Friday, September 30, 2016

నవ మాధుర్యము..


నీ నుదిటిన అంటిన అరుణవర్ణమును నేనే..
నీ సిగలోన దాగున్న మల్లె కొప్పును నేనే..
నీ నాశిక సంపంగెను నేనే..
నీ స్వరము లోని మధుర సౌందర్యమును నేనే ..
నీ అధరములోని అమృత తుల్యమును నేనే ..
నీ తొలి స్పర్శకు తొలి పులకరింతను నేనే..
నీ తొలి సిగ్గుకు తొలి సంకేతనము నేనే..
నీ చీర కుచ్చిల్లల్లో నలుగుతున్న మడతను నేనే..
నీ చెక్కిలిపై నవ కుసుమమును నేనే ..
నీ మూతి విరుపుల్లలో నాజుకును నేనే..
నీ పరువపు సొగసైన సోయగమును నేనే ..
నీ ఉరుములపై జాలువారే ముంగురుల సొగసును నేనే ..
నీ ఒంపులలోని లావణ్యమును నేనే ..
నీ నడకలోని మయూరమును నేనే..
నీ నడతలోని నవ మాధుర్యమును నేనే..
నీ కోర్కెల దాహగ్నికి సంజీవిని నేనే ..
నీ పాద పద్మములకు అంటిన లేలేతపు పారాణిని నేనే..
నీ అణువణువునా నవరస శృంగార సరసఖేలిని నేనే ..
నాటి తొలిరేయి చేసిన తుంటరి నీ పంటి మధుర జ్ఞాపకాలకు
నిలువెత్తు సాక్ష్యం నేనే..

Bobby Nani

వివాహబంధం...


వివాహబంధం అనేది చాలా పవిత్రమైన బంధం.. పూర్వకాలంలో ఐదురోజుల పెళ్ళిళ్ళు, మూడురోజుల పెళ్ళిళ్ళు చేసేవారు.. ఇప్పుడు ఒక్కరోజు పెళ్లికే ఎంతో ప్రయాస పడుతున్నారు.. ఒక్క గంటలో అన్నీ తతంగాలు జరిపేస్తున్నారు.. పురోహితుడు చెప్పే హిందూ వివాహ మంత్రాలలో ఎంతో అర్ధం దాగి ఉంది .. 

ముఖ్యంగా కన్యాదాన సమయంలో, కన్యాదాత వరునితో

“కన్యాం కనక సపన్నాం కనకాభరణభూషితాం దాస్యామి విప్లవేతుభ్యం బ్రహ్మలోక జిగీషియా” అని అంటారు... దానికర్ధం ఏమంటే – నేను బ్రహ్మలోకం సాధించడం కోసం, సువర్ణ ఆభరణములచే అలంకరింపబడ్డది అయిన కన్యను, విష్ణు స్వరూపుడైన నీకు ఇస్తున్నాను అని.. 

తరువాత 

“విశ్వంభరః సర్వభూతాః కన్యాం ఇమాం ప్రదాస్యామి పిత్రూణా తారణాయవై”

దీనిభావం ఏమంటే : నా పితురులు తరించుటకు ఈ కన్యను దానము చేస్తున్నాను. పంచభూతాలు, సమస్త దేవతలు, ఇందుకు సాక్షులు అంటూ 

“కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే, ప్రత్యాహం ప్రయచ్చామి ధర్మకామార్ధ సిద్ధయే” 

అలంకారాలతో కూడి సాధుశీలవతి అయిన ఈ కన్యను, ధర్మ కామార్ధ సిద్దికొరకై సుశీలుడు, బుద్ధిమంతుడు అగు నీకు దానము చేయుచున్నాను .. అంటూ వధువు, వరుల ముత్తాతలనుండి వాళ్ళ గోత్రాలతో ప్రవర చెప్తారు.. వరుని చేతిలో నీటిని ధారగా వదులుతూ, కన్యని వరుని చేతిలో ఉంచి మంత్రాలు వల్లిస్తారు.. వరుడు నాతి చరామి అంటాడు.. అనగా ఈమె మాటను నేను అతిక్రమించను అని అర్ధం.. 

సంస్కృత భాషలో ఎంతో అర్ధాలను పొదగబడిన ఈ వివాహబంధం విడాకుల వరకు వెళ్తున్నాయంటే మనకు ఏంటో ఆశ్చర్యమనిపిస్తుంది.. ఈ బంధాన్ని ఎప్పటికీ, నిర్లక్ష్యం చేయకూడదు.. 

దంపతులిద్దరూ కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ విశాలదృక్పథం కలిగి ఉండాలి.. భర్త తన అనురాగం భార్యకు పంచాలి.. అదేవిధంగా భార్యకూడా తన ప్రేమను భర్తకు అందిస్తూ కష్టసుఖాలు పంచుకుంటూ, క్షణిక ఉద్రేకాలకు లోనుగాకుండా, పరస్పర అవగాహనతో మసలుకోవాలి .. 

నా మనసు నిండా నీవే ఉన్నావు సుమా .. అని భర్త భార్యతో అంటే, ఆమె ఎంతో సంతోషించి తృప్తిగా తన సంతోషాన్ని మరో రూపంలో తెల్పుతుంది.. ఈ చిన్న మాటను అనడానికి భర్తకు అహం నేటి కాలం దంపతులలో.. వివాహ బంధాల్ని గౌరవించండి.. 

స్వస్తి ___/\___

Bobby Nani

విసిరి పారేసిన ఓ గుడ్డ పీలిక ...మనిషి జన్మ ఎంతో శ్రేష్టమైనది కాని మనుషులు మాత్రం ఒక సాటి మనిషిని మనిషిగా చూడని దిస్థితి ... మనిషిగా పంపడం మాత్రమే దేవుని నిర్ణయం ... దాన్ని మానవత్వంతో జీవిచడం మనమే అలవరచుకోవాలి ... సాటి మనిషిని గౌరవించాలి ... కనీసం గౌరవించక పోయినా పర్వాలేదు అవమానించకూడదు ... ఘనకార్యాలు సాధించడానికే భగవంతుడు మనను ఎన్నుకొన్నాడని విశ్వసించాలి. ఆ విశ్వాసమే ఘనకార్యాలని సాధించగల శక్తినిస్తుంది.... ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన చిరంజీవి పట్టుమని 12 ఏళ్ళు అయినా నిండకమునుపే, అల్లరితనం వికసించక మునుపే, ఆనందం వెల్లివిరియక మునుపే, అసలు జీవించక మునుపే కష్టాల కడలిలో కుటుంబ పరిస్థితులను తన భుజములపై వేసుకొని బ్రతుకుతున్న ఓ పేదింటి కొమరుడు గురించి రాయాలనిపించింది .. కొందరు పిల్లలు చదువుకొనవలసిన వయస్సులో కుటుంబాలను పోషించే పరిస్థితి రావడం నిజంగా శోచనీయం .. అలాంటివారిని ఉద్దేశించి హృదయంలో ద్రవించిన భావాన్ని సిరాగా మలిచి వాడికి అందిస్తున్న అక్షర హారం ఇది.. 

విసిరి పారేసిన ఓ గుడ్డ పీలిక ...
*******************


చదువుకుంటానంటే చంపుతానని నాన్న.. 
సినిమాకెళ్తానంటే తంతానని యజమాని
వాడి బల్యానుభూతుల మామిడి పూతల మీద 
మంచులా కురుస్తారు.. 
ఇంకా పిడికెడు అనుభవాలైనా ఏరని 
వాడి పసి చేతుల్లోకి 
కుటుంబ స్థితిగతులు సూది మొనల్లా దిగుతున్నాయి.. 
జీవితమంటే మాయ మంత్రాల 
జానపద సినిమా కాదని తెలిసిపోతుంది.. 
ఇష్టం లేకపోయినా అదే 
జీవనాధారమని అర్ధం అయిపోతుంది.. 
ఇక సూదీ, దారమే వాడికి బంధువులు, స్నేహితులూ 
పోద్దునేప్పుడో తిన్న గుప్పెడు తరవాణీ మెతుకులు.. 
మధ్యాహ్నం యజమాని పోయించిన గుక్కెడు టీ నీళ్ళు.. 
ఇవే వాడికి పంచభక్ష్య పరమాన్నాలు .. 
కాజా చుట్టూ అద్బుతంగా దారాన్ని అల్లే సాలీడు వాడు.. 
తన బతుకు వస్త్రం చిరుగులనేమాత్రం కుట్టుకోలేని 
జాలి కథా నాయకుడు.. 
రీలు నుంచి దారాన్ని తెంపుతున్న సులువుగా 
తన గుండె కండె నుంచి కష్టాల్ని తెంపుకోలేని 
శోక తప్త గీత గాయకుడు వాడు.. 
కుట్టు సరిగా లేదని యజమాని నోరు పారేసుకుంటే 
కత్తిరించి ఓ మూల పారేసిన గుడ్డ పీలిక వాడు.. 
నెలాఖరు క్షణాల్లో కల్లు గుర్రమెక్కి వచ్చిన తండ్రి 
జేబును గుంజుకుపోయినప్పుడు 
చొక్కా నుంచి తెగి పడిన బొత్తం వాడు.. 
వాడి చుట్టూ దండాల మీంచి 
సీతాకోక చిలుక రెక్కల్లాంటి బట్టలు వ్రేలాడుతున్నాయి 
వాడి కళ్ళల్లోంచి మాత్రం 
నాన్న నోట్లోనుంచి కురిసే బూతులు 
రంగు వెలిసిన అమ్మ నవ్వులు వ్రేలాడుతుంటాయి.. 
రంగు రంగు దుస్తుల్లో అంబారీల్లో 
దొరబాబు లోస్తుంటారు పోతుంటారు కాని 
వాడి కేసి కాసిన్ని చూపులు అక్షింతలు అయినా చల్లరు 
టీ తేవడం ఆలస్యమైందని 
యజమాని కొడుకు చేయి విసిరినప్పుడు
పౌరుష మొచ్చినా 
ఇలాయి బుడ్డి పొగ చూరిన అమ్మ కళ్ళలోని జీవితం 
వాడిని బుద్ధుడ్ని చెయ్యడం 
ఎవరూ గమనించరు 
సినిమాపేర్లు చదవడం వరకే 
పరిమితమైన వాడి అక్షర జ్ఞానం 
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ల యూనిఫాంలను 
వాడి కంటి నీటితో తడి చెయ్యడం 
ఎవరూ తెలుసుకోలేరు.. 
రెండు వేళ్ళ నడుమ కదిలే సూది 
నాణెం మీది రెండు కంకుల నడుమ ఒకటి అంకెలా
ఊరించడం 
ఎవరూ గ్రహించరు.. 
గిర్రుమని తిరిగే మిషన్ల హోరులో
వాడి గుండె మూలుగుల్ని ఎవరూ వినరు.. 
వాడు తన ఆశల కంరాలకు 
దారాలతో ఉరివేయడం గాని 
తన ఊహల రెక్కలను 
కత్తెర మొనలతో తుంచెయ్యడం గాని 
ఎవరూ పరికించరు 
సూదిలో దారం ఎక్కించేటప్పుడు 
వాడు అచ్చు తుపాకీలో తూటాలేక్కించే సైనికుడే.. 
కజాలో బోత్తాలో అంచులో కుడుతున్నప్పుడు 
వాడు అచ్చు చిక్కుదీసి తలదువ్వుతున్న అమ్మే...
కుట్టిన దుస్తుల్ని దులిపి మడత పెడుతున్నప్పుడు 
వాడు అచ్చు పసి మెదళ్ల అజ్ఞానాన్ని దులిపే గురువే.. 
చిత్తుగా తాగి వచ్చిన తండ్రిని 
నిలదీయనూ లేక 
నెత్తి, నోరు బాదుకుని విలపించే తల్లిని 
సముదాయించనూ లేక 
పళ్ళ అంచులతో తెంపి ఉమ్మె 
దారపు కొసల సాక్షిగా ఎప్పటిలాగే 
తల కళ్ళ గ్రహాల్ని డీకొనే 
అవసరాల తోక చుక్కల్ని మోసుకుంటూ వాడు.. 
వాడి స్పర్శలో నలిగి పునీతమైన బట్టల్ని తొడుక్కుని 
శరీరం నిండా గర్వాన్ని పూసుకుంటూ మనం.. 
ఇలా బతికేద్దాం.. 

