Saturday, January 11, 2020

SOCOTRA (The Mysterious Island) from Bobby... 35th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

అఘోరాకి కూడా అంతుపట్టక ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు.. 

కాసేపు ఆ ప్రాంతం అంతా నిశబ్దంతో భారంగా మారిపోయింది.. 


తరువాత ఏంటో చూద్దాం పదండి..
35th Part
మీననేత్రి దూరంగా వెళ్ళి కళ్ళు మూసుకొని తన తల్లి (ఆత్మాశి) ని తలుచుకుంది.. కొన్ని క్షణాలు అలా వుండిపోయి.. మీరంతా దూరంగా వెళ్ళండి అంటూ లోకేష్ దగ్గరకు వేగంగా వస్తుంది.. తన శక్తినంతా కళ్ళలోకి చేర్చి.. పెద్దగా రోధిస్తుంది మీననేత్రిని.. 

ఆ రోధన ఎలా వుందంటే ఆకాశమే బాధతో కరిగి వర్షించేలా వుంది.. నాలుగు దిక్కులు పిక్కటిల్లేలా తను రోధిస్తోంది .. తన రోధనకు సాగరంలోని జీవాలన్నీ తీరానికి వచ్చి చూస్తున్నాయి.. ఒక్క జీవం కూడా జీవించని చంద్రిక కొలను మొత్తం రకరకాల సముద్రపు జీవాలతో నిండిపోయింది.. ఆ దృశ్యాన్ని చూస్తున్న అందరి హృదయాలు బరువెక్కిపోయాయి .. అప్పుడే తన నేత్రాలనుంచి రాలుతోంది.. ఆ రాలుతున్న కన్నీటి బిందువులను సరిగ్గా లోకేష్ కళ్ళలో పడేలా తన కనురెప్పలు తెరుస్తుంది.. రెండు కళ్ళలో రెండు బిందువులు తన కన్నీటిని వేసి మరో కొన్ని బిందువులను చంద్రిక కొలనులో వేస్తుంది మీననేత్రి..

లోకేష్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.. 

చంద్రిక కొలను మునుపటిలా నిర్మలంగా నీలవర్ణంగా మారిపోయింది.. తనకోసం వచ్చిన జీవాలన్నిటికీ నోటితో ఓ రకమైన సైగ చేసి తిరిగి పంపేస్తుంది మీననేత్రి..!!


ఇది అత్యద్భుతమైన సంఘటన.. మత్స్యక కన్నీరు కార్చడం నేనెప్పుడు వినలేదు, కనలేదు, ఎక్కడా చదవలేదు.. అంటాడు అఘోరా.. 

అవును మాకు కన్నీరు రావు..మా బాధలను మేము నియంత్రించగలము. అంతే కాదు మేము కన్నీరు చిందిస్తే మా యౌవనాన్ని మేము కోల్పోవాల్సి వస్తుంది.. విపత్కర పరిస్థితుల్లో తప్ప ఇలా ఎప్పటికీ చెయ్యము.. కానీ నా అక్క తన మెట్టినింట సంతోషంగా ఉండాలంటే లోకేష్ బ్రతకాలి.. నా అక్కకోసం ఇది చేసాను.. తను నా ప్రాణాలనే కాపాడింది.. తను నాకు చేసిన దానిముందు.. తనకు నేను చేసిన ఈ చిన్నపాటి సాయం ఏపాటిది.. అని మీననేత్రి అనగానే ఆ అమ్మాయి అమాంతం తనని హత్తుకుంది.. 

నొప్పిగా ఉందా..!!

అంటూ ఆ అమ్మాయి వీపును తడుముతూ అడుగుతుంది మీననేత్రి.. 

నొప్పికన్నా సంతోషమే ఎక్కువగా వుంది .. మరేం పర్వాలేదు అంటుంది ఆ అమ్మాయి.. 

నువ్వు కోరుకున్న వ్యక్తితో నీవు జీవితాంతం సంతోషంగా వుండాలి.. ఇదిగో ఇది తీసుకో అంటూ ఆ తాబేలు హారాన్ని చేతికిస్తుంది.. 

ఎందుకు మళ్ళి ఇస్తున్నావ్.. అని అడుగుతుంది ఆ అమ్మాయి.. 

ఇది నాది కాదు .. నీదే అంటూ తన మెడలో వేస్తుంది మీననేత్రి.. 

సరే మరి నేను వుంటాను ఇక.. ఈ మీనాలను నిద్రలేపి వాటిని యధాస్థానంలో ఏర్పాటు చెయ్యాలి అంటుంది మీననేత్రి.. 

నిన్ను చూడాలనిపిస్తే ఎలా ? అని అడుగుతుంది ఆ అమ్మాయి.. 

