Thursday, June 22, 2017

//ప్రణయాన్వితము\\రాధాకృష్ణులు అంటే ఇష్టంలేని వారు వుండరు కాబోలు.. వారి మధ్య జరిగే ప్రణయం, ప్రేమ, పరిష్వంగం నచ్చనివారు, గిట్టనివారు ఉంటారా.... వారి మధ్య జరిగే మధుర భావనలే బలే గమ్మత్తుగా ఉంటాయి .. ఆ ప్రణయ వర్ణనలు ఎందరో మహానుభావులు చేసారు, చేస్తున్నారు.. అయినా తనివి తీరదు.. వాటిపై వ్యామోహమూ చావదు.. 

వారి ప్రణయాన్ని రాయమని ఓ మిత్రుడు మరీ మరీ అడిగి నన్ను నిమిషం విడువక, ఊపిరి సలపనివ్వక.... చేసిన మెసేజ్ మళ్ళి మళ్ళి చేస్తూ విసుగుచెందని వసుధాధిపుడులా నన్ను అమిత భక్తి ప్రపత్తులతో, ఆరాధనా పలుకులతో చెయ్యకనే హిస్తూ, విసిగిస్తూ, హింసిస్తూ వుండే వాడు .. !! “మహాప్రభో రేపు రాసిపెడతాను” అన్న నా మాటకు సంతుష్టుఁడై, పరితృప్తుడై, ప్రశాంతకాముడై ఈ ఒక్కదినము నన్ను విడిచినమేరకు ఇలా ఈ ప్రణయాక్షరాలను రాయ సంకల్పించి కక్షావైక్షకుడనై కలం పట్టి ఇలా మీ ముందుకు వచ్చి నిల్చున్నాను.. 

ఇది అంతా ఊహాజనితం అయిననూ మిమ్మల్ని అలనాటి బృందావనం, యమునానదీ తీరప్రాంతాలకు తీసుకువెల్లగలననే నమ్మకంతో రాస్తునాను.. ఆస్తికులై, కృష్ణ భక్తితో, ఆరాధనా భావంతో మాత్రమే చదవమని విన్నపం.. ప్రతీ అక్షరాన్ని అనుభూతిస్తూ రాశాను .. మీరూ అలా చదవగలిగితేనే ఆ మాధుర్యం మీకు అర్ధం అవుతుందని మాత్రం నిస్సందేహంగా చెప్పగలను.. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను వెలిబుచ్చాలని మనఃపూర్వకముగా కోరుకుంటూ వున్నాను.. చదువుతారు కదూ... !!

