Saturday, January 11, 2020

JOURNEY OF SOCOTRA
SOCOTRA (The Mysterious Island) ఇది కథ లా నేను రాయలేదు.. ఒక హృదయం నుంచి మరో హృదయానికి చేరే అనుభూతిని, భావాలను కలిపి కుట్టే దారపు కండె లా ప్రతీ అక్షరాన్ని ఆస్వాదిస్తూ నేను ఈ కథను వ్రాయడం జరిగింది.. కొందరు మిత్రుల ప్రోద్బలము, ప్రోత్సాహము వెలకట్టలేనిది. వారికి నేనెంతో రుణపడివున్నాను.. అసంపూర్తిగా సగం లోనే ఈ గ్రంధం నిర్జీవమైపోయిన తరుణంలో నా సోదరి శ్రీమతి రూపసాహిత్య గారు పట్టువిడువక ప్రతీ సందర్భములో నను అడుగుతూ నన్ను వ్రాయమని ప్రోత్సహించే వారు. వారి అభిమానానికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలపాల్సిన సమయం ఇది.. నిజంగా మీకు కృతజ్ఞతలు సోదరి.. 
ఈ కథకు నాకు అవినాభావసంబంధము అందరికీ తెలిసి ఐదు ఏళ్ళు.. కానీ దానికి మునుపు మరో సంవత్సరము నుంచే నేను SOCOTRA దీవిపై అధ్యయనం చేస్తున్నాను... ఎందుకని మీకు 139 పేజీలు రాయడానికి ఇన్ని సంవత్సరముల సమయం పట్టింది అని అడిగే కొందరు మిత్రులకు నా చిరు వివరణ : “క్రిప్టోగ్రఫీ – గూఢలిపి” శాస్త్రం ఇందులో నాకు ఇష్టమైన అతిముఖ్యమైన సన్నివేశం.. ఈ కోడింగ్ నేర్చుకోవడానికి నాకు పట్టిన సమయం షుమారుగా ఒక సంవత్సరము .. youtube లోని కొన్ని సలహాల రూపంలోనూ, కొన్ని వెబ్ పేజీలలోని సూచనలను నేర్చుకున్నాను... అన్నిటికన్నా ముఖ్యంగా నా శ్రీమతి తన పేరుకు తగ్గట్లే తానో “ప్రత్యూష”ము తను M.tech., చేస్తున్నప్పుడు క్రిప్టోగ్రఫీ బేసిక్ సిలబస్ బుక్ లో చూసాను.. అది నన్ను చాలా ఆకట్టుకుంది.. ఇక ఇద్దరం కలిసి బాగా నేర్చుకున్నాం. తను నాకు ఎంతో నేర్పించింది.. క్రిప్టోగ్రఫీ ద్వారా ఒక తాళం, ఆ తాళానికి తాళంచెవిని మేమే సృష్టించాము.. రెండిటినీ ఆ వీలునామాలోనే అత్యంత రహస్యంగా నేను ఏర్పరిచాను.. 
ఇక చిన్మయానంద్ భాటియా గారు వ్రాసిన ఆ సీల్డు కవర్ వీలునామా ఆధారంగా SOCOTRA ప్రయాణం మొదలౌతుంది.. సీల్డు కవర్ వీలునామాలోని ఇంగ్లీషు అక్షరాల ద్వారా వాటి వెనుకన దాగివున్న అదృశ్య సిరా వ్రాతల ద్వారా ఒక తాళంచెవి వంటి కొన్ని ఇంగ్లీషు అక్షరాలు దొరుకుతాయి.. ఆ అక్షరాలను ఎన్నో విధాలుగా మార్చి మార్చి ప్రయత్నిస్తాడు ప్రసన్నకుమార్ భాటియా.. ప్రయోజనం ఉండకపోవడంతో పెద్దోడైన ఆకాష్ తన సీనియర్ మ్యాడం ద్వారా ఆ అక్షరాల మర్మాన్ని కనుగొనమని అడుగుతాడు.. ఆమె ఆ అక్షరాల మర్మాన్ని కనుగొని “ISLAND OF SOCOTRA” అనే దీవి గురించి వారి తాత గారు ఎందుకు అంత గోప్యంగా మర్మంగా వ్రాసారో అనే సందేహముపై అన్వేషించడానికి వీరు నలుగురూ సముద్ర ప్రయాణమౌతారు.. 


