Wednesday, November 30, 2016

“ప్రేమ” ....“ప్రేమ” ....

ఈ రెండక్షరాల పదానికి వున్న శక్తి అంతా ఇంతా కాదండి.. “అమ్మ” తరువాత అమ్మంత ఆకర్షణీయమైన, అనువైన పదం “ప్రేమ” ఒక్కటే.. ఒకరిపై మనం ప్రేమ చూపిస్తే అదే ప్రేమ మనకు అందుతుందని మాత్రం అనుకోకండి... ఇది గోడకు కొట్టిన బంతి కాదు... ఒక్కోసారి మీరు ప్రేమించిన ప్రేమ అంతకన్నా ఎక్కువగా మీకు అందవచ్చు ఒక్కోసారి అసలే రాకపోవచ్చు ... అసలు ఈ “ప్రేమ” ఎలాంటిది అనే తదితర విషయాల గురించి నాకు తెలిసినవి నేను రాస్తున్నాను.. 
కొందరు ఎందుకు ప్రేమించగలుగుతారు ?? 
కొందరు ఎందుకు ప్రేమించలేకపొతున్నారు ?? 
ఈ రెండు ప్రశ్నలకు ఎన్ని రకాలుగా సమాధానాలు చెప్పుకున్నప్పటికీ ప్రేమించడం అందరికీ సులభసాధ్యం కాదు... ప్రేమ అనే పదానికి ఎన్ని నిర్వచనాలిచ్చినా ప్రేమించడం అంత సులభం కాదు.. 

రక్తసంబంధం వున్న వాళ్ళ మీదే ప్రేమ వుంటుంది అనుకోవడం పూర్తిగా నిజం కాదు.. అదే నిజమైతే మన రక్తాన్ని పీల్చి బ్రతికే దోమల మీద మనకు ప్రేమ ఉండాలి... కాని మన రక్తంలో బిందువు ఒక్క అణుమాత్రం పీల్చినా, తక్షణం ఆ దోమని అరచేత్తో ఒక్క చరుపు చరిచి దాని అంతు చూస్తాం... రక్త సంబంధం వున్న బంధువులందరినీ సమానంగా ప్రేమించలేం .. అంటే ప్రేమలో కూడా హెచ్చు తగ్గులుంటాయనే కదా అర్ధం.. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో వుంచినట్లు, ప్రతీ ఒక్కరినీ తూచి తూచి ప్రేమిస్తాం.. 

“నా అత్యంత ప్రియమైన భార్యకి” అని అపురూపంగా రాసిన తన ఓ భర్త మొదటి ఉత్తరానికి ఆ మహా ఇల్లాలు తన సమాధానంలో “ ఆ తక్కిన వాళ్ళెవరు” ? అని అడిగిందట... అంటే “ప్రియమైన భార్య” “అతి ప్రియమైన భార్య” కూడా వుండి ఉంటారని ఆ ఇల్లాలు అనుకోని అసూయ చెందింది.. 

“నిష్కల్మషమైన ప్రేమ” అని వాడుతూ వుంటాం.. అంటే ప్రేమలో కల్మషం, కల్తీ ఉంటాయనే కదా దాని భావం.. పలానా వారి ప్రేమ నిష్కల్మషమైనది అని ప్రత్యేకంగా చెబుతున్నామంటే, నిష్కల్మషమైన ప్రేమ అరుదైనదని అర్ధమవుతుంది.. ప్రేమలో కల్తీ ఎలా ఏర్పడుతుంది ?? ప్రేమలో కలగాపులగంగా స్వార్ధం, అసూయ, అహంకారం, మొదలైన మానవ దుర్లక్షనాలన్నీ ఉంటాయి.. కొన్ని పైకి కనిపిస్తాయి, కొన్ని కనిపించవు.. కొన్ని పైకి కనిపించినా, వాటిని సమర్ధించుకుంటాం ఇదే నేటి కాలపు పోకడ... 

ప్రేమిస్తున్నామంటే సరిపోదు.. ప్రేమకు నిదర్శనం కావాలనుకుంటాం .. మనం ప్రేమిస్తున్న వారికి ఇష్టమైనవి వండి పెడతాం, కొని పెడతాం.. పుట్టినరోజు గుర్తుపెట్టుకొని ఏవైనా బహుమతులు కూడా ఇస్తూ వుంటాం.. మనం ప్రేమిస్తున్న వారితో స్నేహపూర్వకంగా, సరళంగా, మృదువుగా మాట్లాడుతాం... వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాం.. మనల్ని ప్రేమిచే వారుకూడా అలానే ప్రవర్తించాలని ఆపేక్షిస్తాం... మనమంటే నిర్లక్ష్యం చూపించే వాళ్ళకు మనమీద ప్రేమ వుందంటే ఒప్పుకోము.. చివరికి తల్లిదండ్రులు అయినా సరే, నిత్యం, పిల్లల్ని తిట్టి, కొడుతూ వుంటే వారిమీద విముఖత పెరుగుతుంది పిల్లలకు.. ఏదో విసుగొచ్చి తిట్టి, కొడితే మాత్రం తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉండదా అంటారు... కాని కొంతమంది పిల్లలకు తల్లితండ్రుల కఠిన ప్రవర్తన మనస్సులో నాటుకు పోయి, పెద్ద అయిన తరువాత కూడా తల్లిదండ్రులు తమను చిన్నప్పుడు సరిగా ప్రేమగా చూడలేదనే భావం మనసులో ములుకులా గుచ్చుకుంటూ ఉంటుంది .. 

అలాగే భార్య, భర్తలు కూడా నిత్యం తమ ప్రేమను మాటల ద్వారా, చేష్టల ద్వారా ప్రదర్శించాలనుకుంటారు.. ఒకరికిష్టమైనట్లు మరొకరు ప్రవర్తించకపోతే ఎదుటివారికి తమపైన ప్రేమ, గౌరవం లేవనుకుంటారు.. ఈ ప్రేమ ప్రదర్శించడంలో ఎదుటివారికి ఇష్టమైన పనులు చెయ్యడమే కాక, ఎదుటివారికి ఇష్టం లేని పనులు చెయ్యకుండా వుండటం కూడా ఒక భాగమవుతుంది... 

ఈ ఇష్టంలేని వాటిలో ఇంకొకరిమీద ప్రేమ చూపించడం ముఖ్యమైనది.. తన తల్లి ఇంకొకరి పిల్లలను ప్రేమించడం పిల్లలు సహించలేరు... మరొక తల్లి పిల్లల్నే గాక, తన చెల్లినో, తమ్ముడినో ప్రేమించడం కూడా సహించలేరు కొందరు పిల్లలు.. అలాగే భార్యాభర్తలు కూడా పరస్పరంగానే తప్ప, పరులను ప్రేమించడం సహించరు .. 

ప్రేమించడం, ప్రేమించబడటం కూడా సులభం కాదు.. ప్రేమించాలంటే ఎదుటివారు ఎలాంటి వారైనా, వారి లోపాలను పట్టించుకోకుండా ప్రేమించగలగాలి.. ప్రేమించబడాలంటే కోపం, అసూయ, దురాశ మొదలైన లక్షణాలు లేకుండా ఉండాలి... దయ, సానుభూతి, ఔదార్యం, స్నేహం చూపించాలి.. మన ప్రవర్తనలో ఎటుచూసినా, స్వార్ధాన్ని త్యాగం చెయ్యడం తప్పనిసరి అవుతుంది.. ఈ లెక్కన ఎంతమందిని ప్రేమించగలం ?? ఎంతమంది ప్రేమను పొందగలం ?? ఎవరిమటుకు వారు తమ స్వార్ధాన్ని ఎవరికోసం ఎంతవరకు వదులుకోవచ్చునో అంతరాంతరాల్లో బేరీజు వేసుకొని అంతంత మాత్రంగా ప్రేమిస్తారు... 

అనాలోచితంగా ప్రేమించగలగడం కూడా ఒక కళ ... 

స్వస్తి ___/\___

Bobby.Nani

Tuesday, November 29, 2016

కళ్ళు అలసిపోతున్నాయి ..కళ్ళు అలసిపోతున్నాయి .. 
అంధకారం అంటిన ఈ నవ్యసమాజంలో 
మానవత్వమనే ఓ వెలుగు కొరకు వెతుకులాటలో ..

చెవులు వినికిడిని కోల్పోతున్నాయ్.. 
పగలు, రాత్రి తెలియక పైసాచిన దాడి చేస్తున్న నా 
ఆడపడుచుల ఆర్తనాదాలకు.. 

