Wednesday, May 3, 2017

\\\ మన “బాహుబలి” లు.. ///



\\\ మన “బాహుబలి” లు.. ///
*********************


“బాహుబలి” భారతీయ చలనచిత్ర రంగంలో ఓ నూతన అధ్యాయం... 
ఇది చిత్రం కాదు “చరిత్ర” ... తెలుగు వాడు దద్దోజన భోజనప్రియుడు కాదని, కారాడని “ఇషయం” ఉన్నోడని యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా, ప్రతీ తెలుగువాడు రొమ్మువిరిచి గర్వించేలా, అవే సోది కథలు, అవే సోది ప్రేమ కథలు, అవే సోది చిత్రాలను తీస్తున్న దర్శకులకు ఓ చెంపపెట్టుగా రాజమౌళి గారి మెదడులో ఊపిరి పోసుకొని మన ముందుకు వచ్చిన ఈ చిత్రం మీతోపాటు నాకు మిక్కిలి ఆనందదాయకం... 


“బాహుబలి” అంటే ప్రజల అవసరాలను తీర్చేవాడు అని అర్ధం.. అలాంటి అవసరాలను మనం పక్క దిగిన దగ్గరనుంచి పాన్పు ఎక్కేదాకా ఎంతమంది బాహుబలి గా మారి మన అవసరాలను తీరుస్తున్నారో తెలుసా.. ?? అసలెప్పుడైనా వారి గురించి ఏకాంతంలో అయినా ఆలోచించామా.. ?? ఆ కనిపించని బాహుబలి ల గురించి ఓ సారి తెలుసుకుందాం.. 


మనం లేవగానే చేతిలో “టీ” లేదా “కాఫీ” ఉండాలి.. 
నువ్వు కళ్ళు తెరవగానే నీ దగ్గరకు రావడానికి అక్కడ ఓ బాహుబలి తన నిద్రను పక్కనపెట్టి పొద్దు పొడవక ముందే వచ్చి తన భాద్యత తను నిర్వర్తిస్తున్నాడు.. అందుకే మనం కళ్ళు తెరిచే సమయానికి మన చేతిలో వేడి వేడి “కాఫీ” ఉంటుంది..


ఎక్కడో భూ అడుగుభాగంలో ఉన్న నీరుని పై అంతస్తులో వున్న కోళాయిలోకి మనం సుకుమారంగా అలా తిప్పగానే ఎలా వస్తున్నాయి.. 
అక్కడనుంచి ఇక్కడ దాకా ఈ నీరు ప్రవహించడానికి ఎందరు బాహుబలి లు శ్రమ చేసి స్వేదం చిందించి ఉంటారో తెలుసా.. ??ఎప్పుడైనా ఆలోచించావా ?? 


రంగు రంగుల వస్త్రములు, నూతన వస్త్రములు, నలగని వస్త్రములు వేసుకుంటున్నాం.. 
వాటి వెనక ఎందరి బాహుబలి ల నలిగిన కష్టం ఉంటుందో తెలుసా.. ?? రంగు బాలేదని పక్కన పడేస్తాం.. ఎందుకంటె నిమిషాలలో డబ్బు పెట్టి కొన్నాము కదా.. ఆ కష్టం మనకు తెలియదు.. నువ్వు ప్రక్కన పారేసేది వస్త్రాన్ని కాదు కష్టపడి చేసే ఓ బాహుబలి శ్రమను.. 
నువ్వు తినే ధాన్యపు గింజలు కష్టపడి సంపాదించావ్ అని సంబరపడుతుంటావ్.. నీది కష్టమా ?? 
ఈతముల్లు వంటి చేలలో చెప్పులు లేకుండా విత్తు నాటకముందు నుంచి కోత కోసి గింజ తీసేవరకు రైతు పడ్డ కష్టం వుంది చూసావా అది కష్టం అంటే.. వాన కోసం నింగిని, మొలక కోసం పుడమిని కళ్ళు కాయలు కాచేలా చూస్తాడు ఈ బాహుబలి ... చినుకు చిందేదెలా, నేల తడిచే దెలా, కడుపు నిండే దెలా అని నిరంతరం ప్రాకులాడుతూ తన కన్నీటితో పండించి మనకు పంపుతున్నాడయ్యా రైతు.. అది కష్టం అంటే..


