Friday, May 26, 2017

జీవితం ఒక మహా కావ్యం..



ఈ కవిత పూర్తిగా ఆవేశ పూరితమైనది.. కవి యొక్క ఆవేదనని, అంతరంగాన్ని అద్దంలో చూపించినట్లు చూపే ఆవేదనా తత్వమైనది... అందుకని ఇది ఎలా పడితే అలా చదివితే ఆ ఆవేశం, ఆ అనుభూతి మీకు అందదు .. కనుక ఈ కవితను “ఏక బిగిన” మాత్రమే చదవాలి.. కవితలంటే అన్నీ మధురంగానే ఉండవు.. ఇలా ఆవేశపూరితం కూడా వుంటాయి, ఆశుర కవితలు కూడా ఉంటాయి... 

జీవితం ఒక మహా కావ్యం.. 
*******************


ఎక్కడి నుంచి వచ్చి
ఎక్కడికి పోతున్నాడో 
ఎవరికీ తెలియని 
మనిషి జీవితం ఒక మహాకావ్యం.. 
జీవితం ఒక నిత్య సత్యం 
అయినా అది మహా స్వప్నం.. 
బాల్య యౌవన వృద్దాప్యాలు 
రుజా జరా మరణాలు 
రాగ ద్వేషాలు – త్యాగ భోగాలు
అల్లుకున్న 
సుందరతర గందరగోళం ఈ జీవితం 
అనుభవించడం తప్ప 
అర్ధం చెప్పరానిదీ జీవితం 
రండి చూద్దాం జీవితాన్ని 
రంగు రంగుల సింగిణిని 
ఎన్నో వికీర్ణ వర్ణాల ఏకరూపం ఈ జీవితం 
కామ, క్రోధ, లోభ, 
మోహ, మద, మత్సర్యాది 
అరిషడ్వర్గాల పందిరి మీద 
క్షణానికో పూవు పూచే 
చిత్ర గంధి జీవితం 
ఎక్కడ పుడుతుందో.. తెలియని 
ప్రాయేటి కెరటం ఈ జీవితం.. 
జనన మరణాల మధ్యన 
కాలం వ్రేల్లాడ గట్టిన 
కాంతి రేఖ ఈ జీవితం 
జననం ఒక మరణం లేని ప్రశ్న.. 
మరణం ఒక జననం లేని ప్రశ్న.. 
సమాధానం లేని రెండు ప్రశ్నలకు 
సమాధానం చెప్పడానికి 
సందేహాల బోనులో నిలబడ్డ 
సాక్షిలాంటిది ఈ జీవితం .. 
ఎన్ని సాక్ష్యాలో .. 
కళ్ళులేని కాలం.. 
చెవులు లేని కలంతో 
నోరులేని కాగితం మీద 
కన్నీటి అక్షరాలతో 
అన్నీ వ్రాసుకుపోతుంది.. 
అయినా తీర్పులేదు..
అభియోగంలో మార్పు లేదు.. 
అద్బుత ద్వీపం మీద 
మబ్బులా వచ్చి కురిసి 
వాగులా పొంగి పొరలి 
వారాశిలో కలిసిపోయే 
వర్ష బిందువు ఈ జీవితం 
అనుభూతి శిఖరాలనుంచి 
అవలోకిద్దాం జీవితాన్ని 
ఆలోచనా అంతరాళాలనుంచి 
పరిశీలిద్దాం జీవితాన్ని 
అనంతత్వ కిరణాలలో 
దైవత్వ దర్పణాలలో 
దర్శిద్దాం ఈ జీవితాన్ని 
రండి.. కదలండి.. 
దర్శించండి మీ జీవితాల్ని... !!!

Written by : Bobby Nani

2 comments: