కవి రాయని కవిత..
****************
నా దేశంలో..
మహా రావణకాష్ఠం నడుస్తోంది
సందు గొందుకు ఓ రావణాసురుడు
వాడి రణ వేదిక స్త్రీ మర్మస్థలం..!
అదే వాడి కామ క్రీడా విలాసం..!!
బ్రహ్మ కానీ, బ్రహ్మంగారు కానీ,
వ్యాసుడు కానీ, వాల్మీకి కానీ,
ఈ రాతను రాసిన దాఖలా లేదు
దీన్ని పైశాచికమందామా
లేక బలాత్కార సంభోగమందామా..!!
పెన్నూ, జామెంట్రీ బాక్సూ తీసుకొని
హడావిడిగా ఇంట్లోంచి
అడుగు బయట పెట్టె ఆ చిన్నారిని
ఎన్ని కామపు కళ్ళు తడుముతాయో
ఎన్ని అంగాలు లేచి నిక్కబొడుచుకుంటాయో..!!
కడుపులోని ఆడ బిడ్డకే కాదు
పక్కన పడుకున్న పసి పాపను కూడా
కళ్ళలో వొత్తులేసుకొని కాపాడుకోవాల్సిందే
ఏ రాత్రివేళ ఏ మృగం అదును చూసి
మీద పడుతుందేమోననే భయం..!
తన కళ్ళు, తన కన్నీళ్ళు ఆకర్లేదు
రెండు కాళ్ళ మధ్యన మాత్రమే వాడి పనంతా..!
రెండే రెండు నిమిషాలు కోసం
పెద్దా, చిన్నా,
పసి, ముసలి
వావి, వరుసలు అక్కర్లేదు వాడికి..!!
తను డాక్టర్ అయితే
ఎంతమందికి చేయూతనిచ్చేదో
తను ఇంజనీరు అయితే
పారే నదులపై ఎన్ని వంతెనలు నిర్మించేదో
తను వకీలు అయితే
చట్టం చుట్టూ అల్లుకున్న ఎన్ని కల్లగంతల్ని తీసేదో..!!
కానీ రేయ్
నువ్వు చేసిన అకృత్యం వల్ల
తను సర్వం కోల్పోయి
జీవచ్చవమైంది..!
ఓ నిజం చెప్పనా..
మానవ చరిత్ర పుస్తకం పై
తనదృష్టిలో నువ్వో చెరగని
రక్తపు సిరా మరకవి..!!
~ ~ త్రిశూల్ ~ ~
Mobile: 9032977985
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr
No comments:
Post a Comment