Thursday, July 14, 2016

కుటుంబ విలువలు ..



ఒకప్పటి కుటుంబం అంటే తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, ఆత్త, అన్న, తల్లి, తండ్రి, భార్యా, పిల్లలు, అక్కా, చెల్ల్లెళ్లు, మామలు.. ఇలా ఎన్నో బంధాలు అనుబంధాలు…అందరి మధ్యన రక్త సంబంధంతో కూడిన అనురాగం, ఆప్యాయత, గౌరవం, మమకారం కనిపిస్తుంది. “నీది” “నాది” అనకుండా “మనది” అనే అందమైన ఆప్యాయతతో కూడిన భావన అందరికీ ఉండేది. కానీ నేడు ఈ అను బంధాలన్నింటిలో ఎన్నో పరిమితులు మరెన్నో మార్పులు, వలయాలు, పొరలు, ఆత్మవంచనలు, స్వార్థాలు, మోసాలు, అహం, ఇలా ఎన్ని వున్నాయో అన్నీ మన కుటుంబ విలువలను దూరం చేసేసాయి.... ఆనాడు కుటుంబం అంటే చిన్నదైనా, పెద్దదైనా పరస్పరం అందరూ ఒకే చోట కలిసి ఉన్నా, వేర్వేరుగా నివసిస్తున్నా అందరినీ ప్రేమగా చూసుకుంటూ, అందరి పట్ల గౌరవ మర్యాదలతో మసలుకుంటూ బాధ్యతలను సమంగా పంచుకుని నా అనుకుంటూ అందరిని ఏక త్రాటిపై నడిపించే ప్రయత్నం గావించేవారు.. కాని ఇప్పటి పరిస్థితి అందుకు పూర్తిగా వ్యతిరేకం అయిపోయింది.. “ఎవరికి వారే యమునా తీరే” అన్నట్టుగా ఉంది నేటి స్థితి, మన దుస్థితి.. .. కొందరు కావాలని స్వేఛ్చ కోసం వెలితే మరికొందరు విపత్కర పరిస్థితులలో వెళ్ళవలసిన పరిస్థితి... 


ఏది ఏమైనప్పటికీ “ధన” సంపాదనపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మానవ సంబంధాల ప్రాముఖ్యత పలుచబడిపోయింది.. ఒకే ఇంట్లో నివసించే వారి లో కూడా ఈ విభజించి పాలించు అనే సూత్రం దుర్భేద్యంగా ప్రభావితం చేస్తుంది... మనది  అనేది  మరిచి ఇది నీది, అది నాది అన్న దయనీయ వాతావరణం నెలకొంది.... ఇలా ఎవరికివారు బిజీగా బ్రతికేస్తూ, పిల్లల పెంపకాన్ని అనామకులకు వదిలేసి, పెద్దవారిని వృద్ధాశ్రమాలకు తరలించేస్తున్నారు. ఈ కారణంగా కుటుంబ విలువలు పూర్తిగా నీరుగారడమేకాక, తల్లిదండ్రులకు, పిల్లలకు, మనవళ్లకు మధ్య ఉండాల్సిన అనుబంధం, అనురాగం, ఆప్యాయతలు పూర్తిగా కొరవడుతున్నాయి. పెంపకాన్ని అనామకులకు వదిలి, పెద్దవారిని వృద్దాశ్రమాలకు వదిలి ఇంకెందుకు బ్రతకడం, ఎవరికోసం ఈ అవిశ్రాంత ప్రయాస, ఎవరికోసం ఈ ప్రయాణం... 

ఇక్కడ మనం చెప్పుకొని తీరాల్సిన మరో ముఖ్య మైన విషయం : సమాచార, సాంకేతిక విప్లవం.... 

ఈ విశాల ప్రపంచాన్ని ఓ చిన్న గదిగా మార్చేసింది ఈ టెక్నోలజి.... దేశ, విదేశాల, సముద్రాల  మధ్య గల వేల మైళ్ల దూరాన్ని “వేగం” అనే ఆయుధంతో చెరిపేసి వారిని నిమిషాల్లో కలిపే పరికరాలు సహజంగానే అందరికీ అందుబాటులో వుండటం. ఇది చాలా గొప్ప విషయం అయినప్పటికీ ఒకప్పుడు దూరం ఎక్కువ వున్నా మనుషుల మధ్య ఆ దూరం గాలికూడా జొరబడని విధంగా వుండేది.. క్షణాల్లో గమ్యాన్ని చేరే మార్గాలు వున్నా కూడా దూరాలు తగ్గడం అలా ఉంచితే మరింత పెరిగిపోయాయి.. మానవ సంబంధాలు మెరుగవుతూ కనిపించినా, కుటుంబ సంబంధాలు మాత్రం కుంటివై పోతున్నాయి...  ఒకరి మాట ఒకరికి నచ్చడం లేదు. ఒకరి ఉనికిని ఒకరు సహించడంలేదు, చిన్న, పెద్ద తారతమ్య భేదాలు కాలగర్భంలో కలిసిపోయాయి.. 
ఇదంతా ఎందుకు రాస్తున్నాను .. అసలు రాయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే  శ్రీమతి భావన గారు .. నాకు అక్కగారి స్థానంలో వుండి ... నా ప్రతీ పోస్ట్  లోను  ప్రతీ పదంలో ఉన్నటువంటి దోషాలను ప్రేమ పూర్వకంగా ఒక ఉపాధ్యాయురాలు గా వుండి తప్పొప్పులను సరిచేసేవారు ... ఆమెకు ఈ రోజు ఆరోగ్యం బలేనప్పటికీ నన్ను ఓ సహాయం చెయ్యమని అడగడం జరిగింది.. అది నేటి కుటుంబ విలువలు.. 
ఆమె చెప్పిన ప్రకారం ఒక కుటుంబం. ఆ కుటుంబంలోని వారి ప్రవర్తన స్వల్పంగా మీకు చెప్తున్నాను.. ఇలాంటివారు కూడా వున్నారని తెలిపే ముఖ్య ఉద్దేశం మాత్రమే ఇది.. 

ఒకానొక కుటుంబం అమ్మ, నాన్న, పిల్లలు వారు కలిసి భోజనం చెయ్యరు.. మనసువిప్పి మాట్లాడుకోరు... 

తండ్రి ఏమో ఇల్లుని ఒక లాడ్జి లా భావిస్తాడు.. తల్లేమో తన ప్రపంచం ఇది కాదనే ఊహాలోకంలో వుంటుంది.. మరి పిల్లలేమో వారి దారి వారిదే... 
తండ్రి ఓ స్పోర్ట్స్ ఛానల్, తల్లేమో ఓ సీరియల్, పిల్లలేమో మొబైల్ పట్టుకొని నొక్కుకుంటూ వుంటారు.. భోజనం ప్లేట్లు ముందు పెట్టుకొని... 
ఒక శుభకార్యానికి అందరూ వెళ్తారు.. కాని ఆప్యాయంగా పలకరించేందుకు కాదు సెల్ఫి లు తీసుకునేందుకు వాటిని  అప్ లోడ్ చేసేందుకు.. 
ఇక మనం బ్రతకడమెందుకు .. వస్తువులను ప్రేమిస్తూ ప్రాణాలను వాయువులో కలిపేస్తున్నాం.. నిజాన్ని పక్కకు నెట్టి అబద్డంతో కాలక్షేపం చేస్తున్నాం.. మారుదాం.. మీరే కాదు నేను కూడా.. మార్పు మొదట మనతోనే మననుంచే రావాలి.. 

స్వస్తి  __/\__

Bobby Nani

No comments:

Post a Comment