గొంతు మూగపోతోంది.. 
తప్పుడు పనులు చేసి తప్పించుకున్న 
ఈ ప్రజాస్వామ్య తొత్తులు ఇచ్చిన నోట్లకు..

చేతులకు అదృశ్యసంకెళ్ళు పడుతున్నాయ్.. 
అబద్దాన్ని అర్ధవంతంగా రాసే నేటి 
నిష్ప్రయోజన రచయితలకు ... 

జ్ఞానం నిరర్ధకమౌతోంది.. 
తుచ్ఛమైన యోచనతో, అపరిపక్వపు భావనలతో 
మసలుతున్న నేటి యువ మస్తిష్కాలకు .. 

ప్రేమ పైసాచికమౌతోంది .. 
ఉభయుల అహంకారపు జ్వాలల మధ్యన
ఆఖరి చితిని పేర్చే నవ వధూవరులకు .. 

పెళ్లి వ్యాపారమౌతోంది.. 
రెండు యంత్రాల మధ్యన సంసార సఖ్యత లేని 
కట్న, కానుకల ఖరీదైన లాంఛనములకు ... 

భగవంతుడు దోచుకుంటున్నాడు .. 
నకిలీ స్వాముల వికటాట్టహాసముల 
వికృతి విన్యాసాలకు...

అడుగులు తడబడుతున్నాయ్..
దిశ, నిర్దేశం తెలియని నేటి యువత 
మాలిన్యపు చీకటి మరకలకు.. 

అబద్దాలు అందలమెక్కిస్తున్నాయ్.. 
నాయకుల నోటిదూలతనానికి, చౌకబారుతనానికి 
బానిసలుగా మారి నీతి మరిచిన ప్రజలకు... 

వ్యక్తిత్వం అమ్ముడౌతోంది.. 
పదునైన ఓటుకు విలువకట్టే పచ్చనోట్ల 
రెప రెపల మైమరపు సొగసులకు.. 

ఆత్మ మరణిస్తోంది..
మళ్ళీ మానవత్వం చిగురించలేనందుకు ... 

Bobby Nani

Saturday, November 26, 2016

నీ కౌగిలికోసం....నీ కాటుకనంటిన నెమలిపురి నేత్రములు.. 
నీ చెక్కిలినంటిన పున్నమి వెలుగులు.. 
నీ దేహాన్నంటిన పసిడి సొగసులు .. 
నీ అధరములనంటిన గులాబి వర్ణములు.. 
అదేంటో ఇవన్నీ ఎప్పుడూ నిన్నే అంటుకొని ఉంటాయి మరి.. 
నేనెప్పుడు నిన్ను తాకుతానో.. 
కనీసం చూస్తానో లేదో కూడా తెలియట్లేదు.. 
కాని నువ్వు పక్కన వుంటే ఆకాశం వర్షిస్తుందో లేదో నాకు తెలియదు.. కాని..
నువ్వు పక్కన వుంటే హృదయం ఆనందంతో గంతులేస్తుంది అని మాత్రం చెప్పగలను.. 
ఒక్కోసారి అనిపిస్తుంది.. 
నిన్ను తాకుతున్న ఈ గాలి, 
నిను మోస్తున్న ఈ ధరణి, 
నిను చూస్తున్న ఈ లోకం యెంత అదృష్టమో కదా అని.. 
నే రాసే ప్రతీ భావనలో నీ రూపం..
నా ప్రతీ అక్షరంలో నీ ఆలోచన..
ఎప్పుడూ నూతనత్వం చిగురిస్తూనే వుంటుంది..
అబ్బా.. నీ చూపుని తట్టుకోవడం చాలా కష్టం సుమా.. అది 
మలయమారుతంలా నన్ను అమాంతం చుట్టేస్తూ ఇరకాటంలో పెట్టేస్తుంది.. 
పెదవిని పెగలనీయదు, దృష్టిని నిలువనీయదు, 
రాతను కదలనివ్వదు, హృదయాన్ని మెదలనివ్వదు.. 
ఉక్కిరిబిక్కిరి నీ ఊహల ప్రపంచంలో దారంతెగిన ఓ పతంగిలా 
నీ కౌగిలికోసం దిక్కులన్నీ వెతుకుతున్నాను... !!!

Bobby Nani

Friday, November 25, 2016

నోటుకు వేటు..నేను ఈ రాజకీయాలకు చాలా దూరం.. అవంటేనే నాకు అసహ్యం.. ఇప్పటివరకు ఏ ఒక్కరిని నేను సమర్ధించనూ లేదు, అలా అని విమర్శించనూ లేదు.. కాని నేటి రాజకీయం ఎందుకో నాకు వసంతకాలపు చిగురింత లా అగుపించింది.. అలా అని సమర్ధించట్లేదు జరిగిన, జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా నేను ఇలా రాయాల్సివచ్చింది.. ఇబ్బంది వుంది కాదనట్లేదు 10 మంది బాగుకోసం 5 మంది నలిగినా మరేం పర్వాలేదు.. పూర్తిగా ఈ నిర్ణయం పై మార్పు రాకపోయినా మొదటి అడుగు పడినదానికి ఆనందంగా వుంది.. పుట్టినప్పటి నుంచి వింటున్న మాట మన భారతదేశం అభివృద్ధి చెందుతోంది అని .. ఎప్పుడండి అభివృద్ధి చెందేది.. ఇలా ఒక మార్పును కూడా మనం స్వీకరించకుండా, స్వాగతించకుండా పాలకులను, పాలనను తప్పు పట్టే మనం... ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా హాస్యంగా వుంది.. అంటే మనకు ఇబ్బంది కలగకూడదు దేశం అభివృద్ధి అయిపోవాలి.. వహ్ స్వార్ధపూరిత మన మనోభావాల మధ్యన ఏ నాయకుడు వచ్చినా ఇంతే .. తప్పు వాళ్ళది కానేకాదు.. అన్నిటికీ వెంపర్లాడే అతి నీచమైన మనస్తత్వం కలిగిన మనది.. 

నోటుకు వేటు.. 
**********


నోటిమాటకు విలువతగ్గి ...
పచ్చనోటుకు రెక్కలొచ్చే.. 
తళ తళమను పచ్చనోటు ..నేడు 
పనికిరాని పిచ్చినోటయ్యే.. 
భద్రపరుచుకున్న నోట్లు బజారుపాలాయే.. 
ధగ ధగల నోట్లుతో దగాకోరుల పాట్లు.. 
దెప్పిపొడిచే వారుకొందరు.. 
దేవులాడే వారుకొందరు .. 
దిక్కులు ప్రక్కటిల్లేలా అరిచేవారు మరికొందరు.. 
అసమానుడు అనేవారు కొందరు.. 
అసాధారణం అనేవారు కొందరు.. 
చరిత్రకారుడనే వారు ఇంకొందరు ...
ఇంత జరిగినా నోటిమాటకు విలువలేదు.. 
సాటిమనిషికి ప్రయోజన లేదు .. 
ఈ రణరంగ రాజకీయపు ముళ్ళ పొదల మాటున.. ఓ 
మసి పీలిక వలె పేదవాడు చిక్కుకొని 
రెపరెపలాడు గాలివాటుకు చిరుగుతూ తన 
రక్తాశ్రువులు చిందిస్తూ ... 
మసిబారిన బ్రతుకులతో.. 
విరిగిన ఆశలతో ... 
నలిగిన హృదయముతో.. 
రేపటి మార్పుకై ..
ఓ మొనగాడి రాకకై ..
వేచివున్న పసిడి కళలు నేడు సాకారమయ్యే... 
పట్టమెక్కిన వాడు పనివంతుడాయే .. 
ప్రజల పాలకుడాయే .. 
ప్రగల్భాలుడు కాదు ప్రతిభావంతుడయ్యే.. 
ముండమోపి సమాజాన్ని ప్రక్షాళన గావించగ
వికసించిందొక కమలం.. తన తెగింపునే 
శంఖంగా మ్రోగించాడు..అమరేంద్రుడైన నరేంద్రుడు ... 

Bobby Nani

Thursday, November 24, 2016

నీ రూపం...


ప్రాతఃకాలమున పురివిప్పియాడు మయూరము సొగసు నీ రూపం... 
అణువణువూ నా అధరములు తాకే తన్మయత్వం నీ రూపం... 
నుదిటిన మెరిసిన అరుణవర్ణపు కాంతిసోయగం నీ రూపం...
చెక్కిలినంటిన మేలిమిబంగారు లావణ్యం నీ రూపం...
ఎదపై తలవాల్చే ఓ మాతృత్వం నీ రూపం... 
వసంతమే అసూయపడే నవ వసంతసమీరం నీ రూపం...
విహంగ పక్షుల కిల కిల రావాల సప్త, వర్ణ, స్వర, సరిగమల, హరివిల్లు నీ రూపం...
పాదాలకంటిన పారాణి చిందించే సరస సిగ్గులు నీ రూపం...
ప్రకృతిలోని అణువణువూ పరవశముతో పులకించే సమ్మోహనం నీ రూపం...
కాలి అందియల ఘల్లు ఘల్లు మనే మధుర శబ్దమే నీ రూపం...
పెదవులు పలికే మధురాక్షర ఖేలి తియ్యదనం నీ రూపం...
నిర్మలమైన మనస్సుతో, 
నడక అందం చిందుతూ, 
ఊయలలూగే నడుముతో,
చూపుల్లో అభిమానం తొణికిసలాడుతూ, 
నవ నాడులు నీ వశమై తపియింప చేసే చిత్రమైన రూపానివై కరిగిపో... 
నా కౌగిలిలో .. నీ అధర చుంబన సుగంధాల పన్నీటి ప్రవాహములో.. 

Bobby.Nani

Wednesday, November 23, 2016

మసిబారిన పసితనం ..బాలల దినోత్సవం గురించి ఎన్నో గొప్పగా ఉపన్యాసాలు ఇస్తాం.. ముఖపుస్తకంలో ఎక్కడ చూసినా వారిపై రాసేస్తాం పోస్ట్ లు పెట్టేస్తాం.. ఆరోజు అయిపోగానే మళ్ళి ఇక 365 వ రోజున యదాతధం.. దీనివల్ల అర్ధరూపాయి కూడా లాభం లేదని అందరికీ తెలిసిన విషయమే.. అయినా మనం ఇంతే.. మనం మారం ... నేను కూడా.. ఆలోచన గొప్పదే కాని ఆచరణ లేని ఆలోచన నిష్ప్రయోజనం ... మనం ఆలోచనదాకే వచ్చి ఆగిపోతున్నాం.. ఆచరణ చెయ్యట్లేదు.. ఇలాంటి పిల్లల గురించి కొన్ని సేవా సంస్థలు ముందుకు వచ్చాయి .. అందుకు చాలా సంతోషంగా వుంది.. కాని వారికి అందవలసిన అవసరాలు సంపూర్ణంగా అందటం లేదు.. తొంభై శాతం వస్తే పిల్లలకు 40 శాతం మాత్రమే ఖర్చు పెడుతున్నారు.. ఇది చాలా శోచనీయం .. బడికెల్లాల్సిన పిల్లలు బడిబయట బానిసలుగా వున్నారు... పదిమంది కలిసి ఒక్కరి చొప్పున వారి బాగోగులు చూసినా వారి జీవితం మరోలా వుంటుంది.. అలాంటి ఓ మసిబారిన పసి హృదయాల గురించి ఆవేదనా భరిత అక్షర మాల.. 


మసిబారిన పసితనం .. 
****************


నీ అరచేతులు నా వేళ్ళంత పొడవైనా లేవు..
నీ కాళ్ళు నా పాదలంతైనా లేవు... 
అయినా మేము నీ చేత ఎంగిలి కప్పులు తీయిస్తాం.. 
ఎంగిలాకుల భోజనం నీ కడుపుకు పెడతాం.. 
నువ్వు బాలుడవన్న దృష్టి మాకు మా పిల్లల్ని చూసైనా తట్టదాయే.. 
తట్టినా ఒప్పుకునేందుకు తలవంపులు మాకు.. 
అమ్మదగ్గర పాలు తాగినన్నాళ్లే నువ్వు చిన్నారివేమో..
పసివాడి తనమే నీ పసితనమేమో .. 
నీ జీవితం హోటలు బండపై తుండు గుడ్డగానో .. 
విదిలించిన విస్తరి మెతుకులగానో .. 
డబ్బుకు పుట్టిన పిల్లల సంరక్షణాయంత్రం గానో స్థిరపడుతుంది.. 
ముక్కుపచ్చలారని నీ కాలం.. 
బస్సుల్ని, రైళ్ళను శుభ్రం చేసి చేయి చాస్తూనో .. 
మెకానిక్ షెడ్లల్లో రోజు రోజుకీ మసిబారి పోతూనో..
పాలిష్ బూట్ల క్రింద పడ్తూ, లేస్తూనో.. 
దశాబ్దాలు పూర్తి చేసుకుంటుంది.. 
మా పిల్లల కోసమే మేము చాక్లెట్లు, బిస్కెట్లు, 
ఐస్ క్రీముల అందమైన బాల్యాన్ని తయారు చేస్తాం.. 
మేమంతా చదువుకొని 
మేమే బాల సంక్షేమ సంఘాలుగా మారి.. 
ఏడాదికోసారి ఇవాల్టి నీ భవిష్యత్ కోసమే 
మాట్లాడుకుంటున్నామని ఉపన్యాసాలు ఇస్తుంటాం..
మమ్ములను మేమే సమర్ధించుకుంటూ వుంటాం.. 
మొక్కల్ని పెంచి భూమి పచ్చగా వుండాలని కోరుకుంటాం.. 
ఇప్పుడిప్పుడే నాటుకుంటున్న మీరు 
ఎండారో, వానారో, 
బతికేరో, చచ్చేరో 
అసలు మీరు ఏ ప్రపంచం అడుగున 
కష్టం రెక్కల్లో జీవితాన్ని విర్చుకుంటున్నారో ఆస్సలు ఆలోచించం.. 
మీ పై సినిమాలు కూడా తీసేస్తాం.. 
మా కళ్ళెదురుగానే లోకం చాకిరీ అంతా చేయించి.. 
ఇవేళ్టి బాలలే భావి పౌరులమంటాం... 
ఎవడి భవిష్యత్తు వాడే చూస్కోవాలంటాం .. 
చదువుకంటే, ప్రగతి కంటే, ఆకలి ప్రధానమైన చోట, 
మేమే అమ్మానాన్నల మయ్యీ 
నీ పొట్టను నీ చేతికే ఇచ్చేస్తాం.. 
అందుకే నువ్వు పుత్తిల్లలో నుంచి పాలు తాగడం మానగానే ..
శ్రామికుడవయ్యావు .. 
ఓ బాలుడా.. !! 
నీకు “బాల్యం” అంటూ ఒకటుందని 
తిరిగి చూస్కున్నప్పుడు కష్టాలు, కన్నీళ్ళు తప్ప మరేమీ నీకు కనపడవు.. 
అవే నీ జ్ఞాపకాలు, అవే నీ బాంధవ్యాలు.. 
మెహర్భానులు పలుకు మా రాజులం మేము ... ఎప్పటికీ మారము, మారబోము.. !!!

Bobby Nani

Tuesday, November 22, 2016

ఆమె కౌగిలి ..


యెంత వాడైనా కాంత దాసుడే అని అందరూ అంటుంటారు.. “కాంత”కు “దాసీ” అనేది పక్కన పెడితే ఆ కాంతే అన్నీ తనకు అని భావించి అందరూ వుండి ఎవరూ లేని అనాధ అయిన ఓ అబ్బాయిని ఉద్దేశించి రాసాను.. ప్రేమించి బయటకు వచ్చి ఎన్నో కష్ట, నష్టాలను చిరునవ్వుతో చిందిస్తూ అధిగమిస్తూ .. సంధ్యాస్తమ సమయానికి ఆ కోమలాంగి ఎదపై సేదతీరే ఓ పరిణాయకుని మధుర భావనను రాసాను.. ప్రతీ భర్త ఇంటికి వెళ్ళాక తన అర్ధాంగిపై వాలి తనతో ఎన్నో పంచుకోవాలని తపనపడతాడు.. కాని ఎన్నో అడ్డంకులు .. వాటిని అన్నింటిని పక్కన పెట్టి అలా కౌగిలిని ఆనందించే వారు నేటి కాలంలో అరుదు.. అలాంటి అరుదైన పరిణాయకులకు నా ఈ “కౌగిలి” కవిత అందజేస్తూ ... 

