Monday, January 16, 2017

మన జాతీయ గీతం....



సినిమాకు రివ్యూ రాసేంత గొప్పవాడిని కాను కాని.. దానికి ముందు వచ్చే మన జాతీయ గీతం గురించి కొన్ని మాటలు చెప్పాలనిపించింది..

చాలామంది దీనిపై విమర్శలు చేస్తున్నారు... ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చేవాళ్ళకు ఈ జాతీయ గీతం సినిమా హాళ్ళలో ప్లే చెయ్యడం ఎందుకు ?? అని..

106 ఏళ్ళ మన “జాతీయ గీతం” 1.27 బిలియన్ల భారతీయుల గుండె చప్పుడు... అలాంటి గీతాన్ని కేవలం స్కూల్స్ లోనే కాకుండా ఇలా అన్నిరకాల వయస్సు వారు వచ్చే ఈ సినిమా హాల్స్ లో ప్లే చెయ్యడం, వారికి గుర్తుచెయ్యడం, వారు ప్రభావితమయ్యేలా చెయ్యడం నిజంగా ప్రసంసనీయమైన విషయం.. కేవలం స్వాతంత్ర్య దినోత్సవం నాడు మాత్రమే గుర్తుకు తెచ్చుకొని మరలా మరుసటి సంవత్సరం తరువాత గుర్తుచేసుకునే దేశభక్తి మనదేశం కాకూడదు అని, అందరికీ కాకపోయినా సినిమా హాల్స్ కి వెళ్ళే 70% మందికైనా ఈ గీతం అనునిత్యం చేరువ కావాలని సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం నభూతో న భవిష్యతి ...

మీ “ఎంటర్టైన్మెంట్” కి ఈ 52 సెకన్ల జాతీయం గీతం అడ్డు వచ్చిందా.. ??

మనం ఇలా ఈ సినిమా హల్ లో “ఎంటర్టైన్మెంట్” కొరకు వచ్చి జారబడి కూర్చున్నాం అంటే అక్కడ ముద్ద ముట్టని మన సోదరులు కంటిపై కునుకులేకుండా సరిహద్దులలో కాపలాగా వున్నారు కాబట్టే... ఇక్కడ మనకు ఏ పని చెయ్యాలన్నా చెవులో మ్యూజిక్ ఉండాల్సిందే.. అక్కడ వాళ్ళకు నిజమైన మ్యూజిక్ “మన జాతీయ గీతం” ప్రాణాలు గాలిలో కలిసినా పర్వాలేదు జాతీయ గీతం మాత్రం ఆగకూడదు అనే నిర్మలమైన భక్తితో మనకు సేవనందిస్తున్నారు... ఇది ఒకరు చెప్తే రాదు.. చూస్తే రాదు.. చేస్తే రాదు.. ప్రతీ భారతీయుల రక్తంలో మిళితమై ఉంది .. ఆ మిళితమై వున్న దాన్ని తట్టి లేపే ప్రక్రియే ఈ సుప్రీంకోర్టు నిర్ణయం..

అంత గొప్ప గీతాన్ని ఆవిష్కరించిన విశ్వకవి “రవీంద్రనాథ్ ఠాగూర్” గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వున్నాను ... మన జాతీయ గీతం అందరికీ తెలిసినప్పటికీ, ఈ గీతం యొక్క భావం కొందరికి తెలియదు .... అర్ధం తెలియక పాడితే మీ ముఖములో ఆ వర్ణన, అభినయం కనపడవు. తద్వారా ఎదుటివారికి అనుభూతి కలిగించేలా ఉండకపోవచ్చు ... తెలియకుండా చేసేపని మనకు ఎప్పటికి ఫలితాన్ని ఇవ్వబోదు .... కనుక ఈ భావాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ...

భావం : ప్రజలందరి మనస్సుకూ అధినేతవు, భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగు గాక. పంజాబ, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ, వంగ దేశాలతోను, వింధ్య, హిమాలయ పర్వతాలతోను, యమునా, గంగా ప్రవాహాలతో ఉవ్వెత్తున లేచే సముద్ర తరంగాలతోను శోభించే ఓ భాగ్య విధాతా! వాటికి నీ శుభనామం ఉద్బోధ కలిగిస్తుంది. అవి నీ ఆశీస్సులను ఆకాంక్షిస్తాయి. నీ జయ గాథల్ని గానం చేస్తాయి. సకల జనులకు మంగళకారివి. భారత భాగ్య విధాతవూ అయిన నీకు జయమగుగాక! జయమగుగాక! జయమగుగాక!

జనగణమన గీతం విశ్వకవి ఆత్మనే కాదు యావత్‌ భారతదేశాత్మను కూడా నినదింపజేస్తోంది. దీన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో గుర్తించింది. అతి విలువైన, అమూల్యమైన అవార్డు మన గీతానికి దక్కడం భారతీయులుగా మనకందరికీ గర్వకారణం. ఆ బాలగోపాలానికి ప్రీతిపాత్రమైన ఈ గీతాన్ని కలకాలం నిలుపు కుందాం. దేశం దశ దిశలా మారుమోగే ఈ సుందర గీతాన్ని గుండెగుండెలో నింపుకుందాం.

చివరగా : సినిమా హాల్ లో కూర్చున్న నాకు .. నా స్నేహితుడు చెవిలో చెప్పే మాటలు వినడమే కష్టం అయిన తరుణంలో .. తెల్లని వెండి పూత కలిగిన ఆ వస్త్రముపై మువ్వన్నెల జెండా రెప రెప లాడుతూ కనిపించగానే ఒక్కసారిగా ఆ సినిమా హాలు ఆవరణం యెంత నిశ్శబ్దం అయిపోయిందో చెప్పాలంటే మాటలు చాలవు.. అందరూ టక్కున లేచి చేతులు కట్టుకొని కొన్ని క్షణాలు ఆ మధుర గీతంలో కలిసిపోయి పాడే దృశ్యాన్ని చూస్తున్న నాకు వెంట్రుకలు నిక్క బొడుచుకున్నాయి.. ఇదంతా ఒకరు చెప్పారా ?? అలా చెయ్యమని.. లేదే.. ఎవరికి వారు స్వతహాగా తమ భారతదేశాన్ని వారు గౌరవించుకున్నారు.. ప్రతీ హృదయంలో మువ్వన్నెల జెండా రెప రెప లాడింది.. చాలా సంతోషం అనిపించింది.. ఇలాంటి మార్పు అందరిలో రావాలని కోరుకుంటూ..

జైహింద్ __/\__
Written by ; Bobby

1 comment:

  1. super blog....
    Hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai

    ReplyDelete