Bobby Nani​

Wednesday, September 28, 2016

నేటి శృంగార విషయంలో కొందరి అపోహలు, భయాలు..నేటి శృంగార విషయంలో కొందరి అపోహలు, భయాలు.. 

ఈ పైన వున్న పంక్తిని చూడగానే మరో కోణంలో ఆలోచించకండి.. ఆధ్యాత్మిక పరంగానూ, శాస్త్రీయ పరంగాను, విశ్లేషనాత్మకమైన వివరణను రాయ సంకల్పించి గడచిన 4 రోజుల అవిశ్రాంత విరామ అనంతరం మరలా మీ ముందుకు ఇలా వచ్చాను.... ఏ వయస్సు వారు అయిననూ ఇది నిరభ్యంతరం గా చదివేలా కొంచం సమయం తీసుకొని మరీ ఇలా రాసాను.. ఇందుకోసం ఎన్నో సూచనలు చదివాను.. వికీపీడియాను చూసాను, మహాత్ముల రాతలు పరిశీలించాను వారి ఆలోచనలను పరీక్షించాను.. నిజా నిజాలు ఏంటి అనే వాటికోసం వాటి మూలాలలోకి ప్రవేశించాను.. ఎట్టకేలకు ఎన్నో సుధీర్గ అన్వేషణల అనంతరం అన్నీ మిశ్రమం లా చేసి ఒక ఆర్టికల్(వ్యాసం) రాసి కొందరి అపోహలను, ఆలోచనలను సరైన దిశ, నిర్దేశాన్ని కలిగించే చిరు ప్రయత్నమే ఇది.. 

నేటికాలపు విచ్చలవిడి శృంగారాన్ని ఆస్వాదిస్తున్న మానవ యంత్రాలకు అసలైన శృంగారం అంటే ఏంటో దాని పవిత్రత ఏంటో తెలియజెప్పే వ్యాసం ఇది.. అందరూ చదవమని అభ్యర్ధన.. 

శృంగారం పేరెత్తగానే కొంతమంది ఉలిక్కిపడతారు .. మరికొంతమంది కలవర పడతారు.. ఇంకా కొందరు సిగ్గుతో మెలికలు తిరిగిపోతారు.. కొద్దిమంది ఉబ్బి, తబ్బిబ్బు అవుతారు .. తతిమ్మావారు భయంతో వొణికి పోతారు.. ఇది ఈ నేటి స్త్రీ ల స్థితి.. 

శృంగార విషయంగా స్త్రీలు ఇలా భిన్న వైఖరులు ప్రదర్శించడానికి వారు మనుగడ సాగిస్తున్న ఈ సమాజం, చుట్టూ వున్న పురుష ప్రపంచం కారణ భూతాలు .. స్త్రీని జీవంలేని వస్తువులా చూడటం, ఒకవేళ మనిషిగా చూచినా స్వేఛ్చ ఇవ్వకపోవడం, కాస్తో, కూస్తో స్వేచ్చ ఇచ్చినా పురుషునితో సమాన ప్రతిపత్తి ఇవ్వకపోవడం ఇవన్నీ కలిసి స్త్రీని న్యూనతపరిచినాయి. శృంగార అనుభవం తనకవసరమా ?? కాదా ... అని తేల్చుకోవడం, అందులో ఆనందానుభూతిని పొందడానికి ఆశించడం, అందుకనువైన మార్గాలను అన్వేషించడం, ఈ పనులు స్త్రీ కనుక చేపడితే తోటి స్త్రీలు తనని అవహేళన చేస్తారు.. పురుషులు నిందిస్తారు.. శృంగారం విషయం లో సమాజం యొక్క వైఖరిని అందులో స్త్రీ ల దృష్టిని పొరపాటుగా నిర్ణయించుకోవడం వల్ల ఇలా జరుగుతోంది .. 

శృంగారం గూర్చిన విషయం మాట్లాడరాదు, వినరాదు, చర్చించరాదు.. నిజానికి స్త్రీ జీవితంలో శృంగారానికి స్థానం లేదా ?? యుక్త వయస్సు వచ్చినప్పటినుంచి ఆమెకు శృంగారం ఈ సమాజం అనుక్షణం గుర్తు చేయుట లేదా ? అమ్మాయి రజస్వల కాగానే యెంత సంరంభం, యెంత హడావిడి.. ఇరుగుపొరుగు వారిని, భందువర్గాన్ని పిలిచి పంక్తి భోజనాలు సాగిస్తారు.. శృంగార జీవితాన్ని గుర్తుచేసే వేడుకలూ జరుపుతారు.. పెళ్లితంతు సరే సరి .. గర్భాదానపు మంత్రాలలో శృంగార జీవిత చిత్రణ ఎబ్బెట్టుగా వుంటుంది.. గర్భదారణ జరగగానే సూడిదలు, సీమంతాలు .. ప్రసవం కాగానే భారసాల మహోత్సవాలు.. ఇలా స్త్రీ జీవితంలో శృంగారమును అనుక్షణం ఆమెకు గుర్తు చేసేది ఈ సంఘటనలే, క్రతువులు ఎన్నో వుంటాయి.. ఉదాహరణకు : రజస్వల అయిన నక్షత్రం చెడ్డది అయితే గుండపు శాంతులు చేయిస్తారు.. తనేదో దోషం చేశాననే భావాన్ని ఇలాంటి క్రతువుల ద్వారా స్త్రీకి కల్పిస్తుంది ఈ సమాజం ఆమెకు పిన్ననాటనే.. 

శృంగారం ద్వారా ఆనందాన్ని పొందాలని స్త్రీ కోరుకోవడం తప్పని, సంతాన ప్రాప్తి కోసం మాత్రమే స్త్రీ శృంగార జీవితాన్ని గడపకూడదు అని కొందరు నీతి బోధ చేస్తున్నారు, చేస్తూనే వున్నారు.. అలాంటి వారిలో మహాత్మాగాంధీ గారు కూడా ఒకరు .. పితృరుణం తీర్చడానికి పురుష సంతానాన్ని కని భర్తకు సమర్పించిన తర్వాత ఇల్లాలు బ్రహ్మచర్యం అవలంభించాలనే వారు వున్నారు.. వీరి దృష్టిలో స్త్రీ పురుష లైంగిక సంబంధం సంతానం కొరకు మాత్రమే ఉద్దేశించబడింది.. అది లేని వారికి శృంగార జీవితం వింద్యం, గర్హ్యనీయము కూడాను.. అయితే ఇలాంటి వైఖరిని మన పూర్వీకులు ప్రదర్శించినట్లు ఎక్కడా దాఖలాలు లేవు.. ఋషుల కాలంలో శృంగారాన్ని నీచంగా చూడలేదు.. వారు శృంగార జీవితానికి తగినంత ప్రాధాన్యత ఇచ్చారు.. ఒక రకంగా ఆలోచిస్తే ఋషులు ఆనందోపాసకులు. జీవితాన్ని సుఖ ప్రదము, ఫల ప్రదము చేసుకోవడానికి వారు కృషి చేసారు.. శృంగారాన్ని శాస్త్ర విషయంగా గ్రహించి అధ్యయనం చేశారు .. వాత్సాయనుని కామ శాస్త్రం దీనికి తార్కాణం.. కాని ఇటీవల వేయి సంవత్సరాల నుండి వచ్చింది ఈ నాటి వక్ర భాష్యం.. శృంగార జీవితాన్ని చేజేతులా వొదులుకున్న స్త్రీ పురుషులు ఇంద్రియ నిగ్రహం చెయ్యలేక ఎన్ని వెతల పాల్పడుతున్నారో.. ఎన్ని సంకటస్థితులలో చిక్కుకుంటున్నారో, ఎన్ని రకాల మానసిక క్లేశాన్ని అనుభవిస్తున్నారో .. వైద్యులకు, మానసిక శాస్త్రజ్ఞులకు తేటతెల్లమైన విషయమే.. ఈ సిద్దాంతాలతో మానవ ప్రకృతిని, మానవ నిజాన్ని చిదిమేస్తున్నారు.. కొందరు పండితుల అజ్ఞానంతో, అయోమయంలో ఒక వర్గం ప్రజల్ని తమ తప్పుడు ఆలోచనల ద్వారా హింసిస్తుంటే.. మరికొందరు చిత్తశుద్ధి లేని వారై ద్వంద్వ నీతితో కృత్రిమ జీవితాన్ని గడుపుతున్నారు.. ఇలా సమాజాన్ని వక్ర మర్గాన పట్టిస్తున్నారు.. 

శృంగారాన్ని మోక్ష సాధనంగా అభివర్ణించి ప్రచారం చేసే ప్రబుద్దులు లేకపోలేదు.. మన దేశంలో ఆశ్రమాలు నెలకొలిపి కాముక క్రీడద్వారా మోక్ష ప్రాప్తికి సోపానాలు నిర్మించిన కొందరు గురువులు కోకొల్లలు.. తాంత్రిక పద్దతుల్లోని పాంచరాత్ర విధానంలో శృంగారానికి విపరీత స్థానం కల్పించబడింది.. ప్రస్తుత సమాజంలో మోసం, కృత్రిమం, విశ్వాస రాహిత్యం, నిజాయితీలేమి గూడుకట్టుకొని వున్నాయని తలపోస్తూ ఈ సమాజం నుంచి పారిపోదామని ప్రయత్నించే హిప్పీలు శృంగారాన్ని కేవలం సంతోష సాధన మార్గంగానే వాడుతున్నారు..మత్తు పదార్ధాలను సేవించడం, వావి వరసలు లేకుండా లైంగిక స్వైర విహారం చెయ్యడం వీరి నిజంగా మారింది.. దాహం వేస్తే నీరు త్రాగినట్లు శారీరక ఉద్రిక్తతను తొలగించుకోవడానికి, కామ దాహం తీర్చుకోవడానికి నీతి, నియమాలు సమాజం అడ్డురారాదని వాదించేవారూ వున్నారు.. దీనినే Drink of Water Theory అని పిలుస్తారు.. ఇలా వెఱ్ఱితలలు వేశారు విపరీత మనస్కులు.. 

