Monday, November 20, 2017

లేక్షణ..


నా చొక్కా గుండీలో నీ శిరోజాలు ముడి పడినప్పుడు 
ఆ కొంటె కౌగిలి నను పులకరించింది.. 
నా మీసం ముళ్ళకి నీ చెక్కిలి ఎరుపును పొంది 
ఆ పెదాల రంగు పోటీ లో పరవశించింది..
కాస్తా ఊపిరి అందించి నీ మెడ వంపున కితకితలకి 
నా మది గాబరా పడింది...
కాటుక చెరిగిన నీ కళ్ళు ఇంకా నే చేసిన ముద్దుల తడిని 
తుడుచుకుంటూనే ఉన్నాయి....
నీ బరువుని మోసిన నా పాదాలకి 
నీ కాలిమువ్వలు ముద్దులు కురిపిస్తున్నాయి...
నీ స్వేదముతో ఈ తనువు దాహము తీర్చుకుంటూనే ఉంది..
అయినా తనివితీరదెందుకనో ... 
తృప్తి చెందదెందుకనో.. !!


అనంత రహస్యాలన్నీ నీలోనే నిక్షిప్తమై వున్నాయి.. 
పున్నమి వెలుగునై నీపై చేరి... ఒక్కో రహస్యాన్ని ఆక్రమిస్తాను... 
ఒక్కో భావానికి ఊపిరి పోస్తాను.. 
నవనాడుల మీటను నొక్కి.. 
కోరికాస్త్రములను ఒక్కొక్కటిగా సంధిస్తాను 
వేగం పుంజిన నీ హృదయాన్ని నా ఛాతి కవాటాలతో కప్పుతాను.. 
నీ దేహానికి ఛందస్సున్నౌతాను ...
చలి గాలి నిను కప్పిన వేళ.. చలినాపే వెచ్చని శగనౌతాను .. 
దోర పెదవులకు గులాబీ వర్ణాన్నౌతాను.. 
నీ కన్నె వనములో తుమ్మెదనై అణువణువున తచ్చాడుతాను.. 
రా...మరి త్వరగా.. 
దిశ్చక్రపు కొసల నుంచి .. 
అఖండ సముద్ర కెరటాలనుంచి .. 
భీష్మించుకు కూర్చున్న బకాసుర కోనలనుంచి ..
పొగమంచు అంచుల నుంచి 
నా స్వరం జన్మించే నీ హృదయ శబ్దం నుంచి ..
కదలి రా .. జ్ఞాపకానివై .. నా కలలకు కనుపాపవై.. 
నా లేక్షణవై .. !!

Written by: Bobby Nani

No comments:

Post a Comment