Wednesday, January 8, 2020

SOCOTRA (The Mysterious Island) from Bobby... 32nd Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

ఈ  ఏడు  ధాతువులను మేము నియంత్రించగలము..కానీ ఎవరికీ తెలియని అత్యంత రహస్యాన్ని ఇప్పుడు మేము నీకు చెప్తున్నాము ఆలకించు అంటాయి ఆ రెండు మీనాలు..

తరువాత ఏంటో చూద్దాం పదండి..
32nd Part
ఇందాక చెప్పిన ఆ ఏడు ధాతువులు స్వతహాగా నీలోనే వున్నాయి.. ఆ శక్తి నీలోనే ఇమిడీకృతమై వుంది.. 

నువ్వు గమనించావా ?? నీ తల్లి చనిపోయిందని తెలిసినా, నిను పెంచి పెద్ద చేసిన వాసుర నీ కళ్ళముందు మరణించినా నీ కంటినుంచి ఒకే ఒక్క కన్నీటి బిందువు కూడా రాలేదు.. ఆ కన్నీరు నీలో కలిగే భావాలకు బయటకు రావు.. నువ్వు వాటిని అదుపు చెయ్యగలవు.. నువ్వు అనుకున్నప్పుడు మాత్రమే అవి బయటకు వస్తాయి.. ఈ ప్రపంచాన్ని ముంచేంత శక్తి నీ కన్నీళ్ళకు వుంది.. ఇప్పటికైనా నువ్వేంటో తెలుసుకో .. ఈ సముద్రానికి శక్తివీ నీవే.. అశక్తివీ నీవే ఎటు వెళ్ళాలి అనేది నీ చేతుల్లోనే వుంది .. అంటాయి ఆ రెండు మీనాలు.. !! 


ఆ రెండు మీనాలు చెప్పిన మాటలు విన్నాక తనలో ఎన్నో ప్రకంపనలు మనసులో ఎన్నెన్నో అలజడులు.. 

అలా ఆలోచిస్తూనే మెల్లగా పైకి చేరుకుంది.. 

ఆ అమ్మాయి మరియు పిల్లాడు తనని చూచి ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.. దానికి కారణం ఆ మీననేత్రి (జలకూన) ముఖములో, శరీరంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.. కళ్ళు నీలంగా మారిపోయాయి.. శరీరం వెన్నెలలా పొలుసులు పొలుసులుగా మెరిసిపోతోంది.. తన కేశాలు తనకన్నా చాలా పొడవుగా, వొత్తుగా పెరిగిపోయాయి.. 



ఏమైంది ? ఎందుకిలా అయిపోయావు ? అని అడిగింది ఆ అమ్మాయి.. 

కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది మీననేత్రి.. 

నిన్నే అడిగేది .. ఏం జరిగింది ?? సమాధానం చెప్పు .. అని గదమాయించి అడుగుతుంది ఆ అమ్మాయి.. 

ముందు ఈ హారం తీసుకో అంటూ ఆ తాబేలు హారాన్ని తన చేతికి ఇచ్చి .. 

నా పేరు మీననేత్రి అంటూ నీళ్ళ లోపల జరిగిన వారి సంభాషణలన్నీ చెప్తుంది… 

మరి నీ శక్తిని నువ్వు గ్రహించడం ఎలా ? అని అడుగుతుంది ఆ అమ్మాయి.. 

అదే నాకు అర్ధం కావట్లేదు అంటుంది మీననేత్రి.. 

నాకు తెలియకుండానే నాలో చాలా మార్పులు వచ్చాయి.. అదేనేమో నా శక్తిని నేను గ్రహించడం అంటే అంటుంది మీననేత్రి.. 

మరి ఇంతకుముందు నీలో కలిగిన అవే భావాలను నువ్వు మళ్ళి గుర్తుచేసుకుని ప్రయత్నించు .. మళ్ళి నీకు ఏమన్నా తెలుస్తాయేమో అంటుంది ఆ అమ్మాయి.. 

అవును మంచి ఆలోచన … అని అనుకునే లోపే దూరంనుంచి సముద్రంలో ఓ పెద్ద నౌక హారన్ వినపడుతూ వుంది.. 