వారు వెళ్తున్న లాంచీ 82 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తుండగా హటాత్తుగా వాతావరణం అంతా ప్రళయావేశంతో నిండిపోయి వారిని, వారు ప్రయాణిస్తున్న లాంచీ ని అల్లకల్లోలం చేసి కొన్ని కిలోమీటర్ల దూరంలో వున్న ఒక చిన్న దీవిలో విసిరికొడుతుంది.. అదృష్టవశాత్తు అందరూ స్వల్ప గాయాలతో బయటపడుతారు.. ఆ దీవి నుంచి బయటపడే క్రమంలో అందరూ ఒకచోట చేరి మాట్లాడుకుంటూ వుండగా.. ప్రసన్నకుమార్ భాటియా 3 అడుగుల చిన్నని రాతి మీద ఎక్కి తనగురించి, తన జీవితం గురించి ప్రసంగించి.. మిగతా వారిని కూడా వారి జీవితాల గురించి ప్రసంగించమని కోరుతారు.. 


మొదటగా ఓ పెద్దాయన తన జీవితంలో జరిగిన సంగతులను ప్రసంగిస్తాడు.. అందరికీ కళ్ళు చమర్చుతాయి.. తరువాత 15 ఏళ్ళ యువకుడు ముందుకు వచ్చి తన జీవితంలో జరిగిన అత్యంత దుర్భరమైన సంగతులను వివరించి అందరి హృదయాలను కదిలించేస్తాడు .. తరువాత ముంబై నగరంలో ఓ పెద్ద ఐ.టి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే మోహన్ అనే వ్యక్తి తన జీవితంలో జరిగిన విచిత్రమైన నమ్మశక్యం కాని విషయాలను వివరిస్తాడు.. తనను ఒక కల పదే పదే వెంటాడుతూ వుందని అది అత్యంత భయంకరమైనదిగా వుందని దానిగురించి తను ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులను ఆశ్రయించినా ఫలితం లేదని.. తన దగ్గర పనిచేసే ఓ పిల్లాడి సలహా మేరకు ఎవ్వరూ ఉండని అస్తమయపురం అనే చిత్రమైన గ్రామానికి వెళ్తే అక్కడకు ప్రతీ అమావాస్య తరువాత చంద్రుని నుంచి వెలువడే మొదటి రోజు (నెలపొడుపు) యవ్వన చంద్రకాంతులు ప్రసరించే ఆ రాత్రి వేళ ఒక అఘోరా వస్తాడని, తన మాటలు శూలాళ్ళలా ఉంటాయని, ఎన్నో సమస్యలను తను తీరుస్తాడని ఆ పిల్లాడు చెప్పడంతో మోహన్ అక్కడకు వెళ్ళగా.. అఘోరా భూత. భవిష్యత్, వర్తమానం అనే మూడు గుంటలను ఏర్పరిచి భూత కాలంలో మోహన్ ఏం కోల్పోయాడో చూపిస్తూ, వర్తమానంలో తనేం చేస్తున్నాడో తన ప్రవర్తన ఎలా వుందో చూపిస్తూ, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని హెచ్చరిస్తూ తనని తాను తెలుసుకునేలా తను మారేలా ఆ అఘోరా మోహన్ సమస్యను పరిష్కరిస్తాడు.. 

82 మంది ప్రయాణీకులు ఇరుక్కున్న ఆ దీవిలో బయటపడే మార్గాల కొరకు ఎనిమిది బృందాలుగా (ఒక బృందానికి పదిమంది చొప్పున) మారి తలో ఒక దిక్కున అందరూ వెతుకుతున్నారు అప్పుడే పెద్ద శబ్దం చేస్తూ ఒక హెలికాప్టర్ కూలి ఆ దీవిలో పడుతుంది.. పేరాచూట్ నుంచి దిగిన ఓ వ్యక్తి తన శాటిలైట్ ఫోన్ ద్వారా తన పై అధికారులకు తెలిపి తనతోపాటు ఈ దీవినుంచి బయటపడే మార్గం కూడా తను చూపిస్తాడు.. తరువాత రోజు ఆ దీవిదగ్గరకు ఓ నౌక వస్తుందనగా ఆ రోజు రాత్రి అందరూ మంట వేసుకొని ముచ్చట్లు ఆడుతున్న సమయంలో చెట్టు గుబురుల మధ్యన ఓ వికృత ఆకారంలో వున్న మనిషి ఆకారాన్ని చూస్తాడు ప్రసన్న కుమార్ భాటియా మొదటి కుమారుడు అయిన ఆకాష్.. 


