Tuesday, January 9, 2018

గతనిశీధి జ్ఞాపకాలు..స్త్రీ, పురుషుల మధుర సంగమము ఇది..

సున్నితమైన మనస్కులు కాస్త దూరంగా ఉండటం శ్రేయస్కరం అని విన్నవించుకుంటున్నాను.

విశృంఖలమైన సంయోగమును నేను ఇక్కడ రాయలేదు.. ఓ స్త్రీ ఎన్నో కలలు కని తన పరిణేత వద్దకు వస్తుంది.. అలానే ఓ పురుషుడు తన కోమలాంగిని గురించి ఎన్నో కలలు కని ఉంటాడు.. అలాంటి ఓ దంపతుల మధ్య జరిగే ప్రయాణాన్ని, శృంగారాన్ని కలిపి ప్రణయశృంగార వర్ణనను ఇక్కడ పొందుపరిచాను.. పెళ్ళి చూపుల్లలో పరిచయమైన కళ్ళు చివరి ఘట్టం దాకా ఎలా వున్నాయో వివరించాను.. అన్యదా భావించకుండా సాహిత్యపరంగా చూడమని మనవి.. 

గతనిశీధి జ్ఞాపకాలు..
*****************

మొదటసారి నే చూచిన ఆ కళ్ళు 
ఇంకా నాకు గుర్తున్నాయి...!!
నల్లని కాటుకతో, 
నేరేడు కనుపాపలతో, 
తుమ్మెద కనురెప్పలతో, 
ముచ్చటైన ముంగురులతో, 
నను ఆర్తిగా చూసిన ఆ కళ్ళు 
నాకు ఇంకా గుర్తున్నాయి..!!

పచ్చిక మీద నీ ఒడిలో పడుకున్నప్పుడు 
నా తల మీద అదే పనిగా నీ చూపుల వర్షం కురిసేది.. !!
నీ నవ్వుల స్వరం విన్న ప్రతీసారి అలసిన నా హృదయం 
పదే పదే నను పలకరిస్తూ వుండేది.. !!
దూరాన్నించి నీ అడుగుల సవ్వడి విని 
ఓ పరిమళం నీకన్నా ముందొచ్చి ముద్దిలిచ్చేది..!!

ఈ అస్తమయకాలపు పున్నమి నాకు కనిపిస్తోంది.. 
నక్షత్రాల కాంతితో, ఆకాశం విస్తృతమౌతూ
మనకు మరింత దగ్గరగా వస్తోంది..!
మనకోసమే అన్నట్లు పూసిన ప్రతీ పువ్వు 
నల్దిశలా తన అనుభవానుభూతి సువాసనల్ని 
వెదజల్లుతూ ఉన్నాయి... !!
అవును 
నీ ప్రతిబింబం నిశ్చలంగా నన్నే చూస్తూ ఉంది.. 
ఆనాటి కాంతి నీ కళ్ళలో ఇంకా వెలుగుతూనే ఉంది.. 
మంటల మధ్య ఇనుప ముద్దల్లా నీ రెండు పెదవులూ 
ఇంకా వణుకుతూనే ఉన్నాయి.. 
ఈ రాత్రి 
నెమ్మది నెమ్మదిగా ..నీలోకి నేను ప్రవేశిస్తున్నాను .. 
సముద్ర తరంగాల మధ్య రేగే నురగల మీంచి 
నా కాగితపు పడవ ఇంకా నీ ఎదపై 
ప్రణయ ప్రయాణం చేస్తూనే ఉంది..
చిట్ట చివరి మన సమర శృంగారం నడిఝామున
నీ పాదాలను ముద్దాడుతూ గడిచిపోతుందని నాకు తెలుసు.. !!

నాకనిపిస్తోంది నే నొక పూ .. తోటలోనికి ప్రవేశించానని 
అక్కడంతా ఎప్పుడూ చూడని ఆనందమేదో తాండవిస్తోంది..
దారి తెలియక దిక్కులెతుకుతూన్న నాకు ఓ చెయ్యి దారి చూపింది.. 
పూ ..తోట తలుపులు మాత్రం ఎవరో మూసివుంచారు.. 
మునివేళ్ళతో మీటుదామనుకున్నా,
మునిపెదవులతో తాకుదామనుకున్నా, 
ఈ ముదిత కనుసన్నల కోసం ఆర్తిగా ఎదురు చూసాను.. 
ఆపాటికే ఆమె నా వెచ్చని ఆవిర్లు మధ్యన 
లతలా అల్లుకుంటూ కొవ్వొత్తిలా కరిగిపోతూ ఉంది.. !!

వేకువ మంచులా వొళ్ళంతా చెమట.. 
కళ్ళలో సుఖాక్షరాల పరస్పర స్పర్శావేశాలు 
నన్ను నువ్వు, 
నిన్ను నేనూ, 
ఆక్రమించుకున్న గతనిశీధి జ్ఞాపకాలు.. 
గదిలో నిశ్శబ్దాన్ని చీలుస్తూ నిట్టూర్పుల ఊపిరి ఆవిర్లు 
సర్పబంధ రహస్యాన్ని చేధిస్తూ 
మంచు పొగలా కమ్మిన ఒక అలౌకిక ఆనందం.. 
వేళ్ళలోకి వేళ్ళు తన్నుకుంటూ 
ఒకర్నొకరు సున్నితంగా స్పృశించుకుంటున్న 
రెండు అనాది జీమూతముల రహస్య ఆక్రందన 
ఆపాదమస్తకపు అగ్ని సరస్సులో నురగలా 
కరిగిపోతున్న రెండు దేవతా వస్త్రాలు 
బింబం ప్రతిబింబాల్లా 
నీలోకి నేనూ,
నాలోకి నువ్వూ 
ఏకమైపోతున్న 
ఒకే ఒక్క ఆధ్యాత్మిక సందర్భమది..!
ఆనందఖేలి శృంగార ఘట్టమిది..!!

Written by : Bobby Nani

No comments:

Post a Comment