్నా 
యేవో బట్టలు వేసుకొని ..
తిన్నా, తినకున్నా, 
ఎండనకా, వాననకా, 
పగలు, రేయి తారతమ్య భేదాలు మరిచి 
సంసారమనే బీడు కయ్యను ..
గాడేద్దు వలె దుక్కి దున్నుతున్నాడు.. 
కంటిలోని జలాన్ని ఆవిరి చేస్తూ ..
కంటిముందర సంసారమనే భూమిని 
చిరునవ్వుతో .. లాగుతున్నాడు పచ్చని 
పంట చెయ్యాలనే తపనలతో..
కమిలిన చేతులతో, 
తన పాదాన్ని అంటిన కనికరం లేని గాయాలతో.. !!
ఎందుకోసమో ఈ త్రాస.. ఎవరోకోసమో ఈ ప్రయాస.. 
అద్దంలో తనని తాను చూసుకున్నప్పుడు తెలిసింది.. 
మసిపట్టి మసకబారిన తన మోము ఒకటి వుందని.. 
గతించిన ఏళ్ళను వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకుంటే ..
అంతా చీకటిపట్టిన మసే కనిపించింది.. 
దుమ్ము, ధూళితో నిండిన తన జీవితాన్ని దులిపేదెవరు ?? 
మొరటివాడు, మొండి వాడు, క్రోధుడు ఇవే తన బిరుదులు .. 
అతడో అద్బుతం, అతడో అజరామరం, 
అతడే ఓ అనంత శక్తిస్వరూపుడు..!!
అంతటి శక్తి రూపుని అర్ధాంగి “అమ్మ”
అమ్మంటే ఓ అద్బుతం.. 
అమ్మంటే ఓ అపురూపం.. 
అమ్మంటే ఓ అద్బుత కావ్యం.. 
మురిపాలు, జ్ఞాపకాలు, 
లాలిపాటలు, గోరుముద్దలు, 
అక్షరాలు, ఆలింగనాలు, 
నడక, నడత, 
అనురాగాలు, ఆత్మీయతలు, 
ఆనంద సమయాలు, 
కన్నీళ్లను వర్షించే క్షణాలు 
ఇంకా..ఎన్నో ఎన్నెన్నో.. 
అందమైన అనుబంధం, 
అంతేలేని అనురాగం 
వెరసి ఓ మరుపురాని జ్ఞాపకం.. 
పిల్లాడిని గెలిపించడానికి తను ఓడిపోతుంది.. 
అలా ఓడిపోవడమే గెలుపనుకుంటుంది.. 
ఒకసారి తన బిడ్డను కొట్టింది.. 
అయినా ఏం లాభం ? 
వాడికంటే ముందే ఏడ్చింది..!!
వాడు గుక్క పెట్టేలోపే 
గుండెల్లోకి లాక్కుంది.. 
తెరలు తెరలుగా 
తన కౌగిళ్ళలో కప్పుకుంది.. 
కళ్ళే కాదు.. తనువులోని 
ప్రతీ అణువు చెమరించేలా ఏడ్చింది.. 
ఇంకెప్పుడూ అమ్మకు కోపం తెప్పించకూ !! అంటూ 
వాడిని బహిరంగంగా బతిమాలింది.. 
వెయ్యి అల్లర్లు భరించాక ఒక్కటి చెబుతుంది..
అదే అమ్మంటే.. !! 
అంతటి ఉత్తమరాలు నుంచి
వేరుపడిన వారిలో 
గాత్రంతో గారడీ చేసే గాయకులూ,
స్వేదాన్ని చిందించే కర్షకులూ.. 
అద్వైతాన్ని భోధించే జ్ఞానులూ, 
విధ్యను పంచె గురువులూ, 
కనికరము లేని కామాందులూ, 
హింసకు ఆద్యంపోసే రాక్షసులూ, 
సమాజాన్ని మేల్కొలిపే కవులూ, 
అందరూ ఆ తల్లి బిడ్డలే.. 
ఒకే చెట్టు వేళ్లే .. 
ఇంతకీ ఎవరీ కవి.. 
సాధారణ మానవుడు 
స్ఫటికంలాంటివాడు 
ప్రక్క రంగులకు లోబడి 
వ్యక్తిత్వం కోల్పోతాడు
కవిని మాత్రం సూర్యునితో 
ఖచ్చితంగా పోల్చవచ్చు
ఏడు వన్నెలు జీర్ణించుకొని 
ఏకవర్ణం చిమ్ముతాడు 
తన అక్షర శరములతో.. !!
మంచుగుడ్డలు కప్పుకున్న 
మానవుల మెదళ్ళలో 
వెచ్చని కిరాణాలందించే
వాడే కవి, 
వాడే రవి...!!
అవనిలోని ప్రత్యనువూ 
కవికొక బ్రహ్మాండం 
అతనిగుండె కదుపలేని అణుశకలం
లేనే లేదు..!!
అణువులోన నిద్రించే 
అతర్జాతీయత్వాన్ని 
పనిగట్టి వీపుదట్టే 
ప్రబల దార్శినికుడు కవి.. !!
పరమాణువు ముఖములోన 
తెరుచుకునే మరణదంష్ట్రల 
మాటలతో కరిగించే 
మహా మాంత్రికుడు కవి..!!
సాటివాళ్ళు మూఢత్వపు 
సారా మైకంలో పడి 
ప్రేలుతుంటే జాగృతి.. దీ 
పాలెత్తిన వాడు కవి..!!
బురదలోన బ్రతికే ...కు 
మ్మరి పురుగుల లేవనెత్తి 
బంభారాలుగా మార్చే 
బ్రహ్మత్వం కవిలో ఉంది ..!!
చెదలు దిన్న హృదయంతో 
మసిబట్టిన మనస్సుతో 
మాటలు గిల్కేవా... 
డేనాటికి కవికాడు ..!!
పరుల బాధ తన బాధగ
పంచుకున్నవాడే కవి.. 
పరుల సుఖంలో శిరస్సు 
పైకెత్తినవాడే కవి.. !!
పుచ్చపూలు గచ్చపొదలు 
జిల్లెడులు, పల్లేరులు 
కవి కలం సోకితేనే 
కల్పవృక్షాలవుతాయి..!!
తుహినాచల శిరం నుండి 
తురగలించే జలపాతాలు 
కవి గుండెలో విధ్యుత్తును 
కల్పించక మానవు..!!
జగత్తులో ఏ మూలో 
పొగచూరిన నరజాతుల 
వీపులపై విరుగుతున్న 
వెండి కొరడా దెబ్బలతో 
కవి కళ్ళలో ఎర్రదాళ్ళు 
పొంగి ప్రవహించును ..!!
పడమటి బెహార్లు హుషారుగా 
పరచిన బంగారు వలల్లో 
పావురాళ్ళ కాళ్ళిరుక్కుంటే 
కవి గొంతుక లోయలోనుంచి 
గర్జించిన చప్పుడు ..!!
పచ్చిగడ్డిలా పెరిగిన పల్లె వాళ్ళపై 
ఆకాశంనుంచి రాకాసులు 
అగ్నివర్షం కురుస్తుంటే 
కవి శిరస్సును చీలుస్తూ 
ఎగుస్తుంది విస్పోటక ప్రతినాదం..!!
ప్రయోజనం లేకుండా పొడిచే 
పగటి చుక్కలకు 
దూరంనుంచి తో .... కాడించే 
ధూమాకేతువులకు, 
ఎవడి కాంతినో అరువు దెచ్చుకొని 
నిగనిగలాడే చంద్రబింబానికి, 
పనిలేకుండా పరిభ్రమించే 
అనంత గ్రహ గోళాలకు,
క్షణం సేపు మిడిసిపడే 
మిణుగురు పుర్వులకు, 
అకారణంగా ముఖం చిట్లించుకునే 
ఆస్తమ సంధ్యకు, 
అణువణువూ ఈ బ్రహ్మాండంలో 
వున్న జీవికీ, మృత్పిండానికి 
కర్మసాక్షి ఈ కవియే 
ఈ కవియే భారవియే...!!
ప్రణయం ఒక తుమ్మెదలా 
మనస్సులో మర్మరిస్తుంటే, 
ప్రేయసి ఒక తుమ్మెదలా 
ఎదలో కదలాడుతుంటే, 
భవిష్యత్తు ముళ్ళులేని 
ప్రసవ పథంలా కనిపిస్తే, 
బ్రతుకొక చక్రాలు లేని 
ప్రసవ రధంలా ఎదురొస్తే, 
కవిగొంతుక తేనే తేనేగా
పల్కక తప్పదు..!!
కవిలో సౌరభాలు 
రెక్కలు విప్పక తప్పదు..!!
శరన్నిశీధాలు పగళ్ళపై 
దురాక్రమణ సాగించి 
మృత్యుభాను ముడికొప్పును
జీవన పురుషుడు సడలించి 
సెలవేసిన విద్వేషాన్ని 
సౌహార్దం కత్తిరించి 
జగత్సర్ప మొక్కమాటు 
సడలిన కుబుసాన్ని విడిస్తే 
కవి హృదయం నాగస్వరమై రవలిస్తుంది.. !!
కవి గీతం రాగాంకురమై రావణిస్తుంది.. !!
పిరికితనం వారసత్వంగా 
సక్రమించిన శరణాగతుల 
పిల్లి గొంతులలో సాహస
భీషణమర్ధల ఘోషలు 
పెకలించే శంఖస్వరం..!
ఇదే కవితా స్వరూపం..!!
ఇదే కవి విశ్వరూపం.. !!
ఇంతకీ 
ఇదంతా వ్రాస్తున్న నేనెవరిని?? 
నా, నీ, అనే భేదాభిప్రాయం లేకుండా నా 
ఆత్మీయులు సంలపించు “నానీ” నా .. 
అయితే నా గురించి చెప్పాల్సిందే.. 
ప్రకృతే నా పుస్తకం.. 
పాఠకులే నా గ్రంధాలు..
అక్షరాల్లేని కాగితాలను 
చదవడమే నా అలవాటు...!!
ఈ విశ్వాంతరాళంలో 
విరుచుకుపడుతూ 
కాలపురుషుని చోదకత్వంలో 
పయనిస్తున్న 
రధికుణ్ణి నేను.. 
ప్రశాంత సాగర ఘోష 
ప్రళయ ఝుంఝూర్భటుల విలయ హేష 
నా శృతికి అవలీలగా వినిపించే భాష..!!
వసంతాల సంతసాలు 
పౌష్యలక్ష్మి సంబరాలు 
విప్లవ ప్రతాపాలు 
నే నడిచిన మార్గంలో మైలురాళ్ళు ..!!
కర్కశ కరాళ కరాలు 
లే చిగుళ్ళను చిదిమేస్తుంటే 
మూగగా ఆక్రోశిస్తూ 
గులాములకు సలాములిచ్చే 
లే గులాబీ స్వాముల బాష్పాంజలులు 
కలవారి వికటాట్టహాస ఘట్టనలకి 
వెన్ను విరిగి 
వన్నె తరిగి 
వంగి యీల్గే సగటు మనిషి 
సుప్త సంతప్త జ్వాలలు 
నే పయనించే 
మహాప్రయాణంలో 
ఎన్నో అపశృతుల గాథలు.. 
ఇదే నా అక్షర స్వరూపం.. 
మూడు పదుల అనుభవ విలక్షణ విశ్వరూపం..

