ప్రణయమూ తానె
ప్రళయమూ తానె
విదగ్ధ తానె
విధ్వంశి తానె
సత్యనిత్యాన్వేషణలో
తానెప్పుడూ పురివిప్పిన శ్వేత మధుకమే..!!
ఏ రసోద్భవ సన్నివేశంలో జన్మించినదో
ఏ సరసుడూ,
ఏ రసికుడూ,
ఏ కవీ,
తమ తమ అర్ధనిమీలిత నేత్రాలతో వీక్షించినా,
తన్మయత్వ హృదయములతో పలికించినా,
అభివర్ణించలేని లావణ్యము తనది.
ఒక కంటిన సరసమునూ,
మరు కంటిన సమరమునూ,
ఏక కాలమున పండించగల వాగ్దేవి తాను..!!
యీమె
విరహిణి కాదు,
ముగ్దా కాదు,
రస రమ్య అలంకారముతో నున్న
వాసవసజ్జిక, ప్రౌఢ, శాస్త్రకోవిద,
కళాచతుర్విధ కూడా కాదు..
వారికన్నా గొప్పగా గాండీవమును ఎక్కుపెట్టి
కదనరంగమున కత్తి దూయగల
అభినవ సత్య తాను...!
కళ్ళతో కాదబ్బా
మనోనేత్రంతో చూడాలంతే
గోధూళి వేళన
కేరింతలు కొట్టే పసి పిల్లలా కనిపిస్తుందోసారి
తెల తెల్లవారున
అల్లరి పరుగుల పసిడి లేడిలా
కనువిందు చేస్తుందోసారి
ఆ నీలి కురులేమో
గాలి మాటుకు ఎగసిన ప్రతీసారి
ఎన్ని కబుర్లు చెప్తాయో..!! తెలుసా ?
కోపంలో ఎర్రబడిన ప్రభాత కిరణంలా
సాత్వికంలో వెన్నెల మలయమారుతంలా
వేకువన వికసించి ఎప్పటికీ వాడని
కుసుమమై కనిపిస్తుంది
ఏ విపంచీ పలికించలేని వేల భావాలను
అలవోకగా, అత్యంత మధురంగా
కళ్ళతోనే తాను పలికించగలదు
మది లోని ఆంతర్యాలను గప్చిప్గా పరికించగలదు
అందుకే తాను సత్య..!!
భూమ్యాకాశముల మధ్యన
దిక్చక్రపుటంచులలో
పున్నమి, అమాసలను లెక్కించుచున్న
కవి ఆర్ధభరిత అక్షరములలో ఇమిడి
సౌష్టవ కీర్తి పతాకముపై లలితాంగిణిలా నవ్వుతూ
నిల్చుంది అతగాడి హృదయ వేదికపై..!!
Written by: Bobby Aniboyina
Mobile: 9032977985
Insta : https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr
ఆ బుగ్గ మాటు మచ్చ గురించి ఒక్క మాటా రాయలేదేంటండీ ? :)
ReplyDeleteఎందుకు అంటే.. నేను చిత్రాన్ని చూసి రాయలేదు. ఊహించి రాసిన తదుపరి తగ్గ చిత్రాన్ని జోడించాను.
Deleteచాలా రోజులైంది మీ స్పందన చూసి .. కొందరి స్పందన కోసం ఎన్ని రోజులైనా ఎదురుచూడొచ్చు. అలా ఎదురు చూసే వారిలో మీరు ఒకరు. (*_*)