Saturday, December 30, 2017

ఇక నేటితో మా “డాక్యుమెంట్ రైటర్” అవసరం లేదు అనుకుంటున్నాను...



ఇక నేటితో మా “డాక్యుమెంట్ రైటర్” అవసరం లేదు అనుకుంటున్నాను...ఈ వ్యవస్థను నమ్ముకొని వేల మంది రోడ్డున పడుతున్నారు.. కాని దాని గురించి దిగులు లేదు.. ప్రజలకు మంచి విధి విధానాలతో సులభతరంగా, సౌకర్యవంతముగా, స్వల్పతరమైన ఖర్చులతో వారికి మంచి జరుగుతుందంటే మేము దీన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాము..

నిజాలు ఒప్పుకోవాలి మరి..

మాలో కొందరు చాలా దారుణంగా వున్నారు... లంచాలను ప్రోత్సహించడం, వారి పరపతిని వుపయోగించి నయానో, భయానో వారి పని చేయించుకోవడం, ప్రజలను నడ్డి విరిచేలా దోచుకోవడం ఇదే వారి పనిగా కొందరు “డాక్యుమెంట్ రైటర్” లు నిత్య జీవన విధానం అయిన నేటి తరుణంలో ప్రజలకు ఓ కనువిప్పు కలిగించేలా, అక్షరానికి విలువకట్టే మా లో కొందరు రైటర్ల వికటాట్టహాసాలకు, వికృతి చేష్టలకు ఓ చెంపపెట్టులా నేడు స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ ఆశాజనకంగా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వున్నాను.. అలానే చదువు వుండి ఈ వృత్తినే నమ్ముకున్న మాలాంటి యువకులు వేలల్లో వున్నారు.. వారి గురించి కూడా ఓసారి ఆలోచిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను..

అలానే మీరు G.O. లో చెప్పినట్లు ప్రజలే ఇంటిదగ్గరనుంచి తమ ఆస్తిని క్రయం లేదా విక్రయం చెయ్యాలంటే online లో నగదుని కట్టేసి ఎవరికి వారే Fill in the Blanks లో దస్తావేజుని తయారు చేసుకోవచ్చని తీర్మానించారు .. ఇది ప్రతీ ఒక్కరు ఇలా చెయ్యగలరని మీరు భావిస్తున్నారా ?? నగదు రహిత లావాదేవీలకే జనం ఇంకా అలవాటు పడలేదు.. ఇలాంటి సమయంలో ఈ విధి విధానాలు విజయం సాధిస్తాయని మీరు నమ్ముతున్నారా ?? 

మరైతే illiterates సంగతి ఎలా ??

వారు వారి ఆస్తిని విక్రయించాలంటే ఎవరిదగ్గరకు వెళ్ళాలి?? 

మీరే అలాంటివారికోసం ఆఫీస్ లలో ఏవైనా సదుపాయాలు కల్పించి వారి దస్తావేజులను మీరు తయారు చెయ్యగలరా ?? 

ఇలాంటి విషయాల గురించి మీరు ఎక్కడా ప్రస్తావించలేదు..

ఇక పోతే స్వాతంత్ర్యం రాకముందు రాసిన గ్రాంధిక సరళి గొలుసు కట్టు రాతలకు ఇక ముగింపు అని రాసారు... Mother Document అనేది పాత రోజుల్లో గొలుసు కట్టు రాతలతోనే రాస్తారు.. అది అర్ధం చేసుకుంటేనే దాన్ని ఆధారంగా చేసుకొని మిగతా లింకు డాక్యుమెంట్లు అర్ధం అవుతాయి.. మరి మా అవసరం లేదన్నారు.. ఇది చదివేవారు మాలోనే అతి స్వల్పంగా వున్నారు.. దానికి మీ సమాధానం ??

Fill in the Blanks లో దస్తావేజుని తయారు చేసుకోవచ్చని అన్నారు.. ఓ ఐదేళ్ళ క్రితం జరిగిన చిన్న విషయం చెప్పాలనిపించి చెప్తున్నాను..

ఒకవ్యక్తి కొనుగోలు కొరకు వచ్చాడు.. ఆ దస్తావేజులో ఓ లేఖరి పొరపాటున “రూము పోను” అని రాయుటకు బదులుగా “రూము తోను” అని రాయడం జరిగింది .. విషయం ఏంటంటే అమ్మే వ్యక్తికి ఒక పెద్ద ఇల్లు వుంది.. అందులో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక మూలన చిన్న రూము వుంది.. ఆస్తి మొత్తం అమ్ముతాను కాని ఈ రూము మాత్రం నేను అమ్మను నేనే ఉంచుకుంటాను అని ఆయన చెప్పారు.. నిజానికి ఆ దస్తావేజులో ఇలా రాయాలి “రూము పోను సదరు ఆస్తి మీకు చెంది... అది మొదలు మీరు, మీ వారసులు దాన, విక్రయ, వినిమయాధి సర్వ, సంపూర్ణ హక్కులు కలిగి ఆచంద్రార్కస్థాయిగా అనుభవించుకోవలసినది” అని రాయాలి...

