Friday, December 29, 2017

చెట్లు మన మాటలను వింటున్నాయ్ ..!!


చెట్లు మన మాటలను వింటున్నాయ్ ..!!
*****************************

“మీరు చెట్లతో మాట్లాడండి – మీ మాటలు చెట్లు వినగలవు, అర్ధం చేసుకోగలవు” 
అంటున్నారు కొందరు వృక్ష శాస్త్రజ్ఞులు .. ఇంతకుముందు జరిగిన వృక్ష శాస్త్రజ్ఞుల సమావేశ సభలో చెట్లు కూడా అనేక అనుభూతులకు లోనౌతాయని, మన మాటలను అర్ధం చేసుకొని స్పందిస్తాయని ఆ సభలో శాస్త్రజ్ఞులు సూచించారు.. 

మన భారతీయ సంస్కృతిలో చెట్లను పూజించడం కూడా ఓ ప్రముఖమైన ఆచారముగా ఉంది.. 
ఉదాహరణకు ప్రతినిత్యము “తులసి” చెట్టును పూజించడం మనకు తెలిసినదే.. 

రాజస్థాన్ లోని స్త్రీ లు జూన్ నెలలో ఒక నిర్ణీత దినాన “మఱ్ఱి” చెట్టును పూజిస్తారు.. పూజ అనంతరం “ఓ మహా వృక్షమా ! నా భర్తను అన్నీ ఆపదలనుంచి రక్షింపుము, అతణ్ణి అదృష్టశాలిని చేయుము” అని ప్రతీ ఏటా బిగ్గరగా వేడుకుంటూ వుంటారు.. ఆ మఱ్ఱి చెట్టు వారి మాటలను వింటుందని, వారికి శుభములను కలుగజేస్తుందని అక్కడి ప్రజల నమ్మకం..

ఇదే విధంగా కాలిఫోర్నియాలోని లూథర్ అనే శాస్త్రవేత్త వృక్ష శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసాడు.. ఈయన ప్రత్యేక శ్రద్ధతో “నాగ జెముడు” చెట్లను పెంచుతున్నాడు...నాగజెముడు చెట్టు నిండా ముళ్ళు ఉండుట దాని సహజ లక్షణం.. కానీ లూథర్ పెంచే నాగ జెముడు చెట్లకు ముళ్ళు వుండవు...అదే ప్రత్యేకత !!

లూథర్ వాడే విత్తనాలు మమూలువే .. 
అందరిలానే తనూ పెంచుతున్నాడు.. 
కానీ నాగ జెముడు మొక్కలకు ప్రతీరోజూ నీళ్ళు పోస్తూ “ఇతరులను బాధించే ముళ్ళు మీకు అవసరం లేదు.. నేను మీకు ఏ ఆపదా రాకుండా కాపాడుతాను” అనే వాడట.. ఆ మాటలను అర్ధం చేసుకున్న నాగ జెముడు చెట్లు ముళ్ళు లేకుండానే పెరుగుతున్నాయట .. ప్రపంచం మొత్తం మీద నాగ జెముడు చెట్లుకు ముళ్ళు లేకుండా వున్నది ఒక్క లూథర్ గారి తోటలోనేనట.. ఈ వింతను చూసేందుకు చాలామంది ప్రత్యేకంగా వెలుతున్నారట.. 

అలానే 1900 వ సంవత్సరములో ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త జగదీశ చంద్ర ప్రసాద్ వృక్షాలకు ఇరవై విధాలైన గ్రహ్యశక్తి ఉంటుందని .. నరాల సముదాయం లేకపోయినా అవి శ్వాసిస్తాయని, ఆహారాన్ని జీర్ణం చేసుకుంటాయని, కండరాలు లేకపోయినా కదలగలుగుతాయని ప్రకటించారు.. 

ప్రాణమున్న జీవులు ఎండ తీవ్రతకు వాడిపోతాయి. అలాగే చెట్లు కూడా అధిక వేడిమికి వాడిపోతాయి.. క్లోరోఫాం వాసనకు ప్రాణులు మూర్చపోతాయి.. అలానే చెట్లు కూడా మూర్చపోతాయని ఆయన చెప్పారు.. 

“డొరోతీ” అనే మహిళా వృక్ష శాస్త్రవేత్త 1968 వ సంవత్సరములొ మొక్కల మీద కొన్ని ప్రత్యేక ప్రయోగాలు చేసి సంగీతానికి, వాయిద్యాల శబ్దాలకు చెట్లు స్పందిస్తాయని సూచించారు.. పల్లెల్లో పంట పొలాల్లో కార్మికులు, పొలం పనులు చేస్తూ పాడుకునే పాటలకు మొక్కలు స్పందిస్తాయని... అవి ఉత్సాహంగా పెరిగి మంచి పంటను అందిస్తాయని ఆమె చెప్పారు.. ఇంటి ఆవరణంలో చక్కని వాతావరణం ఉంటే ఆ మొక్కలు బాగా పెరుగుతాయని.. అలా కాకుండా రోత పుట్టించే అధిక శబ్దాలు, వాయిద్యాలకు చెట్లు వాడిపోతాయని .. ఆ శబ్దాన్ని అవి భరించలేకపోవడమే అందుకు గల కారణం అని చెప్పారు “డొరోతీ” గారు.. 

మనం తోటలో పెంచుకునే మొక్కలు మనం చూపించే స్నేహం, ప్రేమ వల్ల చాలా ఆనందంగా పెరుగుతున్నాయని జర్మనీకి చెందిన శాస్త్రవేత్త “ఫ్రాంకాస్” మరియు రష్యాకు చెందిన “పోటో వీటోనే” గార్లు కొన్ని వ్యాసాల్లో వ్రాసున్నారు.. 

తెలిసో తెలియకో మనం చెట్లను అనేక రకాల బాధలకు గురి చేస్తూ ఉంటాము కదా.. అంతెందుకు నేనే ఎన్నోసార్లు నా చిన్నతనంలో క్రికెట్ ఆడేందుకు వికెట్స్ కోసం మంచి వాటంగా వుండే కొమ్మలనే విరిచే వాడిని.. అలా ఎన్నో చెట్లను బాధించాను.. మొక్కల గురించి ఇవన్నీ తెలుసుకున్నాక నిజంగా చాలా బాదేసింది.. ఇక నా వల్ల ఏ మొక్కకు బాధ కలగకూడదనే ఆలోచన నాలో కలిగింది.. ఇలాంటి ఆలోచన కనీసం చదివే ఒక్కరిలో అయినా మెదుల్తుందనే సదుద్దేశంతో ఇదంతా నేను మీకోసం రాయాల్సి వచ్చింది.. నా ఉద్దేశంలో వెయ్యిమంది చదవడం గొప్ప కాదు.. ఒక్కరు మారి ఆ మారిన విషయాన్ని మనతో పంచుకుంటారే అదండీ నిజమైన సంతృప్తి.. 

ఆ ఒక్కరికోసమే నా ఈ ప్రయాస..!!

స్వస్తి __/\__

Written by : Bobby Nani

No comments:

Post a Comment