Written by : Bobby Nani

Friday, September 8, 2017

ఆకాశపు ఒడి..

ఆకాశపు ఒడి..

మనసు గదిలో మువ్వలు కదిలిన సవ్వడి..
వెన్నెల వేదికపై మరుమల్లెల పరిమళం..
పడమటి కొండల్లో సంధ్యాకాంత చీకటంచు చీరపై
పరుచుకొనిన నిశథరాత్రి..
నలుదిశలా ఆవరిస్తున్న మలయమారుత తోలి సమీరం
మబ్బుల పల్లకీల జ్ఞాపకాల యవకనిల్లోంచి
వినిపిస్తున్న మౌన వీణాలాపనలో వింతపోకడలు పోతున్న
కొత్త స్వరాల గమకాలు ...
ఆశ స్వప్నపు తోటలో ఎద ఎదను తాకేందుకు
పుడమిపై పరుచుకొన్న పారిజాతాలపై వాలిన
మంచు బిందువుల్లా నా కళ్ళు ఏక దృక్కులు రాస్తున్నాయి..
కొన్ని క్షణాల జీవితం .. లేని పల్లవికి
బతుకు పాటకు మాటలు పొదుగుతోంది
తెగిపడిన గుప్పెడు తీగలను సరిచేసి బిగిస్తోంది ఆశ..
కానీ ... సరిగమలు మరచిన కాలం గొంతులో
గురగుర – గరగర రాలిపడుతున్న నక్షత్రాలు
లక్ష్యాల సమాధులకు పునాదులౌతున్నాయి
ఎగసి ఉరకలు వేసే జన సముద్ర తరంగాలు
విస్పష్ట ఘోశలో ...
ఘోశాలేని అశరీరవాణి పెదవులు కదపటం నేను కళ్ళారా చూసాను..
ధ్యాసమల్లిన రేపటి గీతకు మొట్ట మొదటి
చరణాన్ని దక్షిణాన దాగియున్న లోయల్లోకి
గాలి విసురుగా ఎగిరేసుకుపోయింది..
హమ్మయ్య ప్రారంభమయ్యింది అలజడి..
అదిగో చూడండి.. ఉదయం.. !!
అడ్డుకుంటున్న ఆకాశపు ఒడి..