ఆ విషయాన్ని మోహన్ తో మాట్లాడుతూ వుండగా చకచకమని చాలా వేగంగా వారి వెనుక ఎవరో పరిగెత్తిన చప్పుడు వినిపిస్తుంది.. వెనక్కి తిరిగి చూడగా.. దూరాన ఆ వికృత ఆకారం వెళ్ళడం గమనిస్తారు ఇద్దరూ.. ఆ కారాన్ని వెంబడిస్తూ నిప్పుకు స్పందించే రాయి ద్వారా నేలమాళిగ లోనికి వెళ్ళి తనతో మాట్లాడి వీరు వెళ్ళబోతున్న దీవిలో ఏవో కొన్ని అసాంఘికకార్యక్రమాలు జరుతున్నట్లు వారు భావిస్తారు.. ఆ తరువాత అక్కడనుంచి మరో నౌకద్వార వారి ప్రయాణం సాగిస్తూ వుండగా ఓ గదికి సంబంధించిన తలుపు మీద “నేత్రం నుంచి జాలువారే కన్నీరు” ఆకారంలో ఓ గుర్తును చూస్తాడు ఆకాష్.. అదే గుర్తు కలిగిన ఒక మ్యాప్ ని ఆ విచిత్ర ఆకారం ఆకాష్ చేతికి ఇచ్చి వుండటం చేత ఆ గదిలో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటాడు ఆకాష్. దానికి మోహన్ కూడా సాయం అందించగా ఆకాష్ ఎలాగోలా ఆ గదిలోపలకు వెళ్తాడు.. రోదిస్తున్న ఓ అందమైన అమ్మాయిని చూస్తాడు ఆకాష్.. చూసిన వెంటనే తనపై మనసు పారేసుకుంటాడు. తనకోసం ఏదైనా చెయ్యాలని తపించిపోతాడు.. 

తనతో మాట్లాడి తన గతం గురించి తెలుసుకుంటాడు.. అప్పుడు తను చంద్రిక కొలను అనే రహస్య నీటి కొలను గురించి చెప్తూ జలకూన అనే సాగర పుత్రికను కలుసుకున్నట్లు, తన ప్రాణం కాపాడినట్లు తదితర విషయాలను ఆ అమ్మాయి చెప్తుంది.. అన్ని విన్న ఆకాష్, మోహన్ లు తనను ఆ గది నుంచి విడిపించి వారు వున్న గదిలోకి తీసుకొచ్చి ప్రసన్నకుమార్ భాటియాకు పరిచయం చేస్తారు.. అందరూ ఆ నౌకలోని వారిని ఏమార్చి ఓ చిన్న పడవ సాయంతో “SOCOTRA (The Mysterious Island)” కు వెళ్తారు.. 

