Wednesday, July 13, 2016

నలుగుతున్న ఆడతనం ...

ఎనిమిదేళ్ళ వయస్సులో పక్కనింటి అంకుల్ గట్టిగా బుగ్గ గిల్లాడని తల్లికి చెప్పలేకపోయింది ఓ ఆడతనం .. తల్లి కోప్పడుతుందని..
Photo Credited by : Google 
బడిలో ఓ కామ పంతుల వెకిలి చేష్టల్ని మనసులోనే అణిచివేసింది ఆ ఆడతనం.. ఇంట్లో తెలిస్తే చదువుకు ఇక సెలవంటారని ...
బజారులోని దుకాణం దారుడు, 
రోజు వెళ్ళే బస్సులోని కండెక్టర్,
ఇంటి సందు చివరన కుర్రకారు గుంపు,
ట్యూషన్ మాస్టారు కొడుకు ఇలా ఎన్నో ఎన్నెన్నో వేదింపులు..
అన్నీ అవమానాలను దిగమింగుకొని కన్నిటితోనే కలిసికట్టుగా జీవిస్తోంది..
ఈవ్ టీజింగ్ ని మునిపంట నొక్కి, ర్యాగింగ్ లకు దాసోహం చేసి,
అగ్నిగుండాల వంటి ఎన్నో సంద్రాలను దాటుకొచ్చింది ఆ ఆడతనం ...
ఉద్యోగంలో పై అధికారి దుర్భుద్ది బయటపెడితే గుట్టుగా మందలించింది... వింటే ఎవరైనా తనమీద నిందమోపుతారేమో అని భయపడి..
చివరికి భర్త క్రూరత్వాన్ని, కర్కశత్వాన్ని భరించడంలో తానింకా భూదేవి పాత్రనే ధరిస్తూ వుంది...
సహనంగానే భరిస్తోంది అతగాడి ఆగడాలను.. మౌనంగా ఆ ఆడతనం తన లోలోన కుములుతూ...
శాంతిని కోల్పోతూ, ఆరు నూరైనా సరే నుదుటి గీతను రాసే హక్కు ఎప్పటికీ మొగుడిదే అంటూ...
అతగాని ఆంక్షల లక్ష్మణ రేఖని చెరపలేనంటూ..
చెదరిన మనసుతోనే, చేజారిన ఆశతో .. ఇక బ్రతుకంటోంది.
వాని వికటాట్ట హాసాల విరుపులో ఆమె ఒక తునిగిన తునకవలె....
అదే విజయమని ఆ మగసిరి విర్రవీగితే...
అతని వెనకనున్నది మాత్రం ఆమె నల్లని నీడ మాత్రమే...!!!!

ప్రతీ వయస్సులో ఆడతనం అర్ధాంతరంగా చిదిమివేయబడుతుంది, చితికివేయబడుతుంది... తల్లిదండ్రుల భాద్యత పిల్లలను దగ్గర కూర్చోపెట్టుకొని వారి సమస్యలను తెలుసుకోవడం.. నేటి బిజీ బిజీ ప్రపంచంలో పిల్లలను హాస్టల్ లో వేస్తున్న తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారితో మనసువిప్పి మాట్లాడండి ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది...
సర్వేజనా సుఖినో భవంతుః

స్వస్తి   ___/\___

Bobby Nani

No comments:

Post a Comment