స్త్రీ పురుషుల జీవితంలో శృంగార పాత్రను సరిగా మదింపు చెయ్యాలంటే సామజిక చరిత్ర అవగాహన అవసరం అవుతుంది.. శారీరక శాస్త్ర జ్ఞానాన్ని సంతరించుకోవాల్సి వుంటుంది.. మానసిక శాస్త్ర సిద్దాంతాలను అవగతం చేసుకోవడం ఆవశ్యమౌతుంది... ఇంత విషయ జ్ఞానం అవసరమైనప్పుడు అదేమి పట్టించుకోకుండా మౌడ్యంలో తలమునకలు వెయ్యడం విజ్ఞతకు లక్షణం కాదు.. శృంగార అనుభవం శారీరక సుఖాన్ని చేకూరుస్తుందని, మనసికానందానుభూతి మరో జీవితపు విలువ. స్త్రీ, పురుషులు తమ తమ స్థాయీ భేదాల్ని బట్టి వీటిలో ఒక దానివైపు మొగ్గు చూపించవచ్చు.. మానవుని జీవితంలో శృంగారం ప్రాధాన్యత వహిస్తుందనేది నగ్న సత్యం కాగా శృంగార పరమైన మానసికానందాన్ని ఆవలకు నెట్టి మరో రకంగా మనస్సుకు ఆహ్లాదాన్ని ఆశించేవారూ వున్నారు.. కాగా దరహం మీద చూస్తే మానవులు శరీర సుఖాన్ని, మానసిక సంతోషాన్ని వాంచిస్తున్నట్లు తేలుతుంది.. ఆదిమ సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య శృంగార సంపర్కం సాగేది.. దరిమిలా సంఘ పరిణామంలో శృంగార జీవితాన్ని క్రమబద్దం చెయ్యడానికి, సంతానం యొక్క తల్లితండ్రులను నిర్ధారణ చెయ్యడానికి వివాహ వ్యవస్థ ఉద్భవించింది.. దాంతో సంతానానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.. సంతానప్రాప్తి మాత్రమే వివాహ లక్ష్యంగానూ, శృంగార జీవిత ఆదర్శంగానూ చిత్రించబడింది. శృంగారం సహాయంతో ఆనందాబ్దిలో ఓలలాడవలసిన భార్య, భర్తలు ఈ విచిత్ర నియమాలకు బలైపోతున్నారు.. ఇది శోచనీయం .. 

వివాహం యొక్క లక్ష్యాన్ని సరిగా, స్పష్టంగా నిర్దేశించాలి.. స్త్రీ, పురుషులిద్దరూ ఒకరిపై ఒకరు అభిమానాన్ని, ఆప్యాయతను, మొహాన్ని, ప్రేమను పెంచుకున్నప్పుడు మాములుగా వివాహమాడతారు.. కొంతమంది వివాహ ప్రక్రియ లేకుండా దాంపత్య జీవితం సాగిస్తుంటారు .. ఏ పద్దతి అవలంబించినా ఆ సంబంధానికి ప్రధాన లక్షణం నా దృష్టిలో సాన్నిహితత్వం.. ఒకరికొకరు మానసికంగా, సామాజికంగా చేరువైనప్పుడు వారి ఇరువురూ శృంగార అనుభవాన్ని పొందడం విడ్డూరంగా కనపడదు.. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే .. శృంగార అనుభవం సన్నిహితత్వాన్ని అనుసరించి పోవలెనా లేక దానివల్ల సన్నిహితత్వం ఏర్పడుతుందా అనేది ప్రశ్న.. నిజానికి రెండూ పరస్పరాశ్రయాలె .. అవినాభావ సంబంధం కలవి.. లైంగికానుభూతి సన్నిహితత్వాన్ని చరమదశగా పేర్కొనవచ్చు.. అదిలేని సన్నిహితత్వం పరిపూర్ణత్వాన్ని పొందదు ... అట్లే దాంపత్య జీవితం సన్నిహితత్వాన్ని దృడతరం చేస్తుంది.. 

సతీ పతులు విభిన్న మనస్తత్వాలను కలిగి వున్నా, ఇద్దరిమధ్యా వున్న విశిష్ట సంబంధం వల్ల ఒకరికొకరు చాలా దగ్గరి వారౌతారు.. అలాంటప్పుడు వారు దాంపత్య జీవితం గడపకుండా ప్రేయసి, ప్రియురాలిగా తమను చిత్రించుకుంటూ కాలం గడుపుతుంటే వారి జీవితం నిస్సార మౌతుంది.. ఉత్తరోత్తరా వారు మానసిక క్లేశానికి గురిఅవుతారు.. శృంగారం అచ్చంగా శారీరక ప్రక్రియ అని అనుకోవడం పొరపాటు.. అది మనసుకు, శరీరానికి రెండిటికీ సంబంధించిన విషయం.. మనస్సులేని శృంగార అనుభూతి పశుప్రయంతో సమానం.. 

మోక్షసాధన కోసం శృంగారాన్ని పరిహరించి బ్రహ్మచర్యాన్ని పాటించడం, సంతాన ప్రాప్తికోసం మాత్రమే దాంపత్య జీవితాన్ని గడపపూనటం, మోక్షసాధనకు లైంగికానుభూతిని సోపాన మార్గంగా ఎన్నుకోవడం, మనస్సుతో సంబంధంలేని కామ క్రీడను అభిలషించడం ఇవన్నీ పెడ మార్గాలు.. స్త్రీ, పురుషుల సన్నిహితత్వానికి శృంగారం ఉపకరిస్తుందని గ్రహించడం, కాముక క్రీడను ఒక స్థాయిలోని విలువలుగా గుర్తించడం సవ్యమైన ఆలోచనా విధానానికి ప్రతీకలు.. ఈ విషయాలను స్పష్టంగా గ్రహించ గలిగిన నాడు శృంగారాన్ని నిందించడంగాని, అతిగా స్తుతించడం గాని జరగదు.. సమతుల్య భావనతో, వాస్తవదృష్టితో హేతుబద్దంగా ఆలోచిస్తే శృంగారాన్ని గురించిన గందరగోళం మటుమాయం అవుతుంది.. అలాంటి దశకు మానవజాతి అందులో ముఖ్యంగా భారతీయులు త్వరితగతిన చేరుకుంటారని ఆశిద్దాం.. శృంగార అపోహలను పోగొట్టుకొని, స్వంత ఆలోచనలో నిబ్బరంగా తమ జీవితాలలో దాని పాత్రను సరిగా అర్ధం చేసుకొని మనుగడను స్త్రీలు సుఖవంతం చేసుకునే కాలం వస్తుందని అభిలాషిద్దాం .. 

స్వస్తి ___/\___

Bobby Nani

Saturday, September 24, 2016

మనుషులు, మనస్తత్వాలు ...
మనుషులు, మనస్తత్వాలు ...

1. మేహర్భానుల మారాజులు : మనుషుల్లో వీరు చాలా వ్యత్యాసమైనవారు .. (ఆకంత కూరకు అర్ధరూపాయి ఘరం మసాలా) అన్నట్లు వీరి ప్రవర్తన వుంటుంది.. అంటే .. పనిచేసేది కరివేపాకంత .. కాని సమాజాన్ని నమ్మించేది మాత్రం కొండంత చేశామని చెప్పుకుంటారు.. అంతే కాకుండా ప్రతీ చిన్న విషయానికీ వీరి గురించి వీరు స్వంత డబ్బా కొట్టుకుంటూ ఉంటారు.. నేనే గొప్ప, నేను మాత్రమే గొప్ప.. మిగిలినవారందరూ బోడిలింగాలు అనుకునే అతి వ్యత్యాసమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు వీరు.. 

2. పొగడ్త ప్రియులు : వీరు మహా సున్నిత ప్రియులు.. ఏదొచ్చినా తట్టుకోలేరు.. ఎవరన్నా గాని పొరపాటున మీరు ఉరుమండీ, తురుమండీ అన్నారంటే చాలు ఉన్నపళంగా చెట్టు చిటారు కొమ్మన దర్శనమిస్తారు.. మనల్ని ఏ ఉద్దేశంతో పోగుడుతున్నారో, మననుంచి ఏం ఆశిస్తున్నారో అనే తదితర అంశాలను ఆలోచించకుండా విచక్షణా జ్ఞానంతో వరాలు, వాగ్దానాలు కురిపించేస్తారు... తరువాత చిక్కుల్లో పడి నానా తంటాలు, అవస్థలు పడుతుంటారు.. ఇది వీరి స్వభావం.. 

3. నిశ్శబ్ద హంతకులు : వీరు చెప్పే మాటలు అమృతతుల్యములు.. అనగా.. పైకి ఏమో శ్రీరంగ నీతులు చెప్తూ లోపలేమో గుడిఎనక నా స్వామీ అంటూ చిందులు వేస్తుంటారు.. సమాజంలో ఇలాంటి వారు చాలా ప్రమాదకారులు.. మనముందు మద్దెల దరువులు వేస్తూ వెనక వెన్నును పొడిచే అతి నీచమైన స్వభావులు వీరు... పైశాచిక ఆనందం వీరి తత్వం.. 

4. కలహాప్రియులు : కలహంలో వీరికి వీరే సాటయా ... ముష్టాన్న భోజనం లాంటి కలహం వీరికి ఇరువది నాలుగు గంటలూ వుండాలి.. కలహం ఎదుటివాడికి పెట్టి .. వాళ్ళు జుట్టులు జుట్టులు పట్టుకొని చావబాదుకుంటే వీరు ప్రేతానందం పొందుటలో అందె వేసిన చెయ్యి.. 

5. వెటకార హీనులు : వీళ్ళకు దేహంలో ఆణువణువూ వెటకారమే.. ప్రక్కనవాడిని గెలుక్కొని వాడిమీద వెటకారం చూపడం అంటే మహా మక్కువ.. ఎదుటివారు తీవ్రమైన సంభాషణ కొనసాగిస్తూ వున్నా కూడా లెక్కలేని ధోరణితో, వెకిలి చేష్టలతో, పిల్లతనంతో వెటకారంతో ప్రవర్తించి వారిచే సావబాధించుకోనుటలో వీరు నిష్టాతులు.. 

6. అసమానులు : వీరు అరుదైనవారు. పైకి ఏమీ తెలియనట్లు వుంటారు.. కాని లోపల అన్నిటికీ వీరి దగ్గర సమాధానం వుంటుంది.. “గాలికి ఊగేవి మాకులు గోల చేసేవి కాకులు అన్నట్లుగా” వీరి ప్రవర్తన వుంటుంది.. ప్రతీ విషయాన్ని పలురకముల భంగిమలనుంచి చూడటంలో వీరు దిట్ట.. అల్పులతో మాటల కొనసాగింపు అనర్ధాలకు చేటు అని భావిస్తారు.. వీళ్ళను కదిలిస్తేనే తెలుస్తుంది వీరిలో విషయం ఎంతుందో అనే భావన..

