Thursday, November 16, 2017

వారికంతా తెలుసు..



వారికంతా తెలుసు.. 
***************

ఆడవాళ్ళకంతా తెలుసు, 
అందుకే నిమ్మళంగా కూర్చుంటారు 
బస్సులమ్మటా, రోడ్లమ్మటా కళ్ళు తిప్పుతూ తిరగరు 
ప్రేమకోసమో, పెళ్ళికోసమో వాకిళ్ళు తెరుచుకు కూర్చోరు 

మగవాళ్ళం మనమే కంగారు పడిపోతుంటాం... 
ఉదయం పేపర్లో ఏ నగ్న సౌందర్యాన్ని చూసో 
ఏ ఇంగ్లీషు సినిమాలోని సిగ్గుల్ని విడిచిన సతి భంగిమల్ని చూసో 
గుండెల్ని బిగబట్టుకుంటాం 
పర్సులోనూ, చదూతూన్న పుస్తకంలోనూ ఫోటోల్ని దాచుకుంటాం.. 
స్మృతుల్ని నంజుకుతింటాం.. 

మగవాళ్ళం మనమే తొందర పడిపోతుంటాం... 
మత్తుకీ, మంటకీ చలించి పోతుంటాం.. 
కాటుక కళ్ళకీ, కాంక్షా మృగాలకీ 
లొంగి నీరై ప్రవహిస్తాం.. 
వాళ్ళకి వాళ్ళమ్మలు, అమ్మమ్మలు చెప్పేసే వుంటారు 
సాగరాల సరాగాలన్నీ ఒకటేనన్న అనుభవ సారం 
కంప, ప్రకంపనాల మధ్య వొలికే రిరంసలోని 
తిరుగులేని బింబ ప్రతిబింబ రహస్యం 

మన అబ్బలు మనకేం చెప్పరు 
నాలుగు రోడ్ల కూడలిలో కట్టుబట్టలతో వదిలేస్తారు.. 
చెప్పులు కొనిపెడతారు చిక్కులు తలపెడతారు.. 

చివరికి ఏ పెద్దింటి రబ్బరు బొమ్మకో మనల్ని హైవేలో అమ్మేస్తారు.. 
అర్ధంకాని తమకంలో అడుగులేని గంగాళంలో 
మనమే బొంగరంలా తిరుగుతూ.. తిరుగుతూ.. తిరుగుతూనే వుంటాం.. 

పల్చటి మెత్తటి గుండ్రని పిరుదుల సర్పమే 
వాల్జడ దించేసుకుని పమిట కొంగు ముడేసుకొని 
నీ ఏకాంత మందిరములోకి నెమ్మదిగా ప్రవేశిస్తుంది.. 

ఆడవాళ్ళకంతా తెలుసు.. 
అందుకే – గుమ్మాల్లోంచి చూపుల్ని పారేస్తూ 
చీరలు సర్దుకుంటూ ఉంటారు .. 
చెదిరిపోతున్న మనసులతో, 
కరిగిపోతున్న మనల్ని చూస్తూ 
లో ..లోపలే పక పకా నవ్వుకుంటూ ఉంటారు .. 

Written by : Bobby Nani

No comments:

Post a Comment