ఈ చంద్రిక కొలను దగ్గరకు వచ్చి నన్ను పిలిస్తే క్షణాల వ్యవధిలో నీ ముందు ఉంటాను అంటుంది మీననేత్రి.. !

సరే.. అంటూ నవ్వుతూ తన నుదిటిపై ఓ ముద్దు పెట్టి .. తన చెవి దగ్గరకు వచ్చి జాగ్రత్తగా వుండు.. అని చెప్తుంది ఆ అమ్మాయి.. 

అలాగే నువ్వు కూడా జాగ్రత్తగా వుండు.. అంటూ అందరినీ నవ్వుతూ పలకరించి కొలనులోకి వెళ్ళిపోయింది మీననేత్రి..!!

మీ సాహసం, మీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేము.. మమ్మల్ని, మా ప్రాంతాన్ని మళ్ళి మాకు తిరిగి ఇచ్చారు.. మీకు మీ కుటుంబానికి ఎంతో రుణపడిఉన్నాము. ముఖ్యంగా మీ తాత గారు చిన్మయానంద్ భాటియా గారికి అంటూ ఉవిధ..తనతోపాటు వున్న యక్షామీలు అందరూ వారి తలలు వంచి మోకాళ్ళపై మ్రోకరిల్లి ధన్యవాదములు తెలుపుతారు.. ప్రసన్నకుమార్ భాటియా కుటుంబానికి.. 

మా దీవిలో స్త్రీ ఆక్రందన నేటితో ముగిసింది అంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు యక్షామీలు .. 

అఘోరా, మోహన్, నౌకలోని పిల్లాడు అందరికీ వీడ్కోలు చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోయారు.. 

ఆ నౌకలోని వారినంతా ఏం చేస్తారు అంటాడు.. ఆకాష్.. 


వారు చేసిన తప్పు క్షమించరానిది.. అందుకని వారి చేతులు, కాళ్ళు కట్టి నడిసముద్రంలో ముంచి చేపలకు ఆహారంగా వేస్తాము అంటారు యక్షామీలు.. 

మిమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టాలో చెప్పండి ఆ నౌకలో మిమ్మల్ని క్షేమంగా వదిలి వస్తారు మా వారు అంటుంది ఉవిధ (యక్షామీ).. 

మరో విషయం.. మీరు నౌకలోకి ఎక్కిన తరువాత మీకు ఒక కానుక వుంది అది మీరు తీసుకునే బయలు దేరాలి అంటుంది ఉవిధ.. 

ఏమిటది అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

అదేంటో మీ చిన్న అబ్బాయిని అడగండి అంటుంది ఉవిధ.. 

సంతోష్ నీకు తెలుసా.. ?? ఏంటది అని అడుగుతారు మిగతా వారు.. 

అన్నయ్య వాళ్ళు నన్ను ఒక దగ్గర ఉండమని చెప్పి ముందుకు వెళ్ళిపోయారు.. నాకు అక్కడ నేల అడుగు భాగాన మట్టిలో కనిపించి కనిపించని ఒక కాగితంవంటి ముక్క కనిపించింది... నేను అక్కడ కూర్చుని ఏమి తోచక దాన్ని నా గోరుతో లాగగానే కాస్త బయటకు వచ్చింది.. అది అత్యంత పురాతనమైనదిలా అనిపించి జాగ్రత్తగా లాగాను.. మరికాస్త బయటకు వచ్చింది.. అది ఒక మ్యాప్ లా నాకు అనిపించింది.. ఇంకాస్త బలంగా లాగాను.. మొత్తం చేతిలోకి వచ్చింది.. అది నేను అనుకున్నట్లుగా మ్యాప్.. అందులో ఏదో మార్గం వుంది.. ఇక్కడివారైన ఉవిధ కు ఇస్తే ఆమెకు తెలుస్తుందేమో ఆమెకు ఉపయోగపడుతుందేమో అని తనకు ఇచ్చాను.. అంత వరకే నాకు తెలుసు..

అది ఏం మార్గం ఉవిధను అడుగుతాడు సంతోష్.. 

తను ఆకాష్ వైపు తిరిగి .. నేను నీకు చెప్పాను కదా సముద్రపు దొంగలు నవ నిధులు దాచి పెట్టి ఉంచారని.. ఆ నవ నిధులకు మార్గమే సంతోష్ నాకు ఇచ్చిన మ్యాప్.. ఈ మ్యాప్ కోసం ఎన్నో తిరుగుబాట్లు, మరెన్నో యుద్దాలు జరిగాయి.. ఎందరివో ప్రాణాలు పోయాయి.. విదేశీయులు ఎందరో ఎన్నో విధాలుగా వెతికారు.. కానీ ఎవ్వరికీ దొరకలేదు.. నిష్కల్మషమైన మనస్సు కలిగి ఏమీ ఆశించకుండా ఇంతసాయం చేసారు అందుకే మీకు ఇది దక్కి తీరాలి అంటుంది ఉవిధ.. 