“SOCOTRA” దీవిలో దారి పొడవునా వింత వింత ఆకారంగల జీవులు, విచిత్రమైన వృక్షాలు దూరాన కనిపిస్తున్న ఎన్నో ఏళ్ళ సంవత్సరాలనుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి కాపలా కాస్తున్న పెద్ద పెద్ద వృద్ద పర్వతాలు… నిజంగా భూమి పైనే వున్నామా ?? లేక ఏదైనా గ్రహం మీదకు వచ్చిపడ్డామా … అనేంతలా ఉన్నటువంటి ఈ దీవిని కళ్ళు, నోరు రెండూ పెద్దవిగా చేసి చూస్తూ ముందుకు కదులుతున్నారు.. 20 మిలియన్ సంవత్సరముల వంటి చరిత్ర కలిగిన “డ్రాగన్ వృక్షాల” మధ్యన నడుచుకుంటూ వెళ్తున్నారు.. భానుడి వేడి కిరణాలను వారిపై పడకుండా ఉండేందుకు ఛత్రము వలె తెరిచి వారి తలపై పెట్టినట్లుగా కనపడుతున్నాయి ఆ వృక్షాలు.. 
ఇప్పటివరకు వారు చుసిన జీవరాసి ఒక్కటి కూడా ఇక్కడ కనిపించట్లేదు …. ప్రతీ జీవి అక్కడ ప్రత్యేకమైనదిగా, భయంకరమైనదిగా కనపడుతోంది వారికి.. దాని గురించి మాట్లాడుకుంటూ ముందుకు కదిలారు.. అక్కడ సున్నపురాయితో కలిగిన ఓ రాతి గుట్ట ను గమనించి అందులోకి వెళ్తారు అందరూ.. అక్కడ గోడలపై వున్న 9వ, 10వ శతాబ్దం మధ్యలోని అతిపురాతన కళాఖండాలను చూస్తూ, ఆ గోడలపై భారతదేశం యొక్క బ్రహ్మలిపి చెక్కబడి వుండటం చేత అది ఒక కోవెల అని నిర్ధారించుకొని విశ్రాంతి తీసుకుంటారు అందరూ.. రాత్రి వేళ మంట వెలుగులలో పసిడి కాంతులతో చుట్టూ వున్న గోడలపై ఏవో కొన్ని దృశ్యాలను చూసి రెండు పెద్ద పెద్ద కొండల మధ్యన సన్నని ద్వారము ఆ రెండు కొండలను చీలుస్తూ భూమి లోపలకు వెళ్ళినట్లుగా ఒక రాతిబింబం ద్వారా మార్గాన్ని కనుగొంటారు.. 

అందరూ అక్కడనుంచి బయలుదేరి ముందుకు కదులుతూ వుండగా.. మార్గ మధ్యలో యక్షామి అనే మనిషికి తినే ఆటవికుల గుంపు వారిని అడ్డగించి వారితో తీసుకెళ్తుంది.. ఆ గుంపుకు నాయకురాలైన ఉవిధ అనే ఆమె తానో మంత్రముగ్ధ అంటూ వారికి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను తెల్పుతుంది.. ప్రసన్నకుమార్ భాటియా తాత గారైన చిన్మయానంద్ భాటియా ఇదివరకే ఇక్కడకు వచ్చినట్లు కొందరు ఈ ప్రాంతానికి రాబోతున్నట్లు ఆమెకు చెప్పి హెచ్చరించినట్లు ఉవిధ చెప్తుంది.. తన మాటలు పట్టించుకోకుండా వున్నందుకు దాని పర్యవసానమే మా జాతిలో నేనొక్కదాన్నే మిగిలానని బాధపడుతుంది.. ఇక్కడ జరిగే విషయాలన్నీ రహస్యంగానే వున్నాయి.. అందుకే ఇన్ని రహస్యాలను ఒకేసారి చెప్పలేక మీకు ఒక ఆచూకి లా వీలునామాను పొందుపరిచి దాని ద్వారా మీరు ఈ దీవిని కనుగొనేటట్లు చేసి చివరికి మిమ్మల్ని ఇక్కడదాకా రప్పించారు మీ తాత గారు అంటూ చెప్తుంది ఉవిధ.. 

తరువాత వారిని అస్తమయ పురంలో కనిపించిన అఘోరా వద్దకు తీసుకెళ్తుంది.. ఆ అఘోరా వారందరికీ క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దం నాటి కొన్ని నిజాలను చెప్తాడు.. అవి ఓ సముద్రపు ఒడ్డున వాసుర నక్షత్ అనే ఇద్దరు పిల్లలు ఎప్పుడూ ఆడుకుంటూ ఉండేవారని.. ఒకరోజు ప్రమాదవశాత్తు వాసుర ఆ సముద్రం లో పడిపోతుందని, తరువాత ఆ వాసుర అనే అమ్మాయిని “ఆత్మాశి” అనే సముద్ర మత్స్యక కాపాడుతుందని, వాసుర నక్షత్ లను ఆమె చంద్రిక కొలను దగ్గరకు తీసుకెళ్ళి వారిని పెంచుకుంటుందని. వారికి అన్ని నేర్పుతుందని, తరువాత వారు పెద్ద అయ్యాక చంద్రిక కొలనులో అత్యంత రహస్యమైన సృష్టికి సంబంధించిన రెండు శ్వేతవర్ణపు మీనాల గురించి వాటి మనుగడ గురించి చెప్పి ఏదో ఉపద్రవం రాబోతుందని గ్రహించి వారికి రెండు వేరు వేరు పనులు కేటాయిస్తుంది ఆత్మాశి.. 
1. ఆత్మాశి కి జన్మించబోయే జలకూన రక్షణా బాధ్యతను వాసుర అప్పగిస్తుంది తనను ఒక దిక్కుకు పొమ్మని సూచిస్తుంది.. అలానే 
2. “SOCOTRA” దీవిలోకి నక్షత్ ను పంపించి తనని బ్రహ్మలిపి లో చంద్రిక కొలను గురించి దాని విశిష్టత గురించి, ఆత్మాశి గురించి రాయమని పంపుతుంది.. అలా వారి ఇద్దరినీ, వారి ప్రేమను దూరం చేస్తుంది ఆత్మాశి.. 

