Wednesday, November 1, 2023

వర్షం వెలసిన ఓ సాయంత్రం ...

 

కొన్ని అనుభూతులకు మాటలుండవబ్బా గప్చిప్గా అనుభవించాల్సిందే .. అలాంటి వాటిల్లో ఓ దృశ్యం ..!! అప్పుడే వర్షఋతువు ముగిసి శరదృతువు మొదలౌతూవుంది తల్లి ఒడిలో పాలుతాగే పసి పిల్లాడిలా పశ్చిమ కనుమల్లో ఒదుగుతున్నాడు నారింజ సూరీడు ..!! గాలిపటం ఎగరేసే పిల్లాడు ఆకాశాన్ని అందుకున్నట్లుగా ఎంత సంబరపడి పోతున్నాడో ఎన్ని కేరింతలు కొడుతున్నాడో..!! దుమ్ముకూడా ఎగరని నిర్లిప్తమైన ఓ ప్రశాంతతని పాకుతూ ఆవరిస్తున్న చీకటి మెల్లిగా చెరిపెయ్యడం చూస్తున్నాను ..!! కొన్ని చూడటం సరిపోదు.. కానీ చూసినంత మేర ఆ ప్రపంచాన్ని మన ప్రపంచంగా మార్చేసుకోవాలంతే..!! పిల్ల తెమ్మెరకు పులకరించిన మేఘం అప్పుడే చినుకులు రాల్చి పోయింది రోమాలు నిక్కపొడిచేలా చలిగాడ్పులు మొదలయ్యాయి..!! ఆశ్వీయుజ చవితి రోజున కూడా వెన్నెల ఎందుకో చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది..!! పొద్దున ఎంతో అందంగా వికసించిన పుష్పం కళ్ళముందే నిర్జీవంగా రాలడం నే చూస్తున్నా..!! నేను చెప్పాలనుకున్న మాటలన్నీ గాలి తెమ్మెరలు నాతో ఊసులాడిపోతున్నాయి.. ఎందుకో ఈ అస్తమయపు కొండగాలి హృదయాన్ని కోతపెడుతోంది ..!! వీధిలోని ఇంటి తలుపులన్నీ ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి దీపాల వెలుగులు మెల్లిగా కాంతులిడుతున్నాయి ..!! పొద్దున రావాల్సిన ఉత్తరం కోసం నేనింకా ఎదురుచూస్తూనే వున్నాను.. నాకు తారసపడ్డ ఈ ఏకాంత క్షణాలలో గడచిన ఎన్నో సాయంకాలాలు గప్చిప్గా కరిగిపోయాయి..!! కాలం ముందుకు వెళ్తున్నట్లే ఉంటుంది కానీ మళ్ళి మళ్ళి మనల్ని వెనక్కు తీసుకెళ్తుంటుంది..!! Written by: Bobby Aniboyina Mobile: 9032977985 Insta: https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr

1 comment:

  1. కాలం ముందుకు వెళ్తున్నట్లే ఉంటుంది కానీ
    మళ్ళి మళ్ళి మనల్ని వెనక్కు తీసుకెళ్తుంటుంది..!!
    👌👌👌 Nice

    ReplyDelete