Friday, December 22, 2017

ఓ షార్ట్ ఫిల్మ్...


నేను ఓ షార్ట్ ఫిల్మ్ కు రాసిన స్టొరీ ఇది.. 

సమాజానికి వినోదంతో పాటు ఓ ఆలోచనను కూడా కలిగించాలి... అది మన వ్యక్తిగత భాద్యత.. అలాంటి ఆలోచనలతో కూడిన రచనలు, బుద్దిని, తర్కాన్ని కలిగించే వ్రాతలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. 

ఓ నలభై అయిదేళ్ళ వ్యక్తి తనగదిలో నిద్రపోతూ... పోతూ ... ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు.. అప్పుడు సమయం పావు తక్కువ 6 కావస్తోంది.. !!!

భారంగా తను అడుగులేస్తూ ప్రక్కన వున్న టేబుల్ దగ్గరకు వెళ్ళి నీళ్ళ బాటిల్ లొ వున్న నీరుని గుట గుటా గుక్కతిప్పుకోకుండా తాగేసాడు.. తను చాలా తీవ్ర ఒత్తిడికి లోనౌతున్నట్లుగా కనిపిస్తున్నాడు .. టేబుల్ ప్రక్కన వున్న కుర్చీలో కూర్చుని టేబుల్ కి దగ్గరగా జరిగి అక్కడ ఉన్నటువంటి పేపర్లో ఏదో రాయడం మొదలు పెట్టాడు.. 

కొన్ని క్షణాల అనంతరం తన కళ్ళజోడును చాలా భారంగా తీస్తూ .. కళ్ళు తుడుచుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చి లేచి నిల్చున్నాడు.. నాలుగు అడుగులు ముందుకు వేసి తన తలను నెమ్మదిగా పైకి ఎత్తాడు.. పైన సీలింగ్ కి అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఉక్కుకి ఓ ఉరితాడు వ్రేల్లాడుతూ ఉంది.. !!!

అక్కడవున్నటువంటి కుర్చీ లాక్కొని తన తలకు ఆ ఉరితాడు బిగించి వణుకుతున్న తన శరీరంతో, నీరు చిమ్ముతున్న కళ్ళు రెండూ గట్టిగా మూస్తూ, తన రెండూ చేతులతో తొడల దగ్గర ఉన్నటువంటి తన ఫాంట్ ని గట్టిగా తన పిడికిళ్ళతో నొక్కుతూ.. ఇక నిలబడి వున్న కుర్చీ ప్రక్కకు తన్నబోతున్న సమయంలో .... 

దూరాన నుంచి మైకులో ఓ స్వరం వినిపించ సాగింది.. !!

మీరు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలో కనుక ఉంటే దయచేసి ఒక్క క్షణం ఇక్కడకు వచ్చి వెళ్ళండి ... ఏమో ఈ ఒక్క క్షణం మీ భవిష్యత్తును, ఈ దేశ భవిష్యత్తును మార్చగలదేమో చూద్దాం .. అని ఆవేశ పూరితమైన ప్రసంగాన్ని చేస్తున్నాడు ఆ వ్యక్తి.. 

ఆ మాటలకు, అతని కంఠ స్వరానికి ముగ్ధుడైన ఈ వ్యక్తి .. ఆలోచిస్తూ .. 
సరే ... ఒక్క క్షణంలో ఎంపోతుంది అని అనుకొని .... ఇతడేం చెప్తాడో విందాం అంటూ ... హటాహుటిన మాట్లాడే వ్యక్తి దగ్గరకు చేరుకుంటాడు.. 

అక్కడకు వెళ్ళి చూసిన ఇతడికి నోటిమాట రాలేదు.. 
అందుకు కారణం అది ఒక అనాధలైన చూపు లేని వాళ్ళ సంరక్షణా కేంద్రం.. అక్కడ వున్నవారంతా కంటి చూపు లేని వారే.. పిల్లల దగ్గరనుంచి వృద్దులవరకు అందరూ ఉన్నారు.. అలా వారిని చూస్తుండగానే ఆ వ్యక్తి ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు... 

ఈరోజు మన 71వ స్వాతంత్ర్య దినోత్సవం... 70 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 71వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాం... దీన్ని పురస్కరించుకొని సమాజం విసిరేయబడ్డ ఈ పుడమితల్లి బిడ్డలమైన మేము కొన్ని మాటలను మాట్లాడదలచి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాము.. దయచేసి మా అభ్యర్ధనను మన్నించి మాకోసం మీ అమూల్యమైన కొన్ని విలువైన క్షణాలను వెచ్చించవలసినదిగా ప్రార్ధించడమైనది.. 

