Wednesday, January 22, 2020

హంసయాన


SOCOTRA కథ వల్ల చాలా రోజులైందబ్బా ఓ ఘాటైన కవిత్వం వ్రాసి.. ఇక అది అయిపోయిందిగా.. గాండీవమువల్లె నడుమును వంచి, అక్షరములను మన్మధ శరములుగా మలిచి, సంధిస్తున్నానిదిగో “హంసయాన” ను. అభిప్రాయాలు వెలిబుచ్చాలి మరి.. 
తన ప్రేయసి ఎంత రమణీయమైనదో, ఎంతటి సాత్వికగుణవిలక్షిణి యో వర్ణిస్తూ మనకు తెల్పే ప్రయత్నం ఎలా చేస్తున్నాడో చూడండి ఆ భావకుడు..

హంసయాన 
*********

ఓ రమణీ
నీ కాంతి తీరాల కలల వెంబడి నిత్యం 
నిశీధములోకి పయనించే చైత్రసారథిని నేను..!!


నిశ్శబ్దంలో ఆరిపోయిన వేవేల గొంతుకలు
క్షణకాల నీ సమ్మోహన వీక్షణముతో 
వసంత కోయిలలై సప్తగమకములు పలికెనే.. !!

ఓ ప్రేయసీ ..!!
ఏమాట కామాటేనే
నీలోని సాత్విక సౌష్టవములు జూచి 
నా మానస ప్రవృత్తి 
కందళ తాళ ఆనంద నాదములతో మున్గి తేలుతూ 
చతుర్ధావస్థతో ప్రతిధ్వనులు గావిస్తున్నాయి.. !!

ఏమా సొబగులు !
ఏమా చెలువులు !
పురివిప్పిన మధుమాస చైతన్యం 
నీలో దాగున్న నవ యౌవనం,
ఆ లేలేత బాహువులే తామరతూళ్ళు, 
లక్ష్మికళ ఉట్టిపడే ఆ పసిడి మోమే విలువైన కమల సంపదలు 
నీలోని ఆ యౌవనపు కాంతులే 
శృంగార లీలా విలాసాల శీతల జలపాతాలు
చంచలాలైన సోగ కన్నులే బేడిస చేప కైంకర్యములు 
వట్రువలైన స్తనాలే రథాంగ చక్రవాకములు.
ముచ్చటగొలిపే నీ వాలు జడ అందాల శైవాలము..!!

లావణ్య విలాసాలు గల సచేతనమైన పరిపూర్ణ స్త్రీ తత్వాన్ని 
అయిదే ఐదు అడుగులలో అణువణువున రూపొందించాడా బ్రహ్మ.. 
మతుండే చేసాడంటావా..!!
లేక మత్తెక్కి చేసాడంటావా..!!
వేళాకోళమాడే మరదలు పిల్ల వలె 
గాఢ నిద్రలో వున్న నా చెవిదగ్గరకొచ్చి 
కొక్కొరోకోయి మంటూ చిలిపిగా పిలిచి పోతుంటావు .. 
కన్నులముందుకొచ్చి ఓ సారి కనువిందు చేయవే..
కన్నులు మూసేవరకు పదిలపరుచుకుంటాను.. !!

Written by: Bobby Nani

1 comment:

  1. చతుర్ధావస్థ, బేడిస చేప కైంకర్యములు - ఏమి పద ప్రయోగం చేశావు బాబీ. వేసుకో రెండు వీర తాళ్ళు.

    గాఢ నిద్రలో వున్న నా చెవిదగ్గరకొచ్చి
    కొక్కొరోకోయి మంటూ చిలిపిగా పిలిచి పోతుంటావు - ప్రేయసి కోడి గొంతుకతో నిన్ను మేల్కొలపడానికి రావడం. ఆహా ఇదొక విచిత్ర కైంకర్యం.

    ReplyDelete