Friday, July 28, 2023

వసంత తరువు...


 


అగ్నిగాలులై వీచిన మహా గ్రీష్మాలనుంచి 

స్తన్యధారల్ని కురిపిస్తూ మేఘధేనువులు వచ్చాయి 

ఇన్నాళ్ళూ అరచేతిలో ముఖాన్ని దాచుకున్న వసంతం 

ఇప్పుడు తొలి ఆషాడ మేఘ సందర్శనం తో పురివిప్పుకుంది !!

 

అడవి చుట్టూ నెమళ్ళ పింఛాల వింజామరల సోయ"గా(నా)లు

నదులు, సెలయేళ్ళు పులకరిస్తూ సముద్రాలను పలకరిస్తున్నాయి

తోటల్లోని పువ్వులన్నీ పిల్లగాలులకు ఊగుతూ నవ్వుతున్నాయి 

ఆకాశమంతటా  చిక్కని మేఘాలు

పుడమంతటా కమ్మని సువాసనలు,

అందమైన సుదతి పాదాలపైని  మువ్వలల్లే 

ఆకుకింది వాన చినుకులు  తళుక్కున మెరిసాయి!!  

 

కానుగ చెట్ల గుబుర్లలో గుసగుసలాడుతున్న 

పాలపిట్టల చిలిపి రహస్యాలు

దట్టంగా అల్లుకున్న పూల పందిరి నీడలో 

కాలం తీరి ఒక్కొక్కటిగా నేల రాలుతున్న పువ్వారులు

ఆకుల జోల పాటల్లో కిలకిల్లాడుతున్న కొత్త చివుళ్ళు  

పత్రహరిత  ఛాయల్లో, కుసుమ కోమల పరిమళాల్లో 

ఏకాంతంగా మనోరథ వసంత శయ్యలో 

మైమరిచే క్షణాలను కలగంటూ పడుకున్నాను.. !!

 

Written by: Bobby Aniboyina

Mobile: 9032977985

No comments:

Post a Comment