Wednesday, December 18, 2019

SOCOTRA (The Mysterious Island) from Bobby... 30th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

ఏమైంది ?? ఎందుకు ఏడుస్తున్నారు ??అంటూ ఆకాష్ … 

ఇది ఏడుపు కాదు… నా అనుకున్న వాళ్ళు ఇంకా సజీవంగానే ఉన్నారు.. వాళ్లను నేను వెంటనే చూడాలి వాళ్ల దగ్గరికి నేను వెంటనే వెళ్ళాలి అంటుంది ఉవిధ..

అసలు వారు ఎక్కడున్నారు ?? 

ఎక్కడి నుంచి వారి మాటలు మనకు వినపడుతున్నాయి? అడుగుతాడు ఆకాష్…

తరువాత ఏంటో చూద్దాం పదండి..
30th Part
వారు మనకి కొద్ది దూరంలోనే ఉన్నారు… అప్పటి వారి మేధోసంపత్తికి ఈ కట్టడం ఒక తార్కాణం .. కొన్ని గజాల దూరంలో నుంచే ఆ గదిలో మాట్లాడే మాటలను ఇక్కడ నిలబడి రహస్యంగా వినగలిగేలా దీన్ని ఏర్పాటు చేశారు... ఇది శబ్దశాస్త్రం లోని ఓ ముఖ్యమైన ఘట్టం… ఇది కూడా భారతీయ సంస్కృతి లోని ఒక భాగమే.. అంటుంది ఉవిధ..

ఇక్కడి కట్టడాలు నిర్మాణాలు చాలావరకు భారతీయ సంస్కృతికి చిహ్నాలు గానే ఉన్నాయి… మీ గ్రంధాలలోని మర్మాలను, అత్యంత రహస్యమైన విషయాలను ఎన్నింటినో ఇక్కడ ఉపయోగించారు… వీరు దొంగిలించింది కేవలం మీ యొక్క గ్రంథాలని మాత్రమే కాదు మీ పూర్వీకుల అపారమైన మేధోసంపత్తిని వాటి అనుభవాలను కూడా…

నా వాళ్ళు ఎంతమంది సజీవంగా వున్నారో నాకు తెలియట్లేదు.. కానీ ఈ గొంతులు విన్నాక కొందరైనా బ్రతికి వున్నారని అర్ధం అయింది.. ఇక మనం ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరాలి అంటూ ముందుకు వేగంగా కదుల్తుంది ఉవిధ.. 


ముందుకు వెళ్లేకొద్ది .. ఎన్నో ఏళ్ళ సంవత్సరముల క్రితం నేల మీద రాళ్ళు ఒకటి తరువాత మరొకటి పేర్చినట్లు కనిపిస్తుంది.. ఆ రాళ్ళు చాలా చల్లగా వున్నట్లు కాళ్ళకు అనిపిస్తుంది.. ఆ రాళ్ల మధ్యలో కాస్త గడ్డి మొలిచి నడిచేందుకు అనువుగా వుంది.

అలానే వెళ్తూనే వున్నారు.. ఆ దారి కిందకు వెళ్తున్నట్లుగా కాస్త పల్లముతో కూడుకొని వుంది.. దానివల్ల వారు మెల్లిగా వెళ్దాం అనుకున్నా.. వారి పాదాలు అందుకు సహకరించడం లేదు.. ఆ ముగ్గురూ చాలా వేగంగా ముందుకు కదుల్తున్నారు.. ఆ మార్గం పాతాళానికి వెళ్తున్నట్లుగా వారు భావిస్తారు.. 

వెళ్ళేకొద్దీ ఇంకా ఇంకా పల్లముతో ఆ నేలమారుతోంది... వేసే ప్రతీ అడుగు చాలా జాగ్రత్తగా వేస్తూ ముందుకు కదుల్తున్నారు ముగ్గురూ.. 

అంతలోనే ఉవిధ కంటే ముందుగా లోకేష్ అనుకోకుండా వేగంగా ముందుకు వెళ్తుండగా.. వెనుక నుంచి ఉవిధ తనని వారించేలోగా కుడిచేతిప్రక్క గోడలోంచి కొన్ని టన్నుల బరువున్న ఓ బలమైన రాయి తనని ఎడమవైపు గోడకు బలంగా అదుముతుంది .. తను అక్కడకు అక్కడే పడిపోతాడు.. వెనుక వచ్చే ఆకాష్, ఉవిధ లు ఆ రాయిని తప్పించుకొని లోకేష్ ను పక్కకు తీసుకొచ్చారు.. ఆకాష్ కళ్ళలో నీళ్ళు ..!! 

లోకీ.. లోకీ అంటూఏడ్చే ఆకాష్ రోధనకు ఆ ప్రదేశమంతా దుఃఖసాగరమై పోయింది స్తబ్దుగా .. 

కఠినమైన హృదయముగల (యక్షామి) ఉవిధ.. కూడా కన్నీటిపర్యంతమై లోకేష్ ని చూస్తూ తనలో తాను బాధపడుతూ అలానే ఉండిపోయింది…

తన సోదరుడైన లోకేష్ ను .. ఆకాష్ తన బాహువులపై వేసుకొని కన్నీరు కారుస్తూనే ముందుకు కదిలాడు..

అక్కడ ఓ విశాలమైన గది… ఆ గదిలో ఉక్కు సంకెళ్ళతో బంధించిన స్త్రీ లు కొందరు వున్నారు..



ఆ ప్రదేశమంతా భరించలేని దుర్గంధముతో నిండివుంది.. నెలల తరబడి అక్కడి వారికి సరైన ఆహారం, నీటి వసతి లేనందువల్ల అడుగు తీసి అడుగు వేసేందుకు వీలు లేకుండా ఆ ప్రదేశమంతా నరకంలా మారివుంది.. 

వారి చేతికి, కాళ్ళకు వేసిన ఉక్కుసంకెళ్ళ వల్ల ఆ సంకెళ్ళు వేసిన ప్రాంతమంతా పుండు అయిపోయి ఆ సంకెళ్ళపై నెత్తుటి మరకలు చారలు చారలుగా కారి కనిపిస్తున్నాయి.. నేల అంతా వారి గాయాలనుంచి కారిన రసి తో అత్యంత జుగుప్సాకరముగా వుంది.. 

కానీ ఆ స్త్రీల నిస్సహాయతను, వారి స్థితి ని చూసి ఇద్దరికీ నోట మాట రాకుండా జాలిగా చూస్తూ ఉండిపోయారు అలానే.. 

ఆకాష్ తన బాహువులపై నుంచి తన సోదరుడిని మెల్లిగా కిందకు దించి ఏడుస్తూనే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.. కానీ ఎలాంటి ప్రయోజనమూ లేదు.. లోకేష్ గుండెపై తన చెవి పెట్టి చూడగా తను మరణించినట్లు ఆకాష్ గ్రహిస్తాడు.. బిగ్గరగా రోధిస్తూ పక్కనే వున్న గోడను తన పిడికెళ్ళతో కోపంగా కొడుతూ వున్నాడు ఆకాష్.. 

తన పిడికెళ్ళ నుంచి రక్తం కారుతున్నా తాను అలానే కొడుతూ వుండగా.. ఉవిధ వెళ్ళి తన చేతిని గట్టిగా పట్టుకుంది.. 

ఎందుకు ఆపుతున్నారు నన్ను.. కన్నీరు కారుతూ ఎర్రబడిన తన కళ్ళను పెద్దవి చేసి కోపంగా అడుగుతాడు ఆకాష్.. 

రౌద్రముగా మారిన ఆకాష్ కళ్ళను చూసి ఒకింత వొణుకుపాటుకు గురై భయపడుతూనే .. 

ఆకాష్ .. !! నీ కన్నీళ్ళను నీ బాధను నేను గ్రహించగలుగుతున్నాను.. కానీ తాను మరణించి చాలాసేపు అయింది..ఆ విషయం నాకు ముందే తెలుసు.. కానీ నీకు చెప్పలేక అలా మౌనంగా ఉండిపోయాను.. అఘోరా చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకో.. 

తన కాలం ఇక్కడితో ముగిసిపోయింది.. 

గతించిన కాలాన్ని వెనక్కు తీసుకురాలేవు.. ఒక్కసారి నీ ముందువున్న వారిని చూడు.. వారి కన్నీళ్ళను, వారి పరిస్థితిని చూడు.. నువ్వు దేనికోసమైతే ఇంతదూరం ప్రయాస పడి వచ్చావో అది నీ ముందే వుంది.. ఇప్పుడు నువ్వు ఇలా ఏడుస్తూ, బాధపడుతూ కూర్చుంటే మనమూ ఇక్కడ బంధీలుగా మారిపోతాము.. ప్రస్తుతం మనకు సమయం లేదు.. అడుగు దూరంలో గమ్యాన్ని పెట్టుకొని నువ్వు ఇలా నిరుత్సాహ పడితే నీ సోదరుని మరణానికి అర్ధమే లేకుండా పోతుంది.. ఒక్కసారి సావధానంగా ఆలోచించు.. అంటుంది ఉవిధ.. 