కాని నిజానికి ఇలా రాసారు.. “రూము తోను సదరు ఆస్తి మీకు చెంది... అది మొదలు మీరు, మీ వారసులు దాన, విక్రయ, వినిమయాధి సర్వ, సంపూర్ణ హక్కులు కలిగి ఆచంద్రార్కస్థాయిగా అనుభవించుకోవలసినది” అని ... అంటే ఆ రూమును కూడా కలిపి ఆ కొన్న అతనికి హక్కులు కల్పించేసారు.. “పోను” “తోను” చూసారా యెంత చిన్న సవరణ పడిందో.. ఈ చిన్న సవరణకు ఆయన మళ్ళి ఖర్చు పెట్టాల్సి వచ్చింది..

ఇంత స్వల్పమైన పాయింట్స్ ని వొళ్ళు దగ్గరపెట్టుకొని రాయాల్సి వుంటుంది మేము.. ఒకటికి పదిసార్లు నానార్ధాలను, ద్వందార్ధాలను సరి చూసుకొని ప్రతీ అక్షరం రాస్తాము.. లక్షల్లో ఆస్తులు కొనుగోలు, అమ్మకాలు జరుగుతుంటాయి వాళ్లకు సమాధానం చెప్పాల్సిన భాద్యత మాది.. ఇంత ఆలోచించి రాయాల్సిన డాక్యుమెంట్లును మీరు Fill in the Blanks అంటున్నారు.. అదే ఆందోళనగా వుంది..

తరువాత “వీలునామా” Will గురించి ప్రస్తావిస్తే .. ఈ వీలునామా లో Fill in the Blanks పెట్టడానికి ఎలా సాధ్యం అనేది నాకు అర్ధం కావట్లేదు.. నేను చనిపోయాక నా ఆస్తి పలానా వారికి చెందాలి అని వారి యొక్క వారసులకు యావదాస్తులను, చీర, చీపురు, చెప్పు, చాటా, తట్టా, బుట్టా ఇలా ఒక్కటేమిటి అన్నీ పంచేస్తారు.. ఒక్కోసారి మరొకరికి చెందజేసి వారు జీవించి ఉన్నంతవరకు వాళ్ళకు రైట్స్ ఉండాలి వాళ్ళ తదనంతరం మరొకరికి చెందాలి అనే “లా” conditions తో రాసే వీలునామాల పరిస్థితి ఏంటి.. ??

ఇద్దరి మధ్య ఒప్పుదల లావాదేవీలతో మాటలతో కూడిన దస్తావేజులను ఎలా రాయగలరు ??

దత్త స్వీకార పత్రం “Adoption Deed” ఇందులో ఎలాంటి ఆస్తి వుండదు.. ఒకరిని శాస్త్రీయంగా దత్తత తీసుకునే విధి, విధానాలు మేము ఇప్పుడు దస్తావేజులో రాస్తున్నాం Fill in the Blanks లో రేపు మీరెలా రాస్తారు ??

ఇక “Unregistered Documents” రిజిస్ట్రేషన్ కాకుండా నోటి మాటలతో జరిగే లావాదేవీల ప్రక్రియల గురించి మీరు ఎక్కడా ప్రస్తావించలేదు..

Sale Agreeent – విక్రయానికి ముందు జరిగే అడ్వాన్సు అగ్రిమెంట్ ...

Agreement with possession – విక్రయం జరగని పక్షంలో స్వాదీనం చేసినట్లు రాసుకొనే పత్రం..

Un Registred Settlement – కుటుంబ సభ్యులకు ఉచితంగా చెందజేసే పత్రం

Ratification – ఒప్పుదల (ఇద్దరు మనుషుల మధ్యన కట్టుబడి ఉండాలి అని రాసుకునే పత్రం) 

Relinquieshment – హక్కు విడుదల (ఇద్దరికి హక్కుగల ఆస్తిని ఒకరు హక్కును వదులుకునే పత్రం) 

Lease Deed – బాడుగ ఖరారునామా (నీ స్వంత ఆస్తిని నువ్వు అడ్వాన్సు తీసుకొని టైం పెట్టుకొని ఇతరులకు బాడుగకు ఇచ్చే పత్రం)

Partnership Deed – నూతనంగా ఇద్దరు లేదా కొందరు కలిసి వారి మధ్య ఒప్పందాలను, వారుపెట్టిన ఖర్చులను, రాబోవు లాభాలను వివరంగా రాసుకొనే పత్రం..

ఇలా ఒక్కటేమిటి వందల్లో వున్నాయి.. 

డాక్యుమెంట్ రైటర్ లేకుంటే ఇవన్నీ ఎలా జరగాలి ??

సరైన ప్రాస నియమాలతో, అర్ధవంతమైన పద ప్రయోగాలతో, అక్షర దోషాలు లేకుండా ఎన్నో సంవత్సరాలనుంచి ఈ వృత్తిని నమ్ముకొని ఒకరు మరొకరికి వారి జ్ఞాన సంపదను అందిస్తూ ఓ కుటుంబం గా జీవిస్తున్న వారికి నేడు ఈ దుస్థితి రావడం నిజంగానే శోచనీయం ...

కేవలం.....కేవలం కొందరు దారితప్పిన “అక్షర అసురుల” తప్పిదానికి యావత్ “అక్షర జ్ఞానులు” నేడు తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది..

మార్పు రావాలని కోరుకుంటున్నాం.. 

అందుకు మావంతు మేము ఎప్పుడూ సిద్దమే..

కాని ఆ మార్పు నేడు వున్న స్థితి గతులకన్నా దయనీయమైన స్థితిలో ఉండకూడదని ఆశిస్తూ సెలవు...

Written By : Bobby Nani

No comments:

Post a Comment