7. సోల్లుగాల్లు : ఎవరన్నా ఒక ఆడపిల్ల ఒరపాటున వీడి పోస్ట్ కి like or comment ఇచ్చిందంటే చాలు.. దాని సిగదరగ ఇక రెప్పపాటు లిప్తపాటుకాలంలో తన ప్రైవేటు ఇన్బాక్స్ లో సందేశం వుంటుంది.. హాయ్. నేను ఇది. నేను అది.. మీరు .మీ గురించి చెప్పండి .. ఇలా సొల్లు కబుర్లు, కాలయాపన వీరి జీవిత లక్ష్యం..

8. భ్రమ పరులు : వీరు నిజజీవితంలో కన్నా కల్పించబడిన ఈ ఊహాజీవితాన్నే నిజమని నమ్ముకొని ఇదే వారి వాస్తవ ప్రపంచంగా బతుకుతుంటారు.. పక్కన వారితో సత్సంబంధాలు పూర్తిగా తెంచుకుంటారు.. చివరికి వారెం చేస్తున్నారో, ఏం కోల్పోతున్నారో కూడా మర్చిపోయి బతికేస్తుంటారు.. 

9. కాలయాపన కంత్రీలు : వీరు జేవితాన్ని ఎలా వడ్డించిన విస్తరి చెయ్యాలో, ఒకవేళ చెయ్యకున్నా ఎలా ప్రతీ నిమిషం సంతోషంగా బ్రతకాలో నేర్చిన నేర్పరులు.. ఎవడేట్లా పోయినా నాకేంటి.. నాకు కాలయాపన చెయ్యడానికి ఒకడువుంటే చాలు అని అనుకునే చిత్రమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు వీరు.. వీరు దేన్నీ ఎక్కువరోజులు కొనసాగించరు ... వీరికి ఎప్పటికప్పుడు నూతనం కావాలి.. 

10. అమాయక చక్రవర్తులు : వీరి ఆలోచన ఇలా వుంటుంది.. నేను ఎందుకూ పనికిరాని వాడిని.. నాకు ఏది రాదు.. ప్రతీ చిన్న విషయానికి భయపడటం... ఆత్మహాత్యలు లాంటివి చేసుకునేలా ప్రేరేపించుకోవడం వీరి నైజం.. చిన్న మాటకు కూడా బాదపడిపోతూ తపించిపోతూ, తల్లడిల్లుతూ, కృంగిపోతూ వుంటారు.. 

11. నకిలీ నారాయణులు : అబ్బ బ్బ బ్బ వీళ్ళ గురించి యెంత చెప్పిననూ కొంత మిగిలే ఉంటుందబ్బ .. ఫోటో ఒకటైతే మనిషి మరోటి.. మనసు ఒకటైతే మాటలు మరోటి.. ఫొటోలే కాదు లింగాలు కూడా మార్చుకొని బృహన్నల మాదిర సంచరిస్తూ మాయ చేసే మాయగాల్లు వీరు.. 

12. గోతి కాడ నక్కలు : వీళ్ళ రూటే సపరేటు .. ఎవరన్న మంచి సందేశం పెడితే చాలు శరవేగంతో దాన్ని మక్కి కి మక్కి కాపీ చేసేసి శుభ్రంగా వాళ్ళే పెట్టినట్లు కలరింగ్ ఇచ్చుకుంటూ మెహర్భానులు పడుతుంటారు... కనీసం రాసిన వాడి పేరు కూడా ఉదహరించరు.. ఒకరి అనుభూతులు వీళ్ళకు అవసరం.. 

13. వ్యాపారులు : కొందరు మేము ఈ సంస్థలు నడుపుతున్నాం .. అందరికీ మంచి చేస్తున్నాం .. మీ తోచిన సహాయం మాకు చెయ్యండి అంటూ చాలామంది వాళ్ళ వాళ్ళ అకౌంట్ నంబర్స్ ఇచ్చేస్తూ ఇలా అర్ధిస్తున్నారు... నిజంగా సహాయం చేసేవాడు ఇలా అర్ధించడు .. ముందు తను తనకు శక్తి కొలది చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో ఎవరికంట అయినా పడినప్పుడు వాళ్ళకు తోచిన సహాయం వాళ్ళు చేస్తే అది చూసి సంతోషిస్తాడే కాని ఇలా ఆకులు నాకే వాడి దగ్గర మూతులు నాకాలని అనుకోడు... ఈ వేధికను వ్యాపారంగా చేసుకొని ప్రజలతో సెంటిమెంట్ అనే ఆయుధాన్ని ప్రయోగించి మూటలు వసూలు చెయ్యడంలో వీరు ధీరులు...

ఇక ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని... ముఖపుస్తకంలోనే కాదు ఎక్కడైనా సరే కేవలం టైం పాస్ కొరకు వచ్చేవాళ్ళు కోకొల్లలు... ఏదో ఒకటి సాదిద్దాం, మారుద్దాం అనుకునే పెద్దలు కూడా లేకుండా పోలేదు.. అలాంటి వారు ఇంకా ఉండబట్టే ఇంకా ఈ ముఖపుస్తకం లాంటి సంస్థలలో కొంచమైనా మంచి ఏదో ఒక మూల మిగిలివుంది... మరికొందరు మంచి మంచి కవితలు, కావ్యాలు, తెలియని విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, సైన్స్ కి సంబందించినవి, జాబ్స్ కి సంభంధించినవి, ముఖ్యంగా రక్తం అందలేని వారికి ఆ ప్రాంతంలో వున్న కొందరు స్పందిస్తూ చాలా చాలా మంచి పనులు చేస్తూ ముందుకు పోతున్నారు వీళ్ళంతా ఓన్ గానే చేస్తున్నారే కాని సంస్థలు పెట్టలేదే... ఆలోచించండి... 

రాజకీయాలు అందుకు సంబంధించిన విషయాలు చర్చలు అవసరం. కాని అవే ఈ లోకం కాకూడదు... కొందరు అసెంబ్లీ లో ఈడు ఇలా అన్నాడు.. ఆడు ఇలా అన్నాడు.. పొద్దుగాల నుంచి ఇదే యవ్వారం... మీడియా ఇలా చూపించింది.. అలా చూపించింది... అంటూ దుమ్మెత్తి పోస్తూ వుంటే ఏం లాభం.. ?? ఆకాశానికి చూసి ఉమ్మితే వచ్చి మన మొహానే పడుతుంది అనే సంగతి మనం మరవకూడదు.. వాళ్ళు వాళ్ళు ఈరోజు కొట్టుకున్నా రేపనే రోజు నాయకులంతా ఒక్కటే.. 

“నాయకుడంటేనే శాంతం నాకేసే వాడు అని అర్ధం” కాని నువ్వు అలా చూస్తూ ప్రేక్షకుడిగా ఉంటావే తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. నీ ఓటు తో వాళ్ళకు సమాధానం చెప్పు అంతే కాని ఇలా మాటల వల్ల నిష్ప్రయోజనములే .. 

కొన్ని గ్రౌప్స్ లో చర్చ అని పెట్టి బండ బూతులు తిట్టుకుంటున్నారు... దానివల్ల నాలాంటోడికి టిక్కెట్ లేకుండా హాస్యాన్ని పంచడమే అవుతుంది.. చర్చ వేరు రచ్చ వేరు... అర్ధం చేసుకొని ఆలోచించండి... ఆచరించండి... 

చివరగా : ఏదైనా సృతిమించకూడదు అనేది నా అభిప్రాయం.. అన్ని కళలు వుండాలి కాని అవి హద్దులలో వుండాలి అనే నేను చెప్తున్నాను.. 

స్వస్తి.. __/\__

Bobby Nani

Friday, September 23, 2016

కాలగమనం...యవ్వనం అనేది చాలా అద్బుతమైనది.. దాన్ని కొందరు యువత చే చేతులా నాశనం చేసుకుంటున్నారు.. ఈ మధ్య నాకు తెలిసిన కొందరు పెద్దవారు ఒక సంస్థను నడుపుతున్నారు... వాళ్ళు కొన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ వుంటారు.... వాళ్ళు ఒక జైలు కి వెళ్లి అక్కడవున్న ఖైదీలకు ఏదైనా ఇవ్వాలని అక్కడకు వెళ్ళారు... అక్కడ వాళ్ళు చూసిన సంఘటనకు వాళ్ళు కూడా నిర్ఘాంతపోయి మాట మూగదైపోయిందంట..... ఇంతకీ విషయం ఏంటంటే అక్కడ వున్న ఖైదీలు అందరూ 25 వయస్సు లోపల వయస్సు వున్నవారేనంట ... ఇది మన యువత అందరం తలదించుకొని బాదపడాల్సిన విషయం... 
మన యువత ఎటు పయనిస్తునారు ?? 
ఏవేవో తప్పులు చేసి అందరూ అక్కడ వాళ్ళ బంగారు భవిష్యత్తు ని నాశనం చేసుకున్నారు... నిజంగా ఇది చాలా బాదాకరం..

నేటి యువతకి లైఫ్ అంటే సెలబ్రేషన్.... క్లబ్ లు, పబ్ లు, సినిమాలు, షికార్లు, టీవి, ఇంటర్నెట్, సెల్ఫోన్ లతో కాలక్షేపం..... మారుమూల పల్లెలకి కూడా ఈ వాతావరణం వచ్చేసింది..... తినడానికి తిండి లేక పోయినా ఇంట్లో టీవి, చేతిలో సెల్ఫోను ఉండడం సర్వ సాధారణం అయిపొయింది..... ప్రజల్లోకి, వారి జీవనంలోకి అంతగా చొచ్చుకుపొయిన ఈ సాధనాలు ఎలా ఉపయోగపడుతున్నాయో చూద్దాం...... 

కొన్ని మీడియా సంస్థలు సమాజ క్షేమాన్ని విస్మరిస్తున్నాయి. బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ యువతను పెడద్రోవ పట్టించే అశ్లీల కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ప్రేరేపిస్తున్నాయి..... మంచి, చెడుల విచక్షణ మరచి యువతను లక్ష్యంగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నాయి..... యువతను ఆదర్శంగా మలచాల్సిన మీడియా అందుకు భిన్నంగా వారు పెడద్రోవ పట్టేందుకు వీలుగా క్రైమ్ స్టోరీలు మళ్ళీ మళ్ళీ వేస్తూ ఆవిధంగా ప్రేరేపిస్తున్నారు.....

తప్పు ఎవరిది ??
యువత దా ? 
తల్లిదండ్రులదా ? 
సమాజందా ? 
కాలానిదా ? 
పరిస్తితులదా? ?

ఇవన్నీ ఒకఎత్తు అయితే.. మరికొన్ని కూడా వున్నాయి.. 

తనగురించి తాను పట్టించుకోక పోవడం..
తనమీద తనకు నమ్మకం లేమపోవడం.. 
ఆత్మవిశ్వాసం లోపించడం..
చేసే పనిపై ద్రుష్టి లేకపోవడం..
మనస్సు నిలుప లేక పోవడం.. 
బానిస మనస్తత్వంతో ఉండడం.. 
అనుభవాల ద్వారా జ్ఞానం సంపాదించడం కాకుండా బట్టి పట్టడం..
గొర్రెల మందలో ఒకడిగా ఉండిపోవడం..
ఇతరులతో పోల్చుకోవడం..
అనుకున్నది సాధించలేక పోయాను, జీవితం వృధా అయిందని బాధపడడం..
నిరాశా నిస్పృహలకు తరచు లోనవడం, జీవితాన్ని చాలించాలనుకోవడం..
ఓటమిని స్వీకరించ లేకపోవడం..
చిన్న చిన్నకస్టాలకు, వైఫల్యాలకు కుంగి పోవడం..
చిన్న వైఫల్యాన్ని పెద్దగా ఉహించుకుని వర్తమానాన్ని పాడుచేసుకోవడం..
ఎవరు ఏమనుకుంటారోనని భయపడడం..
సమస్యలను సవాలుగా తీసుకొని ఎదిగేవారి ముందు ఎవరెస్టు శిఖరం కుడా చిన్నబోతుందని తెలియక పోవడం..
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూస్తూ, దేబిరిస్తూ కూర్చోవడం కాదు..
నిప్పులు లేకుండా పొగలు చిమ్మే కర్రల్లాగా కాకుండా అగ్నికణాల్నివిరజిమ్మే దివ్వెలుగా, 
రణరంగంలో క్రమశిక్షణతో పనిచేసే సైనికుల్లా ప్రచండశక్తితో యువత ముందుకు సాగాలి..
నెత్తురు మండే, శక్తులు నిండే యువత తమ ఆకాంక్షలు నేరవేర్చుకోవడమే కాదు దేశానికి కళ్ళు, కాళ్ళూ అయి నడిపించాల్సిన, దేశ భవిష్యత్తు ఉన్నతంగా లిఖించాల్సిన బాధ్యత యువతరం పైనే ఉంది.....

ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేక పోవడం.. రాజకీయ పార్టీలపై విశ్వాసం లేకపోవడం, రాజకీయ వ్యవస్థకి దూరంగా ఉండడం, మాకు సంబంధించిన విషయం కాదని భావించడం.. ఓటింగ్ లో పాల్గొనక పోవడం, ఎన్నికలకు దూరంగా ఉండడం చేస్తోంది.. నేటి యువత.. ఒప్పుకుంటాను నేటి రాజకీయం అలానే ఉంది ... కాని ప్రతీ రంగంలోనూ యువత ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో యువత గురించి ఈ కాలగమనం రాస్తున్నాను.. 


కాలగమనం .... 
***********

కాలము అమూల్యము జారవిడుచుకోకురా ..
నిర్లక్ష్యము చేసితివా తిరిగి నీకు దక్కదురా ..!
పెదవిని దాటిన మాట పృధ్విని దాటేనురా .. 
విల్లును విడిచిన బాణం తిరోముఖం కాదురా.. 
గడచిన కాలాన్ని మళ్ళి కళ్ళ చూడలేవురా ..
అవకాశం చేజారితే అందుట దుస్సాధ్యమురా ..
ప్రతిక్షణమూ కోట్లకొలది ధనముకన్న విలువరా ..
అనుక్షణమూ అది తెలిసి మసలుకోరా సోదరా.. !
కాలగమన చక్రానికి అడ్డనేది లేదురా.. 
పరుగెత్తే సమయానికి పగ్గమేయలేవురా ..
ఆకాశానికి నిచ్చెన దుర్లభమని తెలియరా ..
సమయపు వినియోగము సర్వదా రక్షరా.. 
ఏ వేళకు ఏది నీవు చెయ్యాలో ఎరుగరా ..!
ఏమారితే దేవుడైనా ఆదుకోడు నిన్నురా..!!

ప్రతీ వ్యక్తికి వుండాలి చక్కని ధ్యేయము ..
నిత్యకృషితో చేరాలి ఎంచుకున్న గమ్యము ..
అలసత్వం ముమ్మాటికి నయంకాని దౌర్భల్యం ..
ప్రక్క చూపు వక్రబుద్ధి ప్రగతికి నడ్డు కుడ్యము 
ఓడిన ప్రతివారికి గతమనేది సత్యము 
గెలిచిన ప్రతీ వ్యక్తికి భవిష్యత్తు తథ్యము ..!!

మారరా సోదరా.. మార్చరా భవిత రాతను.. 

Bobby Nani

Wednesday, September 21, 2016

మీననేత్రిని ... (ఓ చేపకళ్ళ వయ్యారి)మీననేత్రిని ... (ఓ చేపకళ్ళ వయ్యారి)


ఆమె చిత్రమా లేక శిల్పమా ... లేక
అపురూపమైన అపరంజి బొమ్మా.. !!
కలలోన నేను కన్నులతో గంటిని..
కౌగిలిలో నామె నే దాచుకొంటి ..
ఆమె ముంగురులు పొడవైన బారులు..
ఆ కన్నులే సరసిలో నడియాడు
గడుసైన మీలకు చక్కని జోడు..
ఆమె కంఠమే శంఖమై రాజిల్లు
ఆమె పెదవులు చిందు అమృతపు జాలు
ఆమె గళమున వెడలిన రవము
అది వాయులీన ధ్వని తోడ సమము..
అటువైపుగా దాటి నిలిచిన నా చూపు
కడులోతుగా నున్న నాభి జూచెను
కనులను వంచి నే గాంచి నానా
ఆమె పాద పల్లవములపైన
అమరివున్న పారాణి గాంచితి
ఆమె కాలి అందియల సవ్వడి
వింటి నామె రూపమును గంటిని..
ఆమె నొసటి కుంకుమను గాంచితిని
ఆమె కనుల కాటుకను జూచితిని
ఆమె గాజుల గలగలలు వుండగా
మరుని మనోహర దీపికలా
బిర బిరా నన్ను చేరగనే
వలపుల వెన్నెల మాలికలా.. !!
విరిసీ విరియని ఆమె కనుదమ్ముల
కురిసే ప్రేమకు నే తాళ లేను
ముగ్దమనోహర మౌ నీ రూపము
చూచుచు ఊరక నే నిల్వ లేను
కులుకుల నడకల నడుచు మరాళీ
నాట్యము చేసే వన మయూరీ
శృంగారమే రూపు తాల్చిన రాణీ
నీ కిదే జోహారు ఓ విరిబోణీ ..!!
బిగి బిగి కౌగిలిలో బంధించ నీవే
ఎదపై తడిముద్దుల వెచ్చనితో ముంచనీవే
అధర సుధలను అందించ రావే
అలరు విల్తు వెత తీర్చగ రావే ..!!
ఒక పరి నా చెవి దావున చేరి
ప్రేమికా యని పిల్వంగ రాదే
నా గుండెలోన నీ ఊపిరితో
వేణువు నూది వినిపింపరాదే ..!!
ఎన్నో జన్మల అనుభందమే ఇది
తెలియవే చెలీ మరువగ రాని
స్వర్గ సుఖాలను చవి చూపించవే
జగమును ఊయల చేసి ఊచవే మీన నేత్రిని ..

Bobby Nani

Tuesday, September 20, 2016

ఘన దేశభక్తుల తను,ధన,మానాల త్యాగాలు బట్టని ధరణి మనది.. !


కుల రాజకీయాల కుమ్ములాటలు పెంచి
పోషించబడుచుఁడు బుడమి మనది.. !

ఘన దేశభక్తుల తను,ధన,మానాల
త్యాగాలు బట్టని ధరణి మనది.. !

అసమానతలపై నన్యాయముల పైని
సహనమ్ముజూపు దేశమ్ము మనది...!

ప్రక్కవాడిని ద్రొక్కి పైకెక్కు టొక్కటే
నేర్పంగ నేర్చిన నేల మనది.. !

లంచగొండుల పాలిట కంచుకోట
అక్రమార్కుల కనువైన ఆటపట్టు మనది.. !

స్వార్ధపూరిత జనుల పైశాచికతకు
ఆత్మబలి జేసికొనుచున్న యువని మనది.. !

పోరాట వీరుల ప్రతిమను గుర్తించక
మొహమాటపు అశ్రునివాళి అందించే ధరణి మనది.. !!

గుండెలు ఎదురొడ్డి పోరాడిన ఘనత మనది.. కాని
దున్నలు కాపుకాస్తున్నంత కాలం ఆ గుండెలకు విలువలేదు..

Bobby Nani

ఈ రోజు చాలా బాధాకరమైన రోజు..
ఈ రోజు చాలా బాధాకరమైన రోజు.. 

17 మంది వీర జవాన్లను కోల్పోయాము.. తెలియకుండానే కళ్ళలో నీరు వచ్చేస్తున్నాయి.. మనకు ఎమౌతారని మనకోసం ప్రాణాలను లెక్కచెయ్యకుండా వారి ప్రాణాలను కోల్పోయారు .. తల్లిదండ్రులను, కన్న బిడ్డలను, కట్టుకున్నవారిని, విడిచి ఒంటరిగా నిలబడి కునుకువెయ్యక నీ ప్రాణాన్ని పనంగాపెట్టి మరీ కాపలా కాస్తున్నావు... పుడమితల్లి రక్షణకోసం, దేశ సంరక్షనే నీ ధ్యేయంగా భవభందాలను పక్కనపెట్టి నీ ఆఖరి శ్వాస వరకు మాకు ఊపిరిపోస్తున్నావు.. ఏమిచ్చి తీర్చుకోగలమయ్యా నీ ఋణం.. కన్నీటి అశ్రువులు తప్ప... 

నాలుగు దిక్కులనుంచి తుపాకీ తూట్ల వర్షం, మందుగుండ్లు దూసుకువస్తుంటే... ఈ బంగారు దేశాన్ని దోచుకోవాలని చుస్తుంటే... గుండే నిండా ధైర్యం తో, అచంచల అత్మ విశ్వాసంతో, భరత మాతను కాపు కాస్తున్నావు.. భగ భగ మండే ఎండల్లో, గడ గడ వణికించే చలిలో... రేయి, పగలూ తేడా లేక ధైర్యంగా నిలుచున్నావ్ ... నీ కోసం బతికే తల్లి తండ్రులను విడిచి, నిన్నే నమ్ముకున్న వారిని వదిలి కర్తవ్యం కొసం బరిలో నిలిచావు ... భార్యా బిడ్డల సంరక్షణ భరతమాతకొదిలేసి దేశ రక్షణలో నిమగ్నమైన ధీరుడవై బుల్లెట్ల వర్షంలో, బాంబుల భీభత్సంలో మరణాన్ని కౌగిలించుకుని ముందుకు సాగుతున్నావ్ .... ఏంటయ్యా నీ ధైర్యం.. 

ఎప్పుడొస్తావని పాప అడిగితే కంట నీరు కార్చి సమాదానం చెప్పలేని నిస్సహాయునిలా నువ్వు మారితే...వదిలి వెళ్ళకు నాన్నా అంటూ ఆ చిన్నారి రెండుకాళ్ళు గట్టిగా పట్టుకుంటే మాయ మాటలు చెప్పి విధి నిర్వహణకై, దేశ సంరక్షణకై ముందుకు కదిలే నీ ఆత్మస్థైర్యాన్ని ఎలా ప్రశంసించాలి.. 