నా తండ్రికి, నా మిగతా సోదరులకు నేనేమని సమాధానం చెప్పాలి .. ?? 

తన రక్షణ నాదంటూ వాడికి నేను మాట ఇచ్చాను..కానీ రక్షించుకోలేక పోయాను.. కళ్ళముందే .. నా కళ్ళముందే నా సోదరుడు నిర్జీవుడై పోయాడు.. ఈ ఆలోచన నాకు నరకం కన్నా బాధిస్తుంది… ఈ బాధకు మరణమే నాకు సరైన మందు అంటూ.. రోధిస్తాడు ఆకాష్.. !!

ఆకాష్ నా మాట విను..ప్రమాదం ముంచుకొస్తుంది.. ఎక్కువసేపు మనం ఇక్కడ వుండకూడదు.. మనవల్ల ఇక్కడవారికి మరింత ప్రాణాంతకం అవుతుంది.. 

లే.. ముందు లే ఇక్కడ నుంచి అంటూ ఆకాష్ చేతిని పట్టుకొని బలవంతంగా పైకి ఎత్తుతుంది.. 

తన ఆంతర్యాన్ని అర్ధం చేసుకున్న ఆకాష్ పైకి లేచి తన తమ్ముడను కాసేపు అలానే చూసుకొని.. కళ్ళు తుడుచుకుని.. ఆ స్త్రీల వైపుకు కదిలాడు.. ఉవిధ తెచ్చిన ఓ పరికరముతో ఇద్దరూ చాలా వేగంగా అక్కడ ఉన్నవారి అందరి సంకెళ్ళు విప్పుతారు.. మీరు నడవగలరా అంటూ ఉవిధ వారి బాషలో అడుగుతూ అందరినీ పలకరిస్తుంది.. దానికి అందరూ భయం భయంగా పొడి పొడి సమాధానాలు ఇస్తారు.. ఇక్కడ నుంచి మరో దారి ఏమైనా ఉందా అంటూ అందరికీ అడుగుతుంది ఉవిధ.. 

కొందరు మౌనంగా వుంటే మరికొందరు అటువైపు అని వారు వచ్చిన మార్గాన్నే చూపించారు.. అది కాకుండా మరో మార్గం ఉందా అని అడుగుతుంది ఉవిధ.. 

ఒక్కరు మాత్రం తన చూపుడు వేలును వెనుకభాగానికి చూపిస్తుంది.. ముందు నేను వెళ్ళి చూస్తాను అని ఆ వైపుగా పరుగెడుతూ వెళ్తుంది ఉవిధ.. 


కాసేపటి తరువాత తిరిగి వచ్చి ఇది సురక్షిత మార్గంలా అనిపిస్తుంది వెళ్దాం పదండి అంటూ పిలుస్తుంది అందరినీ.. 

మీరంతా ఇటు వెళ్ళండి.. నేను వచ్చిన దారిలోనే వెళ్ళి నా తమ్ముడిని తీసుకొని బయటకు వస్తాను అని చెప్తాడు ఆకాష్.. 

అది నువ్వు అనుకున్నంత సులువైన పని కాదు .. వచ్చిన మార్గం చాలా కష్టమైన మార్గం మరలా వెళ్ళడం అనేది బుద్దితక్కువ ప..ని దానివల్ల ప్రాణాలు పోతాయి అంటూ హెచ్చరిస్తుంది ఉవిధ.. 

నా తమ్మునికి నేను మాట ఇచ్చాను .. తిరిగి వస్తాను అని.. వెళ్ళాలి.. ఇప్పటికే ఒకరిని కోల్పోయాను అంటాడు ఆకాష్.. 

తనని వదిలెయ్యమని చెప్పట్లేదు.. మరో మార్గం గుండా వెళ్దాం అని చెప్తున్నాను .. లోకేష్ ని ఇలా భుజాన వేసుకొని ఒంటరిగా నువ్వు ఆ దారిలో వెళ్ళడం అసాధ్యమే కాదు ప్రమాదం కూడా అని వారిస్తుంది ఉవిధ… 

దానికి ఆకాష్ మౌనంగా లోకేష్ ని భుజానికి ఎత్తుకొని వారివెనుకనే నడవడం మొదలు పెట్టాడు..


To be continued …
Written by : BOBBY

No comments:

Post a Comment