Wednesday, January 3, 2018

ఓ కావ్యమా, నువ్వైనా చెప్పు తనకు..


చిరు జల్లులు నను తాకాలని మీద మీదకు వాలుతుంటే..
చెంతనున్న చకోరి .. తన కొంగు గూటిలో నను బిర బిర చేర్చుతుంటే.. 
తన పెదవుల వెచ్చని ఊపిరి .. నా చెక్కిలిని తీపిగా ముద్దాడుతుంటే ... 
రెప్పలు రెండూ తమకమునొందు సమయమున, 
తన ఎద చప్పుడు చెప్పాలనేదో ఆరాటపడుతుంటే,
మౌనం మా మధ్య నాట్యమాడే వేళ..
చిటపటమని రాలుతున్న చిరు చినుకులు చెప్పే 
సప్త స్వరాలే మా యీ ఏకాంత కావ్యం.. !!

తన రూపం నిజంగానే సమ్మోహనమే..
తన నవ్వులో ఎప్పుడూ నూతనత్వమే.. 
తన మువ్వల చప్పుడు ఏనాడూ వినలేదు.. కానీ 
తన అడుగుల చప్పుడు నా మదికెప్పుడూ దగ్గరే.. 
మట్టి గాజుల గలగలలు ఏనాడూ చూడలేదు .. కానీ 
తన మునివేళ్ళ కౌగిలింతలు ఎప్పుడూ నా అక్షరాలతోనే.. 
చిగురుటాకు వెనుక దాగిన నీటి చుక్కలా తన సిగ్గు ఎంత బాగుంటుందో... !
నింగి నుంచి నేలకు వంగిన ఇంద్రధనువులా నవనీతమద్దె నెలవంక నడుము..,
లాగి ఎక్కుపెట్టిన ధనస్సులా.. తన చూపుల శరములు.. 
ఒక్కొక్కటిగా నాపై వాలటం .. మరెంత బాగుంటాయో.. 

ఓ కావ్యమా,
నువ్వైనా చెప్పు తనకు..
మునివేళ్ళ మధ్యన కలం కలవర పడుతోందని ..!

ఓ కనకమా,
నీ పచ్చని సొగసులు తన దేహ సౌందర్యానికి సోబగులని 
నువ్వైనా చెప్పు ..!

హృదయ కవాటాల మధ్యన బిగుసుకున్న ఓ జ్ఞాపకానివై 
నా మస్తిష్కానికే ప్రేమ పాఠాలు నేర్పుతూ వ్యసనమైపోయావే..
నువు రాల్చిన ఒక్కో గడియ యుగాలై సాగెను.. 
ఇక క్షణము కూడా తాళలేను ..
బిర బిర నను చేరగ రావా ... నా 
ఎద తలుపులు తెరిచి ఉంచా.. !!!

Written by : Bobby Nani

No comments:

Post a Comment