Sunday, April 26, 2020

వర్షించిన ఓ సంధ్యాస్తమయం..


చుట్టూ ఆకాశం నీలవర్ణమై మురిసిపోతూ వుంది..
పారిజాత చెట్టు నీడలో నిల్చున్న నాపై,
పిల్ల తెమ్మెరలు కొమ్మల్ని పట్టుకొని ఆకుల్ని కుదిపి కుదిపి
చిగురుటాకు పెదవులపై నుంచి ఎగిరొచ్చే నీటి బిందువుల్ని
నాపై సున్నితంగా వర్షిస్తున్నాయి..!!

మరోసారి కోరిక తీరక నీలాకాశాన్ని ఆక్రమించుకున్న మేఘాల్లో,
కొమ్మా కొమ్మా మురిసిపోతూ,
యౌవనంలో తడిసి మైమరిచిపోతూంటే,
మధ్య కొమ్మల్లో వణుకుతూ కూర్చున్న కోయిల నన్ను చూచి
సిగ్గుతో నవ్వుతూ సప్తస్వరాలు పలికింది..!!

తనతో గొంతు పలికిన నాలో..
ఎన్నెన్నో కోరికలు కొంటెగా నా కళ్ళలో కొచ్చి నిల్చున్నాయి
నా ముందే నగ్నంగా స్నానం చేస్తున్న వృక్షాలు
పువ్వు బుగ్గల్ని పదే పదే ముద్దాడుతున్న పిల్లగాలులు
వర్షాన్ని నిశ్శబ్దంగానే ఆస్వాదిస్తున్నాయి.. !!

గప్చిప్ గానే కళ్ళలో కోరికలను
రగిలించుకుంటున్నాయి తమ హృదయాలతో.!
ఓ మూలన వున్న కొబ్బరాకూ, అరటాకూ
నిశ్శబ్దంగానే  చిలిపిగా వేళ్ళు కలుపుకుంటున్నాయి..!!
ఈ పచ్చని నందనవనంలో
ఆకూ ఆకూ నవ్వుతూ పలకరించుకుంటున్నాయి..
మెరుస్తున్న ఆకుల పరిష్వంగంలో ఆకాశం మురిసిపోతుంది..!!

వెలిసిపోతున్న వర్షపు వేళ్ళలోనుంచి
ఆకాశం వేయి కళ్ళతో తొంగి చూస్తోంది..!!

నా కళ్ళలోని వెలుగుని ఆశ్చర్యాన్ని
జారిపోతున్న నా ఆనందాన్ని గుప్పిట పట్టుకుని
వర్షంలో తడుస్తూ పారిజాత పరిమళాల్ని ఆస్వాదిస్తూ వుండిపోయానలా..!!

Written by: Bobby Nani

Monday, April 13, 2020

ఏమని కవిత రాయమంటావ్ ??


ఏమని కవిత రాయమంటావ్ ..??
నా చుట్టూ లక్షల బ్రతుకులు విషాదమై,
దృశ్యాలు వివర్ణమౌతున్నాయి..
వేకువ నిశీధమై, 
నిశీధము అమాసమై,
రాజ్యాలను కూల్చిన వినూత్న సమాజ
విషాద గానాల్ని నేను నిశ్శబ్దంగా ఆలకిస్తున్నాను.. !!

నా కళ్ళలో జ్వలిస్తున్న ఆందోళనకు
నా హృదయంలో రగుల్తున్న సంఘర్షణకు
రూపమెలా ఇవ్వాలో తెలియని అన్వేషణ లో 
స్తబ్దుగా ఉండిపోతున్నాను.. !!

నా మనసు ప్రపంచాలను దాటి విస్తరించి
ఎన్నో విషయాలను చూస్తోంది..
పట్టపగలే నా దేశ పౌరులు 
వీధి దీపాలకు వేళ్ళాడటం నే దర్శిస్తున్నాను
నిర్లక్ష్యపు అరుపుల్లో వేలకొద్దీ అగ్నిపర్వతాలు నా 
పట్టణ వీధుల్ని ముంచెత్తుతున్నాయి..
అశాంతి తో నా దేశం అట్టుడికినట్లుడికి పోతోంది..
ఈ చీకట్లో నీళ్ళకోసం ఎక్కడని వెతకను ? నా 
రక్తసిక్తమైన నేత్రాలను కడుక్కోడానికి.. !!

ఏమని కవిత రాయమంటావ్..??

కదిలిపోతున్న భవన పునాదులు
కూలిపోతున్న దీప స్తంభాలు
చావు వాసన వేస్తున్న శరీరాలు 
నా దేశం నగరాలనిండా గస్తీ తిరుగుతున్నాయి.. 
నిర్లక్ష్యపు ఈ జనాల మధ్యన వేచి చూస్తున్నాయి...!!

చెప్పు ఏమని కవిత రాయమంటావ్..??

గుండె భారమై పోయింది.. 
అక్షరం వాడిపోయి కూర్చుంది.. 
సిరా ఇంకిపోయి చూస్తుంది..
కలము కదలనని వాపోయింది.. 
అందుకే 
నా గుమ్మానికి లోపలనే కూర్చుని 
వెలుపల వెన్నెల ప్రసారం చేస్తున్న వార్తల్ని వింటూ వున్నా..!! 
నిర్జీవమై ….. వున్నా..!!

Written by: Bobby Nani