అది మీరే తీసుకోండి.. నాకు నా కుటుంబం క్షేమంగా దక్కింది.. నాకు మంచి కోడలు పిల్ల దొరికింది ఇవి చాలు నాకు.. మరేమీ వద్దు అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

అదేం కుదరదు.. అయినా ఆ నిధిని ఆభరణాలను మేమేం చేసుకుంటాం.. ఇది మీ భారతీయ సంపద.. మీకే దక్కాలి.. అంటుంది ఉవిధ.. 

అలాగే దీన్ని తీసుకెళ్ళి మా ప్రభుత్వానికి అందజేస్తాము అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

సరే అని అందరూ అక్కడనుంచి బయలుదేరగా.. 

ఆ అమ్మాయి మాత్రం ఆకాష్ చేతిని గట్టిగా పట్టుకొని మనం రెండు రోజులు ఆగివెల్దామా .. పెదనాన్నను కలిసి ఇదంతా చెప్పి అప్పుడు నేను నీతో వస్తాను .. అదీకాక రేపు పౌర్ణిమ.. రేపు రాత్రి ఈ చంద్రిక కొలను అందాలను చూడాలని వుంది అని తన పెదవులను దగ్గరగా చేసి చంటిపాప లా గోముగా అడుగుతుంది ఆ అమ్మాయి.. 

ఇలా అడిగితే రెండు రోజులేం ఖర్మ.. ఇక్కడే దుకాణం పెట్టేస్తాడు అన్నయ్య అంటూ రెండోవాడైన లోకేష్ చమత్కరిస్తాడు.. 

ఆ మాటకు అందరూ నవ్వుకొని.. 

నిదానంగానే రండి లేకపోతే నేను వచ్చి మాట్లాడమంటే మాట్లాడుతాను అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

మీరు తరువాత వద్దురు మామయ్య గారు.. ముందు మేము వెళ్ళి మాట్లాడి వస్తాము అని చెప్తుంది ఆ అమ్మాయి.. 

అలాగే అంటూ ప్రసన్నకుమార్ భాటియా మిగిలిన ఇద్దరు కుమారులు ఆ నౌక ఎక్కి ఇల్లు చేరుతారు.. ఆ సంపదను భారతీయ ప్రభుత్వానికి అందజేయ్యగానే..వారి సాహసాన్ని, వారి కుటుంబాన్ని ప్రశంసిస్తూ, వారికి ప్రభుత్వం తరపు నుంచి పెద్ద మొత్తంలో బహుమతి దొరుకుతుంది.. చిన్మయానంద్ భాటియా గారి జ్ఞాపక గౌరవ చిహ్నంగా వారి ప్రతిమను ఏర్పాటు చేసి ప్రముఖులు సత్కరించారు.. 

ఆ అమ్మాయి వారి పెదనాన్నకు జరిగినదంతా చెప్పి ఆకాష్ తో తన పెళ్ళికి ఒప్పించింది.. 

ఇద్దరూ ఆరోజు రాత్రి ఆ చంద్రిక కొలను దగ్గరకు చేరుకున్నారు.. 



ఆకాశంలో చంద్రుడు పళ్ళికిలించి నవ్వుతున్నట్లుగా, పిండారబోసినట్లుగా పండు వెన్నెల కాస్తుంది.. ఆ వెన్నెల్లో చంద్రిక కొలను కన్నా ఆ అమ్మాయి మోము మరింత శోభాయమానంగా వెలిగిపోతుంది.. అది గమనించిన ఆకాష్ .. తనను దగ్గరకు లాక్కొని తన రెండు చేతుల్లోకి ఆమె ముఖమును తీసుకొని.. నీ కన్నా అందంగా ఉందంటావా ?? ఈ చంద్రిక కొలను .. అంటాడు.. 

సిగ్గులొలుకుతూ.. తన కనురెప్పలు రెండూ కిందకు దించుతుంది ఆ అమ్మాయి… 

తన గవుదమును పట్టి మెల్లిగా పైకి లేపి.. తనకు ఇంకాస్త దగ్గరగా వచ్చి తన కళ్ళలోకి చూస్తూ.. 

ఇప్పటికైనా నీ పేరు చెప్తావా ? అంటాడు ఆకాష్.. !!


ఆ అమ్మాయి నేత్రాలు ఆనంద భాష్పాలతో నిండిపోయి ఆకాష్ ని హత్తుకొని .. నా పేరు “లేక్షణ” అని చెప్పి తన పెదవులపై ముద్దులు కురిపిస్తూ తనని లతలా అల్లుకుపోయింది.. !!

***సమాప్తము***
Written by : BOBBY
Place : Nellore.
All Copyrights Reserved Text

No comments:

Post a Comment