Written by : Bobby Nani

Tuesday, September 5, 2017

ఆత్మ సఖుడు..ప్రతీ ఒక్కరు పురుషుని భావాలతోనే ఎక్కువశాతం కవితలు వ్రాస్తున్నారు..స్త్రీ లు కూడా పురుషుని స్థానంలో వుండి వ్రాసేస్తున్నారు... రాయలేక ఇలా వ్రాస్తున్నారని నేను అనుకోవట్లేదు.. ఎందుకంటె పరస్పరమైన పురుషుని భావాలనే అవలీలగా వ్రాస్తున్న వీరు తమ స్వంత భావాలను వ్రాయలేరని నేను అనుకోవట్లేదు.. అయిననూ ఇలా ఎందుకు వ్రాస్తున్నారబ్బా అనే ఆలోచన లేకపోలేదు.. బహుశా మగవాని భావాలను బహిర్గతం చేసినట్లు వారి భావాలను చెయ్యడానికి ఆడతనం అడ్డు వస్తుందేమో అనే సందేహమూ లేకపోలేదు.. ఏది ఏమైనా స్త్రీ భావాల రూపంలో ఓ కవిత వ్రాయాలని సంకల్పించాను.. అదే ఈ ఆత్మ సఖుడు.. 

ఆత్మ సఖుడు..
***********


గాండీవం లాంటి 
నీ బాహువుల్లో 
శరంలా బిగించావు నన్ను.. 
విడువకురా.. 
ప్రణయ లోకాలు బ్రద్దలైపోతాయి.. !!!


పూర్ణబింబంలా ముడిచిన 
నీ అధరములతో 
శంఖంలా పట్టి నను పూరిస్తున్నావు..
వదలకురా.. 
సృష్టి అంతా శూన్యమైపోతుంది..!!

నీ నఖ విన్యాస విలాస క్రీడలో 
నక్షత్రాలు మొలుస్తున్నాయి 
నా ఆర్జవ శరీర క్షేత్రంలో 
ఆపకు రా ప్రియా.. 
అంధకారం అలముకుంటుంది..!!

నా స్వప్నాల పూల డోలికలో 
సత్యమై ఊగుతున్నావు 
విశ్రమించకు రా సఖా... 
కాలగతి ఆగిపోతుంది.. !!¬

శ్వేత శిఖరములవంటి 
నా యవ్వన హృదయ సౌందర్యములో 
పసి బాలునివలె ఒదుగుతున్నావు 
రసజగద్రహస్యాల రవిక ముడులువిప్పుతూ.. 
రా... త్వరపడరా ... 
పంచ ప్రాణాలు, పచ్చి ప్రాయాలైపోతున్నాయి.. !!!

ఏమైనా చెయ్యరా.. 
కాని, 
నీ ప్రఘాడ ప్రేమాభివ్యక్తిగా చేసుకో.. 
నీ ఇష్ట కామ్యసిద్ధి శక్తిగా చూసుకో.. 
ఆత్మ సఖా.. 
పరవశించిన నా దేహంలోని 
పంచ ప్రాణాలు నీవేరా... 
అందుకోరా.. 
నా ఆత్మ సఖా.. !!!

Written by : Bobby Nani

Saturday, September 2, 2017

ఇప్పుడే మొదలైంది...ఇప్పుడే మొదలైంది... 
టపటప మని.. చిటపట మని ..
అణిగిమణిగి వున్న మట్టిని ఆదరగొడుతూ .. ఎగరగొడుతూ .. 
నేతివంటను సైతం ప్రక్కకు నెట్టే కమ్మని మట్టి వాసనదుగో ..
నింగినుంచి జల జలా మని రాలుతున్న వర్షపు చినుకులదిగో.. 

కాని ఏం లాభం..