ఆమె కౌగిలి .. 
*********

ప్రాపంచిక బాధల్ని మైమరిపించే మహాదానందముంది ఆమె కౌగిలిలో.. 
మలినబుద్దులన్నీ అనిగిపోయి నిశ్చింత మాత్రమే అనుభూతి పర్చుకుంటుంది ఆమె కౌగిలిలో.. 
ఎన్నోసార్లు నా పగిలిన దుఃఖాలన్నీ నా మెడ వంపునే ప్రవహించాయి.. 
లే లేత కుసుమాలు గుచ్చుకునే ఆ ఎద మంచంపైనే నా చంపల వ్యధలన్నీ తేరుకున్నది.. 
ఏమీలేని ప్రపంచంలో హఠాత్తుగా ఒక రోదన లేని ప్రత్యక్ష ప్రదేశం లభ్యమైనట్లు నా కనిపించింది .. ఆమె కౌగిలిలో... 
ఇంకెక్కడా లేని నిర్భయపు స్థలం ఆ కోమలమైన చేతుల్లోనే నిక్షిప్తమైవుంది... 
మనసంటూ వున్నా.. మరీ ఇంత స్వచ్చంగా ప్రేమిస్తారా..!! నన్నెవరన్నా .. మీ 
నుంచి జన్మించినా .. తిరిగి నన్ను పిల్లాడిని చేస్తారా ఎవరైనా ... ఒక్క ఆమె తప్ప.. 
నా జీవన పరితాపాన్ని తొలగించి,
నా స్వాప్నిక కాలాన్ని పరిశుభ్రం చేసి,
నా దుఃఖిత భయవిహ్వాల సమయాన్ని చేత్తో తీసిపారేసి, 
నా కళ్ళని ఆనందాలతో మెరిపిస్తాదా ... !! ఒక్క ఆమె తప్ప.. 
ఆమె కౌగిట్లో విసుగులేని మాతృత్వం విస్త్రుతమై వుంటుంది.. 
నన్నెవరన్నా ఇలా హత్తుకున్నారా ఎప్పుడైనా ?? 
వ్యధా, వేదనలు చెదిరిపోయేలా... నా తల నిమిరారా ఎవరైనా ?? 
అమ్మా, నాన్నలు ఒక్కళ్లే అయి ... నా కళ్ళు తుడిచారా ??
అయిదేళ్ళ బాల్యాన్ని ఆమె అమ్మకు ఆపాదించి... 
విరిగిపోయిన తల్లి ఆవేదనల్ని ఎదిగిన ప్రేమమూర్తిలా 
ఆమె లే లేత చుంబనాలలో బాధల్ని ప్రక్షాలించింది.. 
నా మనసంతా తీసి ఆమె మెడలో వేళ్ళాడదీసినట్లు 
ఆమె చేతుల్లోకి నన్ను లాక్కొని, కౌగిలించుకొని 
నా తలను తనకానించుకొని 
తిరిగి తిరిగి నన్ను కస్టాల్నుంచి పునర్జీవింపజేసింది ఆమె కౌగిలి.. 
అవును మరి ఆమె కౌగిట్లో,
కోటి జీవితాలకు సరిపడా నిశ్చింత శాంతి సోపాలున్నాయి.. !!!!

Bobby NaniSaturday, November 19, 2016

ఏది అసభ్యత?? ఏది అశ్లీలం ??ఏది అసభ్యత?? ఏది అశ్లీలం ?? 
**********************

శృంగార రచనలు రాసే రచయితలపై ఈ సమాజం వక్రదృష్టిని కనపరుస్తోంది... భాద్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని, యువతలో నైతిక పతనానికి కారణభూతులవుతున్నారని, పాశ్చాత్య పోకడలను అనుసరిస్తున్నారని, అనవసరంగా స్త్రీల అంగాంగవర్ణనలు, కామకేళీ విలాసాలు తమ రచనల్లో గుమ్మరిస్తున్నారని వారి ఆవేదన.. 

అశ్లీల సాహిత్యాన్ని నిషేదించాలని, శృంగారపరమైన వాల్ పోస్టర్లు చించేయ్యాలని మరికొందరు పోరాడుతున్నారు.. మరోవర్గం వారు కేవలం శృంగార సినిమాలే మన పవిత్రతను సర్వనాశనం చేస్తున్నాయని ఆక్షేపిస్తున్నారు .. అసలు కంబైండ్ ఎడ్యుకేషన్ మన కొంప ముంచుతోందని స్త్రీలకు వేరే కళాశాలలు వుండాలి అనేవారు లేక పోలేదు.. 

పురాణాలలోని శృంగార సాహిత్యం సున్నితంగా, మధురంగా, ఉండేదని, నేటి సాహిత్యం ఉద్రేకాన్ని రెచ్చకొడుతుందని అని గింజేసుకునేవారు సైతం అన్ని రకాల శృంగార పుస్తకాలు చదువుతూనే వున్నారు రహస్యంగా.. ఇది అక్షర సత్యం.. నిజాలు ఇలానే ఉంటాయ్ మరి.. “A” అనే బూతు సినిమాలు చూస్తూనే వున్నారు.. మనం వాటికి దూరంగా వుంటే ఆ రచనలు, ఆ సినిమాలు అంతగా ఎదిగేవి కానేకావు... కనుక కారణం మనమే అని చెప్పుకోకతప్పదు... 

అసలు ఎలాంటి శృంగారం కావలి ? 
ఏది బహిష్కరించాలి ?
ఎంతవరకు నిషేదించాలి ?
మరెంతవరకు శృంగార పరిధి ఆమోదయోగ్యం అనే విషయాల్లో మళ్ళి తేడాలు వున్నాయి.. ఇలా అతి ముఖ్యమైనది అనుకున్న శృంగారమును అతి రహస్యంగా వుంచాలనుకోవడంలో అర్ధం ఏమిటి ??
శరీరంలో ఇతర అవయవాల గురించి తెలుసుకోవాలన్నప్పుడు జీవిత ముఖ్య భాగమైన శృంగార విజ్ఞానానికి ఇంత రభస ఎందుకు ?? 
ఇన్ని అడ్డంకులు ఎందుకు ?? 
అటు శృంగారమనుకున్నా, ఇటు శాస్త్రజ్ఞానము అనుకున్నా అనుభవించే విషయాలకు మర్మమెందుకు ?? 
అసలు ఏ విషయాన్ని అయినా గోప్యంగా వుంచామంటే అందులో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలం నేటి వారికి ఎక్కువ అని మర్చిపోతే ఎలా ??

ఈనాటి మిడి మిడి జ్ఞానసంపన్నులు శృంగార విజ్ఞానాన్ని విమర్శిస్తూ వున్నారు... అసహ్యించుకుంటూ వున్నారు.. సిగ్గుపడుతూ వున్నారు.... కాని మీకు తెలియని విషయం ఏంటంటే మన పూర్వికులు, అంతగా విద్యాజ్ఞానం లేని వారు సైతం శృంగారాన్ని నీచంగా చూడలేదు సరికదా దానికి తగిన ప్రాధాన్యత నిచ్చారు.. మన ఋషులు ఆనందోపాసకులు, జీవితాన్ని సుఖప్రదము, ఫలప్రదమూ చేసుకోవడానికి తపనపడ్డారు.. శృంగారాన్ని శాస్త్ర విషయంగా గ్రహించి అధ్యయనం చేసారు.. భాషాజ్ఞానం పెరగని రోజుల్లో వారు దాంపత్య జీవిత రహస్యాలను గుహలలోను, కొండలపైన శిల్పాలుగా చెక్కారు.. ముఖ్యంగా దేవాలయాలపై రక రకాల భంగిమల్లో నిలువెత్తున శిల్ప ప్రక్రియ సాగించారు.. అలా లైంగిక ప్రబోధం చేశారు .. ఆనాటి వారి శిల్పకళ ఈనాటి కొనారక్, ఖజరహో, రామప్ప దేవాలయాలు... వాటిపై రక రకాల బంధాలలో దర్శనమిస్తుంటాయి .. వేల సంఖ్యలో దేశ దేశాల వారు వచ్చి దర్శించి చిత్రాలు తీసుకుంటూ వున్నారు.. ఈ బూతు బొమ్మలు గల దేవాలయాలను నాశనం చేయాలనీ మనం ఉద్యమాలు ఎందుకు నడపటం లేదు ?? వాత్సాయనుని కామ సూత్రాలు నిషేదించక పోగా తెలుగు అనువాదం ఎందుకు జరిగింది ?? ఇలాంటివి ఎన్నో నా ప్రశ్నలు వున్నాయి... 