//ప్రణయాన్వితము\\
****************

దూరానా మురళీ గానం కమ్మగా కర్ణములకు తాకుతోంది..
రాధ మనస్సులో తన్మయత్వపు అలజడులు ఊపిరాడకనివ్వక, 
ఉక్కిరిబిక్కిరి గావిస్తున్నాయి....!!
ఎక్కడ నా కృష్ణుడు?? 
అంటూ తన మనసు, తనువూ తహతహ లాడుతున్నాయి.. 
తన నయనములు రెప్పవేయక వెతుకులాటలో నిమగ్నమయ్యాయి.. !!
పరవశం పొందుతున్న ఆ పాదాలు శబ్ద తరంగాలవైపు అడుగులు కలిపాయి..!!
తనకు తెలియకుండానే బృందావనం చేరుకుంది.. 
అక్కడి పచ్చని చెట్లు, పూల పరిమళం, పక్షుల పాటలు.. 
మనోహరమైన వాతావరణం .. 
ఆ బృందావనాన్ని పవిత్ర ప్రేమాలయంగా మార్చాయి.. !!
యమునానది నుంచి వీచే చల్లనిగాలి తరంగాలు,
దేవలోకం నుంచి యేవో మధురమైన అనుభవ వార్తల్ని 
మోసుకొస్తున్నట్లు భారంగా వున్నాయి.. 
రాధ ఆగమనాన్ని గమనించిన ...బృందావనం, 
యమునానది, గోవర్ధన పర్వతం, పున్నమి వెన్నెల, 
చల్లనిగాలి, మురళీ స్వరం స్వాగతం పలికాయి.. 
ఆమె బృందావనం లొ అడుగు పెట్టీ పెట్టగానే ఏ 
మధుర స్మ్రుతులు గుర్తుకు వచ్చాయో గాని .. 
గూళ్ళలోని పక్షులు ఆ రేయివేళ ఒక్కసారిగా కిలకిల మన్నాయి..!!
దూరాన కోనేరుకు కొన్ని క్రోసుల దూరంలో .. 
పొగడచెట్టు మొదట్లో కృష్ణుడు ఒంటరిగా కూర్చుని, 
మురళీ వాయించుకుంటున్నాడు..!!
వృక్షాగ్రాల ప్రకాశిస్తున్న చంద్రుని వెలుగు నీడల్లో, 
అతడు అత్యంత మనోహరంగా వున్నాడు.. 
పాలవంటి పున్నమి వెన్నెల్లో అతని ఇంద్రనీలం యెంత 
సౌందర్యంగా వెలిగిపోతోంది..!!
అతని చుట్టూవున్న ప్రతీదీ ఎంతో ఆకర్షణీయంగా వుంది.. 
భూమండలానికి ఓ దివ్య భూషణంగా, 
గోకులానికి కల్పవృక్షంగా, 
వ్రేపల్లెలో వెలసిన కృష్ణుడు తన సుందర చంచల వీక్షణాలతో ఈ 
విశ్వసౌందర్యాన్నే దోచుకున్నట్లు గా ఉన్నాడే అనుకుంటూ 
రెప్పవేయక, కాలు కదపక, 
పెదవి విప్పక అలానే చూస్తూనే నిలబడిపోయింది రాధ..!!
తపనపడే రాధ హృదయానికి, 
ఆరాటపడే ఆమె కళ్ళకు, 
ఆకాశంలోని నీల మేఘమే ఆ రూపు 
ధరించిందా అనిపించింది ఆమెకు.. 
నెమ్మదిగా రాధ అడుగులో అడుగు వేసుకుంటూ,
కృష్ణుని సమీపించింది.. 
ఆమె అనుకున్నట్లూ, అనుమానపడినట్లూ..
ఆందోళన చెందినట్లూ, అతని చుట్టూ గోపికలు లేరు..
అతడు ఒంటరిగా కూర్చొని మురళీ వాయించుకుంటూ వున్నాడు.. 
గాలి అతని ముంగురులతో ఆడుకుంటూంది..
వెన్నెల అతని నీల దేహాన్ని తాకి పరవశిస్తోంది...
ఆ దృశ్యం ఆమెను ఉత్తేజపరిచింది.. 
ఆ క్షణాన ఆమె మనసు అతి లావణ్య రస ప్రవాహాన తేలియాడింది.. 
కృష్ణ సందర్శనంతో ఆమె దేహం, ఆపాదమస్తకం పులకరించింది.. 
ఏ లోకంలోనో విహరిస్తున్న అతని చూపులు అప్రయత్నంగా 
ఆమెపై నిలిచాయి.. అతని పెదవులు కదిలి, మధురంగా నవ్వాయి.. 
ఆ క్షణాన అతని ఆంతర్యంలో ఎటువంటి సంకల్పం కలిగిందో కాని, 
ఆమె నిలువెల్లా కరిగిపోయింది..!!
అతని చూపుతో ఆమెకు కాళ్ళక్రింది భూమి,
పై ఆకాశం కదిలిపోతున్నట్లు అనిపించింది.. 
ఆమెకు తన శ్వాస కూడా దీర్ఘం, భారం అనిపించింది..
ఆమె నున్నటి చేక్కెళ్ళ మీదనుంచి ఆనంద భాష్పాలు 
జల జలా ధారలుగా జారి, వక్షోగ్రాల మీద పడి, 
వొడినంతా తడిపాయి.. 
పున్నాగపువ్వులు తలంబ్రాలుగా ఆమె తలపై రాలాయి..
కృష్ణుని వేణుగానం ఆమె హృదయానికి సూటిగా తాకడం వల్ల,
ఆమె మనోస్థితి నిస్సహాయమైపోయింది.. శరీరం వశం తప్పడంతో,
ఆమె తనకు తెలియకుండానే కృష్ణుని చేతిలో మురళి లాక్కుంది. 
కృష్ణుడు ఆమెను పట్టుకోబోయాడు.. 
ఆమె అందక చెంపకచెట్టు ప్రక్కకు తప్పుకుంది... 
మరుక్షణంలోనే, బహుచిత్రంగా పున్నాగ చెట్టుకింద 
రాధ మురళీధరుని నులివెచ్చని కౌగిళ్ళలో తన్మయత్వం పొందుతోంది.. 
కల అనుకుంది.. కాని ఇలే .. 
క్రమ క్రమంగా ఆమె మనసు, హృదయం, దేహం, అతని చేతుల్లో 
వెన్నలా కరిగిపోయాయి.. !!
కృష్ణుడు ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ, 
హృదయానికి గట్టిగా హత్తుకున్నాడు.. 
పద్మం మీదకు వ్రాలే తుమ్మెద మాదిరి, 
అతడు ఆమె ముఖం మీదకి నెమ్మదిగా వొరిగాడు.. 
ఆమె, అతని కౌగిలి నుంచి తప్పించుకోవాలని తంటాలు పడింది.. 
కాని కాలు కూడా కదపలేక పోయింది..
సన్నని సంగీతంలాంటి, గులాబీ రేకులవంటి కృష్ణుని పెదవులు 
రాధ చెక్కెళ్ళపై నాజూకుగా నాట్యం చేశాయి..
అతని మృదు స్పర్శతో .. ఆమె వొళ్ళంతా గగుర్పొడిచింది .. 
ఆమె ప్రతీ జీవకణం మధుర గీతాలాపన చేసింది.. 
ఆమె కళ్ళు తృప్తితో మూతలు పడ్డాయి.. 
మాంత్రికుని చేతిలో కీలుబొమ్మ మాదిరిగా, 
రాధ కృష్ణుని చేతుల్లో ఉండిపోయింది.. కొన్ని క్షణాలు 
నిశ్శబ్దంగా గడిచాయి.. 
చంద్రుడు చెట్ల ఆకుల్లోంచి చల్లగా, మెల్లగా చూస్తున్నాడు.. 
దూరంనుంచి అడవిజాల పరిమళం వొస్తోంది.. 
కృష్ణుడు ఆమె గోమును లాలిస్తూ, ముద్దు పెట్టుకోబోయాడు.. 
ఆమె అరచేతిని అడ్డుపెడుతూ “వద్దు” అంది .. 
ఆమె మాట వినపడనట్లు అతడు ఆమె నడుముచుట్టూ చెయ్యేసి, 
కోనేటివైపుకు తీసుకెళ్ళాడు.. 
అతని సాహసం, చనువుం ఆప్యాయత, అనురాగం, ప్రేమ 
ఆమెనెంతో కదిలించాయి.. 
రాధాకృష్ణులిద్దరూ పూర్ణవికసిత పుష్పాలవలె, 
ప్రేమ సౌరభాన్ని వెదజల్లుతూ బృందావనమంతా తిరుగాడారు..!!!

Written By : Bobby Nani

Monday, June 19, 2017

“ఆత్మహత్య” అనే అంశంపై నా స్వరం సమకూర్చి ఒక వీడియో రూపంలో రూపొందించాను..దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజెయ్యండి..
ఒక చిన్న సాహాసం చేసాను... ఇప్పటివరకు నేను అక్షరాలనే వ్రాసాను.. మొదటిసారి “ఆత్మహత్య” అనే అంశంపై నా స్వరం సమకూర్చి ఒక వీడియో రూపంలో రూపొందించాను..దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజెయ్యండి..

Saturday, June 17, 2017

//// లేక్షణ \\\\“లేక్షణ” ఈ పేరు నేను రాస్తున్న SOCOTRA (The Mysterious Island) లోని అపురూప సౌందర్యవతి అయిన నా కథానాయిక యొక్క పేరు.. ఇది రహస్యంగా ఉంచి ఆ కథలో చెప్పాలనుకున్నా.. కాని ఈ మధుర కవిత రాసాక ఇందులో ప్రతీ అక్షరం ఆమెకే చెందాలనిపించింది.. అందుకే బహిర్గతం చేసాను.. నా లేక్షణ ను మీరుకూడా దర్శించండి.. 

//// లేక్షణ \\\\
***********


కొన్ని బాంధవ్యాలు తెలియకుండా వికసిస్తాయి... 
అలా వికసించి పరిమళించిన ఆత్మీయ బంధములలో 
నీది ప్రధమస్థానం బంగారం..!! 
ఏ క్షణాన నీతో మాట్లాడానో, 
ఆ క్షణం నుంచే నీపై, 
తెలియని, వర్ణించలేని ప్రేమ మాధుర్యం, 
నా మదిలో ధారలా స్రవించింది...!! 
ఆ తమకముతో, మైకముతో, 
రెప్పలు వాలిన నయనములతో, 
నీ హృదయ గూటిలో బంధీనైపోయానిలా... !!
నీ పెదవులనుంచి రాలే ప్రతీ శబ్దాన్ని, 
ఏరుకోవాలని ప్రతీ క్షణం ఉత్సుకతతో ఉంటాను .. 
నా కనుచూపు నీ దేహాన్ని తాకాలని, 
అనునిత్యం ఆరాటపడుతూ ఉంటాను.. 
నిను తాకిన గాలిని నా కౌగిళ్ళలో, 
బంధించాలని ప్రతీ క్షణం తహతహలాడుతుంటాను..!! 
నువ్వెంత దూరాన ఉన్నా నా హృదయానికి మాత్రం 
లిప్తపాటు కాలమే సఖీ.. 
ఒక్కటే కోరిక ..
చివరి క్షణాన అయినా కంటినిండా నీ రూపాన్ని దర్శించి 
గుండెల్లో ప్రతిష్టించి రెప్పలు వాల్చాలని ఉందే ... 
ఓయ్ 
బంగారం 
వినిపిస్తోందా.. 
నీ చెవి దగ్గరగా నిలిపిన నా పెదవుల శబ్దం.. 

