Saturday, July 30, 2016

విటుని కౌగిట నలిగిన ఓ ఆడతనం....






“వేస్య” అనబడే ఈ స్త్రీ గురించి ఎవ్వరూ పట్టించుకోరు.. సమాజంలో ప్రతీ ఒక్కరికి ఆమె లోకువే.. కాని ఆమె ఎందుకలా రోత కూపంలోకి వెళ్లిందో చూసేవాడు చాలా అరుదు.. ఒక స్త్రీ అన్నీ తెగించి అలా పైట జార్చాలంటే ఆమె యెంత నలిగివుండాలో .. యెంత మదనపడి ఉండాలో.. !!! అవసరాల కోసం తనని తాను దహించుకుంటూ క్షణకాలపు సుఖేంద్రులకు తనని తాను అర్పిస్తూ పైకి సన్నజాజిలా నవ్వు చిందిస్తూ.. లోలోన బ్రద్దలవుతున్న అగ్ని సిఖరాగ్నిని అణిచిపెట్టి, త్ర్రోక్కిపెట్టి.. నటిస్తుంది, లాలిస్తుంది.. బిడ్డ ఆకలి కేకలు వినపడినా ఆ చీకట్లో నవ్విస్తుంది, నర్తిస్తుంది.. కళ్ళలోని నీరును ఆవిరి చేస్తూ ఆడుతోంది.. అలాంటి స్త్రీ మూర్తులను ఉద్దేశించి అక్షరనీరాజనం చెయ్యాలనిపించింది .. 

రెండు గుండెలను మాత్రమే చూసే ఓ మగాడు తనని చిదిమేస్తుంటే, ఆ గుండెల వెనుక దాగివున్న ఆవేదనను చూచి అక్షరాలుగా మలిచే మరో మగాడు ఖచ్చితంగా రచయిత అయిన, కవి అయినా అవుతాడు అని సగర్వంగా తెలియజేస్తూ.. ఇది కేవలం విపత్కర పరిస్థితులలో ఇలా మారిన స్త్రీ మూర్తులను మాత్రమే ఉద్దేశించి రాసినది.. ఒళ్ళు బలిసి కన్ను, మిన్ను తెలియక కొట్టు మిట్టాడుతున్న వారికి మాత్రం యెంత మాత్రమూ కాదని విన్నవిస్తూ ... 

విటుని కౌగిట నలిగిన ఓ ఆడతనం.... 

ఓయ్ మగాడా.. !
వింటావా ఓ నిమిషం...!
సమాజం చెక్కిన శిధిల శిల్పాల కన్నీటి గాధ..
ఈ వీధి మలుపులో, ఆ మురికి సందుల్లో...
చీకటి గదుల్లో, కామందుల కబంధ హస్తాలలో...
బండబారిన సుతిమెత్తని హృదయాల రోదన..
సృతితప్పిన జీవన రాగాలాపన.. !!

ఓ మగాడా..
ఇలా చూడు ఓ క్షణం..
కామాంధుని బుసల్లో..
బుగ్గి అయిన నా నును బుగ్గలు..
విటుని కౌగిట కాలిపోయిన నా యవ్వనం..
ఇగిరిపోయిన సోయగం..
సౌష్టవం కోల్పోయిన నా సౌందర్యం..
కార్చిన కన్నీటి వెల్లువ ..ఆ
కన్నీటి తెరల చాటున ఎన్నో, మరెన్నో.......
హృదయ విదారక దృశ్యాలు..
మల్లెలెన్ని తురిమినా పరిమళం చిందని
కుళ్ళిన మా దేహాలు..
చీకటికే బానిస అయిన
జీవచ్చవాలం ..
కామాగ్ని జ్వాలలకు ఆహుతి అవుతున్న
కోమలాంగులం ...
చితికి చేరువ అవుతున్న
నీచమైన నీలవేణులం ..
డబ్బుకు అమ్ముడు పోయిన
బజారు బొమ్మలం..
ఎవరీ దౌర్భాగ్యులు ??
సంఘం వెలివేసిన గమ్యం లేని
బాటసారులు ..
సూత్రమే లేని గాలి పటాలు..
చమురు లేని ప్రమిదలు..

ఓయ్ మగాడా వినిపిస్తోందా ...!!!
ఆశల సుడిగుండాల వలయంలో
చిక్కుకొన్న అంతులేని ఆవేదనలతో
అలమటించే అభాగినుల ఆక్రందనలు..
దాచుకునేందుకు మరేమీ మిగల్చక
సర్వం దోచుకున్న
విలాసేంద్రుల వికటాట్ట హాసాలు..
కనిపిస్తోందా ..
ఆ గాజు కళ్ళలోనుంచి తొంగి చూసే..
నిరాశా, నిస్పృహల వెల్లువ..
ఎన్నో రాత్రుల విషాద అనుభవాల క్రినీడలు...
ఉషోదయమే లేని విషాద జీవచ్చాయలు..
తోడు లేక,
నీడ లేక
ఎండిపోయిన బీడు గుండెల
జీవన సమరపు ఛాయలు ..!!!
అణువణువునా విటుని పన్ను గాట్ల గురుతులు..
కలల్లో జీవిస్తూ, మమతానురాగాలకై
కలవరిస్తూ కాలగర్భంలో కలిసిపోయే
కాగిత పూల కుసుమాలు..
దేవుని పూజకు నోచుకోని
నలిగి నేలరాలిన మల్లెల మాలికలు ..
మానవ సమాజ గ్రంధంలోని
ఆఖరి పుటల్లో సైతం చోటులేని
చరిత్ర హీనుల కన్నీటి బ్రతుకులపై
కించిత్తు సానుభూతి చూపలేవా ??
ఏకాంతం లో అయినా
ఓ వెచ్చటి కన్నీటి బొట్టు రాల్చలేవా మా కోసం ఓ మగాడా.. !!!

స్వస్తి __/\__


Bobby Nani

No comments:

Post a Comment