ఇకపోతే మన కావ్యాలు, ప్రబంధాలు చదువుతుంటే దాన్ని శృంగారమనాలో, అశ్లీలమనాలో, యేమని వర్ణించాలి... ఎలా చెప్పాలి ?? అష్టవిధ శృంగార నాయికలు, చతుర్విధ నాయకులూ దర్శనమిస్తారు ముందుగా, కాలిగోరునుంచి కబరీబంధం దాకా కచ కుచాది వర్ణనలతో, శృంగార నాయికను శల్యపరీక్ష చేసి వర్ణించారు.. ఎదసొత్తులను ఘటాలతోను, ఉదర వృత్తాన్ని కాముని హోమాగ్ని గుండంతోను, షీనహస్తిని, శాతోదరి లాంటి పెర్లుతోను, మరులుగొమట, వలపు గొనుట, మోహించుట, కామించుట లాంటి పద ప్రయోగాలు బోలెడన్ని మన కావ్యాలనిండా వున్నాయి.. అంతే కాదండోయ్ చంద్రబింబ, గజగమన, హంసయానలాంటి వర్ణాలతో ఆనాటి వ్యవస్థలో స్త్రీ ని విలాసవస్తువుగా పరిగణించారు.. 

నాటి శృంగారమంతా సంస్కృత భాషలో వర్ణించారు కనుక ఆ పదాల మాధుర్యానికి ముగ్దులయ్యేవారు.. భాష తెలిస్తే కూడా ఆ తన్మయత్వంపోయి చిందులు త్రోక్కుతారనేది అనుమానాస్పదమే.. గీత గోవింద కావ్యంలో జయదేవుని అష్టపదులన్ని పచ్చి శృంగారాన్ని వర్ణిస్తాయి.. నానారకాల రాతిక్రీడలను దేవునిపేరుతో చిత్రిస్తే వాటిని కంఠస్థం ఎందుకు చేస్తున్నాం ?? పుణ్యమని చేస్తున్నామా ? జీవితానుభవమని ఆహ్లాదిస్తున్నామా ?? ఆలోచించండి ?? 

సీతా వియోగ విరహాన్ని రతి వుపరతులతో (తమ్ముడైన లక్ష్మణునితో) రాముడు వర్ణిస్తుంటే విని ఆనందిస్తున్నామే కాని, ఆ వాల్మీకిని దూషిస్తున్నామా ?? ఆ రామాయణ గ్రంధాన్ని చింపేస్తూ వున్నామా ?? లేదు.. ఎందుకని అది మన అనుభవైక వేధ్యాలు..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో... 

ఆహర నిద్రా మైధునాలు మనవ జీవిత ముఖ్య ధర్మాలు.. కేవలం సినిమాలవల్ల, సాహిత్యం వల్ల, మానవుడు శృంగారానికి ప్రేరేపితుడు కాడు .. అది అతనికి ప్రకృతి నేర్పిన విద్య,, పుట్టుకతో వచ్చిన దేహధర్మం.. జనసత్వాలుడిగినా కామవాంఛ నశించదు .. అది సహజమే కాని యాదృచ్చికం కాదు .. యెవ్వనదశను, అవరోదిస్తూ తృప్తిపడతాడు వృద్దుడు సైతం .. ఆదిమ మానవుడు శృంగారాన్ని ఇచ్చావిసృంఘలత్వంగా, విచ్చలవిడిగా అనుభవించేవాడు.. నాగరిక సమాజంలో శృంగారానికి ఎల్లలు, హద్దులు, పరిమితులు నిర్ధేశించడానికి వివాహ వ్యవస్థను ఏర్పరిచారు... తద్వారా జంతువును దాటి, ఆనందోపాసకుడయ్యాడు మానవుడు... 

శృంగారం తప్పుకాదు అని నేను అనట్లేదు.. విచ్చలవిడి శృంగారం తప్పు అంటున్నాను.. దాన్ని అందరికి విజ్ఞానపరమైన వివరణలా చూపాలని కోరుతున్నాను... శాస్త్రీయపరమైన విశ్లేషణను తెలియజేస్తూ ఈతరానికి ఒక క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నాను.. శృంగారాన్ని దాచేకొద్దీ వారిలో ఆలోచన తారాస్థాయికి వెళ్తుంది.. తెలుసుకోవాలనే తపన అధికంగా వుంటుంది.. తద్వారా పెడద్రోవ పడుతున్నారు నేటి యువత ... 

శృంగారం గురించి ఆలోచించడం తప్పు.. చర్చించడం తప్పు... వ్రాయడం తప్పు .. వ్రాసే విధానం తప్పు ఇలాంటివి మనం అంటుంటే చాలా హాస్యాస్పదంగా వుంది.. శృంగారం గురించి తెలియాలి.. దాని పర్యవసానం గురించి తెలియాలి, వాటివల్ల లాభ, నష్టాలు తెలియాలి, తప్పొప్పులు తెలియాలి, తల్లికి, చెల్లికి వున్న వావి, వరుస తెలియాలి నేటి యువతకు అప్పుడే పోత్తిల్లలోని పసికందు అత్యాచారంకి గురైందనే వార్తలు తగ్గుముఖం పడతాయి.. కమెంద్రుల కబందహస్తాల నుంచి కొందరినైనా రక్షించుకోగలుగుతాం.. ఇలాంటి మార్పు రావాలని కోరుతూ.. సెలవు తీసుకుంటూ వున్నాను... 

స్వస్తి __/\__ 

Written by : Bobby Nani

Thursday, November 17, 2016

హృదయం రాసుకున్న లేఖ ....ప్రేమికుడు చాలా గొప్పవాడు.. ఎందుకంటె తను ప్రేమలో ఉన్నప్పుడు ఎవరిని చూచినా తన ప్రియురాలే గుర్తుకు వస్తుంది తనకు.... ప్రతీ రూపంలో తన ప్రేయసి రూపాన్నే ప్రతిబింబించుకుంటాడు... నెమలి నర్తించినా, తుమ్మెద సవ్వడి చేసినా, కుసుమం వికసించినా, జాజులు పరిమళించినా, మేఘాలు ఘర్జించినా, నింగి వర్షించినా, ప్రకృతి పులకరించినా, ఆ ప్రేమికుడు పరవశంతో ఓ తియ్యనైన మధుర ఆనందాన్ని తన పెదవులతో స్పృశించినట్లు తను భావిస్తాడు.. అందుకే ప్రేమలో ఉన్నప్పుడు అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి.. అందలమెక్కాల్సిన వాడు అధఃపాతాళానికి పోగలడు .. కావున ప్రేమను ఆస్వాదించండి, కాని ఆ ప్రేమే మీ జీవితానికి ఓ విషాదం కాకూడదు అని కోరుకుంటూ ఓ ప్రేమికుడు తన ప్రేయసిని యెంత అమితంగా ప్రేమిస్తున్నాడో మీరే చుడండి ఈ కవితలో ... 


హృదయం రాసుకున్న లేఖ 
*******************


తనో ఉదయించిన రవి కిరణం ..
తనో ఉద్భవించిన నవ కుసుమం.. 
తనో అభినవ అందార విందం.. 
తనో తుంటరి తలోదరి తన్మయత్వం .. తనే 
నా మదిని పరిత్యజించిన మీననేత్రి.. !!!

తన నర్తనలో నవవసంతమే... 
తన హసితములో నిత్య నూతనమే ... 
తన లలితములో యెవ్వన లావణ్యమే.. !!!

తన నేత్రములు చమర్చితే ఆకాశమే వర్షించును... 
తనను తాకిన వాయువు సుగంధ పరిమళములు.. 
తనని అంటిన అందం ప్రకాశవంతం.. !!

తనని చూడని నేత్రములు అంధకారములు.. 
తనని తలవని హృది నిర్జీవములు.. 
తనని తాకని అధరములు వ్యర్ధములు... !!

చకోరి వంటి తన చెంగు చెంగుమనే 
అతి మెత్తని, సుతి మెత్తని 
ప్రత్తి దూది పింజెల వంటి పాదాల స్పర్శకు 
పుడమి తల్లి మధుర గిలిగింతలు పొందును... 

పల్లవిలేని తన వలపు పాటలు..
నియమంలేని తన పద్య పాదాలు...
అలంకారాలే లేని తన అయోమయ భావాలు...
నన్ను ఊపిరాడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి... 
సమాధానం లేని వేల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి,
సందేహాల తన కౌగిలి బోనులో భందీఖానాలా నిలిచున్నా... ఇలా.. 

Bobby Nani

Monday, November 14, 2016

మన తోలి జ్ఞాపకాలు....


