Thursday, January 11, 2018

అక్షర కిరణం ...


నేటికి నా అక్షరారణ్యం అనే బ్లాగ్ మొదలు పెట్టి సంవత్సరం ఆరు మాసములు కావస్తోంది.. ఇన్నిరోజులూ నా అక్షరాలను మోస్తూ తనలోనే ఇముడ్చుకుంది.. ఎందరో పాఠకులకు ఓ వేదికలా మారింది.. మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను అందించింది.

ఎన్ని రాసినా, ఎంత రాసినా ఇంకా ఏదో లోటు .. నిన్న ట్విట్టర్ లొ చూస్తే ముఖపుస్తకాన్ని ట్విట్టర్ తో జత చేసినప్పటినుంచి నిన్నటిదాకా 3,897 పోస్ట్ లు అని చూపించింది .. ఈ మధ్య రాసినవే అన్ని ఉంటే గడచిన 5 ఏళ్ళుగా ముఖపుస్తకంలో వ్రాసినవి ఎన్ని ఉండాలి.. 12 వ ఏటనుంచి కాగితాలలో రాసినవి మరెన్ని ఉండాలి..

నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది.. నేను ఇన్ని రాసినందుకు కాదు.. తెలుగు భాషలో 16 అచ్చులు, 38 హల్లులు ఉన్నాయి.. నకార పొల్లు మరియు నిండు సున్న తో కలిసి 56 అక్షరములు ప్రస్తుత మన మనుగడలో ఉన్నాయి.. అలాంటి 56 అక్షరములను నేను ఇన్ని వేల అక్షరాలుగా మలచగలిగానా అనే ఆశ్చర్యం .. ఆ ఆశ్చర్యంలో చిరు ఆనందం కూడా కలుగుతోంది..

తెలుగు ఇప్పుడిప్పుడే మళ్ళి బ్రతుకుతుంది అనడంలో అతిశయోక్తి లేదు .. ఎందుకంటె ముఖపుస్తకం వేదికగా మారింది.. ఎందరో కవులు, రచయితలు ఇక్కడ కొలువుతీరారు.. వారి అక్షరాలకు జీవం పోస్తూ ఇందులో అనంతమైన అక్షర మాయా లోకంలోకి వారు మనల్ని తీసుకువేళ్తున్నారు .. చిరు రచయితలు వారి అక్షరాలను పదును పెంచుకుంటూ పోటా పోటీగా ముందుకు దూసుకుపోతున్నారు.. ఇదంతా ఈ ముఖపుస్తకం వల్లే సాధ్యం.. మనం మంచిగా ఉపయోగిస్తే రంగులమయమే అవుతుంది.. ఎలా ఉపయోగించాలో మనచేతుల్లోనే ఉంది..

వీటన్నిటినీ పురస్కరించుకొని అక్షరాలపై నా చిరు కవిత..

అక్షర కిరణం 
************

విధి విరామంలేని సమయాల్లో కూడా 
పెల్లుబుకుతాయి నాలో ఊహాగానాలు..
మనసులో పేరుకున్న అనుభవాల మంచుగడ్డలు,
ఆవేదనావేడి కిరణాలకు కరిగి అక్షర రూపంలో,
భావతరంగాల ఎగుడు దిగుడు లోయల్లో ప్రవహించి, 
ప్రశాంత పరిసరాలకు చేరుకున్న, 
కవితా వాహినే నా ఈ “అక్షరారణ్యం” ..!!

అరుణకాంతి రేఖల్లో, 
మెరుపుతీగల చణుకుల్లా,
నా ప్రతీ కవనంలో ఉంటూనే ఉంటాయి 
కొన్ని తళుకులు.. బెళుకులు..!!

ప్రతీ పుట, 
ప్రతీ అక్షరం, 
మెరుపు తీగలే అయితే,
కవ్యాకాశం కాగలదా ఆకర్షనీయం..!! 
కవితకు అంశాలు, సమకాలీనం కావాలి ..
సమాజ జీవితం అందులో అడుగడుగునా ప్రతిబింబించాలి.. 
వ్రాసింది సామాన్యునికి అర్ధం కావాలి..
ఊహల ఛాయా చిత్రం కవిత వెలుగు నీడలకు 
రంగులు దిద్దడమే అవుతుంది కావ్య చిత్రపటం 
అనుభవాలకు అద్దంలో అర్ధం చూపడమే కవనం.. !!

కవితా ఉత్పత్తికి కారణం, 
హృదయ వీణాతంత్రులను సవరించి మీటడం.. 
నివురుగప్పిన భావాలను విసిరి రగిలించడం..
ఎగిరే ఊహా విహంగాలకు, 
కలం సిరా దారాలతో ఉచ్చులు వేయడం.. 
ఏదో చెప్పాలనే మంచుపొరల ఆవేదనలను 
అక్షర కాంతితో ద్రవింపజేయడమే నిజ కవిత్వం.. !!

Written by : Bobby Nani

No comments:

Post a Comment