Thursday, January 5, 2017

ఓ తెలుగువాడి ఆత్మాభిమానం ...



ఓ తెలుగువాడి ఆత్మాభిమానం 
*********************


తెలుగుతల్లి కంఠం మూగవోయింది !
తేట తెలుగు నేడు గరళమయింది !
జానపదుల గుండె చిల్లుపడ్డది !
తెలుగు పుస్తకాల పైరును, పరభాష పురుగు తిన్నది !
రాసే తెలుగు కలాల వెంట కన్నీరు ఉబుకుతున్నది ! 

మున్సిపల్‌ పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దు చేస్తూ మున్సిపల్ శాఖ ఆదేశాలు ఇవ్వడం కడు శోచనీయం ... ప్రపంచంలో ఏ భాషలోనూ లేనంత సాహితీ సంపద తెలుగులో ఉంది. అది మనం చదవాలన్నా లేక మన పిల్లలు చదవాలన్నా ఖచ్చితంగా మనకు మన పిల్లలకు తెలుగు తెలిసి ఉండాలి.

ఆదికవి నన్నయ భారతాన్ని తెలుగులో అనువదించడానికి ముందు, అసలు తెలుగు భాషలో ఉన్న లోపాలను గమనించి ముందు తెలుగు భాషను సంస్కరించాలని "ఆంద్ర శబ్ద చింతామణి" అనే భాషా గ్రంధాన్ని రచించాడు. ఇప్పుడు మనకు, నన్నయకు ఉన్నంత భాషాభిమానం గాని ప్రేమ గాని తెలుగు మీద లేదు. అంత అవసరమూ, సమయమూ మనదగ్గర ఇప్పుడు లేదు. కనీసం ఇప్పుడు మిగిలిన భాషను అయినా కాపాడుకుంటూ వున్నాము అంటే అది కూడా ఇకపై లేకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రతీ తెలుగు వాడు ఖండించాల్సిందే .. 

ఇప్పటికే పుస్తకాల క్షేత్రాలలో కలాల హలాలు దున్నిపండించుకున్న సువర్ణాక్షరాలు కనుమరుగై పోయాయి.. ఈ నిర్ణయం తీసుకుంటే ఇకపై శిధిలావస్థకు చేరుకోక తప్పదు... 

సంస్కృత భాష ప్రాబల్యం నుండి బయటపడేందుకు తెలుగు భాష ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చింది. వైదిక భాషల్నీ, వైదిక భావ జాలాన్నీ ప్రతిఘతించడంలో ద్రవిడ జాతులందరికంటే తెలుగువారే ప్రముఖ పాత్ర వహించారు. ఎట్టకేలకు వాడుక భాషను సాధించారు. ప్రస్తుతం వెయ్యేళ్ళకు పైబడిన తెలుగు సాహిత్యం మనకు లభ్యమవుతోంది. 
"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను 
తెలుగు వల్లభుండ తెలుగొకండ 
ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి 
దేశ భాషలందు తెలుగు లెస్స" 

అని శ్రీకృష్ణదేవరాయలు తన స్వీయ గ్రంధమైన “ఆముక్త మాల్యద”లో తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించాడు. 

చోళులు, చాళుక్యుల యుగం నుండి తెలుగు అన్న మాటను పలికించడం, తెలుగు పద్యం కనిపించడం, తెలుగు పాట వినిపించడం జరిగింది. భారతదేశంలో హింది తరువాత ఎక్కువమంది ప్రజలు మాట్లాడే భాష నా తెలుగు భాష. ద్వితీయ స్థానంలో ఈ అద్వితీయ భాష ఉందంటే కారణం భాషలోని తీయదనం తప్ప మరోటి కాదు అనడంలో అతిశయోక్తి లేదు.. 

అసలు నిజానికి ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలనేది ప్రపంచవ్యాప్తంగా విజ్ఞులు చెప్పేమాట..! ఎందుకంటె ?? పుట్టినప్పటి నుంచీ బిడ్డ తెలుగులోనే మాట్లాడుతూ తెలుగే నేర్చుకుంటాడు. అతడు బువ్వ తింటాడు, ఆడుకుంటాడు, నవ్వుతాడు, ఏడుస్తాడు, కొడతాడు, పాడతాడు. 

అంతేగానీ 

“హి డస్ నాట్ ఈట్” 

“డస్ నాట్ ప్లే” 

“డస్ నాట్ లాఫ్” 

“డస్ నాట్ క్రై”

“డస్ నాట్ బీట్”

“డస్ నాట్ సింగింగ్” 

తెలుగు భాషలో, తెలుగు వాతావరణంలో, తెలుగు సంస్కృతిలో మూడేళ్ళు పెరిగిన పిల్లవాడికి, బడిలో చేరగానే “వాట్జ్స్యువర్నేమ్” ?? “వాట్జ్స్యువర్ నిక్ నేమ్” ?? అంటూ మాట్లాడితే వాడికేం అర్థమౌతుంది? మనల్ని హఠాత్తుగా “స్వాహిలి భాష” మాట్లాడే వాళ్ళ మధ్య పడేస్తే మన పరిస్థితి ఏమిటి?

“దప్పికతో నోరు పిడచకట్టుకు పోతోంది, కాసిన్ని మంచినీళ్ళు ఇప్పించండి” అని తెలుగులో ప్రాథేయపడితే, మంచినీళ్ళు ఇవ్వకుండా “నేనో తెలుగు గాడిదను” అనే బోర్డు మన మెడలో తగిలిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? 

రేపు ఇంగ్లీషు బడిలోకి నెట్టబడిన ఆ కసుగాయల పరిస్థితి కూడా ఇదే అవుతుంది ..!! 