కార్పొరేట్ సదుపాయాల మధ్యన 
సుఖ వీలు చైర్లలో బానిస సంకెళ్ళేసుకొని కూర్చున్నారదిగో.. 
కాలు కదపలేరు.. 
వీలు కుదర రాదు... 
ఆరంతస్తుల అద్దాల మేడల్లో 
ఐదంకెల జీతాల్ని లెక్కించుచూ బిక్కుబిక్కుమని 
బిక్కమొఖము గల్గి చూస్తున్నారదిగో..
ఆనందం తెలియని సంతోషంతో.. 
ఆస్వాదన తెలియని ఆనందంతో.. 
రంగులద్దుకున్న ప్లాస్టిక్ ముఖాలతో.. 
స్వేదం చిమ్మని హిమ గదులలో..
మట్టి తగలని పాదాలతో .. 
సౌకుమారులు.. సుకుమారులు అదిగో.. అదిగో.. 
వారేనయ్యా .. మనిషిని పోలిన ఖరీదు “మా”నుషులు.. 
అన్నీ ఉంటాయంటారు వీరి దగ్గర.. 
ఎంటవని అడిగితే ..
చూపెడతారు ధనము, కారు, ఇల్లు వగైరాలని.. 
అసలదేదయ్యా అని నే నడిగితే 
ఏంటది ?? 
అని బిక్కమోము వేసుకొని నిలబడుతారు నా మధ్యన.. 
ఇంతకీ ఏంటది ??
“సంతోషం, సంతృప్తి, కాలం, యవ్వనం” 
ఎప్పుడూ ఉరుకుల పరుగుల జీవితమేనా.. 
ఓ చెట్టునో, 
చేమనో,
పిట్టనో, 
పిల్లనో, 
వర్షించే మేఘాన్నో, 
హర్షించే నేలనో, 
రాలుతున్న చినుకునో, 
దాగివున్న మొలకనో, 
రెక్కలాడే పక్షినో, 
విచ్చుకునే కుసుమాన్నో,
పారుతున్న నీటినో, 
జారిపోయే చేపనో, 
కూసంత చూద్దామని, 
పరికిద్దామని ఉందా.. ?? 
ఊహు .. 
ఇది కదా సంతోషం.. 
రండి ఓసారలా ప్రపంచాన్ని చూద్దాం..
ప్రకృతి ఒడిలో ఒదిగిపోదాం ..

Written By : Bobby Nani

Friday, September 1, 2017

//// లేక్షణ \\\\//// లేక్షణ \\\\
***********


యెంత కష్టమో నిను చేరాలంటే.. 
ఎలా అయినా నిను చేరాలంతే .. 

నే వచ్చే లోగా నీ తకిట తకదిమి .. ఆగదని.. 
నిలకడ వదలిన నీ మునివేళ్ళును మునిమాపు వేళల్లో 
సందెపొద్దు సూరీడు ముద్దాడి వెళ్ళే లోగా 
అనుకున్నా కలవిడిచి .. 
ఇలనైనా నిను చేరాలంతే .. !!

శీతల పవనాలు ప్రేరేపించే నాదాలై 
పక్షుల కువకువలు స్వర జతులై ఉత్తేజితం చేసే వేళ..
నిశీధి వీధుల విషాద ఛాయల్లో నువ్వు విశ్రమించవని 
అంబర వీధులు పహారా మాని నీకై నిలవనా.. !!

మేఘాల వీవెనలతో చెమిర్చిన మొహనాన్నే తడమనా.. 
మంచు బిందువులు నీ పెదవిపై వాలే లోగా ..
నిను చేరాలంతే ..!!

నీ నర్తనలో తడిసి ముద్దైన నేల నాకు కోనేరే నే ... 
నీ మువ్వ రాల్చిన మెరుపు రజనునై నే తానాలాడనా ..
వలపు వాకిట నీ దరిచేరనా .. నాకది పూల పన్నీరే కదే.. 
దూరాన చలించే నీపై తపనే తమకమై తరించనా
నిను వారించాలని .. వరించాలని వచ్చా 
అయినా నిను చేరాలంతే .. !!

గుండెలదిరేలా వచ్చా వడివడిగా దడదడగా
వెన్నెల కిరణాల దాడిలో నే ఓడేలోగా 
వెన్నెల విరిమోము ఆడి .. ఆడి ..అలసి వాడేలోగా 
నా జీవన ఉచ్వాస నను వీడే లోగా 
ఏనాటికైనా .. ఎలాగోలా .. 
నిను చేరాలంతే .. !! 
నిను చూడాలంతే ... !!

నా తీరంలా నువ్వు నర్తిస్తుంటే 
మెల్లగ నిను ముద్దాడి ...నే... సేద తీరాలంతే .. !!

నిను జీవితంలా శ్వాసించనీ 
ఈ నేలపై 
నా అడుగుల తడబాటు 
నీ ఊహల్లో నేను నేనుగా ఉండాలనే 
ఆవిర్లు విరజిమ్మే ఈ గుండె చప్పుడు 
ఆగేలోగా నిను చేరాలంతే ..!!
నిను హత్తుకోవాలంతే .. !!

నీ వలపుల వాకిట వడిలో బిర బిరా వచ్చి చేరానంతే..!!
తుమ్మెదలా వచ్చి నీ యెద పసిడి శిఖరములపై అలసి వాలానంతే.. !!!

Written By: Bobby Nani