Tuesday, January 7, 2020

SOCOTRA (The Mysterious Island) from Bobby... 31st Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

మీరంతా ఇటు వెళ్ళండి.. నేను వచ్చిన దారిలోనే వెళ్ళి నా తమ్ముడిని తీసుకొని బయటకు వస్తాను అని చెప్తాడు ఆకాష్.. 

అది నువ్వు అనుకున్నంత సులువైన పని కాదు .. వచ్చిన మార్గం చాలా కష్టమైన మార్గం మరలా వెళ్ళడం అనేది బుద్దితక్కువ ప..ని దానివల్ల ప్రాణాలు పోతాయి అంటూ హెచ్చరిస్తుంది ఉవిధ.. 

నా తమ్మునికి నేను మాట ఇచ్చాను .. తిరిగి వస్తాను అని.. వెళ్ళాలి.. ఇప్పటికే ఒకరిని కోల్పోయాను అంటాడు ఆకాష్.. 

తనని వదిలెయ్యమని చెప్పట్లేదు.. మరో మార్గం గుండా వెళ్దాం అని చెప్తున్నాను .. లోకేష్ ని ఇలా భుజాన వేసుకొని ఒంటరిగా నువ్వు ఆ దారిలో వెళ్ళడం అసాధ్యమే కాదు ప్రమాదం కూడా అని వారిస్తుంది ఉవిధ… 

దానికి ఆకాష్ మౌనంగా లోకేష్ ని భుజానికి ఎత్తుకొని వారివెనుకనే నడవడం మొదలు పెట్టాడు..

తరువాత ఏంటో చూద్దాం పదండి..
31st Part
ఎలాగోలా అందరూ క్షేమంగా బయటకు వెళ్ళి చేరుకుంటారు.. అందరినీ ఆ అఘోరా ఉన్నటువంటి నేలమాళిగకు తీసుకొచ్చారు.. ఆకాష్ కూడా అక్కడకు వచ్చి తన భుజాలపై వున్న లోకేష్ ని కింద పడుకోబెట్టి తను మళ్ళి వెనక్కు వెళ్తుండగా.. 

నేనూ నీతో వస్తాను అంటుంది ఉవిధ.. 

లేదు మీరు ఇక్కడ వుండాలి.. వీరందరికీ ఆహారం అందించి మీరు వీరిని జాగ్రత్తగా చూసుకోండి.. నేను వెళ్ళి నా తమ్ముడను తీసుకొస్తాను అంటూ వెళ్ళాడు ఆకాష్.. 

చాలా వేగంగా వెళ్ళి సంతోష్ ని కలుసుకుంటాడు.. జరిగిన విషయాన్ని సంతోష్ కి వివరిస్తాడు ఆకాష్.. 

తను అక్కడే కుప్పకూలి గుండెలు అలిసేలా ఏడుస్తాడు..

ఆ శబ్దానికి అక్కడ పనిచేసే సిబ్బంది కొందరు వచ్చి ఇద్దరినీ బంధించి ఆ కన్నీళ్ళ గదివద్దకు తీసుకువెళ్ళారు ..

ఆ ప్రక్కన గదిలోనే ప్రసన్నకుమార్ భాటియా, మోహన్ లు దాక్కొని వున్నారు..!!

తరువాత మూడవ బృందమైన అమ్మాయి, జలకూన, నౌకలోని చిన్న పిల్లాడు.. అందరూ కలిసి ఆ చీకటి వేళ జలకూన సాయంతో చంద్రిక కొలను దగ్గరకు చేరుకున్నారు…

అక్కా ఇదేనా అందరూ అంటున్న ఆ చంద్రిక కొలను అంటాడు ఆ పిల్లాడు.. 


అవును ఇదే అని సమాధానమిస్తుంది ఆ అమ్మాయి.. 

మీరు అందరూ చెప్పినదానికన్నా ఈ ప్రదేశం ఎంతో అద్బుతంగా వుంది.. ముఖ్యంగా ఆ నీరు లేత నీలం రంగులో ఇంకా ఇంకా అద్బుతంగా వుంది.. అంటాడు ఆ పిల్లాడు.. 

సరే మీరు మాట్లాడుకుంటూ చుట్టూ గమనిస్తూ వుండండి నేను లోపలకు వెళ్ళి వస్తాను అని చెప్తుంది జలకూన.. 

అలాగే అంటారు ఇద్దరూ.. !

