తన తడి పెదవుల విచ్చుకతకు
సొట్టలు పడే ఆ నును బుగ్గల సిగ్గును
ఏ కవి వర్ణించ గలడు ?
సైగలతోనే కనికట్టు చేయగల వాగ్దేవి రూపంతో
మనసుని మెలితిప్పి సమ్మోహించే
ఆ కలువ కళ్ళను ఏ శిల్పి మలచగలడు ?
కనుసొగలతోనే అల్లరిచేసే
తన కొంటెతనంలో
చిలిపిగా నవ్వే ఆ ఎర్రని పెదవంచులలో
తడిసి ముద్దవ్వాల్సిందే కానీ
తనని వర్ణించడం, తన రూపాన్ని చిత్రించడం
ఏ నరునికి సాధ్యం ??
తన రాకను తనకన్నా ముందే
తన దేహ పరిమళం మత్తిల్లి హత్తుకుంటుంది
తను చెప్పే చిరు గుసగుసల సవ్వడికి
ఆ పెదవులు కదిలే కలివిడికి
ఏ మనసైనా అలజడికి ఆహుతి ఆవ్వాల్సిందే..!!
అదేంటో తను మాట్లాడుతుంటే
అలానే చూడాలనిపిస్తుంది
అనురాగ సవ్వడులు వినిపించే…
ఆ హృదయ కోవెలనుంచి
వెచ్చని తన ఊపిరి నా మెడ వెనుక తాకుతుంటే
మనసంతా, తనువంతా ఓ గిలిగింత..!!
వినీలాకాశంలో విలక్షణమైన సౌందర్యం తనది..
అసంఖ్యాక నక్షత్ర మండలంలో రెప్పలార్పలేని రూపం తనది..
సూర్య చంద్రుల్లా ప్రతీక్షణం వెలిగే ఆ నయనాలు,
సంపెంగ వంటి ఆ సన్నని నాశికాగ్రహం,
నల్లని ఆకాశంలోని ఓ తారను తెంచి పెట్టుకున్నట్లుగా నుదుటిన లలాటీకము,
గులాబీ రెక్కల్లా మృదుమధురమైన ఆ యెర్రెర్రని అధరములు,
నవనీతపు ముద్దల్లా సుతిమెత్తని చెక్కిలి
పసిడి ఛాయవంటి యవ్వన కాంతిమయ దేహం.
శంఖం లాంటి మెడ
వెండి తీగలా వున్న సన్నని నడుము.
ఆ స్వరంలో ఉషస్సు,
ఆ చూపుల్లో యశస్సు,
కళ్ళతోనే సంభాషించే సమ్మోహనం ..!!
సువాసనతోనే హత్తుకునే సమ్మేళనం..!!
ఓ కలువ కన్నుల చిన్మయి,
నీ గురించే ఆలోచించేలా చేస్తున్నావ్...
ముఖ్యంగా ఆ చెక్కిలి పై వుండే రెండు పుట్టుమచ్చలు
కళ్ళజోడు పెట్టుకున్నానే కానీ
ఏ స్వాప్నిక ప్రపంచమూ కనిపించడం లేదు..
నిను మొదటిసారి చూసినప్పుడు
ఆ కళ్ళలో ఓ తెలియని అద్భుతాన్ని చూశాను
మంత్రించి విడిచిన మహావాక్యంలా
నిను అలా చూస్తూ నిస్తేజంగా ఉండిపొయాను
ఎవరినైనా సమ్మోహనం చెయ్యగల అభినవ రూపసివి..!!
~ ~ త్రిశూల్ ~ ~
Mobile: 9032977985
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr