Friday, November 10, 2017

భావ కవిత్వం...


భావ కవిత్వం వ్రాసి చాలా రోజులైంది అనుకుంటే.. అందులోను ప్రకృతిపై వ్రాసి అనేక దినాలు కావస్తోంది.. స్నేహితులు మాత్రం ఎక్కువగా శృంగార వర్ణనను, ఈ భావకవిత్వాన్ని పదే పదే పర్సనల్ గా అడుగుతూనే ఉన్నారు.. మరోమారు విన్నవిస్తున్నాను నేను ఏ ఒక్క భావానికీ అతీతుడను కాను.. __/\__ 


గాలి వీస్తుంది 
ఆకుల మృదుత్వాన్ని ఆస్వాదించాలని..
మల్లెమొగ్గ 
బుగ్గల్ని చిదిమి పరిమళాల ముగ్గుల్ని 
ప్రతి గుమ్మంముందూ అలంకరించాలని.. 
మంచు కురుస్తూంది
భూమి ఉష్ణోగ్రతను కొలుచుకుంటూ 
కొండల్ని, కోనల్ని కౌగిలించుకోవాలని.. 
భూమి 
నరాల్ని నీటి బిందువులతో హత్తుకోవాలని.. 

ఆకుల పొత్తిళ్ళూ తహతహలాడ్తాయి
సూర్యకిరణాల్ని ఎత్తుకొని ముద్దాడాలని 
ఒక విచిత్ర అనుభవంగా స్పందిస్తాయి నరాలు 
అనుభూతుల పొరల్లోంచి అమృతం వర్షిస్తున్నట్లు 
ఆకలి రక్తనాళాలూ ఒక్కసారిగా పొంగుతాయి.. 

మెత్తని స్పర్శే బొందిలో ప్రాణాన్ని కొలుస్తుంది.. 
తీయని స్పర్శే నీకు మరో మనిషిని పరిచయం చేస్తుంది.. 
నీ నరాలు మొద్దుబారినప్పుడు 
తల బొప్పి కట్టినప్పుడు 
స్పర్శ నిన్ను పలకరించదు 
నీలో ఊటబావి ఎండిపోయినప్పుడు 
కంటతడి ఆవిరైపోయినప్పుడు 
స్పర్శ నిన్ను వేధించదు 

ఆ .. తీయ్యని అనుభవాన్ని ఆస్వాదించడానికి 
నీలో సముద్రపుటంచులు నిత్యం 
కలల అలల్ని సున్నితంగా ఢీకొంటూ ఉండాలి.. 
గులాబీ పువ్వును కోస్తున్న నీకు 
కొమ్మని కాస్తున్న మెత్తని ముళ్లు 
చటుక్కున చిమ్మిన రక్తం అనుభవంలోకి రావాలి..
మేఘాల వెనుక రగులుతున్న మెరుపుతీగ 
తళుక్కున నీ కళ్ళముందు కదలాడాలి 

సున్నితమైన స్పర్శే
నీలో ఆనందపు లోతుల్ని సృష్టిస్తుంది.. 
నీ ఊపిరిచెట్టు ఉచ్చ్వాస నిశ్వాసాల్లో 
సుగంధ పరిమళాల్ని వెదజల్లుతుంది.. !!

Written by : Bobby Nani

No comments:

Post a Comment