పేపర్ చదువుతూ, టీవి చుస్తూ, సోషల్ నెట్వర్క్స్ లో కాలయాపన చేస్తూ, కుటుంబంతో నిశ్చింతగా గడుపుతున్న మాలాంటి వారికి ఈ స్వేచ్ఛను కల్పించి, నీ స్వేచ్చలన్నీ మాకోసమే విడిచేశావ్ కదయ్యా ... మేము ఇలా వున్నామంటే నీ వీరత్వ త్యాగఫలమే కదా ... సందేహం లేదు ఓ వీర సైనికుడా ఏమిచ్చి తీర్చుకోగలం నీ ఋణం..... వెలకట్టలేనిది నీ ధీరత్వం... జయహో వీర సైనికుడా జయహో... 

ఓ విధినిర్వహణ కర్తకు, 
ఓ అసమాన ధీర మూర్తికి, 
ఓ అజేయ నాయకుడకు, 
ఓ నిర్భయ హృదయుడకు,
ఓ సాహసికుడకు, 
ఓ పరాక్రమవంతుడకు,
మనము విలువ కట్టలేము.. కాని మన గవర్నమెంట్ మాత్రం విలువ కట్టేసింది.. తలో ఐదో, పదో ఇచ్చి కొంచం రిబ్బన్ ముక్క తగిలించి, కొన్ని రౌండ్స్ గాలిలో కాల్పులతో సత్కరించడం.. వహ్ శబాష్ ... 

స్పోర్ట్స్ లో నెగ్గినా నెగ్గకున్నా వారికి మాత్రం ఖరీదైన వసతి, ఖరీదైన భోజనం, ఖరీదైన సదుపాయం మధ్య మధ్యలో యాడ్స్ రూపంలో ఖరీదైన పారితోషికం, పేరంటాలకు, పనికిమాలిన ఓపెనింగ్స్ ఫంక్షన్స్ కు ప్రముఖుల నుంచి, ప్రముఖుల సరసన పిలుపులు వారితో ఆలింగనాలు .. ఇదే నేటి మన భారతం.. 

అక్కడ బోర్డర్ లో ఏం దొరికితే అది తిని ఒక్కోసారి మంచి నీళ్ళతో కూడా సరిపెట్టుకొని నిలబడేవాడు మన జవాన్.. అతనే నిజమైన మా హీరో.. 

ఆ 17 మంది లో ఓ వీర జవాన్ చివరగా తన తల్లికి ఫోన్ చేసి అమ్మ నేను బోర్డర్ కి వెళ్తున్నా ఎందుకో నీతో కాసేపు మాట్లాడాలని వుంది కాసేపు మాట్లాడమ్మ అంటూ తన తల్లితో చాలా సేపు మాట్లాడి ఆ మాటలే తన చివరివి అయిపోయాయే అని ఆ తల్లి కన్నీళ్ళకు, రోదనకు మనసు చెలించి పోతుంది.. 

మరో జవాన్ తన సోదరికి పెళ్లి పెట్టుకొని నేను బోర్డర్ నుంచి వీలైనంత త్వరగా వస్తాను చెల్లి పెళ్లి చాలా బాగా చెయ్యాలి అని చెప్పి తిరిగిరాని లోకాలకు పయనమైపోతే ఆ కుటుంబం కార్చే కన్నీటి ప్రవాహానికి అడ్డుకట్ట కట్టేదెలా.. 

నా కన్నీటి అశ్రునివాళి తో వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను..

BOBBY NANI

Saturday, September 17, 2016

వన మయూరి ...కొందరు తెలుగు వారు అయివుండి పాశ్చాత్య సంస్కృతులను మా గొప్పగా సెలవిస్తున్న నేటి తరుణంలో సాహిత్యం అంటే ఏంటి అనే నేటి యువత ప్రశ్నార్ధక దౌర్భాగ్యపు భావంతో తలమునకలై వెక్కి వెక్కి రోదిస్తున్న తెలుగు తల్లి మాతృ గర్భకోశ శోకానికి చింతిస్తూ వున్న సమయంలో ... విదేశాలలో వుండి కూడా పాశ్చాత్య సంస్కృతులను అవసరానికి మాత్రమే పరిమితం చేస్తూ మన సంస్కృతీ, సంప్రదాయాలను గౌరవిస్తున్న అక్కడ ఉంటున్న కొందరు స్త్రీ మూర్తులకు, పురుష పుంగవులకు పాదాభివందనం .. అలాంటి వారిలో ఓ మిత్రురాలు విదేశాలలో వున్నా కూడా తీరికలేని సమయంతో కాలం గడుపుతున్నా కూడా రచనలు చెయ్యడం, కవితలు రాయడం ఆపలేదు... అన్నిటికీ మించి ఆ కోమలాంగి ఓ గొప్ప కళాకారిణి ... మృదు స్వభావి, సున్నిత మనస్కురాలు, మొహమాటం కొంచం ఎక్కువే.. అయినప్పటికీ ఆ స్త్రీ మూర్తి, ఆ తన్వంగి, ఆ చంద్ర వదన, ఆ వనజ నేత్రిని, ఆ వరారోహిని, సుమధ్య, సుముఖ, సురదన, సులోచన, సువదన, హంసయాన, హరినలోచని ఇలా ఎన్ని పేర్లు చెప్పినా అవి అసంపూర్ణమే ఆమెగురించి ... ఆ అద్బుత మూర్తి గీచినటువంటి ఈ చిత్రానికి మీ అక్షర మాల తొడగమని చెప్పగా ... రాస్తున్నటువంటి ఓ మధురాలంకరణ అక్షర మాలిక.. ఇంతకీ ఈ చిత్రం పేరు చెప్పలేదు కదా “వన మయూరి” ఎందుకంటె వనం లో తిరిగే మయూరం బెరుకుగా, భయంగా అటూ ఇటూ చూస్తూ అమాయకమైన మోముతో కడులాడుతూ వుంటుంది నాకు ఈ చిత్రం చూసిన వెంటనే కలిగిన మొదటి అనుభూతి అదే ... 

వన మయూరి ... 
*************

కోకిల రాగాలు తీసే నవ చిగురులు విరియగ 
వన మయూరి పురివిప్పెను హరిత వర్ణములుగా 
వసంత లక్ష్మీ హొయలు పోవ గున గున నడియాడగ
నవ శోభలు ప్రతీ హృదిలో కువకవలు తీయగ
నేత చీర అందాలతో మురిసిందీ మగువని ....
కనువిందుల సింగారపు సిగ్గుల నవ వధువు 
పేరంటానికి తరలిన కిన్నెర ముత్తైదువు 
పెందలాడే తలస్నానపు ముచ్చటైన చిత్తరువు 
యేమని చెప్పనూ ... యెంతని వర్ణించనూ ... 
వన మయూరి అద్బుత సొగసులు గిలిగింతలు పెట్టగా.. 
చూచె జనుల కలువ నేత్రములు ఆనంద నేత్రములై 
విప్పార్చి పారవశ్యమున పరవశించగా .. 
ప్రతీ హృదయమందు వన మయూరి అవతారము దాల్చగా 
శుభకామన మధురోహల ప్రకృతి పులకించగా 
శతపత్రములు పరుగు పరుగున ఏతెంచగా 
యేమని చెప్పను.. యెంతని వర్ణించనూ 
వన మయూరి అద్బుత సొగసులు గిలిగింతలు పెట్టగా... 

Bobby Nani

Friday, September 16, 2016

స్నేహితుడు అంటే ?నేటికాలంలో స్నేహం అంటే Use and Throw (వాడుట వదులుట) ఎవరి స్వలోభాలకు వారు స్నేహం అనే పదాన్ని అందవిహీనం చేసేసారు.. చేస్తున్నారు.. నిజమైన స్నేహం ఈరోజుల్లో అతి స్వల్పంగా అక్కడక్కడ మాత్రమే కనిపిస్తూ వుంది.. లాభాపేక్ష లేకుండా స్వచ్చమైన మనసుతో ఒకరికి ఒకరు కలిసికట్టుగా వుండటం ఈరోజుల్లో చాలా అరుదు... అలాంటి అరుదైన స్నేహాన్ని మీరు మాత్రం వదలకండి... ఇది ఇలా వుంటే ప్రతీ అడ్డమైన భందానికి స్నేహం అనే పదాన్ని వాడటం మరింత భాదాకరమైన విషయం.. పవిత్రమైన స్నేహం అనేది ఎప్పటికీ వీడదు ... అలా మిమ్మల్ని విడిచిపోయారు అంటే మీలాంటి అద్బుతమైన వారిని వారు వదులుకుంటే వారు దూరదృష్టవంతులే అని అర్ధం.. స్నేహం గురించి యెంత చెప్పినా తక్కువే అయినప్పటికీ మరికొన్ని మాటల్లో...

స్నేహితుడు అంటే ?
మన “అవసరాలకు సమాధానం” అని అర్ధం...
ప్రేమతో విత్తి, ధన్యవాదములతో నూర్చే క్షేత్రం ఈ స్నేహం...
అతడు నీకు అండ, ఆదరణ 
ఆకలితో చేరి శాంతిని పొందుతావు కనుక ... !

స్నేహితుడు తన హృదయాన్ని విప్పి మాట్లాడినప్పుడు 
“లేదు” అనే భయం మనకు రాదు...
మాటలతో పనిలేకుండానే 
స్నేహితంలో అన్నీ కోర్కెలు ఆలోచనలు, 
మౌనంగా పంచుకుంటాం..

ఎక్కే వాడికి కిందనుండి పర్వత శిఖరం కనుపించేలాగే 
మిత్రుడిలో నీవు ప్రేమించేది 
స్పష్టంగా అతను లేనప్పుడు మాత్రమే కనిపిస్తుంది.. 
అందువల్ల అతని వియోగానికి నీవు విచారిచకు.. 
ఆత్మ లోతుల్లోకి పోవడం తప్ప ...!

స్నేహంలో మరి యే లాభాపేక్ష ఉండరాదు...
ప్రేమను కాక మరి దేన్నో కోరే స్నేహం 
స్వలాభాలకు విసిరే వల అవుతుంది.. !
నీలోని మంచిని స్నేహితుడికి అందించు... 
స్నేహం కాదు సమయాన్ని చంపడానికి

అది సమయాన్ని సజీవం చేయడానికే !
స్నేహితుడు మన అవసరాలను నింపాలి
కాని మన ఖాళీలను కాదు.. !
స్నేహపు మాధుర్యంలో నవ్వుల పువ్వులు విరియాలి 
సంతోష పరిమళాలు పంచుకోవాలి.. !!

Bobby Nani

Thursday, September 15, 2016

నా ఊహా సుందరి..


కలలు కనడం మానవ నైజం.. ఆ కలల్లో కొన్ని భయాన్ని కలిగిస్తే మరికొన్ని సంతోషాన్ని కలిగిస్తాయి.. మరికొన్ని అందంగా, అపురూపంగా, అపూర్వంగా కూడా వుంటాయి.. అలాంటి అందాలలో జనియించినదే నా ఈ ఊహా సుందరి.. సాధారణంగా కలలు కొన్ని గుర్తుండవు ప్రక్కరోజు సరిగ్గా అలాంటి సన్నివేశాన్ని కాని లేదా ఆ కలలో కనిపించిన వస్తువులను, రంగులకు, మరేవైనా చూసినప్పుడు ఆ కల మళ్ళి మన మస్తిష్కంలో పునరావృతం అవుతుంది.. అలా మర్చిపోయిన ఊహా సుందరిని ఈరోజు ఓ భూలోక సుందరి పునరావృతం చేసింది.. ఆ నెల్లూరు నెఱజాణ గురించి ఈ చిరు మధుర మందార ధార .. 

