ఐదు పదులు
దాటుంటాఏమో ఆమెకు..!
ఎన్ని అల్లర్లను
దిగమింగుకుందో
ఎన్ని నవ్వులను
దాచుకుందో
పైకి కఱకుగా కనిపిస్తూ
అందరిముందు
ఎన్నేళ్ళుగా నటిస్తుందో ఏమో.. !!
ఎవ్వరూ లేని
ఏకాంత సమయాల్లోనే
చూడాలి ఆమెను.. !
అద్దం ముందు తనని తాను
చూసుకుంటూ మురిసిపోతూ
విచ్చుకునే ఆ పెదవంచుల్లోని
చిలిపితనాన్ని,
కళ్ళకు కాటుకదిద్ది
పువ్వులా వికసించిన ఆ మోముకు
అరచేయి అడ్డుపెట్టి
చూసుకునే అల్లరితనాన్ని,
ఏ చరిత్రకారుడు చూడగలడు
ఏ కృతికర్త వ్రాయగలడు..!!
మట్టిగాజులంటే ఎంత ప్రేమో
స్వయానా కోసిన పూలు
అల్లుకోవడం అంటే ఎంత మక్కువో
పోపు డబ్బాలో దాచుకున్న
పటికబెల్లం చీక్కుంటూ
చిన్నపిల్లలా పెరటిలో
ప్రతీ మొక్కనూ పలకరించడం
ఎంత ఇష్టమో..!!
చల్లని సాయం సంధ్యా వేళలో
చిరుజల్లుల మట్టి వాసనలలో
ఆమె తనువొక ఇంద్రధనువై
ప్రకృతి ఒడిలో ఆటలాడటం
మరెంత ఇష్టమో .. !
దీపపు ప్రమిద కాంతులలో
అప్పుడే ముడతలు పడే ఆ మోము
నీటి బిందువులతో మెరిసే
గులాబీ లా ఎంత అందంగా,
మధురంగా ఉంటుందో,
శారీరకంగా, మానసికంగా,
మధురోహలతో తన్మయించే
ఆమెలోని స్త్రీ తత్వం కూడా
అంతే అందంగా,
అంతే మధురంగా,
మరంతే హుందాగా
విలసిల్లుతూ కనిపిస్తుంది..!
ఆమెకు కావాల్సిందల్లా
మనసైనవాడు కబుర్లాడుతూ
కూర్చునే సాయంత్రాలు.. !
అరచేతుల్లోకి ఆమె ముఖాన్ని తీసుకొని
కళ్ళు చూస్తూ మనసును చదివే సహచరుడు
కన్నులు కార్చే కన్నీటిని తుడుస్తూ
చొరవగా దగ్గరకు లాక్కుని
ధైర్యం చెప్పే కాంతుడు
అన్నిటికన్నా ఆమెకంటూ
సమయాన్ని కేటాయించే రమణుడు
ఇది కదా ఏ స్త్రీ అయినా కోరుకునేది..!!
అలా కుదరనప్పుడే
తానో ఏకాంత కావ్యమై ఇలా
మనముందు గప్చిప్గా
నిల్చుండిపోతుంది..!!
Written by: Bobby Aniboyina
Mobile: 9032977985
Insta : https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr
No comments:
Post a Comment