ఆ అమ్మాయి, పిల్లాడు ఆ చంద్రిక కొలను నుంచి దట్టమైన అడవిని దాటుకొని, పరిగెత్తుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్ళి చూడగానే దూరాన సముద్రంలో కన్నీటి బిందువు ఆకారం గల జెండా రెపరెప లాడుతూ పెద్ద నౌక ఒకటి వీరి వైపుగా రావడం గమనిస్తారు ఇద్దరూ .. 

వెంటనే వెనక్కు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విషయాన్ని మీననేత్రి (జలకూన) కి చెప్పారు.. 

నాకు భయంగా వుంది.. నేను ఏమీ చెయ్యలేను.. దయచేసి నన్ను క్షమించండి అంటూ .. తను నీళ్ళ లోపలకు వెళ్ళిపోయింది.. 

ఆ అమ్మాయికి పిల్లాడికి ఏమి అర్ధం కాక దిగులుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.. 

కాసేపటికి నౌక దగ్గరకు వచ్చిన చప్పుడు వినపడింది.. 

ఆకాశం అంతా ఆ నౌక వదిలిన నల్లని పొగతో కారుమబ్బులా మారిపోయింది.. 


ఇద్దరికీ భయంతో గుండెలు జారిపోయాయి.. ఆ నౌక ఆగినా కూడా పదే పదే ఆ హారన్ మోగిస్తూ వుంది… 

అది వినపడ్డ ప్రతీసారి ఇద్దరూ ఉలిక్కి, ఉలిక్కిపడుతూ వణికిపోతున్నారు.. 

గుండెలను గుప్పిట పెట్టుకొని ఆ చంద్రిక కొలనుకు కాస్త దూరంగా భయం భయంగా పొదలమాటున దాక్కొని వున్నారు.. 

ఆ నౌక ఒక మైలు దూరంలోనే ఆగివుంది..అందులోనుంచి పడవల ద్వారా కొందరు చంద్రిక కొలను దగ్గరకు చేరుకున్నారు.. వారి సంఖ్య చాలా ఎక్కువగా వుంది.. వారి అందరి చేతుల్లో కన్నీటి గాజు సీసాలు వున్నాయి.. ఒక్కొక్కరుగా వెళ్ళి అన్నింటినీ మోసుకొచ్చి ఆ చంద్రిక కొలను చుట్టూ పెడుతున్నారు.. 

ఇంతలో కొందరు విదేశీయులు వచ్చి నిల్చున్నారు.. వారిలో ఆడవారు కూడా ఇద్దరు వున్నారు.. మరో ఇద్దరు డోలీ వంటి పరికరములో ఓ వృద్ధ విదేశీయున్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు.. ఆ వెనుకగానే కొందరు శాస్త్రవేత్తలు, మరికొంతమంది వ్యక్తులు వచ్చారు.. వారి చేతిలో గాజుతో చేసిన డబ్బావంటి పరికరము వుంది.. మరో పడవలో చేతులను వెనుకగా పెట్టి కొందరిని కట్టేసి వున్నారు.. వారందరినీ ఆ కొలను దగ్గరకు తీసుకొచ్చారు.. వారిని చూడగానే ఆ పొదలమాటున దాక్కొని వున్న ఆ అమ్మాయి బిగ్గరగా ఏడుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చింది.. 

వారిలో ఆకాష్, సంతోష్, లు కూడా వున్నారు.. ఆకాష్ కి వీపు భాగాన కొరడా గుర్తులతో దేహం చిట్లి నెత్తురు కారుతూ వుంది.. సంతోష్ కి మాత్రం చిన్న చిన్న గాయాలు కలిగి వున్నాయి.. వెంటనే ఆ అమ్మాయిని కూడా బంధించి చేతులు కట్టేశారు.. 

ఇక మొదలు పెట్టండి అంటూ ఇంగ్లీష్ లో అరుస్తాడు ఆ విదేశీయులలో ఒకరు.. 

ఆ విదేశీయుడు చెప్పి చెప్పగానే బలమైన అయిదుగురు మనుషులు ఒక ఉక్కు యంత్రాన్ని భారంగా నెట్టుకుంటూ వస్తున్నారు.. ఆ యంత్రానికి చాలా పొడవాటి గొలుసు వుంది.. ఆ గొలుసుకు ముందుభాగంలో ఒక మనిషి మునిగేంత పాత్ర వంటి ఆకారం వుంది.. 

ఇద్దరు ఇద్దరుగా వెళ్ళి రెండు వేరు వేరు రకాల కన్నీళ్ళను ఆ పాత్రలో నిండా నింపారు.. మరో ఇద్దరు ఆక్సిజన్ దుస్తులు వేసుకొని చంద్రిక కొలనులో దిగి సిద్దంగా వున్నారు.. తదుపరి ఆ పాత్రలో ఒక రసాయనం వెయ్యగానే అవి చిక్కగా రంగు మారిపోయాయి.... వెంటనే వాటిని ఆ యంత్రం, గొలుసు సాయంతో మెల్లిగా చంద్రిక కొలనులోకి దించుతారు.. ఆ పాత్రతోటి ఆక్సిజన్ దుస్తులు వేసుకున్న యువకులు ఇద్దరూ రెండు మీనాలవైపుగా ఆ పాత్రను తీసుకువెళ్ళారు…!!

ఆ రసాయనం వెయ్యడం మూలంగా కన్నీళ్ళు నీళ్ళలో కలవకుండా కొంతసేపు ఆపేందుకు అది దోహదపదుతుంది.. ఆ మీనాలకు సమీపమునకు చేరుకున్నాక ఆ కన్నీళ్ళు మళ్ళి యధాస్థానానికి వచ్చి మీనాలు వున్న నీటిలో కలిసిపోతాయి.. అవి ఎంత ఎక్కువ కలిస్తే అంతలా ఆ ఆకుపచ్చని వలయం నిర్వీర్యం కాబడి ఆ రెండు మీనాలు బయటకు వచ్చి స్పృహ కోల్పోగలవు.. అప్పుడు వాటిని సునాయాసంగా వీరు బంధించి తమకు అనుగుణంగా మార్చుకోవాలనే పధకం వారిది.. 

ఆ తొట్టి వంటి పాత్ర వేగంగా కిందకు వెళ్తూ వుంది.. మెల్లి మెల్లిగా ఆ చంద్రిక కొలను తన నీలం వర్ణాన్ని కోల్పోతూ వుంది.. 

త్వరగా అంటూ ఆ విదేశీయులు అరుస్తూ వున్నారు.. 

వారి పరిమితి లోతు వరకు ఆ ఇద్దరు యువకులు వెళ్ళి ఆగి చూస్తూ వున్నారు.. ఆ పాత్ర లోని రసాయనం వల్ల వారికి లోపల ఏమి కనిపించకుండా ఆ నీటి అడుగు భాగం మొత్తం లేత ఆకుపచ్చ వర్ణంగా మారిపోయింది.. వారు అనుకున్న కొలతలు ప్రకారం పాత్రను దించి మరో గొలుసు సాయంతో దాన్ని బోర్లించుతారు.. అప్పుడా కన్నీరు మీనాలకు సమీపాన నీళ్ళలో కలిసిపోతుంది.. అలా మొత్తం అన్ని కన్నీళ్ళను వారు ఆ కొలనులో వదిలేసారు.. 

అవి లేత ఆకుపచ్చని ద్రవంలా చిక్కగా మారి కొంచం కొంచంగా ఆ కొలను మొత్తం ఆక్రమిస్తూ వున్నాయి.. 

సముద్రంలోకి వెళ్ళకుండా ఆ మీననేత్రి (జలకూన) నీటి అడుగు భాగాన వుండి పైన జరిగే వీరి చర్యలను భయంతో చూస్తూ వుంది.. తన ప్రాణాలను కాపాడిన ఆ అమ్మాయి ఏడుపును తను వింటూ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో భయంతో వణికిపోతూ వుంది.. 

ఏదో ఒకటి చెయ్యాలి .. ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటూ తనలో తానె అనుకుంటూ తీవ్రమైన ఒత్తిడికి లోనై మదనపడుతూ గట్టిగా కళ్ళు మూసుకుని తలపైకి పెట్టి తన చేతులు రెండూ చాచి అలానే ఉండిపోయింది మీననేత్రి (జలకూన).. 

నా శక్తి ఏంటి? దాన్ని నేనెలా తెలుసుకోవాలి ? 

ఎలా ఎలా ఎలా మార్గం ఎలా అంటూ తనలో తానె పదే పదే అనుకుంటూ వుండగా..


To be continued …
Written by : BOBBY

No comments:

Post a Comment