Monday, November 27, 2017

వేయికళ్ళ రాత్రి..


వేయికళ్ళ రాత్రి.. 
************


ప్రేమికులను ప్రేరేపించేది రాత్రి.. 
కవులకు, గాయకులకు ఉత్సాహాన్ని రేకెత్తించేది రాత్రి.. 
ఆశలకు, కోర్కెలకు, జ్ఞాపకాలకు ఆలయం ఈ రాత్రి.. !!


ఓ రాత్రి.. 
భయమనే ఖడ్గాన్ని ధరించావు.. 
మెరిసే వెన్నెలే నీ కిరీటం.. 
ప్రశాంత, నిశ్శబ్దాలు నీ మేలిముసుగులు ..
వేయి కళ్ళతో బ్రతుకు లోతులను పరికిస్తావు
వెయ్యి చెవులతో చావు, ఎడ్పులను వింటావు 
స్వర్గపు వెలుతురు నీ చీకటిలోనుండే ప్రకాశిస్తుంది.. 
కోటి అందాలు నీ నిశీథము నుంచే ఉద్భవిస్తాయి.. !!


నీ నీలి పరుపు మడతల్లలో 
ప్రేమికుల జీవితాలకు దొరుకుతుంది ఏకాంతం .. 
నూతన దంపతులకు దొరుకుతుంది సుఖాంతం.. 
దిక్కులేనివారినీ ఓదారుస్తావు 
ఒంటరి వారిని నీలో తలదాచుకోనిస్తావు.. 
నీ అనురాగపు నీడలో కవులు విశ్రాంతి తీసుకుంటారు.. 
ప్రవక్తల హృదయం మేల్కొంటుంటుంది.. 
నీ కిరీటపు నీడలో ఆలోచనాపరుల విజ్ఞానం అంకురిస్తుంది.. !!
ఓ రాత్రీ ..
నిజంగానే నువ్వో అద్బుతం.. 
ఓ ఆశ్చర్యం.. 
ఓ తనివితీరని అందం.. 
భువికీ, దివికీ మధ్యలో నిలిచి 
మంచు పోగల మేలిముసుగు వేసుకొని 
మేఘాల వలువలు ధరించి 
సూర్యునితో నవ్వుతూ, పగటిని పరిహసిస్తూ 
దీన్ని శాశ్వతం అనుకునే సమస్త ప్రాణులను హేళన చేస్తున్నావు.. 
పట్టు పాన్పులపై నిద్రించే మహారాజులపై నీ కోపం.. 
నిస్సహాయులు దోచుకునే దొంగలపై నీ కాపలా...
వేశ్యలపై బలవంతపు నవ్వులపై నీ ఏడ్పు ..
నిజ ప్రేమికుల కన్నీటిపై నీ చిరునవ్వు 
మంచికి నీ కుడిచెయ్యిని అందిస్తూ.. 
చెడును నీ పాదాలకింద నలపడం నేను కళ్ళారా చూస్తున్నాను.. 

Written by : Bobby Nani

No comments:

Post a Comment