Tuesday, November 7, 2017

పోరాడు.. లేదా చచ్చిపో..


పోరాడు.. లేదా చచ్చిపో..
*****************

పోరాడు.. లేదా చచ్చిపో..!!
ఇదే మాట పదే పదే 
గుండె కొట్టుకునే శబ్దంలో నుంచి 
ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది..!!

వయస్సు ఉంది.. 
జ్ఞానము ఉంది.. 
శక్తి ఉంది.. 
పోరాడే ప్రతిభా ఉంది.. 
మరెందుకు యువత నింగికి ఎగరలేకున్నాడు .. ??
కారణం 
కుర్రోళ్ళు లే వాళ్ళేం బాధ్యతగా వుంటారనే గా.. 
ఈ అపనమ్మకమే.. మమ్మల్ని నిలువెల్లా దహించివేస్తుంది.. 
పోరాడకుండానే మా ఓటమిని మీరే నిర్ణయిస్తున్నారు..
కనిపించే దట్టమైన మేఘాలను కాస్త దులిపి చూడండయ్యా .. 
నిర్మలమైన నీలాకాశం కనిపిస్తుంది...!!

పత్రికల్లోనో, తెర మీదనో కనిపిస్తేనేనా వాడు గొప్పోడు.. 
ప్రతిభ ఉన్నా కూడా .. వాడు చేతకాని వాడే మీ దృష్టిలో.. 
వాడేం చెప్పినా.. వాడేం రాసినా గొప్పోడే.. 
వాడి మాటకు మద్దెల దరువులేస్తూ, 
వాడి అడుగులకు మడుగులద్దుతూ ఉండటం 
మా మనసుల్ని గాయపరచడం మీకలవాటే గా..!!

అవమానింపబడ్డ ప్రతీసారి 
ఆత్మాభిమానాన్ని బుజ్జగిస్తూనే వస్తున్నాం... 
కాలంతో అడుగులు కలుపుతూ 
నలిగిన జీవితాలతో బ్రతికేస్తూనే వున్నాం.. 
పోరాడు.. లేదా చచ్చిపో... 
ఈ మాటే ఇంకా మాకు ఊపిరిలూదుతోంది.. !!

నిజం చెప్పనా.. 
మా కన్నీటిని బయటకు వదలాలే కాని 
ఈ లోకాన్ని ముంచేంత శక్తి వాటికి ఉంది... 
ప్రతీ యువత తమ తమ గుండెల్లో
జ్వలించే అగ్నిని పెట్టుకు తిరుగుతున్నాడు.. 

మనలేని వాడు .. ఒడినట్లే.. 
ఓడిన వాడు .. చచ్చినట్లే.. 
అందుకే ఈ అకాలమరణాలు.. 
చేతులారా మీరు మొదలెట్టిన 
ముగింపు లేని యుద్దాలే... 

పెద్ద కోరికలేమి లేవు మాకు.. 
ప్రపంచంతో పరుగెడుతున్న 
ప్రతోనితో మేమూ పరిగెత్తాలనే ఓ చి..న్న కోరిక.. 
పరిగెత్తనివ్వండయ్యా .. 
మహా అయితే గెలుస్తాం.. 
లేదా 
ఓడుతాం .. 
కాని
బ్రతికుంటాం గా.. !!

Written by : Bobby Nani

No comments:

Post a Comment