నా ఊహా సుందరి.. 
*****************

నా కలల రూపమా...
నా బ్రతుకున కర్దమా.. 
కావ్య కథానాయికల 
కలబోసిన అందమా.. !!

ఊహల ఉయ్యాలలో ఊగించుట న్యాయమా ?
నీ తలపుల తరంగాల తేలించుట ధర్మమా ?
ఊహల వుచ్చులనుండి ఎప్పటికి విముక్తి ?
ఆలోచన అలలనుండి ఏనాడు తీరానికి తాకేది ?
నీ కొరకై వేచిచూసి, నిరీక్షించి, నీరసించి 
కనులు మూత పడగానే కనుల ముందు మెరిసేటి నా 
కలల ఊహాసుందరివే .. 
మధురమైన నీ ఊసులు వీనులకు విందులు.. 
నీ అధరామృత సుధలు సంజీవని సమంబులు ...
నీ సాంగత్యం నాకు ఇంద్రలోక సమానం.. 
నీవులేని ప్రతీ నిమిషం కర్కశ నరక ప్రాయం... 
నీ కొరకై నిత్య జపము తపము చేసి శుష్కించి 
కనులు మూతపడగానే కనుల ముందు మెరిసేటి నా 
కలల ఊహాసుందరి... 
నీ సుకుమారము చూసిన మరుమల్లియ తెల్లబోయే.. 
నీ నడకల హొయలు గన్న మయూరము చిన్నబోయే .. 
అందానికి అందమా.. గగనమందు చంద్రమా.. 
ఆమనిలా అరుదెంచి పులకరింపచేయుమా.. 
చకోరమై ఎదురుచూసి అలసిపోయి సొమ్మసిల్లి 
కనులు మూతపడగానే కనుల ముందు మెరిసేటి నా 
కలల ఊహాసుందరి నీవే కదా.. 

(మీరు చుస్తున్నటువంటి ఈ అద్బుత కళా ఖండం విశాలేంద్ర గారు గీచినటువంటి చిత్రం.. ఆయన ఇలాంటి ఎన్నో చిత్రాలకు జీవం పోశారు..)

Bobby Nani

Saturday, September 10, 2016

“అవతారికా” ...


ఓ కోమలాంగి చక్కని అలంకారవతి అయినప్పుడు చూసేందుకు రెండు నేత్రములు సరిపోవు తన పరిణాయకుడకు ..... అలాంటి ఓ మధురానుభూతిని కళ్ళకు కట్టినట్లు అర్ధనారీశ్వరుల అంశతో జీవించే యెవ్వన నిత్య ప్రేమికులను ఉద్దేశించి ఓ మధుర రస భరిత ఆస్వాధనామృత సురస రసధార... 

కొంచం రసభరితమైన పదాలు వున్నాయి.. అవి తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ ఇలా బహిరంగంగా రాసి పెట్టడం మొదటిసారి.. మరోలా అనుకోకుండా కవితా హృదయంతో చదవమని అభ్యర్ధన.. 

“అవతారికా” ... 

చంద్రబింబపు చూడచక్క నీ రూపం యేమని వర్ణింప... 
ఆ మోముపై పడు నీ సుగందార్చిత, శోబిత కురులు .. 
నా మదిలో రేగెను ప్రళయ బద్దపు అలజడులు... 
నా బింబానికే ప్రతిబింబానివై .. నా 
హృదయపు స్పందనలో ప్రతీకదలికవై.. 
కావ్యవై, కవయిత్రివై.. కదలరావే “అవతారికవై”....!
లే లే తపు గులాబీ రంగు అధరములను చూచుటయే కాని ..
తాకేందుకు అర్హత లేనివాడినే ... ఆ 
తియ్యటి తేనే లొలుకు పెదవులు పురివిప్పినప్పుడు .. 
అవి కదిలే సొగసైన హొయలు చూచుట సాధ్యమా.. 
సంపంగి సైతం సిగ్గులోలికే ఆ సన్నని నాశిక.. 
నాగ స్వరపు నీ శృంగారపు మెడ వంపులలో ... 
చెలికాడి వెచ్చటి శ్వాస తగలగానే అవి పడే శృంగార హొయలు వర్ణింపసఖ్యమా .. 
నిండు పున్నమివంటి తళ, తళా మెరిసే నీ దేహ సౌందర్యం .... 
నెమలి కంఠము కల్గిన నాజూకైన నడుము వొంపులు ... చిన్న స్పర్శకే 
చిన్నబుచ్చుకునే వాటిపై పడే ముచ్చటైన మూడు మడతలు.. 
ఓ హో యేమని వర్ణింపను ... 
అప్పుడే పడిన వర్షపు తొలకరి చినుకుల నీటి బిందువులకు 
నిలయమైన ఆ కొమ్మల మాటున దాగిన తుంపరులు. .. 
నిన్నుచుడగానే ... గంతులేస్తూ .. నిను తాకే ప్రయత్నంతో.. నీ 
మోముపై చిందగా.. ఆ సమయమున నువ్వు పడే ఆ 
లయలు, నయగారములు, మాటలకందునా..
రూపవతివై, సుగుణవతివై, సౌభాగ్యవతివై, సంతానవతివై, 
గుణవతివై, లావణ్యవతివై, ఆత్మీయపు ప్రమిదవై, 
మీన నేత్రివై సిగ్గులోలికే పద్మముఖీ మందహాసముపై మెరిసే నీ 
ఎరుపు వర్ణపు చెక్కిలి స్వర్ణ, సుగంధ, పుష్పపు రేకుల వలే బహు సున్నితముగా, 
సుకుమారముగా, సుతి మెత్తని ప్రత్తి దూదివలె ముచ్చట గోల్పుచున్నవే.. 
ముద్దడినా మా పురుష రోషపు ముల్లులు గాయపరచక మానవు కదా.. 
పద్మభూషణాలంకరివోలె నీ చెవి మధ్యమమున మత్తుగా ఒక శ్వాస సవ్వడి సేయ్యగా.. 
నీ దేహాంతరంగములు ప్రతిధ్వనించగా.. 
అణువణువునూ నీ అంద చందాలు ఆక్రమిస్తుంటే...
క్రుంగి పోవకనే పోతున్న నాకు ఎందుకో ఈ పిచ్చి ప్రయత్నం..
తపనల పళ్ళెములో ప్రేమాను రాగాల మరుల, సిరులు వొంపిన శృంగార నిధివో... 
లేక నీలవేణి మన సెరిగిన ప్రేమ లోలుని ప్రతిరూపమైన శృంగార నా ధర హాసానివో.. 
ఎవరివే నీవు ...?? 
పురివిప్పిన నా యవ్వన ప్రాంగణములో ..
కురిసే శృంగార విరి జల్లుల వానవా .. లేక 
లలనా చంద్రికల తారాడు నవ వసంత రాధికా సమ్మోహిత ప్రియ ప్రేరణవా ... 
ఎవరివే నీవు ...?? 
విరహం, విరసం, ప్రణయం, సరసం, నయనం, స్వర్గ దారులై విరిసే యదకుసుమంలో.. నీ 
తనువు, అణువు, సొగసు, వయసు, మనసు ..
మధుధారలై కురిసే ఈ మధువనిలో... 
వోపజాల నిరీక్షణల జ్వాల బంధించు కరముల ఆలింగన నీ యదశ్వాసలో...
ప్రేమరాజ్యపు హృదయాల్లో ఒక ప్రణయ “చిత్రినివై “రూపానివై”,
ప్రతీ క్షణం నేను శ్వాసించే గాలిలో నీ వై నిండిపోవా .. 
ఓ నా అవతారికా.. !!!!

Bobby Nani

Tuesday, September 6, 2016

ఓ అసాధారణమైన రచయిత....ఓ అసాధారణమైన రచయిత గురించి నా మాటల్లో మీతో నేను పంచుకోవాలనిపించింది .. 

నేను చదివిన ఆయన రచనలను బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఏదో నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్తూ వున్నాను.. యెంత చెప్పినా ఆయనగురించి అవన్నీ తక్కువే అవుతాయి.. చలనం లేని రాతి సైతం ఆయన రాతలకు చలించిపోతుంది.. ఆయనే ఓ అసాధారణమైన రచయిత “ చలం” (గుడిపాటి వెంకట చలం) గారు.. చలంగారిని పోలిస్తే ఒక నిర్ణిద్ర సముద్రంతో పోల్చాలి.. ఒక మహా జలపాతంతో పోల్చాలి.. లేదా ఒక ఝంఝూనిలంతో నైనా పోల్చాలి... 

చలం గారి అస్తమయంతో ఒక సముద్రం స్తంబించినట్లు, ఒక జలపాతం నిశ్చలమై పోయినట్లు, ఒక ఝంఝూనిలం శాంతించినట్లు అయిపోయింది.. గుడిపాటి వెంకట చలం గారు ఆంధ్ర సాహిత్యంలో ఒక సుడిగాలి వలె, ఒక పెద్ద వరద వలె ప్రవేశించారు .. సంఘంలో, సాహిత్యంలో, ప్రజల ఆలోచనల్లో తర తరాలుగా పేరుకుపోయిన కశ్మలాన్ని కడిగిపారేశారు .. చెత్తా, చెదారం, దుమ్మూ, దూగర ఎగరగొట్టి చైతన్య వంతమైన క్రొత్త గాలులకు తలుపులు తెరిచారు.. క్రొత్త భావాలకు లాకులు ఎత్తివేశారు.. 

ఓకే గొప్ప రచయిత ప్రవేశం తరువాత ఏ సాహిత్యం యథాతథంగా మిగలదు.. దాని స్వరూపం మారిపోతుంది.. దాని స్వభావం మారిపోతుంది.. సాహిత్యంపై ఆయన తన ప్రభావాన్ని ఎన్నటికీ చెరగని విధంగా ముద్రించారు.. తెలుగు వచనా స్వరూపాన్ని, తన రచనా స్వభావాన్ని పూర్తిగా మార్చివేశారు.. సమకాలిక రచయితలపైన, తరువాత తరం వారిపైనా తన ప్రభావ ముద్ర వేశారు.. 

ఆనాడు ఆయనను గురించి రెండే రెండు అభిప్రాయాలు ఉండేవి.. అవి : విమర్శిస్తే అతి తీవ్రంగా విమర్శించడం, లేదా అంతే ఘాడంగా అభిమానించడం ...ఫరవాలేదు బాగానే రాస్తాడు అనో, లేదా ఏమి వ్రాసాడు లెద్దూ అనో చప్పరించి వెయ్యడానికి వీలులేని రచనలను ఆయన చేసారు.. మరొక అభిప్రాయానికి తావులేకుండా రాసేవారు.. 