ఇక్కడ ఉన్నటువంటి ప్రతీ ఒక్కరికీ ఒక్కో హృదయ విదారక సమస్య ఉంది.. అయినా మేమంతా సంతోషంగానే బ్రతుకుతున్నాం.. ఈ సమాజం మమ్మల్ని అసహ్యించుకున్నా, ఛీ కొట్టినా, నీచంగా చూసినా అందుకు కారణం మా పుట్టుకే... మేము కాదు.. నిజంగానే ఇలాంటి పుట్టుకను ఎవ్వరూ కోరుకోరు... జీవితాంతం ప్రత్యక్ష నరకాన్ని మేము ఇక్కడే అనుభవిస్తూ ఉంటాము.. వాటికి తోడు కొందరి సూటిపోటి మాటలు మరింత కృంగదీస్తూ ఉంటాయి.. వీటన్నిటినీ భరిస్తూ ఇంకా ఎందుకు బ్రతికున్నామా అని చాలా సమయాల్లో అనిపించింది.. చావు పరిష్కారం కాదని.. దానివల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేదని గ్రహించాము..

అప్పటినుంచి ఏదైనా సాధించి మరణించాలని బలంగా అనుకొని బ్రతుకుతున్నాం.. మన మరణం పదిమందికి ఉపయోగ పడాలేకాని భారం కాకూడదు అనేలా బ్రతుకుతో పోరాడుతున్నాం అని అంటూ..
“జీవితం అంటే మరణించడం కాదు.. సాధించడం” అని తన ప్రసంగాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంటాడు..

అలా వింటూ వున్న ఇతడికి తెలియకుండానే కళ్ళల్లో నీరు ధారలా కారుతోంది.. కళ్ళు తుడుచుకుంటూ ఉండగా ఇతడి దృష్టి ఓ చిన్నారిపై నిలిచింది... ఎనిమిదేళ్ళు ఉంటాయేమో ఆ చిన్నారికి ... నేలమీద పద్మహాసనం వేసుకొని ఎదురుగా వున్న మన జాతీయ జెండా ని రెప్ప వేయకుండా అలానే చూస్తూ ఉంది.. మిగతా పిల్లలంతా చిన్న చిన్న జెండాలు చేతుల్లో పట్టుకొని అల్లరిచేస్తూ అటూ, ఇటూ పరిగెడుతూ ఉన్నారు.. ఆ చిన్నారి దగ్గరకు వెళ్లబోతుండగా ఆ సంరక్షణా కేంద్రాన్ని చూసుకునే ఓ వ్యక్తి ఇలా రమ్మని సైగ చేస్తాడు.. 

ఇది గమనించిన ఈ వ్యక్తి ....ఆ అధికారి దగ్గరకు వెళ్ళి ……నమస్కారం అండి ఏంటి విషయం ? అని అడుగుతాడు 

మీరు ఆ పాప దగ్గరకు వెళ్తుండటం గమనించాను అందుకే పిలిచాను అని అంటాడు.. 

అవును అండి .. ఇందాక నుంచి గమనిస్తున్న ఆ పాప చాలా వ్యత్యాసంగా ఉంది. అందరి పిల్లల్లా లేదు.. అదీ కాక చక్కగా పద్మహాసనం వేసుకొని జండా ను అలానే చూస్తుంది ఎందుకలా చూస్తుంది ??.. ఏమైవుంటుంది అని తెలుసుకోవాలని తన దగ్గరకు వెళ్తున్నాను అని సమాధానమిస్తాడు.. 
ఆ పాప తండ్రిగారు సైన్యం లొ పనిచేసేవారు.. ఈ పాప పుట్టినదగ్గరనుంచి తన తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియని పరిస్థితి.. ఎప్పుడూ ఫోన్ లొ మాట్లాడటం, ఫోటో చూడటమే కాని నిజంగా ఎదురుగా చూసి మాట్లాడింది ఎరుగదు ఆ పాప .. ఆయన విధి నిర్వహణ అలాంటిది మరి !!!.. వారి అమ్మా, నాన్నది ప్రేమ వివాహం.. అందరిని వదిలి వచ్చేశారు.. ఓరోజు ఎదురు కాల్పులలో దేశంకోసం తన ప్రాణాలను అర్పించాడు.. 
మొదటిసారి తన తండ్రిని చూడటం.. 

శరీరంపై మొత్తం మన దేశ జండాను కప్పి మొహం మాత్రం కనిపించేలా ఉంచారు.. 

ఈ సృష్టిలో తన తండ్రిని మొదటిసారి ఇలా ఏ బిడ్డా అలా చూడలేదేమో .. అప్పటినుంచి ఆ పాప ఇలా అయిపోయింది .. 

మరి తన తల్లి దగ్గర కాకుండా అనాధలా ఇక్కడెందుకు ఉంటుంది ?? అని ప్రశ్నిస్తాడు ఈ వ్యక్తి 

తన భర్త మరణ వార్త విని ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని కన్నీరును తుడుస్తూ చెప్తాడు.. 

అది విన్న ఈ వ్యక్తి కన్నీటి బిందువులు టప టపా నేల రాల్తున్నాయి.. 
ఇంత చిన్న వయస్సులో ఆ పాపకు ఇంత పెద్ద శిక్షా.. అని అనుకుంటూ ఉండగా.. 

ఆ అధికారి తన కళ్ళు తుడుచుకుంటూ బాధాకరమైన విషయం ఏంటంటే తన తల్లి చనిపోయిందని కూడా ఆ పాపకు తెలియకపోవడం.. అని చెప్తాడు..

To be Continued … 


Written by : Bobby Nani

No comments:

Post a Comment