మన తోలి జ్ఞాపకాలు
***************

వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలుపెట్టాలి అని అంటారు తావోయిజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన చైనా తత్వవేత్త లావొట్టు గారు. 

నూరేళ్ళ జీవనయానం కూడా అమ్మ గర్భంలోంచి బయటపడ్డ ఆ మొదటి క్షణం నుంచే ప్రారంభమౌతుంది.... 
తప్పుల్లేని నడతను సంతరించుకోవడానికి తప్పటడుగుతో ప్రారంభిస్తాం .... 
వచ్చీ రాని మాటతో అమ్మా, నాన్నలకు ఆనందాన్ని పంచుతూ ఈ ప్రపంచంలో మన కమ్యూనికేషన్ మొదలు పెడతాం .... 
బెరుగ్గా కూర్చొని విన్న తొలిపాటం, 
మాస్టారు వేసిన మొదటిదెబ్బ, 
భయం భయం గా హాజరైన మొదటి ఇంటర్వ్యూ, 
ప్రపంచాన్ని జయించినంతటి గర్వాన్నిచ్చే అపాయింట్మెంట్ లెటర్, 
విద్యార్ధి జీవితానికి సంబంధించిన కీలక దశలు.... 
దాచిన నెమలీకలు, 
చూసిన సినిమా, 
ఆడిన స్టేజీ నాటకం, 
కాలేజి మాగజైన్లో అచ్చుఅయిన తోలి కవిత, 
మనలోని కళా హృదయాన్ని తట్టి లేపిన ఆనవాళ్ళు.... 
చేసిన కాగితం పడవ, 
గీసిన గులాబి పువ్వు, 
కట్టిన బొమ్మరిల్లు, 
ఎగరువేసిన గాలిపటం, 
మన సృజనాత్మక మేధస్సుకు సూటి నిదర్శనాలు, 
రాసిన మొదటి ఉత్తరం, 
చేసిన మొదటి రైలు ప్రయాణం, 
అపురూపంగా దిగిన మొదటి ఫోటో, 
ఆతురతతో ఎత్తిన మొదటి ఫోన్ కాల్, 
ప్రపంచంలోని సదుపాయాలన్నీ మనకోసమే ఉన్నట్టుగా వినియోగించుకోవడానికి పడిన తోలి అడుగులు.... 
ఇక కొంచం పెద్ద అయ్యాక తొలిప్రేమ, 
తొలిముద్దు, 
చిన్న చిన్న సరసాలు, 
ఈ ప్రపంచంలో మనుషులు అంతరించిపోకుండా మరోజీవి అంకురార్పనకు మనం చేసే అపురూప మజిలీలు...... ఇవి ఎప్పటికీ చెరగని మన జ్ఞాపకాలు కదా... 
ఈ జ్ఞాపకాలు కచ్చితంగా ప్రతీ ఒక్కరు ఆనందించి వచ్చివుంటారు... అన్నీ కాకపోయినా కొన్ని అయినా... వాటిని మళ్ళి మీకు గుర్తు చేసి మీ ఆనందాన్ని తట్టి లేపాలనే నా ఈ చిన్న ప్రయత్నం.... :) 

చిన్నారుల దినోత్సవ శుభాకాంక్షలు .. చిన్నారులుగా వున్న మీరు ఎదిగి చిరంజీవులుగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వున్నాను.. 

Bobby.Nani

Saturday, November 12, 2016

“సంభాషణా చాతుర్యం”“సంభాషణా చాతుర్యం”
*****************

ఈ పోస్ట్ నేను గడచిన ఎన్నో రోజులుగా రాయాలనుకుంటున్న కాని నేటికి ఆ సమయం సిద్దించింది.. మనసులో మెదిలిన భావాల్ని చక్కగా కాగితం మీద కాని లేదా ఎదుటి వారికి తెలపడం కాని తెలిపే క్రియను “సంభాషణా చాతుర్యం” అంటారు.. ఇది అందరికీ ఉండదు.. కాని ఇది సాధ్యమే.. దానికి కావాల్సింది కొంచం సాధన.. చాలామంది తమ భావాలను పైకి చెప్పడానికి చాలా ప్రయత్నిస్తారు కాని నోట మాట రాదు.. పెదవులు కదలవు .. చాలా సతమతమవుతారు ... అలాంటి వారిని ఉద్దేశించి వారిని ముందుకు నడిపే చిరు ప్రయత్నమే ఇది... 

చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా వివరించగలిగే శక్తితోనే అనేకమంది విజయాన్ని అందుకున్నారు.. విషయ విజ్ఞానపు గనులుగా వర్ణింపదగిన వ్యక్తులు కొందరు వుంటారు.. కాని తాము చెప్పదలుచుకున్నవి వివరించే శక్తి లేక పోవడం వల్ల వారు సమర్ధవంతంగా ఉపన్యసించలేరు, రాయలేరు, లేదా వుత్తేజపరచలేరు .. చెప్పినవి కొద్ది మాటలే అయినా మీరు ఆత్మవిస్వాసంతో మాట్లాడినప్పుడు లేదా రాసినప్పుడు విన్నవారికి, చూసినవారికి అందరికీ నచ్చుతుంది.. అలా సమర్ధమైన సంభాషణతో మీరు ఇతరులను ప్రభావితం చేయగలిగినప్పుడు అది మీలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది... చాలామంది మాట్లాడుతారు, వారిలో కొద్దిమందే తమ ఆలోచనల్ని అందరికీ చేరువయ్యేలా చెప్పగలుగుతారు .. వారిలో మరికొద్ది మంది మాత్రమే తమ ఆలోచనల్ని ఇతరులపై ప్రభావం చూపేలా వ్యక్తీకరించగలుగుతారు .. వాదించి, ఇతరులను ఓడించి తద్వారా విశ్వాసాన్ని పొందవచ్చునేమో గానీ అది నిజమైన విజయాన్ని మనకు ఎప్పటికీ సాధించి పెట్టలేదు.. ప్రేమతో, ఆప్యాయతతో, మర్యాదగా, ఆహ్లాదాన్ని కలిగించే భాషను ఉపయోగించినప్పుడు అది మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాకుండా విజయాన్ని కూడా అందిస్తుంది.. అటువంటి వారు గొప్ప ఉత్తీర్ణత సాధించిన పండితులు కాకపోవచ్చు .... అయినప్పటికీ వాళ్ళు అనేక మంది హృదయాలలో స్థానాన్ని సాధించగలుగుతారు.. వారి మాటల్లోని మయాశక్తి శ్రోతల్ని సమ్మోహితులను చేస్తుంది.. 

శ్రీరాముడు తన భూభాగంలోకి ఎందుకు వచ్చాడో కనిపెట్టమని సుగ్రీవుడు మహావీరుడైన హనుమంతుణ్ణి గూఢచారిగా పంపాడు.. మొట్టమొదటి సంభాషణలోనే తీయగా, ఊరటకలిగేలా, మర్యాదగా మాట్లాడి హనుమంతుడు శ్రీ రాముడి మనస్సు దోచుకోగాలిగాడు.. సంభాషించడం లో హనుమంతుడి నైపుణ్యాన్ని శ్రీరాముడు వేనోళ్ళ కొనియాడాడు... చాలామంది సంభాషించడం చేత కాక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి, భయంతో, నిస్పృహకు లోనౌతారు... 

మరో ఉదాహరణ : స్వతంత్ర భారతదేశపు మొట్ట మొదటి గృహమంత్రి అయిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ కు ఒక భగీరథ కార్యం ఎదురుగా వుంది.. ఆ కాలంలో భారతదేశంలో 554 సంస్థానాలు వున్నాయి. వాటిని రాజులు, నవాబులు పరిపాలిస్తున్నారు.. “విభజించి పాలించు” అన్నది బ్రిటీష్ వారి రాజనీతి.. పటేల్ గారు దానికి వ్యతిరేకంగా దేశాన్ని సంఘటితం చెయ్యాలని నిశ్చయించుకున్నారు .. 554 మంది పాలకుల్ని ఒప్పించి లోబరుచుకోవడం మాములు పని కాదు కదా... !! ఈ మహత్తరమైన కారణం కోసం వారిని ఒప్పించగల శక్తి తనకు వుందని ఆయనలో ఆత్మవిశ్వాసం మెండుగా వుంది.. చక్కగా మాట్లాడి ఒప్పించగల నేర్పు వల్లనే ఆయన ఆ నాడు అంతటి మహత్కార్యాన్ని విజయవంతంగా పూర్తి చెయ్యగలిగారు.. ఒకటి రెండు సంస్థానాలు మినహాయించి ఆయన భావాలను అందరూ అంగీకరించి భారతదేశాన్ని ఒక మహత్తర సంఘటిత శక్తిగా చేసేందుకు తమ సంస్థానాలపై అధికారాన్ని వదిలేసారు.. 