ఇలా ఒకటా రెండా మనం వాడే చెప్పుల దగ్గరనుంచి నెత్తికి పులుముకునే “బ్రిల్” క్రీముల వరకు ఎందరో బాహుబలి లు వారి శ్రమను మనకోసం వెచ్చిస్తూనే ఉన్నారు.. నిరంతరం వారి భాద్యతను నిర్వర్తిస్తూనే ఉన్నారు.. అలాంటివారు మచ్చుకి సైతం మనకు గుర్తుండరు కాదు కదా.. గుర్తుకు రారు కూడా.. ఎందుకంటె ధనం తో వారి శ్రమకు మనం ఏనాడో విలువ కట్టేశాం కదా.. 


నిజమైన బాహుబలి లను ఎలానో బ్రతికించలేం .. కనీసం వారి శ్రమను అయినా గుర్తిద్దాం.. 
కాలు కదపకుండా నోటి దగ్గరకు అన్ని తెచ్చి పెడుతున్న ఈ బాహుబలి లకు నా పాదాభివందనం __/\__
మీరు లేనిదే మేము లేము.. సాహోరే బాహుబలి సాహో..

Written by : Bobby Nani

5 comments:

  1. పొద్దున్నే కాఫీతో బాటు చదవడానికి పేపర్ కావాలి. తెల్లారకముందే లేచి పేపర్ కట్టలు తెచ్చుకుని సైకిల్ మీద కట్టుకుని ఇంటింటికీ అందించే పేపర్ కుర్రవాడు మరో "బాహుబలి" కదా.
    అలనాడే ఆచార్య ఆత్రేయ గారు "కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడీదానా" అన్నారు. మీ వ్యాసం బాగా వ్రాసారు.
    -----------------------
    కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదానా / బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా
    నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే / వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెను తెలుసుకో || | | కారులో | |

    చరణం 1 :
    చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదానా / మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా
    కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచి గనులు తొలిచి / చమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో
    కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా
    నిలిచి విను నీ బడాయి చాలు / తెలుసుకో ఈ నిజానిజాలు

    చరణం 2 :
    గాలిలోన తేలిపోయే చీరగట్టిన చిన్నదానా / జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
    చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు / చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో
    కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా
    నిలిచి విను నీ బడాయి చాలు / తెలుసుకో ఈ నిజానిజాలు
    ---------------------------

    ReplyDelete
    Replies
    1. పసిడి ”చానా” అనుకుంటానండి. చాన అంటే యువతి అని అర్ధమనుకుంటా :) ఈ పాట ఆత్రేయ రాసిందని చాలా కలం అనిపించలా :)

      Delete
    2. మీరన్నట్టు "ౘానా" కరక్ట్ శర్మ గారు. అప్పుడే ఈ సందర్భంలో సరైన అర్థం వస్తుంది.

      Delete
  2. బాగా గుర్తు చేసారు unsung బాహుబలిలని.👌
    కార్లు, బీర్లు, వాచీలు, నెక్లెస్సులు వగైరాలు చేసే బాహుబలిల్ని బానే 'గౌరవిస్తాం',బడుగుబలిలంటేనే చులకన.

    ReplyDelete
  3. బాగా గుర్తు చేసారు unsung బాహుబలిలని.👌
    కార్లు, బీర్లు, వాచీలు, నెక్లెస్సులు వగైరాలు చేసే బాహుబలిల్ని బానే 'గౌరవిస్తాం',బడుగుబలిలంటేనే చులకన.

    ReplyDelete