Monday, December 18, 2017

నిన్ను మొదటసారి చూసింది ద్విగుణీకృతమగు ఆ నల్లని శిరోజాల మధ్యన నుంచే.. !!



నిన్ను మొదటసారి చూసింది 
ద్విగుణీకృతమగు ఆ నల్లని శిరోజాల మధ్యన నుంచే.. !!

కనిపించీ కనిపించని ముఖమును చూస్తూ 
కనురెప్పలు రెండూ రెపరెపలాడే కవాటాల్లా కొట్టుకున్నాయి 
ఎన్నో గడియలు నీ, .. నా మధ్య నుంచి నేల రాలుతున్నాయి.. 
అయినా నీ రూపం కనిపించదే .. !!

తపనల తలంపులతో నిలువెల్లా తపించిపోతున్నాను.. 
రోజూ పుష్పించే పుష్పాలతో 
అగరొత్తుల వొత్తైన ఆ శిరోజాల్ని 
నా చేతులతో అలంకరించే రోజుకోసం వేచివున్నాను.. !!

శీతల సముద్రంలోకి ఎగిరొచ్చిన దగ్గరనుంచి
మరణాన్ని మించిన నీ నిశ్శబ్దం 
నను హత్య చెయ్యాలని వెంటాడుతోంది.. 
నీ విరహం నా దేహాన్ని సూదిమొనల్లా తాకుతోంది.. !!

తుమ్మెద రెక్కల వంటి ఆ కనురెప్పలు.. 
కలువలవంటి ఆ నేత్ర త్రయములు...
లేత మీగడ వంటి చెక్కిలి.. 
మరగ కాగినట్టి పాల సొగసు.. 
వీణానాదము వంటి మృదు మధుర వాక్కు..
చూసి చూడగానే విశాల నితంబాలతో 
పులకరింపజేస్తూ, పలకరించినట్లనిపించింది.. !!

ఆ రూపం ఎప్పుడు నన్ను కౌగిలించుకుందో కానీ 
నాటి నుంచి భావాలన్నీ నాలో వక్రంగా 
ధ్వనిస్తున్నాయి..
సంకేతాల మధ్య ఒంటరితనాన్ని అనౌచిత్యంగా 
అలంకరించుకుంటున్నాయి..!!

నీ భావాల కలల అలలతో నేనల్లిన వలల్ని 
నల్దిశలా వెదజల్లుతున్నాను 
ఈ అక్షర మాలికల రూపంలో .. నీ
పరువపు సొగసు, సొబగులను 
వొడుపుగా పట్టడం నేర్చుకున్నాను
అందుకే అందరూ బంగారాన్నేరుతుంటే 
నేను మాత్రం ఈ “బంగారం” జ్ఞాపకాల్ని అన్వేషిస్తున్నాను.. !!

Written by : Bobby Nani

No comments:

Post a Comment