Wednesday, January 31, 2018

కవిని చూద్దామని అతని ఊరెళ్ళాను...



కవిని చూద్దామని అతని ఊరెళ్ళాను 
నా ఆలోచనల పునాదుల్ని కుదిపేసినవాడు 
ఆవేశపు అలజడిని కన్నీటితో కరిగించినవాడు.. 

ప్రశాంతమైన నిద్రలేని రాత్రుల్ని వరంగా అందించినవాడు 
అలంకారాలు లేని అక్షరాలకు వ్యాపకశక్తి ప్రసాదించినవాడు 
అతడెలా ఉన్నా .. ఆ కళ్ళలో వెలుగును చూద్దామని వెళ్లాను..

ఆనందం అనుభూతి ప్రధానమని 
సూదిమొనకు సున్నితత్వం అద్దేవాడ్ని 
ప్రేమను పదాలతో పంచేవాడ్ని 
దయను ఆర్ద్రం చేసేవాడ్ని 
కానరాని వరాలను గుప్పిట అందించే 
రూపం చూడ్డానికి ... వెళ్లాను. 

కళ్ళను చూపుతో తడుముదామని.. 
చేతిని చేతితో కలుపుదామని 
ఇతనూ మనలాంటివాడే కదా అనుకున్నప్పుడు 
నామీద నాకు గౌరవం పెరిగింది.. 
కవిని కనుగొనాలని దిగంతాలలోకి దూకగలనా .. 
వెలుగుని వెతుక్కుంటూ చీకటి బాట పట్టగలనా.. 
అగ్గిని జల్లే ఆకాశాన్ని చుట్టుకున్న వాడ్ని నేను 
చల్లబరిచే సమీరాన్ని చేరాలని కోరుకునేవాడ్ని 
కలల భస్మపు రాశితో బాటలు పరిచేవాడ్ని 
గమ్యం చేరలేని దారని తెలిసినా 
భుజం తట్టే చేతికోసం అలుపెరుగక ప్రవహిస్తున్న వాడ్ని 
కవి సముద్రమో కాదో.. జట్టు కట్టిన సంతోషంలో తేలి 
సాటి నదిలా కలిసి పారి... తనలాంటి జీవితంతో సంగమిద్దామని 
అన్నిరుచుల మట్టినీ ముద్దాడుతూ కథ ముగిద్దామని వెళ్లాను
రేపటి నూతన ప్రస్థానానికి.. !!

Written by : Bobby Nani

No comments:

Post a Comment