Written by : Bobby Nani

Thursday, June 15, 2017

అలలు – కలలు
అలలు – కలలు
(ఓ చిన్న భావకవిత్వం)
*****************అలలకు లేదు అలసట

కలలకు లేదు వేసట

ఆశ్చర్యం !! అలలు శ్రమిస్తాయి,

విరామం లేకుండా , ఫలితం కోరకుండా..!

కలలు కంటారు ఖర్చు లేకుండా,

అనుభవిస్తారు ఆనందం మంచికలలైతే..!

పొందుతారు దుఃఖం చెడ్డ కలలైతే..!

జీవితంలో పొందలేని అనుభవాలు,

ఈలోకంలో అందరాని ఆనందాలు,

పొందవచ్చు స్వప్నాలలో,

చెందవచ్చు సౌఖ్యాన్ని..!

పనిలేని సముద్రం,

పంపుతుంది అలలను ఒడ్డుకు,

అవి అందుకుంటాయి గట్టును,

హత్తుకుంటాయి హృదయానికి,

పెదవులు తృప్తిగా... పెట్టుకుంటాయి ముద్దులు..!!

అసూయతో నిండిన కడలి,

అంతలోనే లాగుతుంది అలల కళ్ళెములను వెనక్కి...!

ముద్దు, మురిపెం ముగియకముందే,

కౌగిలింతలోని చక్కిలిగింతలు పొందకముందే..!!

కలలోనూ అంతే..!

కలలో కన్న సౌభాగ్యాలను పొందకముందే,

చప్పనాతి నిద్ర ఈర్ష్యతో చప్పున మేల్కొల్పుతుంది..!

ఓర్చలేక శరీరం పొందే,

అశరీర సౌందర్యం సంభ్రమాలను,

ఎందులోను ఉన్నా లేకున్నా,

ఇందులో వుంది పోలిక అలలకు కలలకు..!!


Written by : Bobby.Nani

Tuesday, June 13, 2017

జీవితంలో వేకువ, సంధ్య..జీవితంలో వేకువ, సంధ్య..
*******************

చెప్పలేని
దిగులు వ్యధతో
చలిని కప్పుకు వణికిన
ఒక ఎండు చేతుల రాత్రి..!

ఎర్రెర్రగా తొంగిచూస్తున్న
చెట్ల చిగుళ్ళ చిరునవ్వులను
కాలాన్ని వెనక్కి జరిపి
కౌగిలించుకుంటుంది..!

మంచు మైదానమై
పరుచుకున్న
శశిర చీకటిలోనుంచి
ఒక ఆకుపచ్చని గడ్డిపూల మొక్క
బంగారు రెమ్మల కళ్ళతో
తొట్టతొలి కిరణాన్ని
ముద్దాడుతోంది..!

క్రూరమైన దినచర్యలో
ఒళ్ళంతా కమిలిన
ఆకాశం..!

తళుక్కున వేళ్ళాడే
నెలవంక చిరునవ్వుని
ఆప్యాయంగా అక్కున
చేర్చుకుంటుంది..!

వెన్నెల రజనుతో మెరిసే
ఒక స్వేచ్చా సాయంకాలం
వళ్ళు విరుచుకుంటున్న
వేకువతో
కరచాలనం చేస్తుంది..!

పూడుకుపోయిన గొంతుల
మౌన సంభాషణలని
బరువెక్కిన గడియారం
ముండ్ల గుస గుసలు మోస్తాయి..!

తడి ఆరని మెరిసే కళ్ళని
కలిపేందుకు
ఆకాశం చుక్కల చాపలా
చుట్టుకుంటుంది..!

సాయంత్రంలో మునిగిపోయే పగలూ,
ఉదయమై ఎగసిపోయే రాత్రి...!

జీవితమనే పరిమళంలో
ఒక కొత్త రోజుగా
విచ్చుకుంటూ, మిగిలిపోతుంటాయి.. !!

Written by : Bobby Nani