కొన్ని సంవత్సరముల తరువాత ఆ గ్రంధాన్ని పూర్తి చేసి “SOCOTRA” దీవిలో భద్రపరిచి వాసురను వెతుక్కుంటూ తనకోసం వెళ్తాడు నక్షత్.. అప్పటికే సమయం చేయిదాటి వుంటుంది.. జలకూన కోసం వచ్చిన సముద్రపు దొంగలు వదిలిన బాణం వాసురకు తగిలి తను కొనప్రాణంతో వుండగా నక్షత్ అక్కడకు వచ్చి తనను ఒడిలో పెట్టుకొని ఆకాశం వైపు తలయెత్తి బిగ్గరగా రోదిస్తూ తను ప్రాణం వదుల్తాడు.. జలకూన అక్కడనుంచి తప్పించుకొని సముద్రగర్భంలోకి వెళ్ళిపోతుంది.. తన బాధ్యత కోసం ఆత్మాశి కూడా ఆ స్వేతవర్ణపు మీనాలకోసం తన ప్రాణాలు విడుస్తుంది అని చెప్తాడు ఆఘోరా.. 

అప్పుడే యక్షామీ (ఉవిధ) జలకూనను అక్కడకు తీసుకొస్తుంది.. తరువాత అఘోరా చెప్పిన ప్రణాళిక ప్రకారం మూడు బృందాలుగా విడిపోయి మూడువైపులుగా వెళ్తారు.. మొదటి బృందంలో కన్నీళ్ళను సేకరించే ప్రదేశాన్ని కనుగొంటారు.. రెండవ బృందంలో లోకేష్ ప్రాణాలు కోల్పోయి అక్కడ బంధించిన స్త్రీ లను కాపాడి సురక్షిత ప్రాంతానికి తీసుకొస్తారు.. మూడవ బృందంలో చంద్రిక కొలను దగ్గరకు వెళ్ళిన జలకూన భయంతో సాయం చెయ్యకుండా లోపలకు వెళ్తుంది.. అక్కడ కాలరంధ్రముల ద్వారా పయనించి తన భయాన్ని జయించి తన పెదమ్మను కలుసుకొని తన ప్రోద్భలంతో తనలో దాగిన అతీత శక్తిని పుంజుకొని వేగంగా కొలనులోకి ప్రవేశించి అత్యంత భయంకరమైన సుడిగుండాన్ని ఏర్పరిచి ఆ మీనాలను రక్షిస్తుంది.. వారి యంత్రాలను, వారి పరివారాన్ని చెల్లాచెదురు చేసి తాను సంపూర్ణ మత్స్యక లా మార్పు చెందుతుంది.. 

అంతలో యక్షామీల సమూహం వచ్చి మిగతావారినంతా బంధించి సముద్రము మధ్యలో వారి చేతులు కాళ్ళు కట్టి వారిని ముంచేస్తారు.. ప్రాణాలు పోయిన లోకేష్ కు జలకూన (మీననేత్రి) సప్తధాతువులచే ప్రాణాలు పోస్తుంది. సముద్రపు దొంగలు కొల్లగొట్టి అత్యంత గోప్యంగా దాచిన నిధిని ప్రసన్నకుమార్ భాటియాకు అందజేస్తుంది యక్షామీ (ఉవిధ).. 


ఆకాష్, ఆ అమ్మాయి ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని అమ్మాయి వాళ్ళ పెదనాన్నకు చెప్పి ఒప్పించి వారు ఇద్దరూ చంద్రిక కొలను దగ్గరకు వచ్చి ఇప్పటికైనా నీ పేరు చెప్తావా అనే ఆకాష్ ప్రశ్నకు ఆ అమ్మాయి సమాధానముగా నా పేరు “లేక్షణ” అని చెప్పి తన పెదవులపై ముద్దులు కురిపిస్తూ తనని లతలా అల్లుకుపోతూ అక్కడితో ఈ కథ సంపూర్ణం అవుతుంది.. !!

