Monday, August 7, 2023

ఎంత కష్టమే లలన నిను చేరాలంటే....


అమ్మవారి మీద సంస్కృత పదాలతో కొన్ని పాటలు రాసాను. అలానే శాడ్ సాంగ్స్ కొన్ని, మెలోడీస్ కొన్ని, ఫోక్ సాంగ్స్ కొన్ని రాసున్నాను కానీ ప్రాచీన గ్రాంధిక సరళిలో మేళవించి రాసిన "పాట" ఇది.. కొంచం పదాలు తికమక పెట్టి మిమల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కానీ చాలా లోతైన అర్ధాలతో, భావాలతో సాగుతుంది ఈ పాట. ఆసక్తి కలవారు ఎవరన్నా రాగం కట్టగలరేమో ప్రయత్నించండి మీకోసం ఇన్బాక్స్ లో ఎదురుచూస్తుంటాను ... దాని గురించి అక్కడ మాట్లాడుకుందాం..

ఎంత కష్టమే లలన నిను చేరాలంటే ఎలా అయినా వచ్చి నిను చేరాలంతే..!! మేఘాల వీవనలతో చెమర్చిన మొహనాన్నే తడమనా మంచు బిందువులు నీ పెదవిపై వచ్చి వాలే లోగా ..! తళుక్కున వేళ్ళాడే నెలవంక చిరునవ్వును తెంచివ్వనా వెన్నెల విరి మోము ఆడి.. ఆడి అలసి వాడే లోగా..! రెక్కలాడిస్తూ చెప్పే గుసగుసల గోరింకను పట్టివ్వనా చిటారు కొమ్మమీంచి చిట్టచివరి ఆకు రాలే లోగా.. ఎలా అయినా వచ్చి నిను చేరాలంతే..!! ఎంత కష్టమే లలన నిను చేరాలంటే మనోఫలకముపై శీతల పవనాలు ఉత్తుంగ తరంగములై ప్రేరేపించే వేళా..! శ్రవణములకు పక్షుల కిలకిలారావాలు స్వర జతులై ఉత్తేజితం చేసే వేళా..! నీ కాలి మువ్వ రాల్చిన మెరుపు రజనునై నే తానా..లాడు వేళా..! నిలకడ వదలిన నీ మునివేళ్ళను మునిమాపు వేళల్లో, సందెప్రొద్దు సూరీడు కోరికోరి గోముగా ముద్దాడి వెళ్ళేలోగా కలవిడిచి.. ఇలనైనా నిను చేరాలంతే..!! ఎంత కష్టమే లలన నిను చేరాలంటే ఎలా అయినా వచ్చి నిను చేరాలంతే..!! వర్షంలా వచ్చావు నాపైకి వాగులా పయనించావు నాలోకి దాహమైనా తీరలేదే ..నాపై ఓ వలపు చినుకైనా పడలేదే..! నీ నీలి మేఘాల మధ్య మెరుపులా మాయమైనావు పిడుగులా నను బాధించినావు.!! ఎంత కష్టమే లలన నిను చేరాలంటే ఎలా అయినా వచ్చి నిను చేరాలంతే..!! నా తీరంలా నువ్వు నర్తిస్తుంటే మెల్లగ నిను ముద్దాడే తరంగమై.. నే.. సేద తీరాలంతే.. నా జీవన ఉచ్వాస నను వీడే లోగా వెచ్చని ఆవిర్లు విరజిమ్మే నా గుండె చప్పుడు ఆగే లోగా.. నిను చేరాలంతే..!! నిను ఆర్తిగా హత్తుకోవాలంతే..!! నీ వలపు వాకిట ఒడిలో బిర బిరా వచ్చి చేరాలంతే తుమ్మెదనై వచ్చి నీ అధరాలపై అలసి వాలాలంతే..!! ఎంత కష్టమే లలన నిను చేరాలంటే ఎలా అయినా వచ్చి నిను చేరుతానంతే..!! Lyrics: Aniboyina Bobby Mobile: 9032977985

No comments:

Post a Comment