Saturday, January 13, 2018

కవిత్వం ఎక్కడ పుడుతుంది ??



కవిత్వం ఎక్కడ పుడుతుంది ??
అక్కడా, ఇక్కడా అని ఎలా చెప్పను 
ఎక్కడ పడితే అక్కడ, 
ఎలా పడితే అలా
ఓ భావావేశం ఉన్నట్లుండి 
హృదయాన్ని తాకుతుంది 
ఇక అంతే అప్పటివరకు కనిపించిన ప్రపంచం 
కవి నేత్రంతో రంగులమయం అవుతుంది 
రాలిన ప్రతీ భావాన్ని 
కలములోని సిరాలో బంధించి 
రమణీయమైన అక్షరాలను 
రమ్యంబుగ ప్రసవిస్తాడు కవి.. !!


కవిత్వం ఏ ఒక్క భావానికీ అతీతం కాలేదు 
తొంభై ఏళ్ళ ముదుసలి మోము మడతలలో 
అనుభవాల సౌందర్య సారాన్ని ప్రస్తావించనూగలడు..!!
పందొమ్మిదేళ్ళ పడతి యెవ్వన ప్రాయంలో
పరిణేత అధరాల ఆటలో నీల్గి బొటనవ్రే
లంచున నిలిచే మధుర క్షణాన్నీ రాయగలడు.. !!

అరుణోదయం చూడని పేదరికాన్నీ, 
గంజి ముట్టని పెద్దరికాన్నీ, 
ప్రసవవేదనలోని తల్లి అంతరంగాన్నీ, 
తొలిసంధ్యా వెచ్చని కిరణాన్నీ,
వేకువ కుసుమపు పరిమళాన్నీ, 
హృదయం పగిలిన వేదననీ 
ఒక్కటేమిటి 
ప్రతీ భావనలో కవిత్వం జనియిస్తూనే ఉంటుంది.. 
నవీన ఊపిర్లు ఊదుతూనే ఉంటుంది.. !!

Written by : Bobby Nani

No comments:

Post a Comment