కథలోని ముఖ్యమైన అంశములు 
*************************
ఆ దీవి అందాల్ని వర్ణించడానికి మాటలు చాలవు. 
అక్కడి అనుభూతుల్ని ఆస్వాదించడానికి సమయం చాలదు ..
అందం ఉన్నచోటే ఆపదకూడా పొంచి వుంటుంది.. 
అంత అందమైన దీవిలో అడుగడుగునా ఆపదే... 
ఆ అపాయాలను అడ్డుకుంటూ ఓ సాహస యాత్ర ను ఉద్దేశించి, ప్రతీ భావాలను కళ్ళకు కట్టినట్లు చూపడమే నా ముఖ్య ఉద్దేశం.. ముఖ్యంగా ఈ కథలో ఓ కుటుంబం చేసే అత్యంత సాహస ప్రయాణాన్ని.. ఆ ప్రయాణంలో వారికి కలిగిన అనుభవాలను, సంభవించిన పరిణామాలను కూలంకషంగా రాస్తూ వున్నాను.. 

కథలో కొన్ని పెర్లుకు, వాటి ప్రాముఖ్యతలకు వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు... 
వాటిల్లో కొన్ని మరలా మీ ముందుకు..

"సీల్డు కవర్ వీలునామా" 
"క్రిప్టోగ్రఫీ - గూఢలిపి శాస్త్రం" 
"అదృశ్య సిరా" 
"లాంచీ ప్రయాణం" 
"సముద్ర ప్రళయ ఘాబీర్యం" 
"వెంటాడే కల" 
"నెలపొడుపు" 
"అస్తమయ పురం" 
"మూడు గుంటలు" 
"అగ్నిలో అభ్యంగన స్నానం" 
"అఘోరా" 
"భూత, భవిష్యత్తు, వర్తమానం" 
"అడవిలో వికృత ఆకారం" 
"నేల మాలిగ" 
"నిప్పుకు స్పందించే రాయి" 
"కన్నీటి బిందువులు" 
"రహస్య నౌక" 
"చంద్రిక కొలను" 
"జల కూన " 
"శతాబ్దాలనాటి రెండు శ్వేతవర్ణపు చేపలు" 
"తాబేలు హారం" 
"అపురూప సౌందర్యవతి"
“యక్షామీలు” 
“వాసుర – నక్షత్”
“స్త్రీ ఆక్రందన” 
“మంత్రదములు”
“ప్రణవతాండవం” 
“ఆత్మాశి”
“మీననేత్రి”
“శకులి”
“లేక్షణ”

పిల్లలు సరే, హేతు బద్ధతిని కోల్పోతున్న యిప్పటి యువకులు కూడా యిలాంటివి చదివితే సమాజానికి ఎంతో కొంత మంచిదని నా ఉద్దేశం.. ఇందులో ముఖ్యంగా ఒక కొత్త సబ్జెక్టు “Cryptography”(గూడలిపి శాస్త్రం) గురించి మరియు “లా” కు సంబంధించి తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలను కూలంకషంగా వివరించడం జరిగింది..

ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఎన్నెన్నో.. మొదటి నుంచి చివరి వరకు “తరువాత ఏం జరుగుతుందా ?”
అనే ప్రశ్నను పదే పదే మీ ముందు ఉంచుతూ నరాలు తెగేంత ఉత్కంఠభరితముగా ఉంటుందని చెప్పగలను.. బుద్ధిని, తర్కాన్ని పెంచే రచనలు ఈ రోజుల్లో చాలా అరుదు.. ఎందుకంటె అందరూ ఈ మధ్య వినోదం మీదనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు... వినోదంతోపాటు బుద్ధిని, తర్కాన్ని పెంచాలనే సంకల్పంతో ప్రతీ అక్షరాన్ని మనసుపెట్టి రాసాను... అందువల్ల అవి శాస్త్రీయం గా ఆలోచించేందుకు ఉపయోగపడతాయి.

స్వస్తి __/\__

Written by: BOBBY

No comments:

Post a Comment