తన తల్లి ఆత్మాశి (మత్స్యక) ప్రాణాలు విడిచిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ కోపంగా, బాధగా చాలా వేగంగా లోపలకు వెళ్తుంది జలకూన .. లోపలకు వెళ్ళే కొద్ది తనలో ఎన్నో ఆలోచనలు, మరెన్నో భయాలు..మెదుల్తూ.. ప్రళయానికిముందు ఏర్పడే భీకర సముద్ర కెరటాల్లా నిలకడ లేకుండా వుంది తన మానసికస్థితి.. 

లోపలకు వెళ్ళేకొద్దీ తన గుండె భారమైపోతుంది.. ఎందుకిలా నన్ను నేను నియంత్రించుకోలేక పోతున్నాను అని తనలో తానే అనుకుంటూ..ముందుకు కదలసాగింది.. ఈ చంద్రిక కొలను లోని నీరు నాలోని భావాలను, జ్ఞాపకాలను ప్రేరేపిస్తున్నాయి..నాలోని శక్తిని హరిస్తున్నాయి… నా వల్ల కావట్లేదు.. ముందుకు వెళ్ళలేకపోతున్నాను… అని అనుకుంటూ తాను అక్కడే ఆగిపోయింది.. 

కొన్ని క్షణాలు తనలో మౌనం..భయం వల్ల గట్టిగా కళ్ళుమూసుకుంది.. 


అంతా నిశ్శబ్దం ఆవరించిన వేళ తన చేతులు రెండూ చాచి తన తల్లిని తలుచుకుంది..

కొన్ని నిమిషాలు అలానే ఉండిపోయి కళ్ళు తెరిచింది.. తన కళ్ళు నీలం రంగులో మారిపోయాయి.. తనలోకి ఏదో నూతన శక్తి ప్రవహించినట్లు తాను గ్రహిస్తుంది.. తన చేతులు ప్రకాశవంతముగా మెరుస్తున్నాయి..తనలోని ఆలోచనలు, భయాలు అన్నీ తొలగిపోయాయి.. తన కాళ్ళ దగ్గర గల తోక భాగం చాలా దృఢంగా పెద్దదిగా మారింది.. తనని తాను జయించింది.. తానో పరిపూర్ణ మత్స్యకలా మారింది.. ఇక అక్కడ నుంచి శబ్దం కన్నా వేగంగా ఆ రెండు శ్వేత మీనాల వద్దకు వెళ్ళి ధైర్యంగా నిల్చుంది.. చంద్రిక కొలను లోకి రాబోయేముందు ఆ అమ్మాయి దగ్గర తీసుకున్న తాబేలు హారాన్ని ఆ ప్రకాశవంతమైన ఆకుపచ్చని వలయంలో అమర్చగానే తన తల్లి జ్ఞాపకాలు, తన పూర్వీకుల జ్ఞాపకాలు వారి శక్తి, సామర్ధ్యాలు, అన్నీ తనలోకి ప్రవేశించాయి.. తాను ఒక్కసారిగా గగుర్పాటుకు గురై తన్మయత్వంతో కనురెప్పలు రెండూ మూసివేసి కొన్ని క్షణాలు అలానే ఉండిపోతుంది.. తన తల్లి ఎలా చనిపోయిందో, తన పూర్వీకులు ఎలా చనిపోయారో తదితర విషయాలన్నీ తనకు ఓ దృశ్య రూపంగా కనిపిస్తాయి.. అలానే తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను తనకు తెలియజేస్తాయి..!!

ఇక ఆ వలయం లోపలకు వెళ్ళి ఆ శ్వేత మీనాలకు సాదరంగా తన రెండు చేతులను అందిస్తుంది.. తాను చంద్రుని వెలుగులతో ఇంకా ఇంకా ప్రకాశించిపోయింది.. ఆ దృశ్యం చూడటానికి అత్యంత సుందరభరితముగ, మనోరంజనముగా వుంది.. !! 

నిన్ను చూడటం చాలా ఆనందంగా వుంది అన్నట్లు ఆ రెండు మీనాలు తనతో మాట్లాడటం తాను గ్రహిస్తుంది… 

ఆశ్చర్యముగా తాను ఆ రెండు మీనాలనే చూస్తూ ఉండగా.. 