తెలుగులో బోధన జరిగేటపుడు, భాషతో పిల్లలకు ఇబ్బంది ఉండదు - వారికి భాష ముందే వచ్చు కాబట్టి. వాళ్ళకు అక్షరాలు రావంతే! పుస్తకాల్లోని విషయాన్ని చదవేందుకు, చదివినదాన్ని తిరిగి రాసేందుకూ ముందు పిల్లలు అక్షరాలు నేర్చుకోవాలి. అవి బడిలో చేరగానే నేర్చుకుంటారు. కానీ ఇంగ్లీషులో చదివే పిల్లలు ముందు ఇంగ్లీషు భాషను నేర్చుకోవాలి. భాష నేర్చుకోవడమంటే చదవడం రాయడం నేర్చుకోవడం కాదన్న సంగతిని ఈ సందర్భంగా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి.

మనిషి నుంచి మనిషికి సమాచార ప్రవాహం విషయంలో భాష ఎటువంటి పాత్ర పోషిస్తుందో “మాతృభాషలో ప్రాథమిక విద్య శాస్త్రీయ వివరణ” పుస్తకంలో డా. పమిడి శ్రీనివాసతేజ ఇలా రాసారు:

{సంభాషణ లేదా సమాచార మార్పిడి అర్థవంతంగా జరగాలంటే ఇద్దరి వ్యక్తుల మనసుల్లో ముందుగానే భాషకు సంబంధించిన ప్రోగ్రామింగు జరిగి ఉండాలి. బిడ్డ పుట్టినప్పటి నుండీ జరిగే ప్రోగ్రామింగే భాషాభివృద్ధి. మనకు తెలుగులో ప్రోగ్రామింగు జరిగితే తమిళులకు తమిళ భాషలో ప్రోగ్రామింగు జరుగుతుంది. ఎవరికి ఏ భాషలో ప్రోగ్రామింగు జరుగుతుందో దాన్ని మాత్రమే అర్థం చేసుకోగలరు. ఇతర భాషను అర్థం చేసుకోలేరు. ఒక వేళ ఇతర భాషను అర్థం చేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రోగ్రామింగు జరిగి తీరాలి. అంటే ఆ భాషను నేర్చుకుని తీరాలి.}

అంటే, మన కంప్యూటరుకు తెలుగు నేర్పకుండా పొద్దును చదవడానికి ప్రయత్నించడమెలాగో తెలుగు పిల్లలకు ఇంగ్లీషులో చదువు చెప్పడమలాంటిదే!

మహా మహా విజ్ఞానులు, మేధావులు ఉన్న నా తెలుగు దేశంలో ప్రభుత్వం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటుంటే మీరెలా చూస్తూ ఉన్నారు ?? 

కొందరు మాటి మాటికి అంటున్న ఓ మాట చాలా హాస్యాన్ని ఇస్తోంది.. 

“తెలుగు తెలుగు అని గింజు కుంటున్నారు మీ పిల్లల్ని మున్సిపల్ స్కూల్ లో చేర్పిస్తారా” ??

నాటినుంచి నేటి నీ వరకు కూడా నువ్వెక్కడ నుంచి చదివి వచ్చావ్ ?? ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయా.. ?? లేవు కారణం ... ఒకప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆదర్శవంతమైన విద్యను అందించేవారు .. మరి ఇప్పుడు వున్న వాళ్ళలో నూటికి 90 శాతం మంది ఇంటిదగ్గర ట్యూషన్ ల రూపంలో విలువైన విద్యను అందిస్తున్నారు.. నిజానికి వీరు మున్సిపల్‌ పాఠశాలల్లో ఇలాంటి విద్యను చెప్పరు .. వారి స్వంత ట్యూషన్ లలో అయితేనే చెప్తారు.. ఇక ప్రజలు మున్సిపల్‌ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివించాలని ఎలా అనుకుంటారు ?? అందుకే పేదవాడు సైతం తలో, తాడో తాకట్టు పెట్టి విలువైన విద్యను కొనుక్కుంటున్నాడు .. దాన్ని అదునుగా తీసుకొని ప్రైవేటు యాజమాన్యం పేదవాడి నడ్డి విరుస్తోంది ... ఇక్కడ తప్పెవరిది ?? 

విద్యను సరిగా చెప్పగలిగి వుండి కూడా చెప్పకుండా వున్న ఉపాధ్యాయునిదా ?? 

ఉపాధ్యాయులను ఆదేశించి సరిగా పని చెయ్యించలేని ఈ అసమర్ధ ప్రభుత్వానిదా ?? 

ఇంగ్లీష్ మోజు చూపించి స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ అని బట్టీ చదువులకు ఊపిరి పోస్తున్న ప్రైవేటు సంస్థలదా ??

ప్రభుత్వం “తెలుగు రద్దు” అనే మాట కాకుండా మున్సిపల్‌ పాఠశాలల్లో ఇకపై అత్యాధునికమైన విద్యను అందిస్తాము.. ప్రైవేటు సంస్థలకన్నా పేదవానికి అందుబాటులో విలువైన విద్య, ఉన్నతమైన విద్యను అందిస్తాము అని చెప్పివుంటే యావత్ తెలుగు ప్రజలే కాకుండా దేశం మొత్తం కరతాళధ్వనులతో హర్షించేది.. ఇకనైనా రద్దు అనేమాటలు ఆపి ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటే ప్రజలు, ప్రభుత్వం బాగుంటుంది. 


స్వస్తి ___/\___

Written by : BOBBY

2 comments:

  1. nizame andi.government inka okasari aalochinchi aa nirnayanni vennekki teesukunte manchidi nani garu

    ReplyDelete
    Replies
    1. thank u mam ..aa marpukorake vechivunnam mam ..

      Delete