అంతటి శక్తి వుంది మనం మాట్లాడే, రాసే భావాలపై.. మొదట మీ పై మీకు నమ్మకం, ఆత్మవిశ్వాసం రావాలి.. అది రావాలంటే మీరు తప్పో, ఒప్పో చెప్పాలనుకున్నది, రాయాలనుకున్నది రాసేయ్యడమే.. అలా సాధన జరిగాక మీలోని అద్బుతాన్ని మీరే చూస్తారు.. మహా కవులు ఇలా నిరంతర సాధన ద్వారానే సిద్దులైనారు.. కొన్ని వేల కావ్యాలను మనకు అందించగలిగారు.. ఇది వారసత్వంగా వచ్చేది కానే కాదు.. మన భావాల నుంచి నూతన ఆలోచనల నుంచి ఓ కొత్త ఆవిష్కరణ జరిగే పరిణామక్రమం.. మీ ఆలోచనలను లోపల ఎందుకు పెట్టుకుంటారు.. తీయండి.. బయటకు తీసి మీరేంటో చూపించండి.. ప్రతీ ఒక్కరు అద్బుతమే.. ఏమో ఈ శతాబ్దాన్ని ఉర్రూతలూగించబోయే కవి మీరే ఏమో ఓ సారి ఆలోచించండి.. 

స్వస్తి...

Bobby. Nani

Thursday, November 10, 2016

శశిరేఖఘాడమైన ప్రేమ కలిగిన ఉభయ ప్రేమికులను ఉద్దేశించి ముఖ్యంగా ఇది రాసాను.. స్త్రీ, పురుషుల సాంగత్య జీవన విధానం ప్రకృతితో మిళితమై ఉంటుందని చెప్పడానికే ఇక్కడ ప్రకృతిని కూడా వాడుకోవడం జరిగింది.. రెండు హృదయాల పవిత్ర ప్రేమ “ఓం కార” శబ్ధమంత పవిత్రతను కలిగి ఉంటుందని నేను నమ్ముతాను.. అతి స్వల్ప మంది మాత్రమే ఇలాంటి ప్రేమను పొందుతున్నారు.. అలాంటి వారి పవిత్ర ప్రేమను గౌరవిస్తూ వారి గౌరవార్ధం కోసం ఈ శశిరేఖను రాసాను.. నా ఈ శశిరేఖ మీకు నచ్చుతుందని ఆశిస్తూ .. 

శశిరేఖ
*******


రావేలవే ... ఓ మధురసఖీ ఒకపరి ఇల రావేలవే..!!
ఒకసారిటువచ్చి బిగుతైన కౌగిలినందించి నీ..
ప్రేమను నా యెదపై శాసనముగా లిఖించవే ... 
పూ .. పొదరిల్ల మాటున సొగసైన నీ 
తీపి పెదవికై పిల్లగాలితో చెలగాట మాడుతుంటిని .. 
రేఖవై, శశిరేఖవై.. రేయిలో నెలవంకవై నా ముందు 
మెదిలే చిరు మందార దరహాసానివై, చంద్రవదనవై ... 
ప్రాతఃకాలసమయమున పురివిప్పిన మయూరము లా 
వయ్యారాల అలకనంద జలపాయిలా .. నడయాడు నీ 
పారాణినంటిన పాదపద్మములపై జీరాడు ఆ కుచ్చిల్లు సొగసులుతో.. 
ఆమని కోయిలలు వేయిమార్లు ఒక్కసారి కూయంగ నీ 
సిరిగజ్జే మ్రోయంగా... అందాల హరివిల్లు అంబరమునందు విరియంగ.. 
సిరిమల్లె నవ్వంగ , పరువములు సెలగంగ .. 
మకరధ్వజుఁడు నీ పరువపు మకరందమును సేవింపంగ .. 
పులకరింతలు గలుగ పురివిప్పి యాడినవి నీ 
మధుర యవ్వన కన్నె ప్రాయములు .. 

Bobby Nani

Saturday, November 5, 2016

సమాజంలో అందరి పరిస్థితి మారుతుంది.. మెరుగుపడుతుంది ఒక్కరిది తప్ప..సమాజంలో అందరి పరిస్థితి మారుతుంది.. మెరుగుపడుతుంది ఒక్కరిది తప్ప.. 

ఈ మధ్యకాలంలో ఒక ఆర్టికల్ చదివాను. అందులో ఇలా రాసివుంది.. ఇద్దరు అన్నదమ్ములు అంట సీతన్న, వెంకన్న ఆస్తి అంతా ఇద్దరూ చెరిసగం చేసుకున్నారంట .. వారికి ఒక విధవ ఆడపడుచు వుంది అంతే కాదు వారు పంచుకున్న ఆస్తులు సమానంగా పోను ఒక ఎకరా పొలం మిగిలింది.. పొలం, విధవ ఆడపడుచు ఈ రెండిటిని కూడా ఇద్దరూ తీసుకోవాలి అనే నిర్ణయాన్ని నమోదు చేసి ఉంటాడు వారి తండ్రి.. పొలం కావాలని కొట్టు కుంటారేమో అని అందరూ అనుకున్నారు..కాని ఆశ్చర్యంగా వారు ఆమె కావాలని కొట్టుకున్నారు.. విషయం ఏంటి అంటే పొలం మీద పంట వస్తుంది.. ఆమెను ఇంటికి తీసుకువెళ్తే ఖర్చు తగ్గుతుంది.. ఆడమనిషి కాబట్టి బ్రతికినంతకాలం మా కుటుంబానికి చాకిరీ చేస్తుంది .. పైగా అట్లు పోసి అమ్మి రాబడి కూడా తెచ్చి ఇస్తుంది అని సమాధానం చెప్పారంట.. వారి దూర దృష్టికి నేను విస్తుపోయాను..

రక్షణ లేని ఆమెపై అందరికీ హక్కువుంటుంది.. అందరూ ఆమెను వాడుకోవాలని చూసేవాల్లే కాని ఆమె అభివృద్దిని కోరే వారే అరుదవుతారు.. ఆమె శ్రేయస్సు పై కాని, ఆమె ఇష్టాఇస్టాలపై గాని ఏ ఒక్కరికి శ్రద్ద వుండదు.. ఆఖరికి కన్న తల్లితండ్రులకు, రక్త సంబంధీకులకు కూడా భారం అవుతుంది ఈమె.. అత్త మామలు, అన్నదమ్ములు, వదినెలు ఆమెను వేరు పురుగుగా చూస్తారు.. బావలు, మరుదులు ఆమె వారసత్వాన్ని ఎలా భంగ పరుద్దామా అని ఆలోచిస్తారు.. చదువుకుందామా అంటే చదివించే నాధుడే వుండడు .. పోనీ పెళ్ళాడుదామా అంటే మళ్ళీ పెళ్ళా !!! అంటూ అసహ్యంగా చూస్తారు.. వయస్సు మళ్ళిన మగవారు సైతం కన్నెలనే కోరుతారు ..కాని భర్తృవిహీనలంటే అతి నీచంగా చూస్తారు.. వైధవ్యం ఆమె కోరుకున్న వరం కాదు అని అందరికీ తెలిసిన విషయమే కదా.. కావాలని తెచ్చుకున్న దోషం అంతకన్నా కాదు.. అది ఆమెపై అనుకోని ఆశనిఘాతంగా వచ్చిపడ్డ మహోపద్రవం ... 