చలం ఏంటి ఇలా వ్రాసాడు ? ఇంత పచ్చి బూతులా ? ఇంత బరి తెగింపా ? అవినీతిని, విశృంఖలత్వాన్ని భోదిస్తున్నాడే ! సంఘాన్ని, ముఖ్యంగా వివాహ వ్యవస్థను కూకటి వేళ్ళతో సహా కూలద్రోయడానికి యత్నిస్తున్నాడే ! హిందూ సంప్రదాయాన్ని, ఆచారాలను, విశ్వాసాలను, కుల భేదాలను మంట గలుపుతున్నాడే ! ఇలాంటివి ఎన్నో ఆయనను ద్వేషించిన వారి విమర్శ ఇది.. కాని ఈ విమర్శలకు చలంగారు చలించలేదు... తాను నమ్మిన సిద్దాంతాలకోసం సంఘానికి, వ్యక్తులకు ఏది శ్రేయస్కరమని తాము భావించారో ఆ విలువల కోసం ఆయన పుంఖానుపుంఖంగా రచనలు చేస్తూనే పోయారు.. 

స్త్రీ, పురుషుల సంభోగం తో సహా అన్నీ విషయాలలోనూ స్త్రీ కి పురుషునితో సమాన హక్కులు వుండాలి .. యుగ యుగాలుగా పురుషుడికి స్త్రీ బానిసగా పడి వుంది.. పురుష సమాజం స్త్రీ ని అణగద్రొక్కి వేసింది.. ఆమె ఒక వ్యక్తి అని, ఆమెకొక వ్యక్తిత్వం ఉంటుందని, ఆమెకు కూడా సొంత ఇష్టా, ఇష్టాలు, అభిరుచులు, స్వేచ్చానురక్తి ఉంటాయని ఊహించలేదు.. కేవలం పిల్లలను కని, వంట చేసి పెట్టే మరబొమ్మగానే స్త్రీ ని పురుషుడు పరిగణించాడు.. ఇది అన్యాయం. పురుషునికున్న స్వేఛ్చ స్త్రీ కి వుండాలి.. అప్పుడు గాని ఆమె వ్యక్తిత్వం పరిపూర్ణం చెందదు అని చలం గారు ఆనాడు ఘోషించారు.. కాలానికి ఎదురీదుతూ, గొప్ప ఆత్మ విశ్వాసంతో, అంచలంచల ధైర్య సాహసాలతో ఆయన తన భావాలను ప్రచారం చేసారు.. తన మొత్తం సాహిత్యాన్ని తన సాంఘిక విశ్వాసాలకు అంకితం చేసారు.. 

ఎన్ని రచనలు ?? ఒక పెద్ద ఉప్పెన వలె చలం గారి రచనలు ఆంధ్రదేశంపై విరుచుకు పడ్డాయి.. ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ , దైవమిచ్చిన భార్య, శశాంక, చిత్రాంగి, పురూరవ, మైదానం, బ్రాహ్మణీకం, అమీనా, అరుణ, ఇంకా ఇంకా ఎన్నో అసంఖ్యాకమైన నవలలు, నాటకాలు, కథలు, ఇతర రచనలతో వాటిలో అసాంప్రదాయక భావాలతో ఆయన తెలుగువారిని ఉక్కిరిబిక్కిరి చేసారు.. 

తన భావాలను కాదంటూ, ఎవరైనా తన వచనా శైలిని మెచ్చుకుంటే ఆయన సహించే వారు కాదు.. “నా భావాలనుంచి, నా ఆవేశాల నుంచి నా శైలిని విడదీయోద్దు” అవి పరస్పరాశ్రితాలు అని ఆయన అనేవారు.. అయినా తెలుగులో వ్యవహారిక వచనాన్ని తీర్చిదిద్దిన కొద్ది మందిలో ఒకరుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు.... ఒకసారి ఆప్యాయంగా కబుర్లు చెప్పుతున్నట్లు, మరోసారి ఆదలిస్తున్నట్లు, ఒకసారి మృదువుగా, మరోసారి తీక్షణంగా వుంటుంది ఆయన భాష.. తెలుగుదేశపు ప్రకృతిని అంత అందంగా, అనురక్తితో వర్ణించిన మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు.. దాశరధి గారు కూడా ఈ కోవలోకే వస్తారు కాని నా వరకు ఇద్దరూ ఇద్దరే .. చలం గారు ఛందోబద్దంగా వ్రాయలేదు కాని వచనంలోనే కవితా సౌరభాన్ని గుబాళింప చేసారు.. 

చలంగారిని తెలుగువారు చిరకాలం జ్ఞాపకం పెట్టుకుంటారు కాని ఆయన ప్రయోగించిన ఆవేశాస్త్రాలను మాత్రం గుర్తుంచుకోవట్లేదు .. ఇదే ఈ సామాన్యుని ఆవేదన... ఆయన అందించిన అమృతతుల్యపు మాటలను కేవలం విని వదలకుండా పాటించమని అభ్యర్ధనతో.. కేవలం చలం గారే కాదు . దేశ మహోన్నతికి పాటుపడిన వ్యక్తులు అంతరించినా వారి జ్ఞాపకాలు మనతోనే వుంటాయి.. కాని అది మాత్రమే సరిపోదు. వారిబాటలో పయనించాలనే కాంక్ష తో ఈ టపా రాయాలనిపించింది .. 

స్వస్తి.. __/\__

Bobby Nani

Friday, September 2, 2016

మట్టి గణపతినే పూజించండి .....పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను పూజించడమే శ్రేయస్కరం. 
ఈ దిశగా అందరూ ఆలోచన చేసి ఆచరించాలి. ప్రకృతి వరప్రసాదమైన మట్టితో చేసిన విగ్రహాలనే ఉపయోగించాలి. పార్వతీదేవి వినాయకుణ్ణి సహజ సిద్ధమైన నలుగు పిండితో చేసిన సంగతిని ఇతిహాసాల్లో స్పష్టంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. 
“మట్టి విగ్రహాలను పూజిద్దాం.... మన చెరువులను కాపాడుకుందాం”... 
అనే నినాదంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతయినా వుంది. గత రెండేళ్ళనుంచి అక్కడక్కడ ప్రకృతి సిద్ధమైన మట్టితోను, రంగుల కాగితాలతోను రూపొందిన విగ్రహాలను వాడుతున్నారు. అయినా హెచ్చుగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన విగ్రహాలనే ఉపయోగిస్తున్నారు. ఎంతో ప్రచారం జరుగుతున్నా వస్తున్న స్పందన అంతంత మాత్రంగానే ఉండడం బాధాకరమైన అంశం. 

ప్రస్తుతం వినాయక విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తోనే విపరీతంగా తయారుచేయడంవల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. వాటి తయారీకి తక్కువ శ్రమ, ఖర్చు అవుతున్నందువల్ల ఎక్కువ సంఖ్యలో తయారుచేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే కొన్ని వేల సంఖ్యలో విగ్రహాలను తయారుచేస్తున్నారు. ఇక పల్లె, పట్నాల్లో వాటి తయారీ గూర్చి వేరేగా చెప్పనక్కరలేదు. ఈ విగ్రహాలను నదుల్లో, చెరువుల్లో నిమజ్జనం చేయడంతో జీవరాసులైన జలచరాలు చనిపోతున్నాయి. ఈ నీటిలో స్నానం చేసినా, తాగినా పరిస్థితి భయంకరంగా ఉంటుంది. వ్యాధుల తాకిడికి గురికావలసి వస్తుంది.... పర్యావరణం ఘోరంగా దెబ్బతింటోంది.... ఈ విగ్రహాలు కరగకపోయినందువల్ల చెరువు గర్భాల్లో పొరగా ఏర్పడి భూగర్భ జలాల తరుగుదలకు కారణమవుతోంది.... ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో కాల్షియం సల్ఫేటు సెమి హైడ్రేట్ ఉన్నందువల్ల దీనికి పూసిన రసాయనాల్లో పాదరసం ఉన్నందున కొన్ని సంవత్సరాలవరకు నీటిలో కరగవు.... కరగని ఈ రసాయనాలను చేపలు మిగిలిన జలచరాలు ఆహారంగా తీసుకోవడంవల్ల చనిపోతున్నాయి.... నీటిలో ఆమ్ల స్వభావం బాగా పెరిగి, ఆ నీటిని తాగిన మనుషులకు రోగాలు వస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గుతున్నట్టు కూడా వెల్లడైంది....

అయితే ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు శతాబ్దాల చరిత్ర ఉంది.... పారిస్‌లో 17వ శతాబ్దంలో క్యాపిటల్ ఆఫ్ పారిస్‌ను ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించేవారు..... అగ్నిప్రమాదాల బారినుంచి రక్షించేందుకు దాన్ని వాడేవారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది జిప్సం నుండి తయారవుతుంది..... జిప్సం నిల్వలు పారిస్ దగ్గరలో ఎక్కువగా ఉండడంవల్ల అప్పటి రాజు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించేవారు..... ఆ రోజుల్లో చెక్కతో తయారుచేసిన ఇళ్ళకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను కప్పి అగ్ని ప్రమాదాల రక్షణ పొందేందుకు వాడేవారు..... వాటిని నీటిలో కలిపే అవసరం లేకపోయింది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవి కావు....

కొన్నేళ్ళ క్రితం మన రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలి (పి.సి.బి) వారు మట్టితో తయారుచేసిన విగ్రహాలను కొన్ని గ్రామాలకు, పట్నాలకు నామమాత్రంగా పంపారు. ప్రస్తుతం అది కూడా జరగడం లేదు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులచే మట్టి విగ్రహాలను తయారుచేయించి పంపిణీ చేయించేందుకు పాఠశాల విద్యాశాఖ చొరవ తీసుకోవాలి..... అలాగే మట్టి విగ్రహాలనే వినియోగించాలని కోరుతూ ర్యాలీలు జరపాలి..... ఇవన్నీ చేస్తే నెమ్మదిగానైనా మంచి మార్పు వస్తుంది...... పర్యావరణ పరిరక్షణకు ఎంతో కొంత మేలు జరుగుతుంది...... మన మనుగడకు ప్రకృతి ఎన్నోరకాల సదుపాయాలను కలుగజేసింది. .....కానీ వాటి విలువ తెలుసుకోకుండా మనకు మనమే హానికారకులమవుతున్నాము...... ఫలితంగా మన మనుగడ మాత్రమే కాకుండా, సృష్టిలోని ఇతర జీవరాశులు కూడ తీవ్రంగా నష్టపోతున్నాయి. మానవుడు చేపట్టే ప్రకృతి వినాశకర కార్యకలాపాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన వినాయకుళ్ళు కూడా చోటు చేసుకోవడం విచారకరం..... భక్తి మాత్రమే కాదు పర్యావరణ పరిరక్షణ కూడ ముఖ్యం ....

చివరగా : కొందరు విచిత్ర, వికృత ఉమ్మెత్త ముండాకోరుల విన్యాసాలు చూడలేకపోతున్నాం.. బాహుబలి వినాయకుడు ఏందిరా హౌలే.. ఏక దంతుడు, లంబోదరుడు, మూషిక వాహనుడు, ఇలానే వినాయకుడు వుంటేనే అందం.. ఆయన రూపాన్ని అలానే వుంచండి... దయచేసి.. అపహాస్యం చెయ్యకండి.. పిచ్చి తుగ్లక్ విన్యాసాలు మానితేనే చూచే జనులకు బాగుంటుంది అని నా ఉచిత సలహా.. 

స్వస్తి __/\__

Bobby Nani