నువ్వు గ్రహించింది నిజమే మేము నీతోనే మాట్లాడుతున్నాము.. నువ్వు మాకు ప్రతిస్పందనగా నీ మనస్సులోని భావాన్ని తలుచుకుంటే చాలు మాకు అర్థమవుతుందని అంటాయి ఆ రెండు మీనాలు.. మన ఈ కరబంధము ద్వారా ముగ్గురి ఆలోచనా విధానము ఏకమౌతుంది.. తద్వారా మనలో ఎవరి మనస్సు అయినా తెరిచిన పుస్తకములా మారుతుందని అంటాయి ఆ రెండు మీనాలు… 

ఇకపోతే నీ తల్లి నీకు కొన్ని విషయాలను చెప్పాలనుకుంది… వాటిని వినే స్థాయి నీకు వచ్చింది... చెప్పే సమయమూ ప్రస్తుతము ఆసన్నమైంది. అంటాయి ఆ రెండు మీనాలు…

నీ తల్లి నీకు ఎంతో ఇష్టంగా పెట్టాలనుకున్న పేరు "మీననేత్రి" …!! 

అంతే కాదు.. తాను నీకు ఎన్నో చెప్పాలనుకుంది..మరెన్నో నేర్పాలనుకుంది .. కానీ తాను ఒకటి తలిస్తే కాలం మరోటి తలచింది.. దాని పర్యవసానమే నువ్వు ఇంత ఆలస్యంగా ఇక్కడకు రావడం.. నీ బాధ్యత ఏంటో ఇప్పుడు నీకు తెలిసింది కదా..

చెప్పు.. ఎవరి ప్రమేయము లేకుండా ఏ బాధ్యత మీద ఇక్కడకు వచ్చావు ? అడుగుతాయి ఆ రెండు మీనాలు.. 

మిమ్మల్ని లోబరుచుకోవడానికి కొందరు ఇక్కడకు వస్తున్నారు.. వారిదగ్గర రెండు జాతుల స్త్రీ ల కన్నీరు కూడా వుంది.. అది కూడా చాలా అధిక మొత్తంలో.. ఆ కన్నీళ్ళు మిమ్మల్ని తాకగానే మీరు వారికి లొంగిపోతారు .. 

మీరు లొంగితే ఈ ప్రపంచపు స్వరూపాలనే మార్చేయ్యగలరు.. దాన్ని మనం ఎలా అయినా ఆపాలి … నాకు సహాయం చెయ్యండి.. అడుగుతుంది మీననేత్రి.. !!

నీ శక్తి ఏంటో నీకు తెలియట్లేదు.. నిన్ను దాటి ఎవరూ రాలేరు.. ముందు నీ శక్తిని నీవు గ్రహించు అంటాయి రెండు మీనాలు.. 

ఈ సముద్రాలను నియంత్రించి వాటిపై ఆదిపత్యం సాధించాలని ఎన్నో శతాబ్దాల నుంచి ఎందరో ప్రయత్నించారు.. ప్రయత్నిస్తూనే వున్నారు.. మీ సంతతి వారే ఆది నుంచి నేటి వరకు మమ్మల్ని సంరక్షిస్తూ వస్తున్నారు.. దానివల్ల మాకు ఎలాంటి చింత లేదు.. ప్రస్తుతం నీవు పరిపూర్ణమైన మత్స్యక లా మారావు.. అంటాయి రెండు మీనాలు.. 

మీ సహాయం కోసం నేను వస్తే.. మీరేమో నన్నే మీ ధైర్యంగా చెప్తున్నారు ఏంటి ? అడుగుతుంది మీననేత్రి.. 

మేమే కాదు సముద్రాన్ని నియంత్రించే శక్తి నీలోను వుంది.. దానివల్లనే ప్రతీ జీవి నీ మాటకు కట్టుబడివుంటుంది.. నువ్వేం చెప్పినా అవి చేస్తాయి.. నీవు సాయం చెయ్యమని పిలిస్తే సముద్రమే నీ వెనుక నిలుస్తుంది.. జీవం ఏర్పడాలంటే ఏడు ధాతువులు చాలా ముఖ్యంగా వుండాలి…అవి 

1. రసము, 
2. రక్తము, 
3. మాంసము, 
4. మేదస్సు, 
5. అస్థి, 
6. మజ్జ,
7. శుక్రము 

ఈ  ఏడు  ధాతువులను మేము నియంత్రించగలము..కానీ ఎవరికీ తెలియని అత్యంత రహస్యాన్ని ఇప్పుడు మేము నీకు చెప్తున్నాము ఆలకించు అంటాయి ఆ రెండు మీనాలు..


To be continued …
Written by : BOBBY

No comments:

Post a Comment