ఈ సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.. మరెన్నో సమస్యలు తీరుతున్నాయి.. ఇంకెన్నో మరబోతున్నాయి.. కాని మారని సమస్య మన విధవరాండ్రదే ... వారి వేష భాషల్లో కొంచం మార్పు వచ్చినా జీవిత విధానంలో ఏ మార్పు రాకబోవటం శోచనీయం .. వారు ఇటు పుట్టింటి వారికి, అత్తింటి వారికి కూడా బరువే.. అది చాలక “తల చెడ్డ దానికి భోగభాగ్యాలెందుకు పడివుండక” అంటూ ఈసడిస్తుంది ఈ సమాజం.. “పూర్వ జన్మ పాప ఫలం వల్ల ఇలాంటి దశ వచ్చింది “ అంటారు తోటి స్త్రీలు.. “చేసుకున్నవారికి చేసుకున్నంత, అనుభవించక తప్పుతుందా ? ఏనాడో ఏ పచ్చని కాపురంలో నిప్పులు పోసి వుంటుంది అనుభవిస్తుంది మనమేం చేస్తాం “ అంటూ దెప్పిపొడుస్తారు తోబుట్టువులు.. “ నా పాప ఫలం” అంటాడు తండ్రి.. “ నా తలరాత వల్లనే దాన్ని కన్నాను కాని దాని అదృష్టాన్ని కనగలనా “ దానితో పాటు నేను అనుభవించక తప్పుతుందా అంటూ వాపోతుంది ఆమె తల్లి.. 

నెత్తిమీద గుడ్డ ఆ దేముడే తొలగించినప్పుడు, నుదుటి వ్రాత అలా రాసినప్పుడు అనుభవించక తప్పుతుందా.. ఇలా అందరికీ లోకువై, అందరిచేతా ఈసడింపబడుతూ ఎదారిలాంటి జీవితాన్ని సాగిస్తుంది ఆ అభాగ్యురాలు.. ఏ నేరం లేకుండా, ఏ తప్పూ చెయ్యకుండా శిక్ష అనుభవించేది ఎవరయ్యా అంటే విధావాడబడుచు అని రూఢీగా చెప్పవచ్చు.. అంతే కాదు ఒక చెంప జీవితంలో తీరని నష్టాన్ని పొంది బ్రతుకులో భారంతో గడుపుతున్న ఆమెపై జాలిలేక పోగా దయ, కరుణ చూపకపోగా దెప్పిపొడవటంలో న్యాయమేమిటో అర్ధం కావట్లేదు.. అందరికీ చాకిరీ చేస్తూ అందరికీ లోకువగా బ్రతకటమే ఆమె జీవిత ధ్యేయం, పరమావధి అవుతుంది.. 

ఇక పిల్లలున్న తల్లి, ఆస్తిలేని తల్లి, ఉద్యోగార్హత లేని తల్లి అయితే ఆమె కష్టాలు చెప్పలేనివిగా వుంటాయి.. ఇంటిపని, పిల్లల పని, వారి పోషణా భారం అనంతంగా వుంటుంది.. వారి చదువు, ఆరోగ్యం లాంటివి అనుక్షణం ఆమెను వేదిస్తూనే వుంటాయి.. అష్ట కస్టాలు పడి పెంచిన ఆ పిల్లలు పెద్దవారయ్యాక పెళ్లి అయ్యాక ఆమెకు ఇంత తిండీ, గుడ్డా కూడా ఇవ్వరు.. తండ్రి ఆస్తికి మాత్రం వారసులు అవుతారు.. 

“విడో” కాగానే ఆమె పరిస్థితులు తారుమారు అవుతాయి.. కొన్ని విధులు, బాధ్యతలు ఆమెకై కేటాయించబడతాయి .. ఎడురువస్తే “అపశకునం” అంటారు.. శుభకార్యాలలో పాల్గొనరాదు అంటారు.. తన బిడ్డ పెళ్లి కూడా తను దూరంగా వుండి చూడాలి.. ఇలా ఎన్నో ఎన్నెన్నో.. 

ఇవన్నీ మనసులో పెట్టుకొని వారికోసం ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటూ వున్నాను.. స్త్రీలకు కేటాయించిన ఉద్యోగాల్లో వితంతువులకు యాభై శాతం కేటాయిస్తే బాగుండు.. అలాగే వృత్తి, విద్యల్లో వారికి ముందుగా అవకాశం కల్పించాలి.. వయోపరిమితిని అధిగమించి వారికి ప్రత్యేక సదుపాయాలు కలిగించాలి.. యువకులు, విద్యార్ధులు చైతన్య వంతులై అలాంటి వారికి వివాహం చేసేందుకు ముందుకు రావాలి.. తోటి స్త్రీలు వారిని ఉద్దరించడానికి తోడ్పడాలి.. అలా సర్వులూ వారికి చేయూత నిచ్చిన నాడే వారు స్వతంత్రులు కాగలరు.. 

ఎన్ని చేసినా, మరిన్ని చేసినా వితంతువులు సైతం తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుకోవడానికి సర్వవిధాలా ప్రయత్నించాలి.. ఆనాడే వారి సమస్యలు సమసి పోగలవు.. 

ఒక్కరి హృదిలో అయినా ఈ ఆలోచన వస్తే బాగుండు.. 

స్వస్తి __/\__

Bobby Nani

Tuesday, November 1, 2016

స్త్రీ
కన్ను మిన్ను తెలియక పశువులకన్నా అతి దారుణంగా స్త్రీలపై అఘాయిత్యాలు మనం ఇప్పుడు వేస్తున్న ఈ రెప్పపాటు క్షణంలో ఎన్నో ఎన్నెన్నో జరుగుతున్నాయి.. ఎక్కడో ఒక మూల, ఏదో ఒక రకంగా ఆడతనం కామెంద్రుల చేతిలో చిదిమివేయబడుతోంది ... ఇదెలానో ఆపలేము.. కనీసం వారికోసం ఓ వెచ్చటి కన్నీటి బొట్టును అయినా రాల్చాలని మసకబారిన అక్షరాలతో రాసాను.. ఈ చీకటి బ్రతుకులకు ఇక వెలుగు లేదా ?? వారి జీవితం మరొకరి విలాసమా ?? వారి ఆవేదన మరొకరికి ఆనందమా.. ?? ఎక్కడ మార్పు .. కనుచూపు మేర కానరాకున్నది.. 

స్త్రీ

వివస్త్ర కాబడి. 
వీధుల్లో ఊరేగింపబడుతోంది ఈ స్త్రీ.. 
ఇంటరాగేషన్ పేర,
చిత్రహింసలకు గురై,
రక్షకభట నిలయాల్లో ... 
కొందరి ఖాకీ భీకర కౌగిళ్ళలో నలిగి,
సామూహిక మానభంగాలతో,
నేడు .. బలౌతున్నది ఈ స్త్రీ.. !!
నగరం నడిబోడ్డులో
మతకల్లోలాల్లో ... మత రక్కసి విషపు గాట్లకు 
గురౌతున్నది ఈ స్త్రీ.. 
వసతి గృహాలలో 
నయాన్నో, భయాన్నో, 
తెలిసో, తెలియకో,
వంచన కాబడుతున్నది ఈ స్త్రీ..!!
వాడలపైబడి అమానుషంగా 
సామూహిక అఘాయిత్యాలు జరుగుతుంటే, 
బలౌతున్నది ఈ స్త్రీ.. 
ఇది ఈ దేశపు మేధావులకు, 
పాలక వర్గాలకు, పార్టీలకు 
రక్షకభట దళాధిపతులకు తెలుసు.. 
ఇంతటి నాగరిక హిందూదేశంలో 
సభ్యసమాజంలో జీవనం సాగించినా.. 
ఈ స్త్రీ అధికార, ఆధిక్యతలకు ఆహుతై 
సమిధలా బలికాబడుతూనే వుంది.. 
ఆమె ఆర్తనాదాలు ఈ అనంత వాయువుల్లో 
కలసి, సమసిపోతూనే వున్నాయి.. !!
నిలకడలేని ఈ న్యాయమూర్తులతో...
నిజాన్ని చూడలేని ఈ రక్షాధిపతులతో .. !!
కోర్టులకు కొదవేలేదు.. 
రక్షకభట నిలయాలు నిండుకున్నాయి.. 
నిజాన్ని నిక్కచ్చిగా సాక్ష్యం చెప్పినా.. 
బలౌతున్నవారికి రక్షణే లేదు.. 
“బలి” చేస్తున్న వారికి శిక్షాలేదు.. 
ఈ స్త్రీ ఓ బలహీన వర్గపు స్త్రీ
ఈ స్త్రీ ఓ దళిత వర్గపు స్త్రీ 
ఈ స్త్రీ ఓ పేద వర్గపు స్త్రీ కావడమే కదా... !!
ఎందరి హృదయాలలో కెళ్ళాయి 
ఆ ఘోష, ఆ ఆవేదన, ఆ ఆక్రందనలు 
ఎందరి ఎదల్ని తాకాయి ?
ఈ బలహీన దళిత పేద వర్గ స్త్రీ లకై 
ఎందరు బిగించారు పిడికిలి ....!!

Bobby Nani