నా లోని భావాలు ఇవాళ చాలానే చెప్పాలోయ్ నీకు
నిను చూసిన ఆ క్షణం నుంచి మనసులో ఎన్ని భావాలను దాచుకున్నానో .. నీకు తెలియదు ..
వాటిని అలా దాచి దాచి మనసంతా బోలెడు బరువైపోయింది..
చదివిన తరువాత
ఆ ఎర్ర మూతి, మరి కాస్త ఎర్రబడి కోపమొస్తే నన్ను క్షమించు..!!
సరే చెప్తున్నాఇక నా కోసం వింటావు కదూ..!!
అలౌకిక భావాలు
***************
అగరు దూపము నిండిన ఓ … సు ప్రభాత వేళ
అద్వైత్వపు మయూరము పురివిప్పియాడు రీతిగ
మంచుబిందువుల ముసుగులో మల్లెపూవువోలె..
మదన పంచమి చినుకుల్లో చిగురుటాకు వోలె..
పున్నమి చంద్రిక తరంగాలుప్పొంగు ఆత్మీయ ధనూషము వోలె..
రమా రామణీయత్వపు జీరాడు కుచ్చిళ్ళు పారాడు వేళ
తనువొక మందారమై మనసొక విహంగమై నీవు నర్తించు సమయాన
నే చూస్తున్నా నీ రెండు విశాల నేత్రాల మధ్యన నిజమైన సూర్యోదయాన్ని !!
నువ్వెప్పుడూ నాకు ప్రత్యేకమే
ఎందుకో తెలుసా ?
నీలో నీకే
తెలియని ఎన్నో అలౌకిక భావాలను నేను చూస్తుంటాను
ఆడించే అల్లరితనం
లాలించే అమ్మతనం
కవ్వించే కొంటెతనం
మురిపించే జాణతనం
ప్రేమించే సహజతనం
జన్మతః నీలో ఏర్పడిన పంచ ధాతువులివి..!!
ఓ " వీణ " సైతం
పలికించలేని కోటానుకోట్ల భావాలను
భావోద్వేగాలను రస రమ్యమైన నీ లోని స్త్రీ తత్త్వం
అత్యంత మధురంగా సునాయాసంగా సృశించగలదు
బ్రహ్మకాలమున పుష్పించే ఓ పుష్పం
ఎన్ని పరిణామాలను మార్పులను
అదిగమిస్తుందో నీ హృదయం కూడా
అంతకు మించిన భావ ప్రకంపనలను
రస స్పందనలను కలిగి ఉంటుంది.
చల్లని సాయం సంధ్యా వేళలలో
మట్టి వాసనలలో
గుబురు కొమ్మలలో
చిరు జల్లులలో
ప్రకృతి ఒడిలో
ముఖ్యంగా దీపపు ప్రమిద కాంతులలో
నీ దేహపు సున్నుపిండి వాసనలలో
మేలిమి మీగడ చందనాలలో
మధుర పట్టు పరిమళాలలో
ఇలా నీకే తెలియని ఎనేన్నో అసంఖ్యాక భావాలతో,
అలౌకిక రాగాలతో, అణువణువు అంగాంగమూ
ఓ సుందరమైన రాగాన్ని బట్టి,
ప్రేమించే హృదయాన్ని బట్టి
పైపైకి ఉప్పొంగుతూ
తనువూ మనసూ పురివిప్పిన
శ్వేత మధుకమువోలె నా కంటికి కనిపిస్తుంటావు..!!
నా కనురెప్పలకు
ఆశల నక్షత్రాలను కొవ్వొత్తులుగా
అమర్చుకుని మరీ చూస్తున్నాను
నూతనాకాశాల నీడన
పుష్పించు దివ్య కుసుమములా
తళుక్కున అలరించావు
వినీలాకాశపు వీధుల్లో
విహరించు గంధర్వ కన్య లా ఉదయించావు !!
నీ
పెదవంచుల్లో మొదలైన చిలిపి గాలి
నా చెవుల్ని సవరిస్తూ వయ్యారాలు పోతుంటుంది
నీ
మెడవంపుల్లో ఉదయించిన ఓ పరిమళం
నా నాసికను రాసుకుంటూ సమ్మోహనం చేస్తుంటుంది
నీ
దేహానికి తాకిన తియ్యని తేనె సొన
నా ముఖానికి మధురంగా పులుముతుంటుంది..!!
నాలో ఇంత భావుకత ఉబికిందంటే
ఖచ్చితంగా
అది నీ మానసపు నవనీత కాంతులే..!!
నా మనసులో నీ స్థానం ఏంటో నీకు తెలుసా?
క్షీరములో నవనీతపు సోయగం
పువ్వారులో పుప్పొడి చందనం
మధువు లో మధురిమల పరిమళం
ఝుంఝూమారుత ఝర్ఘరీయధ్వనులు
జముకు జముకు అలలై, ఎగసే
లయల కెరటాల రీతి నర్తించు నీ పాద పద్మాలను
ఒకే ఒక్క క్షణం నా విభ్రమ నేత్రాలతో కన్నులారా కాంచిన చాలు కదా..!!
ఈ కాస్త జీవితానికి..!! సరిపడేంత జ్ఞాపకాలు పోగేసుకోవడానికి..!!
ఏమంటావ్?
~ ~ త్రిశూల్ ~ ~
Mobile: 9032977985
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr
No comments:
Post a Comment