Saturday, May 27, 2017

మధురమెక్కడుంది ??



తన భర్త కోసం ఎదురు చూపులతో గట్టుపై కూర్చుని వయ్యారాలు ఒలకబోస్తూ కాలం గడుపుతున్న ఈ సుందరాంగి అంతరంగాన్ని “వచన కవిత్వం” ద్వారా వర్ణించాలనిపించింది .. 

మధురమెక్కడుంది ?? 

సంధ్యవేళ ఆరుబయట సొలసి కూర్చున్న ఈ ఆడతనంలో, 
ఆణువణువునా ఇమిడివుంది..!!
బండపై కుటీరములు ఆన్చిన ఆమె నడుమొంపులలో, 
నలుగుతూ వుంది..!!
అలసిన ఆ పాదాల పద్మపుటంచులలో,
కమిలి వుంది..!!
నల్లని కురుల నయగారాలలో, 
చెరిగి వుంది..!!
మెలికల వాగు వంటి సన్నని వెన్నులో, 
నిగిడి వుంది..!! 
నెమలి నయనముల రెప్పలలో, 
వాలి వుంది..!! 
కనుబొమ్మల కవ్వింతలలో, 
కుదిరి వుంది..!! 
గాజుల గల గల లలో, 
అమరి వుంది..!! 
మువ్వల సవ్వడులలో,
మీటి వుంది..!! 
మకరందపు చక్కర చెక్కిళ్ళలో, 
తియ్యందనమై దాగుంది..!!
అమృత అధరములలో, 
మధువురసం కారుతోంది...!!
ఈమె ప్రమేయం లేకనే 
వికసించే కలువబాల కదలికలు..
గంభీర సరోవరం చుట్టూ మొలిచి 
కలకల నవ్వుతూ 
వేల కబుర్లుచేప్పే గడ్డిపరకల కంఠస్వరాలు..
పచ్చని పంట పొలాల మీదుగా 
పారాడుతూ వచ్చి
కొంగులానించి ముద్దిచ్చిపోయే 
పైరగాలి బిగి కౌగిళ్ళు.. 
అలసిపోయివచ్చే పరిణాయకుణ్ణి
అలరించడానికి 
ఎరుపెక్కిన సాయం సంధ్యారక్తిమలో 
అర్దరాత్రి తోట నదరగొడుతూ 
గుప్పున విరిసిన 
విరజాజుల సురభిళ సౌందర్యంతో...
గంధపు పరిమళంబులు ఆమె దేహమంతా ఆవరించి,
పరిణాయకునికోసం ఎదురు చూసే ఆమె 
సంధ్యావేళ సోగకన్నుల్లో నిక్షిప్తమై వుంది ఈ మధురం...!! 
అర్ధ భాద్యతను పంచుకునే ఈ అర్ధాంగి అధరములను 
అందుకునేందుకు గాడేద్దులా స్వేదం చిందించే,
పరిణేత శ్రామికత్వంలో వుంది ఈ మధురం..!!
అతడెప్పుడొచ్చునో.. !!
ఈ సతి కన్నులలో కాంతులెప్పుడు ప్రసరించునో ..!!!

Written by: Bobby Nani

3 comments: